అవును… రాధికా…!
మన మెదడు మనకే శత్రువు
కాదని చెప్పను… కానీ…
నువ్వు మరోసారి
ఆలోచించాల్సింది రాధికా…!
జీవితం ఎవరికి
వడ్డించిన విస్తరో చెప్పు?
తొమ్మిది నెలలు మనల్ని
మోయటం వెనుక… అమ్మ
ఎంతటి నరకయాతనని అనుభవించిందో తెలియదా?
కుటుంబ వ్యవస్థలో…
ఎంతమంది తండ్రులు
తమ బాధ్యత బరువులు మోస్తున్నారో చూపూ?
ఒక్క హేళన లేకుండా
ఏ స్త్రీ ఐనా గౌరవం పొందగల్గిందో చెప్పగలవా?
అంతెందుకు… ఏ ప్రాణికి
కష్టాలు లేవో
కాస్త ఆలోచించాల్సింది?
బుద్ధుడైనా మరే దేవుడైనా
అమ్మ లేకుండా పుట్టాడా?
ఎవ్వరైనా…
ఆ ఉమ్మ నీటిలో
ఈదేగా బయటపడేది?
విరిగిన వస్తువును సైతం ఆర్తితో దాచుకుంటాం
అలాంటిది జీవితం
అర్థంతరంగా విసిరివేయడానికి నీకు
మనసెలా వచ్చిందో చెప్పు?
పొరపాటు వేరు…
తప్పులు వేరు రాధికా…!
వేటికైనా మూలాలుంటాయిగా
సరిదిద్దుకోలేని వారిని వదిలించుకోవటమేగా మార్గం
నువ్వు చేసిందీ అదేగా?
జీవితమంటే జీవించటం
అంతేకాని… అర్దంతరంగా
కృంగి కృశించటం కాదు కదా!
మనిషికి అవయవంలా
పెండ్లీ ఓ భాగమే…!
లాస్ట్ బస్సు స్టాపు మనది కానప్పుడు
మన స్టేజీలో మనం
దిగి పోవాల్సిందే కదా…!
నమ్మక ద్రోహం ఎదురైతే
జీవించటం ఆపేస్తే ఎలా చెప్పు?
అంతకన్నా ఉత్కృష్టం
మరేం ఉంటుందో చెప్పు?
పిల్లల ఆలనా పాలనా చూడడానికి… మనమేమైనా
సమాన హక్కులు సాధించామా చెప్పు;
ఏ కుటుంబంలో…
ఏ పురుషుడు ముందుకొస్తాడు చెప్పు?
నువ్వు స్వార్ధంగా ఆలోచించావు రాధిక…!
పసి మొగ్గలను కోస్తేనే
తల్లడిల్లే మనం…
పసితనాన్నే పులుముకొచ్చిన
ఆ అమాయక మొహం కన్నా
ఆవేదనకు లొంగిపోవటం అంత అవసరమా?
దుఃఖతెరలు కప్పినప్పుడు
మనల్ని ఒడుపుగా బయటకేసే
స్నేహపు దారులను చూడాలి కదా!
అయినా నీడను చూస్తూ
పిరికివాళ్ళు పారిపోతారంటారు…
నిజానికి అది అబద్ధం
సహానుభూతి లేని వ్యవస్థలో
పిరికివాళ్ళే… ధైర్యవంతులై
జీవితాన్ని వదిలి వెళ్ళిపోతారు
దట్టమైన చీకటి వలయంలో చిక్కి
కాలగమనంలో కనుమరుగై
దాగని కన్నీళ్ళై జారిపడిపోతారు
ఆత్మగౌరవం ముందు…
ఎవరమైనా ఒకటే… రాధిక!
నువ్విప్పుడు… మా అందరినీ
క్షమించాల్సిందే తప్పదు… రాధిక!