ఏగులు వారంగ
కల్లాపు సల్లుతాంటే
వంగి ముగ్గెత్తాంటె
మంచిగున్నది మంచిగున్నదని
ఎదురింటి మామ అంటాంటే
నా ముగ్గు మంచిగున్నదన్నడనుకున్న గాని
వంగినపుడు కనబడీ కనబడని వయసందాలనన్నడనుకోలె
మంచిల్ల బాయికాడ
జర్రున బక్కీట బాయిలేషి తాడుగుంజుతాంటె
జరన్ని నీళ్ళు దూపబోయరాదె పోరీ అని
జాలట్ల నిలుసుని తాత వరసయ్యే జంపయ్య అడిగితే
మంచిళ్ళు గుట్క మింగుతాండనుకున్న గాని
మనిషినే అమాంతం కండ్లతోని మింగుతాండనుకోలె..
పొయ్యిల కట్టెలు దేను పొరుగూరు దాకబోయి
పొతంగ కట్టుకున్న తుమ్మ కట్టెల మోపున
జరంత సాయంబట్టని సాయన్న నడిగితే
ఎత్తినట్టే ఎత్తి ఎదకు షెయ్యి తాకిత్తే
సూడక తగిలిందనుకున్న గాని కావాలని షేషిండనూకోలె
ఆపతేల అత్తమ్మ కొడుకును
ఐదో పదో అడ్కరాపో బిడ్డ ఆసుపత్రికి పోవాలని
అమ్మ పంపితే మనోడే గదాని నడింట్లదాక పోంగనే
నడుం చుట్టూ షెయ్యేసి నలిపేసేదాక తెల్వలే
ఆడు పేరుకు తగ్గట్టు మాటేసిన నాగరాజేనని
వయసుకొచ్చినంక అమ్మ జాగ్రత్త చెబుతాంటే
అసలెందుకో ఈ ఎత్తుపల్లాలు స్త్రీకి అర్ధంకాలే
ఐనా అయ్యలారా… అవ్వలారా
సేతులెత్తి శనార్తులు సేసుకుంట అడుగుతానా
ఆడపిల్లంటే అంతలోకువెట్లైంది
జాగ్రత్తా… జాగ్రత్తా అని చెప్పబట్టేగా ఈ బలహీనత స్త్రీకి
నువు మొగోడివిరా అని నువ్వెక్కించిన బత్తీ కదా ఆడికి
పెంచెటప్పుడే ఆడపిల్ల అగ్గనీ
ముట్టుకుంటే అంతా బొగ్గేనని
ఆడికి చెప్పి పెంచితే…
ఇంతటి ఘోరకలి జరిగేనా
అకృత్యాలు ఆగక మానునా!!