రైలు కట్ట – రోహిణి వంజరి

మే నెల. మలమల మాడ్చే ఎండ. సలసల కాల్చే ఎండ. నల్లిని నలిపినట్టు నలిపేసే ఎండ. రాత్రి తొమ్మిదయినా తగ్గని సెగలు పొగలు. రైలు గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది అక్కడ. తడవ తడవకి రైలు బండ్లు పోతానే ఉండాయి. రైలు గేటుకి ఆ పక్కా, ఈ పక్కా నాలుగైదు వాహనాలు తప్ప నడిచివెళ్ళే మనుషులెవరూ లేరు.

రైలు గేటు దగ్గర స్తంభానికి ఉండే దీపం ఉండుండి ఆరిపోతూ, వెలుగుతూ ఉన్నాది మిణుగురు పురుగులాగా. దాని బల్బు సగం కాలిపోయినట్లు ఉండాది సగం చితికిన మనిషి బతుకు మాదిరి.
రైలు గేటుకి ఇవతల ఓ ముసిలిది కూర్చోనుండాది. ముందర సత్తు తట్ట పెట్టుకోనుండాది. ఎవరైనా ఆ తట్టుకొచ్చి, తట్టలో చిల్లర డబ్బులు వేస్తారేమో అని ఆశగా నాలుగు దిక్కుల చాయ చూస్తా ఉండాది. స్తంభం దగ్గర తప్ప మిగతా అంతా చిమ్మ చీకటి, ఆ చుట్టుపక్కల ఎక్కడో టైరు కాల్చిన పొగ కమురు వాసనతో చీకటితో కలిసి రైలుకట్టను కమ్ముకొంటోంది.
నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న కంకి మీది నించి వొచ్చినట్లు పొగలు వస్తా ఉండాయి ఒంట్లోనించి. తల నించి కారే చెమట, మెడ నించి కారే చెమట, రొమ్ముల నించి కారే చెమట, తొడల నించి కారే చెమట ధారాపాతంగా కారుతూ, పిక్కల మీదినుంచి అరికాళ్ళదాకా పాకుతుంటే, ఉస్సు బుస్సు మంటూ అసహనంగా రైలు గేటుకి ఆ పక్కా ఈ పక్కా బొంగరం మాదిరి తిరగతా ఉండాది యాభై యేళ్ళ శాంతమ్మ. చేతిలో సెల్‌ ఫోన్‌ చాయ మాటిమాటికి చూస్తా ఉండాదామె. రెండు గంటల నుంచి అదే పని. కుప్ప తొట్టి దగ్గర రెండు కుక్కలు ప్లాస్టిక్‌ కవర్ని పళ్ళతో లాగుతూ గెట్టి గెట్టిగా మొరగతా ఉండాయి. తినడానికి కపప్పతొట్టి దగ్గర ఏమి దొరకలేదని బాధేమో వాటికి. రెండు గంటల సేపటినుంచి ఎదురు చూస్తా ఉన్నా నర మానవుడు కానరావడం లేదు. ఆ చుట్టుపక్కల, ఇంకిట్లగాదని సెల్‌ ఆన్‌ చేసింది శాంతమ్మ.
‘‘చెప్పు శాంతక్కా. ఎవురైనా వొచ్చారా ఆ తట్టుకి. నన్ను రమ్మంటావా…?? పక్క ఈదిలోనే వుండాము నేను, కృష్ణవేణి’’ కుడి చేతిలోని సెల్‌ ఎడమ చేతిలోకి మార్చుకొని, కుడి చేత్తో సుగుణా అంగడిలో కొన్న సెంటు జాకెట్టుకి పూసుకుంటూ అనింది అనిత.
‘‘దొంగ సచ్చినోళ్ళు అంతా కట్ట గట్టుకొని ఏడకి పోయినారో ఏమో, ఒక్క నా బట్ట గుడా కూడా రైలుకట్ట కాడికి రాలేదు. మీ కాడికి ఎవురైనా వొచ్చారా? ఒక్క బేరం అయినా తగిలిందా లేదా? నాకు చెప్పకుండా మీరు ఎవురికాడికి పోడానికి లేదు’’ అనింది శాంతమ్మ వగరుస్తా.
అనిత చేతిలోనించి సెల్‌ లాక్కుని ‘‘ఓయమ్మా…! నీకు చెప్పకుండా మేమేడికి పోతామక్కా. ఈ పక్కకి కూడా ఒక్కడూ రాలేదు గంట నించి’’ అనింది కృష్ణవేణి నాసిరకం లిప్స్టిక్ని మళ్ళీ పెదాలకి చిక్కగా, ఎర్రగా పులుముకుంటూ.
‘‘ఆ పోలీస్‌ గురవయ్య సచ్చినోడు ఇప్పటికే మూడు తూర్లు నా చుట్టూ తిరిగి పోయినాడు. కమీషను ఇమ్మని, నా కాడ చిల్లిగవ్వ కూడా లేదు పొమ్మన్నాను. వాడు నా మీద చానా గుర్రుగా
ఉండాడు. మీరిద్దురూ రైలుకట్ట దాటి ఈ సైడుకి వొచ్చేయండి. ఈడ్ని చూసుకుందాం’’ అని సెల్‌ ఆపేసి నిలబడే ఓపిక లేక రైలు కట్ట పక్కన అడ్డ కమ్మి మీద కూలబడిరది శాంతమ్మ భుజం మీది గాయాన్ని తుడుచుకుంటూ. ముసిలిది తట్టలో ఉన్న మూడు రూపాయ బిళ్ళలను లెక్కబెట్టుకుంటానే ఉండాది గెంట నించి.
‘‘కష్టం మనది. పని మనది. ఈ శాంతమ్మకి మనం కమీషను ఇవ్వాలి. ఆమె పోలీసోడికి ఇవ్వాలి. ఈ తూరి నించి మనమే నేరుగా బేరం మాట్లాడుకోవాలి కృష్ణవేణి’’ సెంటు సీసా బ్యాగ్లో వేసింది అనిత.
‘‘అవును అనిత. వంద రూపాయలు కంట బడి వారం అవుతా ఉండాది. ఎండలకు ఏ బొక్కల్లో దాంక్కున్నారో సచ్చినోళ్ళు. రెగ్యులర్‌గా వొచ్చే వీరయ్య, నారిగాడు, పెంచెలయ్య కూడా రావడంలేదు’’ అంది వొక్కాకు తుపుక్కున ఊస్తా కృష్ణవేణి.
ఇద్దరు పట్టాలు దాటి రైలుకట్ట ఇవతలికి వొచ్చారు. అమావాస్య రోజు చంద్రుడి కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షిలా ఆవలిస్తా ఉన్న శాంతమ్మ పక్కనే అడ్డ ఇనప కమ్మి మీద కూలబడ్డారు ఉసూరుమంటూ.
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎప్పుడో వెళ్ళిపోయింది. గూడ్స్‌ బండి ఒకటి ముందుకు కదల్లేక కదల్లేక కదిలే గుడ్డి ముసిలి దానిలాగా చిన్నగా కదిలిపోయింది. గూడ్స్‌ బండి పోయినంతసేపు ఆత్రంగా అవతలిపక్కకి చూస్తా ఉండారు ముగ్గురు. రైలు గేటు ఇనప కమ్మి పైకి లేవగానే ఒక కారు, రెండు స్కూటర్‌ బండ్లు వెళ్ళిపోయాయి దుమ్ము రేపుకుంటూ.
మళ్ళీ చిమ్మ చీకటి. గుండెల్లో నుంచి ఎగజిమ్ముతున్న చిమ్మటి చీకటి. రైలు కట్టకి రెండు పక్కలా గుబురుగా పెరిగిన రెల్లు గడ్డి పొదలు నల్లటి దెయ్యాలు జుట్టు విరబోసుకుని వరసగా కూర్చున్నట్లు ఉండాయి. వేసుకొచ్చిన నాసిరకం మేకప్‌ అంతా చెమటకి తడిచి ముఖం మీదినుంచి మెడ మీదికి కారి తెల్లగా అట్టలు కడుతోంది. సెగల పొగల ఆ రాత్రి ఒళ్ళంతా సలపరంతో జ్వరం వచ్చినట్లు ఉండాది అనితకి. మధ్యాన్నం నాయర్‌ బంకులో బాకీ పెట్టి కొనుకున్న బన్ను రొట్టి తిని టీ తాగింది. మళ్ళీ ఇప్పటిదాకా ఏం తినింది లా. ఆకలితో పేగులు వానపాముల మాదిరి చుట్టుకుపోతా ఉండాయి.
గెంట పదిన్నర కావస్తా ఉండాది. పెద్దగా కూత పెట్టుకుంటూ వొచ్చి రెప్పపాటులో అల్లంత దూరానికి వెళ్ళి కనుమరుగైపోయింది జనశతాబ్ది సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.
‘‘శాంతక్కా. ఈ రేత్రికి ఎవురూ వొచ్చేటట్లు లేరు. ఆకలి పెరికి పారేస్తున్నది. ఈ తూరికి పోదాం పొండి’’ కృష్ణవేణి లేచి నిలబడిరది ఆ రోజుకు ఆశ వదిలేసుకొని.
‘‘ఏమే ముసిలి. బాగా పొద్దు పోయింది. ఇక తొంగోరాదా’’ అసహనంగా కదిలింది శాంతమ్మ.
ఇనప అడ్డ కమ్మి మీదనుంచి ముగ్గురూ లేచారు నిస్సత్తువగా. ముసిలిది పక్క గుడ్డలు పరుచుకుంటోంది చేసేదేమీ లేక. సరిగ్గా అప్పుడే చిరు ఆశ దీపంలా, మండుతున్న దావానాన్ని ఆర్పే పిల్ల తెమ్మెరలా కనపడ్డాడు తూలుకుంటూ తూలుకుంటూ వస్తున్న చెత్త బండి నారిగాడు. శాంతమ్మ ముఖం తామరపువ్వులా వికసించింది. అనిత ముఖం ఫీజు పోయిన బల్బులాగా మాడిపోయింది.
ముసిలిది ఆసక్తిగా లేచి కూర్చుంది. చాటంత ముఖం చేసుకుని నారిగాడి ముందుకు చటుక్కున దూకింది శాంతమ్మ.
‘‘రారా నారయ్య. పది రోజులనించి ఈ తట్టుకి రాలేదేమి’’ శాంతమ్మ వాకబు చేసింది. వాడేదో చిన్నగా శాంతమ్మ చెవిలో రహస్యం మాదిరిగా చెప్పాడు. శాంతమ్మ చేతికి రెండొందలు ఇచ్చి అనిత తట్టుకి చేయి చూపించాడు.
ఊబిలోకి కావాలని దిగాక బురద అంటుకుంటుందంటే ఎలా. ఆ చీకట్లో రైలుకట్ట పక్కన చిన్న రేకుల షెడ్డులోకి మౌనంగా నడిచింది అనిత. ఆమె వెనుక నారిగాడు తూలుకుంటూ వెళ్ళాడు.
బేరం తగిలిన ఉత్సాహంలో శాంతమ్మ కమ్మి మీద కూర్చుని కృష్ణవేణితో కబుర్లు చెబుతోంది.
రేకుల షెడ్డులో చీకటిగా ఉంది. నిప్పుల కొలిమిలా ఉంది. నేలంతా బురదగా ఉంది. లైట్‌ స్విచ్‌ అన్‌ చేసింది అనిత. జీరో వోల్ట్‌ బల్బ్‌లోనించి బులుగు రంగు వెలుగు రేకుల షెడ్డులో మసగ్గా పరచుకుంది. అనిత, నారిగాడు ఒకరికొకరు అస్పష్టంగా కనిపిస్తున్నారు.
నారిగాడికి మహా రంజుగా ఉంది. అనిత గొప్ప అందగత్తె. ఎన్ని రోజులనుంచో అనిత మీద మోజు వాడికి. డ్రెస్సు మీదికి పొంగుకొని వచ్చి సగం బయటకి కనపడే అనిత ఎత్తైన రొమ్ములు, సన్నటి నడుము వాడిని రోజూ నిద్రపోనీకుండా చేస్తాయి. రెండొందలిస్తే కాని అనితకాడికి పంపదు శాంతమ్మ రాక్షసి. వంద రూపాయలిచ్చి, నల్లగా ఉన్న కృష్ణవేణితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు. ఇప్పుడు రెండొందలు ఇచ్చి దర్జాగా అనితని కొనుక్నున్నానన్న ధీమా వాడిది.
నిలువెత్తు చెత్త కుండీలా ఉండే నారి గాడిని దూరం నుంచి చూస్తేనే వాంతి వచ్చేది అనితకి. ఇప్పుడు వాడికి దగ్గరగా, అతి దగ్గరగా, మరింత దగ్గరగా, గాలి ఆడనంత దగ్గరగా. అసహ్యాన్ని మనసులోనే దాచేసి చెమ్మ చెమ్మగా ముక్క వాసన వస్తోన్న నల్లటి కంబళి మీద పడుకుంది కళ్ళుమూసుకుని. నారిగాడు అనితకి మరింత దగ్గరగా జరిగాడు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సంబరంగా ఉంది వాడికి అనిత దగ్గరికి జరుగుతుంటే.
ఎప్పుడో తన చిన్నప్పుడు ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో తన క్లాసులో చాలా అందమైన అబ్బాయి ఉండేవాడు. అప్పట్లో తన మనసు ఆ అబ్బాయి దగ్గర పారేసుకుంది అనిత. ఇప్పుడు పేరు గుర్తులేదు కానీ అతని అందమైన రూపం మాత్రం తనని అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అతని రూపాన్ని ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంది.
కసుక్కున పైపెదవి మీద నారిగాడి పళ్ళు దిగబడ్డాయి. సర్రున పొంగింది రక్తం. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఊహలనుంచి వాస్తవంలోకి జారిపడిరది అనిత. భల్లూకంలా అనితని చుట్టేస్తున్నాడు నారిగాడు ఊహలెప్పుడూ వాస్తవాలు కావన్నంత నిజంగా.
నారిగాడి ఒంటి మీద నుంచి చెమట కంపు. వాడి గుడ్డల నుంచి చెత్త కంపు. వాడి నోటి నుంచి సారాయి కంపు. చటుక్కున లేచి వాడిని తోసేయాలనుకుంది. అంతలోనే ముగ్గురు ఆడపిల్లలను తన మీదికి వదిలి, దేశాలు పట్టి పోయిన మొగుడు చంద్రయ్య గుర్తుకు వచ్చాడు. డేగ కళ్ళు, రాబందు కాళ్ళతో వలవేసి వేటాడి తన బతుకుని నాశనం చేసిన పక్కింటి ముసలోడు గుర్తుకు వచ్చాడు. ముగ్గురు కన్న కూతుర్ల బడి ఫీజులు గుర్తుకు వచ్చాయి. నాయిరు బంకులో పొద్దున్న తిన్న బన్న రొట్టెల బాకీ గుర్తుకు వచ్చింది. కూలి పని కోసం పోతే తనని ఈసడిరచి తరిమేసిన బిల్డర్‌ గుర్తుకు వచ్చాడు. అంతే, నారిగాడి దగ్గర నుంచి వచ్చే కంపులన్నీ మంచి గంధపు వాసనలా ఇంపులుగా మారిపోయినాయి అనితకి.
తల నుంచి కారిన చెమట, కన్నీటితో కలిసి పైపెదవి గాయం మీది రక్తంతో కలిసిపోతున్నాయి. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా విజయ గర్వంతో అనిత మీది నుంచి లేచాడు నారిగాడు. బయటికి వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి తిరిగి చెడ్డి జేబులో చేయి పెట్టి చాలాసేపు లోడి బయటకు తీసి అనిత చేతికి ఇచ్చాడు పళ్ళు బయటపెట్టి నవ్వుతూ.
నీలం రంగు మసక వెలుతురులో తళుక్కున మెరిసింది ఐదొందల నోటు.
‘‘లోపలికొచ్చేముందే శాంతమ్మ రెండొందలు అడిగి తీసుకుంది. నీకు వంద అయినా ఇస్తుందో లేదో ఈ ఐదొందలు తీసుకో అనిత. పెద్ద పని తలిగి ఈ డబ్బులు వచ్చాయిలే. ఈ తూరి లాడ్జికి తీసుకపోతా నిన్ను’’ ముద్దముద్దగా వొచ్చాయి మాటలు. ఎర్రి నవ్వు నవ్వతా తూలుకుంటూ బైటకు వెళ్ళిపోయాడు నారిగాడు.
ఆనందమో, దుఃఖమో తెలియని భావం. జీవితం మీది ఆశ, బిడ్డల మీది పాశం. ఐదొందల నోటుని జాకిట్లో దోపుకుని రేకులషెడ్డు నుంచి బయటకు వచ్చింది అనిత.
కృష్ణవేణి అడ్డకమ్మీ పక్కన చారగిలబడి గురక తీస్తోంది. ముసిలిది రాని నిద్రని తిట్టుకుంటూ కళ్ళుమూస్తూ తెరుస్తూ అవస్థ పడతా ఉండాది. పంటిగాటు గాయంతో ఉబ్బిన పైపెదవిని చేతిగుడ్డతో అదుముకుంటూ వచ్చిన అనితని తన ఎక్స్‌రే కళ్ళతో స్కాన్‌ చేసింది శాంతమ్మ తల పండిన అనుభవంతో. లోనెక్‌ డ్రెస్సులో నుంచి పొంగుకొచ్చిన రొమ్ము ఐదొందల నోటుని శాంతమ్మ కళ్ళబడకుండా దాచలేకపోయింది.
శాంతమ్మ చూపులను పసిగట్టిన అనిత నోటుని మరింత లోపలికి దోపుకోబోయింది తత్తరపాటుగా.
‘‘ఐదొందల నోటు బయటకు తీయే అనిత. అది నాకు ఇచ్చేయ్‌. నీకు రెండొందలు ఇస్తాను’’ అంది శాంతమ్మ.
‘‘ఈ మధ్య బేరాలు చాలా తక్కువ శాంతక్కా. నీకు తెలియనిదేముంది. డబ్బులు కళ్ళబడి చానా దినాలు అయింది. చానా ఖర్చులు ఉండాయి. నువ్వే వంద రూపాయలు ఇచ్చాలి నాకు’’ అంది అనిత.
‘‘నారిగాడు ఇచ్చిన ఐదొందలు ఇస్తావా లేదా? నా తాన కూడా డబ్బులే లేవు’’ శాంతమ్మ గొంతులోని హెచ్చుని గమనించింది అనిత.
‘‘నారిగాడు నీకు ఇవ్వాల్సిన రెండొందలు ఇచ్చాడు. ఇది నాకు ఇచ్చాడు’’ మరింత హెచ్చు స్థాయిలో అనిత స్వరం.
ముసిలిది లేచి కూర్చుని ఆసక్తిగా చూస్తోంది. కృష్ణవేణి గురక ఎగిరిపోయింది. లేచి నిలబడి శాంతమ్మ, అనితల మధ్యకి వచ్చింది. విషయమంతా అర్థమైపోయింది కృష్ణవేణికి.
‘‘శాంతక్కా… ఇది నీకు న్యాయంగా ఉండాదా చెప్పు. ఆ ఎమ్మి కష్టపడి సంపాదించుకుంది ఐదొందలు. నీ కమీషను రెండొందలు నారిగాడు నీకిచ్చాడు కదా’’ కృష్ణవేణి జుట్టు మెలితిప్పి ముడి వేసుకుంది.
‘‘ఆ ఇచ్చినాడు మీ. మీరు సుకంగా పోయి లాడ్జిల్లో, షెడ్డుల్లో పడుకుంటే, ఈడ పోలీసోళ్ళకు ఎదురు పోయి కమీషనిచ్చి, వాళ్ళ చేత లాఠీ దెబ్బలు తిని, వాళ్ళ చేతి… చ్చుకొని, వాళ్ళ కాళ్ళమీద పడి బతిమాలుకొని కేసులు లేకుండా నేను చేసేది కష్టం మాదిరి అవపడడంలేదా మీకు’’ ఒంగి పిక్కల మీది లాఠీ దెబ్బలు తడుముకుంటా అంది శాంతమ్మ.
‘‘ఈ తూరికి వొదిలెయ్‌ శాంతక్కా. బళ్ళు తీస్తా ఉండారు. పిలకాయల బడి ఫీజులకి కావాలి నాకు’’ ఐదొందలు మడిచి లోనెక్‌ డ్రెస్సులోకి దోపుకుంది అనిత. ముసిలిదానికి రాబోయే నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది. ఏం జరుగుద్దో అని ఆత్రం ఎక్కువై లేచి కూర్చుంది.
ఊహించని వేగంతో కదిలి అనిత డ్రెస్సులోకి చేయి దోపి ఐదొందల నోటుని లాగేసుకుంది శాంతమ్మ.
ఇద్దరూ కలబడ్డారు. పెట్టుకున్న పూలు రాలిపోయినై. జుట్టు ముడులు ఊడిపోయినై. చీరలు, డ్రెస్సులు చినిగిపోతున్నాయి. కృష్ణవేణి కూడా కలబడిరది వాళ్ళతో ఐదొందలు దొరికితే తీసి అనితకి ఇవ్వాలని. ఐదొందలు ఎవరికి దక్కుతాయా అని ముసిలిదానికి ఆరాటం ఎక్కువైంది. కాట్ల కుక్కలు కలబడినట్టు ముగ్గురూ కలబడి చీరలు లాక్కున్నారు, జుట్లు తెంపుకున్నారు, డ్రెస్సులు చింపుకున్నారు.
‘‘ముదనష్టపు ముండల్లారా…! వొచ్చిన డబ్బుని ఏదో మాదిరి తీసుకొని అందరూ సర్దుకోకండా, ఐదొందల నోటుని మూడు ముక్కలు చేస్తిరి గదే. గొయ్యి తవ్వి మిమ్మల్ని కప్పెట్ట’’.
ఏనాటి దుఃఖం గావనానికొచ్చిందో ఏమో ముసిలిది లబ లబ లాడుతూ తల బాదుకొంటోంది. పట్టాల మీద రైలు ఆగకుండా వెళుతోంది వేగంగా.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.