గత రెండు వారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సమాజాన్ని కుదిపేసిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ప్రజాస్వామ్య విలువల కోసం సినీ పరిశ్రమ నిలదీసింది. ఈ పరిశ్రమని స్త్రీలకనువయిన పనిస్థలంగా తయారుచెయ్యడానికి, అన్ని పని స్థలాల్లో జరిగే లైంగిక దోపిడీ / వేధింపుల గురించి చర్యలు తీసుకోవాలని గుర్తు చేసింది. ఆ క్రమంలో వచ్చిన అనేక అసంబద్ధ వాదనలని తోసిపుచ్చి సరైన ఆలోచనని ముందుకు తీసుకొచ్చింది. వివిధ మీడియాలలో (రొటీన్ బూతు స్పందనలని పక్కనబెడితే) జరిగిన చర్చలు, స్పందనల్లో వచ్చిన సరైన ఆలోచనని ఒక చోట కూరిస్తే అందరికీ కొంత ఉపయోగపడుతుందని మా ప్రయత్నం.
ఇటువంటి బట్టలిప్పి, అర్థనగ్న నిరసనతో మనం పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం?
చెడు ఆలోచనలు కాక? పెద్దవాళ్ళలాగా పిల్లలు శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా చూడరని అందరికీ తెలుసు. వారికి శరీరం ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ఒక పరికరం మాత్రమే. పెద్దవాళ్ళ పెత్తనం, అధికారం, దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయలేని అసహాయత అనుభవించే పిల్లలకి అధికారం లేని వాళ్ళ నిరసన బాగానే అర్ధమవుతుంది. శ్రీ రెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన గురించి వారికి తెలియటం చాలా మంచిది. ఎందుకంటే, చిన్నపిల్లలని లైంగిక వేధింపుల నుంచి కాపాడడానికి పాఠశాలల్లోనే శరీరాన్ని గురించి నేర్పి మంచి స్పర్శ, చెడ్డ స్పర్శల్లో తేడాలని నేర్పిస్తున్నారు. పెరిగిపోతున్న పిల్లల లైంగిక వేధింపులు ఈ పరిస్థితికి దారితీశాయి. అధికారం ఉన్న వాళ్ళు, హీరోలుగా భావించే వాళ్ళు కూడా తప్పులు చేస్తారని తెలిస్తే, తమని వేధించే పెద్దవాళ్ళ గురించి వారికుండే భయం పోయి బయటికి చెప్తారు.
యువత లంచగొండితనం, విచ్చలవిడి శృంగారం అలవాటు చేసుకుని విలువ లేకుండా తయారయింది.
ముప్ఫయ్యేళ్ళు దాటిన ప్రతి వ్యక్తీ ఈ మాట చెప్పేముందు ఆలోచించాలి. ఎందుకంటే, యువత పుట్టి, పెరిగిన ప్రపంచాన్ని సృష్టించి, ఇలా నిర్వచిస్తున్నవాళ్ళం మనమే. బాధ్యత యువతది మాత్రమే కాదు. తెలుగు సినిమాలు తీసేవాళ్ళు, టెలివిజన్ ఛానళ్ళు, వార్తా పత్రికలు నడిపేవాళ్ళు, సోషల్ మీడియా, ఫేస్‌బుక్ సృష్టించిన మార్క్ జుకెన్బర్గ్‌తో సహా అందరిదీ. మనం సృష్టించిన ప్రపంచంలోకి, విలువల్లోకి ప్రవేశించిన యువతని నిందించి వారిపైనే మొత్తం బాధ్యత పెట్టడం సబబు కాదు కదా?
పరిశ్రమలో అందరూ చెడ్డవాళ్ళే కాదు
స్త్రీలపై లైంగిక వేధింపులు, హింస గురించి మాట్లాడంగానే, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదని, దళితులపై హింస గురించి మాట్లాడితే అగ్ర కులాలందరూ చెడ్డవాళ్ళు కాదనటం వంటిదే ఇది కూడా. కానీ ఆధిపత్య ధోరణులని, సంస్కృతిని, అలవాట్లని, పద్ధతులని ప్రశ్నించడానికి కొంత మేరకు అందర్నీ ఒక గాటన కట్టడం అవసరం. తెలుగు సినీ పరిశ్రమలో స్త్రీలపై పురుషుల లైంగిక దోపిడీని, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి సినీ రంగాన్ని ఒకటిగా పరిగణించటం అటువంటిదే. వాళ్ళే తమని తాము కుటుంబంగా వర్ణించుకుంటారు కూడా. తమ పరిశ్రమలో ఇటువంటి చెడ్డ సంస్కృతి, ధోరణి ఉందని ఒప్పుకున్నప్పుడే, పరిశ్రమ పెద్దలు అవి జరక్కుండా చర్యలు తీసుకోగలరు. భారతదేశ సంస్కృతికి మూలమని చెప్పుకునే కుటుంబంలోనే స్త్రీలపై హింస జరుగుతోందనే చట్టాలు చేసిన దేశం మనది. వేలమంది పనిచేసే ఒక పెద్ద పరిశ్రమలో వేధింపులు జరుగుతాయని ఒప్పుకోవటం వల్ల పరువు పోదు. అది పరిశ్రమ పరిణితికి సూచన అవుతుంది.
సాక్ష్యాలేవీ?
ఒక్కొక్క పరిశ్రమలో లైంగిక దోపిడీ, వేధింపులు ఒక్కో రకంగా ఉంటాయి. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలు, కూలీలపై చేసేది ఒకటి, అలాగే యూనివర్శిటిల్లో మరొకటి, సినిమా పరిశ్రమలో కూడా కింది స్థాయి వారిపై లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీతో కలిసి
ఉంటుంది. వీరిలో ఎవరూ సాక్ష్యాలని సేకరించరు. పై స్థాయిలో జరిగే ‘నేను నీకిది చెయ్యాలంటే, నువ్వు నాకేమిస్తావ్’ అనే ఒప్పందాల్లో లైంగిక దోపిడీ అవకాశాలు కల్పించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ, ఆర్థిక దోపిడీతో కలిసి ఉండదు. రెండు సందర్భాల్లో ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల జరిగేది దోపిడీతో కలిసిన అసమాన కాంట్రాక్టుగానే కనిపిస్తుంది తప్ప, వేధింపులు, హింసగా కనిపించదు. అందుకే అవకాశాలు దొరికినప్పుడే ఫిర్యాదులు వస్తాయి. అప్పుడు జరిగింది దోపిడీ, మోసంగా కనిపిస్తుంది. అలా చేస్తారని ముందే ఊహించారు కాబట్టి సాక్ష్యాలు పొందుపరుచుకోరు. సెలెబ్రిటీలను బెదిరించి డబ్బులు చేసుకుంటారు. కాబట్టి సాక్ష్యాలు అడగాలనే వాళ్ళు కూడా గుర్తించాల్సింది, ఆ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే ఆశకలవాళ్ళు ఎప్పటికీ ఆ పని చెయ్యరని.
పేర్లు చెప్పాల్సిందే!
ఇది అన్నిటికన్నా బాధ్యతా రహిత డిమాండ్. మాట్లాడే స్త్రీలకి, పరిశ్రమలో పురుషులకి ఉన్న తీవ్ర అధికార అంతరాన్ని గుర్తించని డిమాండ్. మాట్లాడే స్త్రీలు ఆధిపత్య శ్రేణిలో కింది స్థాయిలో ఉండేవాళ్ళు, లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్ళు డబ్బు, అధికారం, హోదాల్లో అత్యంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. మాట్లాడే స్త్రీలని ఏ రకంగా అయినా దెబ్బ తియ్యగలిగే అపరిమిత అధికారం ఉన్న
వాళ్ళు, పరువు నష్టం దావాలు వారి ఆయుధాల్లో చిన్నవి. ”మేము పేర్లు చెప్పలేమంటే” అర్థం చేసుకోవాలి. చెప్పిన వాళ్ళని సమర్థించాలి. వారిని శిక్షంచకూడదు. భద్రత కల్పించాలి. ఒక వేదిక ఏర్పర్చాలి. అప్పుడే ధైర్యంగా తమ పరిస్థితిని ఎదుర్కోగలరు. అంతే తప్ప, చెప్పాల్సిందే అని బెదిరించడం వల్ల మరింత హాని జరుగుతుంది.
”నువ్వెందుకు అవకాశమిచ్చావ్? అడిగినోడ్ని ఒక తన్ను తన్నుంటే ఇక్కడివరకు వచ్చేది కాదు” అనడం బాధితులపై బండలు వెయ్యడమే. కేవలం లైంగిక సంబంధాల ఆధారంగా మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు అనే విభజన చేయడం స్త్రీ పురుషుల లైంగికత గురించిన పాత నైతిక సిద్ధాంతాలపై ఆధారపడింది. పురుషులకి ఇటువంటి విభజన వర్తించదు. వివాహం బయట ఇటువంటి సంబంధాలున్నాయని ఒప్పుకున్న స్త్రీలని చెడ్డవాళ్ళంటారు. అదే ఇటువంటి సంబంధాలలోకి స్త్రీలని ఆహ్వానించే వివాహిత పురుషులని మాత్రం ‘మగవాళ్ళు అట్లాగే ఉంటారు’ అంటూ సమర్ధిస్తారు. ఈ ద్వంద్వ విలువలు పురుషాధిక్య హక్కులని కాపాడతాయి. మనం పురుషాధిక్య విలువలు మారాలని, వాటిని నిర్మూలించాలని రాజ్యాంగాన్ని రాసుకున్నాం. పురుషులకున్న అనంతమైన అధికారాల్ని, హక్కుల్ని పరిమితం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. వాటిలో కొన్నింటిని ‘కుటుంబ హింస’, ‘లైంగిక వేధింపులు’ లేదా ‘లైంగిక దాడి’ అనే పేర్లతో నేరస్మృతిలో పొందుపరిచాం. ఇక్కడ విషయం పవిత్ర/అపవిత్ర స్త్రీల గురించి కాదు, పురుషాధిక్యతలను తొలగించటం.
అవకాశం కోసం లొంగిపోయిన స్త్రీకి మాట్లాడే అర్హత లేదు.
లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపుల సమస్య ఫిర్యాదు చేసిన స్త్రీలతో మొదలవలేదు. వారితోనే ముగిసిపోదు. లైంగిక వేధింపుల కమిటీ పెట్టాలని చట్టం వచ్చిన ఐదేళ్ళపాటు కళ్ళు మూసుకుని గడిపిన పరిశ్రమలోని సంస్థల వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎక్కడైనా సరే, ‘లైంగిక లొంగుబాటు’తో పని దొరకటం అవమానకరం. ఈ సంస్కృతిని ఇన్నాళ్ళు భరించిన సినీ రంగాన్ని తప్పు పడదామా? లేక ఉందని చెప్పిన మహిళలనా? లంచం తీసుకున్న అధికారిని తప్పు పడతాం కానీ, ఇచ్చిన వారిని తప్పు పట్టం. అలాగే అవకాశం ఇస్తామని వాడుకున్న వారిది తప్పు గానీ అవకాశం కోసం లొంగిపోయిన వారిది కాదు. మాట్లాడే వారిపై దాడిచేస్తే, ఫిర్యాదు చెయ్యటానికి ఇంకెవరు ముందుకు రారు కదా.
పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కానీ, మీడియా దగ్గరికి కాదు.
సినీ పరిశ్రమ మీడియా లేనిదే ఒక్క రోజు కూడా బతకలేదు. సినిమాల ప్రచారం, పోస్టర్లు, ఆడియో విడుదల, సినిమా సక్సెస్, కొంచెం నోరున్న హీరోయిన్లని నోరు మూయించటం కోసం ఇలా ఎన్నో రకాలుగా మీడియా వారికి ఉపయోగపడుతుంది. మరి అటువంటి మీడియా దగ్గరికి వెళ్ళక ఇంకెక్కడికెళ్ళాలి? మీడియా సినిమా ప్రొడ్యూసర్లకే, హీరోలకే కాదు, అందరికీ కదా. అన్ని రకాల అధికారం కలిగి ఉన్న పురుషులని వ్యతిరేకించటానికి మీడియా కొంచెం వేదిక ఇచ్చినందుకు మెచ్చుకుని, సంతోషించాలి గానీ, వెళ్ళొద్దు అనటం సబబు కాదు కదా?
మా పరిశ్రమని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు?
పరిశ్రమ అంటే లోకువైపోయింది. విషయం పరువు-ప్రతిష్టలకి సంబంధించినది కాదు. పని స్థలాల్లో మహిళల భద్రతకు సంబంధించింది. వారికి తమ పని చికాకులు లేకుండా చేసుకునే వాతావరణం కల్పించటం గురించి కొన్నాళ్ళ క్రితం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్‌ల లిస్టు ఒకటి ఇంటర్నెట్‌లో హల్చల్ చేసింది. ఆయా విద్యాసంస్థలేవీ తమ పేరు నాశనం అయిందని గగ్గోలు పెట్టలేదు. అలాగే రోజూ ఏదో పేరున్న సంస్థలో, రంగంలో వేధింపులు బయటపడుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ సాధ్యమయినంత త్వరగా సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పటికి కొంత శాతమైనా ఆయా రంగాలు బాగుపడి స్త్రీలు కొంతలో కొంత చికాకులు లేకుండా పని చేసుకునే వాతావరణం ఏర్పడింది. తెలుగు సినీ పరిశ్రమ తమని మాత్రమే వేలెత్తి చూపిస్తున్నారని భావన వీడి, త్వరగా పరిస్థితిని బాగు చేసుకుంటే అందరి గౌరవం పెరుగుతుంది.
కింది స్థాయిలో కో-ఆర్డినేటర్స్, బ్రోకర్లతోనే సమస్య, పై వాళ్ళతో సమస్య లేదు.
పై స్థాయిలో ఉండే వారి గురించి ఫిర్యాదులు లేకపోవడం, వారి ఆధిపత్యాన్ని సూచిస్తుంది తప్ప సమస్య లేదని కాదు. ఎక్కడయితే పూర్తి ఆధిపత్యం ఉంటుందో అక్కడ నిశ్శబ్దం కూడా రాజ్యమేలుతుంది. బొడ్డు మీద కొబ్బరి చిప్పలు వేశారని, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిపోయిన హీరోయిన్లు చిన్నగా అంటేనే, వారిని నానా శాపనార్ధాలు పెట్టి వారితో క్షమాపణలు చెప్పించిన సినిమా భక్తులున్న సమాజం మనది. పరిశ్రమ తీసిన అతి పెద్ద సినిమాలో స్త్రీ పాత్ర చిల్లరగా ఉందని విమర్శించిన యువతిని ఇంటర్నెట్‌లో వేధించి మళ్ళీ కనిపించకుండా చేసిన ఘనులు ఉన్నారు. విమర్శ ఎదగడానికి తోడ్పడుతుందనే సోయి లేని భక్తులని, భరించలేని వారి తిట్లని పల్లెత్తు మాట కూడా అనని పురుషులున్న పరిశ్రమలో కింది వాళ్ళు మాత్రమే వేధింపులకు పాల్పడుతున్నారని నమ్మడం కొంచెం కష్టం.
ఇప్పుడు మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు తరువాత మాట మీద నిలబడరు.
నిజమే. ఒత్తిడి తట్టుకోలేని కుటుంబ హింక్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో స బాధితులు ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటారు. అత్యాచార బాధితులు ఏమీ జరగలేదంటారు. హత్య చేయబడిన వారి కుటుంబ సభ్యులే సహజ మరణమంటారు. మరి సినీ పరిశ్రమ వంటి ఆధిపత్య నిర్మాణాన్ని ఢీకొట్టిన వారు ఒత్తిడి, ఎదురు దాడి తట్టుకోలేక వెనుదిరగటంలో ఆశ్చర్యమేముంది? డబ్బులు తీసుకున్నారని, ఏదో రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారిన నిందలు మోపితే తట్టుకోవడం అధికారం, డబ్బూ లేని బాధితులకి సాధ్యం కాదు కదా.
సమస్య లేవనెత్తిన మహిళల నుండి సమస్యని విడదీసి చూడాలని అనేకమంది సోషల్ మీడియాలోనే చక్కగా విడమర్చి చెప్పారు. ఇది మన సమాజ పరిణితికి చిహ్నం. లైంగిక వేధింపులు ఈ ఒక్క నిరసన, చర్చతో మాయమైపోతాయని చెప్పటం కష్టమే. కానీ ఈ చర్చ తర్వాత వీటిని కిందికి నెట్టేయడం కూడా అంత తేలిక కాదు. అసలు ఇటువంటి చర్చ జరగటమే తెలుగు సమాజంలో ఒక ప్రజాస్వామ్య మార్పుకి సూచన అని మా నమ్మకం.