స్త్రీలు, హింస, మానసిక వ్యధ – భార్గవి వి. ధావర్‌

 

హింస నగ్నసత్యమయిన సామాజిక రాజకీయ వాతావరణంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు జీవిస్తున్నారు. సమాజంలో, పనిలో, ఇంటిలో స్త్రీలకు వ్యతిరేకంగా ”అధికారం”, పెత్తనాలను పితృస్వామ్యం దుర్వినియోగం చేయటాన్ని హింసగా పాశ్చాత్య స్త్రీవాదులు నిర్వచిస్తారు. కొన్నిసార్లు హింసను న్యాయపరంగా ”అనాయాచిత, అన్యాయ భౌతికదాడి’గా నిర్వచిస్తారు. అయితే ఇటువంటి న్యాయపర నిర్వచనాల్లో ఎన్నో రకాల దాడులు తప్పించుకుంటాయి. హింస ఎప్పుడూ శారీరికం కానవసరం లేదు. కాబట్టి కొంతమంది స్త్రీవాదులు హింసాత్మక చర్యలను ఒక నిరంతరంగాచూసే నిర్వచనాలను ప్రతిపాదిస్తున్నారు. ఇందులో (1) తేలిక పాటి నుంచి తీవ్రగాయాలను, మరణానికి దారి తీసే భౌతికదాడులు, ఉదా: గిల్లటం, గుద్దడం, వస్తువులు విసిరెయ్యటం, కొట్టటం, కాల్చటం వంటివి (2) భౌతిక హింసతో కూడుకున్న లైంగిక చర్యలు ఉదా: వత్తటం, గిల్లటం, తడమటం, లైంగికంగా వేధించటం, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అత్యాచారం (3) మహిళలను దోపిడీకి గురిచేసే వ్యాపార కార్యకలాపాలు ఉదా: నగ్న ప్రదర్శనలు, వ్యభిచారం, ఆశ్లీలసాహిత్యం మొ. (4) పిల్లల్ని, ఆస్తిని లేదా విలువైనవి తీసుకుపోతామని చేసే బెదిరింపులు (5) బూతు జోకులు, తిట్లు ఉపయోగించి మహిళలను కించపరచటం వంటి వాటి ద్వారా మాటల ద్వారా హింసించటం.

పైన పేర్కొన్న శారీరిక, ఇతర రకాల హింసలను మానసిక హింసగా పరిగణించవచ్చు. స్త్రీల మనసు, అనుభవాలను అవి భయం, ఆందోళన, నేరభావన, దుఃఖం, విచారం, మానసిక ఆలసట, దిగ్భ్రాంతి, రోగాలకు పరిమితం చేస్తాయి. ఈ మానసిక హింస కారణంగానే సగటు స్త్రీ చీకటంటే భయపడుతుంది. కొత్తవాళ్ళతో మాట్లాడాలన్నా, వంటరిగా వెళ్ళాలన్నా, రోడ్డు మీద నడవాలన్నా, ఏడిపించే వాళ్ళను ఎదుర్కోవాలన్నా భయపడుతుంది.

నిజ జీవితంలో మన మీద ఎటువంటి దాడి జరగకపోయినప్పటికి పురుషులంటే భయపడటం, అందోళనతో కూడిన వాతావరణంలో బతకటం నేర్పుతారు. భారతదేశంతో సహా ప్రపంచమంతటి నుంచి వస్తున్న నివేదికలు మహిళలు అత్యాచారమంటే అత్యంతగా భయపడుతుంటారని, ఈ భయం తమ ప్రవర్తన, దుస్తులపట్ల అతి జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుందని తెలియజేస్తున్నాయి. మనం మరిచిపోవటం, క్షమించటం ద్వారా, అంతగా పట్టించుకోకపోవటం ద్వారా ఇతరులతో సంబంధాలలోని మానసిక హింసను గుర్తించం, ఉదాహరణకు ‘మానసిక బ్లాక్‌ మెయిల్‌’ కూడా ఒక రకమైన మానసిక హింసే. ”సమాజం నీ గురించి ఏమనుకుంటుంది?” అని మహిళలుగా మనకు ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. ”నోర్ముసుకో!”, నీకేంత తెలుసు? ”నువ్వు ఆడదానివి మాత్రమే ”, ”నేను చెప్పింది విను”, ”మధ్యలో అడ్డుపడకు”, ”నేను మాట్లాడుతోంటే వెళ్ళిపోకు” వంటివి మనకు నిత్య ‘సంభాషణలు’. ఈ రకమైన అదుపు కూడా మానసిక వత్తిడి , హింస అవుతాయి. ఈ విధంగా మహిళలను సామాజికంగా ఆమోదితమయిన కొన్ని ప్రవర్తనలకే పరిమితం చేస్తారు. ఇంగ్లాండులో హింసపై పని చేస్తున్న మేరీ మేనార్డ్‌ అన్న స్త్రీవాది ఇలా అంటున్నారు. ”అధికారంలో అసమానతల్ని హింస ప్రతిబింబించటమే కాకుండా ఆ అసమానతలు కొనసాగటానికి కూడా దోహదం చేస్తుంది. సమాజంలోనూ, వ్యక్తిగత సంబంధాలలోనూ స్త్రీలపై పురుషులకు గల అధికారాన్ని ప్రతిబింబిస్తూ, దాని కొనసాగింపునకు హింస తోడ్పడుతుంది.”

పాశ్చాత్య దేశాల్లో మహిళలపై హింస చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా కళాశాల విద్యార్థినులలో 20 శాతం మంది అత్యాచారానికి గురవుతున్నారు. వీరిలో అధికశాతం 15ఏండ్ల లోపు వారు. అన్ని సమాజాలలోనూ అత్యాచారం సాధారణ మయిపోయింది. పారిశ్రామికం కాని సమాజాలలో 42 నుండి 90 శాతం దాక అత్యాచార నివేదికలు అందుతున్నాయి. అధికారలెక్కల ప్రకారం మన దేశంలో ప్రతిరోజు 23 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ అంచనా చాలా తక్కువని చెప్పవచ్చు. ఒక్క గుజరాత్‌లోనే 1987లో 177 మహిళలు అత్యాచారానికి గురయ్యారు. నిమ్న కులాల, పేద, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, సామాజిక అత్యాచారాలు, రాజకీయ అత్యాచారాలు, పోలీసులు లేదా కల్లోలిత ప్రాంతాలలో సైన్యం ద్వారా అత్యాచారాలు భారతదేశంలో సాధారణమైపోయాయి. సమాజ ‘రక్షకులుగా’ పిలువబడుతున్న వాళ్ళు మహిళలపై సాగించే అత్యాచారాలు ఊహలకందనివి. వీళ్ళు సాధారణంగా ఎటువంటి శిక్ష లేకుండా హాయిగా తిరుగుతుంటారు.

భార్యల్ని హింసించే విషయానికొస్తే ఇంగ్లాండులో 21-28 శాతం మహిళలు దీనికి గురవుతున్నారు. అమెరికా, కెనడాలలో ప్రతి పది మందిలో ఒకరు భర్త చేతిలో హింసల పాలవుతున్నారు. భార్య భర్తల విభేధాలలో 33 శాతం మహిళలు హింసకు గురయినవారే. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో వైవాహిక బంధనాలలో 35-60 శాతం మహిళలు హింసకు గురవుతున్నారు. విద్య, ఆదాయం, వర్గం, కులాలలకతీతంగా భార్యలపై హింస కొనసాగుతోంది. విద్యావేత్తలయిన పెద్ద వ్యాపారస్తుల నుంచి, న్యాయం కోసం పోరాడే సైద్దాంతిక దృక్పధంగల పార్టీ నాయకుల వరకు భార్యల్ని హింసిస్తుంటారు. ‘వరకట్న చావులు’, ఆశపోతు భర్త అత్తమామలు పురికొల్పే ఆత్మహత్యలు భారతదేశంలో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 1986-87లో గుజరాత్‌లో ప్రతి రోజు సగటున 11 వరకట్న హత్యలు సంభవించాయి. 1989-90లో 2000 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. గత వంద ఏళ్ళలో బెంగాల్‌ ఆత్మహత్యలపై జరిగిన అధ్యయనంలో పురుషులకంటే స్త్రీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడయ్యింది. పెళ్ళి అయ్యి 25-35 సంవత్సరాల వయసుగల మహిళల్లో ఆత్మహత్యల శాతం అత్యధికంగా ఉంది. మరణానికి దారితీసే ఆత్మహత్యా యత్నాలు వివాహిత స్త్రీలలోనే అధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దినపత్రికలలో రోజుకొక ‘అనుమానాస్పద మృతి” వెలుగు చూస్తోంది. 75 శాతం, 95శాతం కాలిన గాయాలు చంపాలన్నఉద్దేశాలను వెల్లడి చేస్తున్నాయి.

పిల్లలు కూడా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15 శాతం బాలికలు లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురయినట్లు 68 శాతం మహిళలు పేర్కొంటున్నారు. సంప్రదాయబద్ద గ్రామీణ సమాజాలలో కూతుళ్ళను తండ్రులు బలాత్కరించటం సాధారణంగా ఉంది. ”పంట విత్తినవాడు ఫలాన్ని అనుభవించవద్దా?” అని అంటారు. ఢిల్లీలో అత్యాచారానికి గురయిన వారిలో 54 శాతం 15ఏండ్ల లోపువారే. 1981లో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రెండు పెళ్ళిళ్ళలో ఒకటి, దేశం మొత్తం మీద ప్రతి నాల్గింట ఒకటిలో ఆడపిల్లల వయసు 15-19 సంవత్సరాల మధ్య ఉంటుంది. అవసరం లేని ఆడశిశువులను వదిలివెయ్యటం, చవకగా అమ్మి వెయ్యటం సాధారణం. వీళ్ళలో చాలా మంది చివరికి వేశ్యా గృహాలకు చేరతారు. ‘ఎయిడ్స్‌’ లేని వేశ్యల అవసరం పెరగటంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తోంది.

గర్భంలోనే అంతమొందించని పక్షంలో ఆడశిశువులను పుట్టగానే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలో 1990లో 1.5 కోట్ల మహిళలు ‘మాయమై’ పోయారని అంచనా ప్రపంచ వ్యాప్తంగా ”మహిళల్ని మట్టుపెట్టడం” పట్ల స్త్రీవాదులు అందోళన చెందుతున్నారు. భారతదేశంలో హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఆడశిశువులను చంపటం చాలా ఎక్కువగా ఉంది. సేలంలో ప్రతి 1000 మంది బాలురకు కేవలం 849 బాలికలు మాత్రమే ఉన్నారు.

హింస అనేక శారీరక, మానసిక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. పూర్తిగా ”పురుషుల చేతల” వల్ల సంభవించింది ఏదైనా ఉందా అంటే వాటిల్లో హింస ఒకటని చెప్పవచ్చు. పురుషులే దీనికి కారకులు, స్త్రీలు బాధ్యులు కారు. తరచు హింసకు ఎటువంటి సాకు ఉండదు.

కానీ ఈ హింస మహిళలపై ప్రత్యేకించి కుటుంబ మద్దతు, ఆర్ధికవనరులు, ఏ దారీ లేని వారిపై ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. హింసకు, అత్యాచారానికి గురయిన మహిళలలో ఆత్మహత్యల శాతం పెరుగుతుంది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి నలుగురు మహిళలలో ఒకరు అంతకు ముందు హింసకు గురయినవారే, ఎముకలు విరగడం, వాపులు, గాయాలు, తీవ్రమయిన తల గాయాలు సాధారణం, గర్భధారణ సమయంలో హింసకు గురి కావడంఎక్కువ. ఇది గర్భ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

బలవంతపు రతి కారణంగా గర్భధారణ, గర్భస్రావం, గర్భవిచ్చిత్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అత్యాచారం వల్ల యోని, గుదం, గుదాశయం చిరిగిపోవడం, సుఖవ్యాధులకు గురికావడం. హెచ్‌.ఐ.వి. బారిన పడటం వంటివి జరుగుతాయి. తీవ్ర తలనొప్పి, పొట్టనెప్పి, జీర్ణ సమస్యలు, కీళ్ళ నొప్పులు, కటి సీమలో బాధ వంటి శారీరిక సమస్యలు సాధారణం, మహిళలపై హింస, దాని ప్రభావాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ప్రతి 5 సంవత్సరాల ఆరోగ్యకర జీవితంలో ఒక సంవత్సరాన్ని కోల్పోతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి చేసింది. హింసకు గురయిన వారికి వైద్య ఆరోగ్య సేవలు 15-24 శాతం అధికంగా అవసరమవుతాయి.

హింస యొక్క మానసిక పరిణామాలు ఒక మొస్తరు నుంచి తీవ్రంగా ఉంటాయి. దిగ్భ్రాంతి, ఆందోళన, భయం, స్తబ్దుగా అయిపోవటం, గందరగోళం, నిస్సహాయత, అపనమ్మకం, తెలిసిన బంధువో, స్నేహితుడో అత్యాచారానికి పాల్పడినప్పుడు మోసగింపబడ్డామన్న భావన, అవరాధ భావన, ఆత్మనూన్యత, ఆభద్రత, ఎందుకు కొరగామన్న భావన, ఆత్మనింద, ఆత్మద్వేషం ఎవరితో కలవక పోవటం, లైంగిక సమస్యలు, తమ లైంగికత గురించి గందరగోళం, లైంగిక సంబంధాలు ఏర్పరచుకోలేకపోవటం, లైంగిక అనాసక్తి, జడత్వం వంటివి అనుభవం కావచ్చు. సామాజికంగా బహిష్కరించబడటం, చెడిపోయింది’ అని ముద్ర పడటం, ‘కుటుంబ గౌరవం’ పేరుతో తరిమెయ్యటం, చంపటం లేదా ఆత్మహత్యలకు పురిగొల్పటం వంటి సమాజిక సమస్యలు కూడా తరుచు ఎదురవుతుంటాయి. ఈ సామాజిక అంశాలే ఒకసారి అత్యాచారానికి గురయిన మహిళ నైతికతలోపించినదిగా, తేలిక ఎరగా మళ్ళీ మళ్ళీ అత్యాచారానికి గురయ్యే అవకాశముంది.

యుద్దం అనంతరం సైనికులు వత్తిడి ప్రభావానికి గురయినట్లుగానే హింసింపబడ్డ మహిళలు ప్రత్యేకించి అత్యాచారానికి గురయిన వాళ్ళు ఆ తరువాత దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అత్యాచార సంఘటన పీడకలలా వెంటాడుతుంటుంది. ఆ భయంకర క్షణాలు మళ్ళీ మళ్ళీ అనుభూతిలోకొస్తుంటాయి. షాక్‌కి గురయ్యి నిస్తబ్దంగా అయిపోతారు. అతిగా భయపడతుంటారు. చిన్నపాటి శబ్ధం లేదా కదలికలకు ఉలిక్కి పడుతుంటారు. లైంగిక ఆత్యాచారానికి గురయిన బాలికలు మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. మాంధ్యం, తీవ్ర భయాందోళనలు (ఫోబియా), హిస్టీరియా వంటివి. ఇది స్కిజోఫ్రినియా వంటి తీవ్ర మానసిక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు.

పురుషుల హింసకు మనస్తత్వశాస్త్రం అనేక రకాలుగా వివరణనిస్తుంది. దాని ప్రాముఖ్యతను తగ్గిస్తుంది. కాబట్టి దీనిపై స్త్రీవాద విమర్శ ఎంతయినా అవసరం, హింసకు గురయిన మహిళలు పక్షపాత పూరితమయిన ఈ సిద్ధాంతాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ రెండు సిద్ధాంతాల గురించి క్లుప్తంగా చర్చిస్తాను. కొన్ని జీవశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం పురుషుల మనస్తత్వంలో దాడి చేసే గుణం ‘సహజం’ అంటాయి. జంతు జాతులలో ఆహారం కోసం, నివసించే స్థలం కోసం, ఆడ జంతువుతో సంభోగానికి మగ జంతువులు పోటీపడతాయి. మగవాడిలో ఉండే టెస్టోస్టిరోన్‌ అన్న హార్మోను కూడా దాడి చేసే గుణంతో ముడి పడి ఉందంటారు. అయితే మానవుల విషయంలో ఈ సిద్ధాంతాలకు అంత ప్రాముఖ్యత లేదు. జంతువులలో దాడిచేసే ప్రవర్తన కొన్ని రకాల ముఖ కవళికలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇవన్నీ మనుగడకు మౌలికమయిన ఆహారం, ఆశ్రయం, పునరుత్పత్తి ముడి పడి ఉన్న సందర్భాలలో మాత్రమే ప్రదర్శితమవుతాయి. పురుషులలో దాడి చేసే స్వభావం ఈ సందర్భాలలను, ఈ పరిమితులను మించి ఉంటాయి. ఉదాహరణకు వేశ్యలుగా మార్చడం, వాళ్ళని అదుపులో ఉంచడం, అత్యాచారం, సామూహిక అత్యాచారం, మోసగించి పెళ్ళి చేసుకుని భర్త బలాత్కరించడం, అన్నం పెట్టకుండా మాడ్చటం, కొట్టడం, నోట్లో గుడ్డలు పెట్టడం, కత్తులతో గాట్లు పెట్టటం, మత్తు మందులకు బానిస చెయ్యడం, సిగరెట్లతో కాల్చటం, చంపటం, ఆత్మహత్యకు పాల్పడేలా చెయ్యడం వంటి వాటికి పాల్పడుతుంటారు. వేశ్యా వ్యాపారం, దానికోసం జరిగే హింస మానవ మనుగడకు సంబంధించినవి కావు. జంతువుల మాదిరి కాకుండా మానవులు హింసను కొనసాగించటానికి సాంకేతిక విజ్ఞానాన్ని, కొత్త విధానాలను అనుసరిస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఆశ్లీల సాహిత్యాన్ని పేర్కొనవచ్చు. జంతు సమూహాల కంటే మానవ సమూహాలు భిన్నమయినవి, మానవులు విలువలు, సంప్రదాయాలు ఏర్పరచుకుని, వాటిని అమలు చేస్తారు. అతిక్రమించినవారిని శిక్షిస్తారు (ఉదా: సతి, వరకట్నం, గర్భంలో ఆడపిల్లల హత్య), మనుషులకే ప్రత్యేకమయిన ఈ ప్రవర్తన, సామాజిక కట్టుబాట్లు, ఉద్దేశ పూర్వక చర్యల ఫలితంగానే మహిళలపై హింస జరుగుతోంది. అంటే విలువలను, అర్థాలను ఏర్పరుచుకుని మానవ ప్రవర్తనను హింస ద్వారా నిర్దేశించటమన్నమాట. హింసను సమర్థించటానికీ, ప్రోత్సామించటానికీ (ఉదా: మత కలహాలలో అత్యాచారాలు, పోలీసుకస్టడీలో అత్యాచారాలు) అవసర వనరులు, సంస్థాగత నియమాలపై మానవ బృందాలకు గట్టి పట్టుకూడా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మానవ దాడులను ‘పాశవికంగా’ పేర్కొనటం సరయినది కాదు. పశువులు తమ తోటి వాటిపై ఇన్ని రకాలుగా, ఇంత తీవ్రదాడులు చేయవు. పురుషులు మాత్రమే అలా ప్రవర్తిస్తారు.

మనసత్తత్వ శాస్త్రంలో ఇతర సిద్ధాంతాలు పురుషులు ‘నిస్పృహ’ (Frustration)కి గురవుతారని పేర్కొంటాయి. ఈ నమూనా కూడా జీవశాస్త్ర పరమైనదే. దీనిని ఆకలి వేసే గుణంతో పోల్చవచ్చు. ఆకలి వేసినపుడు జంతువు ఆకలి తీర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. ‘ప్రేరకం’ (Stimulus) దానికి ‘ప్రతిస్పందన’ మధ్య జీవశాస్త్ర లంకె ఉందని భావిసాత్రు. వాతావరణంలోని లోపాలకు ప్రతిస్పందనగా పురుషులు హింసకు పాల్పడతారని భావిస్తారు.

స్త్రీలపై హింస జరిగే సందర్భాలను పరిశీలిస్తే ఈ సిద్ధాంతంలోని లోపాలు బయటపడతాయి. వంటసరిగా చెయ్యలేదనో, ఉప్పు ఎక్కువయిందనో, ఇల్లు శుభ్రంగా ఉంచలేదనో భార్యల్ని చితకబాదే సందర్భాలు అనేకం. వరకట్నం విషయమే తీసుకుంటే డబ్బు, లేదా ఆస్తిపై దురాశ కారణంగా హింసకు పాల్పడుతున్నారు. మహిళలపై జరుగుతున్న ఈ హింసను వాతావరణంలోని లోపాలుగా వ్యాఖ్యానించటం అన్యాయం. ఇందులోను మనుగడకు సంబంధించిన అంశాలేవి లేవు. పితృస్వామ్య దురహంకారం. దురాశల ఫలితంగా మహిళలపై జరుగుతున్న హింసగా వీటిని చూడటం సరయినది.

హింసను వివరిస్తూ ఇతర సిద్దాతాలు కూడా ఉన్నాయి. వాటిని ఇక్కడ చర్చించలేదు. ఉదాహరణలు : 1) అవేశాలను అదుపు చేసుకోగల శక్తి పురుషులకు సహజంగానే తక్కువ: 2) హింసకు పాల్పడే పురుషులు ఆందోళనకు గురయ్యి ఉంటారు. వారికి ఆత్మగౌరవం తక్కువ; 3) హింసకు పాల్పడే పురుషులు నిజానికి తమకు ప్రేమ, సంరక్షణ కావాలని తెలియజేస్తున్నారు; 4) పరిస్థితుల ప్రభావం కారణంగా పురుషులు హింసాత్మకంగా మారతారు. వంటివి. మహిళలపై జరుగుతున్న హింస ప్రభావాన్ని తగ్గించి చూపటమే కాకుండా, హింస వెనుక వుండే ఉద్దేశాలు, ప్రేరణలు తీసుకొని ఈ సిద్ధాంతాలనన్నింటినీ ఖండించవచ్చు. హింసకు మనస్తత్వ శాస్త్రపరమైన సాకులు ఏవీ ఉండటానికి వీలులేదు. సాకటం, సంరక్షణలకూ, హింసకూ సంబంధమే ఉండదు. మహిళల పట్ల నిర్లక్ష్యం, వాడి పారేసే వస్తువులన్న పురుషుల పొగరుబోతు ప్రవర్తనగా హింసను చూడాలి.

హింసకు సంబంధించి అన్ని అసత్యాలను ఇక్కడ చర్చింబోవటం లేదు. అత్చాచారానికి సంబంధించిన అసత్యాలు అందరికీ తెలిసినవే. అత్యాచారం జరిగినట్టు అందరికీ తెలిసినపుడు ఇవి మరోసారి ఊపందుకుంటాయి. ప్రసార సాధనాలు, కోర్టులు, కుటుంబం ఈ అసత్యాలను బలోపేతం చేస్తుంటాయి. అత్యాచారానికి సంబంధించిన అసత్యాలు కోకొల్లలు. మహిళ చెప్పింది నమ్మకుండా, అత్యాచారం జరిగిందని ”నిరూపించమనటం”, అత్యాచారానికి గురైన మహిళ ప్రవర్తన అంత మంచిదికాదనడం, పురుషులతో ఆమె సంబంధాలు చాలా ‘ఫాస్ట్‌’ అని, ఆమె వేషధారణ రెచ్చగొట్టే విధంగా ఉందని ఆమెకు తగ్గ శాస్తి జరిగిందని మొదలైనవి. ఇటీవల ఒక అత్యాచారం కేసులో నిమ్న కులానికి చెందిన స్త్రీ ఉన్నత కుల పురుషులు బలాత్కారించారనటం నమ్మశక్యంగా లేదంటూ కోర్టు తీర్పునిచ్చింది. క్రైస్తవ సన్యాసిని (నన్‌) వేషధారణలోని మహిళ అత్యాచారానికి గురైనపుడు ఆమె రెచ్చగొట్టే విధంగా బట్టలు వేసుకుందని అన్నారు!

మహిళలపై హింసను ప్రేరేపించే ఘటనలు మన రోజు వారి జీవితాల్లో కోకొల్లలు, రోడ్డుపై వేధింపబడ్డ ఆడపిల్ల ”జాగ్రత్తగా

ఉండమని”, ”దృష్టినాకర్షించవద్దనీ” తల్లిదండ్రులతో తిట్లు తింటుంది. పురుషులు వేధిస్తున్నారని ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు నవ్వేసి రోడ్లపై ఆడవాళ్ళు ప్రవర్తించాల్సిన విధానంపై నీతి బోధ చేస్తారు. కొన్ని సార్లు ఆడపిల్లలు, ప్రత్యేకించి ఇతర వత్తిడులకు కూడా గురయ్యే పేద ఆడ పిల్లలు తమ మగ ”టీచర్ల” లైంగిక వేధింపులు భరించలేక బడి మాని వేయటానికి కూడా పైన పేర్కొన్నటువంటి ప్రవర్తనే కారణం. వేధింపులకు గురయ్యే వారు తమ ప్రవర్తన ద్వారా కోరి కష్టాలు తెచ్చుకున్నారని తోటి వాళ్ళు పరిహసిస్తారు. భార్యలు హింసకు గురికావటాన్ని చాలా కొద్ది మంది సహాయ సలహాదారులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తారు.

చాలా మంది సలహాదారులు స్త్రీలు ప్రవర్తనను ప్రశ్నించి, విమర్శిస్తారు. ‘చక్కగా ఆలంకరించుకో మనో, వంట,

శుభ్రతనేర్చుకోమనో, భర్తను ‘రెచ్చగొట్టవద్ద’నో సలహా ఇస్తారు. ఇవన్నీ పురుషుల హింసను సమర్థించటానికీ, ప్రోత్సాహించటానికీ

ఉపయోగపడతాయి. ఇంకో వైపున హింసకు బలయిన స్త్రీని విమర్శ, ఆక్షేపణ, శిక్షణ ద్వారా మరింతగా హింసకు గురయ్యేలా చేస్తాయి.

చాలా మంది మహిళలు హింసను నిశ్శబ్దంగా, ఏ మాత్రం ప్రతిఘటించకుండా భరిస్తారు. కొంతమంది హింసను తిరిగి హింస ద్వారా ఎదుర్కోవటం నేర్చుకుంటారు. హింసను ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని ప్రాథమిక చర్యలు గురించి మాత్రమే చర్చించారు. ‘చిటికె’లో పరిష్కారాలను ఇవ్వబోవటం లేదు. సంబంధాలలో హింసకు తేలిక పరిష్కారాలు ఏమి లేవు. వాస్తవానికి హింసను, పరిష్కారం అవసరమయ్యే సమస్యగా చాలా అరుదుగా చూస్తారు. ‘ఫురుషులన్న తరువాత అంతే’ అని హింసను అంగీకరిస్తార. మహిళలు తమ అనుభవంలోకి వచ్చిన హింసను గుర్తించరు, పట్టించుకోరు, లేదా అంత ముఖ్యం కాదని అనుకుంటారు. కొన్ని సార్లు ఇవి మనుగడకు అవసరమయ్యే ఎత్తుగడలు కావచ్చు. తరచు మహిళలకు ఇతర దాడులు ఏమీ ఉండవు. భారతదేశంలో మనకి వివాహంలో హింసను, అత్యాచారాన్ని ఆమోదించటం, ఆశించటం కూడా నేర్పుతారు. (సలహాదారులు చెప్పటానికి ఇష్టపడే ఒక జోకు ఉంది. ఒక స్త్రీ వచ్చి తన భర్త తనను ప్రేమించటం లేదని ఫిర్యాదు చేస్తుంది. ప్రేమించటం లేదని ఎలా చెప్పగలుగుతున్నాని అడిగినపుడు ‘గత నెలలో నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు” అని ఆమె బదులిస్తుంది. హిందూ చట్టాలు, ‘కామసూత్ర’ వంటి ఇతర స్మృతులు వైవాహిక, లైంగిక హింసను పట్టించుకోకపోవటమే కాకుండా ప్రోత్సాహిస్తాయి.

హింస యొక్క తీవ్రత, వాటి ప్రభావాలు పైన చర్చించుకున్నాం. వీటిని గుర్తించకుండా పట్టించుకోకుండా ఉండకూడదు. అంత ముఖ్యం కాదని అనుకోగూడదు. మహిళలపై హింస ఒక సమస్య. అది బాధలను, కష్టాలను పెంచుతుంది. బంధాలను అర్థరహితంగా మారుస్తుంది. సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత అనుభూతులను కలుషితం చేస్తుంది. తరుచు జీవితానికే ముప్పు వాటిల్లుతుంది. మన జీవితాన్ని మెరుగు పరచుకోవటంలో భాగంగా ముందు హింసను గుర్తించి, అంగీకరించి దానిని ఎదుర్కోటానికి సిద్దపడాలి. దాని గురించి ఏమైనా చెయ్యాలంటే కుటుంబ వాతావరణంలో హింసను గుర్తించటం. అర్థరహిత హింసకు మనం ఎరలం అవుతున్నామని తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. బంధాలలో హింస ఏ మాత్రం అంగీకరించటానికి వీల్లేదని గట్టిగా విశ్వసించాలి.

వైవాహిక హింస, మద్యపానానికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ రెండూ తరచు జంటగా ఉంటుంటాయి. మద్యానికి విపరీతంగా అలవాటు పడిన వ్యక్తి బార్యాపిల్లల్ని హింసించటానికి ఎక్కువ అవకాశాలున్నాయి; భార్య గర్భవతిగా

ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా హింసకు గురవుతుంది. భార్యను శారీరకంగా హింసించే వ్యక్తి లైంగికంగా హింసించటానికి అవకాశాలు ఎక్కువ. వైవాహిక అత్యాచారం అన్నది వాస్తవం. మహిళలు తమపై బలవంతంగా, మొరటుగా సంభోగం జరిపే సందర్భాల గురిచి సచేతనంగా ఉండాలి. అప్పుడు దానిని నివారించడానికి ఏమైన చర్యలు తీసుకోగలం. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యపాన వ్యతిరేక ఉద్యమంలో మద్యాన్ని అరికట్టిన కుటుంబాలలో ఆ మేరకు హింస తగ్గి ఉండాలి.

హింసకు పాల్పడే వ్యక్తి ప్రత్యేకించి మధ్యతరగతి నేపధ్యంలో, తాను ఏమి చేసినా బెల్టుబాటవుతుందనుకుంటాడు. తన సమస్య గురించి స్నేహితులతో, బంధవులతో, తల్లి దండ్రులతో చర్చించవద్దంటాడు. తీవ్రమయిన హింసకు గురయ్యే మహిళల సామాజిక జీవితం పూర్తిగా శూన్యం కాని పక్షంలో చాలా పరిమితమై ఉంటుంది. గుట్టుగా ఉండే పరిస్థితుల్లో హింస పేట్రేగిపోతుంది. సమస్యకు మద్దతునిచ్చే స్నేహితులకు, బంధువులకు, మహిళా సంస్థలకు చెప్పుకోవటం హింసను ఎదుర్కోవటంలో ఒక మార్గం. అనేక పెద్ద పట్టణాల్లో ఇప్పుడు బాధిత మహిళలకు సహాయ కేంద్రాలున్నాయి. పోలీసుల సహాయం, జోక్యాన్ని కోరడం ద్వారా హింసను సమర్ధంగా అదుపుచేయవచ్చు. నేను ఉండిన ఒక కాలనీలో ఒక స్త్రీ తరచు భర్తతో హింసింపబడేది. ఆమెకు హింసిస్తున్నాడని తెలియగానే ఆమె స్నేహితులు బహిరంగంగా జోక్యం చేసుకోవటం ఇష్టం లేక ”పలకరించటానికి’ వచ్చినట్లుగా వెళ్ళేవారు, లేదా భర్తను బయటకు పిలిచేవారు.

స్త్రీని కొట్టే అవకాశం, సందర్భం, అధికారం దొరుకుతాయి. కాబట్టి పురుషుడు హింసకు పాల్పడుతుంటాడు. హింసకు దిగుతాడు అన్న అనుమానం కలగ్గానే ఆ ప్రదేశాన్ని వదిలి వేరే చోట ఆశ్రయం తీసుకోవాలి. ఉద్యోగం చూసుకోవటం, ఆర్థికంగా స్వాలంబనం పొందటం వంటివి హింసను సహించబోమని తెలియ చేస్తాయి. బంధాలలో అనేక రకాల హింసలను సహించబోమని చెప్పటానికి సాధ్యమయిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు ఏవీ ఫలించకపోతే ఆ సంబంధాలలో కొనసాగనవసరం లేదు. హింస లేని జీవితాలు మనందరి హక్కు. మన శరీరాలు, మన మనసులు మనవి మాత్రమే. వీటికి హాని చేసే అధికారం వేరెవ్వరికీ లేదు.

హింసాత్మక పరిస్థితులలో జీవించే మహిళలకు చంపబడటం, కాల్చబడటం, తిరిగి కోలుకోలేని విధంగా హింసించటం ఎంత తేలికో అర్థమవుతుంది. ఆమె మానసిక జీవితం భయం, ఆందోళనతో నిండిపోతుంది. ప్రతిరోజూ, ప్రతి క్షణం హింసకు గురికాకుండా వుండటం ఎలా అని ఆలోచించటమే సరిపోతుంది. హింసే కాకుండా దాని భయం ఆమె ప్రవర్తనను నిర్దేశిస్తుంటుంది. ఒక్కసారి హింసకు గురయిన మహిళ మనసుపై జీవితాంతం దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ‘పరదా’ వేసుకోవటానికి ఇష్టపడని మహిళను భర్త హింసించనవసరం లేదు. ”పరదా వేసుకోవటానికి ఇష్టపడని మహిళను భర్త హింసించనవసరం లేదు. ”పరదా వేసుకోని రోజున ఏం జరిగిందో నీకు తెలుసు. మళ్ళీ అదే కోరుకుంటున్నావా?” అని అంటే చాలు అమెను భయపెట్టటానికి, భయమూ, అందోళనలు బద్ధలు కొట్టగల ధైర్యం, శక్తి కూడగట్టుకోవటం ఎంతైనా అవసరం. సలహా లేదా మహిళా సంస్థలో ఉండటం ఇందుకు తోడ్పడుతుంది. తీవ్రమయిన శారీరక, మానసిక హింసకు గురయినవారికి ప్రొఫెసనల్‌ సహాయం అవసరం కావచ్చు.

హింసను ‘నివారించటానికి’ ఇటీవల వస్తున్న చాలా కార్యక్రమాలు కేవలం ‘తాత్కాలిక ఉపశమనాలు’గా ఉపయోగపడుతున్నాయి. పురుషుల్ని తీసుకెళ్ళి సలహా ఇచ్చో, కొట్టో వదిలేస్తారు. లేదా సలహాదారులు హింసకు గురయినవాళ్ళను ‘సర్దుకుపొమ్మని’ చెబుతారు. ఇవి హింసను కొంతవరకు అదుపు చేసినప్పటికీ, తాత్కాలికంగానే ఉండిపోతాయి. హింసను పూర్తిగా నిర్మూలించటానికి ఇవి ఉపయోగపడవు. హింస అనేది ప్రవర్తనలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. ఇది సంబంధాలలో అనేక చిన్న చిన్న రూపాలలో బయట పడుతుంది. హింసకు పాల్పడే పురుషులు సాధారణంగా బాల్యంలోనూ హింసకు పాల్పడి వుంటారు, వీళ్ళు ఈ గుణాలను తండ్రి నుంచి నేర్చుకుంటారు. తమ కోరికలకనుగుణంగా పనులు చేయించుకోవటానికి హింస తేలికయిన, సమర్థమయిన మార్గమని వాళ్ళు గుర్తిస్తారు. హింస అనేది చిన్నతనం నుండే నేర్చుకుని ఇతరులను లొంగదీసుకునే ప్రవర్తన. మగ పిల్లలకు కార్లు, తుపాకులు, ఇతర వినాశకర, యాంత్రిక బొమ్మలు కొనిపెట్టడం ద్వారా హింస మంచిదని విశ్వసించటానికి వారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచంతో హింసాత్మకంగా వ్యవహరించటం నేర్చుకుంటారు. హింసను అరికట్టడానికి ఎన్నో దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. మగ పిల్లల హింసాత్మక ప్రవర్తన, దాడి చేసే గుణాన్ని అదుపు చేయటం; మగపిల్లలకు అడవాళ్ళ గురించి శ్రద్ధ చూపటం నేర్పించటం; అడవాళ్ళ గురించి మంచి విషయాలు నేర్పించటం మొదలైనవి, ఇదంతా బడికి వెళ్ళటానికి ముందు నుంచే సామాజీకరణ, విద్యలలో భాగం కావాలి.

(అనువాదం : కె. సురేష్‌, సెప్టెంబర్‌ – ఆక్టోబర్‌ 1998 భూమిక నుంచి…)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.