సాహసోపేతమైన చారిత్రక సందర్భం – వి. ప్రతిమ

ఇటీవల ప్రరవే (ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక) ప్రచురించిన ‘‘ట్రోల్‌’’
పుస్తకం చదివాక, నాలుగు మాటలు రాయకుండా ఉండడం నేరం అనిపించింది …..
కాత్యాయని విద్మహే, కే.ఎన్‌. మల్లీశ్వరి సంపాదకత్వం వహించిన ఈ పుస్తకం,

ఆ రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో ట్రోల్‌ గురించిన లోతైన చర్చలు…. అప్పటికి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీల మీద, భిన్న స్వరాల మీద జరుగుతోన్న హేయమైన, తీవ్రమైన ట్రోల్‌కి ఒక సవాలుగా, ఒక ఎదురుదాడిగా మనం చెప్పుకోవచ్చు….
నిజంగా స్త్రీలకు సంబంధించి… ఒక సాహసోపేతమైన చారిత్రక సందర్భం అది.
ఒక పుస్తకం చదివితే వినోదం, వికాసం, విజ్ఞానం, ధైర్యం, నమ్మకం, కలగడం గురించి మనకు తెలుసు…. అయితే ఒక పుస్తకం చదివినప్పుడు భయానకమైన అనుభవం కలగడం…. అందులోని వాస్తవ స్త్రీలు అనుక్షణం మనల్ని వెంటాడడం, దిగులు కమ్ముకోవడం ఎప్పుడైనా అనుభవమైందా?: ఈ పుస్తకం చదువుతూ కలవరంతో… ఒక ఉన్మాదకరమైన వాతావరణంలో స్త్రీలు బతకాల్సి రావడాన్ని గురించిన ఆలోచనలతో, నిద్రలేని రాత్రులు గడిపాను నేను ….
అంటే చదువుతున్న వాళ్ల పరిస్థితే ఇది అయితే, ఆ అనుభవాలకి స్వయంగా గురైన స్త్రీల మానసిక స్థితి ఏమిటి??
చాలా ఏళ్ళ ముందు, అంటే ఒక నాలుగు దశాబ్దాల ముందు మధురాంతకం రాజారాంగారు ‘‘తురుపు ముక్క’’ అని ఒక కథ రాశారు. ట్రంప్‌ కార్డ్‌ …. భార్యల మీద, లేదా స్త్రీలను నిలవరించడం కోసం పురుషుడు వాడే ఆయుధం వ్యక్తిత్వ హననం, అనుమానం….
అంటే ఈ వ్యక్తిత్వ హననాన్ని ఆయుధంగా వాడడం అనేది ఇవ్వాళ కొత్తేమీ కాదు. ఇప్పుడు ట్రోల్స్‌ రూపంలో స్త్రీలను తీవ్రంగా వేధిస్తున్న ఈ పితృస్వామ్య కుట్రలు, అనాదిగా స్త్రీలపై పురుషుడు ఉపయోగిస్తున్నవే …..
సాహిత్య చరిత్రలోనూ, స్త్రీలు వేధింపులకు గురైన అనేక సందర్భాలు మనకి తెలుసు… అయితే అప్పుడు తక్షణ స్పందనకి తావు లేకపోవడం వల్లనో, స్త్రీలు పరువు వెరపుకి గురై ఉపేక్షించడం వల్లనో, అన్నీ రహస్యంగా ఉండిపోయేవి…
తొంభైల ప్రారంభంలో స్త్రీవాదుల మీద జరిగిన వ్యక్తిగత దాడులు మనందరికీ తెలిసినవే. అయితే చాప కింద నీరులా, ఒక విస్తృతమైన ప్రపంచం మన నట్టింట్లో తిష్ట వేశాక, సెల్‌ఫోన్లు మన జీవితాల్లో, చెప్పాలంటే, మన శరీరాల్లోనే భాగమయి పోయాక, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబుల్లో మనం తలమునకలుగా మునిగిపోయాక ప్రతిదీ బహిరంగమే….
ఈ నేపథ్యంలో నుండి ట్రోల్‌ అంటే ఏమిటి? అనుకుంటే
‘‘ట్రోల్స్‌ అంటే సాంప్రదాయ స్కాన్డినేనియా కథలలో కొండల మీదను, గుహలలోను అసహ్యకరమైన చిత్రరూపాలతో ఉండే మాంత్రిక శక్తి గల చిన్న పెద్ద జీవులు ట్రోల్‌ అన్న పేరుతో చెప్పబడ్డాయి. జానపద మానవుల భావనాత్మక ఊహాత్మక సృజన శక్తి మూలం ట్రోల్‌.
మానవులలోని బలహీనతలతో ఆడుకునే ఆ జీవులను, వీరోచితంగా ఎదుర్కొని పోరాడి, విజయం సాధించడం గురించిన కథలు అక్కడి నుండే పుట్టాయి’’ అంటూ నిర్వచనం చెప్తారు సంపాదకులు.
అల్లరి, దురుద్దేశం, తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, విద్వేషం, విధ్వంసం, వేధింపులతో కూడిన సంభాషణలు వెక్కిరింపులు… మోసం, విషయాలను తారుమారు చేసే ధోరణి, సానుభూతి రాహిత్యం, మొహమాటం లేకపోవడం, ఇతరులను మాటలతో, చేతలతో, బాధపెట్టి ఆనందపడే తత్వం… విధ్వంసంలో సంతృప్తి ట్రోలింగ్‌ కారకాలుగా గుర్తించారు.
ఒక విధంగా పేరుని, ముఖాన్ని దాచుకుని అంతర్జాలం వేదికగా ఆడే విద్వేష క్రీడ ట్రోలింగ్‌ అని చెప్పుకోవచ్చు.
ఈ ట్రోల్‌ జీవుల గురించి సంపాదకులు ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన ముందుమాట రాశారు.
చాలా ఉపయుక్తమయినది.
అయితే ఈ ట్రోలింగ్‌… ట్రోల్‌ అన్నమాట నాకు మొదట ఎప్పుడు తెలిసింది? అనుకుంటే స్వాతి వడ్లమూడి రాసిన కవిత చూసి దిగ్భ్రాంతి చెంది, ఇంత తీవ్రమైన పదజాలంతో, ఇంత నగ్నంగా ఈ కవిత రావడానికి నేపద్యం ఏమిటి, అని తవ్వుతూ పోతే ట్రోలింగ్‌ అర్థమైంది…
ఆ వికృత జీవుల గురించి అప్పుడే గూగుల్‌లో చూడడం జరిగింది. ఆ కవిత రాసిన తరువాత కూడా ఆమె మీద చాలా ట్రోలింగ్‌ జరిగింది… ఆ కవితలోని భాష ఒక స్త్రీ నోటి నుండి రావడాన్ని జీర్ణించుకోలేక పోయింది పురుష ప్రపంచం…..
ట్రోలింగ్‌లో ఎక్కువ భాగం పురుషులు వాడే భాష స్త్రీల శరీరాలను ఉద్దేశించింది అయి ఉంటుంది. పురుషులను ట్రోల్‌ చేయాల్సి వచ్చినా సరే, వారి స్వంత స్త్రీలను జత కలిపి దూషించే పద్ధతి సర్వసాధారణం.
మొదట్లో ఇదంతా చాలా హేయంగా జుగుప్సగా, భరింపరానిదిగా, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా భయానకంగా
ఉన్నప్పటికీ, రాను రాను ఆలోచించడం మొదలుపెడితే…
‘‘నాకు శీలం, పవిత్రత వంటి అంశాల పట్ల నమ్మకం లేనప్పుడు, వాటి పైన దాడి నన్ను ఎందుకు ప్రభావితం చేయాలి? నా తల్లి ఎవరితో ఉండి నన్ను కంటే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి? నేను ఎంతమందితో ఉంటే మాత్రం ప్రపంచానికి నష్టం ఏమిటి? నాలో ఎంతో కొంత మిగిలి ఉన్న పితృస్వామిక భావజాలం వల్లనే ఈ మనోవేదన అని నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుండే ఇలాంటి దాడులు నన్ను బాధించడం మానేశాయి అంటుంది స్వాతి.
మనందరికీ తెలుసు పితృస్వామ్య భావజాలమే స్త్రీలపై ట్రోలింగ్‌కి ప్రధాన కారణం.
స్త్రీల శరీరాలు, వస్తువులుగానూ, ఆస్తిగాను చూసే పితృస్వామిక స్వభావం వలన బూతులు తిడతారు అన్నది పదేపదే స్పురణకు తెచ్చుకుని ఆ ఆందోళన.. అశాంతి, అలజడి వంటివి తగ్గించుకునే దాన్ని అంటుంది మల్లీశ్వరి… తన మీద జరిగిన ట్రోల్‌ బూతు దాడుల గురించి మాట్లాడుతూ… పైన నేను చెప్పిన స్వాతి వడ్లమూడి రాసిన కవిత మరింతగా నలుగురిలోకి వెళ్లాలని అంటారు మల్లీశ్వరి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రరవే ట్రోల్‌ బాధితులకు, మద్దతు ప్రకటిస్తూనే వచ్చింది. దానికి కొనసాగింపే ఈ ‘ట్రోల్‌’ పుస్తక ప్రచురణ.
అణగారిన ప్రజలే నాకు గురువులు, జీవితాన్ని నేర్పించిన వాళ్ళు, ప్రాణాలకు లెక్కచేయకుండా ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు ఆదర్శం నాకు అని చెప్పుకునే సుజాత నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ, ప్రజల్ని చైతన్య పరిచే క్రమంలో ఆన్‌లైన్‌ రాకముందు నుండే ఎన్నెన్ని విధాలుగా ట్రోల్‌కి గురయ్యారో, ఎంతెంత మానసిక వేదన అనుభవించారో, ఆమె తన తల్లిని గురించి ఎంత భయపడ్డారో విద్యార్థులకు ఎంత అంకితభావంతో జీవితాన్ని నేర్పించారు… ఎట్లా వాళ్ళందరినీ కూడగట్టారు… ఆ క్రమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందో చదువుతూ మనం కదిలిపోతాం. ఇక ఆన్‌లైన్‌ వచ్చిన తర్వాత ట్రోలింగ్‌ అయితే సరే సరి …సుజాత గారు ట్రోలింగ్‌కి మరో నిర్వచనం చెప్పారు. ట్రోలింగ్‌ పదం చేపలను పట్టుకోవాలని ఆశతో ఒక గీతను లాగే ఫిషింగ్‌ టెక్నిక్‌ నుండి వచ్చింది. ట్రోల్స్‌ ప్రజలను భావోద్వేగ స్పందనలలోకి ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. అంతర్జాలంలో ఉద్దేశపూర్వకంగా తరచుగా ఇతరులను రెచ్చగొట్టే, కలవరపెట్టే లేకపోతే చిరాకు పెట్టే ఉద్దేశం వీటిలో ఉంటుంది. అభ్యంతరకర పదజాలం, బూతులు ఉపయోగించబడతాయి అంటారు.
అర్బన్‌ నక్సల్‌ ఆరోపణని ఎదుర్కొని కౌంటర్‌గా రాజకీయాల్లో నిలబడి అక్కడా జెండర్‌ వివక్షను ఎదుర్కొన్న సూరేపల్లి సుజాత, తొందరగానే అందులో నుంచి బయటపడ్డారు
ట్రోలింగ్‌కి భయపడి మన అభిప్రాయాలను వదులుకుంటే వారి ధ్యేయం నెరవేరినట్లే కదా అంటారు ఇందులోని స్త్రీలంతా. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం చాలా అభినందనీయం….
ఖమ్మం జిల్లా మారుమూల ఊరి నుండి అంటే అప్పటికి 95% బాల్యవివాహాలు జరుగుతున్న ఆ ఊరి నుండి, తొలి గ్రాడ్యుయేట్‌గా, తొలి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌గా బయటకొచ్చి 30 ఏళ్ల ముందు తొలి మహిళా జర్నలిస్టుగా నిలదొక్కుకొని ప్రతిష్టాత్మకమైన ‘‘రామ్నాథ్‌ గోయంక’’ అవార్డు అందుకున్న వనజ .ష. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
రేడియో, పత్రికలు, టీవీ డాక్యుమెంటరీల మీదగా జరిగిన ఆమె ప్రయాణం ప్రస్తుతం, డిజిటల్‌ మీడియాలో జర్నలిస్టుగా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌గా కొనసాగుతోంది. యూట్యూబ్‌లో మహువ మీడియా అన్న ఛానల్‌నీ నడుపుతూ అనేక విషయాలు మనకి అందిస్తూ ఉంటారు.
పత్రికల్లో, టీవీల్లో పనిచేసేటప్పుడు ఎప్పుడు ట్రోలింగ్‌ బారిన పడలేదు. సోషల్‌ మీడియా డిజిటల్‌ మీడియాలోనే ఘోరమైన ట్రోలింగ్‌ ఎదుర్కోవలసి వచ్చింది. ఫేస్‌బుక్‌లో కంటే యూట్యూబ్‌లో అనామకమైన ఫేక్‌ ఐడీలు చాలా ఎక్కువగా ఉంటాయి. తన మీద ఎక్కువగా హిందుత్వ రాజకీయాలను నమ్మే వాళ్ళ నుండి రోలింగ్‌ ఎదురైందంటారు వనజ. చాలా దారుణమైన, విద్వేషపూరితమైన బెదిరింపులు, భౌతిక దాడులు రేప్‌ చేస్తామనడం… ఉదయం ఫోన్‌ ఆన్‌ చేయగానే, తాము ఎదుర్కొనే బూతు పదజాల తీవ్రమైన దాడి ఎంత కాదన్నా పెయిన్‌ ఫుల్‌ గా ఉంటుందని, తెలియకుండానే సెల్ఫ్‌ సెన్సార్‌కి గురవుతామని, మళ్లీ కాస్త ఆగి అది సరికాదని అర్థమై తిరిగి తదుపరి తమ పని తాము మొదలుపెడతామని అంటారు వనజ. డెమోక్రటిగా, సెక్యులర్‌గా పనిచేసే వాళ్ళ మీద ట్రోల్‌ వీడియోలు చేసి చూస్తున్న వాళ్ళని రెచ్చగొట్టడం, కమ్మీలు సిక్యులర్‌ పేర్లతో వేటాడడం, అందులో పొందే ఆనందంతో తమ వికృతత్వాన్ని మరింత బయట పెట్టుకోవడం, అంటే ఆ గోడల మీది బహిరంగ ప్రోత్సాహం వీరి వికృతత్వానికి పరాకాష్ట. వాళ్ల దృష్టిలో ఉద్యమకారులు, యాక్టివిస్టులు అనేవి బూతు పదాలు… ఫెమినిస్టులు అంటే వ్యభిచారులు…
ఈ పుస్తకంలో తొలి కథనం నిజానికది ముట్టుకోవాలంటేనే దుఃఖం అనిపిస్తుంది
ఏమాత్రం మొహమాటం లేకుండా, ఇతరులను మాటలతో, చేతలతో, వెక్కిరింపులతో బాధ పెట్టి సంతృప్తిని పొంది, ఆనందపడే తత్వం రాను రాను సమాజంలో అంగీకృత విషయంగా మారిపోయిందా?
అజ్ఞాన మారు పేర్లతో మొహాలు మూసి పెట్టిన దేహాలతో ఆ ఉన్మాదులు అరుణ మీద చేసిన బూతు దాడి అత్యంత హేయమైనది. ప్రేమించి వెంటపడి పెళ్లి చేసుకున్న భర్త ఆమె తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడాన్ని సహించలేక వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఒంటరి ఆడపిల్లల తల్లిగా, దళిత స్త్రీగా తాను ఎదుర్కొన్న పరిస్థితి, చేసిన పోరాటం, అన్ని రకాల స్త్రీల జెండర్‌ సమస్యలను అర్థం చేసుకోవడానికి దోహద పడిరదంటారామె.
ఈ లింగ వివక్షని కులం, మతం, కుటుంబం ఎంత పటిష్టంగా నిలబెడతాయో పరిశోధక విద్యార్థిగా.. చదువుకునీ అర్థం చేసుకోవడమే కాక ఆ స్థితిని చాలా దగ్గరగా చూసి తెలుసుకోవడం ద్వారా కూడా కేవలం సాహితీ ప్రక్రియల ద్వారానే కాకుండా, ప్రపంచం మొత్తానికి అందుబాటులో ఉన్న ఫేస్‌బుక్‌ని వేదికగా చేసుకుని, పితృస్వామ్య కోటలను బద్దలు చేసే క్రమంలో ఆమె వ్యాసాలు రాయడం, పోస్టులు పెట్టడం, చాలామందిని గాయపరిచి ఉన్మాదానికి గురి చేసింది. ఆ క్రమంలో ఆమె మీద తీవ్రమైన బూతు దాడి జరిగింది. ‘‘దామోదరం సంజీవయ్య మాల’’ అన్న ఫేక్‌ ఐడితో ఆమె వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌లోకి లాగి, బూతు దాడులతో ఆమెని నిలువరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.
స్త్రీలు ఎక్కడా కూడా అవుట్రైట్‌గా గౌరవింపబడరు. వారి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి గతులు ఆమె గౌరవాన్ని, విలువల్ని ప్రభావితం చేస్తాయన్న పచ్చి నిజం గ్రహింపుకు వచ్చాక, ఈ వ్యక్తిత్వ హననాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం మానేశారామె.
జరుగుతున్న ఈ తీవ్రమైన ట్రోలింగు దాడి అంతా కూడా నామీద కాదు, ఒక స్త్రీ మీద. ఈ బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు ట్రోల్స్‌ అన్ని తన మీద మాత్రమే కాదు, ఈ దేశ స్త్రీలందరికి ఉన్నాయని గుర్తించాలి. ఒకవైపు స్త్రీని పూజనీయ స్థానంలో నిలబెట్టి, మరోవంక ఆమె శరీరాంగాలు ఎక్స్‌పోజ్‌ చేసే వ్యాపారం చేస్తున్న ఈ కుహనా సంస్కృతిని ద్వంద్వ విలువల్ని నిగ్గదీసి ప్రశ్నిస్తుంది అరుణ. లం పెన్‌ గ్రూపులు ఉంటాయని తెలిసి కూడా తన భావాల వ్యక్తీకరణకి అంటే సాంఘిక వివక్షకు వ్యతిరేకంగా ఈ పవర్‌ ఫుల్‌ మీడియాని ధైర్యంగా వాడుకున్న తొలి స్త్రీ బహుశా అరుణే కావచ్చు. లైవ్‌ ద్వారా బలంగా చర్చమొదలుపెట్టి… అభ్యుదయవాదులుగా పైకి చెప్పుకునే మనువాదుల మేక వన్నెల్ని సోషల్‌ మీడియా గోడమీద ఉతికి ఆరేసిందామె.
ఎందుకు చెప్తున్నానంటే, ఇంతటి బలమైన ధైర్యవంతమైన వ్యక్తిత్వం కలిగిన అరుణ వంటి వారు కూడా ఒకానొక క్షణంలో ఈ హేయమైన బూతు దాడిని తట్టుకోలేక చచ్చిపోవాలన్న ఆలోచన చేయడం (ఇద్దరు ఆడపిల్లల్ని పసివాళ్ళని వదిలిపెట్టి), చేయాల్సి రావడం అంటే ఎంత తీవ్రంగా ఎంత దారుణంగా ట్రోలింగ్‌ జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక దుఃఖపు ముద్దలాంటి ఈ కథనం మనని బరువుగా ఈ పుస్తకంలోకి ఆహ్వానిస్తుంది.
హైదరాబాదులో అమూమత్‌ సొసైటీని స్థాపించి, ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తూ, అనేక రకాల సమస్యలను అర్థం చేసుకొని, ప్రజలను చైతన్య పరుస్తూ… గత పాతికేళ్లుగా స్త్రీల హితమే ధ్యేయంగా యాక్టివిస్టుగా పనిచేస్తున్న ఖలీదా పర్వీన్‌పై ఆమె వయసును కూడా చూడకుండా ఎంతెంత ట్రోలింగ్‌ జరిగిందో వింటుంటే క్రోధం, దుఃఖం కలుగుతుంది.
షాహిన్‌ బాగ్‌ సమయంలో రాజకీయ నాయకుల మత విద్వేష, మత హింసనీ ప్రేరేపించే ప్రసంగాలను ఎత్తిచూపుతూ, ముస్లిం మహిళలతో కలిసి పోరాటంలో పాల్గొంటూ, భారతదేశం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఉద్దేశించి ప్రసంగించడం మూలంగా ఆమె మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. బుల్లీబాయ్‌ యాప్‌లో ఆమె ఫొటో వేలంలో పెట్టడం నిజంగా బాధాకరం. ఒక ముస్లిం మహిళ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఎదిరించాలి? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి?
ముస్లిం ఐడెంటిటీ ఉంది కాబట్టి మతపరమైన విషయాల గురించి, ఇస్లామిక్‌ సంస్కృతి గురించి కూడా ట్రోల్‌ చేస్తారు. అయితే క్రమంగా ఆ ట్రోలింగ్‌ పట్టించుకోవడం మానేసి అలవాటు పడిపోయి నవ్వుకుంటారు ఖలీదా… సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అని అంటారామె…
ఇక సమకాలీన సామాజిక రాజకీయ అంశాల మీద ఇండిపెండెంట్‌ జర్నలిస్టుగా నిబద్ధతతో, నిర్భయంగా వీడియోలు చేస్తున్న చందు తులసి 13 ఏళ్ల మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కెరీర్‌ ఇవ్వలేనంత సంతృప్తి మూడేళ్ల ఇండిపెండెంట్‌ జర్నలిజం ఇచ్చింది అంటారు.
ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే ఎప్పుడు కూడా వాళ్ళు నేరుగా నచ్చలేదు అని చెప్పరు. సోషల్‌ మీడియాలో వాళ్ళు పెంచి పోషిస్తున్న ట్రోల్‌ ముఠాలను ఉసిగొల్పి వేధింపులతో అణచడానికి చూస్తారు.
ఆమె ఛానల్‌ ప్రారంభించిన నెల రోజులకే ఆమెను తీవ్రంగా బాడీ షేమింగ్‌ చేస్తూ కామెంట్స్‌ పెట్టారు. తొలుతగా గాయపడి, మౌనంగా ఉన్నప్పటికీ, వెంటనే తేరుకుని తన పనిని తాను కొనసాగించడం విశేషం.. ఇక ఆ తర్వాత మతం పేరు చెప్పినట్లు అడిగే నాయకుల గురించి హెచ్చరిస్తూ చేసిన ‘‘మతమొస్తోంది మేలుకో మిత్రమా’’ అన్న కవితాత్మక వీడియో, ఎంత సంచలనం రేపి ఆమె మీద ఎంతైనా దారుణమైన ట్రోలింగ్‌ జరిగిందంటే నిర్విరామంగా వచ్చే ఫోన్‌ కాల్స్‌, తిట్లు, ఏకంగా ఆమె ఫోటోని మార్ఫింగ్‌ చేసి రకరకాలుగా వేధించడం పచ్చి బూతులు తిట్టడం…
ఆ తర్వాత అదే వీడియోని ఎన్నికల సమయంలో తమ స్టేటస్‌గా ఉంచుకోవడం, ఆ విధంగా ఫాలోయర్స్‌ పెరిగారు… ట్రోలర్స్‌ పెరిగారు.. ఎంతలా అంటే లెక్కలేనన్ని చానళ్ళని ఓపెన్‌ చేసి అంటే కేవలం ఆమెను ప్రక్కకు తోసేసి తిట్టిపోయడం కోసమే తులసి ఫోటోలు పెట్టుకుని తమ ఇన్‌ఫ్లుయెన్స్‌ని పెంచుకున్న క్రమం అది. నిజంగా ఎంత దారుణం? అదంతా అని ముందుకు సాగిందీమే అని ఆశ్చర్యం, దుఃఖం కలగక మానవు.
తులసి మీద జరిగిన దాడి అంతా ఇంతా కాదు ఇన్‌బాక్స్‌లోకి వచ్చేసి వేలాదిగా బూతులు, మార్ఫింగ్‌ ఫోటోలు, ప్రైవేట్‌ పార్ట్‌ల ఫోటోలు, ఆమె మీద ఎలా దాడి చేసేది? ఆమె అడ్రస్‌ గురించి… ఇంకా అసలు ఆమె పూర్తిగా పంచుకోలేదు మనతో… ఆమెని నాన్‌ హిందూ అన్నారు నాన్‌ ఇండియన్‌ అన్నా ఎల్‌టిటిఇ థాను రాజీవ్‌ గాంధీని చంపిన థాను అన్నారు… వాంపెయిర్‌ … రక్తపిశాచి అన్నారు.
అసలు ఈ చిన్న పిల్లకి ఇవన్నీ తట్టుకునేంత పెద్ద గుండె ఎలా ఉందని విస్తు పోతాం మనం…
సరే ఆ మధ్య ఆమె పోస్ట్‌ చూసి సాహిత్య ప్రపంచమంతా కదలి వచ్చి 36 సాహిత్య సంఘాలు, జర్నలిస్టు సంఘాలు రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మద్దతు ఇచ్చినప్పటికీ ఇవాల్టికి ఆ ట్రోలింగ్‌ తగ్గలేదు. అన్ని ప్రాంతాల నుండి రైతులు ఆటోలల్లో వచ్చి ట్యాంక్‌బండ్‌ దగ్గర ర్యాలీ నిర్వహించడం, తులసి చందుకి మద్దతు తెలపడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా ఆమె వీడియోలు చూసేవాళ్ళు ఎంతగా బ్యానర్లతో వీధుల్లోకి వచ్చి వందలాది సభలు పెట్టి మద్దతు ఇచ్చారో మనందరికీ తెలుసు.
అంతమంది అలా రావడానికి నేను ఇమీడియట్‌ కారణం కావచ్చును కానీ, జర్నలిజం అమ్ముడు పోకూడదని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమైంది అంటారామె. బ్లాగుల నాడే ట్రోల్‌కి గురై వేదన చెందిన ఆమె ఇటీవల రాసిన వ్యాసం మీద జరిగిన పెద్ద దాడిని, తాను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక ట్రోల్స్‌ చూసి నవ్వుకున్నానని చెప్పగలిగే ఆలమూరు సౌమ్య ట్రోల్స్‌ స్వరూప స్వభావాలను చాలా లోతుల కెళ్ళి వివరించడమే కాకుండా… మూకుమ్మడి దాడికి మూకుమ్మడి ఖండనే సమాధానమని అంటారు.
సాంకేతిక పరిష్కారాలు ప్రభుత్వ విధానాలు, చట్టపరమైన చర్యలు సానుకూల ఆన్‌లైన్‌ వాతావరణాన్ని ప్రోత్సహించే విద్యా కార్యక్రమాలు అంటే సెక్స్‌ ఎడ్యుకేషన్‌, డిజిటల్‌ లిటరసీ వంటి పలుకోణాలనుంచి ట్రోలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరగాలి అనే సౌమ్య తాను స్వయంగా, తన చుట్టూ ఉన్న అమ్మాయిలకు బేషరతుగా సపోర్ట్‌ చేస్తూ తోడుగా ఉంటాను అన్న భరోసా కలిగిస్తున్నారు.
పీడిత కులాలు, మైనారిటీ మతాలు, స్త్రీల లైంగికత ట్రోల్‌ యొక్క ప్రధాన అంశాలు.
స్త్రీలకు ఎట్లా మతపరమైన ఈ స్వేచ్ఛ కూడా ఉండదో, ఒక్కోసారి మతవ్యాప్తి స్త్రీల ద్వారా కూడా ఎలా జరుగుతుందో? మనందరికీ తెలిసిన విషయమే. మనకున్న ఒకానొక మంచి కవి, నాటక కర్త, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, మెర్సీ మార్గరేట్‌. ‘ఆమె నిర్ణయం’ వంటి కవిత రాసి, ఎంత భయంకరమైన ట్రోలింగ్‌కు గురై, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని.. (అంటే వ్యక్తిత్వ హనంతో పాటు ఆరోగ్య హననం కూడా జరిగిపోతుంది) కొంతకాలం సాహితీ ప్రపంచానికి దూరమై ఎట్లా తిరిగి క్రమంగా నిర్మాణాత్మకంగా నిలదుక్కుకున్నారో మనందరికీ తెలుసు… ఆ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా చాలా గాయపడాల్సి వచ్చింది.
అసలు ఈ ట్రోలర్స్‌ అంతా ఎక్కువగా పాతికేళ్లలోపు వాళ్లే ఉండడం గమనార్హం. అంటే ఈ కొత్త తరానికి బడుల్లో కానీ, ఇంట్లో కానీ విలువలు నేర్చుకునే సమయం లేకపోవడం, మతం, సమాజం వంటి వాటి పట్ల అవగాహన లేకుండా వాట్సాప్‌ యూనివర్సిటీలోనే చదువుకోవడం ఇవన్నీ కారణాలంటారామె. పాఠశాలల్లో సోషల్‌ మీడియాని, సెల్ఫోన్లని ఎలా వాడాలి? అన్న పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందని, ఈ ఎడ్యుకేషన్‌ ఉంటేనే తప్ప ఒక తరాన్ని క్రూరంగా మారకుండా మనం కాపాడుకోలేమని అభిప్రాయపడతారు మెర్సీ.
‘‘మన మీద, మనం పని చేస్తున్న, నమ్ముతున్న, రాజ్యాంగ విలువలు, హక్కులు, జెండర్‌ సమానత్వం, కులమత వివక్షకు వ్యతిరేకంగా పనిచేయటం వంటి అంశాల మీద దాడి చేయమని, ఎవరికో, ఎక్కడి నుంచో రాజకీయ ఆదేశాలు అందుతున్నాయి. ట్రోలింగ్‌ కేవలం స్త్రీల మీదే జరగదు.. భావజాలాల సంఘర్షణ, ముఖ్యంగా కుల వివక్ష, మత విపక్ష గురించి మాట్లాడుతున్న, పని చేస్తున్న అనేకమంది పురుషుల మీద ట్రాన్స్‌ జెండర్‌, ఎల్జిబిటిక్యూ ప్లస్‌ సమూహాల కోసం పనిచేస్తున్న యాక్టివిస్టుల మీద కూడా చాలా తీవ్రస్థాయిలో జరుగుతుంది. ఎంత అధమ స్థాయిలో మనుషులను వారి కుల, మత, జెండర్‌, శరీర ఆకృతులతో కించపరచడం మాట్లాడనీయకుండా చేయడం ద్వారా తమ నియంతృత్వ, రాజకీయ, ఆధిపత్య గుంపు మనస్తత్వాన్ని స్థిరీకృతం చేయటం అనేది, ఈ వ్యవస్థీకృత దాడి వెనుక ఉన్న మూల స్వభావం అంటారు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి… సమాజికార్ధిక.. వ్యాస రచయిత్రి సజయ. కె.
ఎల్జిబిటి క్వీర్ల పరిస్థితి మరింత బాధాకరం.. ఇటీవల ఫ్రాన్షు అన్న పదహారేళ్ల అబ్బాయి, చీర కట్టుకున్న వీడియో పెట్టినందుకు అతడి మీద జరిగిన ట్రోలింగ్‌తో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా విషం చిమ్మడం క్రూర పరిణామం.
స్త్రీలు వంటలు, పూజలు వంటివి పోస్ట్‌ చేసినంతవరకు వాళ్లు సోషల్‌ మీడియాలో వుంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే వాళ్లు సమాజం గురించి, స్త్రీల హక్కుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెడతారో అప్పుడు వాళ్ల మీద ట్రోలింగ్‌ మొదలవుతుంది ఆగకుండా.. అదే క్వీర్‌ వ్యక్తులైతే తమ ఉనికిని తెలియజేస్తే చాలు, వాళ్ళ మీద ట్రోలింగ్‌ మొదలైపోతుంది. అసలు ఈ సమాజంలో క్వీర్‌ వ్యక్తులే ఉండరాదని ట్రోలర్ల ఉద్దేశం. మన సమాజాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేకుండా చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనే భ్రమలో ఉంటారు ఈ సంస్కృతి పరిరక్షకులు. క్వీర్ల గురించి అంకిత భావంతో నిబద్ధతతో పనిచేస్తూ తాను ఎదుర్కొన్న అనేక రకాల ట్రోలింగ్‌లకి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేసి నిలబడిరది… దీప్తి సిర్ల.
దీప్తి తెలంగాణ ఉమెన్‌ ట్రాన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో సభ్యురాలు. అలాగే అనేక సివిల్‌ సొసైటీలతో కూడా కలిసి పనిచేస్తుంది. దళిత మహిళలు, ఆడపిల్లల సమస్యలపై పనిచేస్తూ వృత్తిపరంగా ఒక ఎన్జీవో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉంటున్నారు.
బౌద్ధ సన్యాసిని, ట్రాన్స్‌ వ్యక్తి తాషి చోడుప్‌ ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి అమెరికాలో నివాసం ఉంటున్న అంజలీ రిమి పై జరిగిన భౌతిక దాడులు… వ్యాపారాన్ని మూత పెట్టాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడ్డ శ్రద్ధ… ఇలా అనేక మంది ట్రాన్స్‌ వ్యక్తుల గురించి మాట్లాడుతారు దీప్తి.
ఇందులో మొత్తంగా 15 మంది స్త్రీలు రాసిన స్వీయ అనుభవ కథనాలు ఉన్నాయి.
పాతికేళ్లుగా పితృస్వామ్యానికి అన్ని రకాల వివక్షలకి వ్యతిరేకంగా నిరంతరాయంగా పనిచేస్తూ వస్తున్న సామాజిక ఉద్యమకారులైన దేవి, సంధ్య, కొండవీటి సత్యవతి, కాగుల శ్రీదేవి వంటి వారు రాసిన కథనాలు వారి ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఎక్కడా ఆగరాదన్న సంకల్పాన్ని మనకి అర్థం చేయిస్తాయి. వీరిలో కొందరు ఈ ట్రోలింగ్‌ని ఆపడానికి కొన్ని కొన్ని పరిష్కారాలు సూచించారు. కానీ ఎక్కువ మంది ఈ ట్రోలింగ్‌ని ఆపడం అసాధ్యమని, అది మన జీవితంలో భాగమైపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే తప్ప అరికట్టడం సాధ్యం కాదని అన్నారు. ట్రోలింగ్‌కి గురికావడానికి పురుషులు కూడా మినహాయింపేమీ కాదు…
ఎక్కడో అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీ వంటి వారి సంగతి సరే, మన దగ్గర ఉన్న కత్తి మహేష్‌, ఎన్‌.వేణుగోపాల్‌, బైరి నరేష్‌ వంటి వారు ఎంత దారుణంగా ట్రోల్‌కి గురయ్యారో మనకి తెలుసు.
ఈ ట్రోలింగ్‌ మూలంగా తన కుటుంబం ఎంతగా చిన్నాభిన్నం అయిపోయిందో తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అంతా కూడా చుట్టుపక్కల వారి నుండి అవహేళనలు, అవమానాలు పొందడం తాను 46 రోజులు జైల్లో, అదీ సింగిల్‌ సెల్లో, ఎవరూ కనిపించకుండా ఉండాల్సి రావడం…. 14 నెలలుగా ఇప్పటికీ ట్రోలింగ్‌ ఆగకపోవడం వీటి అన్నింటి గురించి చెప్తూ బైరి నరేష్‌ గారు ఏమంటారంటే… ‘‘ఈ ట్రోలింగ్‌ మూలంగా నాకు, నా కుటుంబానికి జరిగిన నష్టం కన్నా సమాజంలో నాస్తికత్వంపై, దైవంపై, జరుగుతున్న చర్చ మాకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది’’ అంటారు. ఇందులోని 15 మంది స్త్రీలు కూడా ట్రోలింగ్‌ మూలంగా మనం ఆగిపోవడం అంటే… ట్రోలర్స్‌కి విజయం చేకూర్చినట్లు అనే అభిప్రాయపడ్డారు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా గొంతు విప్పినందుకు వీళ్లంతా పోర్న్‌ సైట్లలో అమ్మకపు సరుకులుగా మార్చబడ్డారు.
బూతు దాడులు, బెదిరింపులు, కేసులు అవమానాలు, అవహేళనలు, మనువాదుల ఉపదేశాలు అన్ని భరించారు…. అంతటి బాధా, దుఃఖం అభద్రత, అసహనం, ఆగ్రహానికి గురవుతూ కూడా తాము నమ్మిన విలువల, విశ్వాసాల వ్యాప్తి కోసం నిలిచి పోరాడుతోన్న ఈ స్త్రీలతో సంభాషించడం కోసం తలుపులు తెరిచారు సంపాదకులు మనకోసం. ధైర్యంగా, స్వీయాత్మక అనుభవాలను సాధారణీకరించి, వస్తుగత దృష్టితో విశ్లేషించిన ఈ మహిళలు….. సంపాదకులు అన్నట్టుగా ఒక ఆశను వాగ్దానం చేస్తున్నారు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.