2008 సంవత్సరం!! అప్పటికి ఆయేషా మీరా హత్య జరిగి కొన్ని నెలలు అవుతోంది. ఎల్ఐసిలో పనిచేస్తున్న మహిళల సంఘం తరపున ”మహిళలపై పెరుగుతున్న హింస” అనే అంశంపై ఒక నోట్ తయారు చేయాలి. DATA కోసం వెతుకుతున్నప్పుడు మొదటిసారిగా చూశాను ”భూమిక-స్త్రీ వాద పత్రిక”ను.
భూమిక!! పేరే చాలా అందంగా, మనసుకి హత్తుకుపోయేలా అనిపించింది. భూమిక అంటే అర్థం Role Play అని కదా. బహుశా ఇంత సార్థకత ఏ పేరుకీ ఉండదేమో. అప్పటి నుంచి భూమికకీ, కొండవీటి సత్యవతి గారికి వీరాభిమానిని. తను, తన గోదావరి బ్లాగ్ ఒక passion నాకు. అంతకు మించి ఒక inspiration. ఆ తర్వాత అమ్మగా నన్ను అక్కున చేర్చుకుని, తన మనసులోకి తీసుకోవడం. నేను ఎంతగానో ప్రేమించిన భూమికకు నేను ఆర్టికల్స్ రాసి పంపగలగడం…!! ఇదంతా ఒక Destiny!
”నువ్వు ఏదైనా సాధించాలని బలంగా కోరుకున్నప్పుడు దాన్ని సాధించడంలో ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది” అంటాడు బ్రెజిల్ రచయిత Paulo Coelho.
నా జీవితంలోకి అమ్మ రావడం అలాంటిదే… భూమిక ప్రస్థానం వెనుక కూడా మా అమ్మ కొండవీటి సత్యవతి యొక్క అంత బలీయమైన ఆశ… విశ్వాసం ఉన్నాయి. అందుకే సాహిత్య రంగంలో ఇంత విజయవంతమైన ముద్ర పడింది. సమాజంలోని అన్ని రంగాల్లోను నిరాఘాటంగా చెలామణి అవుతున్న పురుషుల అధికార స్వభావాన్ని ప్రశ్నిస్తూ, దాన్ని మార్చే దిశగా స్త్రీలనీ, పురుషులనీ కూడా చైతన్యవంతులని చేసి ఒక మంచి మానవ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే అంతిమంగా స్త్రీ వాదం ఆశయం.
భూమిక పత్రిక గత 25 సంవత్సరాలుగా ఇదే ఆశయానికి కట్టుబడి ముందుకు సాగుతోంది అన్నది నిర్వివాదాంశం. విలువల ద్వంద్వత్వాన్ని బయటపెడుతూ స్త్రీల సాంఘిక చరిత్రతో పాటు సాహిత్య చరిత్రనూ రికార్డు చేసే ప్రయత్నంలో ”భండారు అచ్చమాంబ”ను వెలుగులోకి తీసుకు రావడంలో కొండవీటి సత్యవతి గారి పాత్ర మరువలేనిది.
అలాగే తన 25 ఏళ్ళ ప్రస్థానంలో భూమిక ఖచ్చితంగా స్త్రీల సమస్యలకు సంబంధించి ఒక అవగాహనను పాఠకులలోనూ, సాహిత్య వర్గాలలోనూ, వెరసి సమాజం తాలూకు ధోరణిలోనూ బలంగానే కలుగజేసింది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇలా స్త్రీలను అణచివేసే అన్ని అంశాల పట్ల చర్చలూ… ప్రతిఘటనలూ, పోరాటాలూ జరగడం వల్ల స్త్రీల సమస్యలన్నీ చాలా త్వరలో… అదాటుగా… మాయమైపోతాయన్న భ్రమలేవీ మనలో లేవు కాబట్టి, భూమిక అవసరం ఇంకా అనేక దశాబ్దాలపాటు ఉంది.
ప్రస్తుతం పరమ కల్లోలంగా ఉన్న కుటుంబ వ్యవస్థ, ఉద్యోగం చేస్తున్న మహిళల పరిస్థితి… వీటి రూపురేఖలు మారనిదే ఆడవాళ్ళకి హింస నుంచి, నిజంగా విముక్తి సాధ్యం కాదన్న ముందు చూపు భూమికకి ఎప్పుడూ ఉంది. అందుకే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం రావాల్సిన అవసరం కొండవీటి సత్యవతి ఎప్పుడో గుర్తించారు.
అందుకే భూమిక సాహిత్యంలో ఈ సంఘర్షణ ప్రతీ అక్షరంలోనూ కనిపిస్తుంది. భూమిక అక్షరాల్లో ఇదే పదును ఎప్పటికీ కొనసాగాలనీ, స్త్రీల అనుభవాలకీ, ఆలోచనలకీ, స్పష్టమైన అద్దంలా భూమిక ఉండాలనీ… స్త్రీల జీవితాలను ఇప్పటికీ శాసిస్తున్న పురాణకాలం నాటి నమ్మకాలను తిరిగి ప్రశ్నించే వేదికగా, ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంలో తిరిగి విశ్లేషణ చేసే భూమికగా మన పత్రిక మరింత బలంగా ముందుకు వెళ్ళాలనీ కోరుకుంటూ… భూమికకీ… కొండవీటి సత్యవతి గారికీ… వెరసి మనందరికీ… శుభాభివందనలు…
– ఉమా నూతక్కి, విశాఖపట్నం