‘‘ఛీఛీ.. మనుషులా.. మృగాలా.. ఊహూ.. మృగాలు అంటే వాటిని అవమానించినట్లే..’’
‘‘ఏందమ్మా .. ఏమైంది అట్లా తిట్టుకుం టున్నావు’’ అంటూ వచ్చింది యాదమ్మ.
‘‘ఏం లేదులే..’’
‘‘అమ్మా.. ఈ మొగోల్లకు ఆడోల్లంటే ఎత్తుపల్లాల మాంసపు ముద్దలేనా.. యాడనో ఆడెవడో పెద్దోళ్ల పోరడు ఆడోళ్లను రేప్ చేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్చేసిండట గద’’ అంటూ పనిలో పడిరది యాదమ్మ.
సోషల్ మీడియా సామాన్యమైంది కాదు. నిముషాల్లో సమాచారాన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి కుమ్మరిస్తుంది. అలా వచ్చిన ఈ విషయం యాదమ్మ దాకా చేరింది అను కుంటూ ఆలోచిస్తున్నా.
ఒక మాజీ ప్రధాని మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అన్న ఇంగితం లేకుండా ఎంత దిగజారిపోయాడు. జేడీఎస్ నుంచి లోకసభకు ఎంపికైన ఏకైక సభ్యుడి గాను, చిన్న వయస్కుడిగా ప్రజ్వల్ రేవణ్ణ గుర్తుండిపోయాడు. కానీ ఇంత నీచుడని ఇప్పుడిప్పుడే తెలిసింది.
2800 మందిపైగా యువతులు, మహి ళలపై లైంగిక దౌర్జన్యం చేసి వీడియోలు తీసి వాటి సాయంతో బాధితులను లొంగ దీసుకున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
అతని బాధితుల్లో ప్రభుత్వ మహిళా
ఉద్యోగులు సైతం ఉన్నారు. 16 ఏళ్ల నుండి 60 ఏళ్ల మహిళలున్నారు. వీరిలో ఎస్సీ ఎస్టీ మహిళలు, కార్మికులు, అంగన్వాడీ కార్య కర్తలు, పోలీసు అధికారులు కూడా ఉన్నా రంటున్నారు. ఇంత జరిగిందంటే మాములు వ్యక్తికి సాధ్యమా?
అధికారం, అర్ధబలం, అంగబలం పుష్టిగా ఉన్నాయన్న అతని ధీమా వల్లనే కదా అతడు ఇంతకు తెగించింది. అందువల్లనే కదా విషయం ఇన్నాళ్లు బయటికి పొక్కకుండా
ఉంచగలిగింది.
పిల్లికి మెడలో గంట కట్టేవారేవ్వరూ లేరనుకున్నారు కానీ ఆ ఇంట్లో పనిచేసిన మనిషే ఆ పని చేసింది. ఎవరైనా ఎంతకని సహిస్తారు?
2019 నుంచి 2022 వరకు పలు మార్లు అతని చెరలో బందీ అయిన ఆమె చివరకు తెగించింది. ప్రజ్వల్ రేవణ్ణ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని విషయాన్ని బయట పెట్టింది.
ఎంత అధికార దన్ను ఉన్నా, సొమ్ము లున్నా ఏదో ఒకరోజు పాపం పండకపోదు. ఇప్పుడు ప్రజ్వల రేవణ్ణ విషయంలో అదే జరిగింది. పాముల పుట్టలో దాగిన విషయా లన్నీ ఒకొక్కటి బయటికి పొక్కడం మొదల యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు 2800 లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రపంచానికి తెలిసింది. వీడియోల పెన్ డ్రైవ్‌లు అన్ని రాజకీయ పార్టీల నేతలను చేరాయి.
అయిదారేళ్ళ క్రితం వీడియోలు చూపి బదనాం చేస్తున్నారని, ఫిర్యాదు ప్రజ్వల్ ఇంట్లో పనిచేస్తున్న మహిళ నుంచి వచ్చిందని .. ఇంతకు ముందు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ప్రశ్నించిన పెద్దమనిషే ఇప్పుడితన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు.
నేరం ఎప్పుడు జరిగినా నేరం నేరమే కదా.. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాల్సిందే కదా..
నేరస్తుడికి అప్పుడు, ఇప్పుడు టికెట్ ఎట్లా ఇచ్చినట్లో..?
చేసుకున్న చట్టాలను చట్టుబండలు చేసి, అధికార మదంతో మరింత రెచ్చిపోయి మహిళలపై మరిన్ని లైంగిక దాడులు చేయడానికా?
పెద్ద సెక్స్ స్కాండల్‌గా ప్రచారమైన ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి ఏప్రిల్ 26న ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కర్ణాటక ప్రభుత్వం దీనిపై సిట్ విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించింది.
బతికుంటే బలుసాకు తినొచ్చనుకు న్నాడో.. లేక రేపటి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చనుకున్నాడో కానీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయాడు.
హిందూ మహిళల మంగళసూత్రాల రక్షణ గురించి మాట్లాడిన గద్దెమీది పెద్దలకు ఈ మహిళలు కనబడలేదా?
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సీరియల్ రేప్ వీడియో రికార్డ్ చేసి పెన్‌డ్రైవ్‌లో ఉంచితే వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా గప్‌చిప్‌గా సరిహద్దులు దాటించేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ పోటీచేసిన హాసన్ లోక్ సభ ఎన్నిక ఎటూ అయిపొయింది. ఇంత దుమారం జరిగాక చర్య తీసుకోకపోతే ఎన్నికలు జరగాల్సిన చోట ఫలితాలు తారుమారవుతాయేమోనని భయంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఎన్నికల వేళ కాబట్టి తప్పనిసరై జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. లేకపోతే ఈ నిర్ణయం జరిగేదా?
నిజానికి, గత డిసెంబర్‌లోనే బిజెపి నేత దేవరాజ్ గౌడ లేఖ ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల విషయం తెలిపారు. మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రీతమ్ గౌడ, ఆర్.టి రామస్వామి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
అయినా మోషాలు మౌనంగానే.. ఎన్డీయే అభ్యర్థిగా ప్రజ్వల్ ఎన్నికల రణరంగంలోనే..
కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ఆరోపించినట్లు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ అతన్ని కాపాడుతున్నది?!.
ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కన్పిస్తున్నదా.. అతడేనన్న ఆధారం ఏంటని వాగిన నోళ్లు ఇప్పుడేం చెబుతాయి?
అమ్మలూ, అక్కలూ, అన్నలూ, అయ్యలూ మన దగ్గర ప్రజ్వల్ లాంటి దగుల్బాజీలు ఎవరైనా ఎన్నికల్లో నిలబడి ఉంటే వారికి మనం ఓటేయొద్దు. మహిళలను గౌరవించే వారికి ఓటు వేద్దాం.
డబ్బులో, మద్యమో, మరేదో ప్రలోభాలకు కాకుండా మహిళలకు రక్షణ కల్పించే వాళ్లకు ఓటు వేద్దాం.
మహిళలను శక్తిగా కొలుస్తామని గొప్పగా చెప్పుకునే కూటమి సొల్లు కబుర్లు వినడం కాదు. మహిళల్ని అవమానించిన నీచులకు తగిన గుణపాఠం చెప్పాలిసిన సమయంలో ఉన్నాం. ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉన్నది. దుష్ట శిక్షణ చేయా ల్సిందే. తప్పదు.