నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ చెంచులు, మహిళల జీవనస్థితి – స్వేచ్ఛ ఒటార్కర్‌

ఆదివాసీలు చరిత్రకు, సంస్కృతికి ప్రతిబింబాలు. అడివమ్మలు ఆదివాసి తల్లులు. తెలంగాణ రాష్ట్రం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌… అక్కడ నుండి మొలచింతలపల్లి దాటితే నల్లమల అడవి. ఒకప్పుడు చెంచుల ఆలవాలం. ఇప్పుడు ఆకలికేకలతో ప్రమాదకర స్థాయిలో అంతరించిపోతున్న చెంచులు. 35 ఏళ్ళకే జీవితాన్ని ముగిస్తున్న చెంచు మహిళలు, వాళ్ళ దుర్భర జీవితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు 35 ఏళ్ళ లోపే చెంచు మహిళలు చనిపోతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఇందుకు కారణమవుతున్నాయో తెలుసుకోవాలని అడవి బాట పట్టాం.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు పాలమూరు జిల్లా అంటే వలసలే ముందు గుర్తొచ్చేవి, కానీ ఏ గొప్ప పర్యాటక ప్రదేశాలకు తీసిపోని ప్రకృతి సౌందర్యం పాలమూరు జిల్లా సొంతం. తెలంగాణ మైసూర్‌గా పిలవబడేది కొల్లాపూర్‌. కొల్లాపూర్‌ని దాటి 12 కిలోమీటర్లు వెళ్తే మొలచింతలపల్లి… అక్కడే చెంచుల కోసం ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయిస్తే ఓ ఎన్జీఓ పునరావాసంగా ఇళ్ళు కట్టించి ఇచ్చింది. కానీ ఈ ఇళ్ళలో ఉండేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. ఎప్పుడైతే నక్సలైట్లకు అన్నం పెడుతున్నారని అడవిలోంచి ఆదివాసీలను బయటకు లాక్కొచ్చి ఊర్లలో ఉంచారో… అప్పటినుండి చెంచుల కష్టాలు మొదలయ్యాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీలను అడవుల్లోంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెంచులను బలవంతంగా అడవికి కాకుండా చేసింది. పునరావాసం అంటూ కొన్ని గ్రామాల్లో అందరికీ ఒకే చోట స్థలం కేటాయించి అక్కడే గుడిసెలు వేసుకుని ఉండమని చెప్పింది ప్రభుత్వం. గుడిసెలయితే వేసుకుని ఉండొచ్చు కానీ బతకడమెట్లా… ఏ పని చేసుకోవాలి, ఉపాధి హామీ పథకం 100 రోజులు. మరి సంవత్సరానికి 365 రోజులు కదా. చెంచులు అడవి దాటి వచ్చిన తరువాత ఈ పునరావాసం, చెంచుల అబివృద్ది పేరుతో చాలా కార్యక్రమాలు జరిగాయి. కొన్ని చోట్ల పట్టా భూములిచ్చామని ప్రభుత్వం చెప్తోంది. కానీ అడవిలోపల కిలోమీటర్ల అవతల ఆ భూములున్నాయి. ఆ భూముల్ని సాగు చేసుకోవాలంటే మైళ్ళు నడిచి వెళ్ళాలి. వర్షాధార పంటలు వేసుకోవాలి. దట్టమైన అడవిలో క్రూర మృగాల భయం. ఒకవైపు అడవినుండి ఆదివాసీలు బయటికి రావాలని పిలుపునిస్తూ, మరోవైపు అడవుల్లో పట్టా భూములిచ్చి వ్యవసాయం చేసుకొండని చెప్పడం చెంచుల అబివృద్ధి పట్ల ప్రభుత్వ ఆలోచన ఏంటో తెలియచేస్తుంది.

పునరావాస కేంద్రాల్లోకి జీవితాన్ని మార్చుకొని బతుకుదెరువు లేక, ఆకలితో వేలాదిమంది చెంచులు చనిపోయారు. ఇక్కడే

ఉంటే చచ్చిపోతామని భయపడి, మళ్ళీ అడవిబాట పట్టారు చెంచు బిడ్డలు.

ఇదంతా ఒక ఎత్తయితే… ఇక్కడ మహిళ జీవనం మరో ఎత్తు. ఉండేది ఎక్కడయినా కష్టాలు తప్పట్లేదు. మామూలుగా చెంచులు అడవిలో చెట్లకింద, నీళ్ళు అందుబాటులో ఉన్నచోట వెదురు బొంగులతో చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతుంటారు. అదంతా ఒకే చోట ఉన్నా కూడా ఎవరి గుడిసె వాళ్ళదే, ఎవరి వంట వాళ్ళదే. వంట చేసుకోవాలంటే ఎండు మిరపకాయలు ఉప్పుతో కలిపి బండరాళ్ళతో నూరుతారు. ఇది కూడా ఏ పూటకాపూటే… దీనికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. అంటే రోజులో గంటన్నర కారం నూరడానికి సరిపోతుంది. వండుకోవడానికి కావలసిన నీళ్ళకోసం నీళ్ళుండే ఊట దగ్గరికి ప్రతిపూటా వెళ్ళాల్సిందే. గుడిసెలకు కనీసం ఇవి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇట్లా ఇంటి అవసరాలకు ఒక్కోసారి రోజులో పది కిలోమీటర్లయినా నడవాల్సొస్తుంది. మినహాయింపులేమీ ఉండవు. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోయినా… పచ్చి బాలింత అయినా… పసిపిల్లలుంటే వాళ్ళని చెట్లకు కట్టిన ఉయ్యాలలో వదిలేసి వెళ్ళి పనులు చేసుకుంటారు. వీటితోపాటు అడవిలో ఆహార పదార్థాల సేకరణ చేస్తుంటారు. వెదురు బొంగులు కొట్టుకొస్తుంటారు. వేటకి కూడా వెళ్తుంటారు. ఇవన్నీ పది పన్నెండేళ్ళ వయసు నుంచే. చెంచుల్లో చిన్నవయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారు. ఆడపిల్ల పెద్దమనిషి కాగానే వెంటనే పెళ్ళి.. ఆ తర్వాత పిల్లలు, ఇల్లు, బాధ్యతలు, ఇంకా చదువుకునే అవకాశమే లేదు.

కనీస అవసరాల కోసమే రోజూ పోరాటం చేయాల్సొస్తుంది. ఇక అభివృద్ధి గురించి ఆలోచించడానికి చాలా దూరంలో ఉన్నారు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు, గర్భం దాలిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అప్పుడప్పుడే ఎదుగుతున్న అవయవాలు, పునరుత్పత్తి వ్యవస్థ, అంతలోనే గర్భం శరీరాన్ని బలహీనం చేస్తుంది. 16 ఏళ్ళలోపే ఇద్దరు పిల్లలకి తల్లులవుతుంటారు. పుట్టిన పిల్లలని చూసుకోవడం, కుటుంబ జీవనోపాధి లేని పరిస్థితుల్లో పౌష్టికాహార లోపం ప్రధానంగా కనిపిస్తుంది. పసిపిల్లలు, గర్భిణులు, మహిళలు సరైన ఆహారం లేక చనిపోవడం అత్యంత బాధాకరం.

ఇప్పుడు కనీసం అడవుల్లో దొరికే గడ్డలు, పళ్ళు, కాయలు కూడా లేకుండా అడవి దోపిడీకి గురైంది. దీంతో వెదురు బొంగులు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కొన్న బియ్యం, పప్పు, వేటలో దొరికే ఉడుము తప్ప ఇంకో ఆహారాన్ని తినే పరిస్థితి లేదు. పప్పు కూడా దొరకనప్పుడు అన్నం, కారం… ఇదే తిండి తింటే పుట్టిన పిల్లలకు పాలు ఎక్కడనుంచి వస్తాయి. తల్లికి తిండి లేక, బిడ్డకి పాలు లేక కడుపు మాడ్చుకుని బతుకులీడుస్తున్నారు.

బయటి ప్రపంచంలో 18 ఏళ్ళలోపు ఆడవాళ్ళ జీవనశైలికి, చెంచు మహిళల జీవనానికి ఎక్కడా పొంతన లేదంటే, జీవన ప్రమాణాల విషయంలో చెంచులు మామూలు సమాజానికి ఎంత దూరంలో

ఉన్నారో అర్థమవుతుంది.

వెదురుతో కట్టిన గుడిసెల్లో ఆవాసం, మలమూత్రాలకి ఆరుబయటే వెళ్లాల్సి రావడంతో, అసలే పౌష్టికాహార లోపంతో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, గైనిక్‌ సమస్యలు చెంచు మహిళలను చుట్టుముడుతున్నాయి. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌, గర్భాశయ వ్యాధులు తరచూ వస్తున్నాయి. జననాంగాల్లో మంట, నొప్పి ఉంటే లోపల్లోపల భరించడం తప్ప, ఆ జబ్బులు ఎందుకొస్తాయి, ఎలా తగ్గుతాయి అన్న కనీస అవగాహన లేని దుస్థితి చెంచు స్త్రీలది.

గిరిజన సంక్షేమ శాఖ మహిళలకు, పిల్లలకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. పిల్లల కోసం బాలబడులు, గర్భిణుల కోసం పౌష్టికాహారం అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతోంది. తెరిచిన రోజుల వ్యవధిలోనే బాలబడులు మూతపడ్డాయి. నామమాత్రంగా కట్టిన భవనాలు పక్కదారి పట్టాయి. తల్లిదండ్రులు అడవులో ఉంటే పసిపిల్లలు హాస్టళ్ళలో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు చెంచులు. అయితే ఈ కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారు. ఆధునిక కాలంలో కూడా చెంచుల పిల్లలు ఇంకా బడికి దూరంగానే ఉండడం, వారి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తోంది.

పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట చెంచుల ఆరోగ్యం, మౌలిక వసతులకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్తున్న అధికారుల మాటలు నీటిమీది రాతల్లాగే ఉన్నాయి. పునరావాస కేంద్రాలలో

ఉండి తిండిలేక చచ్చిపోయే బదులు అడవి తల్లిని నమ్ముకొని బతకడం మేలని అడవిలో అనేక సమస్యల మధ్య జీవనం కొనసాగిస్తున్న చెంచులు…మహిళలు, పిల్లల కోసం కనీస వైద్య సదుపాయాలతో చిన్నపాటి హెల్త్‌ క్యాంపులాంటిదయినా ఏర్పాటు చేయాలంటున్నారు. రోగమొస్తే ఇక్కడినుండి హాస్పిటల్‌కి వెళ్ళాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతలోపు ప్రాణంమీదికి వస్తే, బతికి ఉండడానికయినా ఈ హెల్త్‌ క్యాంపు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నారు. ఒక గర్భిణీకి నాలుగో నెలలో పిండం చనిపోతే, వెంటనే అడవినుండి హాస్పిటల్‌కు వెళ్ళలేక రెండు రోజుల పాటు చనిపోయిన పిండాన్ని కడుపులోనే మోసినటువంటి దారుణ స్థితి తమ వాళ్ళెవరికీ ఇంక రాకూడదని కోరుకుంటున్నారు.

ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, నీ వయసెంత అని ఏ చెంచునడిగినా తెలియదు అన్న సమాధానమే వినిపించింది. ఈ జాతి అంతరించిపోవడం మొదలయినప్పటినుండి చాలా కుటుంబాలకు పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. అమ్మా నాన్నలు, అత్త మామలు ఎవరూ లేరు. భార్య, భర్త… ఉంటే పిల్లలు…అంతే. ఇదే జీవితం.

అంతరించిపోతున్న వేగం చూస్తుంటే పరిస్థితుల వల్ల ఇప్పటికే ఉనికిన కోల్పోతున్న చెంచు సంస్కృతి పూర్తిగా మరుగునపడే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఒక మహిళ వివక్షను జెండర్‌పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, మతపరంగా, కులపరంగా, కుటుంబపరంగా, సాంస్కృతికంగా, ఒక్కొక్కటినీ ఎదుర్కొంటూ వస్తున్న క్రమంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ఒక్కో అడ్డుగోడను తొలగించుకుంటూ ముందుకెళ్ళగలగడమే ఒక మనిషిగా మహిళ సమయాన్ని పోరాటానికి పరిమితం చేసి… ప్రతిఫలాన్ని తినేస్తుంది. మరి అన్నీ అడ్డుగోడలే అయినప్పుడు చెంచు మహిళ జీవనం మెరుగుపడాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పడం సాధ్యమవుతుందా?

 

 

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.