కొండవీటి సత్యవతితోనూ, భూమికతోనూ నా అనుబంధం మీరెవరూ ఊహించలేనంత పాతది. ఈ పుస్తకం తేవటం వెనక అపారమైన ఆమె శ్రమ ఉంది. ఏనాడో ఒకరోజు సత్యవతి విజయవాడలో మా ఇంటికి వచ్చారు. నేను మా అమ్మని తీర్థయాత్రకు తీసుకుపోయే సన్నాహంలో ఉన్నాను. ఇంట్లో అమ్మ ఏదో వండుతోంది. ఆ తియ్యని వాసనల మధ్య ఈ పుస్తకాన్ని అప్పటికి ఇంకా పేరు సరిగా ఖరారు చేయని ఒక స్త్రీ వాద పత్రిక గురించి మాట్లాడుకున్నాం. అప్పటికి స్త్రీ వాదం ఇంకా నడకలలోనే ఉంది. ఎంతో కష్టపడి స్త్రీ వాదాన్ని ముందుకు తెస్తున్న అందరినీ స్వయంగా కలిసి సత్యవతి భూమికకు రూపం పోసింది… ఆమె శ్రమతోనే రూపం పోసుకుంది భూమిక. రచయిత్రులు చాలా కొన్నే రాశారు. అలాంటి సమయంలో స్త్రీల కోసం ఒక పత్రిక తేవటం అన్నది సత్యవతి విజన్. ఆమె ఎంతో దూరం వైపు ఆశగా చూస్తున్నారు. స్త్రీలు సంఘటితంగా కలిసి ఒక వేదికపైకి రావడం గురించి ఆమె ఆశపడుతోంది. అందరినీ కూడగట్టుకునేందుకు ఎంతో కృషి చేసింది. దేన్నయినా మెయిన్ రోడ్ ఎక్కించడం వరకు చాలా కష్టం. ప్రయాస తర్వాత దాని పని అది చేసుకుపోతుంది. చాలా దూరంగా భూమిక ఒక విత్తనంలోంచి మొలకెత్తి, అంకురంలోంచి ఆకు మారాకులేస్తూ మొలుచుకురావటం చూశాను. నా దృష్టిలో సత్యవతి, భూమిక వేర్వేరు కాదు. ఈ వృక్షపు ఛాయలో సత్యవతి ఇంకా ఎన్నో ఆశయాలు నిర్మించుకొంటూ వచ్చింది. ఆమె ఆశయం నెరవేరింది. ఇప్పుడు ఆమె నేను చైతన్యాన్ని, మౌనాన్ని, బాటసారిని, సంతోషిని అంటుంది. ఒక మందిరాన్ని నిర్మించుకొని అందులో సుఖంగా, విశ్రాంతిగా ఉంటే ఎవరికి అభ్యంతరం? భూమిక స్త్రీ వాద పత్రిక. మొన్నమొన్నటివరకు, నే చూడలేదు కానీ బహుశ అడ్వర్‌టైజ్‌మెంట్స్ కూడా లేవు. అలా నడుపుకు రావడం ఎంత కష్టం. మంచి సంపాదకవర్గం, బాగా రాసేవాళ్ళు ఉన్నారు. భూమిక ఆరోగ్యంగా అందరి చేతుల్లోకి వస్తోంది. ఇది మన అందరికోసంగా సత్యవతి తీసుకువస్తోంది కనుక ఆమెకు అభినందనలు,
శుభాకాంక్షలు.
– సి.సుజాత, తెనాలి