పది స్వాతంత్య్ర గాథలు ` 1. ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్ అధికారులను ఎదుర్కొన్నారు. ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు
‘‘వారు మీ ఊరిమీద దాడి చేశారు. మీ నాన్నను ఘోరంగా కొడుతున్నారు. మన ఇళ్ళన్నీ వెతుకుతున్నారు.’’
‘‘వారు’’ అంటే బ్రిటిష్ పోలీసులు, బ్రిటిష్ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాయి అనుకునే గ్రామాలపై విరుచుకుపడ్డారు. అనేక ఇతర గ్రామాలను ధ్వంసం చేశారు, తగలబెట్టారు, వారి ధాన్యం దోచుకున్నారు. తిరుగుబాటుదారులకు తమ స్థానాన్ని చూపించారు.
డేమతి డే, సబర్`సబర్ తెగకు చెందిన ఒక ఆదివాసీ అమ్మాయి. ఆమె సలిహాకి తనతో ఉన్న 40 మంది యువతులతో పాటు పరిగెట్టింది. ‘‘మా నాన్న నేల మీద పడి ఉన్నాడు, రక్తం కారుతోంది’’ అంది వయసుడిగిన ఆ స్వాతంత్య్ర యోధురాలు ‘‘అతని కాలిలో గుండు దిగింది.’’ వయసురీత్యా మసకబారుతున్న తలపుల మధ్య ఈ జ్ఞాపకం ఆమెను ఉత్తేజపరచింది. ‘‘నాకు పట్టలేని కోపం వచ్చి ఆ ఆఫీసర్ మీదికి తుపాకీతో వెళ్ళాను. ఆ రోజుల్లో మేము లాఠీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం పొలాల్లో పనికైనా, అడవిలోకైనా. ఉన్నట్టుండి జంతువులు మీద పడితే మన దగ్గర కాపాడుకోవడానికి ఏదోటి ఉండాలి’’ అంది.
ఒక్కసారి ఆ ఆఫీసర్ మీద ఆమె దాడి చేయగానే ఆమెతో ఉన్న 40 మంది యువతులు మిగిలిన సిబ్బంది మీదకు వారి లాఠీలతో దూసుకెళ్ళారు. ‘‘ఆ వెధవని వీథి చివర వరకు పరిగెత్తించా’’ అందామె. కోపంగానే అంది కానీ ఫక్కున నవ్వింది. ‘‘అలా కొట్టుకుంటూ పోవడమే. అతను తిరిగి నన్నేమైనా అనడానికి కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. నేనలా చేస్తానని అతను ఊహించలేదు. అతను తప్పించుకోడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు’’. ఆమె అతన్ని కొడుతూ ఊరంతా పరిగెత్తించింది. ఆమె అప్పుడు తన తండ్రిని అక్కడ నుంచి ఎత్తి మోసుకుని వచ్చేసింది. అతన్ని తర్వాత అరెస్ట్ చేశారు, కానీ అది వేరే నిరసనకు దారి తీసింది. కార్తీక్ సబర్ అక్కడి బ్రిటిష్ వ్యతిరేకోద్యమాలకు కీలక కార్యదర్శి.
బ్రిటిష్ వారు తన తండ్రిని తుపాకీతో కాల్చారు అన్నమాట సాలిహన్ జ్ఞాపకాన్నీ కోపంతో రగిలించింది.
డేమతి డే సబర్ని ఆమె ఊరి పేరుతో ‘సాలిహాన్’ అని పిలుస్తారు. ఆమె ఊరు నుయపడా జిల్లాలో ఉంది. ఆమె అక్కడే పుట్టింది. ఇప్పటికీ ఒరిస్సాలో ఈ స్వాతంత్య్ర యోధురాలి గురించి, బ్రిటిష్ అధికారిని లాఠీతో బెదిరించి సాగనంపిందని చెప్పుకుంటారు. ఆమెలో ఇప్పటికీ ఆ నిర్భీతి కనిపిస్తుంది. కానీ ఆమె ఏదో గొప్ప పని చేసిందని ఆమె అనుకోదు. ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు కూడా. ‘‘వాళ్ళు మా ఇళ్ళని, పంటని సర్వనాశనం చేశారు. మా నాన్నపై దాడి చేశారు. ఇక వారిని ఎదుర్కొనక తప్పలేదు.’’
అది 1930వ సంవత్సరం. ఆమెకి 16 ఏళ్ళు. అప్పటికి బ్రిటిష్ రాజ్యం స్వాతంత్య్రం కోసం జరిగే మీటింగులపై విరుచుకుపడుతోంది. డెమతి బ్రిటిష్ పోలీసులపై ఎదురు తిరిగిన సంఘటన సలిహా తిరుగుబాటు, కాల్పులుగా మారింది.
నేను డేమతిని కలిసే సమయానికి తన వయసు 90 పైబడిరది. ఆమె మొహంలో ఇంకా బలమూ, అందమూ కనిపిస్తున్నాయి. కనుచూపు కోల్పోయే స్థాయికి వచ్చినా, ఆమె తన యవ్వనంలో అందంగా, పొడుగ్గా, బలంగా ఉండేది. ఆమె పొడవైన చేతుల్లో ఇప్పటికీ చేవ ఉంది. పాపం ఆ అధికారి బాగానే దెబ్బలు తిని ఉంటాడు. పారిపోయి మంచి పని చేశాడు.
ఆమె ధైర్యానికి గుర్తింపు రాలేదు, బయట ఊళ్ళలో చాలావరకు మర్చిపోయారు కూడా. నేను చూసినప్పుడు సాలిహాన్ బర్గా జిల్లాలో విపరీతమైన పేదరికంలో ఉంది. ఆమె నాయకత్వాన్ని స్తుతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రంగురంగుల అధికారిక పత్రం ఒకటే ఆమె ఆస్తి. అందులో కూడా ఆమె గురించి కన్నా, ఆమె తండ్రి గురించే ఎక్కువగా ఉంది. ఆమె చేసిన ఎదురుదాడి గురించి అసలు లేదు. ఆమెకు పెన్షన్ కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం గాని లేదు.
ఆమె జ్ఞాపకం తెచ్చుకోవడానికి కష్టపడిరది. ఒక విషయం ఆమెకి బాగా గుర్తుంది. అదేంటంటే ఆమె తండ్రి కార్తీక్ సబర్ని తుపాకీతో కాల్చి చంపారు. ఆ విషయం ప్రస్తావించగానే ఆమె ఇంకా చల్లారని కోపంతో ఎగిసిపడిరది, ఇప్పుడు ఆమె ముందు జరుగుతున్నంతగా. ఆమె చుట్టూ జ్ఞాపకాలు కూడా ముసురుకున్నాయి.
ఆమె పెద్ద అక్క భాన్ డే, గంగా తలెన్, సఖ తోరెన్ (తెగకు చెందిన మరో ఇద్దరు ఆడవారు) వారు కూడా అరెస్టయ్యారు. ఇప్పుడు వారందరూ లేరు. నాన్న రెండేళ్ళు రాయ్పూర్ జైలులో గడిపాడు.
ఆమె ప్రాంతం ఈ రోజు బ్రిటిష్ రాజ్యంతో చేతులు కలిపిన భూస్వాముల పాలయ్యింది. సాలిహాన్, ఆమె అనుయాయులు చేసిన పోరాటఫలం ఆ భూస్వాములు ఎక్కువగా అనుభవిస్తున్నారు. పేదరికపు సముద్రం మధ్య వీరు ఆస్తిపరులైన దీవుల వంటివారు.
ఆమె మా వైపు చూసి దివ్యమైన చక్కని చిరునవ్వు నవ్వింది. చిరునవ్వులు చిందిస్తోంది కానీ ఆమె అలిసిపోయి ఉంది. ఆమె తన ముగ్గురు కొడుకులైన బ్రిష్ణు భోయి, అంకుర్ భోయి, అకురా భోయి పేర్లు తలుచుకోడానికి చాలా ఇబ్బంది పడిరది. ఆమెకు మేము వెళ్ళొస్తామని చెప్పినప్పుడు చెయ్యి ఊపింది. డేమతి డే సబర్ ఇప్పటికీ నవ్వుతోంది.
సాలిహాన్, మేము ఆమెని కలిసిన మరుసటి సంవత్సరం 2002లో చనిపోయింది.
డెమతి సబర్ ‘సాలిహాన్’ కోసం
వారు నీ కథ చెప్పరు సాలిహాన్
నువ్వు పేజ్ త్రీ లోకి ఎక్కవు
ఆ పేజీ బాగా ముస్తాబయినవారికి,
లిపోసెక్షన్ చేయించుకున్న నాజూకు మనుషులకి,
మిగిలినది పరిశ్రమల అధినేతలకి
ప్రైమ్ టైం నీ కోసం కాదు సాలిహాన్
ఇదేమి చిత్రమైన విషయం కాదు కానీ,
అది హంతకులకు, గాయపరిచేవారికి,
కాల్చేవారికి, ఆరోపించేవారికి,
సాధువుల్లా మాట్లాడేవారికి, శాంతి కోసం తపించేవారికి
తెల్లోళ్ళు మీ ఊరిని తగలబెట్టారు సాలిహాన్
చాలామంది మగవారు తుపాకీలు పట్టుకు తిరిగారు
వారు రైళ్ళలో వచ్చారు
వారితో పాటు బీభత్సాన్నీ నొప్పినీ తీసుకొచ్చారు
ఉన్న మతి పోగొట్టేవరకు
అక్కడున్నదంతా కాల్చేశారు సాలిహాన్
అక్కడ ఉన్న డబ్బును, ధాన్యాన్ని లూటీ చేశాక
బ్రిటిష్ రాజ్య కుక్కలు
బీభత్స కాండాన్ని రచించారు
నువ్వు దానిని లక్ష్యపెట్టకుండా ఎదుర్కొన్నావు
సాలిహాన్లో ఇప్పటికీ
నువు చేసిన యుద్ధాన్ని గురించి ఈ కథని చెప్పుకుంటారు
నువ్వు గెలిచావని
నీ అనుయాయులు రక్తం కారుతూ నీ చుట్టూ ఉన్నారని
నీ తండ్రి కాలిలో ఒక తుపాకీ గుండు దిగబడిపోయిందని
అయినా నువ్వు నిటారుగా నిలబడ్డావని
ఆ బ్రిటిష్ వారిని తోలిపారేశావని
ఎందుకంటే నువ్వక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళావు, ప్రాణభిక్షకు కాదు
నువ్వు ఆ అధికారిని కొట్టావు సాలిహాన్
అతను తిరిగి నీ పైకి రాకముందే అతన్ని చితక్కొట్టావు
చివరికి అతను
కుంటుకుంటూ పోయి దాక్కుంటే
పదహారేళ్ళ పిల్లవైన నువ్వూ
నలభైమంది ఆడవారూ
బ్రిటిష్ రాజ్యంపై తిరగబడ్డారు సాలిహాన్
బలంగా అందంగా ఉన్న నువ్వు
ఇప్పుడు కుంగిపోయావు, తల నెరిసిపోయింది
నీ ఒళ్ళు కృశించిపోతోంది
కానీ ఆ కళ్ళల్లో మెరుపు ఇంకా తగ్గలేదు
ఎవరైతే బ్రిటిష్ రాజులకు మద్దతు పలికారో సాలిహాన్
వారే ఈ రోజు నీ ఊరిని ఏలుతున్నారు
పైగా గుడులు కట్టిస్తున్నారు
మన స్వేచ్ఛను వారి స్వార్థం కోసం అమ్మాలనుకున్నవారు
వారు చేసిన నాశనాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోరు
నువ్వు బతికినంత ధైర్యంగానే చనిపోతావు సాలిహాన్
ఆకలితో, తినడానికి చాలినంత లేక.
చరిత్ర నీడల్లో
నీ జ్ఞాపకం వెలిసిపోతుంది
రాయపూర్ జైల్లో రోస్టర్ షీట్ వంటి
నీ గుండె, దానికున్న దమ్ము నాకుంటే
సాలిహాన్, నేను జయించలేనిదంటూ లేదు
ఆ యుద్ధం అసలు
నీ కోసమే కాదు
మిగిలిన అందరి స్వేచ్ఛ కోసం
మా పిల్లలకి నువ్వు తెలియాలి, సాలిహాన్
కానీ నీ గెలుపును చాటుకోడానికి నీకున్న బలగం ఏంటి
నువ్వు రాంపులపై నడవలేదు
నెత్తి మీద కిరీటాలు ధరించలేదు
పెప్సీ, కోక్ కంపెనీలకి నీ పేరుని అరువివ్వలేదు
నాతో మాట్లాడు సాలిహాన్
గంట నుంచి ముగింపు లేని సమయం వరకు.
మనం విడిపోయే ఈ వేళలో, ఈ సాధారణ ప్రాణికి,
భారతదేశపు అధికారపు అశ్లీలతని కాక,
నీ గుండె దమ్ము గురించి రాయాలనుంది.
కె.వి.ఎస్. రామారావు