ఇంకెన్నాళ్ళు తన్నులు తింటారు. తిరిగి తన్ని చూడండి – సత్యవతి

చెట్టును కొడితే కేసు. పిట్టని కొడితే కేసు. పులిని చంపితే కేసు, కృష్ణజింకని చంపితే కేసు. పక్కింటోణ్ణి కొడితే కేసు. ఎదురింటివాణ్ణి కొడితే కేసు. రోడ్ల మీద ఒకళ్ళ నొకళ్ళ కొట్టుకుంటే కేసులే కేసులు. భార్యని భర్త కొడితే కేసెందుకు కాదు? తాగొచ్చి ప్రతి రాత్రీ కొడితే పోలీసులు కేసులెందుకు పెట్టరు? ఒక మనిషిని ఇంకో మనిషి అది ఆడైనా, మగైనా కొట్టడం అనేది కేసులు పెట్టదగ్గ నేరమైనప్పుడు భర్త, భార్యని కొట్టడం నేరమెందుకు కావడం లేదు?

కుటుంబ హింస నేరమైనప్పుడు ఆ హింసకి పాల్పడిన మనిషి నేరస్తుడు ఎందుకవ్వడం లేదు. భారతీయ శిక్షా స్మ ృతిలోని 498ఏ ప్రకారం భార్య మీద తీవ్రమైన హింసకి పాల్పడి, ఒక్కోసారి ఆమె మరణానికి కారకుడైన భర్త హంతకుడెందుకు కావడం లేదు? బయట వ్యక్తుల్ని హత్య చేయడం తీవ్రమైన నేరమైనప్పుడు తను అగ్నిసాక్షిగా పెళ్ళాడి, కామేచ, అర్థేచ, మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేసినవాడు, ‘సోకాల్డ్‌’ వేదమంత్రాల సాక్షిగా ఆమెని అర్థాంగి అంటూ ఒప్పుకున్నవాడు, కొన్ని రోజులయ్యాక హింసల కొలిమిలో ఆమెను కాల్చి బూడిద చేసిన వాడు ఎలాంటి శిక్ష లేకుండా సభ్యసమాజంలో ఎలా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు?

గృహహింస నిరోధక చట్టం 2005 మీద ఈ రోజు జరిగిన ఒక ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల, ప్రశ్నల సారాంశం పైన నేను పేర్కొన్నది. రిసోర్స్‌ పర్సన్‌ చట్టం గురించి వివరిస్తున్నప్పుడు ఒకామె లేచి చెట్టును కొడితే నేరం కదా! ఆడ మనిషిని కొడితే నేరం కాదా అని అడిగింది. ఇంకొకామె లేచి ఆవును చంపితే నేరమంటున్నారు. ఆడవాళ్ళ ఆవుపాటి కారా? అని అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. రిసోర్స్‌పర్సన్‌ తనకు తోచిన సమాధానం చెప్పి చట్టం గురించి వివరించే పనిలో పడ్డాడు.

‘కుటుంబం’ మనం మహా గొప్పగా కీర్తించుకునే సమాజంలో ఒక ముఖ్యమైన వ్యవస్థ. పితృ స్వామ్య భావజాలానికి పట్టుగొమ్మ. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలని కీర్తించి, కీర్తించి ప్రస్తుతం సినిమాలకే పరిమితమైనాం. సకుటుంబ, సపరివార, ఉమ్మడి కుటుంబ కథాచిత్రం అంటూ ప్రచారం చేసుకునే దశలో ఈ రోజు ఉమ్మడి కుటుంబం ఉంది. ఇక ఇప్పుడు విలసిల్లుతున్న వ్యష్టి కుటుంబాల కథ ఏమని వర్ణించాలి. ఆప్యాయతానురాగాల హరివిల్లుల ఆనవాళ్ళుగా కీర్తించుకునే కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ

ఉదయం మహిళా పోలీస్‌ స్టేషన్‌కి, ఓ మధ్యాహ్నం ఫ్యామిలీ కోర్టుకి, ఓ సాయంత్రం ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్లని సందర్శిస్తే చాలు. ఘనత వహించిన కుటుంబాల్లోని హింసా రూపాలు స్పష్టంగా రూపుకడతాయి.

భార్యా, పిల్లల్ని గాలికొదిలేసి తిరిగే భర్తలు, అడుగడుగునా దొరికే గుడుంబానో, కల్లునో, వైన్‌షాపులో దొరికే మద్యాన్నో తాగి భార్యా, పిల్లలతో పాటు, తల్లిదండ్రుల్నీ తన్నడమే పనిగా పెట్టుకున్న భర్తలు, అనుమానాల్లో రగిలిపోతూ పరస్పర ద్వేషాలను కుమ్మరించుకునే భార్యాభర్తలు, ఒకరి ఫోన్లని ఇంకొకరు దొంగబాటుగా చేక్‌ చేసే దంపతులు… ఇవీ మన కుటుంబాలో జరుగుతున్న నిత్యకృత్యాలు.

ఈ రోజు టెక్నాలజీ ప్రేరేపిత హింస ఎంత భయంకరంగా ఉందో, భార్యా భర్తల మధ్య ఎలాంటి అపనమ్మకాలని, అగాధాలని సృష్టిస్తున్నదో తెలుసుకోవడం అవసరం. గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్‌కి ఇటీవల ఓ కేసొచ్చింది. ఆమె తన ఫోన్‌ను తీసి కౌన్సిలర్‌కిచ్చింది. ఆమె తన ఫోన్‌ ఎందుకిచ్చిందో కౌన్సిలర్‌కి అర్థం కాలేదు. ఎందుకు మీ ఫోన్‌ నాకిచ్చారు అని అడిగింది. అప్పుడామె చెప్పడం మొదలు పెట్టింది. ‘నా భర్తకి నామీద అనుమానం. ఎప్పుడూ ఈ అనుమానంతో నన్ను వేధించడం, నా ఆఫీసు ముందుకొచ్చి నిలబడడం, నా కొలీగ్స్‌ ద్వారా సమాచారం సేకరించడం లాంటి పనుల్ని చేసేవాడు. సాయంత్రం ఇంటికి రాగానే వాడితో వెళ్ళావట వీడితో మాట్లాడావట… ఇదే గోల. అయితే ఈ మధ్య నా ఫోన్‌లో నాకు తెలియకుండా ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి నా కాల్‌డేటా, నా చాట్స్‌, ఫోటోలు అన్నీ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నాడు. నాకు ఎలా తెలిసిందంటే ఓ రోజు ఎవడే వాడు. ఆ ఫోటో ఏంది? వాడితో రాసుకుంటూ పూసుకుంటూ ఆ ఫోటోలేంటి? అంటూ పెద్ద గొడవ పెట్టాడు. బెల్టుతీసుకుని కొట్టాడు. నీ కథలన్నీ నాకు తెలుస్తాయ్‌. జాగ్రత్త అంటూ బెదిరరించాడు. నన్నేం చేయమంటారిప్పుడు’ అంది మనకు తెలియకుండా మన ఫోన్‌లో యాప్‌లు పెట్టి వేధించవచ్చని తెలిసిన కౌన్సిలర్‌ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టి ఏం చేయవచ్చో సూచించింది.

ఇంత వికృతంగా, విపరీత పోకడలతో ఒకర్నొకరు హింసించకుంటున్న భార్యాభర్తల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఐటి సెక్టార్‌లో పని చేస్తున్న వారిలో ఇలాంటి ధోరణులు పెరిగిపోతున్నాయ్‌. తనతో సమానంగా విద్యార్హతలుండి తనతో సమానంగా, చాలాసార్లు ఎక్కువగా సంపాదిస్తున్న స్త్రీలపై కూడా ఈ వికృత మనస్తత్వంతో ఉన్న మగాళ్ళు చెయ్యెత్తడం, చెంపలమీద చెళ్ళుమంటూ కొట్టం జరుగుతూనే ఉంది. ఆర్థికంగా మెరుగ్గా ఉన్నా, స్వతంత్రంగా బతకగల సత్తా ఉన్నా సరే గృహహింస నెదుక్కొంటున్న ఈ స్త్రీలు కూడా దానిలోంచి బయటపడలేకపోవడానికి కారణం వారిని కట్టిపడేసి ఉంచే పితృస్వామ్య భావజాలం, సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాలు, కుటుంబ గౌరవాలు, మొగుడనే వాడి చుట్టూ అల్లిన ఆధిపత్య భావజాలాలు.

అందుకే ఈ దేశంలో చెట్టును కొట్టడం నేరమౌతుంది. పులిని చంపడం నేరమౌతుంది. ఆవుని చంపడం నేరమౌతుంది. భర్త అనే పురుషాంహకారి భార్యని కొట్టడం, చంపడం నేరమని 21వ శతాబ్దపు ఆధునిక సమాజం కూడా అంగీకరించడం లేదు. చంపినా ఫర్వాలేని ఈ సమాజం 498ఎ లాంటి చట్టాలపై విషప్రచారం చేసి దానిని నీరు కారుస్తుంది. ఆడవాళ్ళ కళ్ళనీళ్ళను సెలబ్రేట్‌ చేస్తుంది.

చాలాసార్లు నా కనిపిస్తుంది. ఇలా అరవాలనిపిస్తుంది… ఇంకెన్నాళ్ళు తన్నులు తింటారు. తిరిగి తన్నండెహే. అది జరిగే వరకు ఈ హింసలాగవు. ఈ తన్నులూ ఆగవు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.