ఉమ్మనీరు సంచి ముందుగానే పగిలిపోతే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ ఎక్కువగా వుంటుంది. తల్లికి గనేరియా, సిఫిలిస్, షాంక్రాయిడ్స్, హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధులు ఉన్నట్లయితే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది.
హెచ్ఐవి తల్లికి చుట్ట, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, మద్యం తీసుకునే అలవాటు ఉన్నా పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది.
సర్విక్స్‌లో హెచ్ఐవి క్రిములు ఎక్కువగా వుంటాయి
తల్లి యోని మార్గంలో హెచ్ఐవి క్రిములు అధికంగా వుంటే కాన్పుసమయంలో బిడ్డకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువ. హెచ్ఐవి క్రిములు సర్విక్స్‌లో ఎక్కువ వుంటాయి. సర్విక్స్‌లో 32 శాతం హెచ్ఐవి క్రిములు వుండగా యోని మార్గంలో పది శాతం వుంటాయి. కాన్పు చివరి దశ అధిక సమయం తీసుకున్నట్లయితే సర్విక్స్‌లో ఉన్న క్రిములు బిడ్డ చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు అధికంగా వున్నాయి.
ఎయిడ్స్ కి తల్లిపాలు కూడా కారణమే
మామూలు కాన్పు సమయంలో జననేంద్రియ మార్గంలోని హెచ్ఐవి వైరస్ శిశువుకి సంక్రమించినట్లుగానే కాన్పు తర్వాత తల్లిపాల ద్వారా హెచ్ఐవి సంక్రమణ వుంటుంది. కొందరు తల్లులు హెచ్ఐవి ఉన్నప్పటికీ తమ రొమ్మునే అందిస్తారు. తమ పాలే పడతారు. తల్లిపాలు ఎక్కువ నెలలు తాగిన శిశువులలో పాల ద్వారా హెచ్ఐవి సంక్రమించే శాతం ఎక్కువగా వుంటుంది. తక్కువకాలం పాటు తల్లిపాలు త్రాగిన వాళ్ళల్లో హెచ్ఐవి సంక్రమణ తక్కువగా వుంటుంది.
గర్భిణీ స్త్రీ వైద్య పరీక్షలు- ఎయిడ్స్ నివారణ
హెచ్ఐవి వున్న స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మొదటి నెల నుంచి తగిన వైద్య సలహాలు పొందడం అవసరం. గర్భం రాక ముందు హెచ్ఐవి వున్నదీ లేనిదీ తెలియకపోయినప్పటికీ హెచ్ఐవి రావడానికి అవకాశం ఉన్నవాళ్ళు ముందుగానే పరీక్ష చేయించుకుని హెచ్ఐవి వున్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి.
హెచ్ఐవి తల్లికి తగిన సైకలాజికల్ సపోర్ట్, హెల్త్ సపోర్టు అందిస్తే పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ చాలా తక్కువగా వుంటుంది. అధిక సంఖ్యాక స్త్రీలు ఇది గుర్తించక సరిగ్గా కాన్పు సమయానికి హెచ్ఐవి వుందని తెలుసుకుని అయోమయంలో పడతారు.
(వాసవ్య మహిళా మండలి సౌజన్యంతో)