శివుని రాజేశ్వరి
21వ శతాబ్దంలోకి అడుగిడి ఒక దశాబ్దకాలం (2000-2010) గడిచింది.
ఈ పదేళ్ళ కాలంలో ఆధుని కత అన్ని అంశాల్లోకి ప్రవేశించింది. జీవితంలో, సాహిత్యంలో, భావజాలంలో ఆధునికత ముప్పేటలా పెనవేసుకు పోయింది. స్త్రీవాద భావజాలం, స్త్రీపురుషుల జీవితాన్ని తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. తమకు మాత్రమే ప్రత్యేకించిన సమస్యల స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యక్తీకరించడానికి, తమదైన పంథాలో విముక్తి సాధించడానికి, తగిన అవగాహనను అందించడం స్త్రీవాద దృక్పథం చేసిన పని. ఈ నేపథ్యంలో వచ్చిన కథల్లో రెండు అంశాలు ప్రధానంగా చర్చించ బడతాయి.
స్త్రీవాదం వెలుగులో వచ్చిన కథలకూ, అంతకుముందు వచ్చిన కథలకూ, మౌలికంగా ఉన్న తేడాలను చెప్పడం మొదటిది.
ఈ స్త్రీవాద కథల్లో ప్రధానమైన అంశాలను తెలపడం రెండవది.
స్త్రీవాదం సాహిత్యంలోకి ప్రవేశించకముందు స్త్రీల చైతన్యానికి దోహదం చేసే కథలు ఎన్నో వచ్చాయి. గురజాడ, చలం, కొడవటిగంటి, శ్రీపాద, ఆచంట శారదాదేవి, రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, చాగంటి తులసి, ఆర్.వసుంధరాదేవి, డి.కామేశ్వరి వంటి రచయితలు ఎన్నో కథలు రచించారు. అప్పటి వరకు స్త్రీల జీవితంలో ఉన్న భిన్నకోణాల్ని ఇతివృత్తంగా తీసుకుని కథలు రాశారు. అయితే అందరి దృష్టికోణం ఒక్కటి కాదు. తమదైన అనుభవ దృష్టికోణం నుంచి వీరు కథలు రాశారు. మాతృత్వం, వివాహం, విడాకులు వంటి అంశాలను చిత్రించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న తీరును చూపించారు. వైవాహిక జీవితంలోను, సమాజంలోను, ఆడవాళ్ల అణచివేతకు గల మూలాల్ని ఒక్కొక్కరు ఒక్కో తీరున అర్థం చేసుకుని, తమ కథల్లో ఆవిష్కరించారు. మూలాల చిత్రీకరణ పరిష్కారాల విషయాలలో అంతరాలు వీరి రచనల్లో కనిపిస్తాయి. ఇది ఆయా రచయితల అవగాహనా పరిమితుల ఫలితం. అయినా అప్పటివరకు ఎవరూ స్పృశించని జీవిత కోణాన్ని తమ కథల్లో చిత్రించినందుకు వాటికి కథాసాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీవాద దృక్పథ నేపథ్యంలో స్త్రీవాద కథలు 1990 నుంచి విస్తృతంగా రాసాగాయి. ఒక దృక్పథంగా స్త్రీవాదం విస్తరించకముందే అందుకు సంబంధించిన నేపథ్యాన్ని, ఆలోచనల్ని, భూమికను – అందించడంలో ఈ కథలు ప్రధాన పాత్రను పోషించాయి.
స్త్రీవాద దృక్పథంలో వచ్చిన కథల్లో కొన్ని ప్రధానాంశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలపై ధిక్కారం స్త్రీవాద కథల్లో కనిపించే ప్రధానాంశం. ఇక్కడే ఈ వాదానికి ముందు వచ్చిన కథలకీ, తర్వాతి కథలకూ అంతరం ఉంది. ఈ రెండు వ్యవస్థల ‘ప్రజాస్వామికీకరణ’ జరగాలన్న అవగాహన అంతకు ముందు వచ్చిన కథల్లో వ్యక్తమయ్యేది. ఈ రెండు వ్యవస్థల్లో సర్దుబాటుతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవడం అవసరమన్న అవగాహనను రచయితలు అందించేవారు. ఈ అవగాహనకు ఉన్న పరిమితిని కొందరు స్త్రీవాద కథకులు తేల్చి చెప్పారు. ఈ రెండు వ్యవస్థలకు అవతల సొంతంగా జీవితాన్ని నిర్మించుకునే స్త్రీల పాత్రలు కొందరు స్త్రీవాదుల కథల్లో కనిపిస్తాయి. కుప్పిలి పద్మ – ‘నిర్ణయం’, ‘ది ఇన్‌స్టెంట్ లైఫ్’; ఓల్గా – ‘ప్రయోగం’; కొండేపూడి నిర్మల – ‘ఎద్దుపుండు’ ‘ఉష్ట్రపక్షి’, ఇంకా మరికొందరు రాసిన కథల్లో కూడా ఈ అంశాలు కనిపిస్తాయి. వివాహ వ్యవస్థలోని అసమానతల్ని ప్రశ్నిస్తాయి. ఈ వ్యవస్థ మనుగడపై ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. స్త్రీల రక్షణకు పెళ్లి మంచిదనే వాదనల్ని ధిక్కరిస్తాయి. పెళ్లిలో ఊపిరాడనివ్వనితనాన్ని గుర్తింపజేస్తాయి.
స్త్రీపురుష సంబంధాల్లో కొత్తకోణాన్ని ఆవిష్కరించాయి. స్త్రీవాద కథలు, వైవాహిక జీవితంలో నిస్సారంగా కొట్టుకుంటున్న స్త్రీపురుష సంబంధాల్ని చాలామంది స్త్రీవాదులు చిత్రించారు. స్త్రీపురుషుల కలయికకు ప్రేమనే ప్రాతిపదిక కావాలి. మనసారా ఒకరినొకరు ఇష్టపడటమే ప్రధానం. ప్రేమానురాగాలకు ఏమాత్రం తావులేని పెళ్ళిలో ఉండి, ఇష్టం లేకున్నా మగవాడికి శరీరం అప్పగించడం కన్నా, పెళ్లి చేసుకోకుండా తమకు నచ్చిన వ్యక్తితో నచ్చినంతకాలం జీవిస్తే తప్పేమిటన్న ఆలోచనల్ని స్త్రీవాద కథలు కలిగించాయి. సమాజం చెపుతున్న శీలం, నీతి, మగవాళ్ళకు కూడా వర్తించాలి. వాళ్ళమీద లేని ఆంక్షలు నిర్బంధాలు కేవలం స్త్రీల మీదనే ఎందుకని తమ కథల్లో స్త్రీవాదులు ప్రశ్నించారు. తమను తాము తెలుసుకోవడానికి, విముక్తి కలిగించుకోవడానికి, తమ జీవితాన్ని, ఆత్మవిశ్వాసంతో నిర్మించుకోవడానికి, ఆడవాళ్ళకు స్ఫూర్తిని ఇచ్చాయి. ఈ క్రమంలోనే స్త్రీపురుషుల ‘సహజీవనమే’ పెళ్లికంటే ఉన్నతమైనదన్న అవగాహనను అందించే ఓల్గా ‘ప్రయోగం’ కథ వచ్చింది.
మాతృత్వపు మాయాభావజాలాన్ని ఛేదించాయి స్త్రీవాద కథలు. మాతృత్వం ఒక వరమని, అందులోని తియ్యదనాన్ని బోధించే భావజాలంలోని గుట్టును రట్టు చేశాయి స్త్రీవాద కథలు. మాతృత్వంలో స్త్రీ పొందే శారీరక బాధను, మానసిక సంపూర్ణతను స్పష్టం చేసే కథలు వచ్చాయి. నిజానికి గర్భం దాల్చాలో, లేదో, ఎపుడు పిల్లల్ని కనాలో, కనకూడదో నిర్ణయించే అధికారం మగవాళ్లకు ఎక్కడిదని స్త్రీవాదం ప్రశ్నించింది. కుప్పిలి పద్మ ‘నిర్ణయం’ కథ ఇందుకు ఉదాహరణ.
ఒంటరి స్త్రీల జీవితాల చిత్రణ. ఇది స్త్రీవాద కథల్లో బలంగా కనిపించే అంశం. సౌదా రాసిన ‘వేచిచూడు’ కథ ఇందుకు ఉదాహరణ.
స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సూక్తిలోని మూలాన్ని అత్తాకోడళ్ళు, వదినమరదళ్ళ మధ్య ఉన్న వైరుధ్య సంబంధాల్లోని మూలాలను ఈ కథల్లో చిత్రించడం జరిగింది. ఓల్గా రాసిన గోడలు, శత్రువులెవరు, అన్న కథలు ఉదాహరణ.
ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే స్థోమత ఉన్నంత మాత్రాన స్త్రీలు మగవారి పెత్తనం నుంచి విముక్తి లభించినట్లు కాదని చెప్పాయి స్త్రీవాద కథలు. ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా భర్త పెత్తనం చేసే ధోరణిని చిత్రించాయి. ఓల్గా – ‘అమూల్యం’, కె.రామలక్ష్మి ‘వర్కింగ్ వైఫ్’ కథలు ఉదాహరణ.
రిజర్వేషన్ల ద్వారా అధికారం లభించినా, స్త్రీల పేరిట, ఆమె భర్తో, తండ్రో, పెత్తనం చేసే ధోరణిని కొందరు కథల్లో చూపించారు. వి. ప్రతిమ రాసిన ‘గంగజాతర’, కె.సత్యవతి ‘ముందడుగు’ కథలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
ఆడవాళ్ల స్నేహాలు పెళ్ళి తర్వాత ఎలా చెదిరిపోతాయో తెలియజెప్పే ఇతివృత్తాల్ని చూపించారు. ఓల్గా స్నేహం ‘స్నేహం’ కథ ఇందుకు ఉదాహరణ. స్నేహం స్త్రీలతోనే కాక, పురుషులతో కూడా చేయవచ్చని ఇద్దరు స్త్రీల మధ్య స్నేహ సంబంధాలున్నట్లే, స్త్రీపురుషుల మధ్య కూడా స్నేహం సంబంధాలు సాధ్యమని తెలిపే కథలు స్త్రీవాద కోణంనుంచే వచ్చాయి. కుప్పిలి పద్మ రాసిన ‘గోడ’ కథ స్నేహం సాధ్యం కాదని తెలిపింది.
ప్రేమించి పెళ్ళిచేసుకున్నా, వాటిని నిలుపుకోలేని జంటల సంఘర్షణలు, పెళ్లి తర్వాత మగవాళ్ల ప్రేమ క్రమంగా తగ్గిపోవడాన్ని కొన్ని కథలు చూపించాయి. డి. కామేశ్వరి రాసిన ‘కాలాన్ని వెనక్కి తిప్పకు’ ఉదాహరణ.
కనిపించని శారీరక మానసిక హింస, కుటుంబ హింస గురించి, ఎన్నో కథలు వచ్చాయి. స్త్రీల శరీరంపైన, మనసుపైన ఉన్న రాజకీయాల గుట్టు మట్లు విప్పిన కథ. ఓల్గా ‘రాజకీయకథలు’ స్త్రీలకు శారీరక స్పృహను కలిగించాయి.
పెళ్ళి మాత్రమే జీవితానికి లక్ష్యం కాదని చెప్పే కథలు ఎన్నో స్త్రీవాద దృక్పథ ప్రభావంతో వచ్చాయి. భర్తకోసం తనను తాను కోల్పోవడాన్ని గురించి తెలిపాయి. పి.సత్యవతి రాసిన ‘ఇల్లలకగానే’ సంకలనంలోని కథలు ఉదాహరణలు.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు స్త్రీల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న అంశాలు స్త్రీవాద కథల్లో కనిపించాయి. కుప్పిలి పద్మ రాసిన సాలభంజిక కథలు సుజాతరెడ్డి ‘నిశ్శబ్దం’ పి.సత్యవతి ‘మంత్రనగరి’ కథలు ప్రపంచీకరణ ప్రకంపనల్ని చిత్రించాయి.
వృత్తి, ఉద్యోగాల్లో కలిసి పనిచేస్తున్నట్లు కనిపించినా చివరకు పేరు మాత్రం మగవాడికే లభించడం, నిర్ణయాధికారం, మగవాళ్లే, తీసుకోవడం కనిపిస్తుంది. ఈ అంశాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. కుప్పిలి పద్మ రాసిన ‘కుబుసం’ ‘ది ఇన్‌స్టెంట్ లైఫ్’ కథలు ఉదాహరణ.
ఇటువంటి అనేకానేక పార్శ్వాల్ని చిత్రించిన స్త్రీవాద కథలు గత పదేళ్ళ కాలంలో వందలాదిగా వచ్చాయి. స్త్రీల జీవితాల్లోని సూక్ష్మాతిసూక్ష్మమైన అంశాల్ని సైతం కథకులు రికార్డు చేశాయి. స్త్రీవాద కథలకు కథాసాహిత్యంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వీని ప్రభావం పాఠకుల మీద, సాటి రచయిత మీద, సమాజం మీద బలంగా ఉంది.
కులమతాలు ఏవైనా స్త్రీలందరూ ఒకే విధమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారని తెలిపే కథలు వచ్చాయి. స్త్రీలు తమ మధ్య గోడల్ని చెరిపేసి, ఐక్యత సాధించడమే దానికి పరిష్కారమని కె.వరలక్ష్మి ‘స్వస్తి’ కథ చెప్పింది.
స్త్రీవాద దృక్పథంలో రచనలు చేసినవారిలో పి.సత్యవతి, కరుణ, ఓల్గా, కుప్పిలి పద్మ, కొండేపూడి నిర్మల, వాడ్రేవు వీరలక్ష్మి, పి.సుజాత, పాటిబండ్ల రజని, చంద్రలత, సి.సుజాత, వి.ప్రతిమ, కె.వరలక్ష్మి, భార్గవీరావు, జయప్రభ, గీతాంజలి, పద్మలత, శిలాలోలిత, చల్లపలి స్వరూపరాణి, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కాలవ మల్లయ్య, బి.ఎస్.రాములు, సన్నపురెడ్డి వెంకటరెడ్డి, దాదా హయాత్, బమ్మిడి జగదీశ్వరరావు వంటి రచయితలు ఉన్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags