స్త్రీవాదమనగానే వెంటనే స్త్రీ లోకాన్ని ప్రభావితం చేస్తున్న స్త్రీ వాద పత్రిక భూమిక గుర్తొస్తుంది. అన్ని మతాలూ స్త్రీలకు వ్యతిరేకమైనప్పటికీ ”హిందుత్వం భీతావహానికి కొలువు” అని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అన్నది నూటికి నూరుపాళ్ళూ నిజం. హిందూత్వమంటే పుట్టుక, పెళ్ళి, చావు విషయాల్లోనే కాక ప్రతి విషయంలోనూ ఆచారాల పేరిట ఆడవాళ్ళను ఒక బందీగా ఉంచడమే! ముఖ్యంగా స్త్రీలకు వ్యక్తి స్వాతంత్య్రానికి సంబంధించిన హక్కులేమీ లేకుండా వాళ్ళను స్వంత ఆస్తిగా చూడడమే. అది మన దేశ రాజ్య స్వభావంలోనే ఉంది. ప్రజాస్వామికంగా ఆలోచించే మహిళలకు, రచయితలకు ఇరవై ఐదేళ్ళుగా ఒక సమాంతర కూడలి అయింది భూమిక!

భూమికలో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇంటి చాకిరి, గృహ హింస, స్త్రీల వైద్యం, ఇంటి పని, పిల్లల పని చక్కబెడుతూనో తమ ఆరోగ్యం మీద తాము ఎలా శ్రద్ధ తీసుకోవాలి, వంటింటి దినుసులతో, ఇంటి పెరడులో ఉన్న మొక్కలతో చిన్న చిన్న జబ్బులకు ఎలా వైద్యం చేసుకోవాలనే చిట్కాలు మొదలైన మౌలికమైన సమస్యల మీద సామాన్య స్త్రీలు సులభంగా అర్థం చేసుకునే రీతిలో రచనలొచ్చేవి. నేను ఇంటా, బయటా బండెడు చాకిరీతో, వచ్చీ పోయే చుట్టాలు, స్నేహితులకు వండిపెడుతూ సతమతమవుతున్నప్పుడు ఎన్నోసార్లు నాకు లాయర్‌ వనజ ”అక్కా ఇది చదువు” అని భూమికలు తెచ్చిచ్చేది. వనజ సాంగత్యంలో భూమికలు చదువుతుండడంవల్ల నాకు తెలియకుండానే పనుల ప్రయారిటీలు, ఏ బండ పని ఎలా తప్పించుకోవాలో తెలిసొచ్చింది.

2006-2007 ప్రాంతాల్లో వార్త వారపత్రికలో ”శ్రీవారూ, ఎందుకిలా మీరు?” అనే ఒక ఉత్తరాల శీర్షిక వచ్చేది. పత్రిక వారు ”మీ పేరూ, అడ్రెస్‌లు రహస్యంగా ఉంచుతాం, మీకు మీ శ్రీవారిలో నచ్చని గుణాలు రాయ”మని సాధారణ మహిళలను కోరారు. ఇక చూస్కోండి! ప్రతి వారం వర్షంలా చిట్టి పొట్టి ఉత్తరాల్లో కొండను అద్దంలో చూపించినట్లు వ్యవస్థలోని లోపాలను, ఈ దుర్మార్గపు పురుష ప్రపంచపు మనస్తత్వాన్ని ఎండగడుతూ అలతి అలతి పదాలతో అర్థవంతమైన రచనలు చేశారు. భర్తల అమానుష ప్రవర్తనల గురించి రాశారు. దాదాపు రెండు, రెండున్నరేళ్ళపాటు ఈ శీర్షిక కొనసాగింది. ప్రతివారం పత్రిక రావడంతోటే ”శ్రీవారూ, ఎందుకిలా మీరు?” కోసం ఎందరో మహిళలు (ఉదా.కి మా టెలికాం మహిళలు) ఆత్రంగా చూడటం నాకు తెలుసు. చాలామంది మహిళలు వారితో ఐడెంటిఫై అయ్యారు. పేరున్న రచయితలెవరూ పట్టించుకోలేదు. (పి.సత్యవతి గారు మెచ్చుకున్నారు) కానీ ఈ స్త్రీలను ప్రోత్సహిస్తే మంచి రచయితలవుతారనిపించింది. చైతన్యవంతులైన స్త్రీలు సమాజంలో విస్తరిస్తున్న సమానత్వ భావనలను వెంటనే అందిపుచ్చుకుంటారు. కానీ సాధారణ స్త్రీలకు అంతవరకూ అలవాటైన ఇంటి ఆచారాలు, చుట్టుపక్కల వాతావరణాల వల్ల ఈ భావజాలం మింగుడుపడదు. లోపల ఎంత నరకం అనుభవిస్తున్నా పైకి మాత్రం ”ఆహా! మా ఆయన, అమ్మో! మా ఇంటి గుట్టు” అనే అంటారు. ఆశ్చర్యకరంగా ఈ భ్రమల్ని సామాన్య స్త్రీలు బద్దలు కొట్టారు. భూమికలాంటి సంస్థలు చేపట్టిన కృషివల్ల సమాజంలో ప్రతిఫలించిన సమానత్వ భావనలు సాధారణ స్త్రీల వరకూ ప్రసరించాయి. ఇది నాకు చాలా సంతోషం కలిగించింది. సమాజం కాస్తంత ముందుకి జరగడానికీ, స్త్రీల ఆలోచనల్లో మార్పు రావడానికి భూమిక తనవంతు పాత్ర పోషించిందని నా అభిప్రాయం. మహిళల పట్ల మహిళలూ, సమాజం కూడా న్యాయంగా వ్యవహరించవలసిన ఒక ప్రత్యామ్నాయ సామాజిక ధోరణి సమాజంలో బలపడడానికి భూమిక పునాదులు వేసింది. మిగిలిన మహిళా పత్రికలు సిద్ధాంతాలు పునాదిగా పనిచేస్తున్న సమయంలో భూమిక మహిళల ప్రాథమిక హక్కులను, మౌలిక సమస్యలను ముందుకు తెచ్చింది. ఈ కోణంలో భూమిక నిర్వహించిన పాత్ర ఎంతైనా ప్రశంసనీయం.

భూమిక మొదటి సంపాదకీయంలోని లక్ష్యాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఆ పత్రికను జాగ్రత్తగా భద్రపరచుకున్నాను.

భూమిక ఆధ్వర్యంలో తలకోన, గంగవరం పోర్టు, వాకపల్లి ప్రయాణాల్లో విజ్ఞానం, వినోదం, స్నేహ సౌరభాలు వెల్లివిరిశాయి. బోలెడన్ని హగ్గులూ, జోకులూ… ఆ రోజులు మళ్ళీ రావు!

వాకపల్లి మహిళల పట్ల సహానుభూతితో స్పందించని, కంటతడి పెట్టనివారు లేరు. నిరుపేద ఆదివాసీ మహిళలు తమ ప్రతిఘటన ఉద్యమాలతో అత్యంత శక్తివంతమైన వ్యవస్థను ఎదిరించి నిలిచి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పారు. ప్రభుత్వాలు ఏమి కల్లబొల్లి కబుర్లు చెప్పినా ప్రపంచమంతా నిజాయితీగా ఉన్న వాకపల్లి మహిళల పక్షానే నిలబడింది. వాటిమీద నేను రాసిన వ్యాసాలు భూమికలో వచ్చాయి.

సకల కళల సమాహారం సినిమా. పాశ్చాత్య దేశాల్లో ప్రముఖ రచయితల రచనలన్నీ సమాంతర సినిమాలుగా వస్తాయి. కానీ మనదేశంలో సినిమా పట్ల అది సాహిత్యంలోని భాగమే కాదన్నట్లు సాహిత్యకారులందరికీ నిర్లిప్తత, నిర్లక్ష్యం, చిన్నచూపు. మనవాళ్ళది ఫిల్మ్‌ ఇల్లిటరసీ. ఇలాంటి పరిస్థితుల్లో నా మొట్టమొదటి ఒకటి, రెండు సినిమా సమీక్షలు భూమికలోనే అచ్చయ్యాయి. భూమికకు ధన్యవాదాలు!!

నేనొక కెనడా సినిమా చూశాను. అందులో కథానాయికని చూసినప్పుడు నాకు సత్య గుర్తొచ్చింది. సినిమా పేరు ‘The screen”. కథానాయిక పేరు ”సుజానే”. ఆమె ”అత్యాచారానికి గురైనప్పుడు ఆపత్సమయంలో మిమ్మల్ని రక్షించడానికి ఏ మగాడూ రాడు. కనుక ఒక ఈల మీ దగ్గర ఉంచుకోండి. ఎక్కడైనా, ఎవడైనా మిమ్మల్ని ముట్టుకోబోతున్నాడని తెలిసినపుడు వెంటనే ఈల వేయండి. అది నిశ్శబ్దంలో ఆర్తనాదంలా ప్రతిధ్వనిస్తుంది” అని అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూ తన సహ మహిళా ఉద్యోగులకి ఒక ఉపాయం చెప్తుంది సుజానే. వాళ్ళందరి హోరెత్తించే ఈలల ధ్వనితో చిత్రం ముగుస్తుంది.

సత్య బ్రహ్మాండంగా ఈల వేస్తుంది. తన ఈలతో మనందర్నీ ఎప్పుడూ అటెన్షన్‌తో అలర్ట్‌గా ఉంచే సత్యకే కాదు, భూమిక బృందానికంతటికీ, పోషిస్తున్న పాఠకులకీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

శివాలక్ష్మి, హైదరాబాద్

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.