స్థలకాలాలను లోనిముడ్చుకొనే విశ్వ చేతనలో మనిషి ఒక భాగం! సకల చరాచర జీవరాశులలో భాగమైన మనిషి, ఆరవజ్ఞానం కలిగి ఉన్న మనిషి, ప్రకృతిని వశపరచుకొని, ప్రకృతిని జయించాలని అనునిత్యం తాపత్రయ పడుతున్న మనిషి ఎప్పుడూ విజేతగానే మనుతున్నాడని అనలేం.
తరతరాల మానవజాతిలో, ఒక తరం ఆనందంగా జీవిస్తుంటే, మరొక తరం విషాదాన్ని మోయడం సృష్టి నైజం. అలా విషాదానికి గురవుతున్న (క్రీ.శ. 1820 నుండి, 1947-48 మధ్యగల) ఒక తరం యొక్క తిరోగమన చరిత్రను, గ్రంథస్థం చేసిన నవల, యీ విషాద కామరూప అన్న నవల.
అస్సామీ భాషలో, సాహిత్య అకాడమీ అవార్డు (2000) ను పొందిన, ‘చెదలు పట్టిన అంబారీ’ అన్న అర్థాన్నిచ్చే ఊనే ఖోవా హౌదా అన్న నవల శ్రీమతి ఇందిరా గోస్వామి (మమోనిరైసామ్ గోస్వామి- (1942-2011) గారి రచన. కేంద్రసాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ, అస్సాం సాహిత్య సభల పురస్కారాలనెన్నిటినో అందుకున్న వీరు, అస్సాం, దక్షిణ కామరూపలోని ఒక మారుమూల ప్రాంతమైన ‘రాజపుఖానీ సత్త్రా (వైష్ణవ మఠం) నేపథ్యంతో రాసిన చారిత్రక నవల ఇది. అతి కొద్ది మందికి మాత్రమే అర్థం కాగల, దక్షిణ కామరూప మాండలికంలో తొలుత రాయబడినందున, రచయిత్రి తామే ‘‘ఎ సాగా ఆఫ్ కామరూప్’’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘సెంటర్ ఫర్ కంపేరటివ్ స్టడీస్’లో డైరెక్టర్‌గా నుండిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు, ఒక చారిత్రక నవలను అనువదించాలన్న కోరికతో, మూల విధేయంగా యీ నవలను ‘‘విషాద కామరూప’’ పేర తెలుగు వారికి అందించారు (2002). ‘‘సంస్కృతి కథనం ‘విషాద కామరూప’ కు ఓ విశిష్టతను తెస్తే, విధివంచితులైన, క్రూర వైధవ్య దుఃఖపీడితులైన వివిధ వర్గాల వ్యధార్త స్త్రీల గాథలు యీ నవలకు ఒక అనన్యతను కలిగించింది. ఓ ప్రగాఢతను చేకూర్చింది . ఆధారం: సాహిత్య చరిత్రతో సహయానం: ఆధునికత-సమకాలికత, (కొన్ని పార్శ్వాలు): ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, పుట-95’’అన్న అభిప్రాయం, ఈ నవల నామౌచిత్యాన్ని నిరూపిస్తూ ఉండగా, ఆ కాలంనాటి సాంస్కృతిక శైథిల్యాలు మనసును కలచివేస్తాయి.
పందొమ్మిదవ శతాబ్దం భారతదేశంలోనే ఒకానొక అస్థిరతను సృష్టించిన ఒక అధీర శతాబ్దం. ఆంగ్లేయుల ప్రసక్తితో, ప్రజలజీవనంలో సాంస్కృతికశైథిల్యాన్ని నింపిన శతాబ్దం అది. దక్షిణకామరూపలోని రాజపుఖానీ సత్త్రా కూడా దీనికి మినహాయింపు కాదని ఈ నవల నిరూపిస్తుంది. చారిత్రక జీవనం, సాంస్కృతిక జీవనాలు పడుగు పేకల్లా అల్లుకొని సాగిన ఈ నవలకు రచయిత్రికి చెందిన రాజపుఖానీ సత్త్రాలో లభ్యమైన రికార్డులు, చారిత్రక నేపథ్యాన్ని అందిస్తుండగా, బాల్యం నుండి తాను స్వయంగా చూసిన సామాజిక పరిస్థితులు, వితంతువుల దయనీయమైన జీవనాలు, ప్రజల జీవనాలను నిర్వీర్యం చేస్తూ, వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న నల్లమందు వ్యసనాలు, అప్పుడప్పుడే తలెత్తి, భీకరంగా ఘోషపెడుతున్న కమ్యూనిస్టుల సమానవాద తత్త్వాలు, ఫలితంగా రైతులలో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణులు. ఇలా ఆనాటి అస్తవ్యస్తమైన సామాజిక పరిస్థితులను ఈ నవల కథనం చేస్తుంది.
అస్సాంను పాలించిన అహోమ్ మహారాజులు, సత్త్రాలకు చెందిన బ్రాహ్మణ అధికారుల (గోసాయిలు)కు భూములను దానంగా యివ్వడం, ఆ అధికారులు కొంతమంది శిష్య పరంపరను ఏర్పాటు చేసికొని, వారి మన్ననలను పొందుతూ, తమ భూములను వారితో సాగుచేయించుకుంటూ, తమ జీవనాన్ని గడుపుతూ ఉండటం, అడవి ఏనుగులను మాలిమి చేసుకొని, శిష్యులదగ్గరికి వెళ్ళినా, పంటల సాగుబడిని పర్యవేక్షించడానికి వెళ్ళినా, ఏ శుభకార్యాలకు వెళ్ళినా ఆ ఏనుగులపై అలంకరించిన అంబారీలలో వెడుతూ, తమ హోదాను చాటుకునే సత్త్రా అధికార్ల జీవనంలో వచ్చిన శిథిలతను చూపే నవల ఇది.
ఈ సత్త్రాలో మూడవతరం నాయకుడు ఇంద్రనాథ్ సత్త్రాకు అధికారిగా కాగల వారసుడు. అంధవిశ్వాసాల పట్ల నిరసనభావం, అందరూ బాగుండాలి అన్న మానవతా వాదం, పేద ప్రజల పట్ల కరుణ భావం, వితంతువులుగా తమ యింటికి వచ్చిన మేనత్త దుర్గ, చెల్లెలు గిరిబాల, చిన్నాన్న మరణానంతరం ఒంటరిగా ఉంటూ, స్వయంగా తానే వెళ్ళి తన శిష్యపరంపరను కలుస్తూ, ధీరోచితంగా బ్రతుకుతున్న పినతల్లి చిన్నగోసాయినిల పట్ల ఆదరాభిమానాలను కలవాడు. కాబోయే గోసాయిగా తాను చూపవలసిన నియమ నిబంధనలకు, కరుణతో కూడిన మనసు ఘోషపెడుతున్న మానవతకు మధ్య నిర్దాక్షిణ్యంగా నలిగిపోయినవాడు. ఆముదపు ఆకుల మీద పెరిగే పురుగుల నుండి తీసే ఎండీ పట్టు పంజాబీ చొక్కాలతో రాజసంగా కనిపించే ఇంద్రనాథ్ మనసు మాత్రం బహు సున్నితమైనది. ఒకప్పుడు వైభవంగా వెలిగి, క్రమంగా క్షీణించి పోతూ ఉన్న తమ సాంస్కృతిక శైథిల్యానికి మౌనసాక్షి అతడు.
1815-1828ల మధ్యకాలంలో సతీ ఆచారంలో సజీవదహనం చేయించడానికి, భర్త చనిపోయిన భార్య చేత నల్లమందును తినిపించి, ఢాకాలో 710 మందిని, కలకత్తాలో 5100 మందిని సజీవ దహనం చేశారని తాను చిన్నప్పుడు విన్న విషయాన్ని అతడు మరిచిపోలేదు. తమ సత్త్రాలోని శోభారహితమైన గుడిసెలను చూస్తూ నిశ్శబ్దంగా చింతించే ఇంద్రనాథ్, నల్లమందుకు బానిసలైన ప్రజలను ఉద్ధరించే మార్గం తెలియక విలవిల లాడుతాడు. నల్లమందును దొంగతనంగా రవాణా చేసే వ్యాపారికి, తమ సత్త్రా పూజారి, జోక్రామ్ భగవతి ఆ సరకును దాచిపెట్టడంలో సహాయం చేస్తున్నాడని తెలిసినా ప్రభుత్వానికి విషయం చెప్పడానికి జంకుతాడు. కారణం, తమకు గురుతుల్యుడైన పూజారి జైలుకు వెడితే తమ సత్త్రాగౌరవం ఏమవుతుందన్న మిథ్యకు లోనుకావడం వలన! మిథ్యా గౌరవాలమధ్య బ్రతకలేక, తల్లిదండ్రులకు విడమరిచి చెప్పలేక మధ్య నలిగిపోయినవాడు ఇంద్రనాథ్. అయినా తన చెల్లెలి విషయంలో ఒక సాహసమైన కార్యాన్ని చేయగలిగాడు.
అస్సాంలో తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి వచ్చిన మార్క్ సాహెబ్ (దొర)కు సాయం చేయడానికి, ఎంతో భవిష్యత్తు ఉంది అని తాను నమ్మిన తన చెల్లెలు గిరిబాలను నియమించగలిగిన విశాల హృదయుడు. చిన్న గోసాయినిని గురించి ‘ఒంటరిగా శిష్యపరంపర దగ్గరికి పంట ధరల వసూళ్లకు వెడుతున్నద’ని మాట్లాడిన తన తల్లి అత్తలతో, ‘‘తప్పేముంది. మీరిలా ఇంట్లోనే కూర్చోకపోతే పొలం దగ్గరికి వెళ్లివస్తే ఏమి?’’ అని ప్రశ్నించగలిగిన అభ్యుదయవాది.
మెట్టినింట చనిపోవడమే స్త్రీకి గౌరవమని నమ్ముతున్న నాటి సమాజంలో, ఎప్పటికైనా తన అత్తింటినుండి తనకు పిలుపు వస్తుందని ఎదురుచూస్తూ, క్షయవ్యాధితో చనిపోయిన దుర్గత్త, మార్క్ దొరను ప్రేమించి, అతని నుండి ఎటువంటి స్పందన లేనందుకు చింతిల్లి, ప్రాయశ్చిత్తంలో భాగంగా, మండుతున్న గుడెసెలోనుంచి బయటకు రావడానికి అవకాశమున్నా, అలా రాక, గుడిసెతో బాటే తగలబడిపోయిన గిరిబాల. రోజురోజుకూ పేదరికంలో మగ్గుతూ, పంటల ధనం వసూళ్లకై తనకు సహాయంగా ఉంటాడనుకున్న మహీధర్, తనను మోసపుచ్చి భూములను అతనిపేర మార్పించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని చూసి మనుష్యులపట్ల నమ్మకాన్ని కోల్పోయిన చిన్నగోసాయినీ. వీరందరూ సంప్రదాయాల శైథిల్యతకు బలిగావింపబడిన వారే! మనతో బాటు వారిపట్ల సానుకూల భావనలను కలిగిన ఇంద్రనాథ్‌ను కూడా నిరుత్తరుని చేసిన విషాద గీతాలే!
ఎంతో వైభవంతో, గోసాయీల మాటను జవదాటని శిష్యపరంపరతో సంస్కృతి సంప్రదాయాలలో తాము నమ్మిన పద్దతిలో బతికిన ప్రజలలో కాలంతోబాటు ఒక విచ్ఛేదకర పరిస్థితి నెలకొనింది. రజస్వల కాకముందే వివాహం చేయాలన్న నియమం ఎందరినో వితంతువులుగా మారుస్తుంటే, ధనహీనులైన యువతులను నల్లమందుకు బానిసలైన వారికి, వారి తల్లిదండ్రులే అమ్మేస్తూ ఉంటే, తమకు రావలసిన మెట్టినింటి ఆస్తికోసం కొందరు వితంతువులు గౌహతి కోర్టు చుట్టూ తిరుగుతుంటే, తమ అత్తవారింటి నుండి తమకు ఎప్పటికైనా పిలుపు వస్తుందన్న శుష్కమైన ఎదురుచూపులతో మరికొందరు మృత్యువుకు లోనవుతుంటే, నల్లమందు అలవాటు వలన భూములను అమ్ముకొని, దయనీయమైన స్థితిలో ఎందరో ఊరు విడిచి పోతుంటే శోభారహితమై చిన్నబోయినట్లున్న ఊరు విషాద మోహనరాగాన్ని ఆలపిస్తుంటే ` ఊరు వల్లకాటిని పోలి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు వైభవంతో విలసిల్లిన సత్త్రాలు నేడు ఇంతగా దిగజారిపోయిన దుస్థితికి మన హృదయాలు బరువెక్కుతాయి.
ఒక మంచి చారిత్రక నవలను చదువుతున్నామన్న అనుభూతికి, ఆనాటి సాంస్కృతిక విచ్చేదనలు తోడై మనసునంతా ఒక విషాద రాగంతో నింపేస్తుంది. ఏం చేయాలో తెలిసినా, ఏమీ చేయనివ్వని సాంప్రదాయ శృంఖలాలు ఇంద్రనాథ్‌తో బాటు మనలను కూడా కట్టి పడేస్తాయి. పందొమ్మిదవ శతాబ్దపు చివరి పార్శ్వం, భారతదేశాన్నంతా ఒక నీరవ నిస్సహాయ స్థితిలోనికి నెట్టివేసిన ఒకానొక అధీరత మనసునంతా ఆవరించగా, ఆనాటి సాంస్కృతిక శిథిలత్వంలోనికి మనమూ తోసివేయబడతాం. ఇంద్రనాథ్ వలె మనమూ నిస్సహాయంగా, జరుగుతున్న మిథ్యాచారాలకు సాక్షీభూతంగా మాత్రమే మిగులుతాం. మనసు ఎంత ఘోషిస్తున్నా, ఒకానొక అసహాయత ఇంద్రనాథ్‌ను ఆవరించినట్లే మనలనూ ఆవరిస్తూంది. ఇది గడిచిపోయిన భారతదేశ చరిత్ర అన్న విషయాన్ని మరిచిపోయి, మనచుట్టూ ఇపుడు జరుగుతున్న చరిత్రే అన్న భ్రమకు లోనవుతాం.
రచయిత్రి ఈ విషాదాంత సాంస్కృతిక శైథిల్యాలను సూచించడానికి, అంతరార్థ (Aశ్రీశ్రీఱస్త్రశీతీవ) కథనవిధానాన్ని ఎన్నుకున్నారు. కథాకాలంనాటికే మదమెక్కి సత్త్రానుండి తప్పించుకుని అడవిలోనికి పారిపోయిన జగన్నాథ్ అన్న ఏనుగు ఇంద్రనాథ్ బాల్యం నుండి అతనితో బాటు పెరిగిన ఏనుగు. ఒకప్పుడు సత్త్రాల రాజసానికి ప్రతీకగా ఉండిన ఆ ఏనుగు, మదమెక్కి అడవిలోకి వెళ్ళిపోయిన ఆ ఏనుగు ప్రస్తుతం అప్పుడప్పుడూ మనుష్యులకు కనిపిస్తూ భయపెడుతూ ఉంటుంది. ఏనుగులను మచ్చికచేసే చోట, ఒక ఆడ ఏనుగును చంపివేసిందని, ఎటువంటి ఏనుగునైనా మాలిమి చేయగల శిక్షణ పొందిన ప్రత్యేక మావటీని కూడా చంపివేసిందని తెలిసిన తరువాత, జగన్నాథ్‌ను కాల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తన బాల్యం నుండి తనతో బాటు పెరుగుతూ వచ్చిన జగన్నాథ్ దుస్థితికి దురపిల్లుతూనే ప్రభుత్వ ఉత్తర్వును అమలు పరచక తప్పని స్థితికి లోనవుతాడు ఇంద్రనాథ్. తనకంటి ముందే జగన్నాథ్ మరణం అతడిని పెను విషాదానికి లోనుచేస్తుంది. పట్టపుటేనుగులా మర్యాదలు పొందిన జగన్నాథ్, కాలవైపరీత్యం చేత మదమెక్కి అత్యంత దీనస్థితిలో చంపివేయబడటం అన్న అంతరార్థ కథనం ద్వారా ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లిన సత్త్రా నేడు ఆర్థికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, శోభారహితమౌతూ పొందుతున్న శైథిల్యతను ప్రతీకాత్మతగా చిత్రించడం ఒక విశేషాంశం. సత్త్రాలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న విషాదాంత శైథిల్యాన్ని సూచించే అంతరార్థ కథనంగా జగన్నాథ్ వృత్తాంతాన్ని తీర్చిదిద్దిన రచయిత్రి ప్రతిభకు ఆశ్చర్యపోకుండా ఉండలేం.
పంట వసూళ్లను తీసికొని రావడానికి, ఇంద్రనాథ్ తండ్రి ఆజ్ఞ మేరకు, తమ ఇంట్లో అనాకారంగా
ఉన్న ఏనుగుపై పరచిన చెదలు పట్టిన అంబారీని ఎక్కి తమస్థాయికి తగ్గకుండా వెడతాడు. కోతలు కాగానే, తమ భూములను దున్నుకునే తమ శిష్యులకే పంచివేయాలని దస్తావేజులను తయారు చేసుకుని వెళ్ళిన ఇంద్రనాథ్ సదుద్దేశాన్ని తెలుసుకోలేక, అట్టహాసంగా వచ్చాడన్న కినుకతో, కమ్యూనిస్టుల ప్రోద్బలంతో ఇంద్రనాథ్‌ని చుట్టుముట్టి అక్కడికక్కడే హత్యచేస్తారు వారి శిష్యపరంపరకు చెందిన వారే!. ఎన్నో సంస్కరణలను ఊహించినా, కాలం అనుకూలించనందున ఎన్నిటినో అమలు చేయలేకపోయిన ఇంద్రనాథ్ మరణం, తుప్పుపట్టిన నాటి సంప్రదాయాల శిథిలతకు మచ్చుతునుక!
ఈ నవలను చదువుతున్నంతసేపు మన మనస్సు దుఃఖపడుతూనే ఉంటుంది. ఒక్క అస్సాంలోనే కామరూపలోనే కాదు, అది ఆంధ్రదేశమే కావొచ్చు, బెంగాలు దేశమే కావొచ్చు, మరొకటి మరొకటి కావొచ్చు. ఆనాటి భారతదేశమంతటా నిండుకున్న స్త్రీల, ముఖ్యంగా వితంతువుల దుస్థితి, నల్లమందు వ్యసనం, పరపతిని కోల్పోయిన, కోల్పోతూ ఉన్న జమీందారీ వ్యవస్థల దైన్యత.యిలా ఎన్నో శిథిల సంస్కృతులు మనలను హెచ్చరిస్తూనే ఉంటాయి.
ఇక అనువాదం గురించి ఒకటి రెండు మాటలు. అనువాద కళపట్ల, చరిత్ర సంస్కృతుల పట్ల ప్రగాఢమైన అభిమానం కలిగిన వారు, పర్వ వంటి బృహత్తరమైన నవలను అనువదించిన వారు అయిన, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి నవలానువాదం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. మూల నవల ప్రాంతీయతను నిలపడం కోసం అవే పేర్లను, పదాలను వాడుకుంటూ, అవసరమైన పదాలకు అక్కడికక్కడే అర్థాలను, కథాగమనానికి అడ్డురాకుండా చెప్పడం ఒక గొప్ప అనువాదకళ! చదువు తున్నపుడు ఏకధాటిగా నవలా గమనానికి కొనసాగేందుకు ఉపయోగపడే విధమిది. మళ్ళీ ఆ పదాలకన్నిటికీ నవలాంతంలో 15 పుటలలో భావాలను ఇవ్వడం ఒక గొప్పవిషయం. నవలలోని ఆర్ద్రత, రూపాంతరం చెందుతున్న సామాజిక పరిస్థితులు, ఆద్యంతం చాపకింద నీరులా కొనసాగి వచ్చిన విషాదాంత ఘట్టాలు, నాటి సమాజలోని అస్తవ్యస్థతలు, సంస్కరణను కోరుకున్న ఇంద్రనాథ్ మరణం, ఈ అన్నిటితోబాటు అంతరార్థ కథనంగా సమాంతరంగా నడిచే ఏనుగు జగన్నాథ్ వృత్తాంతం. ఈ అన్నిటినీ మించి, బానిసలకన్నా హీనస్థితిలో చూడబడిన నాటి మహిళల సామాజిక అస్తిత్త్వం. ఈ అన్నీ కలిసి మనసును తడిపేస్తాయి.
ఇంతగొప్ప సామాజిక సంస్కృతీ మిళితమైన ఆధునిక చారిత్రిక నవలను అందించిన ఇందిరాగోస్వామిగారు చిరస్మరణీయులు. ఆనాటి భారతదేశానికి ప్రతీకగా, ఒక ప్రాంతపు సాంస్కృతిక చారిత్రక తిరోగమనాన్ని మూలభావం చెడకుండా తెలుగు నవలనే చదువుతున్నామన్నంత ప్రతిభావంతంగా అనువదించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నిజంగానే ధన్యజీవులు.
నోట్ : ఇక్కడ ఒక విషయాన్ని స్మరించుకోవడం అవసరం. ఇందిరా గోస్వామి గారిని గురించి ఇంటర్నెట్‌లో గాని, ఇతరత్రా గాని, లభ్యం కాని ఎన్నో వివరాలను, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తమ గ్రంథం ‘‘సాహిత్య చరిత్రతో సహయానం-2 ఆధునికత-సమకాలికత (కొన్ని పార్శ్వాలు) లో రెండు వ్యాసాలలో అందించారు. రచయిత్రిని అర్థం చేసుకోవడానికి దోహదపడిన వారి రెండు వ్యాసాలకు, వారి ఈ నవలానువాదానికి తెలుగువారు కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు.
(ఉదయిని వెబ్ మ్యాగజైన్ నుండి…)