కమ్యూనికేషన్ అనే పదం లాటిన్ భాషా నామపదమైన కమ్యూనిస్ (communic) మరియు క్రియా పదమైన కమ్యూనికేర్ అనే పదం నుండి ఉత్పత్తి అయింది. ఈ రెండు పదాల అర్ధం ్‌శీ ఎaసవ షశీఎఎశీఅ అని, అందరికీ సంబంధించినది అని అర్థం. కమ్యూనికేషనే ప్రజలను పరస్పరం దగ్గర చేస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల విషయాలు, అభిప్రాయాలు, సమాచారాలు వినిమయం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
భరతుని నాట్యశాస్త్రంలో కూడా దీని ప్రస్తావన ఉంది. సాధారణీకరణం అనే అర్థంతో దీన్ని ఉపయోగించారు. సహృదయుల్ని దగ్గరకు చేర్చడాన్నే సాధారణీకరణం అంటారు. కమ్యూనికేషన్ అనేది ఒక హక్కుగా పరిణమించింది. మనిషి ప్రాథమిక హక్కుల్లో ఇది కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. భారత పార్లమెంట్ కూడా 1977లో ఈ బిల్లును అంగీకరించింది.
Freedom of speech and pen is the foundation of swaraj, if the foundation stone is in dangers; you have to exert the whole of your might in order to defend that single stone – Mahatma Gandhi.
ముద్రణా వ్యవస్థకు అనుకూల వాతావరణం నిర్మాణమైన తరువాత వర్తమాన పత్రికలు ఆవిర్భవించాయి. మొదట చైనా దేశంలో కాగితం, ముద్రణా సౌలభ్యాలు రెండూ ఉండడంతో ప్రపంచంలోనే మొదట ముద్రణ చైనాలో జరిగింది. మొదట పత్రికల్ని స్థాపించింది మాత్రం 1615లో జర్మనీ, తర్వాత 1622లో ఇంగ్లండ్ ప్రారంభించాయి. కానీ పత్రిక అప్పుడు పాంప్లెట్ల రూపంలో ఉండేది. ఇంగ్లండ్ మొదటి పత్రిక ”పర్‌ఫెక్ట్ డయల్” 1660లో ప్రారంభించగా, తర్వాత 123 ఏండ్లకు పెన్సిల్వేనియాలో ”ఈవెనింగ్ పోస్ట్” పేరుతో అమెరికా దేశం మొదటి పత్రికను తీసుకొచ్చింది. ఇలా అన్ని దేశాల్లోనూ పత్రికలను నెలకొల్పుకుంటూ వచ్చారు. పత్రిక అనే పదం… వ్యవహారం యొక్క చెల్లుబడికై ఒకరికొకరు వ్రాసుకొనబడిన పత్రం (శబ్దరత్నాకరం పుట 548) అని అర్థంతో వాడబడింది.
భారతదేశంలో మొదటి పత్రిక 1780 లో ప్రారంభించిన బెంగాల్ గెజిట్. పత్రికలను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. దేశంలో ప్రభావవంతంగా పనిచేసిన పత్రికలు చాలా ఉన్నాయి. 1881లో బాలగంగాధర్ తిలక్ పూణే నుండి ”కేసరి” పత్రికను నడిపారు. ఇక పత్రికా రంగంలో భారతదేశంలో గాంధీని తలచుకోకుండా ఉండలేము. భారతదేశ పత్రికా స్వాతంత్య్ర పోరాటదారునిగా జేమ్స్ ఆగస్టన్ హికిని చెప్పుకుంటారు. రాజా రామ్మోహన్ రాయ్‌ను జవహర్‌లాల్ నెహ్రు భారతదేశ పత్రికోద్యమ పితామహుడు అని కొనియాడారు. రాయ్ 1821లో ”సంవాద కౌముది” పత్రికను స్థాపించారు. అలాగే 1822లో ”మీద్ ఉల్ అక్బర్” అనే పత్రికను కూడా స్థాపించారు.
సదానంద తమిళనాడులో పుట్టి ముంబైలో తన కార్యకలాపాలను ప్రారంభించిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహంలో ”ప్రి ప్రెస్ జర్నల్’ అనే పత్రికను ప్రారంభించి ప్రజలను జాగృతం చేయడానికి పూనుకున్నారు.1920లో బర్మాలో కూడా పత్రికలను నడపగలిగారు. బి.జి.హార్నిమన్ ”స్టేట్స్‌మన్” అనే పత్రిక ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో భారతదేశానికి మద్దతునిస్తూ పోరు సల్పారు. అతనికి బ్రిటిషర్లు జైలు శిక్ష వేయడమే కాక, దేశ బహిష్కరణ చేశారు. అయినా ఆయన తిరిగివచ్చి తన పోరాటాన్ని కొనసాగించారు. భారతదేశంలో పత్రికలు సామాజిక, సాహిత్య రంగాలకు అపారమైన సేవలందించాయి.
తెలుగుదేశంలో 1850 కంటే పూర్వం భావ ప్రసారం తాళపత్రాల ద్వారా, మౌఖిక మార్గాల ద్వారా నడిచింది. కాకతీయుల పాలనలో కాగితం తయారయ్యేసరికి రాతపూర్వకంగా పత్రికలు వెలువడ్డాయి. తెలుగులో మొదటి పత్రిక 1838లో ”వృత్తాంతి”. తరువాత 1862లో సుజనరంజని, 1863లో యక్షిణి, 1864లో తత్వబోధిని, 1871లో ఆంధ్రభాషా సంజీవని, 1874లో వివేకవర్దిని, 1975లో భారతి, దినవర్తమాన, గోల్కొండ పత్రిక, మీజాన్, శారద, సుజాత, చింతామణి, ఆంధ్రకేసరి, కృష్ణా పత్రిక, తెలుగు, గృహలక్ష్మి మొదలైన పత్రికలు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించాయి. నేడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి, ఆంధ్రభూమి తదితర పత్రికలు సాహిత్యానికి ఎంతో సేవలందిస్తున్నాయి. తెలుగు పత్రికా రంగంలో స్త్రీలు తమ ధైర్య స్థైర్యాలను చూపారు. తెలుగులో స్త్రీల కోసం ఆవిర్భవించిన మొట్టమొదటి పత్రిక ”సతీహితబోధిని”. ఇందులో ముఖచిత్రం పైన…
‘అరక్షితా గృహేరుద్దాః పురుషైరాప్తకారిఖిః
ఆత్మానమాత్మనా యాస్తురక్షేయుస్తాస్సురక్షితాః’
ఆప్తులైన పురుషులచే గృహమున నిర్బంధింపబడు స్త్రీలు సురక్షితాండ్రు కారు. ఏ స్త్రీలు తమ్ము తామే కాపాడుకుందురో వారే సురక్షితాండ్రు అని ముద్రించేవారు. వీరేశలింగం గారు స్త్రీ సంపూర్ణంగా స్వశక్తురాలై ఉండాలని ఆనాటికే కోరుకున్నారు. అసలే అక్షరాస్యత అంతంత మాత్రం ఉండే భారతదేశంలో స్త్రీలు చదువుకోవడమే గగనమైతే ఇక పత్రికల్లో రాయడం కానీ, పత్రిక స్థాపన కానీ ఊహించడానికే కష్టంగా ఉండేది. కాలానుగుణంగా వచ్చిన ఉద్యమాల మార్పులతో పత్రికల ద్వారా సాహిత్య శంఖారావం పూరించడానికి స్త్రీలు ముందుకు వచ్చారు. సంస్కరణల కాలానికి స్త్రీయే కేంద్రబిందువయ్యింది. 1883 నుండి స్వాతంత్య్రం వచ్చేనాటికి 20 స్త్రీల పత్రికలు కార్యరంగంలోకి దిగాయి. సతీహిత బోధిని (1883), తెలుగు జనానా పత్రిక (1893), స్త్రీ హిత బోధిని, అనసూయ, సౌందర్యవల్లి, ఆంధ్రలక్ష్మి, భారత మహిళ, ఆంధ్ర మహిళ మొదలైన పత్రికలు తెలుగులో వెలువడ్డాయి. తొలితరం పత్రికలన్నీ మహిళలను మగవారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా తయారు చేయడానికి మాత్రమే ఉపకరించాయి. పాతివ్రత్య రక్షణ కోసం ప్రాకులాడిన పత్రికలే అలా రాయడానికి కారణం మగవారిలో ఉన్న అభద్రతా భావమే అని చెప్పవచ్చు. మొసలిగంటి రమాబాయి, రాచమల్లు సత్యవతీదేవి, పులుగుర్తి నరసమ్మ, వింజమూరి వెంకటరత్నమ్మ, మల్లాది వెంకటసుబ్బమ్మ, యామినీ పూర్ణతిలకమ్మ, మాలతీ చందూర్ వంటి ప్రముఖులు పత్రికా రంగం ద్వారా సాహిత్యానికి సేవలందించారు. 1980లో ఉద్యమంగా వచ్చిన స్త్రీ వాదం ప్రేరణతో ‘భూమిక’ పత్రిక కేవలం మహిళా సాహిత్య ప్రోత్సాహానికి ఉద్దేశించి ప్రారంభించిన మాసపత్రిక. నేటికీ చాలామంది మహిళలు పత్రికారంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.
‘పులుగుర్తి వరలక్ష్మీ నరసమ్మ’ – ఈమె ”సావిత్రి” అనే పత్రికను 1904లో స్థాపించారు. ఈ పత్రికలో రచయిత్రుల రచనలే ఎక్కువగా కనిపించేవి. సావిత్రి పత్రిక స్త్రీ విద్యను బాగా ప్రోత్సహించేది. అయితే వితంతు వివాహం వంటి సంస్కరణల్ని తీవ్రంగా ఖండించేది. ఒక విధంగా సావిత్రి పత్రిక వీరేశలింగంగారికి ప్రత్యర్ధివంటిదని చెప్పవచ్చు. పంతులుగారు రాసిన సావిత్రి, సత్యవతి సంభాషణమనే ప్రహసనానికి, ఇంకా ఆయన ఇతర విమర్శలకు మన్యం సుబ్బమ్మ అనే రచయిత్రి ఈ పత్రికా ముఖంగానే సవాలు విసిరింది. సావిత్రి అనే పత్రిక సంప్రదాయబద్దమైన రీతిలో స్త్రీ విద్యని కాంక్షించింది, కానీ స్త్రీకి పునర్వివాహం కూడదని ఖచ్చితంగా చెప్పేది. ఈ సావిత్రి పత్రిక ప్రతి మాసము సులభమైన తెలుగులో పతివ్రతా ధర్మములు, సంసార ధర్మములు, తల్లిదండ్రుల కృత్యములు, బ్రకృతి శాస్త్రాదులు, దైవ ప్రార్ధనలు, మంచి పాటలు, గుట్టుపనులు, నీతి విషయములు, దేహారోగ్య ధర్మములు, అన్యదేశపు జెలుల వృత్తాంతం, వినోద వార్తలు మొదలైన విషయాలు ప్రచురించేవి. నా సోదరులందరు లోకాభివృద్ధికి మూలాధారమైన విద్యాభివృద్దిని కోరి నాపై సోదరి భావం చూపి మీ సఖులందరినీ సావిత్రి పత్రిక బంధువులుగా చేయాలని మనవి అని విన్నవించుకొన్నారు నరసమ్మ. సావిత్రి పత్రికను మహిళలందరూ చదివేలా చూడాలని పురుష లోకానికి ఆమె మొరపెట్టుకున్నారు.
”వింజమూరి వెంకటరత్నమ్మ”- దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సోదరిగానే కాకుండా తన ధైర్యసాహసాలతో ఆనాటి స్త్రీల భావాలను నిస్సంకోచంగా వ్యక్తం చేసిన ధీరురాలు. నవ్యసాహితీ సమితిలో ఏకైక మహిళా సభ్యురాలు. తెలుగులో స్త్రీల కోసం అనసూయ అనే పత్రికను 1917లో రామారావు పేట నుంచి ప్రారంభించారు. తొలితరం మహిళలను జాగృతం చేసిన పత్రికగా ‘అనసూయ’ పత్రికను చెప్పుకోవచ్చు. పురుషులతో పోరాడి హక్కుల్ని పొందడమే కాక మగజాతే ఆడవారి బుద్ధిశక్తిని చూసి పిలిచి అవకాశాల్ని సమానస్థాయిలో కల్పించాలని, ఎక్కడ పురుషులతో సమానంగా స్త్రీలను అభివృద్దిలో భాగస్వాములుగా చేస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుందని స్వాతంత్య్రానికి పూర్వమే ఆమె చెప్పారు. స్త్రీల స్వయంప్రతిపత్తిని ఆశించి పురుషులతో సమానావకాశాల్ని ఆశించడమనేదే కాకుండా తన అభిప్రాయాన్ని బహిర్గతం చేయడం ఆ రోజుల్లో సాహసోపేతమైనదిగా భావించవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో నారాయణ చంద్ర వార్కర్ రాసిన వ్యాసాన్ని వెంకటరత్నమ్మ, ”ఇరువురు మాలకన్నియలు” అనే పేరుతో ప్రచురించారు. మేధోపరంగా పురుషులకు స్త్రీలు ఏ మాత్రం తీసిపోరని, అన్ని పాఠశాలల్లోను మహిళా
ఉపాధ్యాయులనే నియమించాలని, విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులను చూసి నేర్చుకుంటారని చెప్పారు. ఆమెకు తెలుగు భాష మీద ఎంతో గౌరవం ఉండేది. అనసూయ పత్రిక అంటే వెంకటరత్నమ్మకి ఎంతిష్టమంటే తన కూతురికి కూడా పత్రిక పేరే పెట్టారు. సాంప్రదాయాలకు భిన్నంగా స్త్రీ సమాజాన్ని మేల్కొలిపే విధంగా తన రచనలు చేశారామె.
‘మల్లాది సుబ్బమ్మ’ – సాంప్రదాయ కుటుంబంలో పుట్టి సాంప్రదాయాలన్నింటినీ ఎదిరించి అభ్యుదయ భావాలు, ప్రశ్నించే మనస్తత్వంతో తెలుగు సాహిత్యంలోనే ఒక క్రాంతికారక భావాలతో సుస్థిర స్థానాన్ని సంపాదించిన శక్తి ‘మల్లాది సుబ్బమ్మ’ది. ఈమె మొదటి కథ ‘పనికిమాలిన ముత్యం’. కథతో సాగిన ప్రయాణం, ఏదీ అశ్లీలం, బానిసా కాదు దేవతా కాదు, వ్యభిచారం ఎవరి నేరం, మం మన సంస్కృతి మొదలైన రచనలతో పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘మహిళాజ్యోతి’ శీర్షికతో ఒక పేజీని కేటాయించారు. అందులో ‘కట్నాల కలహాలు’ కథతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ‘వికాసం’ అనే పేరుతో ఒక పత్రికను నెలకొల్పి పది సంవత్సరాల పాటు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ పురుష సమానత్వం సుబ్బమ్మగారి రచనల ఉద్దేశ్యం. వివాహమే అంతిమ లక్ష్యంగా మారిన మహిళా లోకానికి కాలం చెల్లిన ఆలోచనలను విడనాడాలని, వివాహం స్త్రీ అంతిమ లక్ష్యం కాదు, కారాదు అని ఉపదేశించారు. చిన్నపిల్లల్లో సహనం, సౌశీల్యం, దాతృత్వం, నిస్వార్ధం లాంటి మంచి గుణాలను పెంపొందించడానికి గాను బాలల కోసం కూడా పుస్తకాలు రాశారు. పురాణాలన్నీ స్త్రీలను ఎంత కింది స్థాయికి జమకట్టాయో తెలియచేశారు. తైత్తరీయ బ్రాహ్మణంలో మహిళలను పరాన్నభుక్కుగా (జూaతీaరఱ్‌వ)గా వర్ణించారు. చాణుక్యుడు స్త్రీలు జుట్టు పెంచుకున్నందుకు పన్ను విధించాడని, మానవత్వాన్ని కాలరాసిన నియంత ఎవరంటే మనువు అని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో స్త్రీలు తక్కువగా ఉండడాన్ని నిరశించారు. స్త్రీలకు అధికారం ఉన్నా పురుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారని వాపోయారు. నిజమైన ఆప్యాయతను కోరుకునే పురుషుడు స్త్రీలకు సమానత్వాన్నివ్వాలని, మమ్మల్ని పురుషుడితో సమానంగా చూడాలని కోరుకొన్నారు. దేవుళ్ళందరూ పురుషులే, వారి ప్రతినిధులైన పూజారులు కూడా పురుషులే అయినప్పుడు సమానత్వం అనే పదం ఉచ్చరించడానికే ఇబ్బదిగా ఉంటుందని, ఇంతకంటే మోసం ఇంకేముంటుందని, అన్ని మతాల్లోను మగదేవుళ్ళే ఉంటారని, మగవారి కుట్రలకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఈమె రచనల్లో నీతి, నిజాయితీ, హేతువాద తత్వం, కులతత్వ వ్యతిరేకత కనిపిస్తాయి. మంచి సంఘసేవకురాలిగా ఆమె పూర్తి విశ్వాసంతో, ఎంతో ధైర్యంగా తన భావాలను ముందుకు తీసుకువెళ్ళారు. ప్రశ్నించేవారిని ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరు మల్లాది సుబ్బమ్మ.
కన్నడ రాష్ట్రంలో మంగళూరు సమాచార అనేది మొట్టమొదటి పత్రిక. ఇది 1843 జులై 1 నుండి వెలువడింది. దీని సంపాదకులు హర్మన్ ఫెడ్రిక్ మోగ్లింగ్. దీని తర్వాత బుద్ధి ప్రకాశ (1849), అరుణోద్యమ, బెళగావి సమాచారం, మఠపత్రిక, వృత్తాంత చింతామణి, సాధ్వి, ధనుంజయ, ధనుర్దారి, జ్ఞానబోధిక, ధారవాడ వృత్త శిలానుభవ, నవకర్ణాటక పత్రికలు ప్రారంభమయ్యాయి. కన్నడంలో మొదటి వారపత్రిక మైసూరు వృత్తాంతబోధిని, కర్ణాటక ప్రకాశిక. కన్నడంలో మొదటి సాహిత్య పత్రిక కర్నాటక వైభవ, దేశాభిమాని, కన్నడనడెగన్నడి, సత్యదీపిక, శివమొగ్గ వృత్తాంతి. మహిళల కోసం కర్ణాటక వాణీ విళాస (1888), మైసూరు హెరాల్డ్, కన్నడ స్టాండర్డ్, సూర్యోదయ ప్రకాశిక. ఇక రెండవ తరానికి చెందిన పత్రికలు విశ్వ కర్ణాటక (1921) తాయినాడు, జనవాణి (1934), సంయుక్త కర్ణాటక (1929), జ్వాలాముఖి, ఇన్‌క్విలాబ్ … ఇవన్నీ స్వాతంత్య్రానికి పూర్వపత్రికలు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పత్రికలలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజావాణి (1948) కన్నడప్రభ (1967) ఉదయవాణి (1970) ముంగారు, విశ్వవాణి, విజయకర్ణాటక, ఉషారాణి, సూర్యోదయం మొదలైన పత్రికలు విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని పొందడానికి వీలుగా ఉంటున్నాయి. సాహిత్యానికి పత్రికలు ఇంకా ఎక్కువ స్థాయిలో అవకాశం కల్పించి అనేక సాహిత్య విషయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మరుగవుతున్న జానపద కళారూపాలను సంరక్షించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం కూడా
ఉంది. కన్నడ పత్రికారంగంలో విశేషమైన సేవలందించిన మహిళల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సమాజాన్ని జాగృత పరచడానికి, చైతన్య పరచడానికి ఆసక్తి కనబరిచి అనేక చర్యలు చేపట్టారు కన్నడ మహిళలు. వారిలో తిరుమలాంబ, కళ్యాణమ్మ, ద్వారకామాయి, ఎం.ఆర్.లక్ష్మమ్మ, కె.వారిజాదేవి, బి.మోహినీదేవి, సరస్వతిబాయి, రాజవాడె, బి.కవాల్, కావేరియమ్మ, సరోజినీమహిషి, గౌరీలంకేష్ మొదలైన మహిళలు స్త్రీల కోసం పత్రికలు నడిపారు. ఆ కాలంనాటి స్త్రీ విద్యాభ్యాసం మహిళల అభివృద్ది కోసం పాటుబడిన వారిలో తిరుమలాంబ, కళ్యాణమ్మ, సరస్వతీబాయి పాత్రికేయులుగా, రచయిత్రులుగా ఎన్నో కష్టనష్టాలను చవిచూసి సాహిత్యానికి ప్రగతిపరమైన ఆలోచనలను కలిగించారు. వీరిలో ప్రముఖులు తిరుమలాంబ, కళ్యాణమ్మ, సరస్వతిబాయి, రాజవాడె ముఖ్యులు.
”తిరుమలాంబ” – ఇరవయ్యవ శతాబ్దం ఆరంభకాలంలో మొదటి కన్నడ లేఖకి, మరియు మొదటి పాత్రికేయురాలిగా ప్రసిద్ధి గాంచిన నంజనగూడు తిరుమలాంబ మొదటి సంపాదకురాలే కాకుండా మొదటి పత్రికోద్యమరాలు. వీరి సాధనాలు అపారం. 1887లో పుట్టిన తిరుమలాంబ మాతృభాష తమిళం. తిరుమలాంబ బాల విధవ. తన జీవితం అంధకారంలో ఉండేది. ఒక వృత్తంలో జీవిస్తుండేది. తనకు మిగిలిన ఒంటరితనాన్ని మరచిపోవడానికి సాహిత్య అధ్యయనం చేయడం ప్రారంభించింది. సతీహితైషిణి అనే గ్రంథాలయాన్ని స్థాపించింది. ఈమె 16 నవలలు, నాటకాలు, వ్యాసాలు మొదలైనవి వెలువరించారు. 1913లో స్త్రీల కోసం ‘కర్ణాటక నందిని’ అనే మాసపత్రికను స్థాపించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని చెబుతూ స్త్రీల అభ్యున్నతి కోసమే కర్ణాటక నందిని, సన్మార్గ నందిని అనే పత్రికలను నెలకొల్పారు. స్త్రీలకు సంబంధించిన విషయాలను మాత్రమే రాసేవారు. వారికోసమే ప్రత్యేక శీర్షికలను కేటాయించారు. చిన్న పిల్లల కోసం సన్మార్గదర్శి అనే పత్రికను ప్రచురించారు. వీరు పత్రికల ద్వారా మహిళలలో ఉండే అలసత్వం, ఉదాసీనతను వారి మనసులో నుండి తీసిపారేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పురుషుల నుండి ఎదురయ్యే దౌర్యన్యాలను ప్రతిఘటించారు. పురుషులు, స్త్రీలు పరస్పరం గౌరవంతో నడుచుకోవాలని, పురుషాహంకారంతో స్త్రీలను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆడపిల్లలకు మంచి ఆభరణాలకంటే మంచి విద్యాభ్యాసం ఇప్పించగలిగితే అదే చాలని తిరుమలాంబ వారి తల్లిదండ్రులకు హితబోధ చేశారు. ఇలా వందేళ్ళకంటే ముందే ఒక విధవగా ఉంటూ జీవన సమస్యలను ఎదిరిస్తూ ఆడవారికి విద్యే ఆస్తి అని నమ్మి తోటి స్త్రీలలో మనోధైర్యాన్ని నింపుతూ అత్యంత కష్టమైన పత్రికా రంగంలో ధైర్యంగా నిలవడం అనేది సాహసోపేతమైన విషయంగా చెప్పుకోవచ్చు. అనేకమంది రచయిత్రులను, వారి రచనలను ముద్రించి ప్రోత్సహించారు. కన్నడ ఆధునిక యుగంలో 1913లో మొట్టమొదటి నవల ‘సుశీల’ అంటారు. ఈమె నవలల్లో దాంపత్య జీవిత కష్టసుఖాలు, విద్యావంత స్త్రీల సమస్యలు మొదలైన విషయాలు చర్చించారు. ఈమెకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే ఆమె పేరిట తిరమలాంబ పురస్కారాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
”కల్యాణమ్మ” – తొమ్మిదేళ్ళకే వివాహం చేసుకొని విధవై ఏ మాత్రం డీలా పడకుండా ఆంగ్లం, సంస్కృతం, హిందీ, తెలుగు భాషలను నేర్చుకొని అనువాదం చేసే స్థాయికి ఎదిగారు కళ్యాణమ్మ. కథలు, నవలలు, నాటకాలు, ఆత్మచరిత్ర, వ్యాసాలు తదితర ప్రక్రియల్లో వారి సాహిత్య కృషిని కొనసాగించారు. ఆత్మాభిమానం, ప్రగతిశీల భావాలను కలిగిన కల్యాణమ్మ స్త్రీల విద్యాభివృద్ధికి, సమాజ ఉన్నతికి, మహిళల అభ్యున్నతికి చాలా పాటుపడ్డారు. 1913లో సరస్వతి అనే పత్రికను ప్రారంభించారు. బెంగాల్‌లోని స్వర్ణకుమారిదేవి భారతి పత్రికను నడిపినట్లు కళ్యాణమ్మ నడపాలనుకొంది. విద్యావంతులైన స్త్రీలు దేశాభ్యున్నతి కోసం తమ వంతు తోడ్పాటును అందించాలనే కోరికను కలిగిన కళ్యాణమ్మ స్త్రీల రచనలు ప్రోత్సహించారు. తన పత్రిక ఉద్దేశం కేవలం భాషాసేవ తప్పితే వేరే ఉద్దేశం కాదు. నష్టాలతో నడిచినా అతి తక్కువ ధరకే పత్రికను అందచేశారు. బొమ్మలు గీసేవారికి, కుట్టు యంత్రాల శిక్షణ, వంటలు నేర్పించడం వంటివన్నీ తన పత్రిక ద్వారా నేర్పించారు. రచయిత్రుల కథలు, వ్యాసాలు క్రమం తప్పకుండా ముద్రించేవారు. వీరు రాసే సంపాదకీయ వ్యాసాలు విలువైనవిగా ఉండేవి. స్త్రీల హక్కులు, స్త్రీల ఉద్యోగాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గృహిణుల కోసం కొంత సొమ్మును భద్రపరచడం, సమాజ సేవ, ఆరోగ్యం, రాట్నం ద్వారా బట్టలను నేయడం, దేశం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలను ప్రస్తావించడం వంటి ఉపయోగకరమైన విషయాలను ప్రచురిస్తుండేవారు. సాహిత్యం కోసమే ‘నమ్మనుడిగన్నడి’ అనే శీర్షికతో సాహిత్య సమ్మేళనాలను నెలకొల్పారు. మక్కల బావుటా అనే పత్రికను పిల్లల కోసం స్థాపించి వారిలో సాహిత్య తృష్ణను కలిగించారు. వారి ఆత్మవిశ్వాసం, స్త్రీలపట్ల ఉండే ఆసక్తి పత్రికా రంగానికే స్ఫూర్తి దాయకం. ఈమెను బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిగణించవచ్చు. విద్యావినోదిని అనేది ఆమె బిరుదు. ఆమె రచించిన బలిపీఠం, దేవనెల్లి అనే రచనలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
”సరస్వతిబాయి రాజవాడె” – మహిళల జాగృతి కోసం, సామాజిక మార్పు కోసం 1931 నుండి గిరిబాలె, విశాఖ, వీణాపాణి అనే కలం పేర్లతో చాలా పత్రికలకు రచించారు. కథ, నవల, వ్యాసం, అనువాదాలతో వారి సాహిత్య పరంపరను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళారు. అంతరంగ, నవయుగ, ఉషా, రాయబారి, నవభారత మొదలైన పత్రికలలో వారి రచనలు ముద్రితమయ్యాయి. ‘కథావళి’ అనే పత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించారు. నిసర్గ అనే పత్రికలో స్త్రీలకు కలిగే లైంగిక సమస్యలను నిర్భయంగా బహిర్గతం చేస్తూ తగిన శిక్షణ కూడా ఇచ్చారు. ఈ విషయంలో సంప్రదాయ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయినా నిర్భీతితో అవన్నీ ఎదురించారు. 1952లో సుప్రభాత అనే పత్రికను స్వంతంగా ప్రారంభించారు. ఇది కేవలం మహిళల సాహిత్యం కోసమే కేటాయించిన పత్రిక. చాలా సాహసంతో దాన్ని నడిపారు. ఎందుకంటే వీరికంటే ముందువారైన తిరుమలాంబ, కళ్యాణమ్మలు హెచ్చరిస్తూ వచ్చినా భయపడలేదు. ఆడవారి కోసమే వారిచేతే రాయించారు. ఆ దిశగా ఆమె విజయం కూడా సాధించారు. పత్రికలను పురుషులే నడపాలి, స్త్రీలకు చేతకాదు అనే అపవాదును తొలగించారు. శిరోముండనం, బాల్య వివాహాలు, పురుషుల అధిక పెళ్ళిళ్ళ గురించి సుప్రభాత పత్రికలో ప్రాముఖ్యతనిచ్చారు. జాత్యాహంకారం, లింగ అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించారు. కన్నడ పత్రికా రంగంలోను, కన్నడ సాహిత్య లోకంలోను ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు.
తొలితరం స్త్రీ పత్రికలన్నీ స్త్రీల అభివృద్ధిని ఆశించి వచ్చిన పత్రికలే. అయితే ఆశించిన మార్పు జరగలేదనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. అయినా నాటి మహిళలు చేసిన సాంస్కృతిక కృషి వల్లే ఈనాటి మహిళల పరిస్థితి ఎంతో మెరుగయ్యిందని చెప్పవచ్చు. మీడియా రంగంలో పనిచేసే మహిళల శాతం పెరిగినా పత్రికల ద్వారా సాహిత్య కృషి చేసే మహిళలు తగ్గుముఖం పడుతున్నారు. స్త్రీ అసలైన సమస్యలు వెలుగులోనికి రాకుండా పోతున్నాయి. అన్ని అవసరాలకు పురుషులకు గుర్తొచ్చే మహిళలు వారికి సమాన స్థాయి కల్పించే దగ్గరికి వచ్చేసరికి ఆమెమీద ఎన్నో వంకలు వెతుకుతారు. ఈ పరిస్థితిలో ఇంకా మనం మారాలి. మహిళకి ప్రజాస్వామ్యయుత జీవనానికి అవసరమయ్యే అన్ని సదుపాయాలు ఒనకూర్చాలి. మహిళల కోసం ఏదైనా చేయాల్సి ఉందా, అంటే చాలా ఉంది. ఏం చేయకపోయినా మగువను మనిషిగా బ్రతకనిస్తే అంతకు మించి ఆనందం, అభివృద్ధి మరొకటి ఉండదనేది నా అభిప్రాయం.