జీవవైవిధ్యాన్ని కొల్ల గొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు

జి. రఘురామ్‌
జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు. గనులు తవ్వుకెళ్ళినంత తవ్వుకెళ్ళి ఇది అభివృద్ధని నమ్మమంటున్నారు. చేసిందంతా చేసి ఇంకా ఇంకా చేస్తూ దీనిని ఎలా అరికట్టాలో మాట్లాడుకుందాం రమ్మంటున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి 19 వరకూ హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సుకు బహుళజాతి సంస్థలతో తినమరిగి జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు నటించి సారాంశంలో చివరికి ఆయా దేశాల్లోని కంపెనీలతో, ప్రభుత్వాలతో సఖ్యత పొంది అంతా మనమంచికే, అంతా సుస్థిరమైన అభివృద్ధే అని పక్కకు వెళ్ళిపోయే లక్షలాది కంపెనీల ప్రతినిధుల నుంచి, హిట్‌మేన్‌ల నుంచి ఎన్నుకోబడ్డ 15 వేల మందితో ఈ సమావేశం జరుగుతుంది. 19 రోజుల ఈ జాతరకు ఖర్చు సమారు 500 కోట్ల రూపాయలు. దీని వెనుక యుఎన్‌ ఒది ప్రత్యక్ష పాత్ర అయితే బహుళ జాతి సంస్థలది పరోక్ష పాత్ర. వాస్తవానికి ఈ సదస్సుల వెనక చరిత్రను తిరగవేస్తే మనకు తవ్విన కొద్దీ అనేక వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. జరిగిన నష్టం వర్ణణాతీతంగా మన కళ్ళముందే సాక్షాత్కరించబడుతుంది. ఒకటికాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలాది ఎకరాల్లో అడవులకు, కొండలకు, సముద్ర తీరానికి, వన్య ప్రాణులకు, ఆదివాసులకు, అరుదైన జీవ వైవిధ్యానికి మన దేశంలో జరుగుతున్న నష్టం వర్ణణాతీతంగా ఉంది. ఈ సదస్సు గురించి మాట్లాడే వారంతా ముందుగా మన దేశంలో జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం గురించి తెలుసుకోవాలి.

ధరిత్రీ సదస్సుల చరిత్ర

2002లో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 14 వరకూ దక్షిణాఫ్రికా జోహెన్స్‌బర్గ్‌లో ధరిత్రీ సదస్సు జరిగింది. ఈ సమితి ప్రధాన నినాదం ”సుస్థిరమైన అభివృద్ధి” బహుళ జాతి సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దీనికి ముందు 1992లో రియో డి జనేరోలో ఒక సదస్సు జరిగింది. అయితే 2002లోని సుస్థిరమైన అభివృద్ధనే జోర్డాన్‌ డిక్లరేషన్‌ యుఎన్‌ఒ అనేక దేశాలతో నిర్వహించిన సభలు, సమావేశాల సారాంశం. అయితే ఈ పర్యాయం సుస్థిర అభివృద్ధి ఒక యాక్షన్‌ ప్లాన్‌గా ముందుకు వచ్చింది.

దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార ఒప్పందాలలో సుస్థిరత, ప్రజా సంక్షేమం అనే అంశాలు ఉండటం లేదని, అప్పుడే తెలుసుకున్నారో లేక దేశాల మధ్య జరుగుతున్న ఒడంబడికలలో భాగంగా వనరుల దోపిడీలో వేగం మందగించిందని తెలుసుకున్నారో తెలియదుగాని, ఇప్పుడు అనుకుంటున్న యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా దేశ ప్రభుత్వాలను పక్కన పెట్టి  బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, దేశాల్లోని స్థానిక ప్రభుత్వాలతో  వ్యాపార ఒడంబడికలు చేసుకుని జీవవైవిధ్యాన్ని కాపాడేటట్లు, ప్రకృతి వనరుల వినియోగం జరగాలని నిర్ణయించుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాంకులు కూడా ఈ ప్రతిపాదనకి సంశయంగానే తలూపాయి. ఎందుకంటే దొంగెవరైతేనేం, జరగాల్సింది వనరుల దోపిడీ. అది సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలతోనైనా, బహుళజాతి సంస్థల హిట్‌మేన్‌లతోనైనా పర్వాలేదు. చివరికి అందిపుచ్చుకునే ప్రధాన వాటాదారు అమెరికా ఈగల్‌ అయి ఉండాలి.

జీవ వైవిధ్య సదస్సుల నేపథ్యం

మనుషులకీ, జీవావరణ వనరుల రుజూ మధ్య సంబంధాన్ని, మత నమ్మకాలు, జీవన విధానాలు, సాంస్కృతిక ఆర్థిక అవస రాలు నిర్ణయిస్తాయి. ప్రజలు ఒక ఉమ్మడి ఆలోచనా జ్ఞానంతో ప్రకృతి వనరులకీ, జీవావరణానికి, సామాజిక అవసరాలకీ మధ్య ఒక సమతుల్యం ఉండాలనే జాగ్రత్తతో, అదే సమయంలో ప్రజల సామాజిక అవసరాలు తీరాలనే సంకల్పంతో, ప్రకృతి వనరులు తిరిగి తిరిగి ఉత్పత్తి అవ్వాలనే లక్ష్యంతో ఈ ధరిత్రిని వినియోగించడం జరుగుతుంది. ఆ రకంగా మనం ప్రకృతికి ఒక రక్షణ కవచం తొడుగుతాం. దీనికి కారణం సమగ్రమైన అంతః సంబంధాలతో ఒకదానిపై ఒకటి ఆధారపడే వ్యవస్థలతో మనం నివసించడానికి వీలుగా ఉన్న భూమే మన గృహం. దీంట్లో ఏ వ్యవస్థ పాడైనా మొత్తం నాశనమవుతుంది. కాని ప్రస్తుతం సహజ సిద్ధమైన, స్వాభావికమైన ప్రయోజనాల కోసం, ప్రకృతి వనరుల ధ్వంస రచన సాగుతోంది. పర్యవసానంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది.

జీవ వైవిధ్య సదస్సు వెనక ఉన్న నేపథ్యం ఇది. అందుకే 1992 జీవ వైవిధ్య సదస్సులో ఈ క్రింది విధంగా ఎర్రజెండాను నిర్ణయించుకున్నారు. మనుషులు సుస్థిర అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని, ప్రతి దేశం తన స్వంత నిర్ణయాలతో, స్వయం ప్రతిపత్తితో తమ భూభాగంలోని వనరులపై ఆధిపత్యం వహించాలని, ప్రకృతి వనరులను వినియోగించుకోవడంలో సాగే అభివృద్ధి భవిష్యత్తు తరాల అవసరాలను కూడా తీర్చేదిగా ఉండాలని, సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ, జీవ వైవిధ్య సంరక్షణ ఒక ప్రధాన అంశంగా ఉండాలని, ప్రజల జీవన స్థాయిలోని హెచ్చుతగ్గుల వ్యత్యాసాన్ని నివారిస్తూ అత్యధిక శాతం ప్రజల అవసరాలను శ్రేష్ఠమైన స్థాయిలో తీర్చేదిగా అభివృద్ధి సాగాలని, అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందుతున్న, ప్రధానంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న దేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సుస్థిర అభివృద్ధి సాధించడానికి విధ్వంసకర ప్రకృతి వనరుల దోపిడీని ప్రతి దేశం అరికట్టాలని, ఉత్పత్తి, వినియోగం, పర్యావరణ సమతుల్యం, దెబ్బ తినకుండా సాగేటట్లు ప్రభుత్వాలు చూడాలని, క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రతి దేశంలో పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి పౌరుల, ప్రజల భాగస్వామ్యాన్ని అనుమతించాలని, దీనికోసం ప్రభుత్వాలు అనేక పర్యావరణ చట్టాలు తీసుకువచ్చి. వాటిని పటిష్టంగా అమలు చేయాలని, వాణిజ్య వ్యాపార వేత్తలు మద్యవర్తిత్వం వహిస్తూ, ఏకపక్షంగా పక్షపాత ధోరణితో, మోసపూరితంగా అంతర్జాతీయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించకూడదని, ప్రభుత్వాలు పర్యావరణ కాలుష్యానికి అభివృద్ధి పేరిట జరిగే విస్థాపనకి ప్రజలు గురైతే సరైన ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తూ, నష్ట పరిహారాన్ని చెల్లించాలని, అందుకు తగ్గ చట్టాలను చేయాలని స్వదేశీయులైన, ప్రధానంగా మూలవాసుల, ప్రాంతీయ వాసుల సమూహాల సాంప్రదాయ, ఆచార, వ్యవహారాలను, జీవవైవిధ్యాన్నీ, వారు రక్షించే సాంప్రదాయ పద్ధతులను, ప్రభుత్వం గుర్తించి వారి పాత్రను ప్రోత్సహించాలని, వారి ఆస్తి అయిన సహజ వనరుల దోపిడిని, వారిపై ఆధిపత్యాన్ని, అణిచివేతను, ఆక్రమణని అరికట్టాలని, శాంతి, అభివృద్ధి, పర్యావరణ రక్షణ సమతుల్యం, జీవావరణ వైవిధ్యం, దాని రక్షణ ఇవన్నీ విడదీయ వీలులేకుండా ఒకదానితో ఒకటి సంబంధంలో ఉన్న విషయాలనీ, ప్రజల యొక్క అన్ని పర్యావరణ సమస్యలనీ, వివాదాలనీ సామరస్యంగా పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని పరిష్కరించాలని, ఇంక అడవుల నరికివేతను ఆపాలని, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడాలని, అడవుల పరిరక్షణకై, కరువుకు వ్యతిరేకంగా పోరాడాలని, పర్వతాలను, భూమిని, సముద్రాన్ని, నదులని, జలపాతాలని, అన్ని నీటి వనరులని, వీటన్నింటిలోని జీవావరణ వ్యవస్థలను పరిరక్షించుకోవాలని, మంచినీటి వనరులను, భూ అంతర్భాగంలోని జలధారలను రక్షించుకోవాలని, ప్రధానంగా చిత్తడి నేలలను, బీల భూములను, మడ అడవులను పరిరక్షించాలని, ఔషద మొక్కలను పరిరక్షించుకోవాలని, వన్యప్రాణులు అంతరించిపోకుండా చూడాలని, క్రిమి సంహారక మందులు ఉత్పత్తిని పర్యావరణ సమతుల్యానికి అనుగుణంగా నియంత్రించాలని, ఉత్పత్తి చేయాలని మహిళల, పిల్లల, ఆదివాసుల, స్థానికుల సుస్థిర అభివృద్ధి సాధించాలని…. ఇలా ఎన్నో విషయాలని వాళ్ళ సమితి ముందుమాటలో రాసుకున్నారు. వీటన్నింటినీ లక్ష్యాలుగా పేర్కొన్నారు. వీటన్నింటినీ సాధించడానికి కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు.

అడవుల ధ్వంసంతో నష్టం వర్ణనాతీతం

ప్రపంచ వ్యాప్తంగా అడవులను, ఖనిజాల తవ్వకాల కోసం ప్రధానంగా బొగ్గు కోసం పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారు. కాదు మాయం చేస్తున్నారు. ఈ వినాశనం ఎంత దూరం వెళ్ళిందంటే ధరిత్రి 5వ సారి ఎప్పుడూ లేనంతగా జీవులు వాటి జాతులు అంతరించిపోయే ఉపద్రవాన్ని ఎదుర్కొంటుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించే స్థాయికి చేరుకుంది. అంతకుముందు మంచుయుగాల వల్ల, అగ్ని పర్వతాల వల్ల, భూకంపాల వల్ల, ఉల్కాపాతాల వల్ల కొన్ని జాతులు అంతరించిపోతే ప్రస్తుతం మానవ తప్పిదాల వల్ల, ప్రపంచీకరణ, బహుళజాతి సంస్థల లాభాపేక్ష వల్ల జీవులు అంతరించిపోయే విపత్కర పరిస్థితి ఏర్పడింది. గ్రీన్‌ హౌస్‌ని నాశనం చేసే వాయువులు 50 ఏళ్ళలో రెట్టింపు అవుతాయని, 20 శాతం వెన్నుముక ఉన్న జీవులు అంతరించిపోడానికి దగ్గరవుతున్నాయని, ప్రవాళ దీవులు అంటే సముద్రాలలో జలచరాల కళేబరాలతో ఏర్పడ్డ దీవులు (కోరల్‌రీప్స్‌). 1980 నుండి ఇప్పటి వరకూ 38 శాతం అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది అడవులపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. 40 కోట్ల మందికి పైగా ప్రజలు అడవులనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నారు. తేనె, ఔషద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, పళ్ళు, ఫలాలు, దుంపలు ఇలా చెప్పలేనన్ని సుమారు 5000పై చిలుకు వాణిజ్య జీవావరణ ఉత్పత్తుల అడవుల నుంచి లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వెలకట్టలేని ఓజోన్‌ (ఒ3) అడవుల నుంచే అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని మనం ఏ దేశ మారకంలో కొనగలం? కాని గడిచిన 20 ఏళ్ళలో బహుళజాతి సంస్థల అత్యాశ వల్ల అనేక దేశాల్లో అడవులు బత్తాయి పండుపై తొక్క తీసిన చందంగా నాశనమవుతున్నాయి. గత 14 సంవత్సరాలలో 4 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి భూమ్మీద మాయమైపోయింది. 20 ఏళ్ళలో 35 శాతం మడ అడవులు మాయమైపోయాయి.

ఎందుకింత విధ్వంసం జరుగుతోంది

వేగంగా ఉత్పత్తిని పెంచి ఎవరికి పంచుతున్నారు? ఎవరి పక్షాన అభివృద్ధి ఏ దేశంలోనైనా జరుగుతోంది? బహుళజాతి సంస్థల అత్యాశ ప్రపంచాన్ని రెండుగా చీల్చుతోంది. అమెరికా, యూరప్‌ దేశాల ప్రజలను వాడుకుని విడిచిపెట్టే (యూజ్‌ అండ్‌ త్రో) వినియోగదారులుగాను, దక్షిణాది దేశాలైన ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు ప్రకృతి వనరులను దారుణంగా కోల్పోతూ పర్యావరణ భౌగోళిక సమస్యలతో, పేదరికంతో కొట్టుమిట్టాడే ప్రజలుగా చీలిపోతున్నారు.

ఇదే రకంగా ప్రకృతి వనరులను దోచుకుంటే 2015 కల్లా పది మిలియన్లు అంటే ఒక కోటి వృక్ష, జంతు జాతులు నాశనమౌతాయని, ఇవి జీవావరణంలో 20 శాతం వరకూ ఉంటాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. 1992 ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం 1990 వరకూ అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ రక్షణ కోసం 75,000 నుండి లక్ష కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టాలని తెలియజేసింది. ఈ విషయాన్ని రియోడిజ నెరో సదస్సు కూడా నిర్ధారించింది. ఈ మొత్తం అభివృద్ధి చెందిన దేశాల్లోని స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి) 1.5 నుంచి 2.5 శాతం మాత్రమే కాని     అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణం కోసం ఖర్చు పెట్టడం అనే విషయాన్ని పక్కకు ఉంచితే అమెరికా, బ్రిటన్‌లు రియోడిజనీరోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఖర్చులకివ్వాల్సిన 0.7 శాతం సొమ్మును కూడా ఈ సదస్సు నిర్వాహకులు వసూలు చేయలేకపోయారు. కాని అభివృద్ధి చెందిన దేశాల మిలట్రీ ఖర్చు వారి జిడిపిలో 15 నుంచి 20 శాతం వరకూ ఉంది.

పర్యావరణ పరిరక్షణ కోసం చేయాల్సిన ఖర్చుని ఈ దేశాలు చేయకపోయినా మూడు నుంచి నాలుగు బిలియన్‌ డాలర్లను గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ (జిఇఎఫ్‌) పేరిట పెద్ద దేశాలు ప్రపంచ బ్యాంకు దగ్గర తనఖా పెట్టాయి. ఆ డబ్బుని దొంగదారిలో రాయితీ పేరుతో జి 7 దేశాలకు రకరకాల పర్యావరణ విధ్వంసకర ప్రాజెక్టులకు తరలించారు. ఆ డబ్బు సహాయంతోనే నేపాల్‌లో అరుణ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అక్కడే కాక ప్రపంచ బ్యాంకు విశ్యవ్యాప్తంగా హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌కి, రహదారులకు, భవనాలకు, కోలనైజేషన్‌ ప్రాజెక్టులకు లక్షలాది డాలర్ల రూపాయలను కేటాయించింది. ఇదంతా మౌలిక సదుపాయాల పేరిట పర్వావరణ పరిరక్షణ సూత్రాలను పాటించకుండా జరిగిన నిర్మాణాలకు మళ్ళించింది. ఫిలిప్పైన్స్‌, భారత దేశం, ఆమేజోనియా లాంటి చోట్ల ఈ ఖర్చు కొనసాగింది. ఈ విషయాలేవీ ధరిత్రీ సదస్సులో చర్చించలేదు. కనీసం వాటిపై దృష్టి పెట్టలేదు. సార్దర్‌ సరోవర్‌ డామ్‌ నర్మదా నదిపై నిర్మించినప్పుడు 2,40,000 మంది ఆదివాసుల గ్రామాలను కాళీ చేయించారు. వేల గ్రామాలు నీట మునిగిపోయాయి. ఈ జలశయానికి ప్రపంచ బ్యాంకే ఫైనాన్షియర్‌గా ఉంది. ధరిత్రీ సదస్సులు 1992, 2002, ఇప్పుడు 2012 జరుగుతోంది. ఎక్కడైనా విధ్వంసకరమైన ప్రాజెక్టులు ఆగాయా? చైనాలోని త్రీ గోడ్జస్‌ సంగతేంటి. ప్రస్తుతం మన గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు మాటేమిటి?

పోలవరం ఆనకట్ట వల్ల మూడు లక్షల మందికి పైగా ఆదివాసులు తమ ఆవాసాలను కోల్పోతున్నారు. వందలాది వృక్ష జాతులు అంతరించిపోతాయి. అరుదైన జీవావరణం, వన్య ప్రాణులు విలుప్తమవుతాయి. కొన్ని ఆదివాసీ తెగలకు ముప్పు ఏర్పడుతుంది.

నిజానికి 1992 ధరిత్రీ సదస్సు తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకులు మరింత దూకుడుగా దక్షిణాది దేశాల్లో లక్షల కోట్ల డాలర్లు అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని ధ్వంసం చేసే, జీవ వైవిధ్యాన్ని కాల రాసే, ఆదివాసీ తెగలని విచ్చిన్నం చేసే అనేక ప్రాజెక్టులకి అనుమతిలిచ్చి, డబ్బు సహాయం చేస్తున్నాయి. బోగ్గును ఉత్పత్తి చేయడానికి 2017 వరకూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతించింది. మధ్య భారతంలోని 40 గనుల్లోని 13 గనులు దట్టమైన అటవీ ప్రాంతమే. దీంట్లో 1,40,000 హెక్టార్లు పులుల ఆవాసం. 60 వేల హెక్టార్లు కేవలం ఏనుగుల ఆవాసం. 2.5 లక్షల హెక్టార్లు చిరుతలు, తోడేళ్ళు, నక్కలు ఇంకా ఇతర జంతువుల ఆవాసాలు. ప్రస్తుతం వీటన్నింటికీ బొగ్గు తవ్వకాల వల్ల పెను ప్రమాదం ఏర్పడింది. ఈ 13 బొగ్గుగనుల ప్రాంతంలో పది లక్షల హెక్టార్ల అడవి ఉంది. ఇది అయిదు మెట్రో పాలిటన్‌ సిటీలు (ముంబాయి, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బెంగుళూర్‌)ల వైశాల్యానికి సమానం. మొత్తం భారత దేశంలో కోల్‌ ఇండియా గనులు 80 శాతం అయితే, జిందాల్‌, ఆదానిపవర్‌, టాటా, ఎస్సార్‌ లాంటి ప్రైవేట్‌ సంస్థల గనులు 20 శాతం వరకూ ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేట్‌ కంపెనీలకు గనులు కేటాయించడమే కాకుండా, తన గనుల నుంచి ఛిద్రమవ్వడం, ఆదివాసుల ఆవాసాలు కోల్పోవడమే కాదు, ఎన్నో సెలయేర్లు, నదులు ఇంకిపోతున్నాయి, కొన్ని దారి మళ్లుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రణాళికా సంఘం 2030-2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1475 నుండి 1660 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గు కన్నా రెండింతల ఉత్పత్తి. అంటే ఆ మేరకు మనకు సమీప భవిష్యత్తులో రాబోయే నష్టం ఎంతో అంచనా వేయండి.

పెద్ద మొత్తంలో ఖనిజాల తవ్వకం కూడా అడవి నాశనమవ్వడానికి ప్రధాన కారణం, దీని కోసం లక్షల సంఖ్యలో ఆదివాసులు అడవి నుంచి గెంటివేయబడుతున్నారు. మధ్య భారతదేశ అడవులు లక్షలాది ఆదివాసుల ఆవాస ప్రాంతాలు. ప్రధాన నదులు ఇక్కడే పుట్టాయి. మహానది, తపతి, నర్మద, ఇంద్రావతి, గోదావరి, మహానది, దామోదర తదితర నదులకు మధ్య భారతదేశమే పుట్టినిల్లు. ఇప్పుడీ అడవుల చుట్టూ ఉన్న జీవావరణ వైవిధ్యం గనుల తవ్వకాల వల్ల నాశనమవుతోంది. విపరీతమైన వేగంతో బహుళ జాతి సంస్థల ప్రయోజనం కోసం జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 2002 నుండి 2010 వరకూ 4,00,687 హెక్టార్ల అడవిని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ గనుల తవ్వకం కోసం, అడవి నుండి విడగొట్టి విద్యుత్తు ప్రాజెక్టుల కోసం బొగ్గు తవ్వడానికి కేటాయించింది.

ముందు చెప్పినట్లు భారత ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం అడవి 78 మిలియన్ల హెక్టార్లనే లెక్క అంత నమ్మసఖ్యంగా లేదు. ఎందుకంటే భారత దేశం ఇప్పటికీ 70 శాతం తన సహజసిద్ధమైన అడవిని కోల్పోయింది. ప్రస్తుతం 1.5 శాతం నుండి 2.7 శాతం ప్రతి సంవత్సరం సహజమైన అడవుల్ని కోల్పోతుంది.

గనుల తవ్వకాలు జరిగిన చోట్ల తిరిగి చెట్లు నాటి అడవిని పెంచడం అక్కడక్కడా జరుగుతుంది. కాని ఇది ఎంత కృత్రిమంగా ఉంటుందంటే ఏమాత్రం వైవిధ్యం లేకుండా వేగంగా పెరిగే యూకలిప్టస్‌, అకేసియా, రబ్బర్‌, పైన్‌, టేకు చెట్లతో నింపేస్తారు. ఇది అక్కడి పూర్వపు జీవవైవిధ్యాన్ని తీసుకురాలేవు.

అందుకే 1905 నుండి 2005 వరకూ జరిగిన సర్వేలో కార్బన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌ 138 మెట్రిక్‌ టన్నులు పెరిగింది. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం భారత దేశం 267.21 బిలియన్‌ టన్నుల బొగ్గు వనరులు కలిగి ఉంది. అయితే దీంట్లో 106 బిలియన్‌ టన్నుల బొగ్గు మాత్రమే కనుగొనబడింది. దీంట్లో 71 బిలియన్‌ టన్నులు తవ్వి తీయడానికి ఎంచుకున్నారు. రాబోయే 40 ఏళ్ళలో మొత్తం బొగ్గుని తవ్వి వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ఒక వార్త. అదే నిజమైతే మన జీవ వైవిధ్యం, అడవులు ఏమవుతాయో ఊహించవచ్చు. ప్రపంచ పటంలో భారత దేశ చిత్రపటం ఉంటుందా. ఉన్నా దాంట్లో జీవ వైవిధ్యం ఉంటుందా? మనం జీవించగలమా? ఊహించవచ్చు. ( గ్రీన్‌ క్లైమెట్‌ మేగజైన్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.