కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై పెరిగిన గృహ హింస -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారని తెలిపింది. నేషనల్‌ క్రైమ్‌ రీసెర్చ్‌ బ్యూరో (NRCB) ప్రచురించిన ”క్రైమ్‌ ఇన్‌ ఇండియా” రిపోర్ట్‌ 2018, ప్రకారం భారతదేశంలో ప్రతి 1.7 నిమిషాలకు మహిళలపై ఒక నేరం నమోదవుతున్నది. ప్రతి 4.4 నిమిషాలకు ఒక మహిళ గృహ హింసకు గురవుతోంది. ఈ రిపోర్ట్‌ ప్రకారం ఇండియాలో 2018లో మహిళలపై నేరాలకు సంబంధించి 89,097 కేసులు నమోదయ్యాయి. ఇది 2017లో నమోదైన 86,001 కేసుల కంటే ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (National Family Health Survey) 2015-16 ప్రకారం భారతదేశంలో 15-49 ఏళ్ళ వయసు మహిళల్లో 30 శాతం మంది శారీరక హింసను అనుభవిస్తున్నారు. శారీరక, లైంగిక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్న వివాహిత మహిళలలో 83 శాతం మంది వారి భర్తలను ప్రధాన నేరస్తులని, ఆ తర్వాత భర్త తల్లులు (అత్తలు – 56 శాతం), తండ్రులు (మామలు – 33 శాతం), తోబుట్టువులు (ఆడపడుచులు – 27 శాతం) పేర్కొన్నారని తెలిపింది. అంటే దీన్ని బట్టి సామాజిక శాస్త్రవేత్త ఉబెరాయ్‌ (1995) చెప్పినట్లు కుటుంబం హింస, వివక్షతలకు ఒక ప్రదేశంగా అర్థం చేసుకోవచ్చు.

ఆధిపత్య నిబంధనల ప్రాబల్యం, లైంగిక లేదా గృహ హింస నుండి బయటపడిన వారిపై పొంచి ఉన్న ప్రమాదాల ఫలితంగా గృహ హింస కేసులు చాలా తక్కువగా నివేదించబడుతున్నాయి. పోలీసులను సంప్రదించేటపుడు మహిళలు అసురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే తమ భాగస్వాములను అరెస్ట్‌ చేస్తే వారు విడుదలయ్యాక దారుణమైన దాడులు, వివక్షతకు గురవుతారని మధ్యంతర కాలంలో, వారి అత్తమామల నుండి ఇతర కుటుంబ సభ్యుల నుండి వేధింపులను ఎదుర్కోవలసి వస్తుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు.

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4 ప్రకారం, భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో 25.3% మహిళలు, 34.1% గ్రామీణ మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల మహిళలు నగర ప్రాంతాల మహిళలకంటే ఎక్కువగా గృహ హింసను ఎదుర్కొంటున్నారు. సెంటర్‌ ఫర్‌ ఎంక్వైరీ ఇన్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ థీమ్స్‌ సంస్థకు చెందిన సంగీత రేగి ప్రకారం, గృహ హింస కేసుల సంఖ్య పెరుగుదల ఉందో లేదో నిర్ధారించడానికి స్పష్టమైన సమాచారం లేదు. కానీ నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-4 నుండి వచ్చిన సమాచారం ఆధారంగా భారతదేశంలో 30% మహిళలు గృహహింసతో పోరాడుతున్నారని తెలిపింది. శ్రీనివాస్‌ గోలి, ఎండి., జూయల్‌ రానా, జితేంద్ర గౌడలు నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-4 సమాచారాన్ని ఉపయోగించి సన్నిహిత భాగస్వామి హింస (Intimate partner violence) మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై చూపే ప్రభావాలను అధ్యయనం చేసి గృహ హింస భారతీయ సమాజంలో సర్వసాధారణమని కనుగొన్నారు. స్త్రీ తన పరిస్థితులను అధిగమించే అవకాశాలు పరిమితం. ఎందుకంటే అభివృద్ధి చెందిన అనేక దేశాల మాదిరిగా కాకుండా తక్కువ సంఖ్యలో మహిళలు మాత్రమే సహాయం, కౌన్సెలింగ్‌ పొందడం లాంటివి విస్తృతమైన ప్రసూతి సమస్యలకు, ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. సన్నిహిత భాగస్వామి హింసను ఎదుర్కొనే వ్యూహాలు దాని మూల కారణాలను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల బలహీనత, వారిపై అణచివేత, హింస అనేది తక్కువ చర్చనీయాంశం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం, మరణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలు నిర్మూలించకపోతే ఆరోగ్య స్థిరమైన అభివృద్ది లక్ష్యాలను (ఎస్‌డిజి) సాధించడం కష్టం.

కోవిడ్‌-19 వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలలో ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా గృహహింస కేసులు, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా, యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, బ్రెజిల్‌, ట్యునీషియా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, ఇతర దేశాలలో గృహ హింస, సన్నిహిత భాగస్వామి హింస కేసులు ఎక్కువగా నివేదించాయి. భారతదేశంలో కూడా కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మహిళలపై దాడులు, గృహ హింస కేసులు బాగా పెరిగాయి. గతం నుంచి గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు మాత్రం లాక్‌డౌన్‌ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే, నరకం అనుభవించారు. అనుమానంతో వేధించేవారు కొందరు, రాచి రంపాన పెట్టేవారు కొందరు, అయినదానికీ, కానిదానికీ కన్నీళ్ళు పెట్టించేవారు మరికొందరు. ఇలా రకరకాల కారణాలతో ఇంట్లోని మహిళలు హింసకు టార్గెట్‌ అవుతున్నారు. అత్తమామలు, ఆడపడుచులు, ఇతర బంధువులతో కలిసి ఒకే ఇంట్లో ఉండే మహిళల ఆవేదన చెప్పుకోలేనిది. ఇంట్లో భర్తకు మద్యం తాగే అలవాటుంటే అలాంటి కుటుంబాల్లో భార్య ఎదుర్కొంటున్న హింస గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్‌డౌన్‌తో మద్యం షాప్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేశారు. ఎక్కడా చుక్క మద్యం దొరకలేదు. రోజూ మద్యం తాగితేనే కానీ ఉండలేని మగవాళ్ళ ప్రవర్తన మహిళలను మరింత ఇబ్బందిపెట్టింది. కరోనా భయంతో ఇంట్లోకి పనివాళ్ళను అనుమతించడం లేదు. దీంతో పెద్ద కుటుంబాలలో ఇంటి పని భారం అంతా భార్యపైనే పడింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒక యంత్రంలా పనిచేసినా ఏది తక్కువయినా సూటిపోటి మాటలు, తిట్లు తప్పలేదు. సామాజిక శాస్త్రవేత్త మరియాన్నే హెస్టర్‌ ప్రకారం, ఎప్పుడైతే కుటుంబాలు అందరూ కలిసి ఎక్కువ కాలం గడుపుతారో అక్కడ గృహహింస పెరుగుతుంది. పండుగ సెలవులు, వేసవి సెలవులు లాంటి సమయాల్లో మహిళలపై ఈ హింసలు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎప్పుడైతే ఇండియాలో 25 మార్చి 2020 నుండి లాక్‌డౌన్‌ ప్రకటించారో అప్పటి నుంచి జాతీయ మహిళా కమిషన్‌కు గృహహింసపై చేరిన ఫిర్యాదుల సంఖ్య రెట్టింపయింది. లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై జరుగుతున్న హింసపై ఫిర్యాదులకు జాతీయ మహిళా కమిషన్‌ 72177 35372 అనే వాట్సాప్‌ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కానీ ”జాగోరీ” అనే మహిళా హక్కుల సంస్థ చెప్పిన వాస్తవాల ఆధారంగా మహిళలు వారిపై జరుగుతున్న హింసపై ఫిర్యాదు చేయాలంటే వారు సెల్‌ ఫోన్‌ లేదా ల్యాండ్‌ లైన్‌ కలిగి ఉండాలి. 57% భారత మహిళలకు వ్యక్తిగత సెల్‌ఫోన్‌ లేనందున వారి ఫిర్యాదుల సంఖ్యా పరిమితి తక్కువ అని వెల్లడించింది. ముఖ్యంగా కోవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉండడం వలన ఇంటి పని మొత్తం మహిళలే చేశారు. గృహ హింసకు అధిక ”గృహ పని” భారం కూడా ఒక కారణమే. ఎందుకంటే ఈ ఇంటి పని విషయంలో మహిళలు కుటుంబ సభ్యులు ఆశించినంతగా పనులు చేయకపోతే వారు హింసకు గురవుతున్నారు. అలాంటి సమయంలో మహిళలు అధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్నిసార్లు మహిళలు తమ తరపున సమస్యను నివేదించడానికి కుటుంబ సభ్యులపై కూడా ఆధారపడతారు. ఉదాహరణకు ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం తన కుమార్తె తరపున ఒక తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదును కూడా ఎన్‌సిడబ్ల్యు అందుకున్నట్లు నివేదించింది. ఆమెను తన భర్త దారుణంగా కొట్టాడని, ఆహారం ఇవ్వడానికి కూడా నిరాకరించాడని ఆరోపించారు. గృహ హింసకు అనేక కొలతలు ఉన్నాయి. ఇవన్నీ పితృస్వామ్య అధికారం నుండి పుట్టుకొచ్చాయి. గృహ హింస పెరుగుదలకు కారణమైన మరో ముఖ్యమైన అంశం మహిళలను గృహ కార్మికులుగా పరిగణించటం. ప్రపంచవ్యాప్తంగా లింగ పాత్రలు (Gender roles) ఆధారంగా మహిళలు ఇంటి పనిని వారి భుజాలపై వేసుకున్నారు. ఇది సామాజికంగా, సాంస్కృతికంగా ఇంట్లో చేసే ప్రతి పని అంటే గృహ ఆధారిత పని ”మహిళల పని”గా ముద్ర పడిపోయింది. ఊర్వశి గాంధీ ప్రకారం ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉన్నందున ఇళ్ళల్లో పని భారం పెరిగింది. హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఆ భారాన్ని భరించాలని కుటుంబాలు ఆశించాయి. కాబట్టి ఆ పనులు చేయకపోతే వారిపై హింసలు పెరిగాయి. గృహ హింస నుండి రక్షించడానికి చట్టాలు ఉన్నప్పటికీ పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ గొంతు నులిమి న్యాయ వ్యవస్థ ప్రవేశించడం అంత సులభం కాదు.

జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక ప్రకారం లాక్‌డౌన్‌ మొదలైన 2020 మార్చి నెల నుండి జూన్‌ వరకు చూస్తే జూన్‌ నెలలోనే 2,043 అత్యధిక ఫిర్యాదులు అందాయని తెలిపింది. వాటిలో అత్యధికంగా 603 గృహ హింస ఫిర్యాదులు ‘గౌరవంగా జీవించే హక్కు’ పరిధిలో వచ్చాయి. గౌరవంగా జీవించే హక్కు మహిళల మానసిక వేధింపుల అంశంలోకి వస్తుంది. 2019 సంవత్సరం సెప్టెంబరులో వచ్చిన 2,379 ఫిర్యాదుల తర్వాత 2020 జూన్‌లో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఇవి కాకుండా అత్యాచారాలు, వరకట్న వేధింపులు, వేధింపు కేసులు కూడా ఉన్నాయి. ఎన్సీడబ్ల్యు నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన హింసకు సంబంధించిన ఫిర్యాదులు 2020 మే నెలలో 1,500, ఏప్రిల్‌లో 800, మార్చిలో 1,347, ఫిబ్రవరిలో 1,424, జనవరిలో 1,462, 2019 సంవత్సరం డిసెంబర్‌లో 1,402, నవంబర్‌లో 1,642, అక్టోబర్‌లో 1,885 ఫిర్యాదులు వచ్చాయని కమిషన్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్‌, ట్విట్టర్‌ ద్వారా అధికంగా ఫిర్యాదులు వచ్చాయని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడం వల్ల ఫిర్యాదులు సులువుగా తీసుకోవడం జరిగిందని, దూరదర్శన్‌, అత్యవసర వాట్సాప్‌, హెల్ప్‌లైన్‌ నంబర్ల ద్వారా మహిళల్లో అవగాహనను పెంచామని, ఎన్సీడబ్ల్యు అందుకున్న ఫిర్యాదులలో 99% కొత్త కేసులు కాదని, సంప్రదించిన చాలామంది మహిళలు, బాలికలు గత కొన్నేళ్ళుగా ఇంట్లో హింసను అనుభవిస్తున్నారని చెప్పారు. ఎన్సీడబ్ల్యు మహిళల శ్రేయస్సు, సాధికారత కోసం పనిచేస్తోందని, తద్వారా వారు ఎప్పుడైనా, ఏ రోజునైనా తమను చేరుకోవచ్చని, సహాయక చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (NLSA) 2020 రిపోర్ట్‌ ప్రకారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయం గృహ హింస కేసులు వేగంగా పెరగడానికి దారి తీసిందని, లాక్‌డౌన్‌ ప్రారంభం (మార్చి 25) నుండి మే 15 వరకు 28 రాష్ట్రాలలో లీగల్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఎల్‌ఎ) ద్వారా సేకరించబడిన కేసులను నమోదు చేసింది. అందులో ఉత్తరాఖండ్‌లో అత్యధిక గృహ హింస కేసులు నమోదయ్యాయని, హర్యానా రెండవ స్థానంలో, దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయని పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 1.85 మిలియన్ల మంది మహిళలు గర్బస్రావం సేవలు అందుకోలేకపోయారని, ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో పాటు ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా ఆరోగ్య సమస్యలకు కొన్ని ఆస్పత్రులలో అసలు వైద్యం చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కెమిస్ట్‌ అవుట్‌లెట్లలో అబార్షన్‌ను నిరాకరించినట్లు 12 రాష్ట్రాలలో పనిచేసే ఐపాస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (ఐడీఎఫ్‌) చేసిన సర్వేలో వెల్లడైంది. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్‌ మరియు నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నాల్సా) సహకారంతో న్యాయ సేవల ద్వారా మహిళల సాధికారత సాధించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిర్యాదుల పరిష్కారానికి అందుబాటులో ఉన్న మాధ్యమాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రచార కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం మొదట దేశంలోని 8 రాష్ట్రాలలో… ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో ప్రచారం ప్రారంభించింది. మహిళలకు చట్టపరమైన హక్కులపై అవగాహన లేకపోతే మహిళా సాధికారత ఉండదని ఎన్సీడబ్ల్యు క్రమం తప్పకుండా చట్టపరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కానీ నాల్సా సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని మహిళలను చేరుకోవడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాల మహిళల్లో చట్టపరమైన అవగాహన ఏర్పడుతుందని ఎన్సీడబ్ల్యు తెలిపింది. బ్రిటిష్‌ పాలన నుండి భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుండి దేశంలో మహిళలు భద్రత, వివక్ష, ఆర్థిక స్వాతంత్య్రం లాంటి సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఎన్సీడబ్ల్యు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఒకేసారి రెండు పోరాటాలు చేశారు. అవి వారి దేశానికి మరియు వారి స్వేచ్ఛ కొరకు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంటారు. గతంలో మహిళా కమిషన్‌ మహిళల చట్టపరమైన హక్కుల గురించి జ్ఞానాన్ని పెంచడం ద్వారా సమానత్వం, న్యాయం సాధించాలనే లక్ష్యంతో ”మహిళలు, బాలికల కోసం దేశవ్యాప్త చట్టపరమైన అవగాహన కార్యక్రమం” ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమల్లో ఎన్జీఓలు, ప్రసిద్ధ సంస్థలు పనిచేశాయి. అయితే గృహ హింస కేసులు పెరిగే పరిస్థితి భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా గృహ హింస తరచూ జరుగుతోంది, మరియు పునరావృతమవుతోంది. అయినప్పటికీ కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో మహిళా సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ గృహ హింస హెల్ప్‌లైన్‌లు, సంస్థలు పనిచేశాయి, నిరంతరం పనిచేస్తున్నాయి.

ముగింపు :

కోవిడ్‌-19 వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలలో ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా మహిళలపై గృహ హింస కేసులు, ఇతర హింసలు, దాడులు ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడం వల్ల వారు ఆశించినంతగా పనిచేయకపోతే, నిరుద్యోగం, ఉపాధి లేమి, ఆర్థిక భారం, పురుషులకు మద్యపానం అందుబాటులో లేకపోవడం వంటి ప్రభావాలు మహిళలను సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అనేక సమస్యలకు గురిచేసింది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో గృహ హింసను తీవ్రతరం చేసే ప్రమాదకర పరిస్థితులను ప్రభుత్వం గమనించాలి. నిజం చెప్పాలంటే లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు నిస్సహాయంగా ఉన్నారు. ఎందుకంటే ఆశ్రయ గృహాలు లేవు. లైంగిక, ప్రసూతి, ఇతర ఆరోగ్య సమస్యలకు హాస్పిటల్‌లో తక్కువ వైద్య సేవలు అందించబడ్డాయి. ఎందుకంటే కోవిడ్‌-19 రోగులకు వైద్యం అందించడంలోనే వైద్య సిబ్బంది దృష్టి పెట్టారు. కోవిడ్‌-19ను ఎదుర్కోవడానికి భౌతిక దూరం, చేతులు కడుక్కోవాలని సూచించే ప్రచారాలను ప్రభుత్వం అమలు చేసిన విధంగానే గృహ హింస గురించి కూడా అవగాహనను ప్రోత్సహించడానికి, ఫిర్యాదులను నమోదు చేయగల మాధ్యమాల ఆవశ్యకత, తగు ప్రచారం అవసరం. జాతీయ వార్తా, రేడియో ఛానెల్‌లు, పత్రికలు, సామాజిక మాధ్యమాలను వ్యూహాత్మకంగా ఉపయోగించాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల గిరిజన వాసులకు కూడా గృహ హింస, దాని సహాయక చర్యలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. బాధితులకు వైద్య, న్యాయ సహాయం, 24శ7 కౌన్సెలింగ్‌, ఆశ్రయం ఇవ్వడానికి లాభాపేక్ష లేని సంస్థలు పనిచేస్తున్నాయి. అందువల్ల కోవిడ్‌-19ను ఎదుర్కొనడానికి చేసిన ప్రయత్నాలలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళల సహాయానికి పౌర సమాజ సంస్థలు, సలహాదారులు, మానసిక ఆరోగ్యసంస్థలు, ఇతర సేవా సంస్థలను ప్రభుత్వం అనుమతించాలి. గృహ హింస బాధలో ఉన్న మహిళలు, బాలికలను చేరుకోవడం ప్రభుత్వం అత్యవసర సేవగా పరిగణించాల్సిన అవసరం ఉంది. గృహ హింస, ఇతర హింస సమస్యల పరిష్కారానికి వివిధ సహాయ పోలీస్‌ హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటికి ఫిర్యాదులు ఎక్కువగా నగర ప్రాంత మహిళల నుండే వస్తున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళా భాధితులకు హెల్ప్‌లైన్‌లపై సరైన అవగాహన ఉండడంలేదు. మొబైల్‌, ఇతర సామాజిక మాథ్యమాల్లో వారు అందుబాటులో లేకపోవడం, సామాజిక కట్టుబాట్లు ప్రధాన కారణాలు. అందుకే సఖి వన్‌ స్టెప్‌ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలను సెంటర్లుగా చేసుకొని ఏర్పాటు చేయాలి. అప్పుడే గృహ హింసపై అవగాహన, మహిళా హక్కులు-చట్టాలపై సమాచారం, సహాయక చర్యలు ప్రతి మహిళకూ అందుతాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.