భారతదేశం మరో నైజీరియా అవుతుందా?-నరేష్కుమార్‌ సూఫీ

 

నైజీరియాలోని ఒగోనీ ప్రాంతపు చమురు నిక్షేపాలను తరలించటమే కాకుండా ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది రాయల్‌ డచ్‌ షెల్‌ కంపెనీ. అడవులు తగ్గిపోయి, గాలిలోకి వదిలిన రసాయనాల వల్ల కురిసే యాసిడ్‌ రెయిన్స్‌కీ, భూమిమీద పరుచుకునే చమురు పొరల ప్రభావం వల్ల నేల నేలంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ప్రభుత్వమే ఒక దళారీ వ్యవస్థగా మారిపోయి అంతర్జాతీయ కంపెనీలకు దేశ వనరులని అమ్ముకుంటూ ఆ దేశ పౌరులే సర్వనాశనం అవుతుంటూ చూస్తూ కూర్చుంది. (ఇప్పుడు మీకు భారతదేశపు గనులు, గ్రానైట్‌ తవ్వకాలూ, పెప్సీకోలాంటి కంపెనీలు గుర్తొస్తే నా తప్పు కాదు. ఆదివాసీ తెగల కాళ్ళకింద ఉన్న భూమినీ, అడవినీ తాకట్టు పెడుతున్న ప్రభుత్వాల విధానాలు గుర్తొస్తే కూడా నా తప్పు కాదు. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న స్థాయి పదవి అయిన ఒక్కొక్క ఎమ్మెల్యేకి అయిదేళ్ళలో వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అని ఆలోచించకుంటే మీ తప్పు).

ఆ సమయంలోనే నైజీరియా మీద ఆహార, నిర్మాణ రంగ, ఆయుధ వ్యాపార సంస్థల దాడి మొదలయింది. నెమ్మది నెమ్మదిగా బహుళ జాతి కంపెనీలన్నీ తమ అమ్మకాలని అక్కడ ప్రవేశపెట్టాయి. లోకల్‌ మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతింది. లివర్‌ బ్రదర్‌ (మన దేశంలోని హిందుస్థాన్‌ లివర్‌/ యునిలివర్‌.. ఇది బ్రిటిష్‌ కంపెనీ), క్యాడ్బరీ లాంటివి ఆహార నిత్యావసర వస్తువుల మార్కెట్‌ని ఆక్రమించాయి. బెర్గెర్‌ (ఫ్రెంచి నిర్మాణ రంగ కంపెనీ ఇది ‘బెర్గెర్‌ బైసన్‌ / బెర్గర్‌ పెయింట్స్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుతో మన దేశంలోనూ ఉంది), వికర్‌ (బ్రిటిష్‌ ఆయుధ ఉత్పత్తి సంస్థ) ఇవన్నీ నైజీరియాని తమ మార్కెట్‌ లక్ష్యంగా చేసుకున్నాయి. ఫలితం విపరీతమైన అవినీతి, కుంభకోణాలు. ఈ కుంభకోణాల ఫలితంగా 17 బ్యాంకులు దివాలా తీశాయి. నైజీరియా యవత డ్రగ్స్‌ వాడకం, అమ్మకం బాట పట్టారు. ప్రభుత్వం జీతాలివ్వలేదని పోలీసులే పౌరులని దోచుకున్నారు. (ఇక్కడ మీకు భారతదేశ భవిష్యత్‌ ఏమిటి? అన్న అనుమానం రాకుంటే నా తప్పే కాదు మీ అమాయకత్వానికి జాలి కూడా నాదే) నైజీరియా నిరుద్యోగం, ఆహార కొరతా లాంటి విపరీత సమస్యల్లో కూరుకుపోయింది.

చిన్నాభిన్నం అవుతున్న తన ప్రాంతం కోసం, తన ప్రజల కోసం జనాన్ని కూడగట్టి పోరాడిన కెన్‌ సారో వివాని అరెస్ట్‌ చేసి హత్య చేసింది నైజీరియా ప్రభుత్వం. (ఇప్పుడు కూడా మీకు జీఎన్‌ సాయిబాబా, వరవరరావు లాంటి వాళ్ళు గుర్తొచ్చినా పొరపాటు నాది కానే కాదు) ఎంతో విలువైన సహజ వనరులుండి కటిక దరిద్రంలో ”బంగారు గద్దె మీద కూచున్న గర్భ దరిద్రుడి”గా వర్ణించబడ్డ బొలీవియా లాగా ఇప్పుడీ దేశపు ఆదివాసీల ప్రాంతాలున్నాయి. లక్షల కోట్ల సహజ సంపద కోసం బహుళ జాతి కంపెనీలు భారత గడ్డమీద రాబందుల్లా వాలుతున్నాయి. ఇప్పుడు మనకూ కావాలి కెన్‌ సారో వివాలు. మన అడవులనీ, మనతోపాటే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరుగుతున్న ఆదివాసీలూ, గిరిజనులనీ కాపాడుకోవాల్సింది ఎవరు? మనం కాదా?

ఎలా? ఏ విధంగా మన దేశపు వనరుల దోపిడీని ఆపాలి? ఆసియాలోనే కూల్‌డ్రింక్స్‌, చిప్స్‌ ఇతర బేవరేజెస్‌ వాడకం పెరుగుతున్న దేశాల్లో మన దేశం కూడా ఉంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీ ఎలా ఆగేను? అందుకే ఒక్క కెన్‌ సారో వివా కోసం ఎదురుచూస్తూ ఉందామా? మనలోంచే వచ్చే వివాని నిద్ర లేపుదామా?

కెన్‌ను ఉరితీసే సమయంలో సాంకేతిక లోపం వల్ల అయిదుసార్లు మరణశిక్ష వాయిదా పడింది. ”ఏమిటీ క్రూరత్వం? ఇదేమి దేశం?” అని ప్రశ్నించాడట వివా. ఇదే ప్రశ్న మన జైళ్ళలో, మన అత్యున్నత న్యాయస్థానాల్లో ఎన్నిసార్లు వినబడి ఉంటుందో…!? ”నైజీరియా చేతిలో మోసపోయిన మనిషి, ఇతనికి సొంత దేశంలోనే ఆరడుగుల నేల లేకుండా చేశారు” అని తన సమాధిమీద రాయమని తాను ప్రభుత్వం చేతిలో హత్యకు గురవ్వటానికి ముందు చెప్పాడట.

(విరసం ‘కవి యోధుని చివరి డైరీ’ నుంచి)

మూలం: కెన్సారో వివా

అనువాదం: అఫ్సర్‌ మొహమ్మద్‌

నా రంగేమిటా అని పరీక్షించకు

నా మొహంలోకి కూడా నువ్వు చూడవద్దు

ఒక్క చావుతో

అంతమయ్యేవాడ్ని కాదు నేను

నేనొక తుఫాను

నీ జైళ్ళని ఒక్క ఊపు ఊపుతాను

నేను చావను

నా తలమీద ఆకాశం ఉంది

నా ఊపిరిలో పెను గాలులున్నాయి

నిజమే! నేను నల్లవాడ్నే

పుట్టకముందే చనిపోయే

జనం మధ్య పుట్టిన వాడ్నే

అయినా సరే నేనొక తుఫాను

నేను నల్లవాడ్నే

నా కంఠాన్ని మూసి వేసినప్పుడు

నీ చరిత్రంతా

నల్లబారి పోవాల్సిందే…

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.