సుమిత్ర, అంకురం సొసైటీ
మనిషిని మనిషి దోచుకోని మరియు హింసించని రోజున ‘బాధితులకి’ ఆత్మరక్షణ, హక్కుల రక్షణ, వసతి గృహాల కల్పన అవసరమే రాదు!
కాని ఎంత ఎక్కువ బలం చూపించి దోచుకుంటే అంత ఎక్కువ బలవంతులుగా చలామణి అవుతున్న ఈ రోజులలో – మహిళలు, పిల్లలు, చిన్నపాటి భరోసా కూడా లేని జీవితాల్లో పొట్టకూటికోసం వూరు వదిలి వెళ్ళే వలస జీవులు, వృద్ధులు మొదలైన వాళ్ళు ”బాధితులు”గా మార్చబడి తమంతట తాముగానో కుటుంబాలనుండో, సమాజం నుండో బయటకు త్రోసివేయబడిన వారు వేల సంఖ్యలో ”వసతి లేదా రక్షణ గృహాల” అందుబాటు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ సహాయంతో గాని, స్వచ్ఛందంగా గాని నడుపుతున్న వసతి/రక్షణ గృహాలు అన్నీ ఆశించిన మేర పనిచేయలేక పోతున్నాయి. మరో ప్రక్క ఈ గృహాల అవసరం మరింత పెరుగుతూనే వుంది. ఈ నేపథ్యంలో, సమస్యలని అంచనా వేసుకొని, సరైన పరిష్కార మార్గాలు కనుగొనే దిశలో – అక్టోబర్ 15వ తేదీ 2012 నాడు హైదరాబాదులో ”అంకురం” సారధ్యంలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు, మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, వసతి గృహాలు నడుపుతున్న ఎన్‌జివోలు, రీసెర్చ్ గ్రూపులు ప్రతినిధులు హాజరైనారు. ఆద్యంతం ఆసక్తి కరంగా సాగిన సదస్సు వివరాలు క్లుప్తంగా భూమిక పాఠకుల కోసం :
”సేఫ్ హోమ్‌లు – సవాళ్లు” అంశంపై చర్చించడానికి రాష్ట్ర నలుమూలలనుండి హాజరైన సుమారు 50 మంది ప్రతినిధులకు అంకురం డైరెక్టర్ సుమిత్ర సాదర ఆహ్వానం పలుకుతూ, సదస్సు పెట్టిన ఉద్దేశాన్ని వివరించారు. ఈ మధ్య సేఫ్ హోంలపై జరుగుతున్న భౌతిక దాడులు ఉటంకిస్తూ, హోంల న్విహణలో వస్తున్న ఇబ్బందులు – ఇంట బయట తీసుకోవాల్సిన జాగ్రతలు, కలిసి పనిచేయాల్సిన అవసరం, హోమ్‌లను బాధితులకి అవసరం ఉన్నంతకాలం నిలబెట్టాల్సిన ఉమ్మడి బాధ్యత గురించి వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ పూర్వ సభ్యురాలు పద్మసేత్ గారు మాట్లాడుతూ – వసతి/సేఫ్ గృహాలు నడిపే సంస్థలు మరింత బాధ్యతగా ఉంటూ చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రతలు సమయానుకూలంగా తీసుకోవాలని, ఎలాంటి బాధితులకి ఏ చట్టం సరిగ్గా వర్తిస్తుందో ఆ యాక్టు వర్తించేలా సరైన న్యాయవాది సహాయం తీసుకుని బాధితులకి అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వంలోని అంగాలని సరిగ్గా అర్థం చేసుకుని పనిచేయించాలని, బాధితుల హక్కుల పరిరక్షణకి పోలిస్ అండ తప్పనిసరి అని, వారిని భాగస్వాములను చేయటం అనివార్యమని గుర్తుచేశారు.
భూమిక ఎడిటర్ సత్యవతి గారు మాట్లాడుతూ, వసతి గృహాల పని తీరుపై తాము ఒక సర్వే చేసామని, వసతి గృహాలలో అత్యంత హీనమైన పరిస్థితులు నెలకొని ఉండటం బాధాకరమని, ఇది మొత్తంగా ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలని అన్నారు. భూమిక నుండి ఒక మోడల్ హోంని పెట్టాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వసతి గృహానికి ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ అనుసంధానంగా ఉండాలని అందుకు ఎపిలీగల్ సర్వీస్ అధారిటీ వారి జిల్లా యూనిట్లతో కలిసి పని చేయాలనీ సూచించారు.
స్వార్డ్ సంస్థ నుండి శివ కుమారి మాట్లాడుతూ వసతి గృహాలు నడపడంలో వచ్చే ఇబ్బందులని ఎదుర్కోడానికి ప్రభుత్వం సహాయం ఎంతో అవసరమని, కాని లేకపోవడం వలన వసతి/సేఫ్ గృహాలు నడపడం కష్టసాధ్యం అవుతుందని చెప్పారు. హోంలో ఉండే ఎవరైనా పారిపోయిన, లేదా చనిపోయిన సంఘటన జరిగితే మీడియా దానిని సెన్సేషన్ చేయడానికే చూస్తుంది కాని నిజాన్ని చూపించదు అంటూ తమ స్వీయ అనుభవం చెప్పారు.
కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఫాక్ట్ ఫైండింగ్ మిషన్ ప్రాధాన్యత వివరిస్తూ,సిడబ్ల్యుఎస్, జెజె డిపార్టుమెంటు, డబ్ల్యుసిడి, ఎడ్యుకేషన్, జ్యుడిషియరీతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని, అలాగే బాధితులకి కౌన్సెలింగ్ అవసరాన్ని నొక్కి చెప్పారు.
ప్రకృతి సంస్థ నుండి జయశ్రీ మాట్లాడుతూ హోంలను నడిపే సంస్థలకు ‘గుర్తింపు’ని ఇవ్వడంగాని వనరులని ఇవ్వడంగాని ప్రభుత్వం ‘సింగల్ విండో’ పద్ధతిలో చేపడితే, చాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అలాగే హోంలలో ఉండి నైపుణ్యాలని పెంచుకొనే ఆడవాళ్ళకి, తప్పనిసరిగా ప్రభుత్వ సంస్థలైన మహిళా ప్రాంగణాలు, ఐటిఐ మొదలైన సంస్థలలో ప్రాధాన్యం ప్రాతిపదికన సీట్లు కేటాయింపు జరగాలి అని వివరించారు.
ఆదిలాబాద్ నుండి వచ్చిన ఆర్. సురేందర్, మానవ అక్రమ రావాణా లేదా ట్రాఫికింగ్‌కు గురైన మహిళలు పిల్లలను హోంలలో ఉంచి రీహాబిలిటేషన్ చేసే క్రమంలో వస్తున్న ప్రాక్టికల్ సమస్యలని వివరంగా చెప్పారు. అనుక్షణం జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉన్న ఈ హోంలకు, ప్రభుత్వ అండ అరకొరా ఉండటమే కాక సిబ్బంది అతి తక్కువ జీతాలు, జిల్లాలలో సైకాలజిస్ట్‌ల కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వచ్చిన బాధిత మహిళల్లో కొంతమంది వారి కుటుంబాలని పోషిస్తున్నామని, కేవలం వారిని హోంలో పెట్టినంత మాత్రాన సరిపోదని తమ కుటుంబ గతి ఏమి కావాలని అడుగుతుంటే మా దగ్గిర సమాధానం లేదని చెప్పారు. అందుకే బాధిత స్త్రీలకి అందాల్సిన రిలీఫ్ రిహాబ్ ప్యాకేజి వెంటనే అందచేసి ఆమె శిక్షణ సమయంలో ఉండగా స్ట్తెఫెండ్ కల్పించాలని సూచించారు. ఎంతో కాలంగా అదే పనిని వృత్తిగా చేసిన మహిళలని 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా మార్చివేయటం అసాధ్యం అవుతుందని చెప్పారు.
సిఫార్ నుండి వచ్చిన సంతోషి మాట్లాడుతూ హోంలలో ఉండే మహిళలకి కొంత మందికి ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళని ఉంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో సుప్రీం కోర్ట్ వారు ఇచ్చిన రూలింగ్‌ను ఉటంకిస్తూ – ఒక కమిటీని వేసినట్లు, మైనర్‌లను వృత్తిలోకి రాకుండా నివారించాలని, వృత్తిలో నుండి బయటికి రావాలనుకునే వారికి పునరావాసం కల్పించాలని, ఉండి పోయేవారికి కనీస అవసరాలు కలుగచేయాలని సూచించినట్లు చెప్పారు.
లైట్ సంస్థ నుండి శ్యామల మాట్లాడుతూ సేఫ్ హోంల స్థితి మెరుగుపడే విధంగా, పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, దానికి గాను రాష్ట్ర స్థాయిలో ఒక వేదిక అవసరం అని చెప్పారు. పిల్లల హక్కుల కోసం పని చేసే క్రమంలో హోమ్‌లలో నెలకొన్న పరిస్థితులు బాగుపరచడానికి గతంలో అనేక నివేదికలు తయారుచేసి అనేక మంది ఆఫీసర్లని కలిసామని, అయినప్పటికీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పారు.
ఈ మధ్యనే కొత్తగా మానసిక వికలాంగులతో పనిచేస్తున్న సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి అంశానికి ప్రభుత్వ సహాయం అర్థించకుండా, దాతల సహాయంతో కూడా ఇలాంటి హోంలు నడపవచ్చని స్వీయ అనుభవం చెప్పారు.
ఎల్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ నుండి మంజుల మాట్లాడుతూ, హోమ్‌లు నడిపే అందరికి ఏదొక చేదు అనుభవం లేకపోదు. ఎవరి కష్టం వారిది లాగ మన మన స్థాయిల్లో సమస్యలకి పరిష్కారం వెతుకుతున్నాం కాని అందరం ఒకరికి ఒకరం అండగా నిలిచి హోంలలో ఉన్న బాధితుల తరపున నిలవాలని చెప్పారు. హోంలు నడిపే క్రమంలో కొన్ని సార్లు దాతలుగా ముందుకొచ్చి తర్వాత దౌర్జన్యాలకు కూడా దిగే మనుషులున్నారని తమ స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు.
డబ్లుసిడి నుండి డిఫ్యూటీ డెరెక్టర్ విశాలక్షి గారు మాట్లాడుతూ, ఇక్కడ చర్చిస్తున్న అనేక సమస్యలు డిపార్ట్మెంట్ దృష్టికి వస్తున్నాయని, కావాల్సిన పరిష్కారాలకి సూచనలు ఇవ్వాలని, ఇప్పుడున్న పై ఆఫీసర్లు అందరు సమస్యల పరిష్కారానికి సహకరించే వాళ్ళేనని హామీ ఇచ్చారు.
మొత్తంగా ప్రతినిధులు హోంలు నడపడం కు సంబంధించి సవాళ్ళు ఎదుర్కోవడం సహజమే అని నిర్ధారించారు. ప్రభుత్వ అధికారుల దృష్టి, పనివిధానం ఇన్స్ఫెక్షన్ పద్ధతిలో కాకుండా ఎవాల్యూషన్ పద్ధతిని ఆచరించాలని, హోంల నిర్వాకుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదని, రెగ్యులర్‌గా హోంలను సందర్శిస్తూ సూచనలు ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ సిబ్బంది – హోంలను నిర్వహించే వారు కలిసి : కౌన్సిలింగ్, హోం గుర్తింపు, ట్రాన్స్‌పెరెంసి (వనరులు, పనులు), కన్విర్జెన్సీ, ఇన్స్‌పెక్షన్ వెర్సెస్ ఎవాల్యుయేషన్, ఫండింగ్, లైవిలిహుడ్ లింకేజేస్, లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, మానసిక వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు హోంలు అంశాలపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు.
ఈ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి, తాత్కాలికంగా ఒక ఫోరం ఏర్పాటు దిశగా కొన్ని సంస్థలని గుర్తించి ”సాలిడారిటీ గ్రూప్ ఫర్ సేఫ్ హోమ్స్” అని పిలిచారు. బాధ్యత తీసుకున్న భాగస్వామిలు (ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం) : జుదీదితిజీబిళీ, జురీళీరిశిబి (బీళిదీతీరిజీళీ చేయాల్సి ఉంది), జుఆ ఖబినీరిజిబి రీబిళీబిశినీబి, ఔనీతిళీరిదిబి, ్పుఓజుష్ట్ర, స్త్రళిళిఖి ఐబిళీబిజీరిశిబిదీ, క్ప్పుుఇ, ఉ|స్త్రకఊ, ఉఐశ్రీ ఓళితిదీఖిబిశిరిళిదీ, ఖఖఈఐఐఐ, ఆజీబిదిజీతిశినీరి, ఐఇజుష్ట్రఈ.
ఎంతోకాలంగా చెప్పుకోడానికి వినేవాళ్ళు దొరకని బాధితలుకి తమ గోడు కలబోసుకొనే తోటి వాళ్ళు దొరికితే ఎంత సంబరమో, అంతటి ఉపశమనం దొరికినట్లు అనుభూతి చెందుతూ – ఒక చిన్న ఆశ, ఒకింత సంశయం, మరింత ఉత్సాహం నిండిన మోములతో ప్రతినిధులు ఒకరికొకరు అభివాదాలు తెలుపుతూ నిష్క్రమించారు.