ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ

సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుధ్యం, మరుగుదొడ్లు, తాగు నీరు వంటి కనీస వసతులపై దృష్టి పెట్టడం లేదు. ప్రజా సమూహాలకు దగ్గరలో అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మందులు, వైద్య పరికరాలు సరిపడినన్ని లేక ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో కనీస సేవలు అందించే పరిస్థితిలో లేవు. ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రజలు పోషకాహార లోపం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు, గర్భిణీ స్త్రీలలో ప్రసూతి సమయంలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మలేరియా తదితర విషజ్వరాలు ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలి అనేక మంది వైద్యం అందక చనిపోతున్నారు.

టిఆర్‌ఎస్‌ పార్టీ 2014లో అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య రంగానికి ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తామని వాగ్దానం చేసింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ లేదు. శారీరక ఆరోగ్య సమస్యలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాల నుండి ఆస్పత్రులకు వెళ్ళడానికి ఇప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ ఎంత దుర్భలంగా ఉందో కరోనా సంక్షోభం స్పష్టంగా వెల్లడించింది. ఐదు నెలల తర్వాత ఇప్పటికీ ప్రభుత్వ వ్యవస్థ కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇంకా పూర్తి సంసిద్ధంగా లేదు.

ధనిక దేశాలు, చాలా పేద దేశాలు కూడా తమ బడ్జెట్‌లో పది శాతానికి మించి ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో మాత్రం గత ముప్ఫై ఏళ్ళుగా కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2 శాతం మించలేదు. ”స్వతంత్ర” తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర పాలకుల మాదిరే రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 4 శాతాన్ని మాత్రమే కేటాయిస్తూ వస్తోంది. కడపటి బడ్జెట్‌లో కేసీఆర్‌ దాన్ని 3.5 శాతం చేశారు. బడ్జెట్‌లు పెరగకుండా ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుపడదు కాబట్టి ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలి.

మార్చి నెలలో కోవిడ్‌-19 సంక్షోభం మొదలయిన దగ్గరి నుండి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం చర్యలను జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ప్రజారోగ్య సమస్యగా కంటే ఈ సంక్షోభంలో తన ఇమేజ్‌ని ఎలా కాపాడుకోవాలనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన సర్వశక్తులు వాడిందని అర్థమవుతుంది. ఎపిడెమిక్‌ చట్టం, డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం, లాక్‌డౌన్‌ నియమాలు అమలు చేసి వాటిల్లో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికో లేక కోవిడ్‌-19 ని నియంత్రించడానికి ప్రపంచమంతా అమలవుతున్న పద్ధతులు అమలు చేయడానికో కాక ఆయా చట్టాలిచ్చిన అధికారాలను ప్రజా ఆరోగ్య సిబ్బందిపై నియంత్రణ పెంచుకోవడానికి, కోవిడ్‌-19 సమాచారాన్ని పూర్తిగా తొక్కిపెట్టి ఏ విమర్శకీ భూమిక లేకుండా చేయడానికి, పత్రికల్లో కూడా తాను చెప్పిందే రావడానికి, ఆఖరికి ఉన్నత న్యాయస్థాన ఆదేశాలను కూడా నీరు కార్చడానికి వాడుకుందని కూడా స్పష్టమవుతుంది. ఈ ప్రయత్నాలకు అడ్డు వస్తాయని కాబోలు, అడ్వొకెసీ సమూహాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం మెరుగుపరుస్తామని, ఇతర సహకారం అందిస్తామని, అదీ ప్రభుత్వ నిధులు లేకుండా, అని పదే పదే విజ్ఞప్తులు రాసినప్పటికీ కొన్ని నెలలపాటు తిప్పించుకుని వాటన్నింటినీ బుట్ట దాఖలు చేసింది.

ఎప్పటికప్పుడు తెలంగాణలో కోవిడ్‌ సమస్య పెద్దగా లేదని, ‘బయటి’ నుండి వచ్చిందనే భ్రమని కొనసాగించింది. మార్చిలో ఢిల్లీ తబ్లిగ్‌ సమావేశం నుండి తిరిగి వచ్చిన వ్యక్తుల టార్గెటింగ్‌ మొన్న మొన్నటి వరకూ కొనసాగించింది. బయటి దేశాల నుండి తెలంగాణకు తిరిగొచ్చిన వలస కార్మికులని కోవిడ్‌ నియంత్రణ పేరుతో హోటళ్ళలో వారి ఖర్చుతో ఉంచుతోంది. తెలంగాణలో కోవిడ్‌-19 కమ్యూనిటీలో వ్యాప్తి చెందట్లేదని జులై వరకు చెప్పింది. టెస్టుల సంఖ్యని పెంచకుండా, పెంచినా జరపకుండా ఉంచుతోంది. జరిపితే కేసులు బయటపడతాయన్న భయంతో ప్రభుత్వ ఆస్పత్రులని తెరవకుండా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చింది. ప్రకటనలు తప్ప వాటి ఛార్జీలని నియంత్రించలేదు. అపార్టుమెంటులో ఉండే డబ్బున్న వారికి హోటళ్ళలో ఐసోలేషన్‌ సౌకర్యం చేసుకోమని చెప్పి ఒకే గది ఇంట్లో పదిమంది నివసించాల్సిన పేదవాళ్ళకి మాత్రం ఇతర ఐసోలేషన్‌ సౌకర్యాలు కల్పించకుండా ఇంట్లో ఐసోలేషన్‌ విధించింది. ఇప్పటికీ ప్రాథమక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లకి, నర్సులకి, బస్తీల్లో పనిచేసే ఆశా వర్కర్లకు మాస్కులు, గ్లవ్స్‌, ఇతర ప్రాథమిక సంరక్షణా పరికరాలను అందించలేదు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు నియంత్రణా కాల్స్‌ ఎక్కువ, మందుల కిట్లు తక్కువా అందిస్తోంది. హాస్పిటళ్ళలో బెడ్స్‌, చనిపోయిన వారి సంఖ్య మే నుండి ఇప్పటివరకు దాదాపు రోజువారీ ఆరోగ్య బులెటిన్‌లో మారకుండా చూసింది. టెస్టులు చేస్తున్న ఆస్పత్రులు, ప్రైవేటు టెస్టింగ్‌ సెంటర్ల నుండి ఏ సమాచారం బయటకు రాకుండా కాపాడుతోంది. తాజాగా జిల్లాల నుండి సమాచారాన్ని కూడా నియంత్రించి తాననుకున్న సంఖ్య మాత్రమే బయటపెడుతోంది. దాదాపు 130 పైన ఆరోగ్యం గురించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినప్పటికీ, ఉన్నత న్యాయస్థానం వీటికి సుముఖంగా స్పందించి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టి అనేక ఆర్డర్లు ఇచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా తన పని యధావిథిగా చేసుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌-19 ఆరోగ్య సంక్షోభంలో వ్యవహరిస్తున్న తీరు ప్రజలకి, సమాజానికి తీవ్రమైన హాని కలిగిస్తుందనటంలో ఏ సందేహం లేదు. కోవిడ్‌ కేసులు ఎక్కడ ఎక్కువున్నాయి, టెస్టులు ఎక్కడ, ఎప్పుడు చేసుకోవచ్చు, ఏ ప్రాంతాల్లో ఎక్కువున్నాయి, కంటైన్మెంట్‌ జోన్లు ఎక్కడున్నాయి, ఐసోలేషన్‌ సెంటర్లలో ఎలా చేరవచ్చు – ఏ సమాచారం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ప్రజలకి వ్యక్తిగత స్థాయిలో తీవ్ర ఇబ్బందులు కలగటమే కాదు, వ్యవస్థీకృతంగా తమ పనిని ప్లాన్‌ చేసుకోవడానికి అవకాశం లభించకుండా పోతోంది. ఇటువంటి తెలంగాణ ప్రభుత్వం తీరు కేవలం యాదృచ్ఛికం కాదు. ప్రజలు ప్రభుత్వానికి పొడిగింపు మాత్రమేనన్న వైఖరి, ప్రజలకన్నా రాష్ట్ర పరువు ముఖ్యం అన్న తప్పుడు అవగాహన, కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని రాష్ట్ర ప్రభుత్వాల సామర్ధ్యానికి కొలమానంగా వాడుతుంటే అదే ఆటలో దాన్ని ఓడించాలనే తపన… ఇవన్నీ కలిపి ప్రజల ప్రయోజనాలని ఫణంగా పెట్టడానికి దారి తీస్తున్నాయి.

మానసిక ఆరోగ్యం-సమస్య మూలాలను అర్థం చేసుకుని చికత్స అందించే మద్దతు వ్యవస్థలు అవసరం:

వివిధ సెక్షన్ల ప్రజలలో (చిన్నపిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అప్పుల పాలైన రైతులు, గృహ హింసను, వెలివేతను ఎదుర్కొనే మహిళలు, ఎల్‌.జి.బి.టి. సమూహాలు, మద్యానికి-మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు) మానసిక ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, కుంగుబాటు (డిప్రెషన్‌) మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు రైతులు భూమి పట్టాల కోసం లేదా పంట నష్టం కోసం లేదా అప్పులు పేరుకుపోయి నిరాశకు లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు, మహిళలు కూడా తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోవిడ్‌ సంక్షోభం మొదలైనప్పటి నుండి ఉపాధి కోల్పోయిన వారు, పెరిగిన గృహ హింసకు బలైనవారు ఇలా వివిధ సెక్షన్లలో మానసిక ఆందోళన, కుంగుబాటు పెరుగుతున్నాయి. సమస్య మూలాలను అర్థం చేసుకుని చికిత్స అందించే బదులు, సామాజిక కారణాలను పరిశీలించే బదులు వ్యక్తిగత సమస్యగా పరిగణిస్తున్నారు. అలాగే నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అనేక రకాల సదుపాయాలను కల్పించిన జాతీయ మానసిక ఆరోగ్య చట్టం-2017 తెలంగాణ రాష్ట్రంలో అమలు జరపడం లేదు. అలాగే ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి వరకు సేవలను అందించే మానసిక ఆరోగ్య కార్యక్రమం (ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగం) సరిగ్గా అమలు జరగడం లేదు.

డిమాండ్లు :

– రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులను పెంచి ప్రభుత్వ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న నర్సులు, వైద్యులు ఇతర సిబ్బంది పోస్టులన్నింటికీ నియామకాలను వెంటనే చేయాలి.

– ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్యం, మందులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆధునిక వైద్య పరికరాలు మొదలైనవి కల్పించాలి.

– గర్భిణీ స్త్రీలలో ప్రసూతి మరణాలు నివారించడానికి అత్యవసర సేవలు, మందులు, ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి తేవాలి.

– ప్రైవేటు ఆస్పత్రులలో పేషెంట్ల దోపిడీని అరికట్టడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ సంక్షోభం ముగిసేవరకు ప్రైవేటు ఆస్పత్రులలో ప్రభుత్వ నియమాల మేరకు కోవిడ్‌ వైద్య సేవలు అందించేలా ఆదేశించాలి.

– కోవిడ్‌-19 సమాచారం (టెస్టులు, ఐసోలేషన్‌ సెంటర్లు, ఆస్పత్రులు, బెడ్లు, కంటైన్మెంట్‌ జోన్లు) పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండాలి.

– కోవిడ్‌ కేర్‌ సెంటర్ల స్థాపనని వికేంద్రీకరించాలి. మరికొంత కాలం సాగబోయే కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పౌర సమాజ సంస్థలు కూడా తమను తాము సన్నద్ధం చేసుకోవాలి.

– జాతీయ మానసిక ఆరోగ్య చట్టం 2017 ను ప్రతి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలి. మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌ను ప్రతి జిల్లాలో నెలకొల్పి దాని ద్వారా సమస్యలను నమోదుచేసి కౌన్సిలింగ్‌ తదితర అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– గృహ హింసకు గురయ్యే మహిళలకు, వివక్షను, రకరకాల వేధింపులను ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్లకు మానసిక సమస్యల నుండి బయటపడవేయటానికి దీర్ఘకాలం పాటు సహాయ సహకారాలు అందించాలి.

– ఆరోగ్యశాఖలోని వైద్యులు, అధికారులందరికీ మానసిక ఆరోగ్య సేవల గురించి అవగాహన కల్పించాలి.

– డా|| తిరుపతయ్య, డా|| ఎ.సునీత, శృతి నాయక్‌, ఎస్‌.ఆశాలత

(ప్రజా అసెంబ్లీ కోసం రాసిన వ్యాసం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.