సమాజంలో ఎవరైనా, ఏదైనా మంచి చేస్తే దాన్ని స్వీకరిస్తూ సమాజంలో ఎవరు ఏ చెడు చేసినా దాన్ని వ్యతిరేకిస్తూ తాను అట్టడుగు సమూహాల కోసం నిలబడి సుదీర్ఘమైన యుద్ధం చేసిన వ్యక్తి రచయిత్రి మహాశ్వేతాదేవి.
ప్రజా ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందాల్సిన సేవలు, దక్కాల్సిన లబ్దిలు, చెందాల్సిన సంక్షేమం గురించి ఆమె పట్టించుకున్నారు. చట్ట వ్యతిరేకంగా నేరాలు జరిగితే ఆమె చట్టంతో పోరాటం చేశారు.
1989లో నెహ్రు బాల పుస్తకాలయం ద్వారా ఆమె రాసిన ‘ఎతోవా పోరాటం గెలిచాడు’ అనే 64 పుటల పుస్తకం ప్రచురించబడింది. సహజంగా అది ఆదివాసీ బాలుని కథ.
ఒక పదేళ్ళ అతి పేదవాడైన ఆదివాసీ బాలుడు చేసిన పోరాటం ఏమిటి? అది ఎలా గెలిచాడు? అడవిని తల్లిలా భావించే ఆదివాసులు అడవికెట్లా దూరమయ్యారు. నీటిలోంచి నేలమీదకి విసిరేయబడిన చేపలు గిలగిలా కొట్టుకుంటూ బతకడం జరుగుతుందా?
ఆదివారం రోజున పుట్టాడు కాబట్టి ఎతోవా అని పేరు పెట్టారు ఆ బాలునికి. (ఎతోవా అంటే ఆదివారం వాళ్ళ భాషలో). ఆదివాసులు పిల్లలు పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఎతోవా అని పేరు పెట్టింది అతని తాత మంగళ్‌ముందా. కలకత్తాకు చాల దూరంలో ఉంటుంది ‘హాథీఘర్’ అనే వీళ్ళ ఊరు. హాథీఘర్ అంటే ఏనుగుల ఇల్లు అని అర్థం. అయితే ఆ ఊళ్ళో ఏనుగులు కనిపించవు. ఆ ఊరి భూస్వామి మోతీబాబు పూర్వీకులు పెద్ద పెద్ద సాలలు కట్టించి వాటిల్లో ఏనుగులను ఉంచేవారు. ఇప్పుడా సాలల్లో వరి, గోధుమ ఇతర ధాన్యాలను నిలువ చేస్తున్నారు.
ఈ హాథీఘర్ ఒకప్పుడు ఆదిమజాతికి చెందిన వారిదనీ ఊరి పేరు ‘సాల్ గేర్యా’ అని, ఊరు చుట్టూ సాల వృక్షాలు కాపలా వాళ్ళలా ఉండేవని ఎతోవా తాత అంటాడు.
”జమీందారీ బాబులు ప్రవేశించి మన ఆదివాసుల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి” అని ఆ ఊరి పేరు ఎందుకు మార్చారని అడిగిన ఎతోవాకు చెప్తాడు మంగళ్‌ముందా తాత.
… … …
చదువులు లేకపోవడం వల్ల కోర్టులు, చట్టాలు తెలియకపోవడం వల్ల మనం నష్టపోయాం అని కూడా ఎతోవా అడిగిన ప్రశ్నలకు జవాబుగా చెప్తాడు తాత.
వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయ్యి పున్నములూ, అమావాస్యలూ గడిచాయని ఇంగ్లీష్ వాళ్ళమీద యుద్ధం చేసేందుకు సిద్ధూ, కన్హూ అనే సంతాల్‌లు కొండ జాతుల సేనలను ముందుకు నడిపించిన కాలంలో వీళ్ళ పూర్వీకులు వాళ్ళ భూముల్ని ఒదిలి వచ్చేశారనీ… ఆ ఘోర యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి అందరూ తప్పించుకొని దేశమంతా చిందర ఒందరగా అయిపోయారనీ కొందరు ఇక్కడికొచ్చి అడవిని బాగుచేసుకొని ఊరిలా నివాసయోగ్యం చేసుకొని స్థిరపడ్డారనీ ఎతోవాకు చెప్తాడు తాత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందా జాతివాళ్ళు – కొండజాతి వాళ్ళు బలవంతంగా అనివార్యంగా తప్ప వారి వారి తావుల్నీ, భూముల్నీ ఒదిలి ఎందుకు పారిపోతారు అని తాత ఉక్రోశం.
అదొక బలవంతపు వలసకు సంబంధించిన బాధాకరమైన చరిత్ర అయితే మళ్ళీ కొన్నేళ్ళ తరువాత బీర్సాముందా ముందా జాతివాళ్ళను కూడగట్టి ఇంగ్లీష్ వాళ్ళతో తలపడ్డాడు. ముందాలవి కేవలం బాణాలు, వాళ్ళవి తుపాకి గుళ్ళు. ఓడిన ముందాలు ఒరిస్సా, బీహారు, బెంగాలు, అస్సాం రాష్ట్రాల్లోకి పారిపోయి అడవి ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇది రెండో వలసకు సంబంధించిన ఆదివాసుల ఓటమి చరిత్ర.
అడివే ఆదివాసుల తల్లి. ఒక అడవి, ఒక నది ఇవి చాలు ఆదివాసులు బ్రతకడానికి. అడివిని నాశనం చేసేది ఆదివాసులు కాదు. అడవి సంపద మీద చెడు కన్నేసిన బాబులూ, జమీందారులూ, కాంట్రాక్టర్లు. ఎవరూ తన ఇంటిని తగులబెట్టుకోరు, తను తినే తిండిలో విషం కలుపుకోరు. ఆ పనులన్నీ చేసేది భూస్వాములూ, దొరలే.
… … …
ఎతోవా తల్లిదండ్రులు ఏమయ్యారు? పట్టణంలో నివసించే భూస్వామి కనకబాయి పొలాల్లో పనిచేస్తూ డబ్బుకు బదులుగా కోతల రోజుల్లో ధాన్యం తీసుకునేవాళ్ళు. హాథీఘర్‌కు చెందిన సంతాల్‌లు, ముందాలు, లోథాలు ఈ విధంగా జీవనోపాధి కల్పించుకునేవాళ్ళు.
ఆ సంవత్సరం కనకబాబు పంట చేతికొచ్చే సమయానికి ఈ పనివాళ్ళకు తెలియకుండా భూమిని అమ్మేస్తాడు. కొత్త యజమాని తన సొంత పనివాళ్ళకు కోతల పని అప్పగించాడు.
చాంద్‌ముర్మా అనే సంతాల్ యువకుడు ఇదేం అన్యాయం అని ప్రశ్నించాడు. అక్కడ పెద్ద అలజడి చెలరేగింది. పోలీసులు వచ్చి 36 మంది హాథీఘర్ ఆదివాసులను అరెస్ట్ చేశారు.
కొందరు ఆదివాసులు కాలినడకన 26 మైళ్ళు నడిచి పట్టణానికి పోయి సంతాల్ జాతికి చెందిన ప్లీడర్ జైచంద్‌ను కలుసుకున్నారు. ఆయన చాలా ప్రయత్నం చేసి చాలా నెలల తరువాత ఆ 36 మంది ఆదివాసులన విడిపించాడు. వచ్చే దారిలో ఎతోవా తల్లిదండ్రులు ఏదో విషాహారం తినడం వల్ల గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చబడ్డారు. కానీ వాళ్ళు చనిపోయారు. ఎతోవా, అతని తాత అయినవాళ్ళను కోల్పోయిన అనాధలయ్యారు. ఇంతకీ వాళ్ళు జైలు నుండి వస్తూ ఉత్త చేతులతో ఇంటికి రావడం ఎందుకని ఒక ఇటుక బట్టీలో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదో కొనుక్కుని తిన్నారు. అవి కుళ్ళిపోయిన పండ్లో, బూజుపట్టిన మిఠాయో సరిగ్గా తెలియదు. ఫలితంగా అకారణంగా చనిపోయారు. ఎతోవా వయసు సంవత్సరం అప్పుడు.
వారి దారిద్య్రం అట్లాంటిది. ఎతోవాను ఎట్లా పెంచాలా అన్న దుఃఖంలో ఉన్నప్పుడు అందరిచేత పెద్దమ్మ అని పిలువబడే వృద్ధురాలు అలోమణి పిల్లవాడిని పెంచడానికి ముందుకొస్తే ఇస్తాడు తాత. కానీ మూడు రోజుల తర్వాత వాడికి తల్లినీ, తండ్రినీ నేనే అని పిల్లవాడిని తెచ్చేసుకుంటాడు.
తన కొడుకు బాబు దగ్గర చేసే పని నేను చేస్తానని ఎతోవాను భుజాల మీదేసుకుని పోయి అడుగుతాడు. ఎతోవా తండ్రిని కూడా బడికి పంపేవాడు మంగళ్. కానీ బాబు ఇచ్చే డబ్బులూ, గింజలూ తిండికి సరిపోక కొడుకును కూడా బడి మాన్పించి బాబు తమ్ముడి దూడల్ని మేపే పాలేరుగా అప్పగించవలసి వస్తుంది.
కొంత వాదన జరిగిన పిదప బాబు మంగళ్‌ను పనిలోకి రమ్మంటాడు. ఆదివాసుల్లో తల్లీదండ్రీ లేని పిల్లల్ని ఆ సంఘం వాళ్ళందరూ సంరక్షిస్తారు. చాంద్‌ముర్మా భార్య తన కొడుకు సింగ్‌రాయి, మేనల్లుడు రతన్‌తో పాటు ఎతోవాను తన మూడవ బిడ్డలా చూసుకుంటుంది. ఆ పిల్లలు ముగ్గురూ అన్నదమ్ముల్లా పెరుగుతారు.
ఎతోవాకు ఏడు సంవత్సరాలప్పుడు మంగళ్ వాడిని బడిలో చేరుస్తాడు. పెద్దబాబుల ఇండ్లలో పనికి పంపడం తప్ప ఈ పేద ఆదివాసులకు గత్యంతరం లేకుండా పోతుంది. కారణం దుర్భర దారిద్య్రం. మరో మార్గం లేదు, వారికి తెలియదు కూడా. తన కొడుకు పట్ల జరిగింది, తన మనుమని పట్ల జరగకూడదని మంగళ్ గాఢమైన కోరిక. చాలామంది ఆదివాసులకు తమ పిల్లల్ని చదివించాలని ఉండదు. ఉన్న కొద్ది మందికీ అది ఏ మాత్రం సాధ్యం కాదు.
ఎతోవా చదువు మొదలయ్యింది. స్కూల్లో దేశం గురించీ, మంచి పద్ధతులు, అలవాట్లు, విషయాలు నేర్పిస్తున్నారు. మంగళ్ ఎతోవాను స్కూలుకు పంపడం మోతీబాబుకు కంటగింపుగా ఉంటుంది. బడి నుండి వచ్చే దారిలో తనను అడ్డగించి కోపగించుకోవడం వంటివి చేస్తున్నాడని తాతకు చెప్పాడు ఎతోవా.
ఆదివాసుల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం వాళ్ళు ఉండే ప్రాంతాలలో పాఠశాలలు పెట్టింది. ఆదివాసులు చదవడం, రాయడం తప్పనిసరిగా నేర్చుకోవాలి అని గురూసింగ్ ప్రస్తావన తెస్తాడు.
ఎతోవాకు ఒంటిమీద ఒక ఖాకీ నిక్కరు తప్ప ఏమీ ఉండదు. ఎతోవా మిత్రులు సింగ్‌రాయి, రతన్‌లను కూడా బడికి పంపించమని పంతులు అన్నాడని ఎతోవా సుబర్‌ముర్మాతో చెప్తాడు. కానీ తాను మోతీబాబు యాభై ఆవులనూ, గేదెలనూ వాళ్ళద్దరి చేత మేపిస్తానని మాట ఇచ్చానని అంటాడు.
ఎన్నాళ్ళు మనకీ బానిసత్వమని మంగళ్ నిట్టూర్చాడు. వెట్టిచాకిరి! ప్రపంచమంతా ముందుకు పోతుంటే ఆదివాసీ పిల్లలు విద్యా వికాసం లేకుండా బాల్యం నుండే గొడ్డు చాకిరీ వెట్టి చాకిరీ చేయాలి.
ఎతోవాకు ప్రభుత్వ పుస్తకాలు అందేంతలో వేసవి సెలవులు మొదలయ్యాయి. మిత్రులతో కలిసి ఆటలకు పోయేవాడు ఎతోవా. ఇంకా తాతకు పనుల్లో సహాయం చేయాలనుకుంటాడు. శక్తులు ఉడిగిన తాతకు సహాయంగా మోతీబాబు పనిలోకి దిగాడు ఎతోవా.
ఒక నిముషమైనా ఎతోవాకు విశ్రాంతి ఉండదు. రాత్రి మిగిలిన అన్నం ముద్దలు తిని పొద్దున్నే మోతీబాబు ఇంటికి పోతాడు. ఇల్లూ, వాకిలీ, పెద్ద బంగళా అంతా ఊడ్చి బోర్‌బావి నీళ్ళు కొట్టి తోటను తడిపి ఆవులనూ, గేదెలనూ తీసుకొని పొలం దిక్కుపోతాడు.
అయితే ప్రతిరోజూ దారిలో బడి దగ్గర బడిపంతులు చెప్పే మాటలు వినేందుకు ఆగుతాడు. గతంలో జరిగిన పోరాటాలను పంతులు వర్ణిస్తూ చెప్తుంటాడు. ఎతోవా కూడా తాను సంత రోజుల్లో ఆ ప్రాంగణాలను శుభ్రం చేసి సంపాదించుకున్న ఒక గోనె సంచిని నింపేందుకు పోరాటం సాగిస్తుంటాడు. దులాంగు నదిలో ఆ గోనె సంచిని జాగ్రత్తగా కడుగుతాడు. అది వర్షాకాలంలో గొడుగులా, శీతాకాలంలో కంబళీలా పనికొస్తుంది. మంగళ్ తాత పాత గుడ్డలతో తయారుచేసిన అతుకుల బొంత కూడా ఉంటుంది వాళ్ళకు.
ఎతోవా చదువు ఆగిపోయింది. పదేళ్ళకే అతను ఒక భూస్వామి ఇంటి పనినీ, బయట పనినీ రెక్కలు విరుచుకొని చేస్తున్నాడు. మంగళ్‌కు పిల్లవాడి చదువు గురించి దిగులు, బానిస బతుకులు పోవాలని దిగులు.
… … …
ఎతోవా గొడ్లను కాస్తూ పుల్లలు విరుచుకొస్తాడు. దొరికితే ఆకుకూరలు, చేపలూ తెస్తాడు. పుల్లల్ని అమ్మి నూనె, ఉప్పు తెస్తాడు. మంగళ్ కొన్ని బియ్యపు గింజల్ని తెస్తాడు.
ఎతోవాకు ఏమీ తెలియకముందే తల్లిదండ్రులు చనిపోయారు. వాడికసలు ఆ లోటు తెలుసాని మంగళ్ తలపోస్తుంటాడు.
ఎతోవా చేసే పనిని మెచ్చుకుంటూ ఎప్పటికీ ఈ పనులు చేస్తే బట్టలు కొనిస్తానని, యువరాజులా బ్రతకొచ్చని మోతీబాబు ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఎతోవా అవి వినిపించుకోడు.
మంగళ్ ఎతోవాను ఆదివాసీ క్లబ్బు మీటింగ్‌కి రమ్మంటాడు. నీరసంగా అలిసిపోయి ఉన్న తాతతో నేను హైస్కూలుకు వెళ్ళి బడిపంతులు అయ్యేదాకా బతికి ఉండాలి నువ్వు అంటాడు ఎతోవా. వేసవి సెలవుల్లో 1855-56 సంవత్సరంలో జరిగిన సంతాలు తిరుగుబాటు స్మారక దినోత్సవంలా ‘సిద్ధూ-కన్హూ’ దినం పేరిట 30 జూన్‌న హాథీఘర్ ఆదివాసీ క్లబ్బు ఆటల పోటీలు ఏర్పాటు చేస్తుంది. నవంబరు 15న ముందాల మహానాయకుడు బిర్సాభగవాన్ జన్మదినోత్సవం జరుపుతారు. క్లబ్బుల్లో పుస్తకాలు, పత్రికలూ ఉంటాయి. క్యారమ్స్ ఆటలాంటివి ఉంటాయి.
పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు ఆటలు నేర్పుతారు. కసరత్తులు డ్రిల్లుల్లో శిక్షణ ఇస్తారు. ప్రహరాజసింగ్ ముందా సీనియర్ టీచర్. ఆయన లాల్‌చారీ గ్రామంలో ఆదివాసీలకు క్రీడల్లో పాల్గొనండి, బాగా చదువుకొండి, మీకు ఉద్యోగాలు దొరుకుతాయని ప్రోత్సహిస్తుంటాడు.
బీర్సా ముందా చిత్రపటం చూసి, ఆయనకు జోహార్లు పలికి, ఆయన మన కోసం మహా సంగ్రామం చేశాడు అని గర్వంతో
ఉప్పొంగుతాడు ఎతోవా. ఆ క్షణమే అతనికి తమ మట్టి గుడిసెలపైనా, అడవి మనుషులు అనిపించుకోవడం పైనా, చిరిగిన బట్టలపైనా ప్రశ్నలు తలెత్తుతాయి. దానికి పరిష్కారం సాధించాలన్న తలంపుతో అతని రక్తంతో దులాంగు, సువర్ణరేఖ నదులు ప్రవహిస్తున్నట్లనిపిస్తుంది.
ఆదివాసీల పిల్లలు ప్రభుత్వం వారి కోసం తెరిచిన పాఠశాలల్లోకి రాకపోతే ఆ బళ్ళను మూసివేస్తారు. ఆ పాఠశాలల కోసం వారెంతో పోరాడి గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేసేలా చేసుకున్నారు. ఆదివాసీల పిల్లలు బడికి వెళ్ళకపోతే పోరాడి తెచ్చుకున్నవి మూతబడిపోతాయి.
ఎతోవా ఇక దూడల కాపరిగా ఉండరాదని నిర్ణయించుకున్నాడు. ఆదివాసీలు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపాలని కూడబలుక్కున్నారు.
మోతీబాబుకు ఇక దూడల కాపర్లు పనిలోకి రారని తెలిసి కోపం వస్తుంది. మంగళ్ దగ్గరికి పోయి ఎతోవా పనికి రావడం మానేసాడేమని అడుగుతాడు. దానికి మంగళ్, వాడు ఇంక పనిచేయడని, బడికిపోతాడని చెప్తాడు. ప్రభుత్వం పుస్తకాలు, టిఫిన్లు, స్టైఫండు ఇస్తుంది, ఇంక ఒకళ్ళ దగ్గర బానిస పని ఎందుకు చేయాలంటాడు.
ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, వాడు మహారాజు, మహా మంత్రి అవుతాడా అని మోతీబాబు అంటే మంగళ్, ”లేదు బాబూ! వాడొక మానవుడు అవుతాడు. ఒక స్వేచ్ఛాజీవిననీ, మానవుడ్ని అని నిరూపించుకుంటాడు” అని ”గాలి ఇటు పక్క తిరిగింది, రోజులు మారాయి, అడవి మనుష్యులు ఐకమత్యం సాధించారని” అనగానే మోతీబాబు నోరు మూసుకుని ఇంటి ముఖం పడ్తాడు.
ఎతోవా బడిపంతులుకు ముల్లంగి దుంపనిస్తే దాన్ని స్వీకరిస్తాడు పంతులు. ఎతోవా నది ఒడ్డున ఇసుక తిప్పలపై పడుకొని ”అది ఎంత ఘోరమైన పోరాటమో నీకు తెలుసా?” అని ఆకాశాన్ని ప్రశ్నిస్తూ అతని ఆనందాన్ని నది, ఆకాశం, గడ్డి, పొలం, సమస్త ప్రకృతితో పంచుకుంటాడు. కానీ ఎతోవాకు తానొక గొప్ప బతుకు పోరాటంలో గెలిచానన్న విషయం తెలియదు.
బడిపంతులు ఎన్నోసార్లు బడికి రమ్మని పిలిచినా అది సాధ్యపడక పనిలోకి పోయిన ఎతోవా, తాత అలసట, తాత అనారోగ్యాలు చూసి ఆ పనిని తనమీదేసుకున్న ఎతోవా, చదువుకోవాలని ఉండీ చదువు కొనసాగించలేక బానిసత్వంలో దిగబడిపోయిన ఎతోవా, తన పూర్వీకుల గాథలు విని ఉత్తేజితుడై ప్రభుత్వం కల్పించిన సౌకర్యంతో బడికిపోయి చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివాసీలిప్పుడు భూస్వాములు, బాడాబాబుల బెదిరింపులకూ, ప్రలోభాలకూ లొంగి తరతరాల తమ బానిసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధంగా లేరు. తమ జాతి విముక్తి కోసం పోరాడిన వీరుల చరిత్ర వల్ల ధైర్యం తెచ్చుకుని చదువుకొని బాగుపడాలని అనుకుంటున్నారు.
బానిసత్వాన్ని, దారిద్య్రాన్ని తొలగించుకునే మార్గం లోకజ్ఞానం, విద్యాజ్ఞానం వల్ల సాధ్యమేనని వాళ్ళు బడిపంతుళ్ళ ద్వారా, తమ వారైన ఇతర విద్యావంతుల ద్వారా తెలుసుకున్నారు. ఎతోవా గెలిచిన పోరాట కథ ఇది.
రచయిత్రి ఈ కథలో ఆదివాసీల పండుగలు, వేడుకలు, వారి ఆచారాలు, తంతుల్ని సందర్భోచితంగా చిత్రించారు. ఎతోవా వాటిలో పాల్గొంటూ ఆస్వాదించడాన్ని సహజంగా దృశ్యీకరించారు. ”మన చరిత్ర మనకు తెలియకుండా మరో చరిత్ర సృష్టించలేము” అని డా. అంబేద్కర్ అన్నారు. ఎతోవా తన చరిత్ర తెలుసుకున్నాడు. మరో చరిత్ర రచనలో భాగస్వామ్యానికి సిద్ధమయ్యాడు.
మనమింకా ఎందరో ఎతోవాలు, సింగ్‌రాయ్‌లు, రతన్‌లు బానిసత్వం నుండి విముక్తి పొంది, చైతన్యం పొంది, బతుకు బాటను మార్చుకుని మానవుల్లా ఎదగాలని కోరుకుందాం. మహాశ్వేతాదేవి ఆకాంక్ష నెరవేరే మార్గానికి మద్దతుగా నిలబడదాం.