బక్కి శీను మామిడాడ గ్రామంలోని పాటిమీద ఎస్సీ పేటలో నివాసముంటున్న ముప్ఫై రెండేళ్ళ వ్యవసాయ కూలీ. వ్యవసాయం పనులు లేనప్పుడు, గృహ నిర్మాణ పనీ, మట్టి మోసే పని, ఇలా ఎవరు ఏ పని ఇచ్చినా చేసేవాడని గ్రామస్తులు చెప్పారు. తన భార్య కుమారి (25), ఇద్దరు పిల్లలు సాత్విక్ (5), మహీధర్ (3)లతో కలిసి రెండు గదుల పెంకుటింట్లో ఉంటున్నాడు. అతనికి మందు కాదుకదా కనీసం కాఫీ, టీలు తాగే అలవాటు కూడా లేదనీ, అనవసర ఖర్చులు ఏమీ చేయకుండా, చాలా పొదుపుగా
ఉంటూ, పిల్లల్నిద్దరినీ కాన్వెంట్ స్కూల్‌లో చదివిస్తున్నాడనీ, అతని భార్య కుమారితో పాటు ఇతరులు కూడా చెప్పారు. మే నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు వేసవి సెలవులకు మామిడాడకు వచ్చిన కుమారి వాళ్ళ అన్నయ్య పిల్లలు ముగ్గురినీ వాళ్ళ ఇంట్లో దింపి రావడానికి సామర్లకోట దగ్గర ఉన్న వడ్లమూరుకు వెళ్ళాడు. ఉదయం 10:30 సమయంలో భార్యకు ఫోన్ చేసి తాను సామర్లకోట వరకూ వచ్చానని, మేక మాంసం తీసుకున్నానని, ఇంటికి వచ్చేవరకూ కూర వండొద్దని చెప్పాడు.
పన్నెండు గంటల సమయంలో, మామిడి కాయలు కోసినందుకు గాను, బక్కి శ్రీనుని అక్కడకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగంపల్లి పంచాయతీ ఆఫీసులో బంధించారని ఫోన్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి, ”పంచాయతీ ఆఫీసులో ఉంచి, పెద్దల్ని పిలవడానికి తాము బయటికి వెళ్తే, శ్రీను
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడ”ని తోట కౌలుదారులైన మిత్తన రామకృష్ణ, కడియాల నాగేశ్వరరావు చెబుతూ ఉన్నారు.
మృతదేహం మోకాళ్ళు నేలను తాకుతూ ఉండడం, ముఖం మీద బలమైన గాయాలు, పంచాయతీ ఆఫీసులో అక్కడక్కడా ఉన్న రక్తపు మరకలు చూసి ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని బంధువులు గొడవ చేశారు. అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయింది. అప్పటినుండి మొదలుపెట్టి, డబ్బులతో కేసు సెటిల్ చేయడానికి నిందితులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈలోపు మామిడాడ గ్రామం నుండి రెండు వందల మంది మాల, మాదిగలు సింగంపల్లి చేరుకుని పంచాయతీ ఆఫీసు బయట బైఠాయించి, మర్డర్ కేసు బుక్ చేసి, తోట కౌలుదారులతో పాటు, పంచాయతీ సిబ్బందిని కూడా అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
హత్య జరిగిన తర్వాత పన్నెండు గంటలపాటు, నిందితులకు సెటిల్మెంట్ చేసుకునే అవకాశమిచ్చి, అవేమీ వర్కవుట్ కాని పరిస్థితుల్లో, అర్థరాత్రి ఒంటిగంట తర్వాత ఎఫ్‌ఐఆర్ రాయించి, ఇద్దరు కౌలుదారులతో పాటు, ఎనిమిది మంది పంచాయతీ ఆఫీసు ఉద్యోగులపై కేసు బుక్ చేశారు.
మామిడి తోట కౌలుదారులు ఇద్దరూ బిసి శెట్టి బలిజ కులస్తులు, అగ్ర కులస్తులు ఎవరూ లేరనే తప్పుడు వార్త కొన్ని న్యూస్ పేపర్లలోనూ, ఫేస్‌బుక్ పోస్టుల్లోనూ సర్క్యులేట్ అయింది. అలా జరగడానికి కారణం ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్లు తప్పుగా ఎంటరవడం. మిత్తన రామకృష్ణ (కాపు కులస్థుడు), కడియాల నాగేశ్వరరావు (శెటట్టి బలిజ) మామిడితోట కౌలుదారులు కాగా, మిత్తన రామకృష్ణ స్థానంలో కడియాల రామకృష్ణ (శెట్టి బలిజ)ను కౌలుదారుడుగా రాశారు. తండ్రి పేరు మాత్రం బ్రాహ్మరాజు అనే ఉంచేశారు. నిజానికి బ్రాహ్మరాజు మిత్తన రామకృష్ణ తండ్రి.
అలాగే తోటలో గొడవ అయినపుడు, తగలరానిచోట దెబ్బ తగిలి బక్కి శ్రీను చనిపోతే, మృతదేహాన్ని పంచాయితీకి తీసుకువచ్చి ఉండొచ్చన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేశారు. బక్కి శ్రీనుని తోట నుండి ప్రాణంతోనే తీసుకు వచ్చి, పంచాయితీ ఆఫీసులో కూర్చోబెట్టినప్పటి ఫోటో పంచాయతీ గుమస్తా సెల్‌ఫోన్‌లో ఉంది. ఆ ఫోటోని పోలీసులు బక్కి శ్రీను కుటుంబసభ్యులకు, ఇతర గ్రామస్థులకు చూపించారు. దీని ఆధారంగా, అది పొరపాటున తగిలిన దెబ్బ వల్ల చనిపోవడం కాదనీ, తోట నుంచి తీసుకువచ్చి పంచాయతీ ఆఫీసులో కావాలనే చంపడం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
”పరిచయం లేని వ్యక్తి దళితుడని ఎలా తెలుస్తుంది?” అనేది ఇంకొక వాదన. నిందితుల్లో ఒకరైన పచ్చిపాల వీరబాబు సింగంపల్లి గ్రామంలోనే ఉంటున్న 40 ఏళ్ళ చెల్లే లక్ష్మి అనబడు మాల కులస్థురాలైన బక్కి శ్రీను దూరపు బంధువు వద్దకు వెళ్ళి, ”మామిడాడకు చెందిన మీ బంధువులబ్బాయి దొంగతనం చేస్తుంటే, పంచాయతీ ఆఫీసులో బంధించాం” అని చెప్పడం జరిగింది. బక్కి శ్రీను చుట్టాలెవరో తెలుసుకున్నారంటే, అతని కులం నిందితులకు ముందుగానే తెలుసు. ఆమె వచ్చి చూసేసరికి బక్కి శ్రీను వేలాడుతున్నాడు. పోలీసు రికార్డు ప్రకారం కూడా బక్కి శ్రీను మృతదేహాన్ని చూసిన మొదటి వ్యక్తి చెల్లే లక్ష్మి.
కులహత్య అంటే, ఎదుటి వ్యక్తి కేవలం దళితుడయిన కారణంగా చంపేస్తారని కాదు. హత్య జరగడానికి చాలా కారణాలుంటాయి. కానీ, కాయలు కోసిన వ్యక్తి దళితుడయితే, అతను తిరగబడితే, అగ్రకుల అహంకారం ఎక్కువ గాయపడుతుంది. అవే మామిడికాయలు ఏ రెడ్డి / కాపు / కమ్మ కులస్థులు కోస్తే మహా అయితే తిడతారు. అగ్ర కులస్థుడయినా బీదవాడయితే ఒకటి రెండు దెబ్బలు వేస్తారు కానీ, చంపేసేంత ధైర్యం ఎవరూ చేయరు. ఎందుకంటే, అగ్రకుల వ్యక్తి బీదవాడయినా, వాళ్ళ బంధువుల్లో ఉన్న స్థానిక నేతల సహాయంతోనో, ఇతర పరిచయాలతోనో ఎదురుదాడి చేస్తారన్న భయం
ఉంటుంది. ఇది కులహత్య అనడానికి రెండో కారణం పట్టపగలు పంచాయితీ ఆఫీసుని హత్య చేయడానికి వాడుకోవడం. అలా చేయగల అవకాశం, వెసులుబాటు ఆ ఊరి అగ్రకుల వ్యక్తులకు, వారి సహకారంతో ఇతరులకూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో హత్యచేసి మేనేజ్ చేయగలను అనుకోవడం వెనుక ఉన్నది కుల అహంకారమే.
ఎన్ని మామిడి కాయలు కోశాడు? కోశాడా, ఏరుకున్నాడా? అన్న విషయం స్పష్టంగా తెలీదు. ఆ సంఘటన సమయంలో ఉన్నది బక్కి శ్రీను మరియు నిందితులు మాత్రమే. వేరే సాక్షులు లేరు. బక్కి శ్రీను చనిపోయి ఉండడం వల్ల నిందితులు చెప్పేది నిజమా? కాదా అన్నది తెలీదు.
రెండు మామిడికాయలైనా, ఇరవై మామిడికాయలైనా, కిందపడినవి ఏరుకున్నా, దొంగిలించినా లేదా వేరే ఏ కారణం వల్లనైనా, తోటి మనిషి ప్రాణం తీయడం క్రూరం. హత్యను జస్టిఫై చేసే ప్రతి వాదనా అమానుషం.
”అది హత్య కాదేమో?” అన్న చిన్న డౌట్ ఎవరికైనా ఉంటే, దాన్ని చెరిపేస్తూ, పోస్టుమార్టం రిపోర్టు రెండు రోజుల క్రితమే వచ్చింది. ఎడమ కన్ను మొత్తం నలిగిపోయి, అంతర్గత రక్తస్రావమై నల్లగా అయిపోయింది. ఎడమ కనుబొమ్మ మీద ఎముకను తాకేంత పెద్ద గాయముంది. అదే స్థానంలో లోపలివైపు, బ్రెయిన్‌లో రక్తనాళాలు పగిలి గడ్డకట్టిన రక్తం (బ్రెయిన్ హేమరేజ్) ఉంది. ఊపిరితిత్తుల్లో చేరిన రక్తం, ముక్కుపుుటాల్లో రక్తం, ప్రేగులు కూడా కమిలిపోయాయి. మెడకు ఒక పక్క మూడు గోర్లు, రెండోవైపు ఒక గోరు పీకను బలంగా నులిమి చంపేశాయని సూచిస్తున్నాయి. మెడ చుట్టూ దుప్పటి బిగుసుకోవడం వల్ల ఏర్పడిన గాయాలు చనిపోయిన తర్వాత, శవానికి తగిలిన గాయాలు (పోస్టుమార్టం ఇంజురీస్) మాత్రమే అని, చనిపోవడానికి కారణం ఒళ్ళంతా తగిలిన దెబ్బలతో పాటు, శ్వాస ఆడకుండా పీక నొక్కడమని పోస్టుమార్టం రిపోర్టులో ధృవీకరించడం జరిగింది.
ఒక హత్య కులహత్య అని నిర్ధారణ జరిగితే, హత్య చేసిన కులం వారినందరినీ తప్పు పట్టినట్లు కాదు. అన్ని కులాల్లోనూ ఉన్న కుల అహంకారాన్నీ, కులవివక్షని సమర్ధించేవారిని తప్పు పట్టినట్లు. అందువలన ఇటువంటివి జరిగినప్పుడు పరిణతి చెందిన వ్యక్తులు, కులాల ఆధారంగా, మతాల ఆధారంగా విడిపోయి సొంత కుల, మతస్తులను సపోర్టు చేసుకోవడం మానేయాలి. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం వైపు నిలబడాలి. అసలు దోషులు తప్పించుకోకుండా, సంఘం మొత్తం సహకరించాలి. లేకుంటే, రేపెప్పుడో శ్రీను స్థానంలో నువ్వో, నేనో ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆలోచించడానికి ప్రాణమే ఉండదు.