ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: దాసరి అమరేంద్ర

ఇళాభట్‌

ఆయన పోయినపుడు మీరు పక్కనే ఉన్నారా?

అవును.

ఏమైనా జబ్బు పడ్డారా?

అదే విచిత్రం… ఏ జబ్బూ లేదు. ఆ మాట నాకెపుడూ విచారం కలిగిస్తూ ఉంటుంది. పోయేముందు ఒక్కసారైనా ఆయన అనారోగ్యానికి గురయి ఉంటే బావుండి ఉండేదనిపిస్తుంది. నా శరీరమూ, ఆరోగ్యాల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. విషయాలు చదివి తెలుసుకుంటూ ఉంటాను. కుఛ్‌ భీ హువా తో… ఏమి జరిగినా దాని గురించి చదువుతాను. మాట్లాడతాను. సలహాలు తీసుకొంటాను. మగవాళ్ళు అలా కాదనుకొంటాను. అతను ఏ విధమైన ఇబ్బందుల గురించీ ఎప్పుడూ ఏ మాటా అనేవాడు కాదు. ఆ రోజు ఉదయం వాకింగ్‌కు కూడా వెళ్ళాడు. తిరిగి వచ్చి స్నానం చేశాడు. ఇద్దరం మామూలుగా కలిసి కూర్చున్నాం. ఒక గ్లాసు పాలు తాగాడు. ఆ తర్వాత చాలా నింపాదిగా అన్నాడు ‘మేడ మీదకు వెళ్తున్నా. కాసేపు రెస్టు తీసుకుంటాను’ అని. ఎందుకా అని ఆశ్చర్యపడ్డాను. ఉదయం పూట, ఇప్పుడే కదా స్నానం చేసింది… ఈ రెస్ట్‌ ఏమిటీ! సరిగ్గా ఆ సమయానికే ఎనిమిది గంటల వేళ రోజూలానే స్టెనో వచ్చాడు. అతనితో ఓ అరగంట గడిపాను. ఆ తర్వాత అతడ్ని చూసొద్దామని పైకి వెళ్ళాను. నడిచేటపుడు ఊపిరి అందడం లేదన్న సంగతి అప్పుడు చెప్పాడు. వాకింగ్‌కు వెళ్ళినపుడు ఎక్కడో రోడ్డు పక్కన కాసేపు కూర్చుని లేచి మళ్ళీ నడవాల్సి వచ్చిందట. చూడండి… తిరిగి ఇంటికి వచ్చాకయినా ఆ సంగతి చెప్పవచ్చు కదా! కానీ చెప్పలేదు. ఎందుకని చెప్పలేదూ? ఏ నొప్పీ లేకపోవడం వల్లనా? లేకపోతే ఆ సాయంత్రం మిహిర్‌ ఏదో ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళవలసి ఉంది కదా అతడిని అనవసరంగా కంగారు పెట్టడమెందుకనా? సంగతి నాతో చెప్పగానే డాక్టర్ని పిలిచాను. వీఎస్‌ హాస్పిటల్లో చేర్పించాను. హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఓ పట్టాన ఒప్పుకోలేదు. కానీ మొహంలో బాగా వాపు కనిపించింది. ఐసీయూలో పెట్టారు. నేనూ అతనితోపాటే ఉన్నాను. ఆ సమయమంతా అతని పక్కనే ఉన్నాను. మర్నాటి ఉదయం స్పాంజి బాత్‌ ఇచ్చారు. ఏదో పెర్‌ఫ్యూమ్‌ ఇచ్చారు. దాంతో అక్కడి నర్సుతో ఏదో జోకులు కూడా వేశాడు. ‘టైమెంతయిందీ?’ అని నన్నడిగాడు. ‘పావు తక్కువ పన్నెండు’ అని చెప్పాను. నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. వెచ్చగా అనిపించింది. కానీ కాసేపటికే ప్రాణాలు వదిలేశాడు. మధ్యాహ్నమయ్యేసరికి వెళ్ళిపోయాడు. డాక్టర్లు గుండెల మీద నొక్కడమదీ చేశారు. అందర్‌ కుఛ్‌ భీ నహీ థా… లోపల ఇంకేం మిగల్లేదు. అప్పటికే ఆయన వెళ్ళిపోయారు.

వయసెంత?

ఎంత… అరవై రెండు. ఏనాడూ ఒంట్లో బాగోలేదనలేదు. హాస్పిటల్లో చేర్పించినపుడు మళ్ళీ ఇంటికి తిరిగి రాడన్న ఊహే లేదు. మర్నాటికల్లా తిరిగి వచ్చేస్తామననుకొన్నాను. వచ్చాక అతని సంరక్షణ శ్రద్ధగా చేద్దామనుకొన్నాను. అనుకోవడమే… అది ఒక బహానా గానే మిగిలింది. కళ్ళారా చూశాను. ఐసీయూ నుంచి స్పెషల్‌ రూమ్‌కి మార్చాక పక్కనే కూర్చుని ఎన్నో మాట్లాడదామనుకొన్నాను. దానికి సరిపడా సమయముంటుందనుకొన్నాను. కానీ, ఏక్‌దమ్‌ చలాగయా… క్షణాల్లో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక కూడా…

అప్పట్నుంచీ నాకు అపరాధ భావం. ఎంతో అపరాధ భావం. నేనెప్పుడూ అనుకునేదాన్ని. అతనికన్నా ముందుగా నేనే అనారోగ్యానికి గురయి ఉంటే ఇద్దరం అన్ని చెకప్‌లు చేయించుకునేవాళ్ళం. అన్ని జాగ్రత్తలూ చేయించుకునేవాళ్ళం. అతని ప్రాణాలు కాపాడగలిగి

ఉండేదాన్ని.

మెడికల్‌ చెకప్‌లు చేయించుకోవడం ఒక అలవాటుగా చేసుకోలేదా?

నేను ఏనాడూ జబ్బు పడలేదు. అతనూ అనారోగ్యానికి గురవలేదు. ఓ వయసు వచ్చాక ప్రతివాళ్ళూ క్రమం తప్పకుండా బీపీ, షుగర్‌ లాంటివి చెక్‌ చేయించుకుంటూ ఉంటారు కదా! మేం అలా చెయ్యలేదు. అతడ్ని ఓ మంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్ళలేదనే అపరాధ భావన నాలో గూడు కట్టుకుపోయింది. విచారం కలిగిస్తూ ఉంటుంది. అతనలా హఠాత్తుగా వెళ్ళిపోతాడన్న భావనే నాకెప్పుడూ కలగలేదు. ఎంత తెలివిమాలిన తనం! ఆ అపరాధ భావన నుంచి నా మనసెప్పుడూ బయట పడనేలేదు.

అవును ఈ అపరాధ భావన అనేది మహా పెద్ద భారం.

అతను 1993 ఆగస్టు 19న పోయాడు. దీపావళి వచ్చింది. దీపావళి రోజుల్లో ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. కానీ ఏం చెయ్యాలి? ఏం చేద్దామా అని ఆలోచించాను. మద్రాసుకు చెందిన ఆనందలక్ష్మి మీకు తెలుసు కదా! తను నాకు మంచి స్నేహితురాలు. ఖాట్మండులో ఒక యునిసెఫ్‌ కార్యక్రమానికి ఆరంభోపన్యాసం చెయ్యమనీ, దీపావళి అక్కడే గడపమనీ ఆహ్వానించింది ఆనందలక్ష్మి. బావుందనుకున్నాను, ఒప్పుకున్నాను. మా పిల్లల్ని దీపావళికి ఇంటి పట్టునే ఉండమని నేను ఖాట్మండు వెళ్ళాను . మూడోరోజుకల్లా మిహిర్‌, రీమాలిద్దరూ ఖాట్మండులో ప్రత్యక్షమయ్యారు (నవ్వు). వాళ్ళిద్దరి సంగతీ తెలుసు కదా… సరే అక్కడే ఆనందలక్ష్మి నాకు ‘లివింగ్‌, డైయింగ్‌’ అనే పుస్తకం ఇచ్చింది. డాక్టర్‌ మనూ కొఠారి, డాక్టర్‌ లోపాముద్రలు రాసిన పుస్తకం. వాళ్ళు బొంబాయికి చెందిన సుప్రసిద్ధ హార్ట్‌ స్పెషలిస్టులు.

వాళ్ళు అందులో ఏం చెప్పారంటే, మోటుగా చెప్పాలంటే ‘చావుకీ జబ్బుకీ నేరుగా సంబంధం లేదు. అవి వేర్వేరు. జబ్బు మరణ హేతువు కాదు. మరణం జబ్బు వల్ల రాదు’ అంటారు. ఏదేమైనా ఆ పుస్తకం నాకు చాలా ఉపశమనం కలిగించింది. నా అపరాధ భావనతో సమాధాన పడగలిగాను. ఆ పుస్తకం నాకు ఎంతో ఉపయోగపడింది. ఏది ఏమైనా అతను ఇక లేడు. అది వాస్తవం. అయినా మేమిద్దరం ఏ పనులకు, ధ్యేయాలకు అంకితమయ్యామో ఆయా కార్యాచరణలో నిమగ్నమై ఉన్నంతకాలం అతను నాతోనే ఉంటాడని తెలుసు. ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతు ‘అతను ఈ విషయంలో ఏమనేవాడో’ అని దీర్ఘంగా ఆలోచిస్తాను. దిశా నిర్దేశం జరిగిపోతుంది. మేమిద్దరమూ ఎంతో సన్నిహితంగా బ్రతికాం కదా… ఏయే విషయాల్లో అతను ఏమేం చెపుతాడో, లేదా మౌనంగా ఉండిపోతాడో నేను ఇప్పటికీ చెప్పగలను.

ఆయన వెళ్ళిపోయాక దీపావళి ఇక్కడ గడపడం ఇష్టం లేకపోయిందన్నారు కదా! ఆయన ఉన్న రోజుల్లో ఎలా గడిపేవారు?

దీపావళికి ఇంటి పట్టునే ఉంటూ ఉండేవాళ్ళం. బోలెడిన్న స్వీట్లు చేసుకునేవాళ్ళం (నవ్వు). నాకు రెండు కొత్త చీరలు తెచ్చేవాడు. తనకూ ఓ జత కొనుక్కునేవాడు. పిల్లలు ప్రమిదలతో హడావిడిగా ఉండేవారు. ఇంట్లో బాణాసంచా నిషిద్ధం. స్నేహితులు… పిల్లలకు కొత్త పుస్తకాలు… మా హౌసింగ్‌ సొసైటీకి ఆయన ఛైర్మన్‌. దీపావళికి మా కాలనీలో కొన్ని కొత్త సంప్రదాయాలు ఆరంభించాడు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రతి కొత్త సంవత్సరం నాడు సొసైటీ ప్రాంగణంలో సామూహిక ప్రార్ధన జరుగుతుంది. కాలనీవాసులంతా ఒక్కచోట చేరి ‘వైష్ణవ భజనతో…’ బృందగానం చేస్తారు. తెలుసుకదా… గాంధీజీకి ఇష్టమయిన పాట. చిన్న చిన్న ఉపన్యాసాలు, పరస్పర పలకరింపులు, శుభాకాంక్షలు… చిన్న ఫంక్షనే కానీ అన్ని కుటుంబాలూ, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలు ఒక్కచోట చేరి ‘నయా సాల్‌ ముబారక్‌’ చెప్పుకోవడం. ఎమర్జెన్సీ సమయంలో ఆయన చెప్పిన విషయాలు ముఖ్యమైనవి. 1969 మత కలహాల సందర్బంలో కూడా ఆయన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడిటర్‌ కదా! కాలనీ యువకులంతా రాత్రి ఆయన ఆఫీసు నుంచి తిరిగి వచ్చేదాకా ఎదురు చూసి ఆ వార్తలు వినేవారు. వాళ్ళకు ఏ ఇబ్బంది కలిగినా ఆయన సాయం కోసం ఆశించేవారు. కానీ ఆ కొత్త సంవత్సరం నాడు ఆయన లేరు. నేనూ ఇంట్లో ఉండాలనుకోలేదు.

ఇది మీ వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిన సంభాషణ. మనం ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడుకోలేదు. అది కష్టమని అర్థమవుతోంది. ఒకసారి ప్రజల మధ్య జీవించడం మొదలుపెట్టాక ప్రజా సంబంధిత కార్యక్రమాలకు జీవితాన్ని అంకితం చేశాక, వ్యక్తిగత జీవితం అనేది పక్కన పడిపోతుంది. ‘ఆ సంగతులు తర్వాత చూసుకోవచ్చులే’ అనుకుంటాం. నేను నీరాబెన్‌కు ‘ఈ సిద్ధాంతాలు నాకు వద్దు’ అని చెప్పాను. ఈ సిద్ధాంతాలు నాకు అవసరం లేదు (నవ్వు) నాకు ఇవన్నీ తెలుసు. ‘ఒక్క నిమిషం’ అంటూ మళ్ళీ ఆవిడ సిద్ధాంతాలలోకి వెళ్ళిపోయేది. ఈ రోజుల్లో ఒక ఇంట వివాహం చేసుకుందాం అనుకొంటున్నప్పుడు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నట్టూ! తేడా ఉంది. నేను అనేది ఏమిటంటే ఇప్పుడు మనం ఒక నూతన సామాజిక చరిత్రను ఒడిసి పట్టుకొంటున్నాం.

మీరు అప్పట్లో ఒక గ్రామంలో నెల రోజులు గడపడం గురించి ప్రస్తావించారు. కానీ మీకు ఆ సమయంలో ఏ అభద్రతా భావమూ, నిస్సహాయతా లేకపోవడం వల్ల అదంతా ఒక వింత నాటకంలా ఉంటుంది అనేశారు. ‘అది చేయగలను’ అని మీ తల్లిదండ్రులకు చేసి చూపించాలి అనుకొన్నానన్నారు. దాని గురించి ఇప్పటిదాకా ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. ఆ పేదరికపు నిస్సహాయతను స్వయంగా అనుభవించకపోవడమే ఎక్కడో దానికి కారణం అన్నారు. మీరు ఆ తేడాను గ్రహించడమన్నది చాలా ముఖ్యమయిన విషయం. పొదుపుగా, నిరాడంబరంగా జీవించడం వేరు. బీదగా, నిస్సహాయంగా జీవించడం వేరు. అదే సమయంలో మీ పెళ్ళి జరిగింది. కలిసి జీవితం ఆరంభించారు. ఇప్పుడు మీకున్న భద్రత వేరే కోవకు చెందిన భద్రత. కానీ మీరన్నట్లు కాలం మారింది. ఎంత మితంగా బతికితే అంత ఆనందం కలిగే కాలమది. అయినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంటి పనులను అందరూ కలిసి పంచుకొన్నప్పటికీ ఏదో ఒక సమయంలో ‘స్ట్రగులవుతున్నారు’ అన్న భావన మీకు కలిగే ఉంటుంది. మీ పెళ్ళికి ముందటి రోజుల్లో ఆయన కూడా గ్రహించే ఉంటారు. సూక్ష్మగ్రాహి కదా! మీరు ఎంతో సౌకర్యవంతమూ, భద్రత కలిగిన కుటుంబం నుంచి బయటకు వస్తున్నారన్న విషయం ఆయన గ్రహించే

ఉంటారు. అది మీ అంతట మీరు కావాలని తీసుకొన్న నిర్ణయం. అందుకు మీ ప్రేమే ప్రేరణ అయి ఉండాలి. ఎన్నో సర్దుబాట్లు అవసరమై ఉండాలి. వాటిల్ని ఆయన గ్రహించారన్న విషయం మీకు ఎలా తెలియవచ్చింది?

ఆ విషయాలు అంతకు ముందు నుంచీ చాలా కాలంనుంచీ తెలుసనుకొంటాను.

అది మీకెలా తెలిసింది? ఎలా బయటపడింది?

ఒక్కోసారి నాకు ఖరీదైన బహుమానాలు తెస్తూ ఉండేవాడు.

ఎలాంటివీ?

ఖరీదైనవీ అంటే ఉపయోగకరమైనవి అన్నమాట. ఓసారి ఏదో ట్రైనింగ్‌ కోసం పూనా వెళ్ళాడు. అక్కడ్నించి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వంటింటి పట్టకారు తెచ్చాడు. ఆ రోజుల్లో అది విశేషం. ఎవరింట్లోనూ స్టీలు వస్తువులు ఉండేవి కాదు. సౌకర్యం కలిగించే ఉపకరణాల విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవాడు. మాకో ప్రిస్టేజ్‌ కుక్కర్‌ ఉండేది. ఆ రోజుల్లో ఎవరింటా లేదు. ఎవరింట్లోనూ రిఫ్రిజిరేటర్‌ లేని రోజుల్లో మా ఇంట్లో ఉండేది.

మీ రోజువారీ జీవితం వీలయినంత సరళంగా ఉండేలా చేసేవారన్నమాట

అవును! సరళంగా, సౌకర్యవంతంగా. ఆయనకు కొత్త కొత్త ఉపకరణాలంటే ఇష్టం. ప్రతిసారీ నాకు వాటితో సంభ్రమం కలిగించేవాడు. ఓ ప్రెషర్‌ కుక్కర్‌, ఓ గ్యాస్‌ స్టవ్‌… బర్మాషెల్‌ గ్యాస్‌స్టవ్‌. మా అమ్మా వాళ్ళింట్లో కూడా లేదది. ఎవరింట్లోనూ లేదు, ఇరుగు పొరుగు దగ్గరా లేదు. నేను గ్యాసు మీద వండేదాన్ని. కానీ చాలా రోజులపాటు మా ఫోయ్‌ గ్యాస్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. గ్యాస్‌ మీద వండిన ఒంటికి మంచిది కాదనేది. బొగ్గుల కుంపటే బెస్టనేది. నేను ఒక ‘విలాసాన్ని’ అనుభవిస్తున్నానన్న భావన బహుశా ఆ వ్యతిరేకతకు కారణమేమో! కానీ కొన్ని రోజుల తర్వాత ఆవిడా గ్యాస్‌కు అలవాటు పడిపోయింది. అంతకు ముందున్న కుంపటిని అవతల పెట్టింది.

మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేయకపోయినా మీ ఇద్దరి మధ్యా మౌన ఘర్షణ ఆయన గమనించేవారా?

ఎవరూ… ఫోయ్‌తోనా? మౌన ఘర్షణ గమనించడమేమిటీ. అది చక్కగా బయటికే తెలిసిపోయేది. నా విషయంలో అనేకానేక చవకబారు పనులు చేసేదావిడ. అతను ఏదో పనిమీద విదేశాలకు వెళ్ళినప్పటి సంగతి. నేను నా గదిలో కూర్చొని పని చేసుకుంటూ ఉండేదాన్ని. పోస్టుమేన్‌ బెల్లు కొట్టేవాడు.

ఉత్తరాలున్నాయా అని అడిగి తీసుకునేది. అవన్నీ శుభ్రంగా ఓ మూల దాచిపెట్టేది. వస్తాయి వస్తాయని నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఏదో ఒక అంతర్జాతీయ ఎక్స్చేంజి కార్యక్రమంలో మూడు నెలలకోసం వెళ్ళాడతను. రెండు నెలలు గడిచినా ఒక్క ఉత్తరం ముక్కా అందలేదు. అతనితో పాటు అదే కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళను అడిగే ధైర్యం చేయలేదు. వాళ్ళెక్కడ అతగాడు ఈమెకు ఉత్తరమైనా రాయడం లేదనుకొని పోతారో అని భయం. కానీ అసలు సంగతి అది కాదు కదా! తిరిగి వచ్చాక ‘అసలు ఉత్తరాలే రాయలేదేంటి?’ అనడిగాను. చాలా రాశాను అని చెప్పాడు. ‘నాకవి అందలేదు’ అన్నాను. అతనికేదో తట్టి ఫోయ్‌ పడుకొనే మంచం పరుపు కింద చూశాడు. ఉత్తరాలన్నీ అక్కడున్నాయి (నవ్వు) చాలా బాధపడ్డాడు.

ఆ రోజుల్లో నేను గుజరాతీలో కథలు రాస్తూ ఉండేదాన్ని. ఒక్కోసారి వాటికి పారితోషికంగా మనియార్డర్లు వచ్చేవి. ఫోయ్‌ అవి తీసుకొనేది కాదు కానీ, పోస్ట్‌మేన్‌ను అడిగేది కిత్నాహై.. ఎంత? ఎక్కడ్నించీ అని. ఇరవయ్యనో, యాభై అనో సమాధానం చెప్పేవాడు. నాకు అసలు మనియార్డర్ల సంగతే తెలిసేది కాదు. రమేష్‌ వచ్చాక చెప్పేది ‘ఇవాళ ఎవరో ఆవిడకు డబ్బులు పంపారు’ అని. ఆ చెప్పే పద్ధతి ఏమంత ఆరోగ్యకరంగా ఉండేది కాదు, అతనికి నచ్చేది కాదు.

ఎంతో అరుదు కదూ…! ఆయనేమో తనవరకూ తాను ఎంతో మిత జీవితం గడిపే మనిషి. కానీ మీ సౌకర్యం కోసం ఎన్ని తేవాలో అన్నీ తేవడం, మీ రోజువారీ జీవితం సౌకర్యంగా సాగేలా చూడడం, పని వత్తిడి తగ్గేలా చూడడం. మీ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు కదూ. అది చాలా అమూల్యం!

మాకు ఇంటి పనులు చేసుకోవడమంటే ఇష్టమే. పిల్లలు చక్కగా సాయం చేసేవాళ్ళు. పనంతా ఆడుతూ పాడుతూ సాగేది. అది ఒక భారంగానూ, ఆ బరువు కింద నేను అణిగి పోతున్నట్లు నేను ఎప్పుడూ అనుకోలేదు. మా పుట్టింట్లో ఇలాంటి పనులు చెయ్యకుండా గడిపేశాను కాబట్టి ఇక్కడ నాకు చాలా కష్టమవుతుందని అతను అనుకొనేవాడు. అది నిజం కాదు. అప్పటికి నేనింకా చిన్నదాన్ని. ఒంటినిండా సత్తువ ఉన్నదాన్ని. పని నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నదాన్ని. ఫోయ్‌ దగ్గర ఇంటి పనులు నేర్చుకోవడానికి నేనెప్పుడూ ముందుండేదాన్ని. ఒక్కోసారి ఆవిడకన్నా చక్కగా చేసేదాన్ని. మా కుటుంబం కోసం ఏ పనైనా చాలా ఇష్టంగా చేసేదాని&. చాలాకాలం దాకా మాకు పని మనుషులంటూ లేరు. బహుశా అందుకే ప్రెషర్‌ కుక్కర్‌, గ్యాస్‌ స్టవ్‌ లాంటి ఆధునిక ఉపకరణాలు సమకూర్చాడు. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం స్త్రీల గురించి నన్నో పుస్తకం రాయమంది. అప్పుడే నేను మెక్సికోలో జరిగిన ఒక యూఎన్‌ కాన్ఫరెన్స్‌ నుంచి తిరిగి వచ్చాను. రాగానే ‘గుజరాతీ మహిళ’ అనే పుస్తకం రాయమన్నారు. ఉద్యోగం, ఇల్లు, పిల్లలు… ఇవి కాక మళ్ళీ ఈ పుస్తకం చాల కష్టం. ‘నువ్వా పుస్తకం పొద్దున్న పూట ఎందుకు రాయకూడదూ? ఉదయమయితే పిల్లలు స్కూల్లో

ఉంటారు, నేను కాలేజిలో ఉంటాను. నీకు తీరిక దొరుకుతుంది’ అన్నాడు. నేను ఆఫీసుకి పదకొండున్నరకు వెళ్ళేదాన్ని. ‘నీ టైమంతా వంట కోసం వాడెయ్యకు’ అన్నాడు. దాంతో పొద్దుటి పూటకోసం వంట మనిషిని పెట్టుకొన్నాం. పుస్తకం అయిపోయింది కానీ వంటావిడ మాత్రం మాతోనే చిరకాలం ఉండిపోయింది. ఆవిడకు డెబ్భై ఏళ్ళు వచ్చేదాకా ఉండిపోయింది. ఇప్పటికీ ప్రతి రాత్రీ పడుకోవడానికి వస్తుంది (నవ్వు).

అనవసరపు చిల్లర మల్లర పనుల్లో నేను సమయం గడపడం అతనికి ఇష్టముండేది కాదు. మా పిల్లల బట్టలకు నేను కొద్దిపాటి ఎంబ్రాయిడరీ పని చేస్తూ ఉండేదాన్ని. బట్టలు కూడ కుట్టేదాన్ని. కుట్టు పనిలో నాకు ప్రవేశముంది. వాళ్ళు స్కూలుకెళ్ళే వయసుదాకా బట్టలు కుడుతూ ఉండేదాన్ని. ఓసారి నేను ఎంబ్రాయిడరీ చెయ్యడం చూసి ‘షన్‌ కరో ఛో … ఏం చేస్తున్నావ్‌?” అని అడిగాడు. టేబుల్‌ క్లాత్‌కు ఎంబ్రాయిడరీ చేస్తున్నానని చెప్పాడు. ‘అరె… అది వదిలిపెట్టు. ఆ పని ఇంకెవరికన్నా ఇవ్వు’ అన్నాడు. ఆయన దృష్టిలో కుట్టు పని వరకూ పర్లేదు కానీ టేబుల్‌ క్లాత్‌కు ఎంబ్రాయిడరీ అంటే సమయం వృధా చేస్తున్నట్లే. నేనింక పఠనం మీద దృష్టి పెట్టాలని పట్టు పట్టేవాడు. మరి కొంతకాలం గడిచాక ‘నువ్వెప్పుడూ రాస్తూనే కనిపిస్తావు కానీ చదువుతూ కనిపించవు’ అన్నాడు. నిజమే! ఇప్పుడు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టి అప్పటి లోటును తీర్చుకోవాలనుకుంటున్నాను. బాగా చదవాలనుకుంటున్నాను.

ఆయన పుస్తకాలూ, అవీ మీతో పంచుకునేవారా?

ఊ… అడపా దడపా… గుజరాతీ ఎన్‌సైక్లోపీడియాలో ఆఫ్రికన్‌ విప్లవోద్యమాల గురించి ఒక పూర్తి విభాగమే రాశారాయన. చాలా ఆసక్తికరం.

మీరు ‘ఈ పుస్తకాలు చదవాలి’ అని ఆయన ఎప్పుడైనా చెబుతూ ఉండేవారా?

ఓ ఎస్‌. కానీ నేను అంత సులభంగా చదవనని ఆయనకు తెలుసు. ఎంత గట్టి సలహా అయినా ఆయన ఎంత మృదువుగా చెప్పేవారంటే ఒక్కోసారి అది నా తలకెక్కేదే కాదు. నేను ఈ విషయంలో సరిగ్గా వ్యతిరేకం. ఏవన్నా గట్టిగా చెప్పాలంటే శుభ్రంగా ఆ పని చేసేస్తాను. ఒక్కోసారి ఆయనకది కటువుగా కూడా ధ్వనించేది.

ఎలాంటి విషయాలు?

ఉదాహరణకు మా రైలు ప్రయాణాల సంగతే తీసుకుందాం. నా అలవాటు అలాంటప్పుడు అవరోధంగా పరిణమించేది. అలాంటి విషయాల్లో నేను చాలా వేగంగా నిర్ణయాలు తీసేసుకుంటూ

ఉంటాను. చిన్న చిన్న వివరాలు కూడా నేను మహా వేగంగా ప్లాన్‌ చేసేస్తాను. ఆయన తరపున కూడా నేనే నిర్ణయాలు తీసేసుకునేదాన్ని. అతను చిరాకు పడేవాడు. రైలు ప్రయాణాల్లో ఎప్పుడు ఏం తినాలో నిర్ణయించుకోవడం అతనికి ఇష్టం. అది కాఫీ, టీ కానివ్వండి, స్నాక్స్‌ కానివ్వండి, ఎప్పడు డబ్బాలు తెరవాలి…అలాంటి విషయాలు. నేనేమో గొప్ప నాయకురాలి లాగా, ఓ గట్టి మేనేజర్‌ లాగా ఆన్ని సంప్రదించకుండా ఆయా నిర్ణయాలు నేనే తీసేసుకునేదాన్ని. ఇంట్లో అయితే అన్నీ అమర్చి పెట్టి

ఉంటాయి కాబట్టి ఘర్షణకు తావులేదు. బయటకు వెళ్ళినపుడు… అందులోనూ విద్యార్థి దశ దాటాక మేము పెద్దగా కలిసి ప్రయాణాలు చేసింది లేదు. ఆ సర్దుబాటు లేదు. అంచేత టెన్షన్‌. కనీసం అవతలి మనిషి ఏం తింటారో, ఎప్పుడు తింటాడో కనుక్కోవద్దూ (నవ్వు).

ఇళా బెన్‌, మిమ్మల్ని ఆ రోజుల్లో బాగా అసంతృప్తికి గురి చేసిన విషయం ఏమైనా ఉందా?

తన దుఃఖాల, విచారాలను తను నాతో పంచుకునేవాడు కాదు. చాలా అరుదుగా ఆ విషయాలు మాట్లాడేవాడు. ఆయన ప్రజా జీవితంలోకి వెళ్ళాక ఎన్నో వత్తిళ్ళు తన యజమానులతోనో, సహచరులతోనో, ఆయా రంగాల నిష్ణాతులతోనో… ఎన్నో సిద్ధాంతపరమైన విభేదాలు. ఆయన యూనివర్శిటీ సెనేట్‌లో ఉన్న రోజుల్లో నాతో ఎన్నో విషయాలు పంచుకునేవారు. కానీ ఆ తర్వాత నాకే తీరిక లేకుండా పోయింది. అయినా తర్వాత్తర్వాత… పిల్లలు వెళ్ళిపోయాక మేమిద్దరమే మిగిలాం కదా! నేను ఏమన్నా అడగాలన్నా ఏ సంకోచమూ లేకుండా అడిగేదాన్ని. పూర్తిగా వివరించమనేదాన్ని. కానీ ఆయనకు ఏం కావాలో, ఆయన ఆందోళనలు ఏమిటో అడిగి తెలుసుకునేంత సూక్ష్మత నాలో లేదనుకొంటాను.

బహుశా ఆయన కొంచెం బిడియస్థుడేమో! మగాళ్ళు సామాన్యంగా బిగిసిపోయి ఉంటారు.

అతని మనస్తత్వం నాకు తెలియదని కాదు. నేను కొంచెం మాట్లాడిస్తే ఆయన బయటపడుతూ ఉండేవాడు. విషయాలు నాతో పంచుకోవడానికి కాస్తంత సమయం తీసుకొనేవాడు. ఏ విషయాన్నయినా నలుపు, తెలుపుల్లో చూడ్డం కానీ, దాని గురించి వెంట వెంటనే మాట్లాడడం కానీ ఆయనకు అలవాటు లేని విషయం. తన వ్యక్తిగత అవసరాలను వాయిదా వేసుకుంటూ పోవడమే అతనికి అలవాటు. చాలా చెడ్డ అలవాటు. అవతలి వాళ్ళకు మాత్రం అన్నీ చక్కగా అమర్చాలని ఆశించేవాడు. ముందుగా పిల్లలు, ఆ తర్వాత మిగిలినవాళ్ళు. ఆమకు చిన్న వయసులోనే పెళ్ళయింది. చిన్న వయసులోనే పిల్లలు పుట్టారు. ‘ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది’ అన్నది అతని అభిమాన స్లోగన్‌. నాకు సంగీతమంటే ఇష్టం. ‘నేను సంగీతం నేర్చుకొంటాను’ అనేదాన్ని. ‘ప్రతిదానికీ సరైన సమయమంటూ ఉంటుంది’ అనేవాడు. నేను నా పనుల్లో తీరిక లేకుండా నిమగ్నమై ఉన్నానని తనకు తెలుసు. అలా అంటానే కానీ నేను సంగీతం క్లాసులో చేరననీ, చేరినా క్రమంగా వెళ్ళననీ అతనికి తెలుసు. సంగీతం నా జీవితంలోకి రావడానికి చాలా చాలా కాలం నిరీక్షించింది. ‘సేవ’ జనరల్‌ సెక్రటరీ పదవీ విరమణ చేసిన రోజునే నేను నా ఇంటి దగ్గర సంగీతం క్లాసుల్లో చేరాను. ఆయన ప్రతిసారీ ‘ప్రతిదానికీ సరైన సమయమంటూ ఉంటుంది’ అనడం గుర్తొచ్చింది. నేను పాడుకోవడానికి ఇదేనన్నమాట సరైన సమయం. సమయం వచ్చింది కానీ ఆయన మాత్రం లేడు. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. మొట్టమొదటి సారిగా ఓ అధికారి ఉత్సవంలో, రాష్ట్రపతి భవనంలో నాతోపాటు పాల్గొన్నాడు. నేను పద్మభూషణ్‌ అందుకొంటున్నప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఓ పది మందీ ఉండే సమావేశంలో పాల్గొనడం అదే చివరిసారి.

మీకు మెగసెసే అవార్డు వచ్చినప్పుడు ఆయన సంతోషపడ్డారా?

చాలా సంతోషపడ్డాడు. నిజానికి ముఝేతో పతాహీ నహీ థా. నాకా అవార్డేమిటో తెలియనే తెలియదు. ఆ రోజంతా ఆఫీసులో ఉన్నాను. ఏదో లంచ్‌ మీటింగుకు వెళ్ళవలసి ఉంది. దానికోసం ఆఫీసు నుంచి బయటపుడుతోంటే ఎవరో పిలిచారు. ఇళాబెన్‌, మీకు ఫోన్‌ అన్నారు. మైనే ఫోన్‌ లియా… ఫోన్‌ను అందుకున్నాను. రమేష్‌ ఫోనది. ‘రేడియోలో నీకు మెగసెసే అవార్డు వచ్చిందని చెప్పారు. చాలా బావుంది. కంగ్రాచ్యులేషన్స్‌’ అన్నాడు. కానీ నాకు అప్పటికీ అదేమిటో తెలియదు. అంచేత అతను వివరించి చెప్పాడు. సెప్టెంబర్లో మనీలా వెళ్ళి అవార్డు తీసుకోవాలని చెప్పాడు. నేను గబగబా రెస్టారెంట్లో ఎదురుచూస్తోన్న అతిధుల దగ్గరకు చేరుకున్నాను. భోజనం మొదలుపెట్టగానే, ఆ రెస్టారెంట్‌లోకి పాత్రికేయులు ఫోన్లు చేయడమూ, చుట్టుముట్టడమూ జరిగింది.

మేము ఎంత సన్నిహితంగా ఉన్నా కలిసి నిర్వహించిన కార్యక్రమాలు అతి కొద్ది మాత్రమే. ఒకసారి రియో నగరంలో ‘ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంక్‌’ సమావేశాల సందర్బంగా కలసి వెళ్ళాం. డిన్నర్‌ ముగిసాక మమ్మల్ని పాడమన్నారు. కలిసి పాడాం. ఆ పాట కలిసి పాడేదాకా అతనికి కూడా ‘అంతరో మొమో బిక సితో కరో’ అన్న టాగోర్‌ పాట ఇష్టమని తెలియలేదు. నేను రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేషన్‌లో

ఉన్నప్పుడు ట్రస్టీగా ఉండడం నాకది రెండోసారి. బోర్డు మెంబర్లం తరచూ ఇటలీలోని బెల్లాగియోలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. లేక్‌ పక్కన ఉంది. రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేషన్‌ వాళ్ళ కాన్ఫరెన్స్‌ సెంటర్‌. చాలా సుందరమైన ప్రదేశం. ప్రతి వేసవిలోనూ ట్రస్ట్‌ మెంబర్లను సహచరులతో సహా ఆహ్వానించేవారు. ఆసారి మొట్టమొదటిసారిగా తను కూడా నాతో రావాలనుకొన్నాడు. మరో రోజు అదనంగా ఉండి అక్కడి ప్రదేశాలూ అవీ చూద్దామనే అనుకున్నాం. అలా కలిసి ప్రదేశాలు చూడాలనుకోవడం మాకు అదే మొదటిసారి కానీ ఆ మీటింగుకు నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది… ఆ సెప్టెంబరు కల్లా ఆయన వెళ్ళిపోయాడు (చనిపోయాడు).

ఇలాంటిది తలచుకుంటే బాధగా ఉంటుంది. అయ్యో! ఆ పని చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

ఆయన పోయాక కొద్ది రోజుల పాటు ఇంటికి వచ్చే సంతాపకులను కలుసుకోవడం కోసం నేను ఇంటిపట్టునే ఉండిపోయాను. నా తదుపరి జీవితానికి ఆ ఘట్టం ఎంతో ముఖ్యమైనది అనుకొంటాను. ఆయన తన జీవితపు మలి దశలో చేసిన అనేకానేక కార్యక్రమాల గురించి నాకంతగా తెలియదని బోధపడింది. కలవడానికి వచ్చిన స్నేహితులు, విద్యార్థులు, ఇతర వ్యక్తుల ద్వారా ఆ విషయాలు తెలిశాయి. ఒకోసారి ‘సేవ’ను చూస్తుంటే అది మరణ బిందువు అనిపిస్తుంది. అది నిన్ను నిలువునా చంపి వదులుతుంది. నీ దగ్గరి వాళ్ళకోసం కూడా నీకు సమయం లేకుండా చేసేస్తుంది. అదృష్టవశాత్తు మా పిల్లలు బాగా చిన్న వయసులోనే పుట్టేశారు. వాళ్ళకోసం బాగా సమయం వెచ్చించగలిగాను. ఈనాడు జరుగుతున్నట్లుగా అప్పట్లో కూడా నేను ‘సేవ’ కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండి ఉండిన పక్షంలో పిల్లలు బాగా ఇబ్బంది పడిపోయేవారు. ఈ ‘సేవ’ పని ఉంది చూశారూ… అది దగ్గరివాళ్ళను కూడా దూరం చేసేస్తుంది. మనల్ని నిలువునా ముంచెత్తి వేస్తుంది. ఇప్పుడు నా సహోద్యోగుల్ని చూస్తున్నా కదా… అదే జరుగుతోంది. చూస్తే జాలి వేస్తుంది. నాతో పోలిస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరిగాయి. ‘సేవ’ పని వాళ్ళని ఎంత నరకయాతనకి గురి చేస్తోందో నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళేమో మహా సంతోషంగా తమను తాము ఆమరణ వేదనకు గురి చేసుకొంటున్నారు. పిల్లల ఇబ్బందులు, భర్తల సమస్య… నేను ఎన్నో విధాలుగా అదృష్టవంతురాలిని. అయినా, జీవితంలో ఎంతో కొంత కోల్పోయాను.

అదో వ్యసనమయిపోతుంది.

ఒక రకంగా వ్యసనం మరో రకంగా సుఖం. చెడు అర్థంలో కాదు కానీ, గీతలో చెప్పినట్లుగా ఇది స్వధర్మం. స్వధర్మ్‌ సె చాలిత్‌ నహీ హోతే. నీవు సహజంగా చేసుకుంటూ వెళ్ళే పని నీ స్వధర్మంగా పరిణమిస్తుంది. అది నీ ‘ప్రకృతి’ అయిపోతుంది. ‘నీకు లభించేది నీ కర్మఫలం. కర్మను నువ్వు వెంటాడకూడదు’. ఉదాహరణకు ‘సేవ’ బ్యాంకు సంగతే తీసుకుందాం. నా వరకూ నేను ఏనాడూ ఓ బ్యాంకు వెనక వెళ్ళి ఉండేదాన్ని కాదు. ఓ బ్యాంకు స్థాపించేదాన్నే కాదు. కానీ కొంతమంది మహిళలు ‘బెన్‌, మన బ్యాంకు మనమే ఎందుకు స్థాపించుకోకూడదూ’ అన్నారు. అది మేమో స్వధర్మంగా చేశాం. వాళ్ళకు వడ్డీల వాళ్ళ దోపిడీ ఉండేది. తమ స్వంత బ్యాంకు ఎంతైనా అవసరం. పెద్ద పెద్ద చెక్కులు రాయడం, పెద్ద మొత్తాల్లో డబ్బును నిభాయించడం నాకు కష్టమైన పని. ఒక మంచి బ్రాహ్మణిగా నేను ఇతరుల ధనాన్ని ముట్టుకోకూడదు. అయినా వేలాది బీద మహిళల లక్షలాది రూపాయల్ని నేను నిభాయించాను. మొదట్లో అది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ధర్మా బన్‌గయా – ధర్మంగా పరిణమించింది. ఆ పని నా దగ్గరకు అలా వచ్చింది. నేను నిలకడగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించే మనిషిని కాదు. కానీ ఆయన నాలోని ధైర్యాన్ని మెచ్చుకొనేవాడు. ‘ఇది ప్రత్యామ్నాయ పద్ధతులను నిర్మించే గాంధీ మార్గం. జాతి నిర్మాణ ప్రక్రియ’ అన్నాడు. చాలాసార్లు అతను ఏం చేద్దామనుకొంటాడో మేము అదే చేస్తూ ఉండేవాళ్ళం. ఈ లక్షణం నేను చాలామంది మగవాళ్ళలో చూశాను. ‘సేవ’ కుటుంబాల వాళ్ళు… వాళ్ళు అంబాలా నుంచి కానివ్వండి, బీహార్‌, అసామ్‌పూర్‌ నుంచి కానివ్వండి, ఆ యువకులందరికీ తమ తమ భార్యలు చేస్తోంది అర్థవంతమైన మంచి పని అని నమ్మకం. రమేష్‌ చేసిన ఓ ముఖ్యమైన పని ఏమిటంటే ‘సేవ’ బ్యాంకు ఉద్దేశ్యాలను ఆబ్జెక్టివ్స్‌, రూపకల్పనలో నాకు సాయం చెయ్యడం. అది సమగ్రంగా, పరిపూర్ణంగా వచ్చింది. దిశానిర్దేశం చేస్తూ, పేద ప్రజల స్వయం నిర్ణయాధికారం ఎలా ఉండాలో స్పష్టంగా వివరిస్త చాలా చక్కగా వచ్చిన డాక్యుమెంట్‌ అది.

ఏ యే సమస్యలు వచ్చే అవకాశముందని ఆయన ముందే అంచనా వేశారు?

మూడు దశాబ్దాల ముందే ఆయన బుద్ధిజీవుల ఎత్తుగడల గురించి ఒక ఆర్టికల్‌ రాశారు. పెట్టుబడుల ప్రవాహాలు, టెక్నాలజీలో మార్పులు, త్వరితగతిలో వస్తోన్న ఇతరేతర మార్పులు, వాటి వెన ఉండే విదేశీ భక్తులు, వాటివల్ల బీదలకు కలిగే బాధలు, కష్టాలు… ఇవన్నీ ఆయన ఆనాడే స్పష్టంగా చూడగలిగారు. వీటి గురించి ఆయన అంతకు ముందునుంచీ రాస్తూనే ఉన్నారు. తన ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోమని ఆయన సూచించినా నేను ఆ పని చెయ్యలేదు. కానీ పేద ప్రజల కోసం ప్రత్యామ్నాయ శక్తిగా, ఓ ఆర్థిక సంస్థను స్థాపించడంలోనూ ఉపయోగకరమైన అంశాలను నేను గ్రహించగలిగాను. ఆధునిక ఆర్థిక సంస్థలకు ధీటుగా ఆస్తిపాస్తులు లేని పేద ప్రజల సేవ వీటి లక్ష్యం కానేకాదు. ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను మార్కెట్‌లో ప్రతిభావంతంగా నిలబెట్టడంలోని ఆవశ్యకతనున గ్రహించాను. అంతకు ముందు నేను చెబుతూ ఉండేదాన్ని. ”మనం, పేద ప్రజలు, ఒక గణనీయమైన పరిణామానికి చేరుకోవాలి. అప్పుడే మనం నిలబడి మనుగడ సాగించగలం. మన ఉనికిని పదిమందికీ తెలియపరచగలం. అలా ఎదగాలంటే ప్రభుత్వం వారితో కలిసి మెలిసి పని చేయడం అవసరం” అని. అంతా చేసి ”సేవ” అన్నది నిజానికి ఓ కార్మిక సంఘం. ఓ వంద సహకార సంస్థల సంఘటిత సంస్థ. వాళ్ళ శక్తియుక్తుల సంగతి ఎలా ఉన్నా ‘సేవ’ మహిళలు విపణ వీథిలో నిలబడి తీరాలి. గ్రాంటుల మీదే ఆధారపడలేం. అలా అని మన స్వంత నిధులమీదునే నిలబడలేం, అవి ఏ మాత్రం సరిపోవు. ఆ పద్ధతి సంస్థను కొంత దూరం వరకే నడిపించగలదు. ఆ తర్వాత ‘సేవ’కు చెందిన పేద మహిళలకు సమాన స్థాయిలో చేయూతనిచ్చి నిధులు సమకూర్చి లాభనష్టాలు పంచుకొనే వాళ్ళు కావాలి. మరి ఇలాంటి వాటికి గవర్నమెంటును మించిన భాగస్వాములెవరున్నారు. ఓ ప్రజాస్వామ్య దేశంలో మనమంతా ఎన్నుకొన్న ప్రభుత్వమే ఇందుకు అన్ని విధాలా సరైనది. అంచేత గవర్నమెంట్‌ నిధులు తీసుకొని, పేదల సాధికారతను సాధించి, ఏనాటికయినా వాళ్ళు తమ కాళ్ళమీద తాము నిలబడేలా చేయడానికి నేను ఏనాడూ వెనుకాడలేదు. మేం కలసికట్టుగా ఉన్నాం కాబట్టి, సంఖ్యా బలం ఉంది కాబట్టి అలా చెయ్యగలం. అవసరమయితే వాళ్ళ ప్రణాళికలనూ మార్చగలం.

మేము ఎన్నికల రాజకీయాల్లో లేము కాబట్టి మా పద్ధతి చాలాకాలం పనిచేసింది. స్థానిక స్థాయిలో మేము వాళ్ళకేమీ చికాకులు కలిగించలేదు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలతో పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి సమస్యలూ రావని నేను అనుకొనేదాన్ని. కానీ నా ఆలోచన పూర్తిగా తప్పని ఋజువయింది. అక్కడికీ ఆయన తరచూ హెచ్చరిస్తూనే

వచ్చాడు. మేం పెరిగి పెద్దయ్యేసరికి ప్రభుత్వం మా ఉనికిని సహించలేని స్థితికి వచ్చింది. ఒక విషమ సమస్యలోంచి మరో విషమ సమస్యలోకి వెళ్ళాం, అయినా బతికి బట్టకట్టగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం ‘సేవ’తో తలబడినపుడు మేం అనుసరించిన సత్యాగ్రహ మార్గం విషయంలో అతని భావన ఏమిటో తెలుసుకోగలిగితే బాగుండును అనిపించింది. రాజకీయ నాయకులకు మా సంఖ్యా బలం కావాలి. అధికార గణానికి మా నిధులు కావాలి. ఆ రెండు వర్గాలూ మమ్మల్ని నియంత్రించాలనే చూశాయి. జబ్‌ తక్‌ ప్రాజెక్ట్‌ కె రూప్‌ మే రహో, ఠీక్‌ హై… నీ పనులు ప్రాజెక్టుల రూపంలో ఉన్నంతవరకూ పర్లేదు. నీ పరిధిలో నువ్వు ఉన్నట్లే లెక్క, ఇబ్బంది లేదు. అలా కాకుండా బడుగు వర్గాల ప్రాజెక్టుల పరిధి దాటుకొని బ్యాంకింగ్‌ వ్యవస్థలోనో, వస్తు విపణిలోనో, సేవా విపణిలోనో ఒక శక్తిగా మారి ఒక ప్రధాన మార్గపు వ్యవస్థగా మారినపుడు రాజకీయ అధికార గణాలు మెచ్చవు, సహించవు. ఇది సామాజిక క్రీడా క్రమంలో ఒక భాగం. అది మనం అర్ధం చేసుకోవాలి. ఈ మా ధోరణి గురించి అతను ఏమనేవాడో తెలుసుకోవాలని అనిపిస్తోంది.

ఇవన్నీ ఆయన ఆలోచనలూ, నమ్మకాలూ అనుకోవడంలోనూ, వాటిని మీరు ఆచరణలో పెడుతున్నారనుకోవడంలోనూ ఎంతో సంతృప్తి ఉండేదేమో కదూ…!

అవును. అందుకే అతను లేకపోవడం గురించి నేను ఎక్కువగా బాధపడను. మీరు నమ్మకపోవచ్చు… అతను లేని లోటు నాకు ఎక్కువగా కనిపించదు. మొదట్లో నిజమే మిస్సయ్యేదాన్ని. అవి అప్పటి గరుకు పాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అతను లేడన్న విషయం మరచిపోగలుగుతున్నాను. విచిత్రమేమిటంటే నేను ఇప్పటికీ అతని వారఫలాలు దినపత్రికల్లో చూస్తూనే ఉంటాను. మెడికల్‌ రిపోర్టులు చూస్తూనే ఉంటాను. అతని ఫైళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటాను. అతనింకా ఇక్కడే ఉన్నట్టూ… వెళ్ళిపోనట్టే…

కానీ మా పిల్లలు, మనవలు, మనవరాళ్ళకు ఏదైనా శుభం జరిగినపుడు ఆయన గుర్తొస్తారు, మిస్సవుతాను. ఆయన ఆ సమయంలో నాతో ఉండి ఉంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. గడ్డు సమయాల్లో మాత్రం ఆయన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను.

అంటే ఆ కష్టాలు పంచుకోవడం… ఆ విషయంలోనా?

కాదు. ఏ సమస్య అయినా, ఏ విషయంలోనయినా, నీకు దారి చూపేవాళ్ళు కావలసి వచ్చినపుడు కలిసి ఆలోచించడానికి, పరిష్కారం కనిపెట్టడానికి… (సుదీర్ఘ మౌనం)

మరొక విషయం మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. మీ కాలేజి రోజుల గురించి చెప్పండి.

ఊ… ప్రణయ పరిభాషకు చెందిన ఆకర్షణకు గురయ్యాను. అతనొక కవి, తెలివైన మనిషి, పొడుగాటి మనిషి, చక్కని ఛాయ, సొగసైన మనిషి. కాలేజీలో మొదటి సంవత్సరపు చివరి రోజుల్లో మొదలయింది. కాలేజి ఉత్సవాల్లో కలిసి పాల్గొనే అవకాశాలు చాలా వచ్చాయి. అతడిని ఓ వక్తగా, నాయకునిగా గుర్తెరిగాను. మా కాలేజి చాలా దూరాన ఉండేది. అతని ఇల్లు, మా ఇల్లు ఒకే వైపున ఒకే దారిలో ఉండేవి. నేను కాలేజి నుంచి ఇంటికి సైకిల్‌ మీద తిరిగి వస్తున్నప్పుడు యధాలాపంగా వచ్చినట్లు అతను వచ్చి కలిసేవాడు. అలా మొదలెట్టి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళడం సాగించాం. మెల్లగా మరి కాస్త సుదీర్ఘపు దారుల్లో సైకిలు యాత్రలు సాగించాం. ఏకాంతంగా ఉండే దారుల్లో సాగేవి మా యాత్రలు. నేనో చిలిపి పని చేస్తున్నానని నాకు తెలుసు. సమాజంగానీ, మా అమ్మా నాన్న కానీ ఆ పనిని హర్షించరని తెలుసు.

మీ అమ్మా వాళ్ళకు ఎప్పుడు తెలిసిందీ?

ఎవరో చెప్పి ఉండాలి. తెలుసు కదా… అమ్మలకు నాలుగేసి కళ్ళుంటాయి. మేం కలిసి తిరుగుతున్నామన్న సంగతి తెలిసిపోయింది. అంటే ఏదో చెడు అర్థంలో కాదనుకోండి.

ఆ రోజుల్లో సైకిళ్ళ మీద కలిసి వెళ్ళడం, రోడ్ల మీద కలిసి నడవడం… అంతా విస్తుపోయే విషయాలు కదా! మరి ఏం జరిగిందీ? మీ తల్లిదండ్రుల మొట్ట మొదటి స్పందన ఏమిటీ?

‘ఇందుకేనా నిన్ను కాలేజికి పంపుతోందీ’ అన్నారు (నవ్వు). మా ఫోయ్‌… నాన్న వాళ్ళ అక్కయ్య, మాతో కలిసి ఉంటోన్న వితంతు అక్కగారు అందుకొని ‘నేనప్పటికే చెప్పాను ఆడపిల్లల్ని చదివించవద్దని. కాలేజీలకు వెళితే అక్కడ మగ పిల్లలతో కలిసి ఉంటారు. ఖచ్చితంగా అదే జరిగింది. మా అమ్మాయి మహా బుద్దిమంతురాలు అనుకొన్నావు. అసలు అమ్మా నాన్నల గురించైనా ఆలోచించకుండా ఇంత పని ఎలా చేస్తోందీ?’ అందావిడ. అలాంటి స్తోత్రాలు విన్న కాసేపటికి మనమూ నమ్మేస్తాం. ఏదో కాని పని చేసామన్న అపరాధ భావన, తీవ్ర అపరాధ భావన కలుగుతుంది. అప్పుడప్పుడు మన తల్లిదండ్రులే మనల్ని అలాంటి భావనకు గురి చేస్తారు. కొంతకాలంపాటు మేము…

మీ అమ్మా వాళ్ళకు మరి మీరు ఏమి చెప్పారు?

వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేకపోయాను. మాటా పలుకూ లేకుండా ఉండిపోవడమో లేదా శోక గీతమో… వాదనలంటూ లేవు. వాదించలేం కదా, ఒప్పించలేం కదా, ఒప్పించే వాక్పటిమ లేదు కదా, మాటలు దొరకవు కదా. నువ్వేదో ఘోర అపరాధం చేశానని నువ్వే నమ్మేలా చేస్తారు. కానీ మాది ప్రేమ శక్తి అనండి, యువ ఆకర్షణ అనండి.పేరు ఏదైనా దానికున్న బలం పుణ్యమా అని నాలాంటి వాళ్ళూ దైర్యం పుంజుకొంటారు. కాలేజిలో ఇతర అబ్బాయిలు, అమ్మాయిల ప్రోత్సాహం, జాలరివాడల్లో జనాభా లెక్కల పని… నేను ఆనాటి సాంఘిక వాతావరణానికి పెద్ద పీట వేస్తాను. అహ్మదాబాద్‌లో కన్నా సూరత్‌ ఈ విషయాల్లో మరికాస్త ముందుండేది. సూరత్‌లో కొంగులతో తల కప్పుకోవడం ఉండదు. మా తల్లిదండ్రుల సంగతి సరేసరి. కానీ ఇలాంటి విషయాల్లో సగటు తల్లిదండ్రులు తీసుకువచ్చే మానసిక ఒత్తిడి భరించడం చాలా కష్టం. ఔర్‌ పేరెంట్స్‌ కా పవర్‌ తో కిత్నా హోతా హై…తల్లిదండ్రుల శక్తి మహా గొప్పది కదా… చాలా కష్టం, చెప్పా కదా. ఏడేళ్ళు ఆగాను, వాళ్ళ అంగీకారం కోసం ఏడేళ్ళు ఆగాను.

ఏడేళ్ళు- చాలా ఎక్కువ సమయం కదూ!

మీకో కథ చెపుతాను. ఆ రోజుల్లో రమేష్‌ నైట్‌ షిఫ్టుల్లో ఓ పత్రిక ఆఫీసులో పని చేస్తున్నాడు. ఏదో దిగువ స్థాయి ఉద్యోగం, అతనేదో రాయడమో సరిదిద్దడమో. ఎడిటర్‌ గారు గమనించి ఉంటారు, ఇతగాడికి రాసే శక్తి ఉందని గ్రహించారు. దాంతో అతనికి సరితూగే పని అప్పచెప్పాడు. అదో గుజరాతీ దినపత్రిక. ఈయన్ని వారం వారం ఓ కాలమ్‌ రాయమన్నారు. ఒకసారి మా కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. మా ఇలాకా మహిళలంతా కలిసి… అందులో మా అమ్మా ఉంది. ఆ ఇంటి తాళాలు తెరిచారు. ఆ ఇంటి యజమాని బొంబాయి వెళ్ళాడప్పుడు. మా అమ్మకు శక్తి, ధైర్యం ఎక్కువ. ఆ ఇల్లంతా దొంగ కోసం వెతికింది. అలా వెదుకుతూ వెదుకుతూ మెట్ల కింద ఉన్న ఓ బీరువా తెరిచింది. ముందు ఒక పిల్లాడూ, ఆ వెనక ఓ పెద్ద మనిషి బయటపడ్డారు. వెదికినావిడ ఒక చేత్తో పిల్లాడినీ, మరో చేత్తో పెద్ద మనిషినీ గట్టిగా పట్టుకొంది. ‘ఛోర్‌ పకడాగయా… దొంగ దొరికాడు’ అని కేక పెట్టింది. పోలీసుల్ని పిలవడానికి చేతులు ఖాళీగా లేవు కాబట్ట్టి పిల్లల్ని దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ఆ పిల్లల్లో నేనూ ఒకదాన్ని. ఆ రోజు సాయంత్రం ఓ గోపీ వురపు మహిళ రెండు చేతుల్తో ఇద్దరు దొంగలను పట్టుకొన్న వైనం గురించి ఓ రిపోర్టరు హాస్యం ఉట్టిపడేలా రాసి పత్రికలో వేశాడు. అమ్మ చదివింది, మెచ్చుకొంది. ఆ రిపోర్టరెవరో కనుక్కొంది. నేనేం మాట్లాడలేదు (నవ్వు). ఆ రిపోర్టర్‌కు మా అమ్మ శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురితో సైకిల్‌ విహారం చేస్తోంది ఆ మహానుభావుడే అన్న విషయం మాత్రం గ్రహించలేకపోయింది. ‘అసలు దొంగను పట్టుకొనలేకపోయింది కదా’ అనుకొన్నాను.

… అలా అతనెవరో తెలియకుండా అమ్మ అతణ్ణి ఇష్టపడడం మొదలెట్టింది. నిజానికి ఒకసారి అతడ్ని కలిసిన వాళ్ళెవరైనా ఇష్టపడడం ఖాయం. బహుశా నేను ఈ విషయంలో ఎంత దృఢంగా, పట్టుదలగా ఉన్నానో అమ్మా నాన్న పరీక్షించారనుకొంటాను. ఇలాంటి తొలి మెరుపులు కొద్ది కాలంలోనే సమసిపోతాయన్నది వాళ్ళ అంచనా. అదే సమయంలో నేను నా జీవన సరళిని మార్చుకొని ఖద్దరు వేసుకోవడం, నిరాడంబరంగా ఉండడం వాళ్ళు గమనించారు. సరళమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాను. ఈ విషయాల్లో నా నిబద్ధతనూ, చిత్తశుద్దినీ చివరకు వాళ్ళు గ్రహించారు. ఎంతైనా తల్లిదండ్రులు కదా! వాళ్ళ జీవితాల్లో ఒక ముఖ్యమైన విషయంగా వాళ్ళు నన్ను భావిస్తారు, అభిమానిస్తారు. నాకది అర్థమయింది. మరి వాళ్ళ అంగీకారం, ఆశీర్వచనం లేకుండా పెళ్ళెలా చేసుకోగలను!

అలాగే మనకూ నమ్మకముండాలి కదా… అది తాత్కాలిక ఆకర్షణ కాదని! సహచరులు పోయిన ‘లోటు’ దగ్గరికి తిరిగి వస్తే నేను కలిసి మాట్లాడిన చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తలు పోయాక కూడా తాము వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటున్నామన్నారు. ఒక నిరంతర సంభాషణ కొనసాగుతోందన్నమాట. కొంతమంది మాత్రం ‘సమాధానం’ దొరక్కపోవడమన్నది ఎంతో ఆవేదన కల్గిస్తోందంటున్నారు. సమాధానం ఏమిటో మనకు తెలిసినా అది భౌతికంగా లభించకపోవడం అన్న వాస్తవం ఎంతో నిరుత్సాహం కలిగిస్తుంది.

ఊ… విషాదాలను విస్మరించి సాగిపోవడం నా అలవాటు. అలా ఆచరణలో చెయ్యగలను. అలా చెయ్యడం దీర్ఘకాలపు ప్రాతిపదిక మీద మంచి ఫలితాలు ఇస్తుంది. మా తల్లిదండ్రులు పోయినపుడు ముందు మా అమ్మ, మరుసటి ఏడాది మా నాన్న… ఇల్లు మూతబడిపోయింది. వాళ్ళిద్దరి మధ్యా చక్కని అనురాగ బంధం ఉండడం నేను గమనించాను. ఆ ఇంట్లో ఉంటూ దాని బాగోగులు చూసుకోవడానికి ఓ మనిషి ఉండేవాడు. చాలాకాలం పాటు ఆ ఇంటికేసి వెళ్ళడానికి… అసలా రోడ్డుమీద కూడా నడిచేదాన్ని కాదు. చివరికి ఒకరోజు ఆ ఇల్లు తెరిచాను. తెరిచానే కానీ అక్కడ

ఉందామనుకోలేదు. అంతకు ముందు దాన్ని అద్దెకు ఇచ్చి ఉన్నాం. ఓ లాల్‌ జీ గారి కుటుంబం అద్దెకుండేది. వాళ్ళు ఖాళీ చేశారు. వాళ్ళు వెళ్ళాక ఇంటిని శుభ్రం చేసి సున్నాలు వేద్దామనుకున్నాం. ‘వెళ్ళి వాళ్ళేమన్నా వదిలేసారేమో చూసొద్దాం’ అన్నాడు మా అబ్బాయి. ఓ

ఉదయం పూట వెళ్ళాం. ఆ రోజంతా అక్కడే గడపాలన్నది మా ఆలోచన. లాల్‌ జీ గారి భార్య ఇల్లు తుడుస్తోంది. ఆవిడను ఆపి ఆ పని నేను తీసుకున్నాను. ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డతో తుడిచాను – ప్రతి మూల మూలా, ప్రతి ఇటుక ఇటుకా. మా అమ్మా నాన్నల పాదాలు తాకిన అనుభూతి కలిగింది. ఇక్కడే కదా మా అమ్మా నాన్న తిరుగాడిందీ, నిదురలు పోయిందీ, దీర్ఘ నిద్రకు ఉపక్రమించిందీ అన్న భావన కలిగింది. నేను అప్పటిదాకా మోస్తోన్న విస్మరణా భారం ఒక్కసారిగా మనసులోంచి తొలిగిపోయినట్లు అనిపించింది. మళ్ళీ మరో జన్మ ఎత్తినట్లనిపించింది. అలాగే రమేష్‌ వెళ్ళిపోయిన ఆస్పత్రి… ఇప్పటికీ అటువైపు వెళ్ళడానికి నేను ఇష్టపడను. ఆయన మరణవార్త గురించి పేపర్లలో ప్రకటనలు ఇవ్వకపోవడం కూడా నాకు ఈ విషయంలో ఉపకరించింది. అతను కూడా ఈ విషయం అలాగే నిరాడంబరంగా ఏ ‘ప్రదర్శనా’ లేకుండా జరిగిపోవాలనే కోరుకునేవాడని అనిపించింది. ఓ సాయంత్రం ప్రార్థనా సమావేశం పెట్టుకున్నాం. పదిహేను రోజులు ఆఫీసుకి వెళ్ళలేదు. అతని ప్రపంచానికి చెందిన అనేకానేక మందిని ఇంట్లో కలుసుకున్నాను – నన్ను ఓదార్చడానికీ, ఆయన గురించి మాట్లాడడానికీ వచ్చిన వాళ్ళు. నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా రమేష్‌ తన కార్యక్రమాల్లో గడిపాడని అర్థమయింది. ఆయన కార్యక్రమాల విషయంలో నేను పూర్తిగా ఏ మాత్రమూ సంపర్కంలో లేనని అనిపించింది. నా పనుల్లో నేను మునిగిపోయి ఒకరకమైన స్వవిషయ వలయంలో ఉండిపోయాననిపించింది. ఆయన పనుల గురించి తెలుసుకోవడానికి సరిపడా ఆసక్తి చూపించలేకపోయాను. సమయం వెచ్చించలేకపోయాను. నా విషయంలో ఆయన అనేక పనులు చేశాడు. నాకే ఆ అవగాహన లేకుండా పోయింది. అనేకానేక చిన్న చిన్న కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉండేవాడు. ఓ రాజస్థానీ నేత పని వాళ్ళ గ్రామం, కోస్తా ప్రాంతపు పల్లీయులు, కచ్‌ ప్రాంతంలో గృహ నిర్మాణం, వినియోగదారుల పరిరక్షణ, ఉన్నత విద్య… అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కోసం ‘దారిద్య్రపు రేఖకు దిగువన’ అన్న విషయాన్ని పునర్‌ నిర్వచించడం. అతను పోయాక ఎన్నో పనులు… అతని సహచరులను కలుసుకోవడం ఒకరకంగా ఉపశమనం, మరొక రకంగా విషాద హేతువు. అది అతని ప్రపంచం. అందులో నేనో భాగం కాదు. చెయ్యవలసిందీ, మాట్లాడవలసిందీ, చర్చించవలసిందీ, చవిచూడవలసిందీ ఎంతో ఉంది (నవ్వు). ఒక్కోసారి ఒంటరిగా అనిపిస్తుంది. కానీ మనసును ఆ మాట అననివ్వను (నవ్వు).

‘తడి ఆరని గాయాలు’ పుస్తకం నుండి…

సమాప్తం..)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.