టి. శివాజీ
నిజాయితీగా, నిజంగానే అభివృద్ధి పథకాల పేరున గిరిజనులకు వట్టి కరెన్సీ, పట్టిపోయిన భూమి, తీర్చుకోలేని రుణాలూ అందించినా ప్రయోజనం లేదు. గిరిజన ఆవాసాల స్త్రీలు ఏం కోరుతున్నారో, వారి పిల్లలకు ఏం కావాలో, వారి కుటుంబాల మొత్తానికి అత్యవసరమైన సహాయ సహకారం ఏ రూపంలో ఎలా వుండాలో నగరాల్లో టై బిగించుకుని ఏ.సి. రూముల్లో అవస్థపడే అధికార శ్రేణి నిర్ణయించలేదు.
ఒక్క మానవతా దృష్టి చాలు. అది మార్పించ గల, అధిమగించగల సత్తా చాలు. గిరిజనుల గుడిసె ముందు నిలబడి గిరిజన స్త్రీలతో మాట్లాడితే చాలు. అధికార శిల కరిగి మానవతామూర్తి బయటపడు తుంది. మరి కొరవైంది ఈ దృశ్యమే!
‘అభివృద్ధి’, ‘ప్రగతి’ అనే వాడుక మాటాల మీద మనదేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రభుత్వ పాలనాయంత్రాంగానికి, వారిపై అధికార శ్రేణికి, శ్రీ మంత్రి వర్గానికీ గల ప్రేమ ఎక్కువ. వాస్తవానికి ఆ పదాలకు సరయిన అర్థం గ్రహించి, ఆ దృష్టికోణంలో ప్రజాహిత చర్యలు తీసుకోవడం శూన్యమైంది. ఇది గుడ్డి ప్రేమ ఫలితం. ప్రజా సంక్షేమ రాజ్యంగా మన ప్రభుత్వాల విధానాలన్నీ. జన జీవన అభివృద్ధినే కోరుతున్నాయి. ఎటొచ్చీ అభివృద్ధికి గల అర్థం ఏమిటి, అందులో ప్రజల జీవన నాణ్యతని పెంచేందుకు సూచించిన మార్గాలను అనుసరించే పద్ధతులేమిటి అని చిత్తశుద్ధితో ఆత్మపరిశీలన చేసుకోవడం పరాయి ‘సంస్థ’ వంటి ప్రభుత్వానికి అనవసర అంశమైపోయింది. అందుకనే ‘అభివృద్ధి’ అంటే పరిశ్రమలను పెంచెయ్యడం అని, దేశ విదేశీ పెట్టుబడులకు మార్గాలు వెదకడం అని, ఆపై నిరుపేద, బలహీన వర్గాలకు, కులాలకు, జాతులకూ కరెన్సీ (డబ్బు)ని అందజేయడం, అందుబాటులో వున్న బంజరు భష్ట్రమిని (కాగితాల మీద) అక్కడక్కడ పంచడం, ఒకటి రెండు ఎడ్లని ఇవ్వడం, చిత్రవిచిత్ర ప్రాతిపదికలపై రుణ సౌకర్యాలను అందించటం అని మాత్రమే భావిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదొక ప్రమాదకరమైన ధోరణి. ఎందుకంటే ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో వ్యవసాయం, పశుగణాలు, నిరుపేద ప్రజానీకం, కుగ్రామాలు, గిరిజన ఆదివాసీ జీవనావసరాలు, పర్యావరణం, ప్రాణివైవిధ్యం, సుస్థిర జీవన మార్గాలూ ఏవీ ప్రధానాంశాలు కాకుండాపోతాయి. ‘అభివృద్ధి’ అనగానే ఒక ‘పథకం’తో ముడిపడి ఉవండడం, ఈ పథకానికి మూలాధారం ‘నిధులు’ సమకూర్చి వుండడం – ఇవే ప్రధానం అయ్యాయి. ఈ నిధులు సమకూర్పు ముందు, పథకం అమలు చేసే సంవిధానం ఒకటి రూపొందించే ముందు ఏ ప్రజలకు ఏ ప్రాంతంలో ఏ అంశాలపై ‘అభివృద్ధి’ సాధించవలసి వుందో నిర్ణయించడం, అందుకు సంబంధిత వర్గాల ప్రాతినిధ్యంతో సంపూర్ణంగా చర్చింటచమనే ప్రజాస్వామిక వైఖరి మన విధాన నిర్ణేతలయిన వారికి కొరవడింది. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు, గిరిజన అభివృద్ధి పథకాలూ, పర్యావరణ, వన, జల, వన్యప్రాణి, పశుసంరక్షణ, అభివృద్ధి పథకాల స్థితి చూడండి, కాగితాలమీద ప్రచార వివరాల్లో వీటి రూపురేఖలు ఎలా ఉన్నా అవి అమలుచేసే చోట, అమలు జరిపే తీరు చూడండి – లోపమెక్కడుందో స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు అధికార యంత్రాంగానికి నియమ నిబంధనల ఫైళ్ళుగాక సంబంధిత ప్రజావర్గాలతో సలహా సంప్రదింపులు ముఖ్యం కానట్టు అది అటవీ వ్యవసాయంగాని, గిరిజన జీవనాధారాల పరిరక్షణగాని, ‘సీనియర్ అధికారులు’ నిర్ణయించ వలసిందే! ప్రాంతీయ సమస్యలు, ప్రాంతీయులతో పరిసర ప్రజలతో సంప్రదించి తెలుసుకునే కనీస చర్య, సహృదయత ‘పరిశీలకులకు’, ‘నిపుణులకు, ‘పరిశోధన పత్రాలు’ సమర్పించే వాళ్ళకు లేకపోవడం అన్నది వ్యవహార సరళి అయిపోయింది. ఎప్పుడూ ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, పాలనాంశాలు తప్ప సామాజిక ప్రయోజనంగాని, పొందవలసిన వర్గాల దృష్టిలో పథకానికి ముందు, వెనుకవచ్చిన మార్పుల వాస్తవ రూపంగాని ఏదీ ఏ ఒక్కటీ ప్రభుత్వ ‘లక్ష్యాల్లో చేరకపోవడం ఈ దేశ దారిద్య్రానికి గల అనేక కారణాల్లో ఒకటి.
వ్యవసాయ ప్రధానమైన దేశంలో, కుటీర పరిశ్రమలు, చిన్న తరహా నీటి పథకాలు అతి ముఖ్యమైన దేశంలో వాటిని కల్పించి, వున్న వాటిని సంరక్షించి, క్షీణిస్తూన్న వాటిని పరిరక్షించి పెంపొందిస్తున్న దాఖలాలు లేవెక్కడా – ఉన్నా అవి అధికశాతం ఫైళ్ళకి పరిమితం. అభివృద్ధి పథకాల్లో అధిక శాతం వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల అభివృద్ధికి, వారి అనుయాయుల అభివృద్ధికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించడానికే ఉపయోగపడుతుంటాయి అని విస్పష్టం చేయడానికి మారుమూల పల్లెలు, గ్రామీణ ప్రజలు, గిరిజన ఆదివాసీ ప్రజలు, వారి జీవన స్థితిగతులూ ప్రత్యక్షంగా చూడవచ్చు. సమాచార, సహకార వ్యవస్థ విస్తృతమైన ఈ రోజుల్లో కూడా జాతీయ ప్రధాన రహదారులకి అతి సమీపంగా వున్న గిరిజన ప్రాంతాలు సైతం కనీసావసరాలకు, ఆయా గిరిజన ప్రజల జీవనశైలికి అవసరమైన వనరులేవీ నోచుకోవడం లేదు. అవి కల్పించకపోగా వున్న సహజ వాతావరణం గిరిజన, గ్రామీణులకు నేరుగా లాభం చేకూర్చనీయకుండా అధికార శైలి, పథకాల సూత్రలూ అడ్డుపడుతుంటాయి. వీటన్నిటి ఫలితం అన్ని మారుమూల గ్రామాల మీద, గిరిజనశైలి మీద, వారి సామాజిక సహజీవనం మీదా గట్టి ప్రభావం చూపెడుతుంది.
అసలు గిరిజన గ్రామాలకు కావలసినదేమిటి – వారి ఆరోగ్యానికి అత్యవసరమైన మంచి నీటి వసతి – నీటి సరఫరా, ఖచ్చితమైన వైద్య సహకారం, పరిసర అడవులపై ఆధారపడ్డానికి వారికి అటవీశాఖ చట్టపరమైనవి. ఇతరత్రా పోని ఇబ్బందులు కల్పించకుండా వుండడం, ఆయా గిరిజన ఆవాసాలకు, వారి భూములకు పై ప్రాంతాల వారి అధికార, ఆజమాయిషీ, ఆక్రమణలు లేకుండా చూడడం, గిరిజనులు కొండలనుంచీ, అడవులనుంచీ ముప్పు తిప్పలు పడి సాధించిన అటవీ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ సౌకర్యం కల్పించడం, ఆయా ఉత్పత్తులకు న్యాయబద్ధమైన, తగిన గిట్టుబాటు ధర ఏర్పరచటం, అటవీశాఖ, పోలీసుశాఖ తదితర అధికారుల నుంచీ ఎటువంటి పీడన లేకుండా సజావుగా వుండే పరిస్థితులు కల్పించడం, కనీస విద్యావకాశాలు గిరిజన ప్రాంతాల్లో కల్పించడం, రవాణా, సమాచార అవకాశాలు కలిగించడం వంటివి అత్యావసరాలు. ఇవి వుంటే చాలు ఆయా గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలు వారి తిప్పలు వారు పడుతూ వారి జీవనాన్ని వారు మెరుగు చేసుకోగలరు.
నిజమే ఇవన్నీ కల్పించ డానికి గిరిజన అభివృద్ధి పథకాలు, సమగ్ర గ్రామీణ, గిరిజన పథకాలు, అటవీ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి పథకాలు, ఆర్థిక పరిశ్రమలు, చేతివృత్తులు, హస్తకళల పథకాలు, సాగునీటి పథకాలు, భూగర్భ జలాలకు స్కీములు, వాటర్‌షెడ్, డ్వాక్రా-పొదుపు పథకాల వంటివి సవాలక్ష వున్నాయి. వీటి అమలుకోసం తపించే ప్రభుత్వం, యంత్రాంగం, అధికారపక్షాలు, పరిశీలక బృందాలు, నివేదికలూ వుండనే వున్నాయి. వాటి ”లక్ష్యాలూ” పైకి నిర్దుష్టంగా కనిపిస్తుంటాయి. ఐతే వివిధ స్కీములు అమలు చేయడంలోని వాస్తవాలమీద అధికారులకు ఏపాటి ఆలోచన లేకపోవడంవల్ల లబ్ధిదారులయిన ఆయా ప్రజల జీవితాల్లో మెరుగు కనిపించిందా లేదా అన్నది ప్రధానాంశం కాకుండా పోయింది. వారికి ముఖ్యం ఆయా పథకాలకు కేటాయించిన డబ్బును వ్యయం చేయడం జరిగిందా లేదా అన్నదే! ఎలా వ్యయం అయిందన్నది. అవకతవకల సంగతీ వారికి సంబంధం లేనట్టే వుంటుంది. ఉదాహరణకు వివిధ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నట్టే మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక చిన్న ప్రాంతమయిన ఆళ్ళగడ్డ మొదలయిన మండలాల్లో కొన్ని చెంచుగూడేల పరిస్థితి చూద్దాం. చెంచుజాతి ప్రజల్లో ఆడ, మగ, పిల్లలూ నల్లమల అడవులు, ముఖ్యంగా అహోబిలం పరిసర ప్రాంత అడవులపై, మరొక అంచున మహానంది ప్రాంతంలో అడవులపై, మరొక అంచున మహానంది ప్రాంతంలో అడవులపై ఆధారపడి వున్నారు. అరడజను చెంచుగూడేలున్న ప్రాంతాల్లో దాదాపు అన్ని రకాల ప్రభుత్వ పథకాలూ అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సమగ్ర గ్రామీణ, గిరిజన అభివృద్ధి పథకాల అమలు జరుగుతున్నాయనడానికి వారి కేంద్రాలు, వాటి కమ్యూనిటీ సెంటర్‌లూ తదితరాలు ఆ ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. సరిగ్గా అక్కడే, ఆ చెంచు గూడేల్లోనే పథకాల అమలులోని చిత్రాలు కనిపిస్తాయి. సహజంగానే అవి గిరిజన జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయి- అందులోనూ స్త్రీలపై, భవితవ్యం ప్రతిబింబించే పిల్లలపై సరికొత్త తరంపై.
రహదారులకు, పెద్ద గ్రామాలకూ సహజంగా వున్న చెంచుగూడేల్లోనే ‘అభివృద్ధి’ దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంటే కొండలమీద, అడవుల నడి మధ్యలోని గిరిజన, చెంచుగూడేల పరిస్థితి వేరే వివరించనవసరం లేదు. శ్రీశైలం మొదలు మహానంది వరకు అడవుల మధ్యలో నివసిస్తున్న చెంచులు తరతరాలుగా అడవులమీదనే ఆధారపడి వున్నారు. అభాయారణ్య చట్టాలు, పరిరక్షిత ప్రాంత నియమ నిబంధనలు, అటవీశాఖ కింది స్థాయి అధికార వర్గాల తాకిడి వంటి ఇబ్బందులు అడపా దడపా వారిని చికాకు పెడుతున్నా ఇతరత్రా ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రత్యక్షంగా వారిలో ‘మార్పు’ తెచ్చిన దృశ్యం ఏమీ లేదు. కానీ కొండకింద అడవుల అంచున, రహదారి ప్రాంతాల్లో వున్న చెంచుగూడెంలో ప్రజలు ఇటు అభివృద్ధి అందించే పట్టణ ప్రాంత నాగరికతగాని అటు పూర్తిగా అడవుల్లో ప్రాచీన జీవన మార్గం కాని లేకుండా ఎటూ కాకుండా పోతున్నారు. అదీ స్థితి. ముఖ్యంగా చెంచు మహిళలపై ఈ వత్తిడి పెరిగింది. అనేక రకాల అటవీ ఉత్పత్తులను, ఫలసాయాన్ని సాధారణ సంతకు తెచ్చి కావలసిన వాటితో ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో జీవనం సాగిస్తూన్న చెంచులు పంటలు పండించే వ్యవసాయం చేసుకోగలరా, అది ఏ పాటి వారికి సహకరిస్తుందీ అన్న సమీక్ష లేకుండా కేవలం సగం మంది గిరిజనులకే ఒక్కొక్క కుటుంబానికి ఎకరం నేల, జత ఎడ్లు ఇచ్చింది ప్రభుత్వం ఇటీవల వాటితో అధికభాగం వరకు సేద్యానికి లొంగని నేలలు! పశుపోషణ, వ్యవసాయం కొన్ని ప్రాంతాల గిరిజనులకే సాధ్యం. అన్ని ప్రాంతాల గిరిజనులకు ఒకే విధంగా సేద్యం చేసుకోగల జీవనశైలి లేదు. వ్యవసాయకూలి పనులు తప్ప తాముగా వ్యవసాయం చేసుకునే తీరు తెలియని చెంచులు (ఆళ్లగడ్డ అహోబిలం పరిసర ప్రాంతాలవారు) ఎక్కువమంది తమ భూములను పాడుబెట్టుకున్నారు. కొందరు తాకట్టుకు, వడ్డీకి కట్టుకున్నారు.ఇదెక్కడి జీవనశైలి? ఎవరివల్ల ఎందుకొచ్చినట్టు?
ఇదంతా ఒక నేపథ్యం. ఒక మాదిరి ఆధునిక సంక్లిష్ట జీవన విధానం తెచ్చి పెట్టే అవకతవకలను తీవ్ర పరిణామాలకు గురయ్యే చెంచుల ఆవాస ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడి చెంచు మహిళలపై ఏర్పడ్డ వత్తిడి, దుస్థితిపై నేపథ్యంలోనే చూడాలి. ఈ నేపథ్యమే గిరిజన బాధలకు ఒక ప్రధాన కారణం. నిరుపేద కుగ్రామాల్లోగాని, అటవీ సమీప గిరిజన ఆదివాసీ ఆవాస ప్రాంతాలుగాని అభివృద్ధి పేరిట అందివచ్చే ‘ఆదాయ మార్గాలు’ (వారి జీవనశైలికి విరుద్ధంగా) వాటిని అమలు చేయడమైనా సక్రమంగా లేకపోతే ఫలితం వికటించి డబ్బు అవసరం, దానిని ఆధారం చేసుకున్న పరోక్ష రాజకీయం, ప్రత్యక్ష వత్తిడి, హింసా మొదలైన ఆయా గూడేల్లో నిశ్శబ్దంగా ప్రవేశించి మహిళలకు ఒక పీడకలగా మారతాయి. ఇందుకు సందేహం లేదని చెప్పడానికి అనేకానేక ఉదాహరణల్లో చెంచుగూడేలు కొన్ని.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, రుద్రవరం, దోర్నిపాడు, మండల ప్రాంతాల్లో అహోబిలం, హరినగరం, దొరగొట్టాల, చెంచులక్ష్మిగూడెం, గాజుల పల్లి, ముత్యంపేట, కె.పి. తండా, ఓ.జి. తండా, ఎం. తండా, బి. తండా, మిట్టపల్లి, అలమూర్, మారెనగర్, రెడ్డిపల్లి, వెలగపల్లి, పందిరాల పల్లి మొదలయిన ప్రాంతాలు జాతీయ రహదారులకు దాదాపు సమీప ప్రాంతాల్లోనే వున్నాయి. ఈ ప్రాంతాలకి కొంత దూరంలో ఐదారు ప్రధానమైన చెంచు ఆవాసాలున్నాయి. ఈ ఆవాసాలు ప్రజల్లో స్త్రీ పురుషులు ఇతర అటవీ సంపదలతో బాటు ఎక్కువగా తేనె సేకరణ, దాని అమ్మకాలపై ఆధారపడుతున్నారు. ఈ తేనె సేకరణ కోసం అహోబిలం, పాములేటిసామి కొండలు, పెద్దోలం కొండలు, గుండాల కొండలు, నలికి, ఊట్ల, బైరేని కొండలు, మునిగొండు మొదలైన కొండలన్ని తిరుగుతారు. ఏదయినా సూటిగా సమాధానం చెప్పే ఈ ముక్కుసూటి మనుషులకు, నిజాయితీపరులైన స్త్రీ పురుషులకు తరచు పోలీసుల తాకిడి ఎక్కువ. ముఖ్యంగా వనిపెంట గ్రామానికి సమీపంలో కొండల దగ్గరున్న చెంచు గ్రామాలకు గిరిజన కార్పోరేషన్ అధికారులు, పోలీసుశాఖలే ప్రభుత్వం. వారే అభివృద్ధి కారకులూ. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా చెంచు స్త్రీ పురుషులు పోలీసుల ముందు హాజరు కావలసిందే.
ప్రతి చెంచుగూడెంలో దాదాపు వందకు పైగా కుటుంబాలున్నాయి. స్త్రీలు వయసుకి, శక్తికి మించిన పనులు చేస్తుంటారు. అందుకే వీళ్ళలో మగవారికంటే ఎక్కువగా దాదాపు తరచుగా (సంవత్సరంలో అధిక భాగం) ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు. కొండవాగుల్లో నీరు యధాతథంగా తాగటంవల్ల నీటికి సంబంధించిన రోగాలు, కొండప్రాంతాల్లో కొండ జ్వరాలు, ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు వీళ్ళని పట్టి పీడిస్తుంటాయి. తగిన వైద్య సహాయం వుండదు. విద్య, వైద్యం చెంచులకు (ఇతర జాతులకు మల్లె) అనవసరమని ఎక్కువ శాతం అధికారులు భావిస్తున్నారేమో! ఈ చెంచు తండాల గ్రామాలు అన్నీ కొద్దిపాటి ‘వనసంరక్షణ సమితు’ల నీడలో అటవీశాఖ అరకొరగా అందించే పనులలో మునిగి వుంటాయి. ఆపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ‘పొదుపు’ పథకాల్లో స్త్రీలు సభ్యులయి వుంటారు. చెంచులక్ష్మి, ప్రహ్లాద, శివలక్ష్మీ, సరస్వతి మొదలయిన పేర్లుగల ‘పొదుపు గ్రూపు’ల్లో ఇటీవల కొద్దిపాటి ‘పొదుపు’ చేయడం నేర్చారు.
తేనె మొదలయిన అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో స్త్రీలు అతి కొద్ది శాతం డబ్బు మగవారి సామర్థ్యం నుంచీ కాపాడి దాచుకోగలుగుతున్నారు. ఇదంతా ఒక ఆరంభదశలోనే వుంది. కారణం – వారం రోజులు వొళ్ళు హూనం చేసుకుని అడవుల్లో గింజలు, విత్తనాలు, పళ్ళూ, పూలు, జిగురు (బంక) తేనె వగైరాలు గుంపులుగా వారు వచ్చి, సాధించిన ఇతర కూలిపనులు చేసుకుని సంపాదించినవి. అత్యధికశాతం ప్రతి బుధవారం, ఆయా పరిసర ప్రాంతాల్లో జరిగే సంతలో డబ్బుగా మారి క్షణాల్లో ఆ డబ్బు దాదాపు ఖర్చయిపోతుంటుంది. పెద్దగా ఆడంబరాలు, పండుగ పబ్బాలు లేకపోయినా, తక్కువ శాతం మగవాళ్ళే తాగితందానాలాడుతున్నా సరే ప్రతి గుడిసెలో దరిద్రం కనిపిస్తోంది. కొద్దిపాటి భూమికోసమో, పెళ్లి పని కోసమో ఏపాటి అప్పు చేస్తారోగానీ అనంతంగా ఒక జీవితకాలం భారీ వడ్డీలు కడుతూ వుంటారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో వుండే ఈ ఆర్థిక ప్రమాదం చెంచుగూడేలనీ పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం డబ్బును అందుబాటులోకి తెచ్చే అభివృద్ధి పథకాలు విద్యను అందించడంలో విఫలం కావడమే. దీని ప్రధానమంతా చెంచు మహిళల మీదే ఎక్కువగా కనిపిస్తోంది.
చెంచు స్త్రీలు రోజంతా కష్టపడి దూరం నడిచి నీళ్లు, కట్టె పుల్లలు తెచ్చుకోవడమే గాక జట్లు జట్లుగా బయలుదేరి అడవుల్లో బంక (జిగురు), తేనె, మైనం (తేనె పట్టు నుంచి సాధించేది) చిల్లగింజలు, కరక, కానుగ ముప్పిగింజలు, కుంకుడు, ఉసిరి, మారేడు గడ్డలు, వెదురు, చింతకాయలు, చింతపండు, సారాపప్పు, చెంచుగడ్డలు, విస్తరాకులు, బీడీ ఆకులు, బోదమోపులు మొదలయిన అటవీ సంపద ఏరుకొస్తారు. సంవత్సరం అంతా కష్టించి సాధించే ఈ వనసంపదను అమ్మకానికి గిరిజన కార్పోరేషన్ ముందు పెడతారు. ఏ మాత్రం గిట్టుబాటు కాని ధరలకు కనాకష్టంగా కొంటోంది జి.సి.సి. అదే, వారం వారం జరిగే సంతలోను, విడిగా బయట మార్కెట్‌లోనూ ఇవే పదార్థాలు, వస్తువులూ రెండు, మూడింతలు ఎక్కువ ధరకు అమ్ముడయిపోతాయి. సాంకేతిక, అధికారిక, చట్టపరమైన మార్గాల్లో గిరిజన కార్పోరేషన్ తన ఇష్టాయిష్టాల మేరకు తోచినంత కొనడం, వద్దనడం జరుగుతుంటుంది. గిరిజన కార్పోరేషన్ వద్దన్న, వదులుకున్న పదార్థాలనే చెంచులు బయట విక్రయించవలసి వుంటుంది. చీపుళ్ళు, బిక్కిపళ్ళూ, వంట చెరకు, బందెరాకు, పశుగ్రాసం వంటి అటవీ సంపద గిరిజన కార్పోరేషన్‌కు అవసరం లేదు గనుక వీటి మీద బయట అమ్మకాల్లో వచ్చే ఆదాయమే చెంచు స్త్రీలకు నయమనిపిస్తుంటుంది.
ఒకపక్క ‘అభివృద్ధి’ కోరే ప్రభుత్వ సంబంధిత సంస్థలే హీనమయిన ధరకు పరోక్షంగా వత్తిడి కల్పించి కొంటుంటే చెంచులు ఎంత కష్టపడితే మాత్రం వారికి తగినంత ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది? ఇదంతా ప్రతి గుడిసె మీదా ప్రభావం చూపెడుతుంది ఫలితంగా స్త్రీల అవస్థలు రెండింతలవుతున్నాయి.
ఐతే అసలు సహకారం లేదనడానికి లేదన్నట్టుగానే సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, (డి.ఆర్.డి.ఏ) ‘డ్వాక్రా’ అటవీ శాఖలు చెంచుగూడేల్లో మొదలయిన ‘పొదుపు’ గ్రూపులకు కొంతవరకు ‘మేచింగ్ గ్రాంట్స్’ అందించాయి. ఈ ఆర్థిక సహాయంవల్ల సకాలానికి కొంత పైకం అందివచ్చే సౌలభ్యం ఏర్పడినా సాధించిన పొదుపుని చూసుకుని కొత్త అప్పులు చేసే సత్తా పెరిగి అనేక చెంచు కుటుంబాలు తిరిగి ఋణచక్రంలో పడ్డాయి. ఎంతకీ చేసిన రుణాలు తీరడం అ్నది సమీప భవిష్యత్తులో కనిపించకపోవడంతో కొంతవరకు అలవాటుగా వస్తున్న ‘తాగుడు’ ఆ కుటుంబాల్లో మితి మీరింది (అన్ని చెంచుకుటుంబాలూ, అన్ని ప్రాంతాల్లో తాగుతున్నారని అర్థం కాదు) అడవిలో కొండల్లో దొరికే పదార్థాలతో చేసే సారా, కల్లుగాక రకరకాల మద్యాలు తాగడంవల్ల ఎక్కువమంది స్త్రీ పురుషులు వాళ్ళేం తాగుతున్నారో వాళ్ళకే తెలీని స్థితి ఏర్పడింది. ఈ మధ్యనే చెంచుగూడెంలో ఒక చెంచు స్త్రీ సారా అనుకుని యాసిడ్ ఏదో తాగేసింది. ఆస్పత్రిలో డబ్బు వదిలించుకుని ప్రాణాలతో బయట పడిందామె. చెంచు స్త్రీలలో తాగుడు అలవాటుకి కారణం అధిక శాతం వాళ్ళ భర్తలేనని అక్కడి వృద్ధులు, పిల్లలూ స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా హరినగరం దొరకొట్టాల, అహోబిలం చెంచుల్లో ఈ పరిస్థితి కనిపిస్తూంది. వారికి కనీస విద్య ఏ పాటి అందించే వాతావరణం లేదక్కడ. నిజానికి చెంచులు ఇతర గిరిజనులకన్నా నాగరిక ప్రపంచానికి సమీపంలో వున్నారు. అన్ని విధాలా తాకిడి చూశారు. బుధవారం వస్తే చాలు సంత, కుసంస్కృతి, దుష్ట సంప్రదాయం, అజ్ఞానం చూపెట్టే దిక్కుమాలిన తెలుగు సినిమా తప్పనిసరయిపోయింది వాళ్ళకి.
పరిశుభ్రత – ఆరోగ్యం :
ఈ రెండూ లేవన్నది చెంచుగూడేలకి సహజమయిపోయింది. ఇతర ప్రాంతాల్లో అనేక రకాల గిరిజన, ఆదివాసుల ఇళ్లు, దుస్తులు, పనితీరు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఇక్కడ దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఒక్క పూట విరామం లేకుండా అడవిలో బంక (జిగురు) సేకరించడం, వెదురు కోసి దబ్బలు చీల్చడం, సందగడ్డలు ఏరడం వల్ల చేతులూ, వొళ్లు నిత్యగాయాలతో, మట్టి, దూళితో అపరిశుభ్రంగా వున్నా, తగిన నీటిసౌకర్యంలేని చెంచు స్త్రీలు బట్టలు మార్చుకోవడం, రోజుకోసారి స్నానం చేయడం దాదాపు అరుదు. పైగా అడవిలో నిలిచిన కుంటల నీటి వాడకంవల్ల వీరి అనారోగ్యం ఎక్కువయింది. ”అత్యధిక శాతం స్త్రీలలో వైట్ డిశ్చార్జి, తెల్ల చెరుగు, ఎరుపు” వుందని అక్కడ వన సంరక్షణ, ఉమ్మడి అటవీ సంరక్షణ, యాజమాన్యం పనులు నిర్వహించే ఏ. వరలక్ష్మి చెప్పారు. అన్ని అనారోగ్యాలకు అలోపతి వైద్యం అనగానే డబ్బుకు భయపడి చెంచు స్త్రీలు ఎక్కువగా తమకి తెలిసిన మూలికలపైన, ఆకులపైనా ఆధారపడుతున్నారు. వీటిని సక్రమంగా, తగినట్టుగా వాడకపోవడంవలన అనారోగ్యం వివిధ రూపాల్లో కొనసాగుతూనే వుంది. ఇది వారి ముఖాల్లో కనిపిస్తుంది.
చిన్నచూపు :
మన సంరక్షణ సమితి పనులు, వ్యవసాయ పనులు, అటవీ సంపద సేకరించుకుని రావడం వంటి అన్ని పనుల్లో మగవాళ్ళ కంటే ఎక్కువే శ్రమించే చెంచు మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులు తక్కువ చేసే చూస్తుంటారు. స్త్రీలు కుటుంబ పరంగా పరిచయం లేని మగవాళ్లతో మాట్లాడడం మగవాళ్లు ఏ మాత్రం భరించలేరు. తప్పని సరయినా స్త్రీలు తమ బావలు, మరుదులతో మాట్లాడకూడదు. స్త్రీలు ఎప్పుడైనా శుభ్రంగా తయారయినా, మంచి చీరకట్టినా భర్తలు రాత్రి తాగి వచ్చి నిర్ధాక్షిణ్యంగా కొట్టిన కేసులు కోకొల్లలు. పొదుపు, వనసంరక్షణ తదితర కార్యక్రమాల సమావేశాలకు, అందునా అధికారులు, ఇతర మగవాళ్ళు చేరే చోటికి వెళ్ళడానికి స్త్రీలకు భర్తల అనుమతి వుండాల్సిందే. అదీ వంటరిగా సమావేశాలకు వెడితే ఆ చెంచు వనిత పని అంతే! గొడ్డలితో తొడలు నరకడం, చేతులు నరకడం వంటి ఘోరాలు జరిగిన కేసులున్నాయి. ఇటీవల ఒకే సంవత్సరం నలుగురు మహిళలకు ఈ దారుణం జరిగిందని అహోబిలం పరిసర ప్రాంతాలలో జె.ఎఫ్.ఎం కార్యక్రమాలు చేసే వరలక్ష్మి చెప్పారు. స్త్రీలు బావలతో, మరుదులతో మాట్లాడరాదన్న నియమం పెట్టినా మగవాళ్లు అడవిలో వివిధ కష్టసాధ్యమయిన పనులు చేసేటప్పుడు వెంట వచ్చిన అన్నదమ్ములను నమ్మరట. కేవలం బావలను, బావమరుదులనే విశ్వసిస్తారట!
బాల్య వివాహం – బహు సంతానం :
చెంచు బాలికలకు నేటికీ 12 లేక 13 సంవత్సరాల వయసు రాగానే పెళ్ళి చేసేస్తారు. 5 లీటర్ల సారాయి ఇస్తానంటే చాలు – వివాహం ఖాయం చేసుకున్నట్టే. పెళ్ళిలో ముఖ్యమైన ముచ్చట సారాయి చిత్తుగా తాగటమే. 15 సంవత్సరాల వయసున్న చెంచు తల్లులు చాలా మంది కనిపిస్తారు. ఇంత చిన్న వయసులోనే గర్బం ధరించడం వలన ప్రసవ వేదన పడలేక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. బతికి బాగున్న చెంచు స్త్రీకి 25 సంవత్సరాలొచ్చేసరికి 5 లేక 6 మంది బాల సంచులు అవతరించడం ఖాయం. అధిక సంతానం సహజంగానే అనారోగ్యం ప్రసాదిస్తుంది. అటు పిల్లలకు, ఇటు తల్లులకూ తగిన మంచి ఆహారం, అదీ కావలసినంత అందుబాటులో వుండడం కల వంటిదే.
సంవత్సరంలో దాదాపు 9 లేక 10 నెలలు అడవుల్లో తిరగనిదే డొక్కాడదు చెంచు స్త్రీలకు. అతిగా నడిచినా అనారోగ్యమే మరి. చెంచితలు ప్రసవించిన తరువాత నిండా నెల రోజులు కూడా ఇంటి పట్టున వుండే పరిస్థితి వుండదు. అందుకే చంటిపిల్లలకు ఆలనా పాలనా కరువయి చిక్కి సగమై వుంటారు. ఐదారేడుల పసిపిల్లలు సైతం తండాకి సమీపంలో అడవి పరిసరాల్లో తిరుగుతుంటారు. చెంచు స్త్రీలకు ఆరుగురు సంతానం వుండడంలో ఆశ్చర్యం లేదన్నట్టుంది అక్కడి స్థితి.
చెట్టులెక్కగలవా ఓ చెంచిత …..
చెంచు స్త్రీలకు అడివే ఒక గుడిసె. ఒక కాలంలో గడ్డి కోసం, ఇంకొక కాలంలో చీపురు కోసం దాదాపు అన్ని కాలాల్లో గింజల కోసం, మూలికల కోసం తిరిగే చెంచితలు సంవత్సరానికే ఒక్క బంక వరకే 30 క్వింటాళ్ళు సేకరిస్తారని, ఇలా సాధించిన అనేక రకాలకు గిరిజన కార్పోరేషన్ ఇచ్చే ధరలు గిట్టుబాటు కావటం లేదనీ, ఇంకా ఎక్కువ మొత్తంలో వివిధ పదార్థాలు సేకరించాలన్న ప్రయత్నంలో గిరిజనుల మధ్య వివాదాలు, గొడవలూ పెరుగుతున్నాయని కొత్త కోటాల ఊరికి చెందిన రక్షదేవి, పోలమ్మా చెప్పారు. కొండల్లో అడవుల మధ్యలో వుండే ముందు తరాల చెంచులకు, కొత్త తరం చెంచులకు అటవీ సంపద సేకరించే విషయంలో తీవ్ర విభేధాలున్నాయి. ఏ కుటుంబాలు పంచుకున్న ప్రాంతంలో ఆ కుటుంబాల వారే అటవీ సంపద సేకరించుకోవాలి. అటవీశాఖ, ఎన్.జి.వో నిధుల సహకారం, జి.సి.సి (గిరిజన కార్పోరేషన్) ‘సహకారం’ వంటి ‘అభివృద్ధి’ సహాయం పుణ్యమా అని చెంచువర్గాల్లో తేడాలు తగాదాలదాకా ఎదిగాయి. పూర్వం నుంచీ అడవుల మధ్య వున్న చెంచు తండాలకు, ఆలస్యంగా వచ్చి గ్రామాల సమీపంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వలస వచ్చిన చెంచు తండాలకు మధ్య స్పర్ధలొచ్చాయి. పర్యవసానం చెంచితల మీదనే ఎక్కువ పడింది. చివరికి తేనే, పుట్ట తేనె, సొరతేనె, మునాలి తేనె, పూల తేనెలు, వివిధ రకాల గడ్డి తెచ్చుకునే వారు సైతం ఎర్ర చందనం, గంధం, టేకు ఇతర దొంగ రవాణాను స్వేచ్ఛగా నిర్వహించే వర్గాల గూండాయిజానికి, పోలీసు వత్తిడికి గురి కావలసి వస్తోంది. అటవీశాఖ ఆజమాయిషీ గాక రాయలసీమ ఫాక్షన్ వర్గాల రాజకీయాలు సైతం పీడిస్తున్నాయి చెంచు స్త్రీ పురుషులకు. అడవుల్లో రహస్య హత్యలు, బెదిరింపులూ అక్కడక్కడ బాహాటంగా కనిపిస్తున్నా రాజకీయ, పోలీసు వర్గాలకు భయపడి నిశ్శబ్దం వహిస్తున్న వనిపెంట ప్రాంతం అడవుల్లోని చెంచుగూడెం స్త్రీలు అన్నారు.
తిండికి తిప్పలు :
నెలల తరబడి అడవుల్లో తిరిగి సేకరించే తేనె తాము ఆహార పదార్థంగా ఒకనాడు వాడుకునేవారు. నేడు కరెన్సీ ఆకర్షణలో చివరి బొట్టు తేనె వరకు అమ్మేస్తుంటారు. అపురూపంగా ఎప్పుడైనా తేనె తుట్టలో తేనెటీగల పట్టును పిండి పాలు సాధిస్తారు. ఈ పాలతో జున్ను చేసి, తేనెలో నంజుకుని తింటారు. ఎక్కువ శాతం గుడిసెల్లో కందులు దంచిన పప్పుతో చారు వంటిది తింటారు. అప్పుడప్పుడు మరమరాలు (కొందరు బొరుగులంటారు) నానబెట్టి కారం కలిపి తింటారు. మాంసాహారం, అందులో విశేషాలు బహుతక్కువ. జాతీయ రహదారుల వెంట స్థిరపడిన ఇతర తెగల, జాతుల ప్రజలతో కలిసి నివసించే చెంచులు కంది, సెనగ, పత్తి చేలలో వ్యవసాయానికి కూలీలుగా పోతున్నారు. వీరిలో స్త్రీలు ఎక్కువగా వున్నారు. వీరు ఎక్కువగా జొన్న రొట్టెల మీద ఆధారపడతారు. సాధారణంగా ఇలా ఇతర తెగలతో వంటరిగా తండాలేర్పర్చుకునే చెంచులకు ఇతర తెగల్లాగ ఎక్కువ ఆహార విశేషాల మీద శ్రద్ధ కనబడదు.
తేనె తీపి, మరణ యాతన :
అడవుల మారుమూలల్లో వంటరిగా వుండే జాతి, తెగల ప్రజలతో ఎప్పుడూ సత్సంబంధాలుండడం గ్రామ పట్టణ ప్రాంత వ్యాపార, వాణిజ్య రాజకీయ వర్గాలకు అత్యవసరం. అటవీ సంపద, అడవుల్లోని గిరిజనులూ ఆయా సమీప ప్రాంతాల సంపన్న కుటుంబాలకు ఆధారాలు, అవసరాలూ గనుకనే వీరి సంస్కృతి వారికి, వారి సంస్కృతిలో కొంత వీరికి ఇచ్చి పుచ్చుకోక తప్పదు. అందుకే అడవుల్లోకి వాణిజ్యం, సినిమా, హత్యలు ఇతర నాగరికత ప్రవేశించడానికి ముందు చరిత్రలో బ్రాహ్మణేతర అగ్రవర్ణాలయిన ‘సత్సూద్రుల’నే వారు, ఈ తరువాత అన్ని అగ్రవర్ణాలవారు రాజ్యాలు ఏలుతున్నపుడు అడవుల్లోకి తమ దేవుళ్ళని ప్రవేశపెట్టి కొండకోనల్లో సైతం దేవాలయాలు నిర్మించారు. ఆ పై గిరిజన, జానపద దేవతలను క్రమంగా తాము పూజించే దేవతల్లోకి చేర్చారు. ఇదొక రాజకీయ వ్యూహం, సంస్కృతి. నేడు చావుకి తెగించి తేనె సాధించే సాహస కార్యక్రమంలో చెంచు, చెంచితా సమానమే. తరతరాలుగా ఇతర అటవీ సంపదకన్నా తేనె పట్టుకు రావటమే చెంచులకు ప్రధాన జీవన మార్గంగా కొనసాగుతుంది. తేనె సాధించడం దుస్సాధ్యం, మహాయాతన.
చెంచుగూడేల్లో ప్రతి ప్రాంతం నుంచీ దాదాపు 15 కుటుంబాల స్త్రీ, పురుషులు 20 నుంచీ 30 మంది దాకా తేనె వేటకి బయలు దేరాతారు. వసంతకాలం ముగుస్తుండగా అడవంతా తేనెతుట్టల ఘుమఘుమలే. ఐతే సాధారణంగా అడవిలో అందుబాటు వున్న తేనె తుట్ట ఎలుగుబంట్లకు, ఇతర జీవాలకు అందిపోతోంది. లేకున్న వాటి నుంచి వచ్చే తేనె, మైనం కష్టపడినంత ఫలితాన్నివ్వవు. అయినా తరచు ఈ తేనె పట్టుకోసం చెట్ల కింద పొగబెట్టి, చెట్టు ఎక్కిగాని, కర్రతో పొడిచిగాని పట్టును కిందకి తేవడం సహజం, మామూలు సంగతే. కష్టసాధ్యమైనది, ప్రాణాపాయమైనదీ మరో రకం వుంది. అది కొండ చరియల్లో తేనె రాబట్టడం.
పెద్ద పెద్ద కొండలపై అంచు నుంచి చూస్తే కొద్దిపాటి కిందన అదే కొండకి వట్టి చెట్ల గుబుర్లుగాక పెద్ద పెద్ద రాతి పలకలుంటాయి. అవి పండిన వల్కనో రాతి పొరలు. వీటిలో పెద్ద పెద్ద గదుల్లాగా కంతలు, (కేవిటీలు) ఏర్పడి వుంటాయి. వీటి రాతి కప్పుని ఆధారం చేసుకుని గబ్బిలాలవలె పెద్ద పెద్ద తేనెపట్లు పదినుంచీ ఇరవై దాకా వుంటాయి. ఈ రాతి పలకల అరల్లోకి వెళ్లేందుకు చీమలకి కూడా మార్గం ఉండదు. అటువంటి పలకల అరలను చెంచులు ‘పేట్లు’ అంటారు. ఈ పేట్లలోని తేనె పట్టులను పట్టేందుకు ముందుగా ఉదయమే చెంచు స్త్రీ పురుషులు బయలుదేరి వెళ్ళి ఆ పేట్లున్న కొండ కొమ్ము కింద అడవి నేలని చేరుకుంటారు. కూడా తిండికి అవసరమైన బియ్యం వగైరాలు తెచ్చుకుంటారు. ఆడవాళ్ళు వంట చేయడమే కాదు, అడవిలో వెదికి వెదికి ఒకరకం ఎండుటాకులు ఏరి పెద్ద పెద్ద పోగులు పోస్తారు. ఆ ఆకు కాలితే ఎక్కువ పొగ వస్తుంది. అందుకని పొగపెట్టడం కోసం ఈ ఆకు తెచ్చి నిప్పు పెడతారు. అటు వంట, ఇటు పొగ పెడుతుండగా ‘నారెప’ చెట్టు నారతో చేతులు వాచి, చర్మం తెగేంత కష్టించి స్త్రీలు మోకులు కడతారు. పొగవల్ల లక్షలాది దోమలు, పురుగులూ స్త్రీలని తెగకుట్టి పెడతాయి. చెంచు పురుషులంతా కొండ శిఖరం ఎక్కి అక్కడ ఒక బలమైన చెట్టుకి తాడు కడతారు. ఆ తాడుని ఒకరిద్దరు నడుముకి కట్టుకుని ఒక వెదురు కర్రను ఆధారం చేసుకుని, దానిమీద వేలాడతారు. ఆ వెదురు కర్ర కొనకు మరో తాడు కట్టి కొండ అంచున కొందరు చెంచులు పట్టుకుని వుంటారు. తేనె తుట్టను గచ్చు నుంచీ తెంపేందుకు మోకు కట్టుకున్న చెంచు తెడ్డు కర్రతో పొడుస్తాడు. పై నుంచి కొందరు మరికొన్ని మోకులకు నిప్పు, పండుటాకులు కలిపిన చువ్వలకు కట్టి వేలాడ దీస్తుంటారు. కొండ కింద పెట్టిన పొగ, పైనుంచీ వచ్చిన పొగా, రెండు పొగల ఘాటుకు తేనెటీగలు చెదిరిపోతాయి. ఇది జరిగేసరికి నడిరాత్రి అవుతుంది.
మోకు జారినా, దాన్ని కట్టిన వాళ్ళ పట్టువిడినా, కట్టుకున్న మనిషి వొడుపు జరినా ఆ చెంచు మనిషి శవం సైతం కొండకోనల్లో దొరకదు. అంతేకాదు, కళ్ళు సరిగా కనబడనందువల్ల కొండపై నున్న వాళ్ళు టార్చిగాని, దివిటీగాని వెలిగించక తప్పదు. అందువల్ల తేనె పట్టుని ఇంకా వదలని వేలాది తేనెటీగలు విజృంభించి తుట్టిని కదిపేవారిని, కొండపైనున్న వాళ్ళను కొండ దిగువన పొగ పెడుతున్న చెంచితలను ఘోరంగా కుట్టేస్తాయి. ఆడా మగా ”నర్సిమ్మ సామీ నీవే వుండావు…..నిర్సిమ్మా” అని అరుస్తుంటారు. కాగడాలు, టార్చి వెలుగులో సతమతమవుతున్న తేనెటీగలు కుట్టినంత కుట్టిపోతాయి. తెల్లారి వెలుగు రాగానే మళ్ళీ తుట్టెలు పెట్టిన చోటికి చేరతాయి. ఆ లోగా చెంచులు తేనె పట్టు తీసే కార్యక్రమం ముగించుకోవాలి.
ఇక తేనె పట్టు కొండ కిందికి చేర్చాకే ఆడవాళ్ళు విపరీతంగా శ్రమించి పట్ల నుంచి తేనెను బిందెల్లో పడతారు. ఆపై తేనెను చితుకులు చేర్చి మరిగించి, చెత్త తొలగించి, వడబోసి శుభ్రం చేయడం మైనం వేరు చేయడంలోనూ ఒళ్లు హూనం అవుతుంది. ఇలా మూడు నెలల సీజన్‌లో రెండు మూడురోజులకొకసారి తేనె పట్ల కోసం వెడతారు. ఒక సారి గుడిసెకి చేరాకా వారం రోజులు ఎవరూ ఏ పనీ చేయలేనంత నీరసించిపోతారు. తేనెటీగలు కుట్టిన స్త్రీ పురుషుల శరీరాలు చూడలేనంత బొబ్బలెక్కి వుంటాయి. ఆ బొబ్బల్లోంచి తేనెటీగల ముళ్లు పీకివేసి వంటికి ఆకు పసర్లు, నూనె పట్టించి శరీర రక్షణ చేసుకుంటారు. తరచుగా స్త్రీ పురుషులను అడవుల్లో రకరకాల పురుగులు కుడతాయి. ముఖ్యంగా పాములు, పాము కుడితే తేనె పని ఆపి ఇంటికి చేరే సమస్య లేదు. మరీ ముఖ్యంగా స్త్రీలు. కారణం సమీపంలో అలోపతి వైద్యం ఏమీ వుండదు. అందుకే చెంచులు అడవిలోని ‘కోలముక్కి’ ఆకులు తెంపి నములుతూ నోట్లోనే వుంచుకుని పని చేస్తుంటారు. సాయంత్రంలోగా పాము కాటు విషం విరిగిపోతోందట.
ప్రాణాలకు తెగించి సాధించే తేనెను ఎంత గిరాకీ వున్నా జి.సి.సి. వారు సాధారణంగా సులువుగా లభించే ఇతర అటవీ పదార్థాలతో సమానమైన ధర నిర్ణయిస్తారు. తెల్లబంక, ఎర్రబంక, నల్లబంకవలె తేనెను మైనానికి కూడా కిలో రూ.40 ల ధర నిర్ణయిస్తుంది. జి.సి.సి. ఈ ధరలో మార్పు వుండదు. నిలదీసి అడగడానికి లేదు. బయట మార్కెట్‌లో గిరాకీ లేదని చెబుతారు. బుధవారం సంతలో కిలో రూ.60, 80 రూ.లు, పట్టణ ప్రాంతంలో రూ.90ల దాకా ధర వుంది. బయట ఇతర ప్రాంతాల్లో కిలో 180 రూ.ల దాకా వుంది. ఇది చాలక తేనెను కల్తీ చేసే అనధికార వర్గాలూ వుండనే వున్నారు.
వి.ఎస్.ఎస్. స్త్రీలు పొదుపు సంఘాల ద్వారా కొంత పెట్టుబడి, గ్రామనిధి వంటివి ఏర్పాటు చేసుకుని ఇటీవలే కొద్దిపాటి ఊపిరి తీసుకుంటున్నారు. అంటే, భారీగా సేకరించిన తేనె, మైనం దాచి వుంచగల స్టోరేజి అవకాశాలు లేక ఇంతవరకు మొత్తం తేనె జి.సి.సి. చెప్పే ధరకు అమ్మవలసి వస్తోంది. జి.సి.సి. ఇతరాలు ఇస్తోంది. ఇప్పుడు ఆదా చేసుకున్న డబ్బుపై అప్పు తెచ్చుకుని, స్టోరేజీ అవసరాలు తీర్చుకోదలచారు చెంచితలు. అందుకే కొందరు అధికారులకి తేలు కుట్టినట్టు అయింది. మొత్తం తేనె అమ్మడం లేదని, బయట ఎక్కువ దరకి అమ్ముతున్నారనీ అలిగిన కొంతమంది అధికారులు వారు ఇచ్చిన కంటెయినర్‌లను తిరిగి లాగేసుకున్నారు. పైగా తేనెను తూకం వేసి కొనడంలో కొందరు కింది స్థాయి అధికారులు ఆక్రమాలకు దిగారని చెంచులు చెప్పారు. ఈ స్థితిలో నిరక్షరాస్యులయిన చెంచులు మోసపోవడానికి ఇక ఏ మాత్రం సిద్ధంగా లేరని కొన్ని చెంచు గూడాల స్త్రీలన్నారు. వారిలో అహోబిలం చెంచుగూడేనికి చెందిన ఆవులమ్మ ఒకరు.
ఆవులమ్మ – ఎదురీత :
అహోబలం ప్రాంతంలో వనసంరక్షణ కార్యక్రమాలతో, సమావేశాలతో, సహకార కార్యక్రమాలతో, పొదుపు వర్గాలతో నిత్యం క్షణం తీరిక లేకుండా చెంచు స్త్రీల తలలో నాలికగా పనిచేసే ఆవులమ్మ ఒక సాహసి. చెంచు ఆవాసాల్లో వుండే అన్ని రకాల అడ్డుకట్లను ధైర్యంగా దాటి మొత్తం ఆ ప్రాంత చెంచితలకు ఒక ప్రతినిధిగా, నాయకురాలిగా నిలబడింది. చెంచుగూడేల్లో స్త్రీలలో గట్టి ఐక్యత సాధించడానికి ఆవులమ్మ ప్రయత్నించింది. నేడు అధికారుల వైఖరిని అడ్డుకుని అవసరమైతే మొత్తం తేనె, ఇతర అటవీ పదార్థాలను గిట్టుబాటయే ధర ఎక్కడ పలికితే అక్కడే అమ్ముకుందామనే ఏకైక నిర్ణయం వెనుక ఆవులమ్మ ధైర్యం ఒక అండగా, కొండగానూ నిలిచింది. దీని వెనుక జరిగిన ఒక సంఘటన తెలుసుకోవడం అవసరం.
ఒకసారి చింతపండు సేకరించి జి.సి.సి ముందు అమ్మకానికి పెట్టారు. ఆ సందర్బంలో జి.సి.సి సంబంధిత కింది స్థాయి అధికారి ఒకరు బాహాటంగా అక్రమానికి దిగాడు. దొంగతూకం, దొంగ లెక్కలు చూపిస్తూ చెంచులను (చదువురాని వారు గనుక) ప్రత్యక్షంగా అవమానం చేయడం మొదలుపెట్టాడు. ఆవులమ్మ వంతు వచ్చేసరికి ఆమె ఆ అధికారిని తూకం విషయంలో, తప్పుడు లెక్కల విషయంలో నిలదీసి ప్రశ్నించింది. ఆగ్రహం చెందిన అధికారి అడిగే వారెవరూ లేనట్టు అగౌరవంగా ప్రవర్తించాడు. వెంటనే ఆవులమ్మ ఆ అధికారిని ఈడ్చి కొట్టింది. దిమ్మ తిరిగి హడలిపోయిన అధికారి తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఆ సంఘటనతో చెంచితలకు ధైర్యం వచ్చింది.
పై సంఘటన జరిగిన కొంతకాలానికి మళ్ళీవచ్చిన తేనె సీజన్‌లో 1000 క్వింటాల తేనె సాధించి అమ్మకానికి పెట్టారు చెంచులు. ఐతే ధర విషయంలో ప్రశ్నించడంతో చెంచులపై అలిగిన అధికార శ్రేణి పరోక్ష వ్యూహానికి దిగింది. రెండు నెలలపాటు తేనెను కొనలేదు. తేనె స్టోరేజీ అవసరాల సంగతి అటుంచితే రెండు నెలలకు పైగా ప్రాణాలకు తెగించి సేకరించిన తేనె అమ్ముడు కాకపోతే ఆకలితో కడుపులు మాడిపోవా? ఈ ఆలోచన కలగగానే ఆవులమ్మ మార్గాంతరాలు వెదికింది. ఆళ్లగడ్డలోని భ్రమరాంబ మహిళా బ్యాంకు నుండి పొదుపు బృందం ద్వారా రుణాలు తీసుకున్నది. తేనె, మైనం బయట మార్కెట్‌లో అమ్మడానికి శ్రీకారం చుట్టింది. దాంతో అధికారులు మరింత అలిగి హఠాత్తుగా వచ్చి వారు తేనె స్టోరేజి కోసం అందజేసిన డ్రమ్ములు, కేన్‌లూ ఇచ్చేయాలని భీష్మించుకుని కూర్చున్నారు. నాటినుంచి మార్కెట్‌లో అవసరానికి తగినంత తేనెనే సేకరించడం ఆరంభించారు. ప్రస్తుతం జి.సి.సికి కావలసినంత అమ్మి మిగతా భాగం కర్నూలు, కడపల్లోని సి.హెచ్.ఆర్.డి. అనే సంస్థ ద్వారా బయట మార్కెట్‌లో అమ్మకాలు ఆరంభించారు చెంచులు.
చెంచు స్త్రీలకు, పురుషులకు విద్య, అటవీ సంపద సేకరణకు తగిన స్టోరేజి సౌకర్యాలూ కల్పిస్తే చెంచులు తమకు కావలసిన అభివృద్ధిని తామే రచించుకోగలరు.
విద్య, రవాణా, వైద్య సౌకర్యాలు, నీటి వసతి కనీస మానవహక్కులు – ఇవి కల్పిస్తే చాలు, ఇతరత్రా అభివృద్ధి పథకాలు వున్నా, లేకున్నా ముప్పేమీ వుండదు. ఎటొచ్చీ పట్టణ ప్రాంత నాగరికత అంటకట్టే అభివృద్ధి పథకాలు, నియమ నిబంధనలు, రాజకీయాలు ఏవీ చెంచుగూడేలతో పాటు ఏ గిరిజనులనూ బాగుచేయలేవన్న సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది.
(ఈ కొద్దిపాటి పరిశీలనలో నాకు సహకరించిన పి.డబ్ల్యు.సి. సంస్థకు, సి.హెచ్.ఆర్.డి వారికి శ్రీమతి వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు).
(సెప్టెంబర్ – అక్టోబరు 2002)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags