అనివార్య పెనుగులాట ` దాస్తాన్‌ – కె.శాంతారావు

చీమలు సంఘటిత శ్రమజీవులు. తమ పుట్టను తామే నిర్మించుకుంటాయి. ఆ పుట్టే వాటి ప్రపంచం. శ్రమచేయడం, ఆహారాన్ని తెచ్చుకోవడం, కూడబెట్టుకోవడం, తినడం ` అదే జీవనయానం. అదే లోకం వాటికి. కానీ శత్రువు (పాము) ప్రవేశించి పుట్టను ఆక్రమించినప్పుడు ఆ శత్రువు ఆకారము ఆది మధ్యాంతము కాంచకపోయినా అనివార్యమై జీవన్మరణ పెనుగులాట వీటికి తప్పదు. అప్పుడు కొన్ని మరణిస్తాయి కూడా.

అంతిమంగా పాము చస్తుంది. ఇది ప్రకృతి సూత్రం. మనుగడ కోసం సాగే జీవన పోరాటం. ముస్లిం ప్రపంచం. అందునా దిగువ మధ్యతరగతి, నిరుపేద జీవన ప్రపంచం. ఇతర మతాల్లో మాదిరి ఈ మతంలో కూడా మతంతో పెనవేసుకున్న పురుషాధిక్య, లింగ వివక్ష జీవితంలో చొరబడి తరతరాలుగా బాలికలను, మహిళలను నరకయాతన పెడ్తున్న వేళ… ఓ విస్పష్టమైన విచక్షణా చక్షువులతో పంకిస్తూ, పాఠకులకు ఆ కఠోర వాస్తవ చూపును అందిస్తున్నప్పుడు ఆలోకమే వేరుగా కనిపిస్తుంది. ఆ చీమల పుట్టలో వుండే కటిక చీకటి ఎత్తుపల్లాలు, మూలమూలలను శోధించి చూపుతున్నప్పుడు, అలాగే ఆ భయంకర వివక్ష విషసర్పంతో పెనుగులాడే తీరును కళ్లకు కడుతున్నప్పుడు పాఠకుల కళ్లు చమర్చకుండా ఎలా వుంటాయి? నస్రీన్‌ ఖాన్‌ ‘దాస్తాన్‌’ లోని పది కథలు చిన్నవైనప్పటికీ చదువుతున్నప్పుడు దశావతారాలను తలపిస్తాయి. రచయిత్రికి జీవితం పట్ల ఓ స్పష్టత, గాఢమైన అనురక్తి ఉన్నదని చెప్పడానికి ఈ మాటలు చాలు… ‘‘సమాజంలో ఎంతటి బలమైన బంధాలు వున్నా, అంతే లోతైన సంఘర్షణలు వుంటాయి. ఆ సంఘర్షణలు ఎదుర్కొంటూ, జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడపగలగాలి’’. ` రచయిత్రి చెప్పుకుంటున్నట్టు ‘అన్ని కథల్లోనూ స్వేచ్ఛపై కాంక్ష వుంటుంది. ప్రతి పాత్ర తన సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందడుగు వేయడం కనపడుతుంది’. అంటే ఈ కథలు ఓ చారిత్రక ఆశావహ దృక్పథంతో అల్లుకున్నవనీ, అంతే వాస్తవంగా జీవితానుభవం నుండి ఉద్భవించిన కథలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన ముందున్న సమకాలీన సామాజిక దశ ఓ పోరాటాల కాలం. ముస్లిం మహిళలు పోరాటాల్లో పాల్గొనవచ్చా? అన్నందుకు సమాధానంగా ‘ముందు మాకు భయాన్ని పరిచయం చేస్తారు. ఇప్పుడు కూడా అంతే. సోదరీమణులారా మనందరం ఒక్కటే. మన పిల్లలను హింసించిన వారు ఇప్పటికైనా విడిచి పెట్టాలంటే మనం రోడ్లపై అట్లా కూర్చోవడమే కరెక్టు’. ఆమె గొంతు స్థిరంగా పలికింది (లాపతా). భారతదేశ ఆందోళనా పోరాటాల్లో ముస్లిం మహిళలు సైతం ముందే వుంటారని చెప్పడానికో నిదర్శనం.
‘ఆడోల్లు బతకాల్సిన బతుకంతా మొగోల్లే బతుకుతుంటారు. శరీరం ఆడోల్లదయినా ఆల్ల మెదడు నిండా మొగోల్ల మంచిచెడ్డలే తిరుగుతుంటయ్‌. ఆల్లకు నచ్చే తిండి, మెచ్చే బట్టా మనమే తయారు చేసి పెట్టాలె. మొగోల్ల ఆలోచనల్ల ఆడది తోలుబొమ్మ అయ్యేటట్టు లోకమే తయారు చేసింది బేటా’ (అర్థపురుష్‌). గతం నుండి ఆక్రమించిన భావ పరాధీనత. ‘‘నా జిందగీని సరైన దారిలకు నడిపించుకునే కెపాసిటి నాకుంది. మీరందరూ వున్నరుగా నాకు సపోర్టుకు. అతడు నాకు స్పెర్మ్‌ డోనర్‌ తప్ప మరేమీ కాదు. అసలు వాడు డోనర్‌ కాదు. మనం దహేజ్‌ ఇచ్చి వాడ్ని కొనుకున్నాం అంతే’’ ` స్థిరంగా పలికే పలుకులైనా కఠిన వాస్తవికతకు దర్పణం (దిశ మార్చుకున్న గాలి). ‘ఏదైతే అదయింది. అబద్దం చెప్పి అతడి వద్ద పడుండాల్సిన అవసరం లేదు. నా బతుకు నేను బతికేయగలను. నన్ను బానిస అనుకునే వాడికోసం నా సామాజిక జీవనాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏమిటి?’ ` ఇదో నిశ్చయం. సంకల్పం, తెగింపు. జీవితాన్ని సౌందర్య భరితంగా మార్చే పోరాట మలుపు (పంఛీ అవుర్‌ పింజా).
‘నిండా ప్రేమను మాత్రమే నింపుకుని/ శ్రమనే దైవమనుకున్న పిచ్చిమనిషి/ ఎవరో కాదు నాతోటి మనిషి’ ` రసభరిత ఆరంభ వాఖ్యాలు. మనిషి తనపు పరిమళాలు (కలల కల్లోలం). ‘అరవయ్యేళ్లు దాటితే మనిషి చనిపోవాలా? వృద్దాప్యం ఇంతలా భయపెడుతుందా? మనుషులను… మరో పాతికేళ్లలో తనూ అరవైకి చేరుతుంది. అప్పుడు తను కూడా ఇలాగే ఆలోచిస్తుందా? తల్లిదండ్రులకు ఇటువంటి సంక్షోభం తప్పదా?’ ` ఆత్మ విశ్లేషణ (భరోసా). ‘నడక నేర్చుకున్న వాళ్లకి అడుగులు వేయడం నేర్పాలనుకోవడం ఎంతటి అవివేకం? ఆంక్షల నడుమ బతకడమంటే మనం శవంతో సమానం’ ` జీవన సారం నుండి పుట్టుకొచ్చిన కొత్త సామెతలు (నయాదౌర్‌). ‘కంటికి మంచి చేసే ఆకుపచ్చని రంగుతో దినచర్య మొదలవడం ఎంతో హాయినిస్తుంది. లేలేత సూర్య కిరణాలు ప్రసరిస్తూ మెరిసే ఆకుల మాటు నుంచి వచ్చే సన్నటి పక్షి కూతలు వింటూ టీ తాగడం జిందగీలో కెల్లా గొప్ప అనుభూతి’ ` చిన్నచిన్న ఆనందాల్ని వెతుక్కుంటూ హాయిగా అనుభవించడమే ఓ అద్భుతమైన జీవన కళ.
‘ఎప్పుడూ నా చిటికెన వేలు పట్టుకుని తిరిగే చిన్ని తమ్ముడు, తొలిసారి ఎత్తుకుని బడికి తీసుకెళ్లిన నా తమ్ముడు (నాపై) చెప్పులు విసిరికొట్టాడు. ముఖంపై గట్టిగా తాకాయి. రెండు పెదవులు చిట్టిపోయి రక్తం కారాయి’ ` పసివయసులోనే పురుషాహంకారం నూరిపోయడం అంటే ఇదేగా… (దూప్‌ చావ్ర్‌). తెలిసీ తెల్వక పిల్లలు తప్పుజేస్తే అందరు తల్లితండ్రులు గుండెల్లో పెట్టుకుని చూస్తారనుకోవడం భ్రమే. కడుపున పుట్టిన పిల్లలు కంటే సొసైటీ అనుకునే ముచ్చట్లకే విలువెక్కువ’. ` ఈ కారణాన పరిస్థితుల ప్రభావంతో జీవితాలే తారుమారు అవుతాయి. నిత్య సంఘర్షణగా మారుతాయి (వియర్డ్‌). ‘అసలు ఆ రోజే నేను స్కూలుకు వెళ్లి వుంటే నన్ను ఇంత గలీజుగా మాటలనేవాళ్లా?’ (మగపిల్లల వేధింపులు) ఏడుస్తూనే తల్లిని ప్రశ్నించింది. ఆ రోజు అంటే నమ్రీన్‌ పుష్పవతి అయిన రోజు. ` బాలికల్లో సహజంగా జరిగే మార్పు పుష్పవతి కావడం. ఈ చర్యకు ప్రతిచర్య వికృతంగా వుంటే ఆ ప్రభావం జీవితాన్ని నిత్యం నీడలా వెంటాడుతుంటుంది (పాన్‌). ఇలా పది కథలు చాలా భిన్నమైనవి. బలమైన జీవిత వాస్తవికత ఇతివృత్తంగా కలవి. భాషా పటిమ, శిల్ప సౌందర్యం హృదయాన్ని హుందాగా హత్తుకుంటాయి. కాలానికి తగినట్లుగానే దోపిడి పంజా బలం పుంజుకుంటున్నకొద్దీ సరికొత్త చైతన్యం ఉద్భవిస్తూనే వుంటుంది. ఇదే నవయుగానికి సూచిక’ అని డా॥ ఎస్‌.కె. సాబరా తొలి పలుకులో తెలిపారు. ఈ నవయుగ సంఘర్షణలు తెలుసుకోవాలంటే ఈ పరిణతి కథల పుస్తకం తప్పక చదవాల్సిందే..

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.