సాహితీవేత్త వ్యక్తిత్వ నిర్మాణ పునాదులపైనే తన రచనా శైలి రూపుదిద్దుకుంటుందని ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి ఏనాడో సెలవిచ్చారు.
కేవలం స్వీయ ప్రయోజనాల కోసం, కాలక్షేపం కోసం రాసే ‘చేయితిరిగిన’ రచయితలకు ఇది వర్తించకపోయినా, సామాజిక భద్రతను గుర్తెరిగే శ్రద్ధగల రచయిత/త్రిలకు, మాత్రం ఇది తప్పక వర్తిస్తుంది.
ఎందుకంటే వారు జీవితాలను చూసే తీరు వేరు. వాస్తవంగా పరిశీలించే తీరు వేరు, వాటినుండి నిజాలను నిగ్గుతీసే పద్ధతి వేరు. అసలు విషయాన్ని అవగాహన చేసుకునే తీరు వేరు, ఆలోచించే తీరు వేరు, అనుభూతి చెందుతూ ఆవిష్కరించే తీరు వేరు, అందుకు వారి వద్ద ఆశయ సంకల్పం, పట్టుదల మెండుగానే
ఉంటాయి.
‘ఆకాశమంత’ కథా సంపుటి రచయిత్రి డా||శమంతకమణి ఈ కోవలోకే వస్తారు. తన చుట్టుప్రక్కల పరుచుకున్న మధ్యతరగతి జీవితాన్ని ఒడిసి పట్టుకున్నారు.
అవకాశవాదంవైపు దిగజారిపోకుండా, పరిస్థితులకు రాజీపడకుండా అవసరమైతే ఒంటరిగానే ఎదురీదుతూ ప్రతిఘటిస్తూ
ఉంటాయి ఆ పాత్రలు. ఆ క్రమంలో తనని తాను నిలబెట్టుకుంటూ, కించిత్ దేశభక్తివైపు, ప్రగతిశీలత వైపు సాగుతాయి. రచయిత్రికి సంబంధించిన ఆ జీవ లక్షణం పుటం పుటం ప్రస్ఫుటం చేస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యతరగతి మహిళకు మనోధైర్యాన్ని ఇస్తాయి.
ఇక్కడే ప్రపంచ ప్రఖ్యాత రచయిత టాల్‌స్టాయ్ గుర్తుకు రాక మానడు. జీవితంలో లేని స్పష్టత కళ-సాహిత్యం చేయాలని అంటాడు.
దోపిడీ పాలకుల విధివిధానాలతో మధ్యతరగతి వర్గం నిత్యం ఎప్పటికప్పుడు భ్రమలకు లోనవుతూ ఉంటుంది. శ్రమను గుర్తించలేని గందరగోళంలో పడిపోతుంది. విలువలకంటే ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తుంది. భయంతో అజ్ఞానానికి మోకరిల్లుతుంది. పరిస్థితులు భిన్నమైనప్పుడు కోలుకోలేనంతగా కృంగిపోతుంది.
అటువంటప్పుడు జీవితంపై విశ్వాసం పెంచి, భుజం తట్టి ముందుకు నడిపించాల్సిన బాధ్యత కళాస్రష్టలపై
ఉంటుంది. రచయిత్రి శమంతకమణి అదే చేశారు, చేస్తున్నారు.
ఎక్కడా ఊగిసలాట ఉండదు. సూటిగా స్పష్టంగా కొట్టొచ్చినట్లు ఉంటుంది. ఆ విధంగా నడుచుకోవడం ఆచరణ యోగ్యమే కాదు ఆచరణ సాధ్యం కూడా అని ప్రక్కనే ఉంటూ చెప్తుంటారు. ముఖ్యంగా పాఠకులకు ఇవి సెల్ఫ్ కాన్ఫిడెంట్ (ఆత్మ ప్రభోద) కథలుగా చెప్పుకోవచ్చు.
సన్నివేశాలను, సంఘటనలను అలవోకగా అల్లుకోగలరు. ప్రతి అంశాన్ని కథగా మార్చగలరు. అందుకే కొన్ని ‘కాలమ్స్’గా
ఉంటాయి. అలా అని అంతర్గత భావనలు చెప్పకుండా మానరు.
”తొమ్మిదో తరగతిలో ఉండగా… ఈ వయసులో చలం రచన మ్యూజింగ్స్ చదువుతున్నావా? నీకేం అర్థ¸మవుతుందని అంటూ ప్రశ్నించిన సైన్స్ మాస్టారుకి, ‘చదివితేనే కదా అర్థమయ్యేది’ అన్న నా ఎదురు ప్రశ్న రుచించక క్లాస్ లీడర్‌గా తొలగిస్తే… నన్నెందుకు తొలగించారు? కావాలంటే ఓటింగ్ పెట్టండి’ అంటూ నిగ్గదీసే ధైర్యం నేర్పింది ఎవరు? దెబ్బతిన్న ఆత్మాభిమానమా? అన్యాయంగా తొలగిస్తున్నారన్న ఉక్రోషమా?”
ఇదీ ఆ రచనా శైలి ఒరవడి, వేగం. ఇక్కడ ఒక్క అనుభూతి మాత్రమే కాదు, ఓ ధిక్కారం, ఓ నాయకత్వం, ఓ ప్రజాస్వామ్యం… అన్నీ కలగలిపి కన్పిస్తాయి.
అలాగే ‘కష్టపడే వ్యసనానికి బానిసైపోయింది’ అని ‘అపరాజిత’ అంటుంది. చాలా కథల్లో కథానాయిక పేరు అపరాజిత. అంటే పరాజయం లేనిది. ఎదురీదే వారికి పరాజయం ఎక్కడ ఉంటుంది? ఎందుకుంటుంది? వారి గమనమే వారి విజయం. అదే ఆ తాత్విక దృఢత్వం, దృక్పథం.
తన జీవితమే తనను కథవైపు, రచనా వ్యాసంగం వైపు నడిపినట్లు రచయిత్రి చెప్పుకున్నారు. శోధన, సాధన లక్ష్యాలుగా సాగుతున్న జీవన యానంలో నాకెదురైన చిన్నపాటి అనుభవాలే నా కథాంశాలు అని కూడా తెలిపారు.
‘భారతీయ రైల్వే నా బతుకు మార్గం, ఆశయాల పందిరిలో సజ్జన సాంగత్యం, ప్రజా కళల నందనం, సాహితీ పూలవనం, నా స్వప్నం, నా గమ్యం’ అంటూ తెరచిన పుస్తకంలా తన భావ ప్రపంచాన్ని పాఠకలోకం ముందు పరిచారు.
దాదాపు 30 కథలతో, 200 పేజీలతో 2015లో విడుదలైన ఈ సంపుటి వెల రు.150. ప్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్, విజయవాడ.