తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్ 4, 5, 6
తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక రంగం గురించి, ఈ రంగంలో వస్తున్న మార్పుల గురించి, ఈ రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర చట్ట సభలు తప్పకుండా చర్చించాలి.
గ్రామీణ జనాభా:
2011 సామాజిక, ఆర్థిక కుల గణన నివేదిక (ూజుజజ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 56,43,739 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో భూమిలేని, తమ జీవిక కోసం రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాలు 19,42,889 ఉన్నాయి. మొత్తం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు 42,49,143 (75.29 శాతం) ఉన్నాయి. 2011 జనాభా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 31,51,389 మంది సాగుదారులుగా నమోదయ్యారు. సుమారు 59,15,151 మంది వ్యవసాయ కూలీలుగా నమోదయ్యారు.
కానీ, 2020-2021 రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో 53,60,000 మంది రైతులు, 59,15,000 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు (ణజుూ 2019-2020). గత పది సంవత్సరాలలో వ్యవసాయ కూలీల సంఖ్యలో మార్పు కనపడకపోయినా రైతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది (కనీసం 22 లక్షల మంది).
వాస్తవానికి గత పది సంవత్సరాలలో గ్రామీణ సన్న, చిన్నకారు రైతులు తమ భూములు కోల్పోయారు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నవాళ్ళు వ్యవసాయ మిగులు ఆదాయంతో పెద్దగా భూములు కొన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ భూ పంపిణీ పథకాల క్రింద కూడా లబ్దిదారుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉంది.
ఈ మధ్య కాలంలో వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఈ సంఖ్య పెరుగుదల దానినే సూచిస్తుందా? లేదా భూ కమతాలు గత పది సంవత్సరాలలో మరింత విభజనకు గురయ్యాయా? 2015-2016 భూ కమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 59,48,000 భూ కమతాలు ఉన్నాయి (2017-2018 స్టాటిస్టిక్స్) (2020-2021 వ్యవసాయ ప్రణాళిక నుండి).
సాగు భూమి:
రాష్ట్రంలో స్థూల సాగు భూమి 1,42,68,000 ఎకరాలుగా, నికర సాగు భూమి 1,15,15,000 ఎకరాలుగా 2020-2021 రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక ప్రకటించింది. ఇందులో స్థూలంగా సాగునీరు అందుబాటులో ఉన్న భూమి 77,37,000 ఎకరాలు (అంతకు ముందు 50,09,000 ఎకరాలు). నికరంగా సాగు నీరు అందుబాటులో ఉన్న భూమి 54,16,000 ఎకరాలు (అంతకుముందు 36,70,000 ఎకరాలు మాత్రమే). అంటే కొత్తగా నికరంగా 17,46,000 ఎకరాలకు సాగు నీరు అందిందన్నమాట. గత ఆరు సంవత్సరాలలో లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించి కాలువలు తవ్వి, చెరువులు బాగు చేయడం వల్ల ఈ విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.
వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో నికర సాగు భూమి 1,15,15,000 ఎకరాలు కాగా, వానాకాలం సగటు సాగు విస్తీర్ణం 1,03,47,715 ఎకరాలు మాత్రమే. కానీ ప్రభుత్వం సుదీర్ఘ చర్చల తర్వాత నియంత్రిత పంటల సాగు ద్వారా, 1,26,34,000 ఎకరాలలో పంటల సాగు చేయాలని ప్రణాళిక రూపొందించింది. దీనికి ఉద్యాన పంటల సాగు అదనం. ఇప్పటికే మీడియా కథనాల ప్రకారం 1,26,17,000 ఎకరాలలో పంటలు సాగయ్యాయి. పంటల సాగుకు ఈ అదనపు భూమి ఎక్కడినుండి అందుబాటులోకి వచ్చిందో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి.
ఈ వివరాలను ఇంత వివరంగా ప్రస్తావించడానికి కారణం, ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పారదర్శకంగా లేవు. ప్రభుత్వం ప్రకటించే ఒక నివేదికకు, మరో నివేదికకు పొంతన లేదు. పైగా సర్వే నంబర్ వారీగా వాస్తవ సాగు దారులను గుర్తించే ప్రక్రియ లేదు. ప్రకటించిన అంకెలకు ప్రభుత్వం బాధ్యత వహించే పరిస్థితి లేదు.
గ్రామీణ ప్రాంతానికి, వ్యవసాయ రంగానికి ఒక సమగ్ర విధానం లేకపోవడం:
తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య – రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు గ్రామీణ, అటవీ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగం కోసం సమగ్ర విధానం లేకపోవడం. ఈ విధానం ప్రధానంగా నాలుగు అంశాలను కలిగి ఉండాలని చాలా కాలంగా రైతు సంఘాలు అడుగుతున్నాయి.
1. గ్రామీణ వనరులపై, అటవీ వనరులపై స్థానిక ప్రజలకు హక్కులు ఉండేలా చూడడం
2. గ్రామీణ వ్యవసాయం, ఇతర ఉత్పత్తులు పర్యావరణ హితమై ఉండడం.
3. గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా యువతీ యువకులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించడం.
4. గ్రామీణ రైతు, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆదాయ భద్రత లభించడం.
లక్ష్యంగా ఈ విధానం రూపొందాలని అడుగుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ అటువైపు దృష్టి సారించడం లేదు. కేవలం కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం, నియంత్రిత పంటల సాగు పేరుతో పంటల ప్రణాళిక ప్రకటించడం తప్ప, సమగ్ర చర్చ లేదు, విధానం లేదు.
గ్రామీణ సాగు భూములు రకరకాల పేర్లతో తగ్గిపోతున్నా, వ్యవసాయంలో అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం పెరుగుతున్నా, పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూ, ఆదాయాలు తగ్గిపోయి గ్రామీణ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తగ్గి, వలసలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పెద్ద రైతులు, పరోక్ష భూస్వాములు లబ్ది పొందేలా భూ రికార్డుల ప్రక్షాళన చేయడం, భూమి స్వంత దారులకే రైతు బంధు, రైతు భీమా అమలు చేయడం, కౌలు రైతులను, పోడు రైతులను గుర్తించకుండా నిరంకుశంగా వ్యవహరించడం, సాగు నీరు ప్రాజెక్టులు పూర్తయితే చాలు, అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయని భ్రమలు పెంచడం గమనిస్తున్నాం.
రైతు బంధు ఒక్కటే తారకమంత్రంగా వల్లిస్తూ, రుణమాఫీ హామీ ఒకే దఫాగా అమలు చేయకపోవడం, రైతులకు ఇచ్చే పంట రుణాలపై వడ్డీ రాయితీని అమలు చేయకపోవడం, పంటల బీమా పథకాలను పూర్తిగా రద్దు చేయడం, ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలపై బోనస్ ఇవ్వడానికి ప్రయత్నించకపోవడం, వ్యవసాయ, ఉద్యాన శాఖల సబ్సిడీ పథకాలకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం, ముఖ్యంగా ఎస్.సి, ఎస్.టి సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవడం మనం చూస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం 1973 భూ సంస్కరణల చట్టాన్ని, 2011 కౌలు రైతుల చట్టాన్ని అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమీషన్‌ను స్వతంత్రంగా పని చేయనీవడంలేదు. భూములను సేకరించే సమయంలో 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయంలో సకాలంలో గ్రామస్థాయి వివరాల సేకరణ కానీ, కరువు మండలాలను ప్రకటించడం కానీ చేయడం లేదు. చట్టబద్ధంగా ఏర్పడిన రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు రూపొందించకుండా, కేవలం టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులతో ఏర్పడిన రైతు బంధు కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చి, గ్రామీణ ప్రాంత కార్యక్రమాలను నిర్వహించడం కూడా అధికార పార్టీ ప్రాధాన్యతను తెలియచేస్తోంది.
గ్రామీణ సమాజంలో ఉన్న వివిధ రైతు సమూహాల ప్రత్యేక సమస్యలు :
కౌలు రైతులు :
కౌలు రైతుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన 2011 భూ అధీకృత సాగు దారుల చట్టం అమలు కావడం లేదు. ప్రతి సంవత్సరం సీజన్‌లో సాగించే పంట సాగుదారుల నమోదులో కూడా వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతుల పేర్లను ఆ సర్వే నంబర్‌లో నమోదు చేయకుండా, సాగు చేయని భూ యజమానుల పేర్లే నమోదు చేస్తున్నారు. కౌలు రైతులకు ఈ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వారికి వ్యవసాయ పరంగా, పథకాల పరంగా ఎటువంటి సహాయమూ అందడం లేదు. నీతి ఆయోగ్ రాష్ట్రంలో 13 శాతం కౌలు రైతులు ఉంటారని అంచనా వేసింది. 2012-2013లో వ్యవసాయ శాఖ కూడా కనీసం 12 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కౌలు రైతులు, వారి పక్షాన రైతు సంఘాలు గత ఆరు సంవత్సరాలుగా ఘోష పెట్టినా ప్రభుత్వం కౌలు రైతులకు న్యాయం చేయడానికి పూనుకోవడం లేదు.
ఆదివాసీ రైతులు :
ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఆదివాసీ రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వారికి రైతు బంధు సహాయం అందడం లేదు. వారికి పంట రుణాలు అందడం లేదు. సబ్సిడీ పథకాలు అందడం లేదు. గిరిజన సహకార సంఘం (+జజ) పనితీరు కూడా ఆదివాసీలకు ప్రోత్సాహకరంగా లేదు. చీుఖీూ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల నిర్ణయం, ఆయా ఉత్పత్తుల సేకరణ కూడా సక్రమంగా లేదు. ఫలితంగా ఆదివాసీ రైతులు, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ దారులు దళారుల చేతుల్లో మోసపోతున్నారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో డిజిటల్ కాటాలను కూడా వినియోగించక పోవడం వల్ల తూకంలో కూడా నష్టపోతున్నారు.
దళిత రైతులు :
దళిత సామాజిక వర్గానికి చెందిన రైతులలో అత్యధికులకు చాలా చిన్న కమతాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి చెందిన సబ్సిడీ పథకాలు వీరికి ఎక్కువ అందడం లేదు. రైతు బంధు సహాయం కూడా వీరి కమతం విస్తీర్ణం రీత్యా తక్కువే అందుతున్నది. పైగా అసైన్డ్ భూములు పొందిన దళిత రైతులకు చాలా జిల్లాలలో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. సంస్థాగత పెట్టుబడి అందక, సాగుపై వచ్చే ఆదాయం సరిపోక, వీరిలో అత్యధికులు కూలిపై ఎక్కువ ఆధారపడుతున్నారు. ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం క్రింద భూమి పంపిణీ చేసినా, మొదటి సంవత్సరం ఆ భూమిలో వ్యవసాయం చేయడానికి అందించాల్సిన సహాయం అందరికీ అందడం లేదు. పైగా అసైన్డ్ భూములను ప్రభుత్వం వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో తిరిగి గుంజుకుంటున్నది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయినా, ఆ కుటుంబాల ఆదాయం మాత్రం పడిపోయింది. ఇప్పటికే చాలా అసైన్డ్ భూములు దళిత కుటుంబాల చేతుల నుండి జారిపోయాయి. పై కారణంగా మెజారిటీ కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నాయి.
మహిళా రైతులు :
గ్రామీణ వ్యవసాయంలో, పశుపోషణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలకు ప్రభుత్వం రైతులుగా గుర్తింపు ఇవ్వడం లేదు. భూమి తమ పేరున ఉన్న మహిళలు తప్ప కౌలు, ఒంటరి మహిళా రైతులు ఈ గుర్తింపు పొందడం లేదు. పైగా మహిళా రైతులకు ఎటువంటి విస్తరణ సేవలు అందడం లేదు. వారికి ప్రత్యేక శిక్షణ అందడం లేదు. వారికి బ్యాంకు రుణాలు, సబ్సిడీ పథకాలు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినా, జెండర్ సెల్, జెండర్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (ూజు=ూ) రాష్ట్రంలో మహిళా రైతులతో కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించింది. ఈ ఖీూూ లను బెనిషాన్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫెడరేషన్) గా రిజిస్టర్ చేసింది. ఈ రైతు సహకార సంఘాల నుండి ప్రతిరోజూ కూరగాయలను, పండ్లను సేకరించి హైదరాబాద్‌లో మార్కెట్ చేస్తోంది. ఈ సంఘాలలో ఉన్న మహిళా రైతులతో సేంద్రీయ వ్యవసాయం చేయించడానికి శిక్షణలు ఇప్పించింది. అర ఎకరంలో సంవత్సరం పొడవునా కూరగాయల సాగు పథకం అమలు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో మహిళా ఎఫ్‌పిఓ ఆధ్వర్యంలో చిన్న యంత్రాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. సెర్ప్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక మేరకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
వ్యవసాయ కూలీలు :
రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళా కూలీలు. వీరికి సంవత్సరం పొడవునా వ్యవసాయంలో పని దొరికే పరిస్థితి లేదు. ఎటువంటి సాంఘిక భద్రతా పథకాలు అమలు కావడం లేదు. ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉపాధి అవకాశాలను కల్పించే వీ+చీ=జు+ూ పథకం సరిగ్గా అమలు కావడం లేదు. చట్టం ప్రకారం 100 రోజుల పని దొరుకుతున్న కుటుంబాలు పది శాతం కూడా ఉండడం లేదు. పైగా చేసిన పనికి వెంటనే వేతనాలు అందడం లేదు. రాష్ట్ర కనీస వేతనాల కంటే ఈ పథకంలో వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఈ కూలీలలో ఎక్కువ మందికి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఫలితంగా వ్యవసాయ కూలీ కుటుంబాల సభ్యులు అనారోగ్యానికి గురయినప్పుడు ఆ కుటుంబాలు సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. పంటల ఉత్పత్తి పద్ధతుల వల్ల, విష రసాయనాలతో అనేక మంది వ్యవసాయ కూలీలు ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. ఆర్థిక సంక్షోభానికి గురవడం వల్ల అనేక మంది కూలీలు ప్రతి సంవత్సరం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
నియంత్రిత పంటల సాగు – సమస్యలు :
ఏ రాష్ట్రంలోనైనా, ఏ వాతావరణ ఆధారిత జోన్‌లో అయినా ఆయా ప్రాంతాలకు అనుగుణమైన పంటలు వేయాలి. కానీ ప్రభుత్వం ఇక్కడి భూములను, వాతావరణాన్ని, రాష్ట్ర అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం 3-4 పంటలకే ప్రాధాన్యత ఇస్తూ పంటల ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. ఇది మొత్తం పంటల పొందికను నాశనం చేయడమే కాక, ఆర్థిక, పర్యావరణ సమస్యలను సృష్టిస్తుంది.
పంట రుణాలు – పంటల భీమా :
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఋణ మాఫీ హామీని రెండుసార్లు కూడా సరిగ్గా అమలు చేయలేదు. విడతల వారీగా ఋణమాఫీ అమలు చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం పడుతోంది. పైగా సంస్థాగత రుణ వ్యవస్థ పూర్తిగా అడుగంటిపోయింది. ఫలితంగా రైతులకు సకాలంలో పంట రుణాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు రుణాల ఊబిలో కూరుకు పోతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న దశలో ఏ రాష్ట్రమైనా పంటల భీమా పథకాలు అమలు చేయాలి. కానీ గత సంత్సరాలలో కూడా రాష్ట్రంలో ఈ భీమా పథకాలు సరిగ్గా అమలు కాలేదు. ఎక్కువ మంది రైతులకు లాభం జరగలేదు. ఈ సంవత్సరం ఈ పథకాలు అసలు పూర్తిగా అమలులోనే లేవు. ఆగస్టులో కురిసిన వర్షాలకు వేలాది మంది రైతులు పంటలు నష్టపోయారు. కానీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో నష్టపోయిన రైతుల, పంటల నివేదికలు తయారు చేయకపోతే ఈ రైతులకు ఏ పరిహారం అందదు.
రైతు బంధు :
రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. రైతులకు పెట్టుబడి సమకూర్చడంలో ఇటువంటి పథకాలు ఒక మేరకు ఉపయోగపడినా, ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు సన్న, చిన్న కారు రైతులకు పెద్దగా ఉపయోగ పడడం లేదు. వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులు, పోడు రైతులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న కౌలు రైతులు, భూ రికార్డులు సరిగ్గా లేని చిన్న రైతులు, సాదా బైనామా రైతులు, భూమిపై హక్కులు లేని ఒంటరి మహిళా రైతులు, ప్రభుత్వ భూ సేకరణలో భూములు కోల్పోయి ఇంకా నష్టపరిహారం అందుకోని రైతులు, హై టెన్షన్ వైర్లకు, కాలువల కోసం భూములు ఇచ్చిన రైతులు రైతుబంధు డబ్బులు అందక నష్టపోతున్నారు. పెద్ద రైతులకు, పరోక్ష భూస్వాములకు ఈ పథకం ఎక్కువ ఉపయోగపడుతున్నది.
రైతు బీమా:
భూమిపై హక్కులు కలిగిన రైతులకు అమలు చేస్తున్న రైతు బీమా పథకం కూడా అర్థాంతరంగా భూ యజమాని చనిపోయిన సందర్భంలో ఒక మేరకు పేద రైతు కుటుంబాలకు ఉపయోగపడుతోంది. కానీ భూమి తమ పేరున లేని రైతు కుటుంబ సభ్యులు చనిపోయినా, భూమి లేని కౌలు రైతులు చనిపోయినా, పోడు రైతులు చనిపోయినా ఈ బీమా వర్తించడం లేదు. పైగా 60 సంవత్సరాలు దాటిన, పట్టా హక్కులు కలిగిన రైతులకు కూడా ఈ బీమా వర్తించడం లేదు. భూమిలేని వ్యవసాయ కూలీలు, ఇతర చేతివృత్తుల వారు, భూమి లేని మత్స్యకారులు, పశుపోషకులు కూడా ఈ పథకం లబ్ది పొందలేకపోతున్నారు.
బలవన్మరణాల రైతు కుటుంబాలకు పరిహారం :
రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వంత భూమి ఉన్న రైతుల మరణం / ఆత్మహత్య సమయంలో వారికి రైతు బీమా అందుతోంది కనుక రైతు ఆత్మహత్యల విషయం మరుగున పడుతున్నది. భూమి లేని కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగిన సమయంలో వారికి బీమా కానీ, జీవో 193 ప్రకారం పరిహారం కానీ అందడం లేదు. అసలు రైతు బలవన్మరణాలను గుర్తించడం మానేశారు. త్రిసభ్య కమిటీ వెళ్ళి విచారణ చేయడం, ఆ విచారణ ఆధారంగా పరిహారం అందించడం మానేశారు. పైగా రైతు ఆత్మహత్యలుగా గుర్తించిన వారికి కూడా పరిహారం ఇవ్వడం లేదు.
సబ్సిడీ పథకాలు :
గత బడ్జెట్‌లలో భారీ కేటాయింపులు చూపించినా సబ్సిడీ పథకాలకు ఖర్చు చేసింది తక్కువ. ఈ బడ్జెట్‌లో అయితే ఈ పథకాలకు కేటాయింపులే తగ్గించేశారు. ఫలితంగా రైతులకు ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలు, యంత్రీకరణ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు. ఆయా పథకాల కోసం డి.డి.లు కట్టిన రైతులు కూడా సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు.
పశుపోషణ :
గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ పాలకు కొరత ఏర్పడుతున్నది. పశువులకు మేత భూముల ప్రణాళిక లేకపోవడం, వరికోతలో వచ్చిన యంత్రీకరణ, పశువుల మేతకు ఉపయోగపడే జొన్న, మొక్కజొన్న లాంటి పంటలకు ప్రోత్సాహం లేకపోవడం, మేతకు పనికిరాని పత్తి పంట విస్తీర్ణం పెరిగిపోవడం, పాలకు సరైన ధరలు లేకపోవడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
గొర్రెలు, మేకల పంపిణీ కోసం పెట్టుకున్న లక్ష్యాలు కూడా మూడు సంవత్సరాలు గడిచినా నెరవేరలేదు. ఈ పథకం అములులో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. అవినీతి చోటు చేసుకుంది. పైగా ఈ గొర్రెలకు అవసరమైనంత మేత భూములు గ్రామీణ ఉమ్మడి భూములుగా లేవు.
తెలంగాణ ప్రజా అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్లు :
1. రాష్ట్ర గ్రామీణ ప్రాంత, అటవీ ప్రాంత అభివృద్ధి కోసం, వ్యవసాయ కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలి.
2. గ్రామీణ ప్రాంతంలో ప్రతి సర్వే నంబర్‌లో వాస్తవ సాగుదారులను గుర్తించి వారి పేర్లనే ఆ సీజన్‌లో రైతులుగా నమోదు చేయాలి.
3. వాస్తవ సాగుదారులకు మాత్రమే రైతు బంధు సహాయం అందించాలి. సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా రైతుబంధు మార్గదర్శకాలను రూపొందించాలి.
4. రైతు బీమా మార్గదర్శకాలను సవరించి, మొత్తం గ్రామీణ కుటుంబాలను బీమా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రీమియం చెల్లించాలి. బీమా వయో పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలి. అన్ని రైతు, కూలీల ఆత్మహత్యలను గుర్తించాలి. ఆయా కుటుంబాలకు పరిహారం అందించాలి.
5. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించాలి. వారికి ఆన్ని వ్యవసాయ రంగ పథకాలను అమలు చేయాలి.
6. రాష్ట్ర స్థాయిలో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అన్ని పంటలకు అమలు చేయాలి. వాతావరణ పంటల బీమా పథకం అమలు చేయాలి. ఈ సంవత్సరం నోటిఫికేషన్ విడుదల కాని ప్రత్యేక పరిస్థితిలో ఈ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
7. రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు, భూముల స్వభావానికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. పంటల సాగులో విష రసాయనాలను పూర్తిగా మానేసేలా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
8. గ్రామ పంచాయితీ స్థాయిలో మహిళలను రైతులుగా గుర్తించి వారి పేర్లను నమోదు చేయాలి. ఒంటరి మహిళల వ్యవసాయానికి పూర్తి మద్దతు అందించాలి. మండల స్థాయిలో జెండర్ సెల్, జెండర్ బడ్జెట్ రూపొందించి అమలు చేయాలి. సెర్ప్ సంస్థ అనుభవాలను క్రోడీకరించి రాష్ట్రంలో మహిళా రైతుల కేంద్రంగా ప్రణాళిక అమలు చేయాలి.
9. రైతు కుటుంబాలు ప్రైవేట్ అప్పుల ఊబి నుండి బయటపడాలంటే వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, కాలిక రుణాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాస్తవ సాగు దారుల పంట రుణాలను హామీ ఇచ్చిన విధంగా ఒకే దఫాగా మాఫీ చేయాలి. కౌలు రైతులకు, పోడు రైతులకు కూడా పంట రుణాలు అందేలా ప్రభుత్వం బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి.
10. రాష్ట్రంలో అన్ని పంటలు, పాలు, కూరగాయలు, పండ్లకు కూడా శాస్త్రీయంగా ఉత్పత్తి ఖర్చులను లెక్కవేసి రాష్ట్ర స్థాయిలో ధరలను ప్రకటించాలి. ఈ ధరలకు చట్టబద్ధత కల్పించాలి. ప్రభుత్వం సేకరించినప్పుడు, వ్యాపారులు సేకరించేటప్పుడు కూడా ఈ ధరలతోనే పంటలను సేకరించేలా జీవో జారీ చేయాలి.
11. కొన్ని రైతు సహకార సంఘాలు (ూూజజూ) ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి ఫెడరేషన్‌గా ఉన్నాయి. మిగిలిన రైతు సహకార సంఘాలను (వీూజూ) కూడా అదే విధంగా ఫెడరేషన్‌గా నిర్మాణం చేయాలి. సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా బృందాలతో ఏర్పడిన సహకార సంఘాలు (వీూజూ) కూడా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్‌గా ఉన్నాయి. నాబార్డ్ సహకారంతో ఏర్పడుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఖీూూ) కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసి ప్రత్యేక ఫెడరేషన్లుగా ఏర్పాటు చేయాలి. ఈ సంఘాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు సంవత్సరాలు పూర్తి సహకారం అందించాలి. అన్ని రకాల సహకార సంఘాల మధ్య సమన్వయానికి ఒక వేదిక ఏర్పరచాలి.
12. ఈ సహకార సంఘాలు, ఖీూూ ల ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలను (గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు) నిర్మించాలి. ఇందుకు కేంద్రం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. ఈ సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి చిన్న యంత్రాలను రైతులకు తక్కువ ధరలకు కిరాయికి అందించాలి. రైతులు వ్యవసాయానికి, కస్టమ్ హైరింగ్ సెంటర్ల నిర్వహణకు వినియోగించే డీజిల్‌పై పన్నులు తగ్గించాలి. రైతులు, రైతు సహకార సంఘాలు వ్యవసాయం, చిన్న పరిశ్రమల కోసం కొనుగోలు చేసే పరికరాలపై, సరుకులపై చెల్లించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి.
13. గ్రామ పంచాయతీ స్థాయిలో రైతులకు, ఇతర గ్రామీణ ప్రజలకు అన్ని సేవలు అందేలా సహకార సంఘాల / రైతు ఉత్పత్తి దారుల కంపెనీల ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాల నిర్వహణకు మానవ వనరులు, కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల విస్తరణ సిబ్బందిని ఈ కేంద్రాలకు జవాబుదారీగా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలి.
14. కేంద్రం ఇటీవల తెచ్చిన విద్యుత్ బిల్లు-2020, మూడు ఆర్డినెన్సులు రైతులకు అత్యంత నష్టం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా హరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లును, కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయాలి. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అటువంటి తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపింది.
15. రైతులకు సాగునీరు అందించడానికి నిర్మాణమవుతున్న ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల భారాన్ని రైతులపై మోపకుండా ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత విద్యుత్ పథకం కొనసాగించాలి. రైతు, మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్లకు విద్యుత్‌ను తక్కువ ధరకు అందించాలి.
16. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా, కేంద్రం ప్రకటించే మద్దతు ధరలకు అదనంగా రైతులకు బోనస్ చెల్లించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలి.
17. గ్రామీణ పేదలకు తగినన్ని పనిదినాలు దొరికేలా ఉపాధి హామీ పని దినాలను 200కు పెంచాలి. రాష్ట్ర కనీస వేతనాలను ఉపాధి హామీ వేతనాలుగా చెల్లించాలి. పని స్థలాలలో సౌకర్యాలను మెరుగు పరచాలి. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను తిరగి భర్తీ చేయాలి. వ్యవసాయ కూలీలను కూడా అసంఘటిత రంగ బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. ఈ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి.
18. గ్రామాలలో పశు సంపద పెరిగేలా చర్యలు చేపట్టాలి. ఈ పశువులకు మేత, తాగు నీరు, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలి. గొర్రెలు, మేకల పంపిణీని కొనసాగించాలి. ఈ పథకంలో అవినీతిని నిర్మూలించాలి.
19. వీజన=ణ రూపొందించిన కరువు మాన్యువల్‌ను వెంటనే ఆమోదించాలి. అమలు చేయాలి.
20. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టి, అమలు చేయాలి.
కల్తీ విత్తనాలను అమ్మిన వ్యాపారులు, కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. రైతులతో విత్తనాలు
ఉత్పత్తి చేయడానికి కంపెనీలు చేసుకున్న అన్ని కాంట్రాక్ట్ ఒప్పందాలపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా సంతకాలు చేసి విత్తన రైతులను రక్షించాలి.
(ప్రజా అసెంబ్లీ కోసం రాసిన వ్యాసం)