దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

సాహితీవ్యక్తిత్వం

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ శక్తులు అసదృశం. సమాజతాదాత్మ్యం అవిరతం. మరి ఆమె గొప్ప రచయిత్రి కాగలిగి ఉండేది కాదా! ఆమెకు ఆ అవకాశం కానీ, సమయం కానీ లభించలేదు. ఎనిమిదేళ్ళ వయసుకే దుర్గాబాయి సమాజ చైతన్య కర్తవ్యాన్ని స్వీకరించింది. స్వాతంత్య్రోద్యమ ప్రబోధ కార్యక్రమాన్ని ఉద్యమింపచేసింది.

తెలుగువారి ప్రసిద్ధ సాహిత్య సాంస్కృతిక చారిత్రక పునరుజ్జీవనోద్యమ ప్రబోధ మాసపత్రిక ‘భారతి’ వెలువడే నాటికి ఆమెకు పదిహేనేళ్ళ వయసు (1924) అంతకు ముందు రెండేళ్ళ నుంచి ఆమె కాకినాడ కాంగ్రెస్‌ మహాసభలకు గాను స్వచ్ఛంద సేవికా దళాన్ని నిర్మించే పనిలో నిమగ్నురాలై ఉంది. అంతకుముందు ఏడాది పూర్వమే రాజమండ్రిలో గాంధీ మహాత్ముణ్ణి దర్శించి ప్రబోధితురాలైంది. అంతకు మూడేళ్ళకు పూర్వమే ఆమెకు పెళ్ళి కూడా అయింది. జీవితం పుట్టిల్లు మెట్టినిల్లుగా విభక్తమైంది. కాబట్టి ఆమెకు కౌమార వయస్సులో సాహిత్యరంగంలో ప్రవేశించే అభిలాష ఎంత ఉన్నా జీవిత సంఘటనల సహకారం అందుకు అనుకూలించలేదు. అయినా ఆమె కథలు రాసింది. నవల కూడా రచించింది. పత్రికలు నడిపింది. ఆత్మకథ రచించింది. శతాధికంగా సమాజ సంక్షేమ నివేదికలు, సంయోజనలు, సాంఘిక సంక్షేమ పథకాలు, విదేశీ పర్యటనానుభవాలు, పంచవర్ష ప్రణాళిక మహిళాభ్యుదయ కార్యక్రమాలు రూపొందించింది. ఆంధ్ర మహిళ పత్రికలను, పిల్లల కోసం రేడియో కార్యక్రమాలు, దసరా పండుగ కార్యక్రమాలను, లలిత సంగీత విభావరులను, ప్రభాత భేరీలను నిర్వహించింది.

1924 నుంచి 1930 వరకు ఆమె ‘భారతి’కి కథలు రాసినట్లు దుర్గాబాయి జీవిత చరిత్రకారులు చెపుతున్నారు. శ్రీమతి నేతి సీతాదేవిగారు రచించిన జీవిత చరిత్రలో ఈ ప్రస్తావన ఇలా ఉంది. ఆమె సన్నిహిత మిత్రురాలు కందా పాపాయమ్మగారు దుర్గాబాయమ్మగారి సాహిత్య పిపాసనిట్లా తెలియజేశారట. ”తాను పెద్దయ్యాక ఏవో సంస్థలను, పాఠశాలలనూ స్థాపించి నిర్వహిస్తున్నట్లు, ఎందరికో అనాథలకు జీవనోపాధి కల్పిస్తున్నట్లు తానే నాయికగా ఊహించుకుంటూ (ప్రధాన పాత్ర) దుర్గాబాయి రాసిన కథలు గృహలక్ష్మి, భారతి లాంటి పత్రికలలో ఆ రోజులలో వచ్చేవట”. (పుట.62)

రాయవేలూరు జైలులో ఆమె ‘కథలు’ వ్రాసేది. ఆమె జైల్లో ఉండగా ‘లక్ష్మి’ అని ఆమె రాసిన నవల ఒక ప్రముఖ పత్రికలో సీరియల్‌గా వచ్చినట్లు దుర్గాబాయిగారే చెప్పినట్లు సీతాదేవిగారి భోగట్టా. అది మంచి నవల అని కూడా తెలుస్తున్నది. ప్రవాహ సదృశమైన, నిత్య నిరంతర చైతన్య కార్యక్రమ ఘటితమైన జీవితంలో ఆమె చిన్ననాటి రచనలు భద్రంగా ఉంచాలనే ఆసక్తి లేకపోయి ఉంటుందామెకు.

కానీ ఆమె ఎందరినో రచయితలను, రచయిత్రులను చేసింది. వాళ్ళలో సృజనాత్మకతను పెంపొందించింది. సాహితీపరులను చేసింది. బహుశా సాహిత్య, కళా, లలిత సంగీత కార్యక్రమాలు వేయికి పైగా నిర్వహించి ఉంటుందామె తన విరామమెరుగని వేగసంభరిత జీవితంలో. మద్రాసుకు ఆకాశవాణి కేంద్రం వచ్చిన తొలిరోజులలో ఆంధ్ర మహిళా సభ స్త్రీల, పిల్లల విభాగం పక్షాన ఆమె ఎన్నో కార్యక్రమాలు రూపొందించేదని ఆమె జీవిత చరిత్ర రచయిత్రి పేర్కొన్నారు. దుర్గాబాయి సభలో మెంబర్లందర్నీ ఒక్కొక్క రూపాయితో ఆలిండియా రేడియో సభ్యులుగా చేర్పించి వారిచేత ఉపన్యాసాలు, పాటలు, నాటకాల ప్రోగ్రాములిప్పించి పారితోషికంగా, ఆలిండియా రేడియో వారిచ్చిన ధనాన్ని సభ నిధికి జమకట్టించేది (పుట.177).

ఈ విధంగా తెలుగువారి భాషా సాహిత్య సంగీతాలకు ఆమె జనప్రియత కలిగించింది. వ్యాప్తి కలిగించింది. ఆమె శిక్షణలో తర్ఫీదు పొందిన వారెందరో తర్వాత కాలంలో రచయితలు, కళాకారులు కావడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. దుర్గాబాయికి సాహిత్యం పట్ల, సాహిత్యపరుల పట్ల సమధిక గౌరవాదరాలుండేవి.

”నిత్య నిరవధిక పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయితీ, స్నేహభావం అన్నీ ప్రోగుపడిన దుర్గాబాయిలో నటనాశక్తి కూడా

ఉండేది. ఆవిడ నాటకాలు వేసేది, వేయించేది. 1930లో మద్రాసు వెళ్ళినప్పుడావిడ ఒక ఫిల్మ్‌ కంపెనీ స్థాపనకు తోడ్పడి అందులో నటించడానికి కూడా సంసిద్ధత చూపించారంటారు” అని కపిల కాశీపతి దుర్గాబాయి గురించి చేసిన రచన (11-2-53 ఆంధ్ర సచిత్ర వారపత్రిక) నుంచి నేతి సీతాదేవి ఉదహరించారు. (పుట.326-1977).

”ఆమె గృహలక్ష్మి పత్రికలో ఆ రోజులలో గాంధీజీ వ్రాసిన ఒక వ్యాసం గాంధీజీ వ్యక్తిత్వం తెలియజెప్పే మాట అటుంచి ఆవిడ హృదయాంతర్గతమైన మనోభావాలను అద్దంపెట్టి చూపుతుంది” అన్నారు సీతాదేవి. (పుట.330)

దుర్గాబాయి శైలి ఇట్లా ఉంది:

”మానవ మాత్రుల శృంఖలాబద్ధ హృదయముల నుండి వెలువడు ఆర్తనాదమును తమ తమ కవిత్వముల ద్వారా గంభీరముగా వ్యక్తపరుపగలిగిన కవిశిల్పులే నిజమగు శూరులు… బ్రహ్మాండమగు ఈ విశ్వమందు ముక్తి, బంధనము లీలామాత్రములు. జ్ఞాని, చింతాశీలుడు, ముకుక్షువునగు పురుషుడే ఈ లీలలకు పరిచితుడు. అట్టి పురుషుడు బంధనములందున్నను ముక్తినే అనుభవించుచుండును. హర్ష శ్లోకములు వానికి సమానము”.

ఈ శైలి, ఉన్నత మానవ జీవిత తాత్విక చింతన, ఏ కాశీనాధుని నాగేశ్వరరావు గారినో, వేటూరి ప్రభాకరశాస్త్రి గారినో, ఉన్నవ లక్ష్మీనారాయణగారినో తలపింపచేస్తున్నవి. ఆమె ఎన్ని గ్రంథాలు చదివిందో, ఆమెకు ఆ గ్రంథాలన్నీ చదవడానికి తీరిక ఎక్కడ లభించిందో!

నిజానికి ఆమె సాహిత్య వ్యాసంగమే, ఆమె రచయిత్రి కావడమే ఆమెను కాశీనాథుని నాగేశ్వరరావుగారికి (ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథమాల వ్యవస్థాపకుడు) సన్నిహితురాలిని చేసి ఉంటుంది. తమ విశాల గృహంలో కొంత భాగం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది, అందులో మీరు ఉండవచ్చును అని దుర్గాబాయి రాసిన లేఖకు ఆయన సమాధానం రాయడానికి కారణమై ఉంటుంది. హైదరాబాదులో సి.డి.దేశ్‌ముఖ్‌, దుర్గాబాయి మనసుపడి నిర్మించుకున్న ఇంటికి ‘రచన’ అని పేరు పెట్టుకున్నారు. వారు సమాజాన్ని కూడా ఒక

శుభ్రమైన, సంక్షేమకరమైన రచనగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు.

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ తన సంచలన జీవిత ధ్యేయాన్ని, దాన్ని సాధించడంలో తన పూనికను, దాని ఫలితాలను ‘ది స్టోన్‌ దట్‌ స్పీకెత్‌’ (శిలలు చెపుతున్నాయి) అని రెండు సంపుటాల ఉద్గ్రంథం వెలువరించింది. ఆమె తన జీవిత సార్థకానికి ఈ పేరు పెట్టడం ఎంత ఔచితీ గంభీరంగానూ, భావుకంగాను, నిస్వార్థ త్యాగ సేవాస్ఫోరకంగానూ ఉన్నదో ఊహించవచ్చు. భగవద్గీతలో చెప్పిన నిష్కామసేవాకర్మకిది సఫలీకృత ఉదాహరణం. శిలలే చెపుతున్నాయి అనటం ఒక్కొక్క రాయి పేర్చి మహా భవనాలనెన్నింటినో నిర్మించిన మహిళా సభ భౌతిక స్వరూపం వివరించటం. ఆమె నిస్సంగత్వాన్ని ఆ భవనాల చరిత్ర ద్వారా ఆమె ఆ సంపుటాలలో వివరించింది. అంటే ఆమె తనకు ఏమీ ప్రాధాన్యం ఆపాదించుకోకుండా తన కృషిని స్థిరంగా నిలిపే సేవా కార్యక్రమాలకే ఆ ప్రాధాన్యం, ఆ కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి, దక్కాలి అని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేయడం ఆ గ్రంథానికా పేరు పెట్టడంలో స్ఫురిస్తున్నది. ముప్ఫై, నలభై ఏళ్ళ నిరంతర సేవా తత్పరత ఆ భవన సముదాయాల రూపేట లోకానికి మేలు చేస్తాయి, సమాజానికి స్ఫూర్తినిస్తాయి అని ఆమె భావం.

సమాజంలోని దురాచారాలతో, అంధ విశ్వాసాలతో, అన్యాయాలతో, వీరేశలింగం వంటి వాళ్ళు పోరాటాలు సలిపి గత శతాబ్దంలో కృతకృత్యులైనారు. ఆ పోరాటాల తీవ్రత ఇప్పుడు శమించింది. వాటి అక్కరా, అవసరం కూడా కనబడవు ఇప్పుడు. అయినా అవశేషాలతో ఆమె పోరాటం సలిపింది. 20వ శతాబ్దంలో, అందునా ముఖ్యంగా స్వాతంత్య్రం తరువాత సమాజ పునర్నిర్మాణం ఆమె ధ్యేయంగా చేసుకున్నది. శిథిల భవనాలు కూల్చడం, పడగొట్టడం కొంతమేరకు సులభమే కావచ్చు. కానీ కొత్త కట్టడాలు నిర్మించటం, ఆవాసయోగ్యం చేయడం శ్రమైక సాధ్యం. ఇరవయ్యవ శతాబ్దంలో వీరేశలింగం నిజమైన వారసురాలు దుర్గాబాయే. ఆయనిది దుష్ట నిర్మూలనం కాగా ఈమెది శిష్ట నిర్మాణం.

మదన మోహన మాలవ్య పండితుడి అనుదిన చర్య వారణాసి హిందూ విశ్వవిద్యాలయ విశాలావరణలో నిర్మించిన భవనాలు ఒక్కొక్కదాన్నీ చూసుకుంటూ ఒకసారి ఉదయాన్నే తిరిగి రావడమట. దుర్గాబాయి రెండేళ్ళపాటు ఆయన ప్రేమాభిమాన వాత్సల్యాలను చూరగొన్నది. అప్పుడామెకాయన చిత్తవృత్తి అక్కజంగొలిపి ఉంటుంది. ఆయన ఆ మహాభవనాలను, ఆ కట్టడాల వరుసలను, ఆ విద్యావేదిక విజ్ఞాన ప్రదాయినులను ఎంతో మమకారంగా రోజూ ఒకసారి చూసుకొని తృప్తిపడేవారన్న మాట. లేక ఇంకా అటువంటి ఆలోచనల స్ఫూర్తి పొందేవారన్నమాట.

తన జీవితంలో ఒక స్థిమితం ఏర్పడిన తర్వాత, తన కలలు సాకారమవుతోన్న ఆసన్న శుభ సమయంలో దుర్గాబాయికి మాలవ్యా మహాశయుని ఆర్ద్ర చిత్త వృత్తి అర్థమై ఉంటుంది. అందుకే ఆమె తన జీవిత కృషికి ‘ది స్టోన్‌ దట్‌ స్పీకెత్‌’ (శిలలు మాట్లాడతాయి) అని పేరు పెట్టి ఉంటుంది. ఒక విధంగా ఇది మాలవ్యా మహాశయుడి పట్ల తన మనసులో కుదురుకున్న కృతజ్ఞతాభావాన్ని స్మరించుకోవటమే అవుతుంది.

దుర్గాబాయమ్మకు సాహిత్యకారుల పట్ల, సామాజిక వేత్తల పట్ల, గ్రంథ రచయితల పట్ల గౌరవాదర ప్రశంసాభావం ఉండేది. దుర్గాబాయి జీవిత చరిత్రకారులు ఎవరూ స్పృశించని విషయం ఒకటుంది. శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల షష్టిపూర్తి ఉత్సవాల సమ్మాన సంఘాధ్యక్షురాలిగా ఆమె ఆ కార్యక్రమాలను ఘనంగా జరిపించడం అది. ఈ ఉత్సవాలు రాజమండ్రిలో, కాకినాడలో జరిగినట్లు వేంకట పార్వతీశ కవుల సాహిత్య ప్రస్థానం ద్వారా తెలుస్తున్నది. ఆ మహాకవుల షష్టిపూర్తి ముద్రణలు కొన్ని వెలువరించడం అది. బాలాంత్రపు వేంకటరావుగారి కుమారులైన నళినీకాంతరావు, రజనీకాంతరావులతో ఆమెకు ఆత్మీయానుబంధం ఉండేది. ‘నళిని’ ఆమె స్థాపించిన సంస్థలలో సన్నిహితంగా మెలిగినవాడు కూడాను.

ఆంధ్ర మహిళా సభ రజతోత్సవ సంచిక వెలువరించే సందర్భంగా కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు ప్రభృతులు ఆ సంచిక రూపొందించడంలో ఎంతో సహాయ సహకార ఆసక్తి కనబరిచారని తెలుస్తోంది. నళినీకాంతారావు మహిళా సభ మహత్తర సామాజిక సేవను కవిత్వీకరించాడు కూడా. పాలగుమ్మి పద్మరాజు దుర్గాబాయి తల్లిగారైన కృష్ణవేణమ్మగారి మహిత వ్యక్తిత్వాన్ని నాలుగైదు కథలలో వ్యక్తీకరించారని కూడా నేతి సీతాదేవి చెప్పారు. (పుట.304) దేవులపల్లి కృష్ణశాస్త్రి గారంటే దుర్గాబాయికి ఎంతో గౌరవం. సర్వ మహనీయతలో 20వ శతాబ్ది భారతదేశ చరిత్రలోనే దుర్గాబాయి సర్వశ్రేష్ఠురాలు అని కృష్ణశాస్త్రి ఆమెకు నివాళినర్పించారు. కృష్ణశాస్త్రి గారి పేరిట ఆంధ్ర మహిళా సభ వారు ఉత్తమ కవితా పురస్కారం కూడా ఏర్పాటు చేసి కొంతకాలం నిర్వహించారు. దీని వెనుక దుర్గాబాయమ్మ అంతరంగం ఉండి ఉంటుంది. ‘ఏవీ తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములూ’ అనే ప్రశస్త గీతంలో శ్రీ శ్రీ దుర్గాబాయమ్మను ఘనంగా కీర్తించాడు. దుర్గాబాయి నిజంగా భర్గురాణి వంటి శక్తి స్వరూపిణి అని శ్రీశ్రీ నివాళి.

దుర్గాబాయి ఆత్మకథ, సంఘ నిర్మాణ చరిత్ర గ్రంథమూ తెలుగు అనువాదాలు వెలువడినప్పుడు, ఆమె కథలూ, వ్యాసాలు, సామాజిక తత్వ చింతనలూ లభించినంత వరకైనా పుస్తక రూపం ధరిస్తే ఈ తరం, ఇంకా ముందు తరాల తెలుగు వాళ్ళకు ఆమె సాహితీ వ్యక్తిత్వం కొంతవరకు బోధపడుతుంది. ‘చెప్పు నిట్లు సర్వశాస్త్రమ్ములు, అంబ గౌరవమున అధికయగుట’ అని మహాభారతంలో చిరకారి కథలో తిక్కన చెప్పాడు. ఆమె తన తరం వారికి ఎందరికో అమ్మ కాగలిగింది. ముందు తరాల వారికి అమ్మగా ఆమె అర్థమవుతుంది. చిరకాలం ఆమె యశస్సు ‘మహాభారతం’లో నిలుస్తుంది.

లోకంలో ఎప్పుడైనా, ఎక్కడైనా సాహిత్యరంగంలోనో, సామాజిక రంగంలోనో విశిష్ట వ్యక్తిత్వ శోభితులు స్వీయచరిత్ర రాయడం కద్దు. కానీ దుర్గాబాయి రెండు స్వీయచరిత్రలు రాశారు. అంతేకాక ఆమె భర్త చింతమణి ద్వారకనాథ్‌ దేశ్‌ముఖ్‌ కూడా చరిత్ర రాశారు. కాబట్టి ఈ విషయంలో ఆమెతో పోలిక చెప్పగలవారెవరూ లేరనే అనుకోవాలి. కందుకూరి వీరేశలింగం పంతులు తన భార్య రాజ్యలక్ష్మి చరిత్ర రాశారు. దానిని స్వీయచరిత్రలో చేర్చారు. మళ్ళీ అదేవిధంగా సి.డి.దేశ్‌ముఖ్‌ స్వీయచరిత్రలో దుర్గాబాయి జీవిత చరిత్ర కనబడుతుంది. దుర్గాబాయి కూడా స్వీయ చరిత్ర రాసుకున్నారు. ‘చింతామణి అండ్‌ ఐ’ అనే పేరుతో ఆమె రాసిన స్వీయచరిత్రలో ఈ జీవిత రంగంలో తామెట్లా తారసపడిందీ, తాను ఆయనకు ఏ విధంగా ఆలంబనమైందీ ఆమె అభివర్ణించుకున్నారు. అట్లానే చింతామణి కూడా ఆమెపట్ల తన మెప్పునూ, కృతజ్ఞతను స్వీయ చరిత్రలో వర్ణించుకున్నారు.

దుర్గాబాయి స్వీయచరిత్రను రెండుసార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? రాయాల్సి వచ్చింది? అంటే ఆమె సామాజిక సేవ, సంస్థా నిర్మాణ దక్షత, దీనజనుల పట్ల కరుణాంతరంగం అటువంటివి కాబట్టి. దుర్గాబాయి జీవితమనే గొప్ప విలువైన బంగారు నాణేనికి ఆమె స్వాతంత్య్రోద్యమ సార్థక అంకిత ప్రవృత్తి ఒకవైపు కాగా, నవభారత అభ్యుదయ వికాస నిర్మాణ కృషి మరొకవైపు కాబట్టి ఆమె రెండుసార్లు స్వీయచరిత్ర చెప్పుకోవలసి వచ్చిందనిపిస్తుంది.

‘చింతామణి అండ్‌ ఐ’ (చింతామణి – నేను) అనేది చాలా సంగ్రహంగా ఆమె రాసుకున్నారు. ఈ స్వీయ చరిత్రకు పేరుపెట్టడంలో కూడా ‘నేనూ-చింతామణీ’ అనలేదు ఆమె. ఆమె గొప్ప మనస్వితకు ఇది నిదర్శనం. ఆమె జీవిత సార్థకత, సాఫల్యత, చరిత్రాత్మకత అంతా ఇలా పేరు పెట్టడంలో ఆమె ధ్వనింపచేశారనుకోవాలి. ఒకే జీవిత కాలంలో రెండు జీవిత కాలులు ఆమె దర్శించారు. ఆమె సంస్థా నిర్మాణ, నిర్వహణ కృషి అంతా చింతామణి సహాయ ఉత్సాహ ప్రోత్సాహ సహకారాలతోనే ఆమె సాధించగలిగారు. దాన్నే ఆమె స్వీయచరిత్రలో సంస్మరించుకున్నారు. అయితే ఆమె చింతామణి పట్ల ఎంతగా కృతజ్ఞత చూపించారో చింతామణి దేశ్‌ముఖ్‌ కూడా స్వీయచరిత్ర ‘ది కోర్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ (జీవితస్రవంతి) లో దుర్గాబాయి ఏ విధంగా తన జీవితంలో బాసటగా నిలిచిందో, తన వేసటనంతా ఎలా తొలగించిందో, మళ్ళీ తనను సార్థక జీవనుణ్ణి చేసిందో, ఆశావథానుణ్ణిగా ఆదరించిందో స్వీయచరిత్రలో చెప్పుకున్నారు. పండిత జవహర్‌లాల్‌ నెహ్రు వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారని తెలిసి ఎంతో సంతోషపూర్వకమైన తృప్తి పొందినట్లు చెప్పుకున్నారు.

దుర్గాబాయి పూర్వజీవితం ఆవేశోద్వేగసంభరితం. చింతామణి పూర్వజీవితం నిరాశోపహత నిరీక్షణం. ఆయన గొప్ప మేధావి. ఇంగ్లండులో ఎ.సి.ఎస్‌.కు సమాయత్తుడవుతున్న రోజుల్లో ఆయన యూరోపియన్‌ యువతిని వివాహం చేసుకున్నారు. వాళ్ళకు ఒక పాప కూడా పుట్టింది. అయితే దురదృష్టవశాత్తు ఆ వివాహం విఫలమైంది. విడాకులకు దారితీసింది. ఆయన విషణ్ణమానసుడైనాడు. తన రక్తం పంచుకుని పుట్టిన ఆ పాప పట్ల ఆయనకు అమిత అనురాగం. అయితే ఆ పాప తల్లి ఆధీనంలో ఉంది. ఆ పాపకు ఎనిమిది, తొమ్మిదేళ్ళు వచ్చేదాకా చింతామణి దేశ్‌ముఖ్‌ ఆ పాప పట్ల తండ్రి చూసే మమతకు దూరమయ్యాడు. ఆయన దుర్గాబాయిని వివాహమాడిన తర్వాత ఆయన మనస్సుకు స్వస్థత, శాంతి లభించాయి. తన కూతురు తనకు దగ్గరైంది. దుర్గాబాయి ఆ పాపను ఎంతో ఆదరంగా చూసుకుంది. చింతామణి ద్వారా తనకు ఏర్పడిన కుటుంబ బాంధవ్యాలతో దుర్గాబాయి ఉదార హృదయం, ఉన్నత సంస్కారం, ఉత్తమ వ్యక్తిత్వం, ఆమె అత్తగారింట కూడా ప్రస్తుతిపాత్రమైనాయి. తన చిన్ననాటి సంగతులు, గాంధీజీ ప్రభావం, సత్యాగ్రహోద్యమ సంరంభం మొదలైన విషయాలన్నీ వ్యక్తిగతమైన వివరాలన్నీ ఆమె ‘చింతామణి-నేనూ’ అనే స్వీయచరిత్రలో రాసింది. అంతటితో ఆమె జీవితం ఆగిపోలేదు. ఉపనదులెన్నో కలిసి మహానదిలాగా పరిణమించునట్లు స్వాతంత్య్రానంతర కాలంలో నవభారత పునర్నిర్మాణ కర్తవ్యం, బాధ్యతను ఆమె స్వీకరించింది. ‘సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు’కు విదుషి, మహిళాలోకపు ఆశాజ్యోతి. రాజ్యాంగ సభ సభ్యురాలే కాక, అధ్యక్షత స్థానం పెట్టి సత్ఫలితాలు సాధించిన కార్యశీలురాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర మహిళా సంస్థను స్థాపించి లక్షలాది సంఖ్యలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన మాన్యచరిత.

ఈ విషయాలన్నీ ఆమె ‘ది స్టోన్‌ దట్‌ స్పీకెత్‌’ అనే విఫలమైన స్వీయచరిత్రలో ఉల్లేఖించింది. పునాదిరాయి మహా భవనం కావడమే ఆమె సంకల్పం. ఏడెనిమిది సంవత్సరాల వ్యవధిలో ఆమె మెట్రిక్యులేషన్‌ పరీక్ష నుంచి ఎం.ఏ, బి.ఎల్‌. కాగలిగింది. ఇంగ్లీషు అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఇంత తక్కువ కాలవ్యవధిలో అంత గొప్ప చదువు సాధించిన వారి చరితలు ఎక్కడా కనబడవు. ”క్రిమినల్‌ లా”లో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించిన వారి దృష్టాంతాలు కూడా మరెక్కడా కనబడవు. పాకాల రాజమన్నార్‌, కోకా సుబ్బారావులతో ఆమె వ్యాజ్య వివాదాలలో సమాలోచనలు జరిపింది. భారత రాజ్యాంగ సభ తొలి అధ్యక్షులైన జి.వి.మావలంకర్‌ ఆమెనెంతో అభిమానించేవారు. తన సంస్థాన నిర్వహణ కృషి అంతా ‘ది స్టోన్‌ దట్‌ స్పీకెత్‌’ అనే రెండు సంపుటాల స్వీయచరిత్రలో ఆమె వివరించింది. ‘ద్వైమాతురగణాధిపః’ అన్నట్లు ఆమె గణనీయురాలు. ఆమె సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వం ఈ స్వీయ చరిత్రలో దర్శనమిస్తుంది.

1930వ సంవత్సరం ఆమె జీవితంలో సంచలనాత్మకమైన కాలం. చెన్నపట్నంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహానికి ఆమె నాయకత్వం వహించింది. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలనామె సత్యాగ్రహంలో సృష్టించింది. అయినా ఆమె ఎట్లా తీరిక చేసుకున్నదో 1930 ఫిబ్రవరి ‘భారతి’లో ఒక గొప్ప కథ రాసింది. ఆ కథ పేరు ‘పశ్చాత్తాపము’. భారతీయ కుటుంబ జీవనానికి, సంస్కృతికి, విలువలకు, ఆశయాలకు, పాశ్చాత్యజీవన విధానానికి ఉండే అంతరాలను ఈ కథలో ఆమె హృద్యంగా చిత్రీకరించింది. రచనాశైలి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ‘కమల’ అనే ఒక ముగ్ధను, తరుణ వయస్కురాలిని పాశ్చాత్య నాగరికత అనే ప్రలోభాల రొంపితో స్వయంగా ఆమె భర్తే ఏ విధంగా అకృష్టురాలిని చేశాడో, అది ఏ విధమైన విషమ, విషాద పరిణామాలకు దారితీసిందో, ఆ భర్తలోనే ఏ విధమైన పరివర్తనకు అది ప్రేరేపించిందో, అదృష్టవశాత్తు ఆమె కూడా ఆత్మావలోకనం చేసుకుని ఎలా పశ్చాత్తాపానికి లోనైందో ఈ కథలో ఆమె చిత్రించింది. 1930ల నాటికి విద్యాధికులలో పాశ్చాత్య నాగరికత, సాహిత్యం, సంస్కృతుల పట్ల మోజు ప్రబలంగా

ఉండేది. ఎందరో బారిష్టరు చదువుల కోసం ఇంగ్లండు వెళ్ళాలని ఆరాటపడుతుండేవారు. ‘క్లబ్బు’ మోహం ఉండేది. మన సాహిత్య సంస్కృతుల పట్ల అనాదరణ, అగౌరవం, నిర్లక్ష్యం ఉండేవి. ఇటువంటి వాతావరణంలో ఈ కథలో ఆమె ఎంతో నేర్పుగా వర్ణించింది. ఇంకా ఆమె జైలు జీవితం గడిపినప్పుడు ‘లక్ష్మి’ అనే నవల రచించినట్లూ, ఆ కఠోర జీవితంలో ఇది ఎక్కడో విస్మృతమైనట్లు తెలుస్తున్నది. ఆంధ్ర మహిళ పత్రిక నడపడంలో, ఆంధ్ర మహిళా సంస్థను నిర్వహించడంలో ఆమె సృజనాత్మకత ఎంత ప్రజ్ఞావిలసితంగా

ఉండేదో స్వీయ చరిత్ర ద్వారా స్పష్టమవుతుంది. ఆమె రచనలు నేడు లభ్యంలో లేవు. లభ్యమై ఉంటే ఉత్తమ రచయిత్రిగా ఆమె సుప్రతిష్టురాలై ఉండేది. సంఘర్షణాత్మకమైన అత్యంత సంచలనాత్మకమైన ఆమె జీవిత సంఘటనలు అందుకు అవకాశం కలిగించలేదు. ఆమె తెలుగు సాహిత్య దురదృష్టం.

ఆనాటి ప్రముఖ ప్రసిద్ధ చిత్రకారుడు తలిశెట్టి రామారావు, దుర్గాబాయి రాసిన ఈ కథకు పదిదాకా బొమ్మలు వేయడం స్మరణీయం. ఆ బొమ్మలు కూడా కథకు తగినట్లు ఎంతో బాగున్నాయి.

(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.