దేశంలో ట్రాన్స్‌జెండర్ల స్థితిగతులు-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

భయంకర బాధల పాటల…పల్లవి!

”పూటపూట జేసుకోని బతికెటోళ్ళం…పూటగడవా ఇంతదూరం వచ్చినోళ్ళం… దేశమేమో గొప్పదాయె మా బతుకులేమో చిన్నవాయె… మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్ను బోసె… పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో…” అంటూ కరోనా కాలంలో వేనవేల మంది వలసజీవుల వెతలకి మారుగా మార్మోగింది ఆ పాట. ‘కలిసిమెలిసి కలోగంజో తాగెటోళ్ళం… కష్టకాలం ఇంటికాడ ఉంటా’మని వేడుకున్న కష్టజీవుల కంటి చెలమల్ని ధారగట్టిందా పాట. కానీ, అలా అయినవాళ్ళని తలుచుకోడానికి ఒక ఇల్లూ, మాది అని చెప్పుకోడానికంటూ ఓ ఊరూ కూడా లేని ఇంకా అట్టడుగు అభాగ్యులు-ట్రాన్స్‌జెండర్లు! కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కడుపునిండే మార్గం లేక, ఆదుకునే చేయి లేక, ‘ఊరు పొమ్మంటే, కాడు రమ్మంది…’ అన్నట్టు దిక్కులేక విలవిల్లాడారు.

ట్రాన్స్‌జెండర్‌ లోపలి మనిషికి, బైట రూపానికి ఉన్న అంతరాన్ని ఛీత్కరించకుండా సమాజం సానుభూతి చూపాలని, చిన్నబుచ్చకుండా అర్థం చేసుకోవాలని ట్రాన్స్‌ జెండర్లు చేసే బతుకు పోరాటమే- ఒక మహా ప్రయాణం; దూరాలూ… కాలాలూ కొలవలేని ఓ అంతులేని నడక. కానీ, కరోనా లాక్‌ డౌన్‌ కరుకు కాలంలో మాత్రం ఉన్నచోటు నుంచి కదల్లేని బందీఖానా బతుకులు గడుపుతున్నారు. ఉన్న ఊళ్ళో ఉపాధి దొరకక, వెళ్ళడానికి ఏ ఒక్క దారి కూడా లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని చాలామంది ట్రాన్స్‌జెండర్లు పుట్టింటికి కానివాళ్ళే. తమని కాదనుకున్న కుటుంబాలకు దూరంగా, కానివాళ్ళుగా చూసే సమాజంలో ఒంటరిగా తమ తోటి ట్రాన్స్‌జెండర్లతో కలిసి బతుకుతుంటారు. ట్రాన్స్‌ జెండర్లలో హిజ్రాలు ఎలాగోలా ఒకచోట కలిసిపోయి ఉంటారు; మిగిలిన వాళ్ళు మాత్రం ఒక్కరే ఉండడం లేదా తమ భాగస్వాములతో కలిసి ఉండడం లాంటివి చేస్తారు.

పుట్టినింటిని వదిలిపెట్టి వచ్చిన ట్రాన్స్‌జెండర్లలో హిజ్రాలు చాలావరకు టోలీ బధాయీ(ఱ) లాంటి సంప్రదాయాల మీద, వ్యభిచారం మీద ఆధారపడి పొట్టపోసుకుంటారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ పుణ్యమాని వాళ్ళ ఆ కాస్త ఆదాయం కూడా పూర్తిగా సున్నా అయింది. ఇక మిగిలిన ట్రాన్స్‌జెండర్లలో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న ట్రాన్స్‌-పురుషులకు లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోయింది. వాళ్ళమీద హింస కూడా చాలా తీవ్రంగా ఉంటోంది. భౌతిక దాడులు చేయడం, ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించడం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి నేరాలను అరికట్టడానికి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. తమ వర్గంలోని ఇతరులతో సంబంధం లేకుండా విడిగా ఉండే ట్రాన్స్‌ జెండర్లకు ఏ విధమైన సాయం అందడం కూడా గగన కుసుమమే అయింది. దీంతో కొంతమంది మళ్ళీ తమని కాదనుకొన్న పుట్టిళ్ళ ఆరళ్ళే నయమనుకొని, ఆ హింసను భరించడానికైనా సిద్ధమై తిరిగి వెళ్తున్నారు.

నగరాల్లో పరిస్థితి ఇలాగ ఉంటే, పట్టణాలు, పల్లెల్లో వీళ్ళు అనుభవిస్తున్న నరక బాధలు చెప్పనలవి కావు. వీళ్ళలో చాలామంది ఇప్పటివరకు చేస్తున్న చిన్నా చితకా పనులను కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వచ్ఛంద సంస్థల లాంటివి కూడా ఈ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను దించలేకపోవడంతో ట్రాన్స్‌జెండర్లకు అసలు ఏ రూపంలోనూ సాయం అందడం లేదు.

ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనలోనూ ట్రాన్స్‌జెండర్ల ప్రస్తావనే లేదు. దీన్ని బట్టే రాజ్యం ఈ వర్గాల సంక్షేమం మీద ఏ పాటి శ్రద్ధ వహిస్తోందో ఇట్టే అర్థమైపోతుంది. కొన్ని రాష్ట్రాలలో అక్కడి స్థానిక ప్రభుత్వాలు చొరవ చూపించి, ఏవో కంటితుడుపు చర్యలు తీసుకోవడం తప్ప, చాలావరకు ఈ ట్రాన్స్‌జెండర్లు కరోనా మహమ్మారి రోజుల్లో బతకడానికి సమాజంలో కొందరి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సి వస్తోంది.

ఉన్నదున్నట్లుగా…

2011 జనాభా లెక్కల(ఱఱ) ప్రకారం, భారతదేశంలో సుమారు 4.9 లక్షల మంది ట్రాన్స్‌ జెండర్లున్నారు. ఈ లెక్కలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అరకొర మాత్రమే. ఎందుకంటే, జనాభా లెక్కలు సేకరించే సమయంలో చాలామంది సమాజంలో చిన్న చూపు చూస్తున్నారన్న భయంతో తమని తాము ట్రాన్స్‌జెండర్లుగా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. సామాజిక అవమానానికి వెరసి, ద్వైలింగ విభజనలో ఆడ లేదా మగ వర్గాన్ని ఎంచుకున్నారే తప్ప, తమను తాము ట్రాన్స్‌జెండర్లుగా చెప్పుకునే ధైర్యం వాళ్ళకు లేకపోయింది.

ట్రాన్స్‌జెండర్లలో 54 శాతం మందికి నెలకు రూ.5,000 కంటే తక్కువ సంపాదన మాత్రమే ఉందని ఈ జనాభా లెక్కల్లో తేలింది. వీరిలో 38 శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారని, 65 శాతం మందికే ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ కాలం పని దొరుకుతోందని కూడా అర్థమయింది(ఱఱఱ)

ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి.(ఱఙ) ప్రకారం, 92% మంది ట్రాన్స్‌ జెండర్లకు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే హక్కు లేదు. దానివల్ల వాళ్ళల్లో చాలామంది వ్యభిచార వృత్తిలోకి, యాచక వృత్తిలోకి లేదా బధాయి టోలీలోకి దిగాల్సి వస్తోంది. ముఖ్యంగా ట్రాన్స్‌ మహిళలు, హిజ్రాలది ఇదే పరిస్థితి. కొందరు ట్రాన్స్‌ మహిళలు మాత్రం చిన్న స్థాయి వాణిజ్యవేత్తలుగా, మేకప్‌ కళాకారులుగా, లేదా వినోద వృత్తిలో ఉంటున్నారు. అయితే ఈ వృత్తులన్నింటిలోనూ ప్రజలతో సంబంధాలుంటాయి. ఇవి అసంఘటిత రంగంలో భాగంగానే ఉంటాయి. ఇలా అసంఘటిత రంగానికి చెందడం వల్లే లాక్‌డౌన్‌ సమయంలో ట్రాన్స్‌ జెండర్లు ఉపాధి విషయంలో దారుణంగా దెబ్బతిన్నారు.

ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఇలా…

(ఱ) ‘పరిమిత కాలానికి’ గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 4,500 మంది ట్రాన్స్‌జెండర్లలో ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని జాతీయ సామాజిక రక్షణ సంస్థ ద్వారా 2020 ఏప్రిల్‌ నెలలో అందించింది. బ్యాంకు ఖాతాలు కూడా ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌ జెండర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది.

(ఱఱ) కేరళ ప్రభుత్వం వెయ్యిమంది ట్రాన్స్‌ జెండర్లకు తాత్కాలిక గృహ, ఆహార వసతులను ప్రకటించింది.

(ఱఱఱ) తమిళనాడు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా ట్రాన్స్‌ జెండర్లకు రూ.వెయ్యి చొప్పున సాయం అందించింది. అయితే, తమ వద్ద అధికారిక పత్రాలు కానీ, గుర్తింపు కార్డులు కానీ లేకపోవడంతో చాలామంది ట్రాన్స్‌ జెండర్లు ఈ కొద్దిపాటి సాయాన్ని కూడా అందుకోలేకపోయారు.

(ఱఙ) తెలంగాణ, కర్నాటక, ఝార్ఖండ్‌ లాంటి రాష్ట్రాల్లో అక్కడి హైకోర్టుల ఆదేశాలతో కొద్దిపాటి సాయం అందింది.

(ఙ) లాక్‌ డౌన్‌ సమయంలో తమ సొంత కుటుంబాలతో తప్పనిసరిగా ఉండాల్సి వచ్చిన ట్రాన్స్‌జెండర్లకు గృహ హింస తీవ్రంగా ఎదురు కావడంతో వాళ్ళ మానసిక ఆరోగ్యంపైన కూడా అధిక ప్రభావం పడింది. లాక్‌ డౌన్‌ సమయంలో గృహ హింస కేసులు రెండున్నర రెట్లు పెరిగాయని జాతీయ మహిళా హక్కుల కమిషన్‌ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే, ట్రాన్స్‌జెండర్ల విషయంలో మాత్రం ఇలాంటి సమాచారం ఏదీ అందుబాటులో లేదు.

ఎల్‌.జి.బి.టి.క్యు.ఐ.ఎ+ వ్యక్తుల కోసం హెల్ప్‌ లైన్లు, కౌన్సిలింగ్‌ కేంద్రాలు నిర్వహించే సంస్థలకు వారి నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయి. గతంలో కంటే లాక్‌డౌన్‌ సమయంలో వీటి సంఖ్య బాగా పెరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన ఛీత్కారాలు, హింసను తట్టుకోవడానికి తగినంత మానసిక స్థైర్యం అందించాలని, ఆర్థిక సాయం కావాలని, లేదా కుటుంబంలో తమ పట్ల పెరుగుతోన్న హింసను తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోవడానికి సాయం కావాలంటూనే ఎక్కువ శాతం ఫోన్లు రావడం గమనార్హం.

భారతదేశంలో ట్రాన్స్‌జెండర్లలో 3.1% మందికి హెచ్‌ఐవి ఉంటోందని 2017 నాటి లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి వారికి యాంటీరెట్రో వైరల్‌ థెరపీ మందులు అందుబాటులో లేకపోవడంతో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది.

హార్మోన్ల మార్పిడి చికిత్స (హెచ్‌.ఆర్‌.టి) తీసుకుంటున్న వారు, చేతిలో డబ్బు లేక, ఆస్పత్రులకు వెళ్ళే దారిలేక ఆ చికిత్సకు దూరమయ్యారు. దాంతోపాటు ఆ చికిత్స అత్యవసర సర్వీసుల్లో భాగంగా ఆస్పత్రులు గుర్తించకపోవడమూ వీరికి శాపమే అయింది.

ఇక క్వారంటైన్‌ కేంద్రాలు కూడా చాలావరకు పురుషులకు, మహిళలకు అంటూ విడివిడిగా ఉన్నాయి తప్ప ట్రాన్స్‌జెండర్లకంటూ లేకపోవడం కూడా వీరికి పెద్ద సమస్యగానే మారింది. మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మాత్రం అక్కడ ఉద్యమకారులు గట్టిగా కలగజేసుకున్న తర్వాత ట్రాన్స్‌జెండర్లకూ ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జవాబుదారీతనం కోసం డిమాండ్లు :

ఈ ట్రాన్స్‌జెండర్ల వర్గానికి చెందినవారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రులకు రాసిన అనేక లేఖల్లో పలు విన్నపాలు చేసుకున్నారు. తమకు సాయం కావాలని, జీవనభృతి అందించాలని కోరారు. వాళ్ళు కంటితుడుపు చర్యలు తీసుకున్నారు. గుర్తింపు కార్డులు లేని ట్రాన్స్‌జెండర్లలో ఎవ్వరికీ అవి అందలేదు. ఇలా గుర్తింపు కార్డులు లేనివారికి సాయం అందించే విషయంలో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. అంతే తప్ప, ఈ వర్గానికి చెందిన ఉద్యమకారుల మీద లేనిపోని భారాన్ని మోపాలని ప్రయత్నించకూడదు.

తమకంటూ ఏ ఠికానా లేని, ఎటువంటి పత్రాలు లేని ట్రాన్స్‌జెండర్ల మీద తీవ్రంగా ప్రభావం చూపించే సీఏఏ, ఎన్నార్సీలను వెనక్కి తీసుకోవాలి.

ట్రాన్స్‌జెండర్ల (హక్కుల రక్షణ) చట్టం, 2020 లోని ముసాయిదా నిబంధనలను సరిగ్గా లాక్‌డౌన్‌ సమయంలో రూపొందించారు. నిజానికి ఆ సమయానికి ఈ వర్గానికి చెందిన ఉద్యమకారులంతా సహాయ కార్యకలాపాలలోను, దేశవ్యాప్తంగా ఉన్న ఈ వర్గానికి చెందిన వారిని సంప్రదించడంలోనూ హడావిడిగా ఉన్నారు. దాంతో వారికి ఈ నిబంధనల రూపకల్పనలో పాలుపంచుకునే అవకాశమే లేదు. అందువల్ల ఈ చట్ట నిబంధనలకు తుదిరూపు ఇవ్వడం, దాన్ని నోటిఫై చేయడం లాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలి. మహమ్మారి నియంత్రణలోకి వచ్చేవరకు, ట్రాన్స్‌ జెండర్ల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించేవరకు ఈ చట్టాన్ని ఆపాలి.

అసంఘటిత రంగంలో ఉన్న ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. వారికి విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాల కోసం రిజర్వేషన్లు అందించాలి.

సన్నద్ధానికి పిలుపు :

వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు తమ డిమాండ్ల విషయంలో గళమెత్తడానికి వీలుగా వారితో ట్విట్టర్‌ స్టార్మ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహించొచ్చు. వివిధ హ్యాష్‌ ట్యాగ్‌లతో చిన్న చిన్న వీడియోలు రూపొందించి, వాటిని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాప్తి చెందించాలని ఈ వర్గం వారిని కోరొచ్చు.

లాక్‌డౌన్‌ సమయంలో జరుగుతున్న వివిధ ఉద్యమాలలోనూ ట్రాన్స్‌జెండర్ల గొంతులు ప్రముఖంగా వినిపించేలా చూడాలి.

ఆపత్సమయంలో ఆశాకిరణం-మేము సైతం…

మహమ్మారి వ్యాప్తి చెందిన ఈ తరుణంలో తమిళనాడు, కశ్మీర్‌, అసోం, మణిపూర్‌, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలలో ఈ వర్గానికి చెందినవారు నిధులు సేకరించడంతో ట్రాన్స్‌ జెండర్లు కొంతలో కొంత బతుకుబండిని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అయితే బరేలి, అలహాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లే కొందరు పూనుకొని, ప్రతిరోజూ వందమంది వలస కూలీలకు ఆహారం కూడా అందించారు.

మణిపూర్‌ రాష్ట్రంలో ట్రాన్స్‌ జెండర్ల హక్కుల ఉద్యమకారిణి శాంతా ఖురై చేసిన కృషి ఫలితంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్‌ జెండర్ల కోసం కొన్ని క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ ప్రాంతాల్లో మణిపూర్‌ ప్రభుత్వం మే 21న రెండు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి, ఇటీవలే స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి కోసం ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇతర రాష్ట్రాల నుండి సొంత రాష్ట్రానికి వచ్చిన ట్రాన్స్‌ జెండర్లు అక్కడున్న క్వారంటైన్‌ కేంద్రాల్లో పురుషులు లేదా మహిళలతో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని శాంతా ఖురై మణిపూర్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ దృష్టికి తేవడంతో ఆయన చొరవతో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రత్యేక కేంద్రాల్లో ట్రాన్స్‌ జెండర్ల శారీరక ఆరోగ్య సంరక్షణతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించారు.

Share
This entry was posted in మనం గళమెత్తకపోతే . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.