పి.సత్యవతి సాహిత్య కృషి – ఒక అంచనా

బండారి సుజాత
పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే
నవలా ప్రక్రియకు సంబంధించి సత్యవతి చేసిన సాహిత్య కృషిని గమనిస్తే స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేకమైన ముద్ర అని అర్థం అవుతుంది.

అంతే కాదు ఆ నవలలు వ్రాయటం ద్వారా స్త్రీవాద భావజాల వ్యాప్తికి ఆమె చేసిన దోహదం కూడా అర్థం అవుతుంది. కథతో పాటు నవలను మాత్రమే కాక వ్యాస రచనలో కూడా ఆమె స్త్రీ వాద సైద్ధాంతిక నిబద్ధతే కనబడుతుంది.
1960వ దశకం నుండి రచనలు చేస్తూ, వర్తమానంలో మారుతున్న సామాజిక రాజకీయార్థిక పరిణామాలను ప్రభావాలను స్త్రీల కోణం నుండి వ్యాఖ్యానిస్తూ, స్త్రీల జీవితంపై వాటి వెలుగునీడల క్రీడను చూపిస్తూ వున్న సత్యవతి సాహిత్య కృషి సృజనసాహిత్యం, వ్యాస సాహిత్యం, అనువాద సాహిత్యం అన్న మూడు ముఖాలతో సాగింది.
సృజనసాహిత్యం :
1900తరువాత స్త్రీలు నవలా రచనాభ్యాసాన్ని ప్రారంభించారు. ఇప్పటికి తెలిసినంత వరకు తొలి తెలుగు నవలా రచయిత్రి జయంతి సూరమ్మ 1906లో ఆమె సుదక్షణా చరిత్ర అనే నవల వ్రాసింది. 1914లో మల్లవరపు సుబ్బమ్మ కళావతి చరిత్ర వ్రాసింది.
తొలి తెలుగు నవలలు రాజశేఖర చరిత్ర, సత్యవతి చరిత్ర, రామచంద్ర విజయం మొదలైన వాటిలాగానే తొలుతగా స్త్రీలు వ్రాసిన నవలలు కూడా వ్యక్తుల చరిత్రగానే వుండటం గమనించవచ్చు. స్త్రీలు సాంఘిక నవలలు వ్రాయటం ఎ.పి.పిరాట్టమ్మతో ప్రారంభమైంది. ఆమె వ్రాసిన నవల పేరు శోభావతి. ఆ మార్గంలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ”వసుమతి” అనే నవల వ్రాసింది.
20వ దశకపు తొలి పాదంలో తెలుగులో ప్రధానంగా చారిత్రక నవలలు, అపరాధ పరిశోధన నవలలు వచ్చాయి. ఈ విధంగా 1950ల నాటికి స్త్రీలు వ్రాసిన నవలలు యాభై వరకు ఉండవచ్చని అంచనా.
1950వ దశకంలో శ్రీదేవి వ్రాసిన కాలాతీత వ్యక్తులు, వట్టికొండ విశాలాక్షి వ్రాసిన నిష్మామయోగి నవలలతో తెలుగులో స్త్రీల నవల ఆధునిక చైతన్యంతో పునరుజ్జీవనం పొందింది.
1960 నుండి 1980ల వరకు స్త్రీలు వ్రాసిన నవలలు విస్తృతంగా కనపడతాయి. ప్రేమలు, పెళ్ళిళ్ళు, కుటుంబ జీవిత సమస్యలు, స్త్రీల ఆశలు, ఆకాంక్షలు, అసంతృప్తులు, భంగపాట్లు, సర్దుబాట్లు మొదలైనవన్ని స్త్రీల నవలేతి వృత్తాలలో కనిపిస్తాయి. వీటి మధ్య నుంచి స్త్రీల ఆత్మాభిమానం, ఆత్మగౌరవ చైతన్యం అనే విలువలు తొంగిచూడటం గమనించవచ్చు. సరిగ్గా ఈ సన్నివేశం నుండే నవలా రచయిత్రిగా పి. సత్యవతి రంగప్రవేశం చేసింది.
పి. సత్యవతి వ్రాసిన నవలలు ఆరు. 1973 నుండి 1988 మధ్యకాలంలో ఈ నవలలు వచ్చాయి. అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి రెండేళ్ళ ముందు ప్రారంభమై అంతర్జాతీయ మహిళా దశాబ్ది తరువాత మూడేళ్ల కాలం వరకు ఈ నవలలు విస్తరించుకొని వున్నాయి. మహిళా జీవిత సమస్యల గురించి, ప్రపంచమంతా ఆలోచిస్తున్న కాలంలో సత్యవతి ఈ నవలలు వ్రాసిందన్నమాట.
సత్యవతి వ్రాసిన ఆరు నవలల్లో మర్రినీడ తప్ప మిగిలినవన్ని స్త్రీల జీవితాల సంఘర్షణ చుట్టు అల్లుకొన్నవే. అనుకూలమైన ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులు లేక, ప్రేమ రాహిత్యంతో బాధపడే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్త్రీలు ఎలాంటి ప్రలోభాలకు లోనయ్యే ప్రమాదం వుందో ఇటు పద్మవ్యూహం (1973) లో సరస్వతి పాత్ర ద్వారా, పడుచుదనం రైలుబండి నవలలో (1988) లో నాగమణి పాత్రద్వారా చూపించింది సత్యవతి. సరస్వతిలాగ కాక నాగమణి ప్రమాదపు అంచుల వరకు వెళ్ళినా అప్పటికే తాను చేస్తున్న చిన్న, చిన్న ఉద్యోగాల వల్ల, చూస్తున్న ప్రపంచం ద్వారా పొందిన అనుభవజ్ఞానంతో, వ్యక్తిత్వ ప్రకర్షతో తనను తాను రక్షించుకోగలిగింది. ఆ పనిచేయలేని సరస్వతి జీవితం ప్రేమరాహిత్యంలోకే ప్రయాణించి ఒంటరి వేదనతో కనిపిస్తుంది. నాగమణి మాత్రం వివేకంతో, చొరవతో జీవితాన్ని నిర్మించుకోగలిగింది.
మర్రినీడ నవల (1975) లో గ్రామీణ ధనస్వామ్య వర్గ స్వభావాన్ని చిత్రించిన సత్యవతి, పడుచుదనం రైలుబండి (1988) నవలలో పట్టణ ధనస్వామ్య వర్గ స్వభావాన్ని చిత్రించింది. మొత్తానికి ధనస్వామ్య వర్గం మనుష్యులను తమ ఎదుగుదలకు ఉపయోగించుకుంటుందే కాని ఆ మనుష్యుల జీవితాలను గురించి అసలే పట్టించుకోదని ఈ రెండు నవలలు సూచిస్తాయి.
అన్నపూర్ణ (1976), గొడుగు (1978), ఆ తప్పు నీది కాదు (1981) ఈ మూడు నవలలు పూర్తిగా స్త్రీల జీవిత చైతన్యాలను ఇతివృత్తంగా కలిగినవే. స్వతంత్ర వ్యక్తిగా ఎదిగే క్రమంలో, ఆత్మగౌరవ చైతన్యాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో అస్థిత్వంలో వున్న సమాజంతో, విలువలతో, సమన్వయం సాధించుకోలేక స్త్రీలు పడే తత్తరపాటును అన్నపూర్ణ నవలలో చిత్రించింది.
శరీర స్పృహ, లైంగిక స్వేచ్ఛ అనేవి నూతన స్త్రీవాద ఉద్యమంలో ముందుకొచ్చిన అంశాలు, పితృస్వామిక కటుంబ నిర్మాణానికి ఈ విలువలకు మధ్య వైరుధ్యముంది. దీనిని చిత్రించటం గొడుగు నవల చేసిన పని. ఈ క్రమంలోనే సత్యవతి కుటుంబ వ్యవస్థయొక్క బోలుతనాన్ని కూడ నిరూపించగలిగింది.
స్త్రీలపై జరిగే లైంగిక అత్యాచారాన్ని ఏ విధంగా చూడాలన్న దానిపై జాతీయ స్థాయిలో చర్చ జరగడానికి మధుర, రమీజాబి రేప్‌ సంఘటనలు కారణమయ్యాయి. ఈ చర్చల నేపథ్యంలోనే సత్యవతి ఆ తప్పునీది కాదు నవల వ్రాసింది. అత్యాచారానికి గురైన ఆడపిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు దానిని శీలానికి సంబంధించిన ఒక భంగపాటుగా చూడటం, అవమానానికి, వేదనకు గురికావటం, ముడుచుకుపోవటం, కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేయటం ఆత్మహత్యలకు ఒడిగట్టడం ఇవన్ని సర్వసాధారణమైన అంశాలు. ఈ విధమైన గతాను గతికత్వంనుండి బయటపడి అత్యాచారం పట్ల స్త్రీ, పురుషులు అలవరుచుకోవలసిన నూతన దృక్పథాన్ని గురించిన ప్రేరణ ఇవ్వటం ఈ నవల ముఖ్యోద్దేశం.
అత్యాచారనేరం చేసిన వాళ్ళను వదిలేసి బాధితులనే నేరస్థులుగా చూసే సామాజిక సంస్కృతి అత్యంత హీనమైనదని దాని నుండి స్త్రీ పురుషులు బయట పడాల్సి వుందని ఈ నవల ద్వారా సత్యవతి సూచించింది.
మొత్తంమీద సత్యవతి నవలలను గమనిస్తే నవలా రచనా రంగంలో పి. శ్రీదేవి, వట్టికొండ విశాలాక్షి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన వారి వారసత్వాన్ని గుణాత్మకంగా ముందుకు తీసుకొనిపోవటం కనిపిస్తుంది. సమకాలీన సాంఘిక దౌర్జన్యాలను ఖండించటం కుటుంబంలో, సంఘంలో ఉన్న లింగ వివక్షను గుర్తించి విమర్శకు పెట్టడం, సంసార జీవిత చిత్రణకు పరిమితం కాక వ్యక్తులుగా స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తూ పాత విలువలతో సంఘర్షించే స్త్రీలను చూపించటం, ఓడినా, గెలిచినా స్త్రీల జీవితాలకు స్త్రీలనే బాధ్యులుగా చేయటం, ఆత్మగౌరవ చైతన్యంతో స్త్రీలు జీవితాన్ని నిర్మించుకొనడాన్ని ఆశించటం, పి. సత్యవతి నవలల జీవిత సారంగా కనబడుతుంది.
ఆ రకంగా సత్యవతి నవలలు 90వ దశకంలో ఆంధ్రప్రదేశంలో అభివృద్ధి చెందిన స్త్రీవాద సాహిత్యోద్యమానికి వేగుచుక్కలై కనిపిస్తాయి.
అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో అంది వచ్చిన కొత్త చైతన్యం ఆంధ్రదేశంలో స్త్రీ వాద భావజాల వ్యాప్తికి తోడ్పడింది. జాతీయోద్యమ కాలం నుండి తెలంగాణ రైతాంగ ఉద్యమంలోను, ఆ తరువాత శ్రీకాకుళ గిరిజనోద్యమంలోను భాగస్వాములైన మహిళల అనుభవాల అవగాహనకు కొత్త కోణాన్ని ఇచ్చింది స్త్రీవాదం. పితృస్వామ్య అధికార రాజకీయాలను ప్రశ్నించటం, విమర్శకు పెట్టడం, చైతన్య పరచటం అనే మూడు కార్యక్రమాలతో ఇది కొనసాగింది. స్త్రీలు తమవైపు తాము చూసుకొని, తమ గురించి తాము ఆలోచించుకొని తమ ప్రయోజనాల కొరకు పనిచేసే కొత్త దృక్పధాన్ని ఇచ్చింది.
ఒక వ్యక్తిగా, సంఘజీవిగా, పౌరురాలిగా స్త్రీని చూసే స్పృహను పెంచింది స్త్రీవాద ఉద్యమం. వ్యక్తిగతమంతా రాజకీయమే అన్న అవగాహనతో స్త్రీల జీవితం చుట్టు అల్లబడిన పితృస్వామిక మాయాజాలాన్ని బద్దలు కొట్టడం దీని లక్ష్యం. ఈ లక్ష్యంతో 1990 నాటికి ఆంధ్రదేశంలో స్త్రీవాద సాహిత్యోద్యమం అభివృద్ధి చెందింది. ఈ సాహిత్య ఉద్యమానికి బలమైన ప్రతినిధి పి. సత్యవతి.
1964లో ఆదివారం కోసం అన్నకథతో సత్యవతి సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. సెలవులు లేని ఇంటిపనిలో తలమునకలైన స్త్రీకి అందరికీ సెలవైన ఆదివారం మరింత పనిభారాన్ని ఎలా పెంచుతుందో తన వ్యక్తితమైన పనులకు ఆశగా ఎదురు చూసిన ఆ ఆదివారం నాడు కూడా ఆమెకు ఎలా ఆ అవకాశం రాకుండానే గడిచిపోతుందో ఈ కథలో చూపించింది సత్యవతి.
1974లో వ్రాసిన భూపాలరాగం కథలో పేద, మధ్య, ధనిక వర్గపు స్త్రీల గృహ జీవన శైలిని చిత్రించింది. 1978లో మాఘ సూర్యకాంతి కథ వ్రాసి స్త్రీల జీవితంలోని కనిపించని హింసను, పోలీసింగ్‌ను గుర్తించి చూపడమే కాక ప్రతిఘటించి నిలిచే స్త్రీల చైతన్యాన్ని కూడా నిరూపించింది సత్యవతి. తమ జీవితాన్ని తాము నిర్మించుకోవడానికి సిద్ధపడుతున్న ఆధునిక మహిళలను డాటర్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి కథలలో చూపింది. ఆరకంగా సత్యవతి తొలినుండే స్త్రీల కోణం నుండే కథలు రాయటం గమనించవచ్చు.
1985 తరువాత బలపడిన స్త్రీవాద ఉద్యమ చైతన్యం నుండి సత్యవతి సాహిత్య దృక్పథం మరింత పదునెక్కింది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అన్న నానుడిలోని మాయను విప్పి చెప్తూ ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తనను తాను కోల్పోవటం వుంటుంది. అన్న చేదు వాస్తవాన్ని నిరూపిస్తూ తాయిలం కథ వ్రాసింది సత్యవతి.
వ్యక్తిగత సృజనాత్మక ప్రతిభల ఆవిష్కారానికి అవకాశం లేని ఇంటి పనిలో స్త్రీలు తమని తాము కోల్పోవటం ఇల్లలకగానే (1990) కథలో శక్తివంతంగా చూపించింది. స్త్రీల జీవితాలు పురుషుల ప్రతిభకు అవకాశాలకు అనుకూలంగా కత్తిరించబడుతూ, కుదించబడుతున్న పితృస్వామిక సామాజిక దుస్థితిని గాంధారి రాగం, బదిలి, గణితం, పహరా, ముసుగు మొదలైన కథల ద్వారా చూపించింది. ఆ రకంగా 1995 నాటికి స్త్రీల జీవితంలోని పరాధీనతను విశ్లేషిస్తూ వచ్చిన సత్యవతి 1996 తరువాత ఆ పరాధీనతను మరింత వికృతీకరిస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాద ప్రభావాలను, మత ప్రభావాలను ఇతివృత్తంలో భాగం చేసుకుంటు సూపర్‌ మామ్‌ సిండ్రోమ్‌, తిమింగల స్వర్గం, మంత్రనగరి, పతిభక్తి వంటి కథలను వ్రాసింది.
వ్యాస సాహిత్యం :
స్త్రీల జీవిత సమస్యల పట్ల, స్త్రీల జీవన వేదనల పట్ల ఆర్తిని వ్యక్తీకరించటానికి ఒకవైపు నవలలు, కథలు వ్రాస్తూనే మరొకవైపు స్త్రీల సమస్యల గురించి వ్రాయటానికి భూమిక పత్రికలో ‘రాగం భూపాలం’ అనే ‘కాలం’ను ఉపయోగించుకొన్నది సత్యవతి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన స్త్రీల సాహిత్యాన్ని ‘ఆహ్వానం’ వంటి పత్రికల ద్వారా పరిచయం చేసింది. కొన్నింటిని తెలుగులోని అనువదించింది. పుస్తక పరిచయాలు చేసినా, వ్యాసాలు వ్రాసినా సమీక్షలు చేసినా, కాలమ్‌ నిర్వహించినా సత్యవతి స్త్రీల కోణం నుండి స్త్రీల ప్రయోజనాల కొరకే చేసింది. స్త్రీల చైతన్యాభివృద్ధి కొరకే చేసింది.
సత్యవతి వృత్తిరీత్యా ఆంగ్లోభాషాపన్యాసకురాలు అందువల్ల ప్రపంచసాహిత్యంతో ఆమెకు ఆత్మీయ సంబంధం వుంది. భారతదేశ స్త్రీల జీవిత సమస్యలకు ప్రపంచ స్త్రీల సమస్యల సాపేక్షతతో అర్థం చేసుకోవడానికి ఆమెకు ఆంగ్ల సాహిత్యం బాగా ఉపకరించింది. ప్రపంచ స్త్రీల అందరి సమస్యలలోని సారూప్యతను పరిచయం చేసి తెలుగు స్త్రీల చైతన్యాన్ని మెరుగెక్కించటానికి పుస్తకాల పరిచయాన్ని ఆమె ఒక మాధ్యమంగా స్వీకరించింది.
లాటిన్‌ అమెరికన్‌ రచయిత ‘లారా ఎస్క్వీవల్‌ వ్రాసిన ‘లైక్‌ వాటర్‌ ఫర్‌ చాక్‌లెట్‌’ నవలను పరిచయం చేయడం ద్వారా మెక్సికన్‌ స్త్రీల స్థితిగతులను గురించి పరిచయం చేసింది.
ఎమిటాన్‌ వ్రాసిన ‘జాయ్‌ లక్‌ క్లబ్‌’ నవలను పరిచయం చేస్తూ సత్యవతి వలస స్త్రీల జీవన సంస్కృతి సంఘర్షణలను గురించి తెలియచేసింది. 1940లో చైనా నుండి అమెరికా తరలివచ్చిన వేలాది కుటుంబాలలో నలుగురు స్త్రీల కుటుంబాల జీవితం ఈ నవలకు ఇతివృత్తం. ఒక ప్రక్క జపానుదాడి, మరొక ప్రక్క అంతర్యుద్ధం వలన కోట్లాది ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ఆస్తులు-ప్రాణాలు పోయాయి. కుటుంబాలు చెల్లాచెదురై పోయాయి. దాంతో విషాదంతో కూడిన గతాన్ని మాతృదేశంలో వదిలి క్రొత్త జీవితాన్ని వెతుక్కుంటు అమెరికాకి వచ్చిన ఈ నలుగురు స్త్రీలు అప్పుడప్పుడు సరదాగా కలుసుకొని చైనా సంప్రదాయ క్రీడ అయిన ‘మాజోంగ్‌’ ఆడుకుని మంచి భోజనం చేయడాన్నే ‘జాయ్‌ లక్‌ క్లబ్‌’ అని పిలుచుకుంటారు. చైనా దేశపు స్త్రీల జీవితాలను గురించి వివరణాత్మకంగా చెబుతూ అమెరికాలో పెరగటం ఎలా వుంటుందో చెబుతూ ఆక్రమంలో తల్లీకూతుళ్ళ మధ్య తరాల అంతరాలను, మాతృహృదయ సంస్పదనలను ఆధునిక యువతుల మనోభావాలను ఆవిష్కరించిన ఆ నవలను పరిచయం చేయటం ద్వారా సత్యవతి తెలుగు స్త్రీల జీవితానుభవాలను, జ్ఞాన చైతన్యాలను విస్తరింపచేసింది.
‘బియాండ్‌ జండర్‌ ఆఫ్‌ జాగ్రఫ్‌’ ఇరవై నలుగురు అమెరికన్‌ రచయిత్రులు వ్రాసిన కథల సంకలనం. అమెరికన్‌ సమాజంలోను స్త్రీలు ప్రతిఫలం లేని ఇంటి చాకిరితో మగ్గిపోవటం విచ్ఛిన్న కుటుంబాలలో స్త్రీల స్థితి, అత్తా కోడళ్ళ సంబంధాలు, తల్లీ పిల్లల సంబంధాలు, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే స్త్రీల జీవితాలు మొదలైన వాటిని ఈ కథా సంకలనం ఎలా ప్రతిఫలించిందో పరిచయం చేసింది సత్యవతి. ఆ రకంగా అమెరికా అయినా ఆంధ్రదేశమైనా స్త్రీల స్థితిగతులలో, కుటుంబ సామాజిక సంబంధాలలో పెద్దగా తేడా లేకపోవటాన్ని నొక్కి చెప్పింది.
నూతన స్త్రీవాదఉద్యమానికి అవసరమైన సైద్ధాంతిక విశ్లేషణను అందించిన రచనలలో ‘ఫిమినైన్‌ మిస్టిక్‌’ ఒకటి. ‘బెట్టి ఫ్రీడన్‌’ ఆ పుస్తక రచయిత. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్‌ మధ్య తరగతి స్త్రీల పరిస్థితిపై విశ్లేషణగా వున్న ఈ పుస్తకం వంటింటిని, పడక గదిని, మాతృత్వాన్ని స్త్రీల జీవితంలో అత్యంత గౌరవ ప్రదమైనవిగా చిత్రించి ప్రచారం చేసిన పత్రికలను ఎలా నిరసించిందో సత్యవతి సూచించింది. స్త్రీలను పంజరాలలో బంధించటానికి దోహదపడిన స్వార్థ ప్రయోజనాలను తిరస్కరించి స్త్రీల విముక్తి అవసరాన్ని ఈ పుస్తకం ఎలా చర్చించిందో సత్యవతి చెప్పింది.
అదే విధంగా స్త్రీల హక్కుల ఉద్యమానికి ఆదిగ్రంథమైన ‘విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ వుమన్‌’ పుస్తకాన్ని కూడా సత్యవతి పరిచయం చేసింది. ఫ్రెంచి విప్లవ కాలంలో పెరిగిన ”మే వూల్‌ స్టోన్‌ క్రాఫ్ట్‌” 1792లో ప్రచురించిన పుస్తకమిది. ఆనాటి స్త్రీల పరిస్థితిని, పురుష భావజాలాన్ని, రచయితలు స్త్రీలకు నిర్దేశించిన నడవడిని, జండర్‌ వివక్షను చూపే విద్యా వ్యవస్థను విమర్శకు పెడుతూ స్త్రీల హక్కుల ఆవశ్యకతను ఈ పుస్తకం ఎలా ప్రతిపాదించి సత్యవతి పరిచయం చేసింది.
నవలా రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు అయిన వర్జీనియా ఉల్ఫ్‌ 1928లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని రెండు స్త్రీల కళాశాలలో ”స్త్రీలు కాల్పనిక సాహిత్యం” అనే అంశంపై ఇచ్చిన ఉపన్యాసాల సారంగా వచ్చిన ‘ఎరూమ్‌ ఆఫ్‌ ఒన్స్‌ ఓన్‌’ అనే గ్రంథాన్ని పరిచయం చేసింది సత్యవతి. స్త్రీలు సాహిత్య కృషి చెయ్యాలంటే, అందులో వాళ్ళు విజయం సాధించాలంటే, వాళ్ళకు స్వంత డబ్బు, దానిపై హక్కు, స్వంత సమయం, స్వంత గదీ ఉండాలని ఆమె 1928లో గట్టిగా చెప్పింది. ఆమె ఆ సంగతి సోదాహరణంగా వివరించి దాదాపు ముప్పావు శతాబ్దం అయిపోయింది. ఇన్నాళ్ళ తరువాత మనకవన్ని సిద్ధించాయా? అని ఒక్కసారి ఆలోచించి చూసుకోవడానికైనా వర్జీనియా ఉల్ఫ్‌ని మనం చదివి తీరాలి అంటారు సత్యవతి. ఈ పుస్తకంలో ఆమె స్త్రీల చరిత్రే స్త్రీల సాహిత్యం అని ప్రతిపాదించి పదహారవ శతాబ్దం నుండి ఇరవయ్యొవ శతాబ్దం వరకు అకాలంలో స్త్రీల పరిస్థితులలో వచ్చిన మార్పులను విశ్లేషించిందని, స్త్రీల సాహిత్య సృజన పట్ల పురుష సమాజానికున్న చిన్నచూపును నిరసించిందని, స్త్రీలు నవలలే వ్రాయడానికి, కవిత్వం వ్రాయక పోవటానికి వారి జీవన పరిస్థితులే కారణమని నిరూపించిందని సత్యవతి వివరించింది. నిరాదరణలోనైనా ఎదిరించి పోరాడే స్థితిని సాహిత్య రంగంలో స్త్రీలు అలవరచుకోవాలని వర్జీనియా చెప్పిన విషయాన్ని సత్యవతి గుర్తు చేసింది.
అరాచకవాద కమ్యూనిస్ట్‌ ఫెమినిస్టయిన ‘ఎమ్మా గోల్డ్‌మన్‌’ ఆత్మకథ ‘లివింగ్‌ మై లైఫ్‌’ పుస్తకాన్ని పరిచయం చేస్తూ సత్యవతి ఆమె జీవితంలోని ఉద్యమ శీలతను కుటుంబం పట్ల, వివాహం పట్ల ఆమె దృక్పథాన్ని పరిచయం చేసింది.
అదే విధంగా సోవియట్‌ యూనియన్‌లోని మొదటితరం సోషలిస్ట్‌ ఫెమినిస్టయిన ‘అలెగ్జాండ్రా కొల్లంతాయ్‌’ రచనలను పరిచయం చేసింది.
భారతీయ ఆంగ్ల రచయిత భారతీముఖర్జి, శశిదేశ్‌పాండే వ్రాసిన నవలను కూడా పరిచయం చేసింది సత్యవతి.
ఆడపిల్లకు పుట్టినప్పటినుండి మంచి భార్యగా జీవించటానికి శిక్షణ నిచ్చే కుటుంబ సంస్కృతిని, భార్యగా తప్ప మరొక జీవితం లేని స్త్రీల స్థితిని ‘వైఫ్‌’ నవల ఎలా చిత్రించిందో పరిచయం చేసింది సత్యవతి.”
‘శశిదేశ్‌పాండే’ వ్రాసిన ‘ది డార్క్‌ హోల్డ్స్‌ నో టెర్రర్స్‌’ (పు. 34) ‘ద బైండింగ్‌ వైన్‌’ నవలలు వైవాహిక వ్యవస్థలో భార్యా భర్తల మధ్య దూరాన్ని అసంతృప్తులను, రాజీలను, తిరుగుబాట్లను చిత్రించిన విధానాన్ని పరిచయం చేసింది సత్యవతి.
ఉన్నత మధ్య తరగతి ముస్లిం కుటుంబాలలో స్త్రీల జీవితాలను నియంత్రించే సంప్రదాయాలను నిరసిస్తూ ‘ఇస్మత్‌చుగ్తాయ్‌’ వ్రాసిన రచనలతో ఒకటైన ‘దిల్‌కి దునియ’ నవలను పరిచయం చేసింది సత్యవతి.
రాజం కృష్ణన్‌ అనే మళయాళి రచయిత్రి వ్రాసిన ‘ప్రవాహంలో దీపాలు’ అనే నవల పితృస్వామిక కుటుంబ సంబంధాలను అందులో స్త్రీల మధ్య వుండే వైరుధ్యాలను, వాటిని అధిగమించే ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రదర్శించే స్త్రీలను, పురుష రాజకీయాలను అర్థం చేసుకునే వారి అవగాహనను ఎలా చిత్రించిందో పరిచయం చేసింది సత్యవతి.
ఈ రకంగా ఆంగ్లంలో వచ్చిన స్త్రీల రచనలను, ఆంగ్లంలోకి అనువాదమైన భారతీయ స్త్రీల రచనలను పరిచయం చేసి పి. సత్యవతి తెలుగు సమాజంలో స్త్రీల సమస్యలను గురించిన అవగాహనకు దోహదం చేసింది.
సత్యవతి కథా రచయిత్రి కనుక సంఘటన దగ్గరనో, సన్నివేశం దగ్గరనో ప్రారంభించి దాన్ని విశ్లేషిస్తూన్నట్లుగానో, వివరిస్తున్నట్లుగానో, స్త్రీ జీవిత సమస్యలను వ్యాఖ్యానిస్తూ వ్రాసిన వ్యాసాల వంటి రచనలు ఉన్నాయి. కొమర్రాజు అచ్చమాంబ గురించి వామపక్ష ఉద్యమంలో ప్రత్యేకించి మహిళా ఉద్యమంలో ఆమె భాగస్వామ్య స్వభావాన్ని వివరిస్తూ వ్రాసిన ‘ఆమె అందరికీ అమ్మే’ వ్యాసం కూడ పేర్కొనదగినది.
ఆహ్వానంలో అదనపు విలువలు ‘రాగం భూపాలం’ ‘కాలం’ లో వ్రాసిన ఇతర రచనలు ఈ కోవలోవే. ఇంట్లో తాతయ్య వైఖరిని, తాతయ్యతో మాట్లాడడానికి వచ్చిన మామయ్య సంభాషణలను, చదువుకున్న చైతన్యం కల స్త్రీ కోణం నుండి వ్యాఖ్యానిస్తూ మొత్తంగా స్త్రీల జీవితంలోని నియంత్రణను, హింసను ఇంటిపని భారాన్ని, లైంగికత మీద పురుష పెత్తనాన్ని వివాహ వ్యవస్థలోని అధికార లక్షణాన్ని, నిరసన స్వరంతో వినిపించిన వ్యాసం అదనపు విలువలు.
”యెట్‌ అనదర్‌” వ్యాసంలో ప్రేమోన్మాద దాడులను ప్రస్తావిస్తూ యువకులను సమాజానికి అవసరమైన మానవీయ వ్యక్తులుగా తయారు చేసుకోవడానికి, కుటుంబ సంబంధాలను ఆత్మీయంగా, సంస్కారవంతంగా మలుచుకోవాలని సూచించటంతో పాటు ధైర్యంతో, చొరవతో, జ్ఞానంతో, పట్టుదలతో, బాధ్యతతో తమను తాము అలరించుకోమని స్త్రీలకు చెప్పింది సత్యవతి. మంచి పుస్తకాలు చదవటం, మానవీయ సమాజం ఆవిష్కరణకు అవసరమైన సంస్కారం ఇస్తుందని కూడా ఆమె ఈ వ్యాసంలో సూచించింది.
‘యాసిడ్‌ ప్రూఫ్‌ ఫేస్‌ మార్క్‌’ వ్యాసం కూడ ఈ కోవలోనిదే. హింసనే వార్తలుగా ప్రచురించే పత్రికలను గురించి ప్రస్తావిస్తూ అందులో స్త్రీల పేజీలలో చెప్పబడే సౌందర్య సాధనాల గురించి వ్యంగ్యంగా ఈ వ్యాసంలో విమర్శించింది సత్యవతి. తేెనె, పండ్లు, పాలు మొదలైన వాటిని ముఖాలకు పట్టించుకొని అందంగా తయారుకమ్మని చెప్పే పత్రికలను విమర్శిస్తూనే అలాంటి అందమైన ముఖాల మీద ఆమ్ల వర్షం కురిపించే దుష్ట సంస్కృతిని గురించి నిరసన స్వరంతో పేర్కొన్నది సత్యవతి. స్త్రీల సౌందర్య పోషణ గురించి ఇన్ని చెప్పే పత్రికలు స్త్రీలకు ఆత్మరక్షణ మార్గాలు చెప్పకపోవడం గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది సత్యవతి. స్వంత ముఖాలతో నిర్భయంగా నడవటానికి యాసిడ్‌ ప్రూఫ్‌ ఫేస్‌ కావాలిప్పుడు అంటుంది సత్యవతి. ఆత్మగౌరవం అభివృద్ధి చేసుకోవలసిన విలువ అని కూడా అంటుంది సత్యవతి.
ఒంటరిగా రైలెక్కిన ఆడపిల్లను తోటి ప్రయాణీకులు అడిగే ప్రశ్నలు ఇచ్చే సలహాలు చూస్తూ తనలో కలిగిన ఆలోచనల వ్యక్తీకరణగా వ్రాసిన వ్యాసం ‘రైలెక్కిన ఆడపిల్ల’. తన జీవితాన్ని తను నిర్మించుకోవటానికి ఒంటరిగా బయలుదేరే ఆడపిల్లలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే పెంపకాలు కుటుంబంలో వున్నాయా? అని సత్యవతి ప్రశ్న! లేవన్నది ఆమె అనుభవం.
ఓపెన్‌ యూనివర్సిటి విద్యావకాశాలను ఉపయోగించుకొని మధ్య వయసు స్త్రీలు, గృహిణులు డిగ్రీల కోసం పరీక్షలు వ్రాయడాన్ని ప్రస్తావిస్తూ జీవితమంతా ఇంటిపనిలో, కుటుంబ బాధ్యతల నిర్వహణలో కాలం గడిపేసే స్త్రీలకు తమ అభిరుచులను, వ్యాపకాలను కాపాడుకొనే సొంత సమయం అనేది లేకపోవటాన్ని గురించి బాధపడింది. శాంతి కాముకులుగా, సహనవతులుగా స్త్రీలు కుటుంబంలో గొప్ప పేరును పొందవచ్చును. కానీ దాని వెనుక వాళ్ళు తమ విలువైన జీవితాన్ని, సమయాన్ని కోల్పోతున్నారన్న వేదన సత్యవతిది.
సాహిత్యానికి సంబంధించిన ‘కాలమ్‌’ లలోనైతేనేమి ‘సమీక్షలుగా’ నైతేనేమి ‘వ్యాసాల’ రూపంలో నైతేనేమి సత్యవతి చేసిన రచనలు పదిహేను వున్నాయి. వీటిలో కుటుంబరావు సాహిత్యం మీద వ్రాసిన రెండు వ్యాసాలు, కేశవరెడ్డి నవలలపైన, శాక్కొ-వాంజెట్టి పుస్తకంపైన, నాకో పిస్తోలు కావాలి సంకలనం మీద వ్రాసిన సమీక్షలు మాత్రమే సాహిత్యానికి సంబంధించినవి. బీనాదేవి సాహిత్యంపై వ్రాసిన కూడ దీనిలో చేర్చదగిందే. సత్యవతి సమీక్షించిన తిలాదానం, సుమిత్ర గారిల్లు కథాసంపుటాలు కూడ పురుష రచయితలవే. పురుషుల సాహిత్యాన్ని గురించి చర్చించిన సందర్భాల్లో కూడ సత్యవతి స్త్రీల సమస్యల పట్ల ఆయా రచయితలకున్న దృక్పథాన్ని అంచనా వేయడం గమనించదగింది.
కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన ‘కురూపి’ లాంటి నవలలను పరిచయం చేయటంలో సత్యవతి సౌందర్యాత్మక హింసలో నలిగిపోతున్న స్త్రీలను హెచ్చరించటమే లక్ష్యంగా చేసుకోవటం కనిపిస్తుంది.
రాగం భూపాలం ‘కాలమ్‌’ లో వ్రాసిన కవయిత్రుల సాయంత్రంలో అద్భుతమైన కవితలు వినిపించిన ముగ్గురు కవయిత్రులను అభినందనలతో పేర్కొన్నది. భావుకత పండిన జూపాక సుభద్ర కవిత్వాన్ని, దు:ఖానుభూతిని వ్యక్తీకరించిన సి.హెచ్‌. రత్నమాల కవిత్వాన్ని ఆదివాసీల గురించి వ్రాసిన సుజాత పట్వారి కవిత్వాన్ని సత్యవతి పేర్కొన్నది.
ఎవర్ని నొప్పించే కథలు రాయొద్దని స్త్రీ వాదులకు హితవు చెప్పే పురుష రచయితలను దృష్టితో పెట్టుకొని స్త్రీలను నొప్పించే సంఘటనలు, సందర్భాలే జీవితం నిండా పరుచుకొని వున్నప్పుడు స్త్రీలు వాటి గురించి కాక మరి దేన్ని గురించి వ్రాస్తారని ఒక ప్రశ్నను సంధించింది సత్యవతి. ‘ఏమిరాయను’? అన్న వ్యాసంలో అలాగే ఆమె ‘ఎగ్నెస్‌ స్మెడ్లి వ్రాసిన భూమిపుత్రిక నవలను సమీక్షించడం ద్వారా అస్థిత్వ చైతన్యం కల అంతర్జాతీయ సందర్భం నుండి, వ్యక్తి అనుభవం కోణం నుండి, స్త్రీల లైంగికతను లైంగిక స్వేచ్ఛా భావనను ఎలా అర్థం చేసుకోవాలో సూచించింది స్త్రీ వాద సాహిత్యోద్యమ తాత్త్వికతకు ఇదొక చేర్పు. నిర్మలా రాని, సుభాషిణి, సునితా రాణి వంటి కథా రచయితల అనువాదకుల పుస్తకాలకు ముందుమాట వ్రాయటంలో స్త్రీల సృజనాత్మకత ప్రతిభలకు మార్గదర్శకత్వం వహించే సహోదర తత్త్వమే కనబడుతుంది. 20వ శతాబ్ది రాజకీయార్థిక పరిణామాలు తెలుగులో స్త్రీల సాహిత్యం అనే వ్యాస సంకలనాన్ని సమీక్షించటం ద్వారా సాహిత్య చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీల చరిత్రను నిర్మించుకొనవలసిన అవసరాన్ని ఆమోదించి నొక్కి చెప్పింది సత్యవతి.
అనువాద సాహిత్యం :
సత్యవతి అనువాదాలలో సిమోన్‌ ది బోవా వ్రాసిన ‘సెకండ్‌ సెక్స్‌’ ముఖ్యమైనది. భారతదేశంలో ఫెమినిస్టు ఉద్యమం ఇంకా బాల్యదశలోనే ఉందని అదైనా నగరాలకు మాత్రమే పరిమితమై వుందని సత్యవతి భావించింది. అన్ని దేశాల ఫెమినిస్ట్‌ ఉద్యమ చరిత్రలను పరిశీలించి ఆస్ఫూర్తితో అవగాహనతో మన ఫెమినిస్ట్‌ ఉద్యమాన్ని మనమే మన సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకోవలసి ఉంది అని అభిప్రాయపడింది.
అందుకనుగుణంగానే సెకండ్‌ సెక్స్‌ అన్న స్త్రీవాద రచనను సంక్షిప్తంగా అనువదించి పరిచయం చేసింది. నీలిమేఘాలు కవితా సంకలనంతో తెలుగులో స్త్రీవాద ఉద్యమం ఒక మలుపు తీసుకున్న కాలంలోనే సత్యవతి 1949లో ఫ్రాన్సు నుండి వచ్చిన స్త్రీవాద సైద్ధాంతిక గ్రంథాన్ని పరిచయం చేయటం విశేషం. ప్రతి స్త్రీ తానెవరో సంఘంలో తన ప్రతిపత్తి ఏమిటో, తన శరీరం ఏమిటో తనకి పురుషునికి ఉండవలసిన సాంఘిక సంబంధాలు ఎలా వుండాలో తెలుసుకోవాలంటే ‘సిమోన్‌ ది బోవా’ ని అవశ్యం చదవాలంటారు సత్యవతి.
సత్యవతి అనువాదాలలో స్త్రీవాద సైద్ధాంతిక జ్ఞాన చైతన్యాలకు తోడ్పడే ‘సెకండ్‌ సెక్స్‌’ మాత్రమేకాక ఒక నవల, మరి రెండు కథలు ఒక వ్యాసం వున్నాయి.
‘నూనె గానుగ’ కథ ‘మళయాళీ’ భాష నుండి అనువాదం చేయబడింది. మూల కథారచయిత ‘బాలకృష్ణన్‌ మంగాడ్‌’. పురుషుడు భూస్వామ్య పెత్తందారి తనానికి బానిస అయితే, బానిసకు, బానిసగా బ్రతికే స్త్రీ జీవితంలోని దౌర్భాగ్యాన్ని విప్పి చెప్పిన కథ ఇది. ఇంటి చాకిరిలో, యజమానుల చాకిరిలో గానుగెద్దు బ్రతుకులు బ్రతికే స్త్రీల జీవిత విషాదం ఏ ఒక్క స్త్రీకో సంబంధించింది కాదని కూడా ఈ కథ చెప్తుంది.
ఈజిప్టు రచయిత ‘నవల్‌ ఎల్‌ సాథవి’ అణచివేతకు గురవుతున్న అరబ్‌ స్త్రీల జీవితాలను చిత్రిస్తూ సాహిత్యాన్ని సృష్టించింది. ఆమె రచించిన ఒక కథను ‘స్వర్గంలో ఆమెకు చోటు లేదు’ అను శీర్షికతో అనువదించింది సత్యవతి. పుట్టినప్పటి నుండి మరణించే వరకు వివక్షను, అణచివేతను, నియంత్రణను, హింసను ఎదుర్కొంటు అటు తండ్రి అదుపాజ్ఞలలోను ఇటు భర్త అదుపాజ్ఞలలోను జీవించే అరబ్‌ స్త్రీ వ్యధ ఈ కథలో కనపడుతుంది. భర్త మరణిస్తే భార్య మరొక పురుషుడి ప్రసక్తి లేకుండా జీవితం గడపాలని, మరణానంతరం స్వర్గంలో తన కొరకు ఎదురు చూచే భర్తను కలుసుకోవాలని మనుధర్మ శాస్త్రమే కాదు ముస్లిం మత ధర్మాలు కూడా చెబుతాయి అని ఈ కథ చదివితే తెలుస్తుంది. స్వర్గంలో భర్తను కలుస్తానని ఆశపెడుతూ ఈ కథలోని స్త్రీ జీవితంలోకి ఆమె పెద్దలు మరే పురుషుడిని రానివ్వలేదు. మరణించి ఆమె స్వర్గం చేరుకునేటప్పటికి ఆమె భర్త అక్కడ దేవతా స్త్రీలతో సరస సల్లాపలలో వుండటం ఈ కథలోని వ్యంగ్యం. భార్యను తన్ని హింసపెట్టిన భర్తకు స్వర్గ ప్రవేశం వుంది కాని జీవితమంతా అణచివేతకు గురైన స్త్రీలకు స్వర్గ ప్రవేశం వుందా? లేదా? అన్న చర్చ ఆమెకు నిర్దేశించబడిన స్త్రీ ధర్మాలను అమలు చేసిన తీరు ప్రాతిపదికగా జరగటం కూడా ఈ కథలోని మరొక అంశం. స్త్రీల అణచివేత పట్ల ‘నవల్‌ సాధవి’ కోపం అంత ఈ కథలో కనపడుతుంది. ఈ కథను అనువాదం చేయటం ద్వారా సత్యవతి స్త్రీలపై హింసాసూత్రం విశ్వజనీనంగా ఎలా నిర్మించబడి ఆచరించబడుతున్నదో సూచించి స్త్రీల ఐక్యతను ఒక ప్రాతిపదిక వేసింది.
మతం అంచులకు నెట్టివేయబడిన స్త్రీల అంతరంగాన్ని పరిచయం చేసే చిన్న వ్యాసం ‘జ్ఞానదాతకే జ్ఞానదాత సుజాత’ అన్ని మతాలలాగానే బౌద్ధం కూడా స్త్రీని దూరంగానే వుంచింది. మత గురువులు కూడా మమ్మల్ని అజ్ఞానంలో వుంచటానికే ప్రయత్నిస్తే ఎలా అని బుద్ధుడినే ప్రశ్నించిన సుజాత గురించి బౌద్ధమత సాహిత్యం ఆధారంగా జరగవలసిన పరిశోధనలను గురించి ప్రస్తావించింది ఈ వ్యాసంలో సత్యవతి.
ఈ విధంగా బహుముఖాలుగా సాగిన సత్యవతి సాహిత్య కృషి మొత్తం పందొమ్మిది వందల తొంబయ్యవ దశకపు స్త్రీవాద ఉద్యమానికి ఒక జీవశక్తి నిచ్చిందనటంలో అతిశయోక్తి లేదు. స్త్రీ సమస్య ప్రపంచ శ్రామిక విముక్తి ఉద్యమాలతో, హక్కుల ఉద్యమాలతో ముడిపడి పరిష్కరింపబడుతుందన్న అవగాహనను కూడా సత్యవతి తన ఈ రచనల ద్వారా తెలుగువారి భావ ప్రపంచంలోకి ప్రసరింపచేయటం విశేషం.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో