భూమిక ఎడిటర్ గారికి,
ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎంతో హుందాగా, తన జీవితమే ఒక తెరిచిన పుస్తకంగా జీవించిన ఛాయాదేవి గారు, అందరికీ ఆదర్శవంతంగా ఉంటూ తనువు చాలించారు. వారిపట్ల సత్యవతక్క ప్రకటన కూడా చాలా ఆహ్వానించదగ్గదిగా ఉంది. ముఖ్యంగా ఎర్రబస్సు పరిచయాలను ఇంత సింపుల్గా చెప్పడంతో పాటు, ఒక సంపాదకీయ స్థానంలో ఉంటూ కూడా కలాన్ని చాలా జాగ్రత్తగా నడపించారు. అక్క నుండి ఆమె అనుభవాలను ముందు ముందు మరిన్ని తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను.
యురేనియం గురించి ఎవరైనా అడిగితే నా పరిధికి దాని గురించి ఏమీ తెల్వదని, నేను ఏమి చెప్పగలను అని అనేవాడిని. కానీ జయక్క అనువాద వ్యాసం చదివినప్పుడు ఆమె ఎదురుగా మాట్లాడినట్లు ఉండడంతోపాటు అనువాదకులకు ఒక దిశానిర్దేశం చేసినట్లు ఉంది. ఆమెకు యురేనియం బాధితుల తరపున ప్రతి ఒక్కరం రుణపడి ఉండాల్సిందే!
ఇక కవన భూమికను కదన రంగానికి సిద్ధం చేస్తున్న పద్ధతి చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మా భూమిక ఇంత ఉన్నతంగా కవన కువకువలు విన్పిస్తుందని నేను ఊహించలేదు.
ప్రణయ్ సంస్మరణలో నాకు మొదటినుంచి చివరివరకు కళ్ళనుండి నీరు కారుతూనే ఉంది. ఆ తర్వాత ఇన్ని రోజులకు ‘అమృత విలాపం’ చదువుతుంటే సాహితీవనంలో పూచే పువ్వులుగా మీరు ఎల్లవేళలా ఉదయస్తూ ఉంటారని మీరు వ్రాసిన నివాళి చేతులెత్తి నమస్కరించేలా హుందాగా ఉండి, ‘నిహాన్’ను నిజమైన ఖడ్గధారణవైపు తీసుకెళ్తారనే భరోసా మాకు కల్గింది. ఇంతటి చారిత్రాత్మక సంఘటనకు భూమిక వేదిక కావడం మా భరోసాను ఇంకా పదిరెట్లు పెంచింది.
చరిత్రను నడిపిస్తూ వస్తున్న వారి ఆధీనంలో చరిత్ర రచించబడుతూ వచ్చింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు చరిత్రలో పావులుగా మారుతున్న ప్రజలు కూడా తమవైపు నుంచి చరిత్ర రచన గావిస్తే అది ఎలా ఉంటుందో చూచాయగా పౌరాణిక పాత్రల ద్వారా మన కళ్ళకు కట్టే విధంగా మౌఖిక సాహిత్యాన్ని మనముందు ఉంచారు. అయితే నాకు ఆ వ్యాసం చదువుతున్నంతసేపూ డి.డి.కౌశాంబి, శైలజా బండారి వ్రాసిన ‘మన చరిత్ర – సంస్కృతి, భిన్నకోణాలు’, ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ పుస్తకాలు గుర్తుకు వచ్చాయి. ఆ పుస్తకాలను మరొక్కసారి విపులంగా చదవడానికి ప్రయత్నిస్తాను. భూమిక పాఠకులకు కూడా చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను.
చివరగా ‘పిల్లల భూమిక’ శీర్షికలో పెద్ద, చిన్న విషయాలకు తేడా లేదన్నట్లుగా పిల్లలు అంత అందంగా కవితలు అల్లుతున్నందుకు శుభాశీస్సులు.
– కలన, హైద్రాబాద్