గృహ హింస చట్టం 2005 – ఒక పరిశీలన

-లక్కిరెడ్డి సత్తయ్య, గోడిశాల చంద్రమౌళి, గుగులోతు జాంబు

కొన్ని శతాబ్దాలుగా భారత సమాజంలో స్త్రీలకు, పురుషులకు సమానమైన అంతస్థు, హక్కులు లభించడం లేదు. పురుషులకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్య్రాలు స్త్రీలకు లోపించడమే కాకుండా, స్త్రీలు వారి జీవితంలో గృహ కృత్యాలకు మాత్రమే అంకితమైనది. అంతేకాక భారత స్త్రీలు అనేక అన్యాయాలకు, అరాచకాలకు గురి అయ్యారు. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్లే పారిశ్రామికాభివృద్ధి జరిగి స్త్రీలు, పురుషులతో పాటు సమానంగా ప్రబలడం కొరకు, స్త్రీలకూ సామాజిక న్యాయాన్ని చేకూర్చడం కోసం సరియైన అంతస్థు ప్రసాదించడం కోసం గత 150 సంవత్సరాల నుండి కృషి జరుగుతూనే వుంది. అనాది కాలంనుండి నేటి ఆధునిక కాలం వరకూ అన్యాయాలను, అక్రమాలను అరికట్టి స్త్రీలకు న్యాయం చేకూరేటట్టు శాసనాలను కూడా రూపొందించి, అవి అమలు జరిగేటట్లు కృషి చేస్తూనే ఉన్నారు. సాంఘిక నిర్మితిలో మార్పు తీసుకొని రావాలంటే శాసనాల ద్వారానే సాధ్యమవుతుందని ‘రేనడే’ అభిప్రాయపడ్డారు.

భారతీయ మహిళకు పురుషుడితో సమానమైన అంతస్థు, హోదా కలగజేయడానికి వివాహ వ్యవస్థలో వంశపారంపర్యంగా హక్కులలో, ఆస్థి సంక్రమణలోను స్త్రీల స్థితిగతులను పటిష్టం చేయడానికి సమాజంలో ఆమెపట్ల జరిగే హింస నుండి రక్షణ ఏర్పరచడానికి ప్రభుత్వం ఎన్నో శాసనాలను చేసింది. వాటిలో ముఖ్యమైనవి.

మహిళా ఆర్థిక చట్టాలుః
1.కర్మాగారాల చట్టం-1948
2.కనీస వేతనాల చట్టం 1948
3.సమాన పారితోషిక చట్టం-1976
4.వ్యవసాయ కార్మిక చట్టం -1951
5.వెట్టిచాకిరి నిర్మూలన చట్టం-1976

రక్షణ చట్టాలుః
1. నేర శిక్షాస్మృతి చట్టం -1973
2. భారతీయ శిక్షాస్మృతి క్రింది న్యాయవాది వృత్తి హక్కు -1923
3.గర్భస్థ శిశు నిర్ధారణ నిరోధక చట్టం -1994

సామాజిక చట్టాలుః
1. కుటుంబ న్యాయస్థానాల చట్టం – 1984
2. భారత వారసత్వ చట్టం – 1925,
3. వైద్యంతో గర్భం తొలగింపు చట్టం – 1971
4. అక్రమ తొలగింపు నిరోధక చట్టం -1956
5. ప్రసూతి ప్రయోజన చట్టం -1961
6. వరకట్న నిషేధ చట్టం – 1961
7. మహిళలను అగౌరవ పరచడాన్ని నిరోధించే చట్టం – 1987
8. సతీ సహగమన నిషేద చట్టం -1987
పై చట్టాలన్నింటితో పాటు ఇటీవల కాలంలో కుటుంబ హింస నుండి రక్షణ కల్పించే చట్టం 2005 అమలుకై ఒక పరిశీలన.

గృహహింస చట్టం 2005 – ఆవిర్భావముః
గృహ హింస నుండి మహిళలకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టం అవసరం వుందని మహిళా సంస్థలు ఎప్పటినుంచో పోరాటం కొనసాగిస్తున్నాయి. 1994 లో మహిళా కమీషన్, 1999లో లాయర్సు కలెక్టివ్ ఉమెన్స్‌ రైట్స్ ఇవిషియటివ్ సంస్థలు గృహ హింస నిరోధక చట్టం 2001 ని ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనకు కొన్ని మార్పులు చేసి ప్రభుత్వము 2002 లో గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం – 2001 తయారు చేసింది. కాని ఈ చట్టం ఎవరికి సంతృప్తి కలిగించలేదు. ఎందుకంటే సెక్షన్ -4 ప్రకారం ఆత్మరక్షణ కోసం పురుషుడు హింసకు దిగితే ఆ చట్టం అతడిని శిక్షించడం జరగదు అంటే మహిళలను ఇష్టం వచ్చినట్లు హింసించి ఆత్మరక్షణ కోసమై హింసించానని తప్పించుకొనే అవకాశం పురుషుడికి వుంటుందన్న మాట. ఎవరిని సంతృప్తి పరచలేని ఈ బిల్లును మొక్కుబడిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ నిచ్చేశామని ప్రభుత్వం చేతులు దుల్పుకుంది. గృహ హింస చట్టం – 2001 కి వ్యతిరేకంగా మహిళా సంఘాలు కొత్త బిల్లు కోసం పోరాటం ఆరంభించాయి. యుపిఏ ప్రభుత్వం ఏజెండాలో ఈ బిల్లు కూడా వుండటంతో 2006 ఆగస్టున పార్లమెంట్ ఆమోదంతో సెప్టెంబరు 13 న రాష్ట్రపతి రాజముద్ర ఆమోదం పొందిన గృహ హింస చట్టం – 2005 భారతీయ మహిళా ఉద్యమ చరిత్రలో మైలురాయి. స్వేచ్ఛ కోసం గౌరవ ప్రదమైన మనుగడ కోసం, పీడనం నుండి విముక్తి కోసం, దీర్ఘకాలంగా తపిస్తున్న భారతీయ స్త్రీకి ఎంతో కొంత ఊరట, ఉపశమనం లభిస్తున్న గృహ హింస చట్టం – 2005 దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కుటుంబ విలువల మాటున తిరుగులేని పెత్తనం చెలాయించడానికి పురుష అహంకారులకు ఇకపై కుదరదు. గృహ హింస బాధితులు ఫిర్యాదు చేయడానికి, కోర్టులను ఆశ్రయించడానికి, రక్షణను పొందడానికి అమలైన కొన్ని వ్యవస్థలు నేటినుంచి అందుబాటులో వుంటాయి. ఫిర్యాదు చేసిన తరువాత కూడా రక్షణలను అతిక్రమించిన సందర్భాలలో నిందితులకు ఏడాది జైలు శిక్ష, రూ|| 20,000/- జరిమానా విధిస్తారు. చట్టబద్దముగా హక్కుదారులైనా కాకపోయినా నివసిస్తున్న ఇంటినుండి బాధిత స్త్రీలను వెళ్ళగొట్టడం కుదరదు. ఈ చట్టం అందించే రక్షణ కేవలం భార్యలకు మాత్రమే కాదు. వివాహ బంధం లేకుండా కలిసి జీవిస్తున్న మహిళ, తల్లి, సోదరి వితంతువుగా కుటుంబంతో వుంటున్న మహిళ, కూతురు, దత్తత సంతానం, ఉమ్మడి కుటుంబంలో ఏదో ఒక వరస బంధువులందరు గృహ హింస చట్టం -2005 నుండి రక్షణ పొందుతారు. కొత్త చట్టం ప్రకారం గృహ హింస అంటే కేవలం భౌతికంగా హింసించడం మాత్రమే కాదు. మహిళలపై మాటల ద్వారా కాని, భౌతికంగా గాని, లైంగికంగా గాని, మౌఖికంగా గాని, మానసికంగా గాని, ఆర్థిక పరంగా గాని, మహిళలు వేధించిన, అలా బెదిరించినా గృహ హింసలో భాగమే అవుతుంది. ఈ రకంగా ఈ చట్టం మహిళలపై జరిగే వేధింపులు, హింసలకు సంబంధించిన పరిధిని, నిర్వచనాలను ఘననీయంగా విస్తృత పరిచింది. దీని వెనుక జాతీయ మహిళా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు నిర్వహించిన కృషి ఎంతో గొప్పది. భారతదేశంలో వివాహిత స్త్రీలలో మూడింట రెండువంతుల మంది కుటుంబ హింస బాధితులేనని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తెలియజేస్తుంది.

గృహ హింస నిరోధం – బాధ్యతః
గృహ హింస నిరోధ చట్టం అమలు బాధ్యతను ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖకు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా జి.ఓ.నెం.22 ను విడుదల చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్లను రక్షణ అధికారులుగా నియమించింది. రక్షణ అధికారులతో పాటు తను సర్వీసు అందించేందుకు జిల్లాల వారిగా పలు స్వచ్ఛంద సంస్థలను గుర్తిస్తారు. మహిళలు గృహ హింసకు గురైనట్లయితే పోలీసులను సంప్రదించవల్సిన అవసరం లేదు. గృహ హింసకు గురైన మహిళలు తమకు దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళి ఫిర్యాదు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు ఆయా మహిళ ఫిర్యాదులను రక్షణ అధికారులకు (ప్రాజెక్టు డైరెక్టర్లు) సమర్పిస్తారు.మహిళలు ఫిర్యాదు చేసిన అంశాలపై రక్షణ అధికారులు విచారణ చేసి తుది నివేదికను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పిస్తారు. మేజిస్ట్రేట్ ఆ నివేదికలను పరిశీలించి, ఇచ్చిన తీర్పు ప్రకారం పోలీసులు గృహ హింసకు పాల్పడిన సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

యునిసెఫ్ 199 రిపోర్టు ప్రకారం వివిధ దేశాలలో గృహ హింసకు లోనవుతున్న వివరాలుః
15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న వివాహిత మహిళలలో నూటికి 70 మంది భౌతిక హింసతో లైంగిక దౌర్జన్యాలకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రతి ఐదుగురు మహిళలలో ఒకరు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారి అత్యాచారానికో, బలాత్కారానికో గురవుతున్నారని ప్రతి ముగ్గురిలో ఒక్కరు, భౌతిక హింసకు లోనవుతున్నారని అన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులలో, దగ్గరి బంధువులలో నేరస్తులుగా ఉన్నారని ఆ నివేదిక చెబుతున్నది. నాలుగు గోడల మధ్య స్త్రీని హింసపెట్టడం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు.

కెనడాః 16 ఏళ్ళ వయస్సు నుండి 23 శాతం మహిళలు హింసకు గురవుతున్నారు.

జపాన్: 59 శాతం మంది భర్త అత్యాచారాలను అనుభవిస్తున్నారు.

న్యూజిలాండ్: 20 శాతం మంది ఏదో సమయంలో గృహ హింస అనుభవించినవారే.

ఇంగ్లాండ్: ఏదో సమయంలో భర్త భౌతిక హింసకు 25 శాతం గురి అవుతున్నారు.

అమెరికాః 28 శాతం భౌతిక హింసకు గురి అవుతున్నారు.

భారతదేశం: ఏదో ఒక సమయంలో భార్యను భౌతికంగా హింసించినట్లు 45 శాతం పైగా భర్తలు ఒప్పుకున్నారు.

ఈస్టోనియాః పెరిగే వయస్సుతో పాటు తమపై హింస పెరుగుతుందని మహిళల అభిప్రాయం. 65 ఏళ్ళ పైనున్న వారిలో 52 శాతం మంది ఇంకా హింసను అనుభవిస్తు న్నారు.

ఈ గృహ హింసల కారణంగా ఆమెరికాలో ఏటా 1230 కోట్ల డాలర్ల ఉత్పాదకత దెబ్బతింటున్నది. ఆస్ట్రేలియాలో ఆ నష్టం 630 కోట్ల డాలర్లదాకా ఉన్నది. భారతదేశం లాంటి మూడవ ప్రపంచ దేశాలలో ఈ అణచివేత పీడన మరింత హెచ్చుస్థాయిలో, తీవ్ర రూపాలలో వుంటున్నాయి. ఆర్థికంగా స్వావలంబకులైన స్త్రీలకు కూడా వేరే స్థాయిలో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్న స్వీయ ఆర్జన, ఆస్తి లేని స్త్రీల విషయంలో వివిధ రూపాలలో హింస అధికంగా కనిపిస్తున్నది. కేరళలో ఆస్థిపరులైన స్త్రీలలో కేవలం 7 శాతం, ఆస్తులు లేని వారిలో 49 శాతం కుటుంబ హింస కనిపిస్తుంది. పిల్లలను నిర్లక్ష్యం చెయ్యడం, చెప్పకుండా బయటకు పోవడం, భర్త లేదా జీవిత భాగస్వామితో వాదనకు దిగడం, సెక్స్‌లో పాల్గొనడానికి నిరాకరించడం, వంట సరిగా లేదా సకాలంలో వండకపోవడం, వేరే మగవాళ్ళతో మాట్లాడడం ఈ కారణంతోనే తాము ఆడవాళ్ళను కొడతామని భారతదేశంతో సహ పది దేశాలలోని పురుషులు చెప్పిన అభిప్రాయాలను ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రస్తావించింది. ఇలాంటి బాధలను అనుభవిస్తున్న స్త్రీలకోసం మరియు జనాభాలో సగం స్త్రీలే కాబట్టి దేశంలో ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతారో అక్కడ సుఖ సంతోషాలు వుంటాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గృహ హింస చట్టం -2005 అమలులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం వలన కుటుంబంలో అణగారిపోయే మహిళల వేదన అరణ్య రోదన కాకుండా కొంత చట్టం కొన్ని కిటికీలు తెరిచింది తప్ప అది మొత్తంగా గృహాలలో పరిస్థితి మారలేదు. సమాజంలో మహిళల కున్న సమస్యలన్ని ఒక చట్టంతోనే పరిష్కరించడం సాధ్యం కానిపని అని భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏనాడో స్పష్టీకరించినా పట్టించుకున్న నాథుడే లేడు. సమస్య మూలాలలోకి వెళ్ళని అసంబద్ధమైన వైఖరి వల్లనే వెట్టిచాకిరి రద్దు, బాలకార్మికుల నిషేదం, బాల్య వివాహాల నిరోధకచట్టం లాంటి ఎన్నో అక్కరకు రానివిగా భ్రష్టుపడు తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమం కోసం తెచ్చిన ప్రత్యేక శాసనాలది అవే వ్యథ. వరకట్నాన్ని నిషేధిస్తూ 1961 లోని కేంద్రం చట్టం చేసినా నేటికి వరకట్న పిశాచం అవిచ్ఛిన్నంగానే కొనసాగుతున్నది. దశాబ్దం క్రితం లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం తెచ్చాక తగ్గుముఖం పట్టాల్సిన భ్రూణ హత్యలు ఇంతలంతలయ్యాయి. గృహ హింసను నిరోధించేందుకు మరొకటి చట్టాలు చేయడమే స్త్రీ జనోద్ధరణగా నేతలు, భుజకీర్తులు తరుముకుంటున్నారు.

శాసనాలు తీర్మాణాలతోనే స్త్రీల స్థితిగతులు బాగుపడిపోవు. విద్య, ఆర్థిక రంగాలలో, అభ్యున్నతి సాధించి భిన్న వర్గాల, వనితల సర్వశక్తి సంపన్నులయ్యేలా చేసే బహుముఖ వ్యూహం నేడు అవసరం. అమ్మాయిలకు చదివే ప్రగతి సాధనం అయ్యేలా ప్రణాళికలను పరిపుష్టికరించడం కీలకం. ఇలాంటి చట్టాలు కాదు. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు సమానత్వానికి సంబంధించిన విలువలను, ఆదర్శాలను విస్తృతంగా ప్రచారం చేయడం అవసరం. ముఖ్యంగా సినిమాలు, టెలివిజన్ వంటి ప్రభావశీల, వినోద సాధనాలు మహిళలపై సమాజానికి తప్పుడు అవగాహన కలిగించడానికి ప్రయత్నించకుండా ఉదాత్తంగా వ్యవహరించాలి. ఆధునిక వినియోగ సంస్కృతి వరకట్న దురాచారాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, అవధులు లేని లాభాపేక్ష మనుషులలో సున్నితత్వాన్ని అపహరిస్తుంది. స్త్రీలను వస్తువుగా పరిగణించే సంస్కృతి అభివృద్దిగా పరిగణ పొందుతున్నది. ఇవన్నీ ఒకవైపు స్త్రీలపై హింస అవకాశాలను పెంచుతున్నప్పుడు చట్టాన్ని అమలుచేసే వారికి మాత్రం చిత్తశుద్ధి నూరుపాళ్ళు వుంటుందని ఆశించలేము.

చదువుకోవడం దగ్గరనుండి ఉద్యోగాల్లో, ఉద్యమాల్లో, పదవులలో స్థానం పొందడం దాకా స్త్రీలు తమ పుట్టింటితో, అత్తవారింటితో పోరాడవలసి రావడం నేటి వాస్తవం. ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతున్న మహిళ కూడా నాలుగు గోడల మధ్య అనాధే అవుతుంది. ఈ పరిస్థితి పోగొట్టడానికి ఈ చట్టం ఉపకరణం. క్రియాశీల మహిళా ఉద్యమాలు ఈ విజయం సాధించడానికి మూడు దశాబ్దాల కాలం పట్టింది. పెరుగుతున్న స్త్రీ విద్య, సాధికారత స్పృహల ఫలితం ఇది. ఈ గెలుపును సార్ధకం చేసుకుంటూ ఇటువంటి మరిన్ని విజయాలు సాధించే దిశగా మహిళాలోకం చైతన్యం వైపు పురోగమించాలి.

గృహహింస రక్షణ చట్టం:
వాడుకోవడమెలా…. కాపాడుకోవడమెలా…
“నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఇల్లు గడవడానికి డబ్బులివ్వడు. అతన్ని జైల్లో పెట్టినంత మాత్రాన నా ఇల్లు గడవదు కదా అని కోర్టుకెళ్ళడానికి వెనకాడుతున్నా”.

“నా వయస్సు 75 సంవత్సరాలు. నా పేరునున్న పొలం రాసిచ్చేవరకు నా కొడుకు ఊరుకోలా. తీరా రాసిచ్చినాక ఇప్పుడు నా తిండికి, మందులకయ్యే ఖర్చు భరించడానికి కూడా ఏడిపించుకు తింటున్నాడు. ఈ వయస్సులో ఇవర్ని దేహీ అని అడగను?”

“నేను నాల్గవ తరగతి చదువుతున్నా. మా నాన్న రాత్రిపూట తప్పతాగి వచ్చి నన్ను, మా తమ్ముణ్ణి, మా అమ్మని చితకబాదుతూ వుంటాడు. కమిలిన దెబ్బలతో బడికెళ్ళాలంటే సిగ్గేస్తుంది…”

ఆలకించాలే గాని ఇట్లా వింటూ పోతే కట్టలు తెంచుకుని ప్రవాహంలా విరుచుకుపడతాయి సమస్యలు మనపైన. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలుంటాయో లేదో తెలీదుగాని అందుకు జరగాల్సిన ప్రయత్నం మటుకూ ఎప్పుడూ జరుగుతూనే వుంది. అటువంటి ప్రయత్నాలు బాధితులు, మహిళా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు చేయబట్టే “మహిళా గృహ హింస రక్షణ చట్టం, 2005”. ఈ ఏడాది అక్టోబరు 26న అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని అమలుపరిచే విధానంలోనూ, అది కల్పించే ఉపశమనాలలోనూ కొత్తదనం చాలా వుంది. దీనిని సరిగ్గా అర్థం చేసుకొని వినియోగించుకుంటే గృహహింసకు గురయ్యే స్త్రీలకు బాగా మేలు చేయగలదు.

గృహ హింసను నేరంగా పరిగణించి, ఆ నేరానికి పాల్పడే వారిని శిక్షించే చట్టం ప్రస్తుతం అమలులో వుంది. అది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఎ. అయితే ఆ చట్టం బాధపెట్టిన వాడిని శిక్షిస్తుందే తప్ప బాధితురాలికి ఉపశమనం ఇవ్వదు. నివారణకూ ఉపయోగపడదు. నేరం జరిగిపోయిన తరువాత శిక్షించడానికే తప్ప నేరం జరగకుండా నివారించడానికి ఉపయోగపడదు. ఆ లోటును గుర్తించి, మరింత విస్తృత ప్రాతిపదికన గృహహింస నుండి రక్షణ కల్పించే చట్టం కావాలని మహిళా ఉద్యమం చేసిన డిమాండు ఈ చట్టానికి దారితీసింది.

ఈ చట్టంలో ‘బాధితులు’ అంటే ఎవరు?
ఈ చట్టం కేవలం వేధింపులకు గురయ్యే భార్యలకే కాదు ఒక కుటుంబంలోని స్త్రీలందరికీ వర్తిస్తుంది. అంటే అక్కా, చెల్లి, తల్లి, రక్తసంబంధం, వివాహం, దత్తత మొదలైన బాంధవ్యాల వల్ల ఒక కుటుంబంలో సభ్యులైన స్త్రీలందరికీ వర్తిస్తుంది.

గృహహింస అని దేన్ని అంటారు?
సెక్షన్ 498 – ఎ వరకట్నం వేధింపును, ఆత్మహత్యకు దారితీయగల శారీరక, మానసిక వేధింపును నేరంగా గుర్తించింది. అయితే కొత్త చట్టంలో గృహహింసకు మరింత విశాలమైన అర్థం కల్పించారు. శరీరానికైనా, మనసుకైనా, ఆరోగ్యానికైనా, సంక్షేమానికైనా హాని కలిగించే భౌతిక, మానసిక, లైంగిక, ఆర్థిక చర్యగానీ, నోటి మాటకేగానీ గృహ హింస కిందికీ వస్తుంది. బాధితురాలినే కాక ఆమెకు సంబంధించిన వారెవ్వరినైనా ఇటువంటి హింసాత్మక చర్య ద్వారా బెదిరించడం కూడా గృహహింస కిందికి వస్తుంది. ఈ హింసాత్మక చర్యల జాబితాలో ‘ఆర్థిక చర్య’ అనే దానిని చేర్చడం విశేషం. ఆమె హక్కయిన ఆర్థిక వనరులను ఆమెకు దూరం చేయడం, ఆమె మనుగడకు అవసరమైన ఆర్థిక వనరులు ఆమెకు లేకుండా చేయడం, ఆమెకు వాడుకునే హక్కు ఉన్న స్థిరాస్తినైనా, చరాస్తినైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మివేయడం, లేదా అటువంటి కుటుంబ వనరులను ఆమెకు దూరం చేయడం కూడా గృహహింసకు పాల్పడడం కిందికే వస్తుంది.

ఈ చట్టాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి?
ఇందుకు బాధితురాలు కోర్టులో కేసు వేయనక్కర లేదు. ఆమె చేయవలసిందల్లా ఏమిటంటే తాను ఎదుర్కొంటున్న సమస్యలను రాతపూర్వకంగా, ఫిర్యాదు రూపంలో ఇవ్వడమే. బాధితురాలే ఫిర్యాదు ఇవ్వాలని లేదు. ఆమె తరఫున ఆమె బంధువులు, పక్కింటివారు, సామాజిక కార్యకర్తలు ఎవరైనా ఇవ్వొచ్చు.

ఫిర్యాదు ఎవరికి సమర్పించాలి?
ఈ చట్టాన్ని అమలుపర్చడానికి భద్రతాధికార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. తమ సమస్యలను వారికి నివేదిక రూపంలో సమర్పించాలి. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత భద్రతాధికార్లు ఆ ఫిర్యాదుపైన గృహహింస నివేదిక (డిఐఆర్) నొకదాన్ని తయారుచేస్తారు. మామూలు కేసుల్లో ఎఫ్ఐఆర్‌లాగా. బాధితురాలు కోరుకుంటున్న ఉపశమనమేమిటి అనేది కూడా రాసుకుంటారు. వీటన్నిటినీ భద్రతాధికారి ఒకటవ తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పెడతారు. అంటే బాధితురాలు నేరుగా కోర్టుని ఆశ్రయించే అవసరం లేకుండా ఆమెకు భద్రతాధికారి అండదండలు వుంటాయి. ఒకే అధికారిపై ఇంతటి అపార నమ్మకం పెట్టుకుంటే ఆ అధికారి సాయం చేయకుండా అడ్డం తిరిగితే పరిస్థితి ఏమిటి? అనే సందేహం వస్తుందేమో. బాధితురాలి నివేదికను ఖాతరు చేయని భద్రతాధికారికి ఏడాది జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధించవచ్చు. వేధింపులకు గురయ్యే స్త్రీలకు పోలీసుల రక్షణ అవసరం కావచ్చు. లేక ఇతరత్రా సహాయ సహకారాలు అవసరం కావచ్చు. అందుకోసమే భద్రతాధికారి గృహహింస నివేదిక కాపీలను పోలీసులకు, సర్వీసు ప్రొవైడర్స్ కు కూడా పంపాలి. సర్వీసు ప్రొవైడర్స్ అంటే స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకర్తలు.

మన రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను భద్రతాధికారులుగా నియమించారు. తమకు ఇతర బాధ్యతలు వుండడం వల్ల ఈ అభ్యర్థనల్ని పట్టించుకోలేమని వారు తప్పించుకోడానికి వీలు లేదనీ, తప్పకుండా స్వీకరించి తీరవలసిందేననీ చట్టం చెప్పినా ఈ నియామకం చట్టం లక్ష్యాన్ని సాధించడానికి సరిపోదు. కనీసం మండల స్థాయిలో పూర్తికాలం భద్రతాధికారులను నియమించడం అవసరం. వాళ్ళకు పనిలేకుండా పోతుందేమోనన్న ఆందోళన అవసరం లేదు. ఈ చట్టాన్ని స్త్రీలు అర్థం చేసుకొని ఉపయోగించడం నేర్చుకోవాలే గానీ భద్రతాధికారులకు పనికి కొదువ వుండదు.

కోర్టులో విచారణ ఎలా జరుగుతుంది?
బాధితురాలు నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసినా, ఆమె తరఫున వేరే ఎవరైనా చేసినా లేదా ఆమె దగ్గర ఫిర్యాదు స్వీకరించిన భద్రతాధికారి దానిని ఆధారం చేసుకొని కోర్టులో ఫిర్యాదు చేసినా, కోర్టు దానిపైన విచారణ చేపడుతుంది. కౌన్సిలింగ్‌ అవసరమనుకుంటే కౌన్సిలింగ్‌ చేపడుతుంది. లేదా ప్రతివాదికి నోటీసు జారీచేసి విచారణ చేపడుతుంది.

ఉపశమనాలేమిటి?
ఈ చట్టం కింద రకరకాల సమస్యలకు తగిన పరిష్కారాలను కల్పించే ప్రయత్నం జరిగింది. ఇది ఈ చట్టంలోని అత్యంత ఉపయోగకరమైన అంశం. బాధితురాలిపై ప్రతివాది హింసకు పాల్పడకుండా నిషేధిస్తూ భద్రతా ఆదేశాలు (ప్రొటెక్షన్ ఆర్డర్) జారీ చేయడానికి మేజిస్ట్రేటుకు అధికారాలు ఉన్నాయి. ఇంట్లోనే కాదు బైట కూడా ఆమెను వేధించకుండా ప్రతివాది కదలికలపై ఆంక్షలు విధించవచ్చు. నోటితోనే కాదు రాత పూర్వకంగా గాని, ఫోన్ చేసిగాని ఆమెను వేధించకూడదని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చు. ఉమ్మడి ఆస్తులను అమ్మడానికి వీలులేకుండా ఉత్తర్వులు పొందవచ్చు. ఉమ్మడిగా ఉన్న బ్యాంక్ ఖాతాలు, లాకర్ల వినియోగాన్ని కూడా అరికట్టవచ్చు. బాధితురాలికి అండగా నిలిచిన వారిపై అతను ఎటువంటి దాడికి పూనుకోకూడదు. ఆ రకంగా భద్రతా ఆదేశాలు పొందవచ్చు.

ఇవికాకుండా తాను వుంటున్న ఇంట్లో బాధితురాలికి నివాసహక్కు వుందని కూడా ఈ చట్టం చెబుతుంది. చెప్పడమే కాక ఆ నివాసహక్కు అనుభవించడానికి అవసరమైన ఆదేశాలు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం ఇచ్చింది. ఆ ఇంటిపై యాజమాన్య హక్కు లేకపోయినా సరే ఆమెను ఆ ఇంట్లో నుంచి గెంటెయ్యడానికి ఎవరికీ అధికారం లేదు. ఇంట్లో నుంచి తరిమేయబడ్డ ఆడవాళ్ళకు తల దాచుకోవడం ఒక పెద్ద సమస్య. ఒక్కోసారి కన్న తల్లిదండ్రులే ముఖం చాటేస్తుంటారు. అటువంటి ఆడవారికి భద్రతాధికార్లు షెల్టర్ హోమ్స్‌లో ఆశ్రయం కల్పించాలి. మేజిస్ట్రేట్ కూడా ఈ విషయంలో అవసరానికి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆమె కావాలంటే తమ కుటుంబముంటున్న ఇంట్లోనే వుండొచ్చు. ఆ ఇంట్లోనే ఒక వాటాను ఆమెకు కేటాయించవచ్చు. వేరే ఇంట్లో వుంచడం మంచిదైతే అద్దె తదితర ఖర్చులు ప్రతివాది భరించాలి. ఈ విధమైన ఆదేశాలు జారీ చేసే అధికారం మేజిస్ట్రేట్‌కి వుంది. ప్రతివాది వేధింపుల వల్ల బాధితురాలు ఆర్థికంగా నష్టపోతే దాన్ని పూరించాల్సిన బాధ్యత ప్రతివాదిదే. ఈ వేధింపులవల్ల ఆమె ఆరోగ్యం చెడితే వైద్యానికయ్యే ఖర్చు ప్రతివాది భరించాలి. ఆమె ఆస్తిపాస్తుల్ని ధ్వంసం చేస్తే అందుకైన నష్టాన్ని ప్రతివాదే భరించాలి. బాధితురాలు ఈ చట్టం ద్వారా కూడా మనోవర్తి పొందవచ్చు. మనోవర్తి ఇంతివ్వాలి, అంతివ్వాలని పరిమితులేమీ ఈ చట్టంలో లేవు. ఈ ఉపశమనాలతో పాటు మేజిస్ట్రేట్ అవసరమైతే ప్రతివాదిని నష్టపరిహారం చెల్లించమని చెప్పొచ్చు. వేధింపులవల్ల మానసిక చిత్రవధకు, ఒత్తిళ్ళకు గురైనందుకు ఆమెకు అతను నష్టపరిహారం ఇవ్వాల్సి వుంటుంది. బాధితురాలే ఆదేశాలు వెనక్కి తీసుకోమని అడిగేవరకు కోర్టు ఆదేశాలు అమల్లో వుంటాయి. పరిస్థితుల్లో మార్పులను బట్టి కోర్టు తన ఆదేశాలను సవరిస్తూ వుంటుంది.

ప్రతివాదికి శిక్ష ఎప్పుడు?
ఈ చట్టం కింద ఉపశమనాలన్నీ సివిల్ స్వభావం గలవి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రతివాదికి ఏడాది జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధిస్తారు. ఒక హక్కుకి శాసన రూపం కల్పించడమే ఒక భగీరథ ప్రయత్నం. దాన్ని స్త్రీలు సాధించారు. పోలీసుల, న్యాయవాదుల తలుపులు తట్టేబదులు ఇప్పుడు స్త్రీలు భద్రతాధికార్ల తలుపులు తట్టాలి. గట్టిగా తట్టాలి! న్యాయం జరగాలంటే అందరికీ వినబడేంత గట్టిగా తట్టాలి!

మనమేం చేయాలి?
సామాజికంగా అణగారిన వర్గాలకు హక్కులు కల్పించే చట్టాలు మన పాలకులు అప్పుడప్పుడు చేస్తుంటారు. అయితే ఆ వర్గాల ప్రతినిధులకు వాటి రూపకల్పనలో స్థానం ఉన్నప్పుడు తప్ప అవి సమగ్రంగా వుండవు. గృహహింస చట్టాన్ని రూపొందించిన క్రమంలో మహిళా ఉద్యమకారులు చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి ఈ చట్టం బాగుంది. అయితే సామాజిక వ్యవస్థ పోకడకు వ్యతిరేక దిశలో ఉన్న చట్టాలు వాటంతటవి అమలు కావు. పూనుకొని అమలు చేయించుకుంటేనే అమలవుతాయి. మహిళా సంఘాలు, ప్రజాతంత్ర ఉద్యమ శక్తులు ఆ కర్తవ్యాన్ని మీద వేసుకుంటాయని ఆశిద్దాం. లేకపోతే ఇది కరడు గట్టిన న్యాయవ్యవస్థ యథాస్థితివాద సంస్కృతికి బలయ్యే ప్రమాదం వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to గృహ హింస చట్టం 2005 – ఒక పరిశీలన

  1. srikanth says:

    70% స్త్రీలు భారత దేశములో గృహహింసను అనుభవిస్తున్నారండమ పచ్చి అబద్దము:

    RADAR అనే సంస్థ UN population fund (UNDP) సైట్ ను పూర్థిగ పరిశోదించింది. అందులో ఏమీ లేదు. దాని తరువాత google లొ వెదికి చూసింది . అందులో కూడ తమకు కావలసిన సమాచారం లభించలేదు. ఇక ఇలా ఐతే లాభం లేదనుకుని, సరాసరి UNDP సమాచార కార్యాలయాన్న్ని వివరన్ కోరింది. ఫలితం ఏమిటో తెలుసా.. ఈ 70% అనేది ఎక్కడనుండి వచ్చిందో దానికి సంభందించిన ఆధారాలు ( పరిషోధించి రాసినవి) మచ్చుకైనా కనిపిచలేదు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఈ 70% స్త్రీలు హింసకు గురవుతున్నరనేది కేవలం “అసత్య వాదుల ప్రచారమని అని.

    చివరగా UN తమ తప్పు తెలుసుకుని లెంపలు వేసుకుని ఆ వింత గణాంకాలని బుద్దిగా వెనక్కి తీసుకుంది.

    కానీ మన మంత్రివర్యులు , ప్రసిద్దిచెందిన NCW వారు ఈ కాకిలెక్కలను బూచిగా చూపించి DV act వంటి draconian laws సమర్ధిన్స్తున్నారు. ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకుంటారా..? లేదు. కాల గర్భంలోకాలిసిపోయిన మనువాదానికి కాస్త అటూ ఇటూ గా వున్న ఈ చట్టాన్ని మగవారి మీద రుద్ది, వారి హక్కుల్ని ( నిష్ప్కక్ష పాతంగా న్యాయాన్ని పొందడం) కూడా హరించి వేశారు.

    http://washingtontimes.com/corrections/20061128-102228-2806r.htm

    కనీసం భూమిక పత్రిక ఐనా.. ఈ అబద్దాన్ని ప్రచారం చేయకుండా అపుతుందా… వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.