జండర్ స్పృహ ఇసుమంతైనా లేని మన సమాజంపై ఫోకస్ చేయబడిన ఒక శక్తివంతమైన టార్చిలైట్ స్త్రీవాద పత్రిక భూమిక. స్త్రీలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వ్యాసాలు, కథలు, కవితలు, కార్టూన్లు, ఎడిటోరియల్స్ రూపంలో మన కళ్ళకు కట్టినట్లు చూపుతోంది భూమిక. అంతేకాదు! వారి జీవితాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, తక్షణ ఉపశమనాల గురించి ప్రభుత్వ సంస్థలకు సూచించి అంతటితో ఊరుకోక వారి పనితీరులోని లోపాలను, అవినీతిని నిస్సంకోచంగా ఎండగడుతుంది.
స్త్రీ వాద పత్రిక అంటే ”కేవలం స్త్రీల గురించే రాస్తారు” అనుకొనే సంకుచిత జీవుల దురభిప్రాయాన్ని బద్దలు కొట్టి దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కష్టాలు, కడగండ్లు, వారి పోరాటాల గురించి, ఇంకా ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్లు, ఇంటిపని
వాళ్ళు లాంటి వివిధ సమూహాల గొంతుకను భూమిక పత్రికలో బలంగా వినిపించి, వారి పోరాటాలకు ప్రత్యక్ష మద్దతునిచ్చి వారితో నిరంతరం కలిసి నడవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను.
అంతేకాకుండా మంటగలుస్తున్న మానవ హక్కులకు ప్రతిరూపంగా నిల్చిన గౌరీలంకేష్ హత్య గురించి, రోహిత్ లాంటి దళిత మేధావి విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న విషాద రాజకీయాల గురించి, పర్యావరణ స్పృహను పాతరేస్తూ మల్టీ నేషనల్స్‌కు జాతి సంపదను దోచిపెట్టే ప్రభుత్వ అడ్డగోలు విధానాలను నిరసిస్తూ, నర్మదా, పోలవరం, కాకినాడ సెజ్ నిర్వాసితుల ఆక్రందనలను, వాకపల్లి మహిళల ప్రశ్నలు, నల్లమల చెంచుల దుస్థితి వరకు, కుటుంబ హింసతో మొదలుపెట్టి రాజ్య హింస వరకు ప్రతి ఒక్క అన్యాయాన్ని, ప్రతి ఒక్క దుర్మార్గాన్ని భూమిక పత్రికలో ధైర్యంగా ప్రచురించి సమాజం పట్ల తనకున్న నిబద్ధతను భూమిక చాటుకుంది. వారి ప్రశ్నలకు వేలగొంతుకలై నిలిచింది. అందుకోసమే మనం భూమికకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఈ తరం యువతను దృష్టిలో పెట్టుకుని వారికి గత కాలపు గొప్ప సాహిత్యం, ఉద్యమ చరిత్రలు తెలియచేసేందుకు తొలి తెలుగు రచయిత్రి భండారు అచ్చమాంబ జీవిత చరిత్ర, ‘మనం మరిచిన మన చరిత్ర’ లాంటి పుస్తకాల పరిచయం, రమణిక గుప్తా లాంటి డేరింగ్ ట్రేడ్ యూనియన్ ఉద్యమకారిణి ఉజ్వల అనుభవాలు ప్రచురిస్తున్నారు.
స్త్రీలు, పిల్లల సమస్యలపై కొత్తగా వచ్చిన చట్టాల గురించి, వాటి అమలులోని లోపాల గురించి, బాధిత స్త్రీలకు ఎక్కడెక్కడ ఎలాంటి సాయం అందుతుందో వాటి వివరాలు ఎప్పటికప్పుడు ప్రచురించి సమాచారం అందచేస్తున్నారు.
వర్తమాన యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో ప్రతి సంవత్సరం కథలు, కవితలు, వ్యాసాలలో పోటీ నిర్వహించి ఉత్తమ రచనలకు గాను బహుమతులు అందచేయటం నిజంగా ఎంతో గొప్ప విషయం. స్త్రీలలో కార్టూనిస్టులు, ఆర్టిస్టులు రావాల్సి ఉందని, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం సంతోషించదగ్గది.
పాఠకులకు తక్కువ ఖర్చుతో ప్రతినెలా సకాలంలో పత్రికను అందించబూనుకోవడం ఈ కాలంలో నిజంగా ఒక సాహసం. అత్యంత సాహసోపేతంగా ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్న సంపాదక బృందానికి నా ధన్యవాదాలు.
వివిద అస్థిత్వ వాదాలు, భావ సంఘర్షణల మధ్య బుద్ధిజీవులంతా తమలో తాము గ్రూపులుగా విడిపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా రచయితలనందరినీ కలుపుకుపోతూ, సంకుచితత్వానికి, స్వార్ధానికి తావీయక కేవలం మానవ ఔన్నత్యానికి, సంక్షేమానికి మాత్రమే దోహదం చేసే రచనలకు స్థానం కల్పించిన ఉత్తమ స్థాయి పత్రిక భూమిక అని నా అభిప్రాయం.
ప్రజాస్వామ్య వాదులందరికీ ఆశాజ్యోతిగా, హింసలేని సమాజం కోసం మనం వేసే అడుగులన్నింటినీ ఏకం చేసి, మనలో నిరంతరం ఉత్తేజాన్నిస్తూ, సమాజంలోని స్త్రీల పట్ల అమలవుతున్న వివిధ రకాల వివక్షలను అంతమొందించాలనే మనందరి ప్రయత్నాలకు ఒక ఆయుధంలా నిలబడలింది స్త్రీ వాద పత్రిక భూమిక.
జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న వివిధ పోరాటాల సమాచారాన్ని నిరంతరం తెలుగు పాఠకులందరికీ అందజేసేందుకు భూమికకు కొండంత అండగా నిలబడ్డ భూమిక ప్రధాన సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారికి వందనాలు. భూమికకు ప్రపంచ మాతృభాషా దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు.
– మీ ఆర్.శాంతిప్రియ, హైదరాబాద్