-ఎం.స్వర్ణలత
సెరికల్చర్ మహిళా రైతు విజయగాథ
ఎం.స్వర్ణలత , ఆత్మకూర్ గ్రామం, నల్గొండ జిల్లా
నల్గొండ జిల్లా, ఆత్మకూరు గ్రామానికి చెందిన స్వర్ణలత సెరికల్చర్ రైతుల జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చిందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే సెరికల్చర్ వైపు మళ్ళడం తనకు, తమ బంధువులకు కూడా ఆనందంగా ఉంది. తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడంతో గ్రామంలో మాకు పరపతి పెరిగింది అని సంతోషం వ్యక్తం చేశారు స్వర్ణలత.
మార్పుతోపాటు పయనం…. ఒకే తరహా వ్యవసాయాన్ని నమ్ముకోకుండా కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని నమ్ముతారు స్వర్ణలత. మార్పుతో పాటు పయనించడం వలనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది
నష్టాలు దాటి…. తమకున్న నాలుగు ఎకరాలలో మల్బరీ సేద్యం చేస్తూ… సెరికల్చర్కు అవసరమైన షెడ్డు నిర్మించాం. మరో 16 ఎకరాల్లో వరి, పత్తి పండించడం వలన తాము ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాం, కాని సెరికల్చర్లో మాత్రం నష్టం ఎదురవ్వలేదు. మా లాంటి రైతులకు సెరికల్చర్ అత్యంత లాభదాయకమైన సేద్యం అని స్వర్ణ వివరించారు.. తమ కష్టాలకు సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఒక పరిష్కారాన్ని చూపిందంటారు స్వర్ణలత. వర్షాధారిత వ్యవసాయంతో నష్టపోయిన తమకి సెరికల్చర్ కొత్త మార్గం చూపిందన్నారు.
సెరికల్చర్ మొదలుపెట్టాక సుమారు 2 దఫాల సేద్యంలోనే అనగా 300 డిఎఫ్ఎల్స్తో సుమారు 160 కేజీల ఉత్పత్తి సాధించారు. మరో దఫా సేద్యం 580 డిఎఫ్ఎల్స్కు గాను 28 కేజీల ఉత్పత్తి పొందారు.
లాభాల పంట… ఇప్పటివరకూ చేసిన సెరికల్చర్కి రూ. లక్షకు పైగా ఆదాయం వచ్చింది. రెండో దఫాలో అత్యంత నూతన విధానమైన చాకీ పద్ధతిని అవలంభించారు. దీనికోసం వేరే షెడ్డును నిర్మించారు.
పేదమహిళలకు ఉపాధి…. స్వర్ణలత అత్యంత నైపుణ్యంతో సెరికల్చర్ని సాగుచేస్తున్నారు. వ్యాధి సంహారక మందులకోసం ఓ ప్రత్యేక ట్యాంకు నిర్మించారు. సేద్యంలో నిరంతరం సహాయపడేందుకు ఇద్దరు కూలీలను నియమించారు. అవసరమైనప్పుడు సరైన శిక్షణ గల వ్యక్తులను నియమించి ఉత్పత్తి పెరిగేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకించి మహిళా కూలీలను పెట్టుకొని రోజుకు రూ. 100 కూలీ ఇస్తున్నారు.
డిపార్ట్మెంట్ ప్రోత్సాహం…. సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారు తమను ఎంతగానో ప్రోత్సహించారని స్వర్ణలత చెప్పారు. షెడ్డులను నిర్మించే సమయంలో సుమారు లక్ష రూపాయలు ఆర్థికసాయం, బైవోలటైన్ గుడ్లను సబ్సిడీ రేట్లకు అందించారు.
క్రిమిసంహారక మందులను 50% సబ్సిడీకి అందించారని స్వర్ణలత తెలిపారు.
ఈ ప్రోత్సాహం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి మరింత సహాయం కావాలని కోరుతున్నారు స్వర్ణ. సెరికల్చర్లో ఉన్న మగవారికి కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ఆమె అంటారు.
”సెరికల్చర్పై ఆసక్తి పెంచడంతోపాటు షెడ్స్, వ్యాధిరహిత గుడ్ల కోసం ప్రభుత్వం సబ్సిడీతో ఆర్థిక సాయం అందించడంవల్ల మేం ఈ రంగంలో ఎదగడానికి అవకాశం కలిగింది” అంటారు స్వర్ణ.