వరంగల్‌లో పసిపాపకు జరిగిన దారుణం సందర్భంగా అనేకమంది అనేకం రాస్తూ చదువుకున్నవాళ్ళు లైంగిక హింసకు పాల్పడరు, చదువులేని వాళ్ళు, కూలీపనులు చేసేవాళ్ళు లేదా మతిస్థిమితం లేనివాళ్ళు చేస్తారన్నట్టు చాలామంది రాస్తున్నారు.
లైంగిక హింసకి పాల్పడేది ఎక్కువగా తెలిసినవాళ్ళే! వీళ్ళంతా చదువుకున్నవాళ్ళే! కాకపోతే కుటుంబ సభ్యులనో, స్నేహితులనో, పరువు పోతుందనో మరోటో… ఈ కేసులు బయటికి రావు. రోజు కూలీనో, బస్ డ్రైవరో చేసినవి వెంటనే బయటికొస్తాయి. అంతేకాక చదువుకున్నవాళ్ళు చాలా తెలివిగా బయటికి రాని విధంగా కన్నింగ్‌గా చేస్తారు పనులు. చదువు లేనివాళ్ళు అనాగరికంగా, అరాచకంగా చేస్తారు. నాకు తెలిసిన ఒక వాస్తవం…ఒక 14ఏళ్ళ అమ్మాయి, ఒక ఎం.డి డాక్టర్, 50 ఏళ్ళ వ్యక్తి. ఆ పాపని పుట్టిన దగ్గరనుంచీ చూసినవాడు. నాన్న ఫ్రెండు. ఇంట్లో బాగా క్లోజ్. ఈ అమ్మాయితో రోజూ ఫోర్‌ప్లే, కొన్నాళ్ళకి సెక్స్…. నొప్పిగా ఉండేదని పూర్తిగా ఎప్పుడూ జరగలేదు. అది తప్పు కాదని ఆడ-మగ మధ్య సహజమని, ఆమె నిజంగానే తన పట్ల ఆకర్షితురాలయిందని ఆ పిల్లని ఎలాగో నమ్మించాడు. ఇలా నాలుగేళ్ళు గడిచింది. పిల్ల కాలేజికొచ్చింది. కాలేజిలో ఒకబ్బాయి వెనకపడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది. ఈ విషయం అంకుల్‌కి తెలిసింది. హింస మొదలెట్టాడు. జీవితంలో నువ్వు నాకు తప్ప ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదని హింస మొదలెట్టాడు. అంతకుముందు తను అతనితో సన్నిహితంగా ఉన్న విషయం ఇంట్లో తెలిస్తే కోప్పడతారని ఆమె అతని హింస గురించి బయటపెట్టలేదు. అయితే అతని బాధ తట్టుకోలేక మానసికంగా అనారోగ్యం పాలయింది. వింత వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. వెంటనే ఇంట్లోని వాళ్ళు వైద్య సహాయం తీసుకున్నారు. ఆమెకు మూడేళ్ళపాటు వైద్య చికిత్స జరిగింది. ఏడాదిపాటు హాస్పిటల్లో ఉంది. జరిగిందంతా అందరికీ తెలిసింది. డాక్టర్ మీద కేసు వేశారు. ఆ కేసు సంవత్సరాలపాటు నడిచింది. డాక్టర్ ఏదో జరిమానాతో తప్పించుకున్నాడు.
ఈ కథలో ఆ అమ్మాయిదే తప్పని, ఆమెను నానా మాటలు అనడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఇందులో చదువుకోని వాళ్ళెవరు?
సమాజంలో సెక్స్ పట్ల ఉన్న టాబూని బ్రేక్ చేస్తే తప్ప లైంగిక హింస తగ్గదు. అదొక్కటే మార్గం. సెక్స్ అనేది తప్పు, రహస్యం అనుకునేంతవరకూ హింస కొనసాగుతూనే ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడాలి. పిల్లలు లైంగిక సంబంధ విషయాలలో ఇంట్లో ఏ మొహమాటం లేకుండా చెప్పగలిగే వాతావరణం రావాలి. ఒకవేళ ఏదైనా జరిగినా అది ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి రావాలి. ఏదైనా సంఘటన జరగగానే కుటుంబం, సమాజం, ప్రభుత్వం బాధితురాలిని నిందించకుండా ఉండాలి. సమాజంలో 50 మంది చెడ్డవాళ్ళుంటే, 50 మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారనే ధైర్యం ఆడపిల్లలకి కలగాలి.
చదువే ధైర్యం ఇస్తుందనుకుంటే, ఈ కాలంలో చాలామంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి ధైర్యం ఎందుకు కలగట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు కూడా లైంగిక హింస, గృహ హింస గురించి మాట్లాడట్లేదు. బయటికి చెప్పట్లేదు. నజఖ లో నేను నా కళ్ళతో ఎన్నోసార్లు చూశాను. హాస్టల్ రూముల్లో కూర్చుని వాడిలా చేశాడు, వీడిలా హింసిస్తున్నాడు అని ఏడ్చే అమ్మాయిలని చూశాను. మేమంతా కలిసి ఒక ప్రొఫెసర్ చేసిన లైంగిక హింస కేసు డీల్ చేశాం. ఆ వార్త అప్పట్లో అన్ని పేపర్లలో వచ్చింది. యూనివర్శిటీలో ప్రొఫెసర్లు చేసే హింస ఎంతవరకు బయటికొస్తుంది? వీళ్ళంతా చదువుకున్నవాళ్ళేగా. చదువు వీళ్లకి ధైర్యం ఎందుకు ఇవ్వట్లేదు?
మొన్న ఒక మైనర్ బాలికను వారంపాటు గ్యాంగ్ రేప్ చేశారని వార్త వస్తే, వారంలో ఆ అమ్మాయి తప్పించుకునే ప్రయత్నమేమీ చెయ్యకపోవడం ఆశ్చర్యం అంటూ perverted mind ని కొందరు బయటపెట్టుకున్నారు. స్త్రీ రేప్‌ని ఎంజాయ్ చేస్తుందంటూ వాగినవాళ్ళూ ఉన్నారు. ఎవరో జర్నలిస్టు, రచయితట. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అంటూ అసహ్యకరమైన వాగుడు వాగాడు. వాళ్ళంతా చదువుకున్నవాళ్ళేగా!
అంటే చదువుతోపాటు కలగవలసిన జ్ఞానమేదో కలగట్లేదు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? సాంఘికంగా ఫెయిల్ అవుతున్నాం. సమాజ కట్టుబాట్ల దగ్గర ఫెయిల్ అవుతున్నాం. అమ్మాయి లైంగిక వస్తువైతే, అబ్బాయీ లైంగిక వస్తువే మరి! కానీ అమ్మాయిని మాత్రమే లైంగిక వస్తువుగా చూడడం వలనే ఈ సమస్య! Bharadwaja Rangavajhala పీపుల్స్ వార్‌లో పనిచేస్తున్న ఒక కుర్రాడు ఎనిమిదేళ్ళ పిల్లమీద ఎలా లైంగిక హింసకు పాల్పడ్డాడో రాశారు. సో… సిద్దాంతాలు కూడా లైంగిక హింసను కట్టడి చెయ్యలేవన్నమాట!
Sowmya PS వావి వరసలు మనం ఏర్పరచుకున్నవనీ, తండ్రి, కూతురి మీద హింకు పాల్పపడితే దాన్ని పురుషుడు, స్త్రీ మీద చేసిన హింసగానే చూడాలని రాశారు. ఎంత నిజం! ఇప్పుడు మనకు కావలసిన attitude అది. లైంగిక వాంఛ ప్రకృతి సహజం. అందులో తప్పు లేదు, దాపరికం లేదు. consensual sex లో ఏ తప్పూ లేదు. ముందు దాన్ని తప్పుగా చూడడం మానేయాలి. సెక్స్ పట్ల మన సమాజ దృక్పథం మారాలి. consensual sexకి, రేప్‌కి ఉన్న తేడా మనకు స్పష్టంగా తెలీదు. ఎవరెంత గుండెలు బాదుకున్నా ఇది నిజం! అందుకే రెంటినీ తప్పుగా, రహస్యంగా చూస్తున్నాం. consensual sexని రహస్యంగా, తప్పుగా చూడడం మానేస్తే, లైంగిక హింస వెలుగులోకొస్తుంది.ఎదుర్కోగల ధైర్యమూ వస్తుంది. దాని గురించి బయటికి చెప్పుకోగల స్వేచ్ఛ వస్తుంది.
మైనర్ బాలికలు, వృద్ధుల విషయంలో నిందితుడికి కఠిన శిక్షలు పడాలి. అసలు సెక్స్ పట్ల మన సమాజ అవగాహన మారితే ఈ మానసిక ప్రవృత్తి కూడా మారుతుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఆడ, మగ పిల్లలందరికీ సమానంగా, కలిసి ఒకేచోట ఇవ్వగలగాలి. ఆడపిల్లకి ఆడ టీచర్, మగ పిల్లలకి మగ టీచర్ కాకుండా ఆడ, మగ టీచర్ ఎవరైనా సరే నిర్భయంగా, సైన్స్ చెబుతున్నట్లు చెప్పగలగాలి.
PS 1: Developed Societies లో ఇవన్నీ ఉన్నా లైంగిక హింస జరుగుతోంది. అది చర్చించవలసిన మరో పెద్ద విషయం. ఆ స్టేజ్‌కి మనం ఇంకా చేరుకోలేదు. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడగలగడం అనేది సమస్య పరిష్కారానికి మొదటి అడుగు. మానవ మనుగడ ఉన్నంతవరకూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూనే ఉండాలి. ఇప్పటి మన సమాజానికి, ఇది ఒక పరిష్కార మార్గం అవ్వొచ్చన్నదే నా ఆలోచన!
PS 2: ఇది చదివాక, విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తోందని గుండెలు బాదుకునేవాళ్ళని, అయితే పక్కింటోడి పెళ్ళాన్ని లేపుకుపోవచ్చన్నమాట లాంటి వాంతి కలిగించే జోకులేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసే పద్ధతేదైనా ఉంటే బాగుండును.