వైవిధ్యాన్ని ప్రేమించేవారు ఈపుస్తకం చదవాలి – కొండవీటి సత్యవతి

‘సన్‌ ఆఫ్‌ జోజప్ప’ ఈ పుస్తకం చదవడానికి నాకు అంచెలంచలుగా నెల రోజులు పట్టింది. సాధారణంగా పుస్తకం చదవడం మొదలు పెడితే తొందరగానే పూర్తి చేయగలుగుతాను. కానీ ఈ పుస్తకం చదవకుండా అక్కడక్కడ నన్ను ఆపేసింది. చెప్పలేని ఒక నెగెటివ్‌ ఫీలింగ్‌, అభిప్రాయం నన్ను ముందుకెళ్లకుండా చాలాసార్లు ఆపేసింది.

ఎందుకిలా జరిగింది అని ఆలోచించినప్పుడు సెక్సువాలిటీకి సంబంధించిన పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. పురుషుడిగా పుట్టిన ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళ భావోద్వేగాలను, సంఘర్షణలను ఇంత లోతుగా వివరంగా రాసిన తెలుగు పుస్తకం బహుశా నాకు తెలిసి లేదనుకుంటున్నాను.
పుస్తకంలో కొన్నిచోట్ల కొన్ని అనుభవాల వర్ణనలు వెగటును కలిగించిన మాట నిజం. అయితే చదవడం ఆపేసిన ప్రతిసారీ ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముడుతూ ఉండేవి. అందుకనే మళ్ళీ మళ్ళీ పుస్తకం తీసుకుని చదువుతూ ఈరోజు మొత్తం పుస్తకం చదవడం పూర్తి చేశాను. చివరి పేజీ చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లు కారడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.
ఈ పుస్తకాన్ని రాయలసీమ యాసలో రాయడం, కొన్ని పదాలు చాలా చోట్ల అర్థం కాలేదు. ధారళంగా వాడిన బూతులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ నవలలో పిల్లోడికి పేరు లేదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు పిల్లోడుగానే మిగిలిపోయాడు. ఆ పిల్లోడి బాల్యం, స్కూల్లో జరిగిన అనుభవాలు, ఘర్షణలు, అతని ఆలోచనా ధోరణలు చాలా వివరంగా ఈ పుస్తకంలో రాశారు విజయ కుమార్‌. తన జీవితం గురించి, చిన్నప్పటినుంచి పిల్లోడికి తాను పిల్లోడుగా ఉన్నాడు గానీ తన లోపల అంతా అమ్మాయిల, ఆడపిల్లల ఆలోచనలే ఉన్నాయనే గందరగోళం మధ్య ఎన్నో అనుభవాలను, ఎన్నో కన్నీళ్లను పిల్లోడు ఎదుర్కొన్నాడు. అసలు తన శరీరంలో ఏం జరుగుతోంది, తనకు ఎందుకని మగవారి పట్ల ఆకర్షణ కలుగుతుంది? లైంగికంగా వారితో కలవాలని ఎందుకు అనిపిస్తుంది అనే దానిపైన పిల్లాడికి ఎక్కడ కూడా స్పష్టత లేదు. కానీ అదంతా కావాలనిపిస్తుంది. దానివల్ల ఎన్నోసార్లు ఎన్నో మోసాలకు గురవుతూ ఉంటాడు.
పిల్లాడి జీవితంలో తండ్రి లేకపోవడం, తల్లి దగ్గరకి రాత్రిళ్ళు వచ్చే మనిషి తన తండ్రి కాకపోవడం, తన తల్లిని ఆ మనిషి ఘోరంగా హింసించడం ఇవన్నీ పిల్లాడికి ఎంతో దు:ఖాన్ని కలిగిస్తుంటాయి.
తల్లితో ఉన్నప్పటికీ పిల్లాడు ఎప్పుడూ ఏకాకే. ఒంటరితనంతో కుములుతూ ఉంటాడు. తన గదిలో తనకు ఇష్టమైనట్టు చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్టు కాటుక పెట్టుకుని నిద్రపోవడం అనేది ఒక అలవాటుగా పిల్లాడికి మారుతుంది. క్రమంగా తాగడం అలవాటు చేసుకుంటాడు. సుధా అనే వాడి ఆకర్షణలో పడి నలుగుతుంటాడు.
తన జీవితంలోని ఘర్షణలను, కష్టాలను, కన్నీళ్లను ఒక టెడ్డీబేర్‌తో చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే ఒక డైరీలో తన అనుభవాలు అన్నింటిని రాస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు తన శారీరక అవసరాల కోసం చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలకి వెళ్లడం, చాలాసార్లు గాయపడడం జరుగుతూ ఉంటుంది.
అలా చేయడం, చేయలేకపోవడం అనేది పిల్లాడి చేతుల్లో ఉండదు. చివరికి తల్లి అనారోగ్యం పాలైనప్పుడు ఆమెను చూసుకోవడానికి వచ్చిన లింగ అనే ఒక పిల్ల అతనికి ఎంతో సాంత్వననిస్తుంది. ఆమెతో తన బాధను చెప్పుకోగలుగుతాడు. ఆమె ఎంతో సానుభూతిగా పిల్లాడిని ఒడిలోకి తీసుకుని ఓదారుస్తుంది. పెద్దపెద్ద కళ్ళతో ఆకర్షణీయంగా ఉండే లింగ తనని అన్ని విధాల అర్థం చేసుకున్నదని పిల్లోడు చాలా సంతోషపడుతుంటాడు. ఆమె దగ్గర ఎంతో సంతోషంగా అంతా చెప్పుకుంటూ ఉంటాడు. లింగ తనకి ఇష్టం లేని మేనమామతో తన పెళ్ళని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లిపోవడం పిల్లాడికి చాలా దు:ఖాన్ని కలిగిస్తుంది. ఆ ఇంట్లో ఇంక తనకెవ్వరూ లేరని, తన కోరుకున్న జీవితాన్ని వెతుక్కుంటూ తన కమ్యూనిటీ వేపు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తల్లికి ఒక పెద్ద లెటర్‌ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు పిల్లాడు. పిల్లాడు రాసిన ఉత్తరం చదివిన ఎవరి మనసైనా కరగక మారదు. అబ్బాయిగా పుట్టినప్పటికీ తన లోపల అన్నీ ఆడ లక్షణాలే ఉండడం, ఆడవాళ్ళల్లాగా బతకాలనుకోవడం, మగాళ్ళ తోడు కోసం, వాళ్ళ ప్రేమ కోసం తపించడం ఇవన్నీ కూడా మామూలుగా ఆలోచించే వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు. కానీ సన్‌ ఆఫ్‌ జోజప్ప పుస్తకం చదివాక తప్పకుండా ఇలాంటి మనుషుల జీవితాల గురించి, జీవన విధానాల గురించి, వారి సంఘర్షణలు, వారి బాధలు తప్పక అర్థం చేసుకునే చూపునిస్తాయి.
ఎల్‌.జి.బి.టి.క్యు పేరుతో ఉన్న ఈ కమ్యూనిటీ ఎంతో వైవిధ్యంతో వారి వారి సెక్సువాలిటీ గురించి మాట్లాడడం చాలా సమావేశాల్లో నేను చాలాసార్లు విన్నాను. నన్ను మమ్మీ అంటూ ఎంతో ప్రేమతో పిలుస్తారు.
రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కధ చదివినప్పుడు మొదట షాక్‌కి గురైనప్పటికీ వారి జీవితంలోని దు:ఖాలను, హింసలను అర్థం చేసుకున్న తర్వాత నేను చాలా పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకున్నాను.
ఇటీవల ఒక సమావేశంలో ఒక ట్రాన్స్‌మాన్‌ ఇలా మాట్లాడారు… అచ్చమైన పురుషునిలా మైకు ముందు నిలబడి మాట్లాడిన మాటలు మొదటిసారి ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళని చాలా గందరగోళ పరుస్తాయి… ‘నేను ఒక మహిళగా పుట్టాను. మా అమ్మ నాన్న నేను వద్దంటున్నా వినకుండా నాకు పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో నేను ఒక కొడుకును కన్నాను. ఆ కొడుకు ఇప్పుడు 20 ఏళ్ల వాడు. నా కొడుకు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. కానీ నేను ఆడ మనిషిగా ఉండాలనుకోలేదు. నా లోపల మగాడిగా బతకాలనే ఆకాంక్ష బలమవుతుండడంతో ఆపరేషన్‌ చేయించుకుని పురుషుడిగా మారాను. ఒకమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను’ అని తన గురించి చెప్పుకున్నాడు.
మొదటిసారి ఇలాంటి సమావేశాలకు వచ్చినవాళ్ళు తప్పకుండా షాక్‌కి గురౌతారు. అర్ధం చేసుకోవడానికి చాలా ఎంపతి ఉండాలి.
మోహన్‌ స్వామి లాంటి పుస్తకాలు చదివినప్పుడు సామాన్య పాఠకులకు ఆయా జీవితాలను అర్ధం చేసుకోవడానికి తప్పకుండా సమయం పడుతుంది. పుట్టుకతో ఒక శరీరం. కానీ ఆ శరీరం తనది కాదు. తాను వేరు, తన ఆలోచనలు వేరు, తన ఆకాంక్షలు వేరు అని భావించుకునే స్త్రీ, పురుషుల వేదనామయమైన జీవితాలు, సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించని, అర్థం చేసుకోలేని వారి జీవన విధానాలు తప్పకుండా అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడు తమ జీవితాల్లోని దు:ఖాలను, హింసలను సమావేశాలలో చెప్పుకోగలుగుతున్నారు. దాన్ని అంగీకరించే దశలో ఇంకా సమాజం లేదు. వారి అనుభవాలు మొదటిసారి చదువుతున్నప్పుడు ఒకలాంటి జుగుప్స అనిపించవచ్చు. కానీ అది వాస్తవం, అది వారి జీవితం. దీనిని మనం అర్థం చేసుకోగలిగితే ‘సన్నాఫ్‌ జోజప్ప’ నవలలోని లింగ అనే అమ్మాయి ప్రదర్శించిన గొప్ప మనసును మనమందరం కూడా అలవర్చుకునే అవకాశం తప్పకుండా ఉంది.
ఈ పుస్తకాన్ని ఎంతో ధైర్యంగా రాసిన సొలోమోన్‌ విజయ్‌ కుమార్‌ గారికి అభినందనలు. ఇన్‌బాక్స్‌లో నా అడ్రస్‌ అడిగి తీసుకుని పోస్ట్‌లో పుస్తకం పంపిన విజయకుమార్‌కి ధాంక్స్‌. వారి ధైర్యాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. అలాగే ఇలాంటి పుస్తకాన్ని అంటే నా ఉద్దేశం సమాజం ఇంకా వీరి జీవితాల్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగని దశలో సన్నాఫ్‌ జోజప్ప లాంటి పుస్తకాలను ప్రచురించిన ఛాయా పబ్లికేషన్స్‌కి, తమ్ముడు, ఎడిటర్‌ అరుణాంక్‌కి చాలా చాలా అభినందనలు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.