తెలంగాణ పల్లె కోయిలమ్మ యశోదా రెడ్డి – డా|| కొమర్రాజు రామలక్ష్మి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథా రచయిత్రి అయిన పాకాల యశోదారెడ్డి గారు 1929 ఆగస్టు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా (పాలమూరు జిల్లా) బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి, సరస్వతమ్మలకు జన్మించారు. మూడు తరాలు చూసిన ముత్తవ్వగా పేరు గాంచిన యశోదారెడ్డి గొప్ప కథకురాలు. ఆమె కథలు అచ్చమైన మాండలికంలో ఉన్నాయి. మాండలిక పదాలను ప్రజలు ఎలా పలుకుతారో అదే విధంగా ఆమె కథల్లో రాశారు. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో యశోదారెడ్డి స్థానం విశిష్టమైంది. ప్రాచీన సాహిత్యంపై లోతైన పాండిత్యం, సంస్కృతంపై పట్టు ఉండి కూడా తెలంగాణా భాష ప్రాధాన్యతను గుర్తించిన రచయిత్రి ఆమె. తన 12వ ఏట నుండే కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టిన యశోదారెడ్డి 1955లో అంటే తన 25వ ఏట మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా చేరారు. 1955 జులై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకురాలిగా, అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా, విద్యార్థి సలహాదారుగా వ్యవహరిస్తూనే ఇంకా అనేక ఇతర పదవీ బాధ్యతలను నిర్వర్తించారు.

యశోదారెడ్డిని చిన్నప్పుడు ఎచ్చమ్మ అని పిలిచేవారు. ఆమెకు 1947 మే నెలలో తిరుపతిరెడ్డి గారితో పెళ్ళి జరిగింది. ఆయన పి.టి.రెడ్డిగా ప్రసిద్ధి గాంచిన చిత్రకారులు. డాక్టర్‌ పి.యశోదారెడ్డి గొప్ప పరిశోధకులు. 1969లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి పర్యవేక్షణలో తెలుగులో ‘హరివంశములు’పై విస్తృత పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు. వందకు పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘భారతంలో స్త్రీలు’ అనే గ్రంథంపై చేసిన పరిశోధన విశిష్టమైనది. ప్రబంధాలను పరిశీలించడానికి స్త్రీలు జంకే కాలంలో వాటిని పరిశోధించిన ధీరవనిత యశోదారెడ్డి. అదే స్థాయి లోతైన పరిశోధనా దృష్టి తెలంగాణ గ్రామీణ జీవన చిత్రీకరణలోనూ మనకు కనిపిస్తుంది.

యశోదారెడ్డి అచ్చమైన తెలంగాణ భాషకు ప్రతీక. తెలంగాణ భాషను, సంస్కృతిని, కుటుంబ సంబంధాలను, రక్త సంబంధాలను, పండుగలు, పబ్బాలను, మూఢ విశ్వాసాలను యశోదారెడ్డి మాత్రమే తమ రచనల్లో చిత్రించగలిగారు. ఆమెకు పల్లెతనం, పల్లె ప్రేమ ఎక్కువ. బాల్యంలో బిజినేపల్లి లేదా చౌదరిపల్లె, మహబూబ్‌నగర్‌లలో ఆడిపాడినందుకేమో ఆ జ్ఞాపకాల చిక్కదనం ఆమెను అంటిపెట్టుకొని ఉంది. యశోదమ్మ ఊరినీ, పరిసరాలనూ, ఉత్పత్తి జనాన్నీ, వారి జీవన విధానాలూ, ఘటనలూ అన్నీ మేధస్సులో జ్ఞాపకాలుగా భద్రపరచుకున్నారు. ఆమె కథలకు పునాది, నేపథ్యం, జనజీవం పల్లె జీవనమే అయింది. తెలంగాణా భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఆమె కథల్లో చాటి చెప్పారు.

యశోదారెడ్డి మంచి విమర్శకురాలు కాబట్టి ఆమెకు కథను గురించి, దాని చరిత్ర, లక్షణాలను గురించి అవగాహన ఉంది. ఆమె మొదటి కథల సంపుటి ‘మా వూరి ముచ్చట్లు’ 1973లో అచ్చయింది. దీనిలో పది కథలున్నాయి. వీటన్నింటిలో గ్రామీణ జీవిత చిత్రణ కనిపిస్తుంది. 1999లో ఆమె కలం నుండి మరొక కథా సంపుటి ‘ధర్మశాల’ వెలువడింది. దీనిలో 24 కథలున్నాయి. వీటిలో మధ్య తరగతి జీవన చిత్రణలు కూడా కనిపిస్తాయి. 2000 సంవత్సరంలో అచ్చయిన ‘ఎచ్చెమ్మ కథలు’ సంపుటిలో 20 కథలున్నాయి. ఇవన్నీ చాలా వరకు గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేవే. మా వూరి ముచ్చట్లు 1950-65, ఎచ్చెమ్మ కథలు 1965-80, కాలాల జీవితాలను, పరిణామాలను, భాషను, సంస్కృతిని చిత్రిస్తే, ధర్మశాలలో 1980-1999 మధ్య పరిణామాలను చిత్రించారు. యశోదారెడ్డి తెలంగాణా భాషను, పలుకుబడులను, మాటతీరును, సంస్కృతిని తన కథల్లో నిక్షిప్తం చేశారు. భాష సంస్కృతికి ఆయువుపట్టు అని భావించి వాటిని రికార్డు చేయాలని కథలు రాశారు. ఆమె వెనకటి కాలాన్ని ఊరిస్తూ గొప్పగా ఉందని బాల్య జ్ఞాపకాలను ఆకర్షణీయంగా చిత్రించినా ఎన్కటి కాలం మారిపోయినందుకు బాధపడుతూ చిత్రించలేదు. ఆధునిక అభివృద్ధిని వ్యతిరేకించలేదు. ఆధునిక సామాజిక పరిణామాలను అర్థం చేసుకొని కాలం తెచ్చే మార్పులను సానుకూలంగా స్వీకరించారు, పరిశీలించారు.

కథ ఎప్పుడూ నిరాధారంగా పొటమరిల్లదు. కథా వస్తువు ఎక్కడో అంతూ పొంతూ చిక్కని ఆకాశం నుండి ఊడిపడదు. అది జీవితం నుండి, జనానీకం నుండి, పరిసరాల నుండి, నిశితమైన చూపు నుండి, అనుభవరాశి నుండి మొలకెత్తుతుంది. అన్నీ యశోదారెడ్డి గారు కథను రమణీయంగా మలచడం రచయిత రచనపై, శిల్ప సామర్ధ్యాలపై ఆధారపడి ఉంటుందని కూడా అంటారు.

రచయిత తన అనుభవాలు, నిశిత దృష్టితో చూపిన విషయాలు మెదడులో ఓ మూల స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ అనుభవసారమే రచయితకు నిగూఢ నిధిలా ఉపకరిస్తుంది అని గుర్తించిన యశోదారెడ్డి చాలా కథల్లో చిన్ననాడు చూసిన పల్లెటూళ్ళు, అక్కడి మనుషులు, పేర్లు, అప్పటి జీవితం, సంస్కృతి ప్రతిబింబిస్తాయి.

తన కథలు నేల విడిచి సాము చేయలేదనీ, ఏ ఊహాలోకం నుండో ఊడి పడలేదనీ, వస్తువు ఎక్కడో మిన్నులుపడ్డ తావుల నుండి రాలేదని చెప్పే ఆమె అన్నీ తన ఉనికి చుట్టూ ఉన్న విషయాలే అంటారు. తెలుగు పలుకుబడులు నశించకుండా ఉండి భావితరాలకు అందాలనే వాటిని కతలలో పొదిగి అల్లడం జరిగింది అంటారు యశోదారెడ్డి.

ఒక జాతికి భాషా సంస్కృతులే కాదు ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు అన్నీ ప్రత్యేకమే. అవి ఆ జాతికి ఆయువు పట్టు వంటివని గుర్తించి తన భాషను, యాసను శ్వాసిస్తూ, తెలుగు సాహిత్య సేద్యం కావించిన పండిత శ్రామికురాలు యశోదారెడ్డి. మన భాషలోని అందాలను, పలుకుబడుల తియ్యందనాలను తన జీవన పర్యంతం హత్తుకొని వాటిని విశిష్ట సంపత్తిగా ముందు తరాలకు అప్పగించే బృహత్తర బాధ్యతలను నెత్తికెత్తుకున్న తెలంగాణ పల్లె కోయిలమ్మ యశోదమ్మ. అమూల్యమైన సాహితీ సంపదను మనకందించి తన చివరి ఊపిరి వరకు జ్ఞానసేద్యం చేస్తూ 7 అక్టోబర్‌ 2007న కీర్తిశేషులైన ఆ అమ్మకు నివాళులు.

Share
This entry was posted in సంస్మరణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.