ఆమె నడిచిన దారి… మహాశ్వేతాదేవి -అనిశెట్టి రజిత

కొందరు వ్యక్తులు తాము జీవించిన విధానం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. వారిని సమాజం పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంది. వారు చేసిన పనులను చర్చించుకుంటుంది. సంఘంలోని సభ్యులుగా మన జీవిత గమనానికి ఒక దారంటూ ఏర్పర్చుకోవాల్సి వస్తుంది.

మహాశ్వేతాదేవి నడిచిన దారి కఠినమైనది. కష్టాలూ, ఎదురీతలతో కూడుకున్నది. కానీ మహోన్నతమైనది. ఆమె తలుచుకుంటే ఆమె రచనల ద్వారా బాగా డబ్బును సంపాదించుకుని సుఖప్రదమైన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఎంతో ఉంది. ఆమె రచనలు నేల విడిచి సాము చేసే గారడీ బురిడీలు కాదు. ఒక్కొక్కటీ నిప్పులా కాల్చే నిజాల్ని వెల్లడించేవి.

మన దేశంలో అంటరాని అస్తిత్వంలేేని మానవ సమూహాలెన్నో ఉన్నాయి. ఎవరికీ పట్టనివాళ్ళు, ఎవరికీ వారిపట్ల సానుభూతి లేనివాళ్ళు… వాళ్ళూ మనుషులే, పౌరులే అన్న గుర్తింపునకు దూరమైనవారు గిరిజన ఆదివాసీలు. వారి భాషకు లిపి అంటూ లేదు. వారికి లిఖిత సాహిత్యమంటూ లేదు. అధిక శాతం మంది నిరక్షరాస్యులై సామాజిక జ్ఞానానికి వెలివేయబడి అభద్రతా జీవితం గడుపుతూ అంతరించిపోతున్నారు. వారు నాగరికతకు దూరంగా ఉండి అజ్ఞానంలో ఉన్నా వారిలో వారిదైన నాగరికత, సంస్కృతి, ప్రాకృతిక జ్ఞానం ఎంతో ఉంది. ఆ విధంగా వారు శక్తివంతులు. నిరంతరం ప్రకృతితో వారు చేసే పోరాటమే వారి జీవిత విధానం.

ఎన్ని ఉన్నా వారికి సుఖశాంతులు ఉండవు. ఆవేదనా మయం వారి నిత్య జీవితం. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఆదివాసీ తెగలకు నేరస్థ జాతులుగా ముద్ర వేయడం వల్ల వారిని ప్రమాదకరమైన జాతులుగా, నేరస్థులుగా ఆదివాసేతర సమాజం వెలివేస్తుంది.

మహాశ్వేత 1963 నుండి 1975 వరకూ పలమావు, చైబైసా, రాంచీ, సింగ్‌భుం ప్రాంతాలలో ప్రతి సంవత్సరం కొన్ని రోజులపాటు తిరిగింది. ఆమె ఎవరి గురించి రాస్తోందో ఆ ప్రజలతో మమేకమయ్యింది. ఆమెకు ఆదివాసీ తెగలైన ఖేరియా, లోధా, సంధాల్‌ ప్రజలతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది.

ఒక ఆదివాసేతర స్త్రీ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఆదివాసీల ఆత్మీయ ”మారంమాయి (పెద్దమ్మ)”, ”మారందాయి (పెద్దక్క)”గా వారి మనిషైపోవడం సామాన్యమైన విషయం కాదు.

ఆమె నోరులేని మూగ ప్రాణులు, శక్తిహీనులు, నిర్వాసితులు, పేదలు, అంటరానివాళ్ళు, నిరక్షరాస్యులు, అనారోగ్య పీడితుల పక్షాన నిలబడి వారికి తన గళాన్నీ, తన కాలాన్నీ ఇచ్చి తన కలాన్ని సంధించింది. ఆమెది అన్నార్తులూ, ఆక్రందితులైన నిర్భాగ్యజన పక్షం.

ఆదివాసీల కష్టాలకు అంతమంటూ లేదు. అభివృద్ధి పేరున అన్ని ప్రభుత్వాలూ అడవితో వారికున్న అనుబంధాన్ని తెంచుతూ వారిని నిర్వాసితుల్నీ, నిర్భాగ్యుల్నీ చేస్తుంటాయి. వారిని నిర్దాక్షిణ్యంగా తరిమేస్తూ వారిపై అటవీ నేరాలు మోపి కేసులు పెడుతుంటారు అటవీ అధికారులు. వారికి జామీను ఇచ్చేవారు ఉండరు. ఏళ్ళ తరబడి అన్యాయంగా జైళ్ళలో మగ్గిపోతుంటారు.

మన రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోని ఆదివాసుల పట్ల హక్కుల ఉల్లంఘన సర్వసామాన్యంగా జరిగే దౌర్జన్యం. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులూ, పథకాలూ కేవలం ఆదివాసులను మట్టుపెట్టడానికే అన్నట్లు ఉంటున్నాయి.

మేకలను పెంచేది పులులకు బలివ్వడాననికేనన్నట్లు ఆదివాసులను ”అభివృద్ధి”కి బలిస్తుంటారు. వారీ దేశ పౌరులు కారన్నట్లు, వారి పట్ల తమకు ఏ బాధ్యతా లేదన్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు. అటవీ చట్టాలు, ఆదివాసీల చట్టాలు కాగితాలకే పరిమితం చేయబడి రాజ్యాంగం వారికిచ్చిన రక్షణసూత్రాలకు మరణశాసనం చేస్తున్న నాగరిక వ్యవస్థ మనది.

పరాధీన భారతానికి పరాకాష్ట మన దేశంలో ఆదివాసీల యదార్థ స్థితి.

మహా శ్వేత తనను తాను గిరిజన స్త్రీగా మలుచుకున్నది. ”నేను ఆదివాసీని మీరు ఆదివాసీయేనా” అని ఆమె ఎదుటివారిని అడిగేది. అందుకే ఆమె ఘాటైన పరిమళాలు వెదజల్లే విప్పపూల చెట్టు. ఆదివాసీలకు ఆమె శీఅవ జూవతీరశీఅ తీవరశీబతీషవ షవఅ్‌తీవ.

కల్లోలపరిచే కథల ఖజానాతో ఆమె రచనా కార్యాచరణల సంగమం. ఆమెది స్త్రీల పట్లా, అణగారిన జన సమూహాలైన ఆదివాసీల పట్లా వర్గ దృక్పథం కలిగిన రచనా తీవ్రత.

సమాజం కోసం పనిచేసే కొడుకు మరణంతో ‘ఒక తల్లి’ లో కలిగిన వివేచన, చైతన్యీకరణ ‘హజార్‌ చౌరాసి మామా’ నవలలో సంచలనాత్మకంగా చిత్రించింది.

‘రాకాసికోర’ భూస్వాముల దౌర్జన్యాలు, తరతరాలుగా స్త్రీలపై లైంగిక అత్యాచారాలను చిత్రించిన నవల.

‘ఎవరిదీ అడవి’ నవలలో బ్రిటిష్‌ పాలనా దురాగతాలను ఎదిరించి యుద్ధం నడిపిన పాతికేళ్ళ యువకుడైన బీర్సాముందా చరిత్రను లిఖించింది.

బ్రెస్ట్‌ స్టోరీస్‌ పేరిట ‘ఛోలీకే పీఛే’ అనే మూడు కథల సంపుటాన్ని 1997లో హైద్రాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. స్త్రీల శరీరం చుట్టూ, శరీరంలోని అన్ని భాగాలపైనా సమాజం ఎంత కుటిల రాజకీయం, పెత్తనం చేస్తోందో పచ్చిగా చెప్పిన కథలు ”ఛోలీ కే పీఛే” కథలు.

”బషాయిటుడు” ఒక ఆధునిక ఆదివాసీ మహాభారత యుద్ధకథ లాంటిది. ఇందులో నిజమైన నక్సలైట్‌ ఉద్యమం నడిపిన ఆదివాసీ హీరోలు అనేకమందిలో ఒక బషాయిటుడు ఆమె తన గిరిజన కథానాయకుడిగా రూపొందించారు.

”రుదాల” కథా సంపుటిలోని ఉప్పు, చిన్నోళ్ళు, దెయ్యాలున్నాయి జాగ్రత్త, శ్రీశ్రీ గణేశ మహిమ, రుడాలి కథలు గిరిజన జీవితాల్లోని వివిధ కోణాలను నమోదు చేశాయి.

‘శవాచరి’ కథా సంకలనంలో ‘అన్నం, నీళ్ళు, గిరిబాల, విత్తనాలు, జీవితఖైదీ, దొంగతనం, సహచరి, మకర్‌సవర, దేవతా వృక్షం, భీకర యుద్ధం తర్వాత’ కథలు గిరిజనుల వెతలను ఎన్నో రకాలుగా ఆవిష్కరిస్తాయి.

మహాశ్వేత 1956 నుండి 1996 వరకు ఈ 40 ఏళ్ళ మధ్యకాలంలో 94 సృజనాత్మకమైన రచనలు చేసింది. 1979లో ఆమె తండ్రి మరణానంతరం ‘బోర్టికె’ అనే పత్రిను నడిపింది. 1997 నాటికే ఆమె శతాధిక రచనలు చేసింది.

పీడిత జాతుల పెన్నూ వెన్నూగా మారిపోయిన ఆమె కేవలం పీడితుల జీవితాలను వాస్తవికంగా అక్షరబద్ధం చేసే వాలుకుర్చీ రచయితగా మిగిలిపోకుండా ఆమె జ్వలనఖడ్గంతో జ్వాలాముఖిగా గాలితోపాటు ప్రయాణించి అభాగ్యులూ ఆక్రందితుల కోసం ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేసిన మహాయోధ.

ఆదివాసీల కోసం అనేక సంఘాలనూ, వేదికనూ స్థాపించి ఒక కార్యకర్తలా పనిచేసిన మహాశ్వేత 14 జనవరి 1926లో నాటి ఈస్ట్‌ బెంగాల్‌ నాటి బంగ్లాదేశ్‌లోని ఢాకాలో స్వాతంత్య్ర కాంక్ష బలంగా ఉన్న ఒక ఎగువ మధ్య తరగతి మేధావులు, కళాకారుల కుటుంబంలో జన్మించింది. కలకత్తాకు మారిపోయిన వారి కుటుంబంతో పాటు ఆమె చివరికంటా కలకత్తాలో నివసించింది. అక్కడే విద్యాభ్యాసం, ఉద్యోగాలూ చేసింది.

భాష తదితర అంశాలను అధిగమించిన ఈ బెంగాలీ రచయిత్రి సాహిత్యానికీ, ప్రజల కష్టాలకూ సరిహద్దులు లేవని నిరూపిస్తూ భారతీయ రచయిత్రిగా ఆవిష్కృతమయ్యింది. 28 జులై 2016న 90 ఏళ్ళ వయసులో ఇంకా ముగిసిపోని పోరాట ఆయుధాన్ని మనకందించి కలకత్తాలో తుదిశ్వాస విడిచింది. ఆదివాసీ గూడెంలోనే తనను సమాధి చేయాలని ఆమె కోరింది. మహా మానవి మహాశ్వేతకు మన నీరాజనాలు! ఆమె నడిచిన దారే మనకాదర్శం!

(28 జులై 2019 ఆమె 3వ వర్ధంతి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.