ప్రత్యామ్నాయ పత్రికల అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. అలాంటి అవసరాన్ని తీర్చినవాటిలో భూమిక ఒకటి. భూమికతో నాకు ప్రత్యక్ష అనుబంధమే ఉంది. అప్పుడప్పుడూ రచనలు పంపడమే కాక ఆరేళ్ళపాటు మృదంగం అనే కాలమ్ రాశాను. అది వస్తున్న రోజులలో అందుకున్న స్పందన మర్చిపోలేను. అది పుస్తకంగా తేవాలన్న కోరిక ఇప్పటికి తీరింది. ఎప్పటి వార్తను అప్పుడు సమీక్ష చేయడానికి నేను తీసుకున్న సులభ శైలి, వ్యంగ్య ధోరణి పాఠకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ జనవరి 26న రాజమండ్రిలోని కడియం గులాబీ తోటల మధ్య దీన్ని రిలీజ్ చేశాను.
దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీని సందర్భం మానవ వాదుల సదస్సు. ఆవిష్కర్త ప్రముఖ మానవవాది బాబు గోగినేని, ప్రచురించినది మానవవాది గూడూరు సీతామహాలక్ష్మి. ఇక ఇందులో ఉన్నవన్నీ మానవ సంబంధాల్లోని అసమానత మీద చర్చలే అని మీకు తెలుసు. ఇంత గొప్ప అనుభవం సత్యవతి ఇచ్చిన ఒక పేజీ వల్లనే సాధ్యమయింది. ఆ సమయంలో పి.సత్యవతి లాంటి వాళ్ళు నాకు సహ కాలమిస్టులు అవ్వడం గర్వంగా ఉంటుంది.
అంతక్రితం నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో జూనియర్ ఆర్టిస్టుల మీద చేసిన ప్రాజెక్టు కూడా భూమిక కోసం చేసినదే. ఆ రిపోర్టు ఇందులోనే వచ్చింది. అది నాకు రంగవల్లి అవార్డును తెచ్చిపెట్టింది.
ఒక పత్రికతో రచయిత్రికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. అది ప్రజల్లోకి తీసుకెడుతుంది. నిరంతర సంభాషణకు సాక్ష్యమవుతుంది. ఒక జర్నలిస్టుగా ఎన్నో పత్రికలతో నాకు సంబంధం ఉన్నా స్వేచ్ఛాపూరితమైన భావోద్వేగాలకు వేదిక ఇచ్చింది నిస్సందేహంగా ఈ పత్రికే. మేమంతా ప్రేమగా పిలుచుకునే కొండవీటి దొంగ ప్లస్ సత్యవతికి నా అభినందనలు.
– కొండేపూడి నిర్మల, హైదరాబాద