శృంగార దేవత మార్లిన్‌ మన్రో -రొంపిచర్ల భార్గవి

మార్లిన్‌ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన చిత్ర చరిత్ర మీద చెరిగిపోని సంతకం మార్లిన్‌ మన్రో.

అలా అనిపించడానికి కారణాలు పసిపిల్లలా అమాయకంగా కవ్వించే ఆమె మొఖమా? సరైన కొలతలలో చేసిపెట్టిన బొమ్మలా ఉండే ఆమె శరీరాకృతా? రహస్యాలు చెబుతున్నట్లుగా పలికే ఆమె గొంతా? ఎంతటివారినైనా మంత్రముగ్ధులను చేసి కట్టిపడేసే ఆ నవ్వా? అని ఆలోచిస్తే వీటన్నింటినీ మించి తెలియని ఒక తీవ్రమైన ఆకర్షణ అనిపిస్తుంది.

1962లో చనిపోయే నాటికి ఆమెకు కేవలం 36 ఏళ్ళు. ఆమె చలన చిత్ర జీవితంలో యాక్టివ్‌గా ఉన్నది 1950 నుండి 1962 వరకూ అంటే కేవలం పన్నెండేళ్ళు. నటించింది సుమారు ముప్ఫయి చిత్రాలు. అయితే ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర 200 మిలియన్ల పైన వసూలు చేశాయి. అది మిగతా నటులందరికంటే ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ప్రజలు ఆమె తెరమీద కనపడితే చాలు వెర్రెక్కిపోయేవాళ్ళు. ఇరవయ్యో శతాబ్దంలో అత్యంత ప్రముఖ నటిగా పరిగణిస్తారు ఆమెను.

నటిగా ఆమె ఇంత ఉన్నత స్థాయికి రావడమనేది ఆమె చిన్ననాటి కల. దాన్ని సాకారం చేసుకోవడానికి ఆమె ఎన్నో కష్టనష్టాలు పడింది. చివరికి సాధించి విజేతగా నిలిచింది. ఇంకో రకంగా జీవితంలో చాలా కోల్పోయింది. ఒక సామాన్య మహిళకు కూడా దక్కే పిల్లాపాపలతో కూడిన భద్రమయిన గృహ జీవితం తనకు దక్కలేదనే బాధ ఆమెను జీవితాంతం వెంటాడింది.

ఇంకా తల్లిదండ్రుల ప్రేమ కరువైన విషాదకరమైన బాల్యం. బాల్యంలో ఆమె మీద జరిగిన అత్యాచారాలు కూడా ఆమె మీద చాలా ప్రభావం చూపాయి. ఆమెను మానసికంగా బలహీనురాలిని చేశాయి. ఆమెలో ఆందోళన, వత్తిడి, నైరాశ్యం, అభద్రతా గూడుకట్టుకుని ఉండేవి. వాటి నుండి బయటపడడానికి ఆమె మద్యానికి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడింది. పీడకల లాంటి తన గతాన్ని మరిపింపచేసే ప్రేమ కోసం జీవితాంతం వెతుక్కుంది. చివరికి తన అలవాట్లే తన అకాల మరణానికి కారణమయ్యాయి.

పరిశీలించి చూస్తే ఆమె జీవితమే ఒక సినిమా కథను తలపిస్తుంది.

మార్లిన్‌ మన్రో అసలు పేరు నార్మాజీన్‌. ఆమె 1926 జూన్‌ 1వ తేదీన అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో (హాలీవుడ్‌కి కొద్ది దూరంలో) జన్మించింది. తల్లి పేరు గ్లాడిస్‌ పెర్ల్‌, తండ్రి ఎవరన్నది కరెక్ట్‌గా తెలీదు. గ్లాడిస్‌ పెర్ల్‌ చలన చిత్రాలకు సంబంధించిన కంపెనీలో ఫిల్మ్‌ కట్టర్‌గా పనిచేస్తుండేది. ఆమెకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భర్తకు (జాన్‌ బేకర్‌) పుట్టిన ఇద్దరు పిల్లలనూ ఆయనే తీసుకొని వెళ్ళిపోయాడు. రెండో భర్త (మార్టెన్‌ సన్‌) పిల్లలు పుట్టకముందే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన కొంతకాలానికి గ్లాడిస్‌ పెర్గ్‌ నార్మాజీన్‌ని కన్నది. కొంతమంది ఆమెతోపాటు పనిచేసే ఛార్లెస్‌ స్టాన్లీ గిఫర్డ్‌ అనే ఆయన, నార్మాజీన్‌ తండ్రి అని చెబుతారు. అయితే రికార్డ్స్‌లో నార్మాజీన్‌ మార్టెన్‌ సన్‌ అన తన తల్లి రెండో భర్త పేరు రాసి ఉంది. మరికొన్ని చోట్ల నార్మాజీన్‌ బేకర్‌ అని ఆమె మొదటి భర్త పేరు కూడా చెబుతూ ఉండేది. అలా నార్మాజీన్‌ బేకర్‌ గానూ, నార్మాజీన్‌ మార్టిన్‌ సన్‌ గానూ కూడా వ్యవహరింపబడుతున్న ఆమె మార్లిన్‌ మన్రో ఎలా అయిందో తర్వాత చెప్పుకుందాం.

గ్లాడిస్‌ పెర్ల్‌ చేసే చిన్న ఉద్యోగంలో వచ్చే ఆదాయం తినడానికీ, ఉండడానికీ, పాపను పెంచడానికీ సరిపోయేది కాదు. పదమూడు రోజుల పాపను ఇరుగు పొరుగుకి అప్పచెప్పి ఉద్యోగానికి వెళ్ళేది.

రెండేళ్ళ పిల్లగా ఉన్నప్పటి నుండే ప్రభుత్వ వసతి గృహాల్లోనూ (ఫోస్టర్‌ హోమ్స్‌), అనాథాశ్రమాల్లోనూ, స్నేహితుల ఇళ్ళల్లోనూ పెరగవలసి వచ్చింది. సుమారు పన్నెండు ఫోస్టర్‌ హోమ్స్‌, ఒకటి, రెండు అనాథాశ్రమాలూ ఆశ్రయాన్నిచ్చాయి. ఆ ఫోస్టర్‌ హోమ్స్‌లో ఉన్నప్పుడూ, తల్లి స్నేహితుల ఇళ్ళల్లో ఉన్నప్పుడూ రెండు మూడు సార్లు ఆమె అత్యాచారానికి గురైంది. తన ఎనిమిదవ ఏట తల్లి తనతో తీసుకెళ్ళి తన దగ్గరే

ఉంచుకుంది. కానీ, ఉన్నట్టుండి ఆమె మానసిక అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరడంతో (పారనాయిడ్‌ షిజోఫ్రినియా) తల్లి స్నేహితురాలు గ్రేస్‌ మెకి అన్నామె నార్మాజీన్‌కి గార్డియన్‌గా బాధ్యత తీసుకుని ఆమెను కొంతకాలం అనాథాశ్రమంలో ఉంచింది. తర్వాత తనతో కొంతకాలమూ, బంధువుల ఇంట కొంత కాలమూ ఉంచింది.

ఆమె నార్మాజీన్‌ని బాగానే చూసుకునేది. సినిమాలకి తీసుకెళ్ళేది. జీన్‌ హార్లో లాగా నటించాలనేది. ఆ రోజుల్లో చూసిన సినిమాల్లోని హీరో క్లార్క్‌ గేబుల్‌ని చాలా ఇష్టపడేది నార్మాజీన్‌. అతన్ని తన తండ్రి స్థానంలో ఊహించుకుని మురిసిపోయేది. అలా ఆమెలో సినీ నటన పట్ల ఉత్సాహమూ, ఆకర్షణా ఏర్పడ్డాయి.

1942లో సరిగ్గా 16 ఏళ్ళ పద్దెనిమిది రోజులకు జూన్‌ 19న గ్రేస్‌ బంధువుల ఇంటి పక్కనుండే జిమ్‌ డొరోతిని వివాహం చేసుకుంది నార్మాజీన్‌. ఒకవేళ ఆ వివాహం జరిగి ఉండకపోతే మరొక అనాథాశ్రమానికి వెళ్ళవలసి వచ్చేది. ఒక రకంగా అది తప్పించుకోవడానికి ఆమె ఈ వివాహం చేసకున్నట్లు కనపడుతుంది. జిమ్‌ నేవీలో పనిచేస్తూ ఉండేవాడు. సంసారం హాయిగా సాగుతోంది. ఈలోగా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా షిప్‌ మీద సౌత్‌ పసిఫిక్‌ ద్వీపాలకు వెళ్లవలసి వచ్చింది అతను.

నార్మాజీన్‌ మార్లిన్‌ మన్రోగా మారిన వైనం…

జిమ్‌ డొరోతీ సౌత్‌ పసిఫిక్‌ ఐలాండ్స్‌కి షిప్‌లో యుద్ధం డ్యూటీ మీద (1944లో) వెళ్ళేదాకా నార్మాజీన్‌, జిమ్‌ డొరోతీల సంసారం అన్యోన్యంగా, హాయిగా సాగిపోతూ ఉండేది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టంగానే ఉండేది, ఏ పొరపొచ్చాలూ లేవు. అతను వెళ్ళాక నార్మాజీన్‌ అత్తగారింటికి వచ్చి అక్కడ రేడియో ప్లేన్‌ మ్యూనిషన్స్‌ ఫ్యాక్టరీలో పనిలో చేరింది. యుద్ధ విమానాల్లో పారాచూట్లు అమర్చే పనిలో సహాయపడుతూ ఉండేది.

అదే సమయంలో డేవిడ్‌ కొనోవర్‌ అనే ఫోటోగ్రాఫర్‌ ‘యాంక్‌’ అనే మాగజైన్‌ కోసం యుద్ధ సమయంలో ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళల ఫోటోలు తీస్తూ నార్మాజీన్‌ ఫోటో కూడా తీయడం, ఆమె ఫోటోజెనిక్‌గా ఉందని మెచ్చుకోవడమూ, కెమెరా సెన్స్‌ బాగుందని మోడల్‌గా ప్రయత్నిస్తే రాణిస్తావని సలహా ఇవ్వడమూ జరిగింది.

ఆ మాటలతో నార్మాజీన్‌లో నిద్రాణమైన కోరికలు చిగురించాయి. ఎలాగైనా మంచి మోడల్‌గా, సినీనటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. బ్లూ బుక్‌ ఏజెన్సీ అనే మోడలింగ్‌ ఏజెన్సీలో చేరి, మోడలింగ్‌ పాఠాలతో పాటు మేకప్‌ ఎలా చేసుకోవాలో, ఎలా నడవాలో, హెయిర్‌ స్టయిల్‌ ఎలా చేసుకోవాలో మొదలైన విషయాలలో కోచింగ్‌ తీసుకుంది. తన బ్రౌన్‌ హెయిర్‌ను బ్లీచింగ్‌ చేసుకుని బ్లాండ్‌ హెయిర్‌గా మార్చుకుంది. ఆ ఏజెన్సీ ద్వారా కొన్ని మ్యాగజైన్ల ముందు ముఖచిత్రాలకు ఫోజులిచ్చింది, చాలా కాలెండర్లకు కూడా మోడల్‌ గర్ల్‌గా ఉంది.

ఇదంతా గమనిస్తున్న అత్తగారు సహజంగానే మందలించారు. దాంతో తన భవిష్యత్తు గురించి వేరే బాటలు వేసుకుంటున్న నార్మాజీన్‌ అత్తగారింటి నుంచి బయటకు వచ్చి వేరే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ విడాకులకు అప్లయ్‌ చేసింది.

అదే సంవత్సరం 20్‌ష్ట్ర సెంచురీ ఫాక్స్‌ వాళ్ళ స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొన్న నార్మాజీన్‌ విజయవంతంగా సెలక్టయింది. ఆరు నెలల కాంట్రాక్ట్‌, వారానికి 75 డాలర్ల జీతం.

కొత్త టాలెంట్‌లని కనిపెట్టి అవకాశాలు కల్పించే ఏజెంట్‌ బెన్‌ లియాన్‌ ఆమె పేరు మార్చుకుంటే బాగుంటుందనే సలహాతో పాటు ‘మార్లిన్‌ మన్రో’ అని పెట్టుకుంటే బాగుంటుందని సూచించాడు. మన్రో అనే పేరు ఆమె అమ్మమ్మ తరపు నుండి వస్తే, మార్లిన్‌ అన్న పదం అప్పట్లో మార్లిన్‌ మిల్లర్‌ అనే నటి పేరు నుండి తీసుకున్నారు. అలా నార్మాజీన్‌ అప్పటినుండి ‘మార్లిన్‌ మన్రో’ అయింది. అయితే తనకు మాత్రం జీన్‌ అని పిలిపించుకోవడం ఇష్టమని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో.

చలన చిత్ర రంగంలో ప్రవేశించడం 1946లోనే అయినా, ఆమెకు సరైన అవకాశాలు రావడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. మొదట్లో చిన్న చిన్న రోల్స్‌లో బి గ్రేడ్‌ చిత్రాలలో అవకాశాలు వస్తూ ఉండేవి. ఇంతలో ఆరు నెలల కాంట్రాక్ట్‌ ముగిసింది. మళ్ళీ రెన్యువల్‌ చేయలేదు. అవకాశాలేమీ లేవు. అయితేనేం నిరుత్సాహపడకుండా, మోడలింగ్‌ చేసుకుంటూ, హాలీవుడ్‌లో జరిగే పార్టీలకు హాజరై ప్రముఖులతో పరిచయాలు పెంచుకునే క్రమంలో ఒకాయన పరిచయం వలన కొలంబియా పిక్చర్స్‌లో అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఒక ఆర్నెల్లు కాంట్రాక్ట్‌. ఆ సమయంలో ”లేడీస్‌ ఆఫ్‌ ది కోరస్‌” (1948) సినిమాలో పనిచేసేటప్పుడు, డైలాగ్‌లు కోచింగ్‌ ఇచ్చేటప్పుడు పరిచయమైన నటాషాని చాలాకాలం తనతోనే కోచ్‌గా ఉంచుకుంది. ఆమె వలన కొన్ని వివాదాలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది మార్లిన్‌ మన్రో. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

ఆర్నెల్ల తర్వాత కొలంబియా పిక్చర్స్‌ కాంట్రాక్ట్‌ అయిపోయాక బతుకు మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ మోడల్‌ గర్ల్‌గా పనిచేయడం, స్టూడియోల చుట్టూ తిరగడం, హాలీవుడ్‌ పార్టీలకు హాజరవడం… అదీ జీవితం.

అలాంటి సమయంలో ఒక న్యూ ఇయర్‌ పార్టీలో విలియమ్‌ మోరిస్‌ ఏజెన్సీలో పనిచేసే జానీ హైడ్‌ అనే మంచి పేరు ప్రతిష్టలున్న ఏజెంట్‌తో పరిచయమయింది. ఆయన మార్లిన్‌లో ఒక స్టార్‌ దాగుందనీ, సానపెడితే ఆమె వజ్రంలా మెరవగలదనీ విశ్వసించాడు. ఆమెను ఎంతో ప్రోత్సహించాడు. ఆయన ఇన్‌ఫ్లుయన్స్‌ వలన వచ్చిన సినిమా ”అస్ఫాల్ట్‌ జంగిల్‌” తోనే (1950 ఎం.జి.ఎం) మార్లిన్‌ జీవితంలో మంచి బ్రేక్‌ వచ్చింది. పిక్చర్‌ ఫీల్డ్‌లో ఆమెకొక గుర్తింపు వచ్చింది. ఆయన వల్లనే ట్వంటీయత్‌ సెంచురీ ఫాక్స్‌తో మళ్ళీ నటిగా కాంట్రాక్ట్‌ రాసుకుంది.

జానీ హైడ్‌ ఆమెకు అన్ని రకాలుగా గార్డియన్‌గా ఉండి రక్షణ కల్పించాడు. ముక్కుకు కాస్మటిక్‌ సర్జరీ చేయించి మరింత అందంగా తయారు చేయించడం, ఆమె వార్డ్‌ రోబ్‌ ఆధునికమైన దుస్తులతో ఉండేలా చూడడం, చిత్రసీమలో పెద్ద పెద్ద వారిని పరిచయం చేయడం, వీటన్నింటి వెనకా ఆయన పాత్ర ఉండేది. తాను పోతే ఆమె ఏమయిపోతుందోనని ఆయన ఆందోళన పడేవాడు.

అంతేకాదు తనను పెళ్ళాడమని మార్లిన్‌ను ఆయన పదే పదే అభ్యర్థించేవాడు. అయితే అది ఆమెకు ఇష్టంలేదు. ఒకవేళ ఆయనను చేసుకుని ఉంటే ఆమె చాలా ధనవంతురాలయి ఉండేది. విధి చిన్నచూపు చూసింది. ఇంకా మార్లిన్‌ సరిగ్గా చిత్రసీమలో నిలదొక్కుకోకుండానే హఠాత్తుగా, ఆమె శ్రేయోభిలాషి జానీ హైడ్‌ గుండెజబ్బుతో మరణించాడు (1950). మళ్ళీ ఒక్కసారిగా మార్లిన్‌ ఒంటరిగా మిగిలింది. అయినా ధైర్యంగా ముందుకు సాగడానికే నిశ్చయించుకుంది.

జానీ హైడ్‌ మరణం ఆమెని చాలా కృంగదీసింది. ఆయనను గాఢంగా ప్రేమించకపోయినా ఆయనంటే గాఢమైన అభిమానం ఉండేది. ఆయన పోయిన మరుక్షణమే ఆయన కుటుంబం మార్లిన్‌కి ఆయన ఇచ్చిన కానుకలన్నీ లాక్కొని ఆమెను బయటకి సాగనంపారు. కర్మకాండలన్నీ అయిపోయాక ఎన్ని కాల్స్‌ చేసినా, ఆయన కంపెనీలోని వారు స్పందించలేదు. ఒక పక్క స్టూడియో కాంట్రాక్ట్‌ సమయం అయిపోవస్తోంది. తన తరపున మాట్లాడి రెన్యూ చేయించేవాళ్ళెవరూ లేరు. ఇదివరకైతే జానీ హైడ్స్‌ అన్నీ చూసుకునేవాడు.

ఏది ఏమైనా ఈ ఫీల్డ్‌ను వదిలేది లేదు, అన్ని విషయాలూ తానే చూసుకోవాలని గట్టిగా నిశ్చయించుకొంది.

ఈ లోగా ఒక ఫిల్మ్‌ ఎగ్జిబిటర్‌ ఇచ్చిన డిన్నర్‌లో స్కిన్‌ టైట్‌ కాక్‌టెయిల్‌ డ్రెస్‌లో మిలమిలా మెరిసిపోతున్న మార్లిన్‌ను చూసిన ట్వంటీయత్‌ సెంచురీ ఫాక్స్‌ ప్రెసిడెంట్‌ వెంటనే కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ చేయడమే కాదు, తర్వాత ఏడేళ్ల వరకూ పొడిగించాడు కూడా.

ఇక్కడ కళాకారిణిగా మార్లిన్‌ మన్రో గురించి చెప్పాలంటే మొదట్లో తనకన్నీ ప్రాధాన్యత లేని పాత్రలూ, తన అందాన్ని ఆరబోసే పాత్రలే వస్తుండేవి. కానీ క్రమేణా నటనకు అవకాశమున్న పాత్రలు లభించాయి. ఆమె కూడా కేవలం అందమే కాదు తనలో నటనా ప్రతిభ కూడా దాగి ఉందని నిరూపించుకోవాలని తాపత్రయపడేది. అందుకోసమని తనకు పర్సనల్‌ కోచ్‌ను వెతుక్కుని తనతో పాటు స్టూడియోకి తెచ్చుకుని తను నటించే ప్రతి సీన్‌కీ ఆ కోచ్‌ ఆమోద ముద్ర తీసుకునేది. దీనివలన ఆమె నటన మెరుగుపడినప్పటికీ, కొన్ని వివాదాలూ, ఇబ్బందులూ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ముందు చెప్పుకున్నాం కదా ”లేడీస్‌ ఆఫ్‌ ది కోరస్‌”లో నటించేటప్పుడు పరిచయమైన నటాషా అనే కోచ్‌ని తన వ్యక్తిగత శిక్షకురాలిగా తనతో తెచ్చుకుందని. సెట్‌లో నటించేటప్పుడు ప్రతిసారీ టేక్‌ అయిపోగానే బాగా వచ్చిందా లేదా అని దర్శకుడిని అడిగే బదులు నటాషాని అడిగేది మార్లిన్‌. ఆమె ఒప్పుకుంటే సరే లేదంటే మళ్ళీ రీటేక్‌ అడిగేది. ఈ వ్యవహారమంతా దర్శకుడికీ, సహ నటీనటులకూ ఇబ్బందిగా పరిణమిస్తూ ఉండేది. అంతేకాదు ఆమె స్టూడియోకి సమయానికే వచ్చినా సెట్‌కి రావడానికి చాలా ఆలస్యం చేసేది. ఎందుకు ఈ ఆలస్యం అంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా చెయ్యాలనే తాపత్రయం, కెమెరా ముందుకు వెళ్ళాలంటే భయం, ఆందోళనా, అభద్రతా… వీటన్నింటినీ అధిగమించడానికి పదే పదే మేకప్‌ దిద్దుకుంటూ, కోచ్‌కి డైలాగులు అప్పచెబుతూ తాత్సారం చేసేది. సహనటీనటులకు, దర్శకుడికీ సహనానికి పరీక్ష పెట్టేది. చాలా విసిగిపోయేవారు. చివరికి సెట్లోకొచ్చాక డైలాగ్‌ లైన్లు మర్చిపోయేది. ఇదంతా ఆమె కావాలని చేసేది కాదు. ఆమెలోని కాంప్లెక్స్‌ వలన అలా జరుగుతూ ఉండేది. కెమెరా ముందుకు వచ్చేదాకానే ఈ గొడవంతా. ఒకసారి కెమెరా ముందుకొచ్చాక చాలా బాగా చేసేది. అనేకసార్లు ఆమె కోచ్‌ నటాషాకి, డైరెక్టర్లకి గొడవలు జరుగుతుండేవి. కానీ, ఆమె అదృష్టం పిక్చర్‌ పూర్తయ్యాక చూస్తే ఫలితం చాలాసార్లు తృప్తిగా వచ్చేది. పిక్చర్‌ హిట్టయ్యాక ఇవన్నీ మర్చిపోయేవాళ్ళు. అయితే విచిత్రంగా మోడల్‌ గర్ల్‌గా కెమెరాకి ఫోజులివ్వడానికి మాత్రం ఏ సంకోచమూ, బెరుకూ లేకుండా చాలా సహజంగా ఉండేది. నటించడానికి వచ్చినప్పుడే సమస్యంతా.

నటిగా తనను తాను మెరుగుపరచుకోవడానికి చివరి వరకూ కృషి చేస్తూనే ఉండేది. మార్లిన్‌ 1955 ప్రాంతాలలో న్యూయార్క్‌లోని యాక్టర్స్‌ స్టూడియో స్థాపించి నడుపుతున్న లీ స్ట్రాస్‌ బర్గ్‌ దగ్గర మెథడ్‌ యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆయన భార్య పౌలా స్ట్రాస్‌ బర్గ్‌ని నటాషా స్థానంలో తనకు కోచ్‌గా నియమించుకోవడమే కాక వారి కుటుంబంలో ఒక సభ్యురాలులాగా మెలుగుతూ ఉండేది. ఈ అనుబంధం ఆమె చనిపోయేవారకూ కొనసాగింది.

మొట్టమొదట నటించిన సినిమాలలో చిన్న చిన్న అప్రధాన పాత్రలలో నటించినప్పటికీ 1950లో ‘అస్ఫాల్ట్‌ జంగిల్‌’లో నటించినప్పటి నుంచీ క్రమేణా హాస్య ప్రధానమైన, శృంగార ప్రధానమైన పాత్రలు నటిస్తూ, 1953 ప్రాంతాలకొచ్చేటప్పటికి మంచి పాప్యులర్‌ నటి అయింది. తర్వాత నటనకు ప్రధానమైన పాత్రలను ఎన్నుకోవడంతో పాటు, తనకు నచ్చిన డైరెక్టర్లూ, నటులూ, స్ట్రిప్టూ

ఉండాలని షరతులు పెట్టే స్థాయికి ఎదిగింది.

ఆమె నటించిన అన్ని చిత్రాల గురించీ మాట్లాడుకోలేము కానీ ముఖ్యమైన చిత్రాలు చెప్పాలంటే…

లేడీస్‌ ఆఫ్‌ ది కోరస్‌, అస్ఫాల్ట్‌ జంగిల్‌, క్లాష్‌ బై నైట్‌, మంకీ బిజినెస్‌, నయాగరా, జంటిల్మన్‌ ప్రిఫర్‌ బ్లాండ్స్‌, వియ్‌ ఆర్‌ నాట్‌ మారీడ్‌, ప్రిన్స్‌ అండ్‌ ది షో గర్ల్‌, బస్‌ స్టాప్‌, సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌, సమ్‌ లైక్‌ ఇట్‌ హాట్‌, రివర్‌ ఆఫ్‌ నో రిటర్న్‌, హౌ టు మారీ ఎ మిలియనీర్‌, లెట్స్‌ మేక్‌ లవ్‌, మిస్‌ ఫిట్స్‌.

ఆమె ఆఖరి చిత్రం ”సమ్‌ థింగ్‌ గాట్‌ టు గివ్‌” పూర్తి కాకుండానే మరణించింది.

1950-52 ప్రాంతాలలో ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగింది. వారం వారం కొన్ని వేల ఉత్తరాలు వచ్చేవి. న్యూస్‌ పేపర్లూ, పత్రికలూ ఆమెను ”మిస్‌ ఛీజ్‌ కేక్‌” అని అభివర్ణించేవారు. అయితే స్టూడియోలో కొంత వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చేది. అదేంటంటే ఆమె తల్లీ తండ్రీ లేని అనాథ అని, సరైన కుటుంబ నేపథ్యం లేదనీ ఇలా కొంత ఆమెను చిన్న చూపు చూసేవారు. ఇది కూడా ఆమె కాంప్లెక్స్‌ ప్రవర్తనకు ఒక కారణం.

1952లో చిత్రాలలో మంచి పేరు సంపాదిస్తున్న సమయంలో, 1949లో ఆమె టామ్‌ కెల్లీ అనే ఫోటోగ్రాఫర్‌కు ఇచ్చిన న్యూడ్‌ ఫోటో కేలండర్‌ మీద ప్రింటయ్యి బయటకు వచ్చింది. పెట్రోల్‌ బంకుల్లోనూ, బార్బర్‌ షాపుల్లోనూ ఎక్కడ చూసినా ఇదే దర్శనమిచ్చేది. ప్రజలు గుర్తు పట్టారు. ఇక చలన చిత్ర నటిగా ఆమె ఛాప్టర్‌ క్లోజ్‌ అని సినీ పండితులు భావించారు. అప్పుడు మార్లిన్‌ తెలివిగా జర్నలిస్ట్‌ అలైవ్‌ మోస్బే అనే అతనికి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి ”కొన్ని డబ్బు ఇబ్బందులలో ఉండి అలా న్యూడ్‌ ఫోజిచ్చాను” అని చెప్పింది. దాంతో ప్రజల్లో అసహ్యం కలగకపోగా సానుభూతి పెరిగిపోయిందంట. ఆ క్యాలెండర్‌ చాలాసార్లు ప్రింటయ్యి దాదాపు నాలుగు మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయట!

అలాగే ఆమె తల్లీ తండ్రీ లేని అనాథ కాదు. తల్లి ఉంది ఫలానా పిచ్చాసుపత్రిలో అని ఎవరో జర్నలిస్ట్‌ కూపీ లాగినప్పుడు కూడా అవును నిజమే అని ఒప్పుకుంటూ తన తల్లికి కావలసిన వైద్య ఖర్చులు భరిస్తున్నట్లు నిజాయితీగా చెప్పడం వలన కూడా ప్రజలకు ఆమె మీద సానుభూతి ఎక్కువ అయింది. 1951 ప్రాంతాలలో తనకు నటిగా గుర్తింపు వస్తున్న సమయంలో తన తండ్రి అయ్యుంటాడని భావిస్తున్న స్టాన్లీ గిఫర్ట్‌ని కలవాలని ప్రయత్నించింది కానీ అతను కలవడానికి ఇష్టపడలేదు.

ఇలా న్యూడ్‌ క్యాలెండర్‌ గొడవ జరిగే సమయంలో (1952) ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైన పరిచయం ఒకటి జరిగింది. అది ప్రముఖ బేస్‌ బాల్‌ ఆటగాడు జో డిమాజ్జియోతో పరిచయం. ఆమెను గురించి విన్న ”జో” తనకీ, ఆమెకీ ఉన్న కామన్‌ ఫ్రెండ్స్‌ని ఆమెతో పరిచయం కల్పించమని అభ్యర్థించి పరిచయం చేసుకున్నాడు.

ఇక్కడ జో డీమాజ్జియో గురించి రెండు మాటలు… అతని తల్లిదండ్రులు ఇటాలియన్లు. అక్కడినుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఫిషర్‌మేన్‌. ఆయనకున్న ఏడుగురు పిల్లల్లో జో ఆరవ వాడు. అతడు చిన్నప్పటి నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, అన్న బేస్‌ బాల్‌ ఆడడం చూసి ఆ స్ఫూర్తితో ఆడడం మొదలుపెట్టి, దేశంలో అత్యున్నత బేస్‌ బాల్‌ ఆటగాడిగా ఎదిగాడు. ఆ ఆటలో అతను నెలకొల్పిన హిట్‌ స్ట్రీక్‌ రికార్డు ఇంతవరకూ ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు. అతను డొరోతీ ఆర్నాల్డ్‌ అనే చిన్న నటిని వివాహం చేసుకుని 1944లోనే విడాకులిచ్చేశాడు. అతనికి ఒక కొడుకు (జో జూనియర్‌).

అతడికి సినిమాల గురించి, సాహిత్యం గురించి ఏమీ తెలీదు. మార్లిన్‌కి బేస్‌బాల్‌లో ఓనమాలు తెలీవు. అయితేనేం ఇద్దరూ మొదటి రోజు నుండీ గాఢమైన ప్రేమలో పడ్డారు. మార్లిన్‌కు అంతకుముందు యూల్‌ బ్రిన్నర్‌లాంటి నటులతో అఫైర్‌ ఉన్నప్పటికీ అవి చాలా తాత్కాలికమైనవి. న్యూస్‌ పేపర్లన్నీ వీళ్ళ ప్రణయ కలాపాలను ప్రముఖంగా రాసేవి.

జో తన పట్ల బాధ్యతగానూ, రక్షణగానూ ఉండడం ఆమెకు నచ్చింది. కానీ, అతనితో పేచీ ఏమిటంటే ఆమెను ఇంకెవరైనా ఆరాధనగా చూస్తే అతను భరించలేడు. ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకుంటే అభ్యంతర పెడతాడు. అతన్ని పెళ్ళి చేసుకుని సినిమాలు మానేయమంటాడు. ఈ అభ్యంతరాల వలన ఆమె అతనెంత బతిమాలినా పెళ్ళికి ఒప్పుకోలేదు. చివరికి 1954లో ”రివర్‌ ఆఫ్‌ నో రిటర్న్‌”లో నటించడం అయిపోయాక, శాన్‌ఫ్రాన్సిస్కోలో అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు 1954 జనవరి 14న సిటీహాల్‌లో అతన్ని పెళ్ళాడింది.

హనీమూన్‌కి టోక్యోలో బేస్‌ బాల్‌ సీజన్‌కి అతనితో కలిసి వెళ్ళిన మార్లిన్‌ని చూడడానికే ఎక్కువ మంది కుతూహలం చూపించడంతో జో లో జెలసీ మొలకెత్తింది. కొరియన్‌ వార్‌ సోల్జర్స్‌ని చూడడానికి మార్లిన్‌ ఒక్కతే తాను రానన్నా వెళ్ళి రావడం, అక్కడ లక్షమంది సోల్జర్స్‌ని కలిసి వచ్చానని ఆనందంగా చెప్పడంతో అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది.

ఇదంతా ఒక ఎత్తు. బిల్లీ వైల్డర్‌ అనే ప్రఖ్యాత దర్శకుడి నేతృత్వంలో ‘సెవన్‌ ఇయర్‌ ఇచ్‌’లో స్కర్ట్‌ ఎగిరిపోయే సీన్‌, న్యూయార్క్‌ నడి బజారులో నాలుగువేల మంది జనం ముందు నటించడం ఒక ఎత్తు. సాధారణంగా షూటింగ్‌లకి రాని జో ఆ సీన్‌లో తన భార్య నటించడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి వారిద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధమే కాదు, అతను ఆమెమీద చేయి కూడా చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. వారి వివాహ జీవితం ఆ విధంగా బీటలు వారడం మొదలై, 1955లో అధికారికంగా విడాకులు మంజూరవడంతో ముగిసింది.

మార్లిన్‌ 1954 డిసెంబర్‌ నుండి ఒక సంవత్సరం పాటు న్యూయార్క్‌లోనే ఉండిపోయింది. ఆ సంవత్సరం కాలం అక్కడ ఆమె ఏమి చేసిందో? ప్రఖ్యాత రచయిత ఆర్థర్‌ మిల్లర్‌కీ ఆమెకీ గల సంబంధం ఏమిటి?

జో డీ మాజ్జియోతో పెళ్ళయిన తొమ్మిది నెలలకే విడాకులకు అప్లయ్‌ చేయాల్సి రావడం (1954 అక్టోబర్‌) మార్లిన్‌కి చాలా బాధ కలిగించింది. విడాకుల పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ప్రజలందరి దృష్టిలో ‘బంగారుజంట’గా పేరు పడిన వారి అనుబంధానికేమయింది అని ఎవరికి వారే చెవులు కొరుక్కోసాగారు. ‘వివాహమంటే దాంపత్య సౌఖ్యం లాంటి ప్రత్యేక సౌకర్యం పొందగలిగే వింతైన, నిలుపుకోవడానికి వీలుపడని ఒక స్నేహం, నాకు తెలిసి పెళ్ళిళ్ళన్నీ ఇలాంటివే’ అని వ్యాఖ్యానించింది మార్లిన్‌.

వారిద్దరూ విడిగా జీవించసాగారు. అయినప్పటికీ జో ఆమెను పదే పదే విడాకులు కాన్సిల్‌ చేసుకోమని బతిమాలాడు. తాను మారిపోతానన్నాడు. మద్యం వలనే ఇలా జరిగిందని, మద్యం ముట్టనని ప్రమాణం చేశాడు. అయినా మార్లిన్‌ కరగలేదు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి సుమారు సంవత్సరం సమయం పట్టింది. విడాకులైపోయిన తర్వాత కూడా మార్లిన్‌ ఎప్పుడు ఏ కష్టాల్లో ఉన్నా జో ఆమెను ఆదుకుంటూ తన విశ్వాసం చాటేవాడు. ఒక రకంగా అతని ప్రేమ కల్తీ లేనిదీ, నిఖార్సయినదీ అనిపిస్తుంది. ఆమె చివరి రోజుల్లో అతని ప్రవర్తన గురించి కూడా ముందు ముందు చెప్పుకుందాం.

ఈ లోగా స్టూడియో వారితో వివాదంలో ఇరుక్కుంది మార్లిన్‌. అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా తనకు తగినంత పారితోషికం లభించడం లేదన్న ఆలోచనలో ఉన్న ఆమె ‘సెవన్‌ ఇయర్‌ ఇచ్‌’ తర్వాత, వారి సినిమా షూటింగ్‌లకు వెళ్ళడం మానేసింది. 1954 డిసెంబర్‌లో హాలీవుడ్‌కి టాటా చెప్పి న్యూయార్క్‌కి మకాం మార్చింది. అక్కడ తనని ఫోటోలలో విభిన్నంగా ఆవిష్కరించి, తన అభిమానం చూరగొన్న మిల్టన్‌ గ్రీన్‌తో కలిసి ”మార్లిన్‌ మన్రో ప్రొడక్షన్స్‌” స్థాపించి సొంతంగా సినిమాలు తీయాలని సంకల్పించింది. కొన్నాళ్ళు హోటల్లోనూ, కొన్నాళ్ళు వారి కుటుంబంతోనూ కలిసి ఉంది.

న్యూయార్క్‌లో ఉన్న ఒక సంవత్సర కాలాన్నీ నటిగా తనను తాను తీర్చిదిద్దుకోవడానికి, లిటరరీ సమావేశాల్లో పాల్గొని తన సాహిత్యాభిరుచి పెంపొందించుకోవడానికి, నాటకాలను వీక్షించడానికి, థార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి వినియోగించింది.

న్యూయార్క్‌లో నటనకి తర్ఫీదునిచ్చే లీ స్ట్రాస్‌ బర్గ్‌ ”యాక్టర్స్‌ స్టూడియో”లో చేరింది. అక్కడ మెథడ్‌ యాక్టింగ్‌లో శిక్షణ పొందుతూ, నటనలో తనకున్న లోపాలను సరిదిద్దుకుని, ఒక వంక పెట్టలేని నటిగా తయారవ్వాలని శాయశక్తులా కృషి చేసే మార్లిన్‌ మన్రోని చూసి లీ స్ట్రాస్‌ బర్గ్‌ ఎంతో ముచ్చట పడ్డాడు. అప్పటికే పేరొందిన నటి ఒక విద్యార్థిగా అలా రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ శిక్షకురాలిగా పనిచేసే అతని భార్య పౌలా తర్వాత ఆమెకు నటాషా స్థానంలో పర్సనల్‌ కోచ్‌గా మారి 1956 నుండి ఆమె చనిపోయేవరకూ ఆమె పక్కనే నిలిచింది.

ఆర్థర్‌ మిల్లర్‌తో తన అనుబంధం…

ఆర్థర్‌ మిల్లర్‌, ఇరవయ్యో శతాబ్దంలో అత్యంత ప్రముఖుడిగా పేరొందిన నాటక కర్త. అతను యూదు మతానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులు పోలెండ్‌ నుండి వచ్చి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అతని ‘డెత్‌ ఆఫ్‌ ఎ స్లేవ్‌’ అనే నాటకానికి అత్యున్నతమైనదిగా పరిగణించే ‘పులిట్జర్‌ ప్రైజ్‌’ లభించింది.

1950లో హాలీవుడ్‌లో ఒకరికొకరు పరిచయమైన మార్లిన్‌, ఆర్థర్‌ మిల్లర్‌ ఇద్దరూ న్యూయార్క్‌లో లిటరరీ మీటింగ్స్‌లో తరచూ కలుస్తూ ఉండడంతో వారి పరిచయం మరింత బలపడింది. సహజంగానే పురుషులలో చదువూ, ధైర్యమూ, తెలివీ, జ్ఞానమూ చూసి ఇష్టపడే మార్లిన్‌ ఆర్థర్‌ మిల్లర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇంటా, బయటా తరచూ కలిసి కనిపించే వారిద్దరి గురించి న్యూస్‌ పేపర్లు కథలు కథలుగా రాశాయి.

ఆర్థర్‌ మిల్లర్‌ అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న వాడు. (మార్లిన్‌ ఆ ఇద్దరు పిల్లలతో చాలా కలివిడిగా ఉండేది, వాళ్ళు కూడా అంతే). భార్యాపిల్లలను వదులుకోదలచుకోలేదు అతను. మార్లిన్‌కి కూడా కుటుంబాన్ని విడదీసే ఉద్దేశ్యం లేదు కానీ కాలం గడిచేకొద్దీ మిల్లర్‌ విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది.

1956లో అతను మొదటి భార్యతో విడాకులు తీసుకుని మార్లిన్‌ని పెళ్ళాడాడు. ఆమె అతని కోసం యూదు మత నియమాలన్నీ పాటించేది. ఒక చక్కని గృహిణిగానూ, అతని పిల్లలకు తల్లిగానూ మారి అతన్ని సంతోష పెట్టాలనుకునేది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని మరొకసారి రుజువయ్యింది.

మార్లిన్‌ మన్రో ప్రొడక్షన్స్‌ తరపున ప్రఖ్యాత బ్రిటిష్‌ నటుడు లారెన్స్‌ ఒలీవియర్‌ రచనా, దర్శకత్వం నెరపుతుండగా, తాను హీరోయిన్‌గా ”ది ప్రిన్స్‌ అండ్‌ ది షో గర్ల్‌”లో నటించడానికి లండన్‌ బయలుదేరారు కొత్త దంపతులు మార్లిన్‌, మిల్లర్‌లిద్దరూ. అక్కడుండగానే ఆమెకు గర్భం వచ్చి కొద్ది వారాల్లోనే పోయింది. ఇది ఆమెను చాలా కృంగదీసింది. అతన్ని వివాహ బంధంలో నిలపడానికి అతనికి ఒక బిడ్డను కనడం అవసరం అనుకుంది. కానీ వరుసగా 1956, 57, 58 సంవత్సరాలలో మూడుసార్లు గర్భస్రావాలయ్యాక ఆమె ఆ ఆలోచనను విరమించుకుంది.

మార్లిన్‌ మన్రో ఆరోగ్యం గురించి…

ఆమె ఎండోమెట్రియాసిస్‌ అనే వ్యాధితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన కడుపు నొప్పితో పాటు, కడుపులో పేగులు అతుక్కుపోవడం, గర్భం రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం లాంటి సమస్యలొస్తాయి. అందుకే ఆమె ఈ సమస్య గురించి రెండుసార్లు ఆపరేషన్‌ చేయించుకుంది. ఒకసారి అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. మరోసారి ఎక్టోపిక్‌ ప్రగ్నెన్సీకి గురై ఆపరేషన్‌ చేయించుకుంది. రెండుసార్లు అబార్షన్లయ్యాయి. గాల్‌ బ్లాడర్‌కి ఆపరేషన్‌ అయింది. మధ్యమధ్యలో న్యుమోనియాతో రెండుసార్లు హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయింది. మత్తుబిళ్ళలు ఓవర్‌ డోస్‌ అయ్యి రెండు మూడు సార్లు ప్రాణాపాయం దాకా వెళ్ళి బయటపడింది. ఇన్ని అనారోగ్యాలతో పాటు, నిద్రలేమి వలన, నిద్ర పట్టడానికి టాబ్లెట్లూ, నిద్ర లేవడానికి టాబ్లెట్లూ మొత్తం శరీరం మందుల మీద ఆధారపడే స్థితికి చేరుకుంది.

మార్లిన్‌ మన్రో ప్రొడక్షన్స్‌ నుండి ”ప్రిన్స్‌ అండ్‌ షో గర్ల్‌” తర్వాత సినిమా రాలేదు. మిల్టన్‌ గ్రీన్‌తో అభిప్రాయ భేదాలు వచ్చి అతన్ని తొలగించింది మార్లిన్‌.

నెమ్మది నెమ్మదిగా మార్లిన్‌కీ, మిల్లర్‌కీ అభిప్రాయ భేదాలు తలెత్తసాగాయి. ఆమె అలవాట్లు, అభద్రతా, మూడ్‌ స్వింగ్స్‌ను అతను తట్టుకోలేకపోయేవాడు. అతను తగినంతగా తనను పట్టించుకోవడం లేదని ఆమె ఫీలయ్యేది.

ఇదిలా ఉండగా ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ స్టూడియో వారితో సంబంధాలు మెరుగుపడి, వారు ఆమె షరతులన్నీ ఒప్పుకోవడంతో మార్లిన్‌ ‘సెవన్‌ ఇయర్‌ ఇచ్‌’, ‘బస్టాప్‌’, ‘సమ్‌ లైక్‌ ఇట్‌ హాట్‌’, ‘లెట్స్‌ మేక్‌ లవ్‌’ చిత్రాలలో నటిస్తూ, న్యూయార్క్‌లోనే ఉండి, హాలీవుడ్‌కి వెళ్ళి వస్తూ ఉండేది.

1960లో ది మిస్‌ ఫిట్స్‌ అనే సినిమాకి మిల్లర్‌ కథ, స్క్రీన్‌ ప్లే సమకూర్చాడు. అందులో హీరోయిన్‌ పాత్ర మార్లిన్‌ కోసమే సృష్టించాడు. ఆ విధంగా తామిద్దరి మధ్యా బలహీనపడుతున్న అనుబంధాన్ని బలపరచాలనుకుంటే, తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దలేదని, కేవలం తన పేరు పెంచుకోవడం కోసమే అతనీ ప్రాజెక్టు చేపట్టాడనీ ఆమె అపార్థం చేసుకుంది.

”ది మిస్‌ ఫిట్స్‌”లో తన అభిమాన నటుడు క్లార్క్‌ గేబుల్‌తో నటించిందామె. పిక్చర్‌ పూర్తవడంతోనే క్లార్క్‌ గుండెపోటుతో మరణించాడు. (కొంతమంది దానికి కూడా మార్లిన్‌ మన్రోనే కారణమని, ఆమె షూటింగ్‌కి టైముకి రాకపోవడం, సహనటులతో సహకరించకోవడంతో అతనికి గుండె పోటు వచ్చిందనీ ఆరోపించారు. ఇది చాలా అర్థరహితమైన ఆరోపణ. హెవీ స్మోకర్‌ కావడమే అతని గుండెపోటుకి కారణం)

మిల్లర్‌ ఆ సినిమాకు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఇంగే మోరత్‌ అనే ఆమెతో అఫైర్‌లో పడ్డాడు. మార్లిన్‌, మిల్లర్‌ ఇద్దరూ వేర్వేరుగా జీవించసాగారు. పెళ్ళయిన అయిదేళ్ళకు 1961లో విడాకులైపోయాయి ఇద్దరికీ. ఆర్థర్‌ మిల్లర్‌ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఇదంతా ఆమెను మానసికంగా బాగా దెబ్బతీసింది. ఒక డాక్టర్‌ ఇచ్చిన తప్పుడు సలహాతో ఆమెను మానసిక రోగులున్న హాస్పిటల్‌లో చేర్చారు. చుట్టూ ఉన్న మానసిక రోగులను చూసి తన తల్లిలాగా అవుతానేమో అని భయపడింది. తనను బయటకు పంపమని ఏడ్చింది, ప్రాధేయపడింది.

అప్పుడు ఇదంతా తెలుసుకున్న జో డిమాజ్జియో ఆమెను బయటకు తీసుకువచ్చి న్యూరాలజీకి సంబంధించిన ఇంకో హాస్పిటల్‌లో చేర్చి బాగయ్యేంత వరకూ పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత తనతో పాటు ఫ్లోరిడా తీసుకువెళ్ళి కొంతకాలం విశ్రాంతి కల్పించాడు. 1961 జూన్‌లో గాల్‌ బ్లాడర్‌ సర్జరీ జరిగినప్పుడు కూడా జో తన పక్కనే ఉన్నాడు. ఆమెతో విడాకులయ్యాక అతను మద్యం మానేశాడు.

1961 ఆగస్టులో మార్లిన్‌ మన్రో హాలీవుడ్‌కి తిరిగి వచ్చి ‘సమ్‌ థింగ్‌ గాట్‌ టు గివ్‌’ అనే సినిమాలో నటించడం మొదలుపెట్టింది.

మార్లిన్‌ మన్రో తర్వాత జీవితం ఎలా గడిచింది? అమెరికా ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌. కెన్నెడీకీ, ఆమెకూ ఎలా పరిచయం అయింది? ఆమె జీవిత చరమాంకం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం…

తాను కన్న కలలన్నీ భగ్నం చేసిన న్యూయార్క్‌ నగరాన్ని వదిలి, తిరిగి 1961 వేసవిలో హాలీవుడ్‌ చేరిన మార్లిన్‌ మొట్టమొదట తను చిన్నతారగా జీవించిన చిన్న అపార్ట్‌మెంట్‌ (ణశీష్ట్రవఅవ ణతీఱఙవ) లోనే అడుగుపెట్టింది. సొంతగూటికి చేరుకున్న పక్షిలాగా ఫీలయ్యింది. పాత గాయాలను మాన్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తిరిగి హాలీవుడ్‌ శైలి జీవితం ప్రారంభమైంది. ఎడతెగని పార్టీలు, వాటిలో పీటర్‌ లాఫర్ట్‌ బీచ్‌ హౌస్‌లో జరిగే పార్టీలు ప్రత్యేకమైనవి. అనేకమంది సెలబ్రిటీలూ, రాజకీయ నాయకులూ, సినిమా ప్రముఖులూ హాజరవుతూ ఉంటారు. పీటర్‌ లాఫర్డ్‌ ఆమెకు చాలా కాలంగా తెలుసు. అతను ప్రముఖ నటుడు, డాన్సరూ అయిన ఫ్రాంక్‌ సినాత్రాకి స్నేహితుడు, ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌.కెన్నడీకి బావమరిదీ. అలా అక్కడ జరిగే పార్టీలలో పాల్గొన్నప్పుడే, జాన్‌ ఎఫ్‌.కెన్నడీ, అతని సోదరుడు రాబర్ట్‌ కెన్నడీ (బాబీ) మార్లిన్‌కి పరిచయమయ్యారు.

ప్రెసిడెంట్‌ కెన్నడీ కంటే అతని సోదరుడితోనే ఆమెకు ఎక్కువ అనుబంధం. (అదే ఆమె ప్రాణానికి ముప్పు తీసుకువచ్చిందని కొంతమంది అభిప్రాయం). అతను 1961 అక్టోబర్‌లో లాఫర్డ్‌ బీచ్‌ హౌస్‌ పార్టీలో పరిచయమైన దగ్గర్నుండి వారిద్దరి మధ్యా తీవ్రమైన అకర్షణ చోటుచేసుకుంది. అదే సంవత్సరం నవంబర్‌లో అక్కడ జరిగిన పార్టీకి ప్రెసిడెంట్‌ కెన్నడీ కూడా హాజరయ్యారు. ఆ పరిచయంతోనే ఆమె 1962 మే 19న జరిగిన ప్రెసిడెంట్‌ కెన్నెడీ జన్మదిన వేడుకలలో పాల్గొని బర్త్‌డే పాట పాడింది.

1962 లో మార్లిన్‌ తన మానసిక సమస్యల పరిష్కారం కోసం మానసిక వైద్యుడూ, మానసిక శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ రాల్ఫ్‌ గ్రీన్‌ సన్‌ని సంప్రదిస్తూ ఉండేది. ఆయన తన రంగంలో చాలా పేరున్న వాడు, ప్రముఖ సినీ తారలైన టోనీ కర్టిస్‌కీ, ఫ్రాంక్‌ సినాత్రాకీ, వివియన్‌ లీ కీ కూడా వైద్యసేవలందిస్తూ ఉండేవాడు.

మార్లిన్‌కీ, ఆ డాక్టర్‌ కుటుంబానికీ కూడా మంచి అనుబంధం ఉండేది. ఆమె చాలా తరచుగా ఆ డాక్టర్‌ని సంప్రదించడమూ, వారితో కలిసి భోజనం చేసి అక్కడే ఉండడమూ చేస్తూ ఉండేది. ఇది కొంతమంది విమర్శలకు కారణమైంది. ఒక పేషెంట్‌కి చికిత్సనందించేటప్పుడు తగినంత దూరం పాటించడం అవసరమనీ, వ్యక్తిగతంగా ఇన్వాల్వ్‌ అవడం తప్పనీ వారి వాదన.

అయితే ఆమె ఆ డాక్టర్‌ మీద పూర్తిగా ఆధారపడసాగింది. అతను కుదిర్చిన యూనిస్‌ ముర్రే అనే ఆమెని హౌస్‌ కీపర్‌గా కుదుర్చుకుంది. ఆమె చూసిపెట్టిన, డాక్టర్‌ ఇంటిని పోలిన మెక్సికన్‌ స్టైల్‌ ఇంటిని ఇష్టపడి కొనుక్కుంది. అదే ఆమె చివరి ఇల్లు. ఆ ఇంటికోసం ఫర్నిచర్‌ కొనడానికి మెక్సికో వెళ్ళి షాపింగ్‌ చేసుకుని వచ్చింది. కొత్త ఇల్లు, పరిసరాలూ ఆమెను కొంత సేదతీరుస్తున్నాయనుకునేంతలో ఇంకో అవాంతరం ఎదురు చూస్తోంది. షాపింగ్‌ నుండి తిరిగి రావడంతోనే ఆర్థర్‌ మిల్లర్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడన్న వార్త ఆమెను అతలాకుతలం చేసింది. భగ్నమయిన కలలన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. ఇంకేముంది మళ్ళీ మత్తు పానీయాలూ, మాదక ద్రవ్యాలలో మునిగిపోసాగింది.

హాలీవుడ్‌ తిరిగొచ్చాక నటిగా ఆమె కెరీర్‌ గురించి చూస్తే, అప్పటికి ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ స్టూడియో వారికి కాంట్రాక్ట్‌ ప్రకారం ఇంకా ఒక చిత్రం బాకీ ఉంది. 1960లో ”ది మిస్‌ ఫిట్స్‌” తర్వాత రెండు సంవత్సరాలు ఆమె ఖాళీగానే ఉంది. స్టూడియో వారికి తన పారితోషికం విషయంలోనూ, స్క్రిప్టూ, డైరెక్టరూ తదితర విషయాలలోనూ అంగీకారం కుదరక 1962 ఏప్రిల్‌ నెలలో కానీ, వారి చిత్రం మొదలవలేదు. (చిత్రం పేరు ”సమ్‌ థింగ్‌ గాట్‌ టు గివ్‌”). ఆ మాటకొస్తే స్టూడియో వారితో మార్లిన్‌ ఎప్పుడూ వివాదాల్లో పడుతూనే ఉండేది.

ఆమె సరిగ్గా షూటింగ్‌కి రాదనీ, ఒకవేళ వచ్చినా టేకులు మీద టేకులు తింటుందనీ, అందువలన సహనటులకి, దర్శకుడికి ఇబ్బంది కలుగుతుందని, ఇదంతా చివరకు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడానికి కారణమనీ వారి వాదన. తనకున్న ప్రజాదరణకి తగిన పారితోషికం చెల్లించడం లేదనీ, ఇతర నటుల కంటే తక్కువ చెల్లిస్తున్నారనీ, తనకి నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు ఇవ్వడం లేదనీ ఆమె వాదన.

ఇలాంటి సమస్యలతో వారు ఆమెను చాలాసార్లు సస్పెండ్‌ చేయడం, మళ్ళీ ఆమె చిత్రాలు సూపర్‌ హిట్‌లవుతుండడంతో మళ్ళీ రాజీ కుదుర్చుకోవడం… ఇలా జరుగుతుండేది.

సరే ”సమ్‌ థింగ్‌ గాట్‌ టు గివ్‌” సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ 1962లో మొదలయ్యేటప్పటికి మార్లిన్‌ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. జ్వరంతో బాధపడుతూ ఉండేది. అయినప్పటికీ పిక్చర్‌ డిలే అవుతుందనే ఉద్దేశ్యంతో క్రమం తప్పకుండా మే 17వ తేదీ వరకూ పాల్గొంది. ఆ రోజు బయలుదేరి న్యూయార్క్‌ వెళ్ళింది మే 19న జరిగే ప్రెసిడెంట్‌ కెన్నెడీ జన్మదిన వేడుకలలో పాల్గొనడానికి.

ఇలా షూటింగ్‌ మధ్యలో వెళ్ళడాన్ని స్టూడియో అభ్యంతరపెట్టింది. జూన్‌ ఫస్ట్‌న తన ముప్ఫయ్యారవ పుట్టిన రోజును సెట్స్‌లో జరుపుకుంది మార్లిన్‌. అదే ఆమె స్టూడియోలో గడిపిన చివరి రోజు, పబ్లిక్‌గా ఆమె ప్రజలకు కనపడడం కూడా అదే ఆఖరుసారి. జూన్‌ ఫస్ట్‌ నుండి ఎనిమిదవ తేదీ వరకు వారం రోజులు ఎదురు చూసిన ఆ స్టూడియో మార్లిన్‌ను ఆ ప్రాజెక్టు నుండి తొలగించినట్లు తెలిపింది. ఆమె ఏజెంట్‌ ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఒక వారంలో తిరిగి షూటింగ్‌కి వస్తుందని చెప్పినా వారు వినలేదు.

ఈలోగా ఒకటి, రెండు ఫోటో సెషన్స్‌ ”వోగ్‌” మాగజైన్‌ కోసం, ”కాస్మోపాలిటన్‌” మాగజైన్‌ కోసం జరిగాయి. రిఛర్డ్‌ మెరీమన్‌కి ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. అదే చివరిది.

జులై నెలలో స్టూడియో వారితో మళ్ళీ చర్చలు మొదలై ఫలప్రదమయ్యాయి. పారితోషికం రెండింతలు చేయడానికి ఒప్పుకోవడంతో పాటు, సినిమా షూటింగ్‌ని సెప్టెంబర్‌లో మొదలుపెడతామని చెప్పారు. 1962 జులై 20న మళ్ళీ ఎండోమెట్రియోసిస్‌ నివారణకు ఆపరేషన్‌ జరిగింది. ఆగస్ట్‌ ఒకటిన స్టూడియో ఆమె కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. ఆగస్ట్‌ మూడవ తేదీన ”లైఫ్‌” మ్యాగజైన్‌ మార్లిన్‌ ముఖచిత్రంతో వెలువడింది, అదే ఆఖరి చిత్రం. ఆగస్ట్‌ నాల్గవ తేదీన మధ్యాహ్నమంతా డాక్టర్‌ గ్రీన్సన్‌ మార్లిన్‌ ఇంట్లోనే గడిపాడు. ఏడు గంటలకు ఆమె లాఫర్డ్‌ ఇంటికి డిన్నర్‌కి వెళ్ళాల్సి ఉండడంతో ఆయన వెళ్ళిపోయాడు.

ఒక గంట తర్వాత మార్లిన్‌ రాక గురించి కనుక్కుందామని ఫోన్‌ చేసిన లాఫర్డ్‌కి ముద్దగా, అస్పష్టంగా ఉన్న ఆమె మాటల ధోరణి ఆందోళన కలిగించింది. ఆమె లాయర్‌ మిల్టన్‌ రూడిన్‌కి ఫోన్‌ చేశాడు. అతను ఆమె హౌస్‌ కీపర్‌ యూనిస్‌ ముర్రేకి ఫోన్‌ చేస్తే ఆమె మార్లిన్‌ బాగానే ఉందని చెప్పింది. ఆ రోజు తెల్లవారుజామున హౌస్‌ కీపర్‌కి ఏదో అనుమానమొచ్చి డాక్టర్‌ గ్రీన్సన్‌కి ఫోన్‌ చేసింది. వారిద్దరూ కలిసి తలుపు పగలగొట్టి చూస్తే బెడ్‌ మీద విగతజీవిగా మార్లిన్‌, చేతిలో ఇంకా వీడని టెలిఫోన్‌.

అటాప్సీలో ఎక్కువ మోతాదులో నెంబ్యుటాల్‌, క్లోరాల్‌ హైడ్రేట్‌ ఉన్నట్లు తేలింది.

రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మహత్య అంటే, కొంతమంది అది హత్యేనని కొన్ని రాజకీయ రహస్యాలు ఆమె బయటపెడుతుందనే భయంతో జరిగిన పెద్ద కుట్ర అని అన్నారు. ఇంకొంతమంది యాక్సిడెంటల్‌గా, అంటే తెలియకుండా ఎక్కువ మోతాదులో మాత్రలు మింగి

ఉంటుందన్నారు. అయితే చాలామంది ఏమన్నారంటే, ఆమె అంతకు ముందు ఒకటి, రెండుసార్లు ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడూ, యాక్సిడెంటల్‌గా ఎక్కువ మోతాదులో మందులు మింగినప్పుడూ సమయానికి చూసి చికిత్స చేయడం వలన బతికిందని, ఈ సారి చాలా ఆలస్యమయిందని.

వార్త తెలిసిన వెంటనే అక్కడ వాలిపోయి, కన్నీటితో ఆమెకు వీడ్కోలు ఏర్పాట్లు చేసిన వాడు జో డిమాజ్జియో. హాలీవుడ్‌కి చెందిన ఆమె స్నేహితులనెవ్వరినీ దగ్గరకు రానీయలేదు అతను. వారే ఆమె చనిపోవడానికి కారణమని ఆరోపించాడు కూడా. ఇది చాలా వ్యక్తిగతమైన వ్యవహారమనీ, వీలైనంత నిరాడంబరంగా జరపాలనీ నిర్ణయించి, ఆమె మేనేజర్‌ సహాయంతో నిర్వహించాడు. ప్రెస్‌నీ, ఫోటోగ్రాఫర్లనీ ఆమడ దూరంలో ఉంచాడు. ఆమె అంత్యక్రియలు వెస్ట్‌ వుడ్‌ మెమోరియల్‌ పార్క్‌ (లాస్‌ ఏంజెల్స్‌)లో జరిగాయి.

ఆమెకు ఎంతో సన్నిహితంగా ఉండే మేకప్‌ మెన్‌ వైటీ స్పైడర్‌, ఆమెకు చివరిసారి మేకప్‌చేసి వాళ్ళిద్దరి మధ్యా సరదాగా జరిగిన ఒప్పందం తీర్చుకున్నాడు. (అతనికంటే ముందు ఆమె పోతే చివరి మేకప్‌ అతనే చెయ్యాలన్నదే ఆ ఒప్పందం.)

జో కూడా ఆమెకు చేసిన ఒప్పందం ప్రకారం, ఆమె సమాధి మీద ఉంచడానికి ఒక ఎర్ర గులాబీని వారానికి రెండు సార్లు పంపేవాడు. అలా ఇరవై సంవత్సరాలు చేయడమే కాదు, అతను మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. ఎక్కడా మార్లిన్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా చలన చిత్ర ప్రపంచం ఆమెని మరిచిపోలేదు.

యు.కె.కి చెందిన ”అంపైర్‌” మాగజైన్‌ ఆమెను ఏ కాలానికైనా నిలబడే అత్యుత్తమ శృంగార తార అని పేర్కొంది.

ప్లేబాయ్‌ మాగజైన్‌ (ప్రారంభ సంచిక ముఖచిత్రం మార్లిన్‌ మన్రో) ఇరవయ్యో శతాబ్దపు అత్యుత్తమ శృంగార తార మార్లిన్‌ అని తేల్చింది.

1995లో అమెరికా ఆమె పేర ఒక పోస్టేజ్‌ స్టాంప్‌ రిలీజ్‌ చేసింది.

నాకు ఆమె జీవితం రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ని తలపిస్తుంది. ఒక అనాథ బాలికగా తల్లి ప్రేమకూ, తండ్రి ఆదరణకూ దూరమై ఫోస్టర్‌ హోమ్స్‌లో అత్యాచారాలకు గురై ఎంత వేదన పడిందో, తల్లి కోసం, తండ్రి కోసం ఎంత తపించిందో తలుచుకుంటే నాకు ఊహకు కూడా అందదు. ఒక భద్రమైన కుటుంబ జీవితమూ, ప్రేమించే భర్తా దొరికి సుఖపడే సమయంలో చిన్ననాడు ఆమె కన్న కలలు ఆమెను నిలువనివ్వలేదు. పట్టుదలతో సాధించి తన కలలు నిజం చేసుకుంది. ప్రముఖ నటిగా ప్రజాదరణ పొందింది.

దేశంలో అత్యుత్తమ క్రీడాకారుణ్ణి పెళ్ళాడింది, కానీ ఆంక్షల దాష్టీకం సహించలేక బయటకు వచ్చింది. అత్యుత్తమ నాటక రచయితనీ, ఇంటల్లెక్చువల్‌నీ పెళ్ళాడింది, తాను మొదట్లో వద్దని వదిలేసిన గృహ జీవితం అతనితో పొందాలనుకుంది. కానీ పొందలేకపోయింది.

దేశాన్నేలే ప్రెసిడెంట్‌తో సహా ఆమె సౌందర్యానికి సలాం అన్నారు. ఆమెతో అనుబంధం కోసం అర్రులు చాచిన ప్రముఖులలో యూల్‌ బ్రిన్నర్‌, మార్లన్‌ బ్రాండో, ఫ్రాంక్‌ సినాత్రా, యువన్‌ మోంటాండ్‌ మొదలైన వారున్నారు. చివరికి ఆమెకి మిగిలిందేమిటీ? ఇంట్లో ఆమె కోసం ఎదురుచూసే తనవారెవరూ లేరు. తన అని చెప్పుకునే ఏమీ మిగల్లేదు.

మార్లిన్‌ జీవితం ఆదర్శప్రాయం కాకపోవచ్చు కానీ నేర్చుకోవాల్సిన గుణపాఠాలున్నాయి ఆమె జీవితంలో.

ఆమె గురించి కొంతమంది ప్రముఖులు చెప్పిన మాటలు…

క్లార్క్‌ గేబుల్‌ (ప్రముఖ నటుడు) – మార్లిన్‌ మాట్లాడినా, నడిచినా, చివరకు నడుం తిప్పినా ఏం చేసినా మిగిలిన స్త్రీల కంటే విభిన్నంగా, వింతగా, ఉద్వేగంగా ఉంటుంది.

బిల్లీ వైల్డర్‌ (ప్రముఖ దర్శకుడు) – ఆమె చాలా గొప్ప నటి. ఇతరులు టైమ్‌కొచ్చి నటించిన దానికంటే మార్లిన్‌ లేటుగా రావడమే నయం.

బార్బర్‌ స్టాన్‌ విక్‌ – ఆమెకు క్రమశిక్షణ లేదు. చాలాసార్లు లేటవుతుంది. కానీ ఏదో తెలియని మాంత్రిక శక్తి ఆమెలో దాగుందని ఒక్కసారిగా ఆమెను చూడగానే తెలిసొస్తుంది.

శామ్‌ షా – ఆమె అభద్రతలు అందరికీ తెలుసు. కానీ ఎంత సరదాగా ఉంటుందో ఆమెతో. ఎవ్వరి గురించీ పల్లెత్తు మాట కూడా చెడుగా అనదు. మంచి హాస్యస్ఫూర్తి గల మనిషి.

ఇక ఆమె తన గురించి తాను అనుకున్న మాటలు…

”నాకు డబ్బంటే లెక్కలేదు. నేనొక అద్భుతంగా ఉండాలని ఆశిస్తాను”.

”నేను కాలెండర్ల మీద కనపడతాను కానీ సమయాన్ని తప్పించి”

”ఇక్కడ హాలీవుడ్‌లో ఒక నవ్వుకి వెయ్యి డాలర్లు, ఒక ఆత్మకి యాభై సెంట్లూ ఇస్తారు. అందుకే నేను మొదటి దాన్ని వదిలేసి, యాభై సెంట్లకి కుదురుకుంటాను”.

”నన్ను సెక్స్‌కి ప్రతీకగా ఒక వస్తువుగా చూస్తారు. నాకు వస్తువులంటే అసహ్యం. కానీ ఏదైనా ఒక విషయానికి ప్రతీకగా ఉండవలసి వస్తే ఇతర విషయాలకంటే సెక్స్‌కే ప్రతీకగా ఉండడం నయమనుకుంటాను”

”నేనే కనుక షరతులకి లోబడితే నేనెక్కడికీ చేరుకునేదాన్ని కాదు”

”కుక్కలెప్పుడూ కరవవు నన్ను మనుషులే కరిచేది”

అదీ మార్లిన్‌ అంటే!

ఆమె ఈ ప్రపంచాన్ని వీడి 48 ఏళ్ళయినా ఆమెను తలచుకునే వారుంటూనే ఉండడానికి కారణం, నటిగానూ, వ్యక్తిగానూ ఆమె నిజాయితీగా ఉండడమే అని కొంతమంది అంటారు.

అమాయకమైన పువ్వులాగా ఈ ప్రపంచంలోకి వచ్చి అందరినీ తన అందంతో అలరించి, కేవలం ముప్ఫయ్యారు సంవత్సరాలకే, ఆ అందం కరిగిపోక ముందే కనుమరుగయిన మార్లిన్‌ మన్రో, తన చిత్రాలు ఉన్నంత వరకూ చిరంజీవే.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.