జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలిని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని పిలుస్తారు. ఇంతవరకూ ఇది 10 సాధారణ సమావేశాలను, ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రారంభంలో ఏడాదికి ఒక సమావేశం వంతున నిర్వహించగా 2000 నుంచి రెండేళ్లకు ఒకటివంతున నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఇంతవరకూ 299 నిర్ణయాలను తీసుకోవటం జరిగింది. నగోయా (జపాన్)లో 2010 అక్టోబర్ 18-20 వరకు పదవ సమావేశం జరిగింది. ఇప్పుడు 11వ సాధారణ సమావేశాన్ని హైదరాబాద్‌లో అక్టోబర్ 1-19 తేదీల మధ్య నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ఇంటర్‌నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్ సిటిలో నిర్వహించే ఈ సదస్సులో 193 దేశాల నుండి 15 వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు స్వాగతోపన్యాసం దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర అటవీ వనరుల శాఖ సహాయ మంత్రి జయంతి నటరాజన్ ఉపన్యసిస్తారు. ఈ సమావేశంలో మొత్తం 17 విషయాలను చర్చించనున్నారు. 1. సముద్ర తీరప్రాంత జీవవైవిధ్యము, 2. జన్యు వనరుల లభ్యత, 3. జీవవైవిధ్య సుస్థిరత మరియు సంరక్షణ, 4. జీవవైవిధ్య రక్షణ, 5. జీవపరిరక్షణ, 6. వ్యవసాయ జీవవైవిధ్యము, 7. అంతర్జలావరణము, 8. నీటి వినియోగము, 9. మెట్ట భూములు, మధ్యతరహా మెట్ట భూములు, గడ్డి నేలలు, పర్యావరణము, 10. సుస్థిర ఉపయోగము పర్యాటక రంగము, 11. అటవీ, పర్యావరణము సంబంధిత జాతులు, 12. పర్వతాలు, పర్యావరణము, 13. సాంకేతిక జ్ఞాన బదిలీ మరియు సహకారము, 14. ద్వీపాలు – పర్యావరణము, 15 అడవులు – పర్యావరణము, 16. పర్యావరణము – అవగాహన, 17. వ్యవసాయము – జీవవైవిధ్యము అనే అంశాలపై చర్చిస్తారు. గతంలో నిర్వహించిన సమావేశాల విషయానికి వస్తే మొదటిది నాసావ్‌లో (బహమాస్) జీవవైవిధ్య సదస్సు నిర్వహించారు. ఇందులో జీవవైవిధ్యం గురించి చర్చలు, నిర్ణయాలు జరిగాయి. రెండవది జకార్తాలో (ఇండోనేషియా) లో జరిగింది. ఈ సమావేశంలో తీర ప్రాంతాల్లో జీవవైవిధ్యం జలచరాల జన్యువనరులు, జీవవైవిధ్య సంరక్షణ, దాని సద్వినియోగం వంటి అంశాలను చేపట్టారు. మూడవది బ్యూనాస్ ఏరీస్‌లో (అర్జంటీనా)లో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ జీవవైవిధ్యం, ఆర్థిక వనరులు – యంత్రాంగం, వాటిని గుర్తించడం, పర్యవేక్షణ, సమీక్ష, మేధో హక్కులు అనే విషయాలను చర్చించారు. నాల్గవది బ్రతిస్లేవాలో (స్లోవేకియా)లో నిర్వహించారు. ఈ సమావేశంలో నదులు, చెరువులు, వాగులు, వంకలు, బావులు, కుంటల వంటి జల వనరులు పర్యావరణ పరిస్థితులు, అప్పటివరకు జరిగిన సమావేశాల సమీక్షపై క్షుణ్ణంగా చర్చిండం జరిగింది.
అయిదవది నైరోబీలో (కెన్యా)లో నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్ట భూములు, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలు, మద్యధరా ప్రాంతాల వాతావరణం, పచ్చిక నేలలు లాభసాటిగా వినియోగం, పర్యాటకం, జన్యు వనరుల లభ్యత వంటి అంశాల గురించి చర్చించారు. ఆరవది హేగ్ (నెదర్‌ల్యాండ్స్)లో నిర్వహించారు. ఈ సమావేశంలో అడవుల పర్యావరణ, గుర్తించని జాతులు, ప్రయోజనాల భాగస్వామ్యం, 2002-10 కాలానికి వ్యూహరచన వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఏడవది కౌలాలంపూర్ (మలేషియా)లో నిర్వహించారు. ఈ సమావేశంలో పర్వతాల పర్యావరణం, రక్షిత ప్రాంతాలు, సాంకేతిక మార్పిడి, సహకారం అంశాలను చేపట్టింది. ఎనిమిదవది కురిటిబాలో (బ్రెజిల్)లో జరిగింది. ఈ సమావేశంలో దీవులు, తేమ ఉన్నా వర్షాలు సక్రమంగా కురవని ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల జీవవైవిధ్యం, కమ్యూనికేషన్ సౌకర్యాలు, జనబాహుళ్యంలో అవగాహన పెంపొందించటం వంటి విషయాలను చర్చించారు. తొమ్మిదవ సమావేశం బాన్‌లో (జర్మనీ)లో నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ జీవవైవిధ్యం, మొక్కల సంరక్షణలో ప్రపంచ దేశాల ప్రణాళికలు, అజ్ఞాత జాతులు, అటవీ జీవవైవిధ్యం, ప్రోత్సాహక చర్యలు, ఆర్థిక వనరులు, ప్రగతి సమీక్షలు, వ్యూహరచనపై దృష్టిపెట్టింది. ( గ్రీన్ క్లైమెట్ మేగజైన్ నుండి)