పురాణం త్యాగమూర్తి శర్మ
మహాపురుషుల చరిత్రలు వింతగా ఉంటాయి. నవంబర్ 30వ తేదీన జన్మించి, నవంబర్ 30వ తేదీనే భౌతికశరీరం చాలించిన, గురజాడ అప్పారావు ఒక మహిళాజనోద్ధారకునిగా, నవయుగవైతాళికునిగా, సంఘసంస్కర్తగా, నాటక రచయితగా, గేయనాటికల రచయితగా, భాషా సంస్కర్తగా, మూఢవిశ్వాసాలపై తిరుగుబాటుదారునిగా శాశ్వతకీర్తిని గడించినవారైనారు. గురజాడ పేరు వినగానే ‘కన్యాశుల్కం’ పేరు స్ఫురణకు వస్తుంది. గురజాడవారు నవంబర్ 30, 1861లో విశాఖపట్నం జిల్లా రాయవరం అనే గ్రామంలో జన్మించారు. నవంబరు 30, 1915లో (తన 55వ ఏట) తన భౌతిక శరీరం చాలించారు.
ఆయన తెలుగు సాహిత్యంలోనే ఒక నూతన విధానాన్నీ, భాషను ప్రవేశపెట్టారు. ఆధునిక సాహిత్యానికి జాడజూపిన వారు గురజాడ వారు.
కళాశాలలో విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ”సారంగధర” అనే నాటకం ఆంగ్లభాషలో వ్రాశారు. ఈ నాటకానికి ఎన్నో ప్రశంసలు ఆయన అందుకున్నారు.
ఆనందగజపతి విజయనగర సంస్థానాధీశ్వరుడు అప్పారావును మహారాజా కళాశాలలో ఆంగ్లోపన్యాసకునిగా నియమించుటే గాక, తన సంస్థానములోని ప్రాచీన శిలాశాసనాలను, తాళపత్రాలను పరిశీలించుటకు నియమించుకున్నాడు. ఈ అవకాశంతో ”కళింగదేశ చరిత్ర” వ్రాశాడు. కానీ అది గ్రాంథికభాషలో వ్రాయబడుండలేదనీ వ్యవహారికభాషలో వ్రాయబడి ఉన్నందున ముద్రించుటకు వీలుగాదనీ ఒక చరిత్ర పరిశోధనా సంస్థ తేల్చి చెప్పింది. అందుపై గురజాడవారు ”అది ముద్రించకపోయినా ఫరవాలేదు గానీ, నేను వ్యవహారిక భాషను మాత్రము మార్చను” అని సమాధానమిచ్చాడట.
వ్యాసచరిత్ర – మహాకవి డైరీలు, మాటామంతీ మొదలైన రచనలలో ఆయన సమాజాన్ని చూపుత, సమాజరుగ్మతలు పోగొట్టడానికి పూనుకొన్నాడు. ముఖ్యంగా ఆతని కథానికలు ఇతర భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి.
గురజాడ ఎక్కడ అడుగుపెడితే అక్కడ సంస్కరణ జరిగి తీరాల్సిందే. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనెట్ సభ్యుడుగాను, ఎగ్జామినర్ గాను ఉండినాడు. విద్యార్థికి లోకజ్ఞానం పరీక్షించే పరీక్షాపద్ధతి కావాలని ప్రవేశపెట్టడానికిగాను, పరీక్షాపత్రాల పద్ధతినే మార్చేశాడు. కానీ ఆంగ్లేయులు మెచ్చుకున్నా – మన భారతదేశ పండితులు వ్యతిరేకించారు – కానీ ఈతడు ముందుకు కొనసాగాడు – విద్యాసంస్కర్త అయినాడు.
మహిళాసమస్యలు-పరిష్కారానికి రచనలు :
స్త్రీజాతి పట్ల సానుభతి గల్గి – మహిళాభ్యుదయనికి నడుం బిగించిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు గారు. ”బాల్యవివాహం”, వరకట్నం కన్నా హీనమైన ”కన్యాశుల్కం” మొదలైన దురాచారాల నిర్మలనకు పోరాడిన ఘనుడు. కలంతోన బలంతోన పోరాడినాడు. ”బలం” ఆర్థికబలమూ గాదు. అంగబలమూ గాదు. అదే గుండెబలం, ఆత్మబలం అన్నవి మాత్రమే అతనికి అండదండగా నిలిచాయి.
‘గురజాడ’ అనగానే ‘టపీ’మని ”కన్యాశుల్కం” రచయిత అనే మాట వెంటనే ఎదుటివారనేస్తారు. ఈ నాటకం సంఘసంస్కరణకు సహకరించింది. కన్యాశుల్కం నాటకం ఎందుకు వ్రాయవలసి వచ్చిందో కొంత గమనించాలి. గురజాడవారు విజయనగరంలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని పట్టభద్రుడు కాగానే డిప్యూటీ కలెక్టర్ వారి కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగిగా విజయనగరంలో చేరాడు. పేరుకు గుమాస్తా అయినా, ఆయన సాహిత్యంలో అందరికన్నా మిన్నయైనవాడు. వారి రచనలు గజపతిని ఆకర్షించినాయి. పైగా ఆయన కళాపోషకుడు, సాహిత్యపోషకుడు – అంతేగాదు స్వయంగా ఆయన కూడ మహాపండితుడు. విద్యావ్యాప్తికి ఎంతో సహకరించినాడు. ఆయనగారి ఆస్థానంలో కవులు, పండితులు, కళాకారులు, గాయకులు, నటులు – అనేకులుండినారు. అప్పారావుగారు ఆంగ్లంలోన, తెలుగులోన విశేషప్రజ్ఞ గలవాడని తెలుసుకున్న మహారాజు, విజయనగరము కళాశాలలో ఆంగ్లోపన్యాసకునిగా నియమించుకున్నారు.
విజయనగరం సంస్థానంలో బాలవితంతువులు, వేశ్యలు, కన్యాశుల్కానికి గురయినవారు ఎందరెందరున్నారో గణాంకసేకరణ జరిపించాడు ఆనందగజపతి. ఈ గణాంక సేకరణచే ఆకర్షితుడైన అప్పారావు గుండె ద్రవించింది. ప్రజలను మేల్కొల్పాలన్నట్టి తీర్మానంతో, దృశ్యకావ్యంగా ‘కన్యాశుల్కం’ నాటకం వ్రాశారు.
అసలు ‘కన్యాశుల్కం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈనాడు ‘వరకట్నం’ ఉంది. ఆ రోజుల్లో కన్యను వివాహం చేసుకోవాలంటే కన్య తల్లిదండ్రులకు వరుని యింటివారు ద్రవ్యము ఇచ్చేవారు. అదే కన్యాశుల్కం. ఆ రోజుల్లో భార్య గతించినట్టి, వయస్సు ముదిరిపోయినట్టి వృద్ధునికి, ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కం ఆశించి, రెండవ పెళ్ళికి ఆ అమ్మాయిని సిద్ధపరచేవారు – కానీ ఆ ముదుసలి భర్త మరణిస్తే ఆ బాలిక జీవితాంతము వరకూ వితంతువుగానే కొనసాగే రోజులవి.
బాల్యవివాహాలు, బాల్యవితంతువులు, కన్యాశుల్కం అన్నవి గురజాడవారికి రచనావస్తువులైనాయి. కన్యాశుల్క రచనలో వేశ్యావ్యావెహం, బాల్యవివాహం, కన్యాశుల్కంలపై తిరుగుబాటును తెచ్చాడు. పామరులకు కూడ అర్థం కావాలనే ఉద్దేశ్యంతో గ్రాంథికభాషలో గాక, మమూలుగా అందరు మాట్లాడుకొనే వాడుకభాష (వ్యవహారిక భాషలో)లో వ్రాశాడు. ఇందుకుగాను భాషాసంస్కరణను కూడ తెచ్చాడు. తెలుగుభాషలో వ్యవహారిక భాషలో వ్రాయబడిన మొదటి నాటకం ఈ కన్యాశుల్కమే. ఈ నాటకంలోనే గాదు, ఆంధ్రసాహిత్యంలో సజీవంగా నిలిచిన పాత్ర గిరీశం పాత్రతో వ్యంగ్య ధోరణిలో జ్ఞానోదయం కల్గించాడు గురజాడ. 1896లో గురజాడవారు ఈ నాటకం వ్రాశారు. ప్రదర్శించారు.
గురజాడవారు ”పుత్తడిబొమ్మ పూర్ణమ్మ” అనే గేయగాథ కూడ వ్రాశారు. బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కుకొని బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథ, పాషాణ కఠిన కర్కశ హృదయన్నైనా కరగించి పారేస్తుంది. ఇందులోని ఛందస్సు కూడ క్రొత్తదే. ఈ గేయనాటిక ఒక చక్కని నృత్య గేయనాటికగా ఆంధ్రదేశంలో ఎంతో పేరు గడించింది. ‘పూర్ణమ్మ’ – ‘కన్యక’ అను గేయనాటికలు 1910లో ముద్రించి వెలుగులోనికి తేబడ్డాయి.
కథానికలుగా ప్రసిద్ధిచెందిన ”దిద్దుబాటు”, ”మీ పేరేమిటి?”, ”పెద్దమసీదు”లలో కూడ మహిళల పరిస్థితిని, ఆనాటి సంఘ దురాచారాలను నిర్భయంగా చాటారు – మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశారు.
మహిళలకు విద్య అవసరమని, సంఘసంస్కరణకు పూనుకొన్నాడు. ఆ రోజుల్లో వేశ్యావ్యావెహం పురుషుల్లో అధికంగా ఉండేది. ”నశ్యం-వేశ్య” రెండూగల పురుషుడే అధిక గౌరవం గలవాడు ఆ రోజుల్లో. అతడే ”పెద్దమనిషి” – ఎవడెన్ని భోగం మేళాలు పోషిస్తే – అతడంత ఘనుడు. అట్టి సమాజంలో వేశ్యావ్యావెహనాన్ని అరికట్టి, గురజాడవారు కుటుంబాలను కాపాడగల్గారు. గురజాడవారు బాల్యవివాహాలు వ్యతిరేకిస్తండగా, కన్యాశుల్కానికి వ్యతిరేకోద్యమాలు బయలుదేరాయి. కానీ గురజాడవారు ఎదురీది నిలచి గట్టు చేరుకున్నాడు.
వీరెన్నో రచనలు చేశారు. కానీ మహిళోద్ధరణకు రచించిన ‘కన్యాశుల్కం’, ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, ‘కన్యక’లు ఎంతో ఆదర్శవంతమై మహిళోద్ధరణకు సహకరించాయి. నేటికీ ఈ మూడు సజీవములుగానే ఉన్నాయి.
గురజాడ వారి ”దేశభక్తి” – గేయం, ”దేశమును ప్రేమించుమన్న” – అన్నది అందరికీ పరిచయమైనదే.
‘పెన్నిధి’ అన్న కవితలో
ప్రేమపెన్నిధి
కాని ఇంటను
నేర్పరీకళ
ఒజ్జలెవ్వరు
లేరు
శాస్త్రములిందు గర్చి
తాల్చెమౌనము
నేను నేర్పితి
భాగ్యవశమున కవుల
కృపగని.
హృదయమెల్లను
నించినాడను
ప్రేమయనురతనాలు
కొనుము (కొనుము=తీసికొమ్ము)
తొడవులుగనవిమేనదాల్చుట
యెటులనంటివో?
తాల్చితదె… నా…
కంటచడుము
సతుల సౌరను
కమలవనముకు
పతుల ప్రేమయె
వేవెలుగు… ప్రేమ కలుగక బ్రతుకు
…… చీకటే
ఇందులో ప్రేమతత్వాన్నీ – ప్రేమలేని (కలుగని) బ్రతుకు) చీకటి బ్రతుకని తెలిపినాడు.
ఇక ”మనిషి” అను కవితలో
మనిషి చేసిన రాయిరప్పకి
మహిమ కలదని సాగిమొక్కుత
మనుషులంటే, రాయిరప్పల
కన్న కనిష్టం
గాను చతువేల? బాలా?
దేవుడెక్కడో దాగెనంట
కొండకోనలు వెదుకులాడే
వేలా?
కన్నుదెరచిన కానబడడో
మనిషి మాత్రుడియందులేడో?
యెరిగి కోరిన కరిగి యీడో.
ముక్తి! ……. అని రాయీరప్పల రుపాలకు, కనిపించని దేవునికి మొక్కులిడుట కన్నా – ఎదుటనున్న మనిషిలో దైవత్వమునుచూడుమన్నాడు. ”దైవం వనుషరపేణ” అన్న నానుడికి ఈయన జీవం పోశారు – ఇట్లు మూఢవిశ్వాసాలపైన కూడ దాడిచేసి మానవతకు విలువనిచ్చాడు అప్పారావు. వ్యాసాలు, గేయలు, నాటికలు, నాటకాలు, ప్రహసనాలు, పద్యములు రచించి, వాడుకభాషకే విలువనిచ్చిన భాషాసంస్కర్త – సంఘసంస్కర్త గురజాడ.