డా|| పి. సంజీవమ్మ
సాధారణంగా విమర్శకులందరూ రవీంద్రనాథ్‌ఠాకూర్ సాహిత్యంలో మానవతాదృష్టిని గురించే మాట్లాడుతూ వుంటారు. ఆయన స్త్రీ పక్షపాతి కూడ. నూరేళ్ళ క్రితమే స్త్రీల పక్షంలో గట్టిగ వాదించినవాడు. ఆయన కాలంలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీల సమస్యలు వారి దుస్థితి వారి దయనీయమైన స్థితి మానవతావాదియైన రవీంద్రుని మనసును కలచివేశాయి. పురుషాధిక్య భావజాలం కింద నలిగి, మానసికంగా కుళ్ళిపోతూన్న ఆ స్త్రీలను తన సాహిత్యంలో పాత్రలుగా మలచినాడు. ఆ చిత్రణ సహజంగ సజీవంగ వాస్తవికతను ప్రతిబింబంచేదిగ వుంది.
అయితే రవీంద్రుడు ఆ స్త్రీల దుస్థితిని చిత్రించటంతోనే ఆగలేదు, సమకాలీన ప్రపంచం మీద వారు మౌనంగానే అయినా తీవ్రంగ తిరుగుబాటు చేసినట్లు చిత్రించటం ఆనాటికి గొప్ప విషయం. అలాంటి స్త్రీపాత్ర చిత్రణలో ఆయన సూక్ష్మదృష్టి అద్భుతం!
‘రవీంద్ర కథావళి’ పుస్తకంలో (సాహిత్య అకాడెమి ప్రచురణ 1968, 2003) ‘భార్య వ్రాసిన లేఖ’ అనే కథ ప్రసిద్ధమైంది. ఇది రవీంద్రుడు 1913లో రాసింది. ఈ కథలో మృణాళ్ ముఖ్యమైన స్త్రీపాత్ర. ఆమె 15 సంవత్సరాలు గృహిణిగ నలిగి, మానసికంగ వూపిరాడని స్థితిలో తీర్థయాత్రకు వెళ్ళే నెపంతో ఇంటినుండి బయటపడుతుంది. బయటినుండి భర్తకు లేఖ రాస్తుంది. ఈ లేఖ సారాంశమే కథ. తిరిగి ఆమె ఇంటికి రాదు.
ఆ లేఖలో మృణాళ్ వ్యక్తం చేసిన భావాలు ఆనాటి సమాజానికే కాదు, ఈనాటికీ చురకలు – చురకత్తులు. ఆమె అంటుంది – ”స్త్రీ జీవితానికి వివాహం, భార్యాత్వం మాత్రమే పరమావధి కాదు, ఆమెకూ పురుషునికిలాగ విశాలప్రపంచం వుంది. విశాల ప్రపంచంలో జీవించడమే జీవితం. మీనుండి బయటపడి ఇప్పుడు బ్రతికాను నేను” అని. ఆమె స్త్రీలకు జరుగుతూన్న అన్యాయాల్ని అవమానాల్ని పదునైన భాషలో వ్యక్తంచేస్తూ పురుష కబంధ హస్తాలనుండి స్వయంగ విముక్తం కావాలని కోరుకుంటుంది. ఆ సందర్భంలో రాస్తుంది – ”మీ పురుషులు స్త్రీల జీవితాల్ని శాశ్వతంగ కాళ్ళకింద నొక్కిపెట్టి వుంచటానికి మీకాళ్ళు అంత పొడుగాటివి కావు. మృత్యువు మీ కంటె ఎంతో గొప్పది” అని.
ఆ లేఖలోనే ఒక మహా పతివ్రత కథ జ్ఞాపకం చేస్తూ రాస్తుంది – ”కుష్ఠురోగి అయిన భర్తను ఎత్తుకొని ఆయన కోరిక మేరకు స్వయంగ ఆ సాధ్వీమణి వేశ్య యింటికి తీసుకువెళ్ళింది. ఈ నీచమైన కథను ప్రచారం చేస్తూ రావటానికి మీ పురుషుల మనసుల్లో రవంత అయినా సంకోచం సిగ్గూ కలగలేదు. మీ తలలు ఒరిగిపోవలసిన చోట నిటారుగ గర్వంతో నిలుచున్నాయి…” ఈ మాటలకు వేరే వ్యాఖ్యానంతో పనిలేదు.
మృణాళ్ పల్లెటూరి పిల్ల అయి నప్పటికీ, ఆమె రూపవతి అయినందున భర్తవైపువాళ్ళు ఆమెను వివాహం చేసుకొని వచ్చారు. అయితే ఆమె రూపం వాళ్ళకు ఎన్నాళ్ళు జ్ఞాపకం వుంటుంది? రూపంతో పాటు ఆమెకు జ్ఞానమూ వుంది. అదే ఆమె భర్తకు కొరుకుడు పడలేదు. ఆడవాళ్ళకి జ్ఞానం అనవసరమైనదని ఆ పురుషుల గాఢమైన అభిప్రాయం. ”పురుషుల ఆజ్ఞలను శిరసావహించి విధేయతతో నడచుకోవలసిన వాళ్ళు, జ్ఞానంతో ప్రవర్తించాలనుకుంటే తలబొప్పెలు కట్టి కట్టి పగిలిపోవాల్సిందే. మరి స్త్రీలు తమ జ్ఞానాన్ని ఎవరికి తిరిగి ఇచ్చేయగలరు? చెప్పండి. ఇదీ ఆమె ప్రశ్న.
ఆనాటి సమాజానికే కాదు, నేటి సమాజానికీ ఇది ఇంకా ప్రశ్నగానే వుంది. ఆనాడే ఇటువంటి ప్రశ్నల్ని చర్చను లేవదీసిన రవీంద్రుడు స్త్రీవాది!
మృణాళ్ తోడికోడలి చెల్లెలు బిందు. ఆమె తండ్రి పోయాక, ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకొని పినతండ్రి కొడుకులు ఆమెను ఇంటినుండి గెంటివేస్తారు. దిక్కులేని బిందు అక్క దగ్గరికి వస్తుంది. ఆ అక్క పతివ్రత. భర్త మాట జవదాటదు. వారి అనుమతిలేనిదే స్వంత చెల్లెల్ని చేరదీయడానికి కూడా భయపడుతుంది. కాని మృణాళ్ కాస్త ధైర్యం చేసి బిందును చేరదీస్తుంది. కొన్నాళ్ళకి బిందును ఒక పిచ్చివానికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. పెళ్ళికి ముందు ఆ విషయం దాచిపెడతారు.
స్త్రీకి ఆస్తిహక్కు లేని కాలం. బీదపిల్లకి పెళ్ళి కావాలంటే కష్టం మరి. పెళ్ళయ్యాక బిందు భర్త విషయం గ్రహించింది. అతని హింస భరించలేక తిరిగి అక్క దగ్గరికి వస్తుంది. అక్కడ అక్క కాదు కదా ఎవరూ ఆమెని ఆహ్వానించడానికి సిద్ధంగ లేరు. వాళ్ళందరూ అనే మాట ఒక్కటే – ”ఆడది ఆడదే. మగవాడు పిచ్చివాడు అయితే కావచ్చు. కాని భర్తేగా!” అని.
ఆఖరికి బిందు కాల్చుకొని చని పోతుంది. ఆడవాళ్ళు చీరలకు నిప్పంటించు కొని చనిపోవటం ఫ్యాషన్ అయింది అన్నారు ఇరుగుపొరుగు, ముఖ్యంగ పురుషులు. అదంతా నాటకం అని కూడ అన్నారు వాళ్ళు. ఈ సందర్భంలో మృణాళ్ ప్రశ్న ఏమిటంటే – ”బెంగాలీ వీరపురుషుల ధోవతులకు నిప్పంటుకోదేమి మరి?” ఇదీ చాలా ఆలోచించాల్సిన విషయం మరి.
”రవీంద్ర వ్యాసావళి” అనే పుస్తకం (సాహిత్య అకాడెమి ప్రచురణ 1966)లో ‘భారత వర్షీయ వివాహము’, తర్వాత ‘నారి’ అనే రెండు వ్యాసాలు ఆధారంగ స్త్రీలపట్ల రవీంద్రుని మరికొన్ని భావాలు గమనిద్దాం – 1926లో వ్రాసిన ‘భారత వర్షీయ వివాహము’ అనే వ్యాసంలో వివాహాన్ని గురించి వ్రాస్తూ ”ఈనాటికీ వివాహం అన్ని దేశాల్లో కాస్త హెచ్చుతక్కువగ స్త్రీలను బందీ చేసి వుంచే పంజరము వలెవున్నది. దానికి కాపలా కాసేవాడు పురుష ప్రభుత్వపు చప్రాసీ. అందువల్ల స్త్రీలు అన్ని సమాజములందూ తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకొని సమాజమునకు ఇవ్వగలిగిన సంపదను ఇవ్వలేకపోతున్నారు. తత్ఫలితంగా కలిగే దైన్యతాభారాన్ని సమాజములన్నీ మోస్తున్నాయి. నారీశక్తి ఎంత వ్యర్థమవుతూ వుందో ఎవరూ అంచనా వేయలేరు. ఈనాటికీ వివాహం విషయంలో మన సమాజాలు బర్బర యుగంలోనే వున్నాయి.” వరకట్న దురాచారంతో అది మరింత బర్బరమయింది మన దేశంలో.
జనాభాలో సగం మంది – మానవ వనరుల్లో సగభాగం సామాజిక వుత్పత్తిలో పాలుపంచుకోలేకపోతే ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ సందర్భంలో గురజాడ మాట గుర్తుకు వస్తూంది – సమాజమనే రథానికి స్త్రీపురుషులు రెండు చక్రాలు ఒక చక్రం దిగబడిపోతే రథం ఎలా ముందుకు సాగుతుంది? అనేది.
వివాహబంధం కొందరు స్త్రీలకు బంగారుపంజరం కావచ్చు, మరికొందరికి ఇనుప పంజరం కావచ్చు. ఏదైనా అది పంజరం నేటికీ! స్త్రీ స్వాతంత్య్రం స్త్రీ కోసం మాత్రమే కాదు, స్త్రీకి విద్య విజ్ఞానం స్త్రీ కోసం మాత్రమే కాదు, అది మొత్తం సమాజానికి వుపయోగపడుతుంది. ఈ ఎరుక లేకనే పురుషాధిక్య ప్రపంచమూ పురుషాధిక్య ప్రభుత్వాలూ సగం వెనుకబడే వుంటాయి.
రవీంద్రుడు ఈ వ్యాసంలో ఇంకా ఇలా అంటాడు – ”మనదేశంలో కామినీ కాంచనములను ద్వంద్వసమాస సూత్రంలో బంధించి స్త్రీని నిందాకరమైన భాషలో అవమానపరచడానికి వెనుదీయలేదు. పురుషుడు తన స్వతంత్రమే ఏకమాత్ర లక్ష్యంగ, స్త్రీని తాను కాంచనము వలె తన ఇచ్ఛాప్రయోజనములను అనుసరించి స్వీకరించవచ్చును, త్యజించనూ వచ్చును అనుకుంటున్నాడు. ఆమెను త్యజించడం ద్వారా తాను ఆత్మహత్య పాలౌతున్నాడని అతడు ఎరుగడు. పురుషుని సకల సాధనాలలోను అంతర్గతమగు పరమ సంపద స్త్రీ అని అర్థం చేసుకొనే సమయం ఇంకా రాలేదు. మన సర్వవ్యాప్తమగు శక్తిహీనతకు అదే ఒక ప్రధాన కారణం.”
1926లోనే రవీంద్రుడు ఇంత చక్కటి విశ్లేషణ చేశాడంటే, స్త్రీల పక్షంలో ఇంతగా ఆలోచించాడంటే అది ఆయన గొప్పతనం. స్త్రీ శక్తి నిర్వీర్యం కావటం వల్ల దేశాభివృద్ధి సమాజాభివృద్ధి కుంటుపడుతుంది అనే నిష్ఠుర సత్యం ఆనాడే ఆయన మనకు విప్పి చెప్పారు.
”నారి” అనే వ్యాసంలో (1937లో వ్రాసింది) అంటాడు రవీంద్రుడు- ”మానవ సభ్యతా వ్యవస్థాభారం అతిదీర్ఘకాలం పురుషుల చేతులలో నడిచింది. ఇది ఒకే దిక్కు మొగ్గిన సభ్యత అయిపోయింది” అని. అయితే స్త్రీలు క్రమక్రమంగా గృహాలకే పరిమితం కాకుండ, విశ్వమునకు చెందిన స్త్రీలు అయి కనిపిస్తున్నారని ఆశను వ్యక్తం చేస్తాడు. ”ఈ విశాల సంసారపు బాధ్యతను కూడ వారు స్వీకరించక తప్పదు…వారి ముఖాలనుంచే కాదు మేలిముసుగు తొలగిపోయింది, వారి మనసులను కప్పి వారిలో అధికాంశమును లోకమునుంచి చాటొనర్చిన మేలిముసుగు కూడా ఇప్పుడు జారిపోతున్నది” అని కూడ అన్నాడు.
మరింత ముందుకు వెళ్ళి అంటాడు – ”స్త్రీలు నేడు నూతన యుగ నిర్మాణంలో పాల్గొనడం జరుగుతుంద నడంలో సందేహం లేదు” అని.
”ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది” అన్న గురజాడ మాట ఇక్కడ గుర్తుకు వస్తూంది. రవీంద్రుడు మాస్కో వెళ్ళినపుడు అక్కడ జరుగుతూ వుండిన అభివృద్ధి పట్ల ముగ్ధుడై ”రష్యాలేఖలు” పేరు తో వ్యాసాలు రాశాడు ముఖ్యంగ అక్కడ అంద రికీ విద్య ఆరోగ్యం, మహిళల అభ్యు దయం ఆయన్ని ఆకట్టుకున్నాయి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
పిచ్హి వాల్లను చెసుకున్న మగ వాల్లు లేరా…………………….