సీనియర్ సిటిజన్స్ (వయోవృద్ధుల)కు మన ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను కల్పించింది. రైల్ టికెట్లలో రాయితీ, బ్యాంకు డిపాజిట్లలో అధిక వడ్డీ, ప్రభుత్వ పింఛన్లు, దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలవంటివి కొన్ని సౌకర్యాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ఆయా రంగాలలో తలపండిన వ్యక్తుల నుండి తగిన సలహాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం తద్వారా వచ్చే ప్రయోజనాలను అందుకోవడమన్నది మనమందరం తరచుగా చూస్తున్నాము. కానీ ఇలా తలపండిన వ్యక్తులు ఇంట్లో వారి కుటుంబ సభ్యుల నిరాదరణకు గురికావడమన్నది కూడా ఒక సామాజిక వాస్తవం. ఇంట్లో తల్లిదండ్రుల మీద చేయిచేసుకోవడం వంటివి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడం కోసం వచ్చిన చట్టమే తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007. వయస్సు 57 సంవత్సరాలు నిండిన వారంతా ఈ చట్టం పరిధిలోనికి వస్తారు. ఎటువంటి నిరాదరణకు గురికాబడినా, లేదా శారీరక, మానసిక హింసకు గురికాబడిన, వారు ఒక తెల్లకాగితం మీద వివరాలు రాసి, ఈ చట్టం క్రింద నియమించబడిన అధికారికి అందచేస్తే చాలు. సమస్య పరిష్కారం కేవలం రెండు నెలల వ్యవధిలో జరగాలన్నది ఈ చట్టం చెబుతోంది. తల్లిదండ్రులను నిరాదరణగా చూసిన కుటుంబసభ్యులకు ఊచలు లెక్కబెట్టేలా శిక్షించే అధికారం ఆ ప్రత్యేక అధికారికి ఉంది. చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న వారి పరిస్థితి ఏమిటి? సంపాదనతో సంబంధం లేకుండా ఉన్నంతలో తల్లిదండ్రులను పోషించాలని చట్టం చెబుతోంది. వయస్సు పైబడిన తల్లిదండ్రులకు కావలసింది పరమాన్నాలు, పట్టుబట్టలు కావు, పట్టెడన్నం, ఒక ఆత్మీయ పలకరింపు. కాదంటారా?
సరే ఇప్పుడు సమాజంలో గౌరవమర్యాదలు, డబ్బు, దస్కం ఉన్న కుటుంబాలలో కూడా ఇదే కథ. తల్లిదండ్రుల పట్ల నిరాదరణ. పెద్దవాళ్ళు తీసుకొనే ఉదయపు కాఫీలో కాస్త మందో మాకో కలిపేస్తే పోలా… అన్నంత దూరం వెళ్తోంది ఈ కాలపు యువత ఆలోచన. వృద్ధాశ్రమంలో పెట్టేద్దామని కొడుకు, కోడలి మధ్య ఒక అంగీకారం. సరే తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి ఒక ఆశ్రమంలో చేర్పించారనే అనుకుందాం… అప్పుడు ఈ చట్టప్రకారం ఆ తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు? ఒక తెల్లకాగితం మీద వివరాలు రాసి, ఈ చట్టం క్రింద నియమించబడిన అధికారికి ఫిర్యాదు అందజేయవచ్చు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆరోపణలు నిజమని తేలితే, కొడుకు కోడలిని ఊచల వెనకకు పంపించే అధికారం ఆ అధికారికి ఉంటుంది.
తల్లితండ్రుల పేరుమీద ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వారిని మభ్యపెట్టి దస్తావేజుల మీద మోసపూరితంగా సంతకాలు చేయించుకొనే ప్రబుద్ధులు ఉన్నారు. గతంలో అయితే ఆస్తిని వెనక్కు రాబట్టుకోవడానికి చాలా తతంగం ఉండేది. ప్లీడరు ఖర్చులు, కోర్టు ఫీజులు, సంవత్సరాలపాటు కోర్టు చుట్టూ తిరగడం లాంటివి ఉండేవి. కానీ ఈ చట్టంలో 2019లో తగిన మార్పులు చేశారు. ఆస్తిని తిరిగి రాబట్టుకోవడం కోసం ఇప్పుడు ఏ కోర్టు చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇటువంటి కేసులను పరిష్కరించే అధికారం ఒక ప్రత్యేక అధికారికి ఇచ్చారు. మోసపూరితంగా రాయించుకున్న ఇంటి కాగితాలకు ఎటువంటి విలువ లేకుండా చేసే అధికారం ఆ ప్రత్యేక అధికారికి ఉంటుంది. ఇటీవల కాలంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తల్లిదండ్రులు తాము నివసిస్తున్న ఇంట్లో… ఆది స్వార్జితం కావచ్చు లేక పూర్వీకుల నుంచి వచ్చినది కావచ్చు, ఇతర కుటుంబ సభ్యుల యొక్క నిరాదరణకు గురికాబడినట్లుగా భావిస్తే, అటువంటి కుటుంబ సభ్యులను ఆ ఇంటినుంచి బైటికి పంపించివేసే అధికారం ఉంటుంది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అందరి మన్ననలను పొందింది.
పదవీ విరమణ చేసే ఉద్యోగులు సాధారణంగా చేసే ఒక పొరపాటు…తాము సంపాదించిన ప్రతి రూపాయి స్వంత ఇంటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఖర్చుపెట్టడం. సాధారణంగా వయస్సు పైబడిన వారికి అద్దె ఇల్లు దొరకడం కష్టం. అందువల్ల స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకావాలన్న కోరిక వాళ్ళలో బలంగా ఉంటుంది. అయితే అందరూ కలసి ఒకే ఇంట్లో ఉండవలసి రావడం, చేతిలో డబ్బులు లేకపోవడం, కొడుకు, కోడలితో సూటిపోటి మాటలు పడవలసి రావడం ప్రస్తుతం అనేకమంది ఎదుర్కొనే సమస్య. అయితే, ఇటీవల బ్యాంకులు ఒక ప్రత్యేకమైన స్కీమ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ స్కీమ్ ప్రకారం బ్యాంకు ఆ ఇంటిని తనఖా పెట్టుకొని ప్రతీనెలా రూ.25,000 వరకు ఇస్తుంది. ఇంటి యజమాని బ్యాంకుకు తన ఇంటిని స్వాధీనపరచవలసిన అవసరం లేదు. సుమారు 25 సంవత్సరాల పాటు ప్రతినెలా బ్యాంకులు ఇలా డబ్బులు ఇస్తుంది. తర్వాత ఇంటిని తనఖా నుండి విడిపించుకొనే బాధ్యత వారి పిల్లలపై ఉంటుంది.
చట్టాలు బలంగా చేసినంత మాత్రాన, అధికారులు దానిని సమర్ధవంతంగా అమలు చేసినంత మాత్రాన పిల్లలకు, ఇంట్లో పెద్దలపట్ల ప్రేమ పుట్టుకు రాదు, అది స్వతహాగా రావాలి. ఒక్కసారి మీరు ఇంట్లో పెద్దలకు భోజనం మీ చేెత్తో తినిపించండి, మీరు ఎదుర్కొనే సమస్యలు చెప్పి, వారి సలహా తీసుకొని వాటిని అమలు చేయండి. వారికి కొండంత తృప్తి. ఇంట్లో పెద్దవారిని ప్రేమగా చూసుకొనే వాళ్లకు, ఆ దైవాశీస్సులు నిండుగా వుంటాయి. ఇక అన్ని విజయాలు మీ వెంటే.
చివరిగా ఒక మాట… అమృతం తాగేవాళ్లు దేవతలూ, దేవుళ్లు. వాటిని కన్నబిడ్డలకు పంచేవాళ్లు తల్లిదండ్రులు. అవునంటారా…!