నారీ మణులకు నీరాజనం! – డా. సగిలి సుధారాణి

శ్రీమతి సుశీల, డా.సి. నారాయణరెడ్డి ట్రస్టువారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సమున్నత వ్యక్తిత్త్వంతో వెలుగొందిన ప్రతిభామూర్తుల గురించి ప్రసంగాలను 9-03-2024 శనివారంనాడు ఉదయం 10. గం.లకు, మణికొండలోని విశ్వంభర నిలయంలో ఏర్పాటు చేశారు.

సి.నా.రె తనయిలు గంగ, సరస్వతి, యమున, కృష్ణల సంగమ రూపమే ‘సుశీల నారాయణరెడ్డి ట్రస్టు’. తండ్రిగారి సాహిత్య వారసత్వాన్ని వీరు పుణికిపుచ్చుకొన్నారు. దాదాపు 40 సం.లుగా వారి అమ్మగారి పేరుమీద ప్రతీయేడాది సాహిత్య పురస్కారం, వర్థమాన కవయిత్రులు తమ రచనలు ప్రచురించుకోవడానికి ఆర్థిక చేయూతనందిస్తున్నారు.
ఇటువంటి సాహితీ కార్యక్రమాల్లో భాగంగా గతేడాది కాత్యాయని విద్మహేగారు దక్షిణాత్య సాహిత్య విదూషీమణులు రంగాజమ్మ, ముద్దుపళని గురించి ఓల్గాగారు, ఆచంట శారదాదేవిగారి గురించి వారణాసి నాగలక్ష్మిగారు, కళ్యాణ సూది జగన్మోహన్‌ గురించి కరిమెల్ల లావణ్యగారు ఊటుకూరి లక్ష్మీకాంతంగారి గురించి, ఇల్లిందల సరస్వతిగారి గురించి మాట్లాడారు.
కేవలం తెలుగు సాహిత్య రంగానికే పరిమితం గాకుండా, భారతీయ సాహిత్య, సంగీత, నాటకరంగాల్లో కృషిచేసి చరిత్రలో నిలచిపోయిన నారీమణులు ఎందరో ఉన్నారు. అటువంటి రచయిత్రులను, కళాకారులను స్మరిస్తూ, ఈ యేడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరపడానికి ట్రస్టువారు నిర్ణయించారు. సభా కార్యక్రమాన్ని ముందుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డిగారిని స్మరించుకొంటూ, వారి కలం నుండి జాలువారి జనాల మదిలో నిలచి పోయిన గీతావళి…….
మహిళ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సి.నా.రె కలం నుండి జాలువారిన అద్భుత పాటలను శశికళ స్వామి, గీతాంజలి బృందం ఆలపించి ఆహ్లాదపరిచారు. అంతులేని చప్పట్ల రూపంలో స్పందనలు ప్రేక్షకుల నుండి వెల్లువలా వచ్చాయి. రసజ్ఞులైన శ్రోతలు ఉన్నంత వరకు, తెలుగు చలన చిత్రరంగం బతికి ఉన్నంతవరకు తెలుగువారి హృదయాలలో ఈ పాటలు నిలిచిపోతాయి. వీటి సృష్టికర్త జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి. నా. రె నడయాడిన స్మృతి స్థలంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
శీల సుభద్రా దేవిగారి సభాక్ష్యతన కార్యక్రమం ప్రారంభం అయింది.
స్త్రీలు తమ ఆశయాలు, అభిరుచులు సాధించుకోవాలంటే, తమనుతాము ప్రోత్సాహించుకోవడానికి దారిలో ఎన్నో ముళ్లకంపలు, ఎత్తుపల్లాలను అధిగమించి ముందుకు నడుస్తూ వెలుగుబాటను ఏర్పరిచారు. ఆ దారిలోనే మనమందరం నడుస్తున్నాం. ఒక రచన చేయాలన్నా, ఒక బొమ్మగీయాలన్నా, మనకోసం వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఓల్గాగారి ప్రసంగం సభకు నమస్కారం!
సుశీల నారాయణ రెడ్డిగారి పేరుతో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రాతఃకాలంలో ఈనాటి కార్యక్రమం ఆహ్లాదకరంగా, హాయిగా మొదలైంది. సమాజ నిర్మాణంలో స్త్రీల కృషిని కొంత తెలుసుకొందాం. స్త్రీ చరిత్ర నిర్మాణాన్ని జరుపుకొంటూ వస్తోంది. ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది. అందుకు కావలసిన ముడిసరుకును చాలాచోట్ల నుండి సేకరించి పోగుచేసుకొంటూ వస్తోంది. ‘‘సంగీత సాహిత్య సమలంకృతే!’’ అన్న సి. నారాయణ రెడ్డిగారి పాటను స్మరిస్తూ… బెంగుళూరు నాగరత్నమ్మ, నయనాదేవి గురించి వోల్గా మాట్లాడటమేమిటన్న సందేహం మీకు రావచ్చు. సంగీతం గురించి మాట్లాడాలంటే నాకున్న అర్హతలు ఏమంటే… ‘మహిళావరణం’ అనే స్త్రీల చరిత్రకు సంబంధించిన పుస్తక కూర్పు, అస్మిత నుండి తీసుకొనివచ్చిన ‘బెంగుళూరు నాగరత్నమ్మ చరిత్ర’లో వారి వేదన, పోరాటాలను గురించి అధ్యయనం చేసిన అనుభవం నాకున్నాయి. అంతేగాక బెంగుళూరు నాగరత్నమ్మ గారి చరిత్రను కథగా మలచి ప్రముఖనటి పావలా శ్యామలగారిచే నటింపజేసిన అనుభవం, అలాగే త్యాగరాయ స్వామి ఆరాధనోత్సవాల్లో బెంగుళూరు నాగరత్నమ్మ గారిని స్మరించుకోవడం.
అలాగే నైనాదేవి ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు. ‘టుమ్రే’ సంగీతాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చారు. ఆమె గురించి విద్యారావుగారు ఆంగ్లంలో ‘పార్ట్‌ టు’ పుస్తకాన్ని రాశారు. దానిని తెలుగులో నేను అనువాదం చేస్తూ విద్యాదేవి గారితో, నయనాదేవి గారితో ప్రేమలో పడ్డాను. విద్యారావుగారు ప్రముఖ విద్వాంసురాలు! ఆమె ఈ సభలో ఉన్నారు.
ఇవి వారి గురించి మాట్లాడేందుకు నాకున్న అర్హతలు. అంతకుమించి సంగీతంలో నాకు అనుభవం లేదు.
బెంగుళూరు నాగరత్నమ్మగారి గురించి తెలుసుకోవాలంటే ఆనాటి చరిత్రకు సంబంధించిన కొంత విషయాన్ని తెలుసుకోవాలి. 19వ శతాబ్దం చివరి భాగంలో సమాజం ఎటువంటి మార్పులకు లోనవుతూ వచ్చింది? వివిధ రంగాల్లో వలసపాలకులు చొరబడి ఆ వృత్తులను ఏ విధంగా తమ ఆధీనంలోనికి తెచ్చుకొన్నారో చరిత్రను తవ్వి తియ్యాలి. ఈ సమయంలో బెంగుళూరు నాగరత్నమ్మ తననుతాను ఏవిధంగా మలచుకొందో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
నాగరత్నమ్మగారు పుట్టిన సమయంలో దేవదాసీల ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. ఇందుకు గల ప్రధాన కారణం ‘సాంఘిక పవిత్ర
ఉద్యమం’. ప్రపంచంపై ఇది ప్రభావాన్ని చూపింది. బ్రిటిష్‌ వలస పాలకుల ద్వారా మనదేశంలో ఇది ప్రవేశపెట్టబడిరది. మన దేశంలో ఈ ఉద్యమ ప్రభావంతో అంతవరకు కొనసాగించే ఆచార సంప్రదాయాల అర్థాలను వీళ్ళు మార్చివేశారు. ఉదాహరణకు ఆ కాలంలో వ్యభిచారం అంటే సంతానోత్పత్తికి అవతల జరిగే లైంగిక ప్రక్రియ.
దేవదాసీ వ్యవస్థ కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశంలో అమలులో ఉండేది. దేవదాసీలు దేవాలయాల్లో నృత్యంచేస్తూ, దేవాలయ మాన్యాలలో భాగాన్ని పొందుతూ గౌరవంగా జీవించేవారు. అలాగే పాలకుల పోషణ కూడా దొరికేది. అటువంటి దేవదాసీ వ్యవస్థ గురించి వలస పాలకులకు అర్థం కాలేదు. అర్థం చేసుకొనే ప్రయత్నమూ చెయ్యలేదు. వారి దృష్టిలో భారతీయ సంప్రదాయాలు అసంబద్ధమైనవి! భారతీయులంతా అనాగరికులు! వీరికి నాగరికత నేర్పించి పద్ధతిలోనికి తీసుకొనిరావాలి! బ్రష్టుపట్టిన జాతిని పునరుద్ధరించాలని బ్రిటిష్‌ వాళ్ళు కంకణం కట్టుకొన్నారు. మనం నిజంగా పాడై ఉండి ఉంటే సంస్కరిస్తున్నారని అనుకోవచ్చు!
భారతదేశం బహు వర్ణాల పుష్పగుచ్చం! భారతీయులు తమ అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వస్తున్నారు. అటువంటి ఈ సమూహాలను తమ ఆధీనంలోనికి తెచ్చుకొని, వారి ఆదాయంపై పన్ను వేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనే సమయంలో ఈ దేవాదాసీ వ్యవస్థ వారికంట పడిరది. ఈ నేపథ్యంలో బెంగుళూరు నాగరత్నమ్మ గారి జీవితం అనేక ఆటుపోట్లకు గురి అయ్యింది. ఈమె జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి.
సాటిలేని సంగీత సుధామయి!: నాగరత్నమ్మ చిన్నతనాన వకీలు సుబ్బారావుగారు, తరువాత గిరిభట్ల తిమ్మయ్య గారి ఆశ్రయం పొందింది. సంగీత, నాట్యాలను అభ్యసించింది! అనేక అవరోధాలు ఎదుర్కొని ధైర్యంగా ముందుకు దూసుకొని వెళ్ళింది. సుమారు 30సం.లలో దాదాపు 1236 సంగీత కచేరీలు చేసింది. అవి ఎంతో ప్రజాదారణను పొందాయి.
బహుభాష కోవిదురాలు!: బెంగుళూరు నాగరత్నమ్మగారు సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో నిష్ణాతురాలై ఎన్నో పుస్తకాలను అవలీలగా రాసింది. ముఖ్యంగా తెలుగులో ‘మద్యపానము’, సంస్కృత భాషలో ‘త్యాగరాజు అష్టోత్తర శతనామవళి’, తమిళంలో ‘పంచీకరణ బోధిక’ రాసింది. ఆకాలాన స్త్రీలను సమాజం మేధావులుగా గుర్తించదు. అందుకు ఉదాహరణ బెంగుళూరు నాగరత్నమ్మ ‘ముద్దు పళని రాధికా స్వాంతన’ కావ్యానికి సంబంధించి ఎన్నో ప్రతులు పరిశీలించి, గ్రంథ పరిష్కరణ చేసి మేలుప్రతిని తయారు చేసింది. ఇది చెయ్యాలంటే భాషాభిమానంతో పాటు పాండిత్యం ఉండాలి! గ్రంథ పరిష్కరణ చెయ్యాలంటే ఆనాటి కావ్యభాషపై పట్టుండాలి! ఆ కాలంనాటి వాడుక భాషలోని పదాల గురించి కూలంకుషంగా తెలియాలి. ముందు వెనుక పద్యాల తేడాలను గుర్తించగలగాలి. ఇన్నింటిని అధిగమించి గ్రంథం ముద్రణరూపంలో వెలుగులోనికి వచ్చిన తరువాత అందులోని లోటుపాట్లను ఎత్తి చూపడానికి పండితలోకం కాచుకొని కూర్చోనుంటుంది. పురుషులకన్నా స్త్రీలు ఇటువంటివి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నాగరత్నమ్మ ఒంటి చేత్తో చేసింది. నాకు తెలిసి ఏ స్త్రీ ఇలా చెయ్యడానికి సాహసించలేదు.
తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాతఃస్మరణీయులు కందుకూరి వీరేశలింగ పంతులుగారు. ఆయన రాసిన ‘కవుల చరిత్ర’కు ముందుమాట రాస్తూ ముద్దుపళని రాసిన ‘‘రాధిక స్వాంతన గ్రంథ పరిష్కరణ చేసిన ఇది వ్యభిచారిణి వృత్తి కలిగిన జారిణి అగుటచే శృంగారం అనుపేర పచ్చి సంభోగ వర్ణనలు చాలా పచ్చిగా చేసింది’’ అని రాశారు. సాధారణంగా కవులను సంబోధించేప్పుడు బహువచనం ప్రయోగించే కందుకూరివారు ఇక్కడ నాగరత్నమ్మ గారిని ఉద్దేశించి ‘ఇది, వ్యభిచారిణి, జారిణి’ అనే పదాలను వాడారు.
నాగరత్నమ్మకు తనకులం పట్ల స్వాభిమానం, వృత్తి పట్ల గౌరవం ఎక్కువ! దీనికి సమాధానంగా రాధికా స్వాంతనానికి ముందుమాటలో ‘‘అగ్నిసాక్షిగా, ఒక మగనిని పెండ్లియాడి, వేరొకరితో పోవుట జారత్వం అనిపించుకొనును కానీ, వేశ్య జారిణి కాదు! బ్రహ్మ సృష్టించిన నాటినుండి వాత్సాయన కామసూత్రం వరకు చదివినవారికి ఈ విషయాలు తేటతెల్లం అవుతాయి!’’ అని రాసింది.
ఆ కాలాన కందుకూరి వీరేశలింగం లాంటి వారిని ఎదిరించడమంటే మాటలు కాదు! ఈ పుస్తకాన్ని వావిళ్ళ Ê సన్స్‌ వారు ప్రచురించారు. ‘అశ్లీలమైన పుస్తకం’ అని కేసులు పెట్టి ఆ ప్రతులన్నీ తగులబెట్టారు. స్వాతంత్య్రానంతరం అనేక పోరాటాల తరువాత ఆ కావ్యం వెలుగులోనికి వచ్చింది. స్త్రీలు వాళ్ళ లైంగికత్వాన్ని అర్థం చేసుకొని ముద్దుపళని రాసిన కావ్యం ‘పచ్చి శృంగార కావ్యం’ అన్నారు సరే! అదే పెద్దన లాంటి గొప్ప వారు రాస్తే అది ‘మంచి శృంగార కావ్యం!’. శ్రీనాధుడు లాంటి వారు రాస్తే ‘శృంగార ప్రబంధ కావ్యం!’. దేవదాసీలు రాస్తే ‘అశ్లీల కావ్యాలని’ ముద్ర వేస్తారు. అలాగే 1990సం॥లో స్త్రీ కవిత్వాన్ని నీలికవిత్వమని, వారకవిత్వమని, బూతు కవిత్వమని, ఒళ్లు బలచిన వాళ్ళు రాసిన కవిత్వమని కందుకూరి వారస కవులు చరిత్ర పునారావృతం చేస్తే దానిని ప్రతిఘటించి, కవయిత్రులు ఎలా నిలిచారో తెలుస్తుంది.
రాణిగా నిర్మాణాత్మక పనులు!: దేవదాసిగా పుట్టింది! ఆ ఆత్మ గౌరవంతోనే పెరిగింది! దేవదాసీల పక్షాన నిలిచింది. అయితే దేవదాసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. ముత్తులక్ష్మి వర్గం వారు ఈ వృత్తిని నిషేధించాలని కోరితే, నాగరత్నమ్మ వర్గంవారు ఈ వృత్తిని కొనసాగించాలని కోరారు. త్యాగరాజుస్వామి అంటే ఈమెకు వల్లమాలిన అభిమానం! ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి లాంటివారు జావలీలు వదిలివేసి సంకీర్తనలు మాత్రమే పాడారు. తంజావూరులోని తిరువయ్యూరులో 1921సం॥లో త్యాగరాజస్వామి గుడికి నాగరత్నమ్మగారు పునాదులు వేయించింది. దశలవారిగా నిర్మాణాన్ని చేపడుతూ తన ఇంటిని, యావదాస్తిని, నగనట్రా అన్నింటినీ ఇచ్చి 1949 సం॥ నాటికి గుడికట్టడం పూర్తి చేసింది. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పుష్య బహుళ పంచమినాడు ఆరాధనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అయితే త్యాగరాజు సద్‌ బ్రాహ్మణుడు! ఆ మహానుభావుడిని దేవదాసి ఉద్దరించడం ఏమిటని ఈమెను ఆరాధనోత్సవాల్లో రెండేండ్ల వరకు పాడనివ్వక నిషేధించారు. ఆమె పోరాడి గెలిచి నిలిచింది. ఇలా సంగీతం ` విజ్ఞానం ` మేథస్సు- సాహిత్యాలను అధ్యయన శక్తులుగా మలచుకొని సంస్కరణలతో నాయకురాలై పోరాడి జయించింది.
నయనాదేవి – 1917సం॥లో రష్యా విప్లవం మొదలైంది. ఆ సమయంలో భారతదేశంలో రాజరామోహన్‌రాయ్‌ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈయన శిష్యుడు కేశవ చంద్రసేన్‌ మనవరాలే నయనాదేవి. తండ్రి శరత్‌ చంద్రసేన్‌ బెంగాల్‌లో చాలా విశిష్టమైన సంపన్న కుటుంబం. దేనికీ లోటులేదు! విద్య, సంగీతం, సాహిత్యం, నాటకాలు బ్రహ్మ సమాజంలో భాగంగా ఏర్పాటయ్యాయి.
గొప్ప గొప్ప సంగీతకారులు ఎంతోమంది వారింటికి వచ్చి సంగీత కచ్చేరీలు ఇచ్చేవారు. వారిలో ‘తావాయిఫ్‌లు’ కూడా ఉండేవారు. ఉత్సాహంగా వాటిని వినడమేగాక తిరిగి పాడేవారు నైనా. ఒక గొప్ప విద్వాంసుడు ఆమెను శిష్యురాలిగా స్వీకరించారు. సంగీతాన్ని నేర్పించారు. ఆకాలంలో పెద్ద కుటుంబాలలో బయట పాడటానికి, నృత్యం చేయడానికి అనుమతించేవారు కాదు.
9సం॥ వయస్సులో నైనా వారి బాబాయితో పాటు రహస్యంగా అంగూర్‌ బాల ఇంటికి వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చోని తాను పాడే పాటకు ప్రభావితం అయింది. ఇలా తన బాల్యం సాగిపోయే సమయంలో పంజాబ్‌ రాజ వంశీయుడు ‘రిప్‌ జిత్‌సేన్‌’తో వివాహమైంది. విందులు, వినోదాలు, సంగీత కచేరిలతో హాయిగా దాంపత్య జీవితం సాగిపోయి నలుగురు పిల్లలు పుట్టారు. నైనాకు 30సం॥ వయస్సులో భర్త చనిపోవడంతో జీవితం కుప్ప కూలిపోయింది. ఇది ఏస్త్రీ జీవితంలోనైనా శాపమే! కానీ నైనా కుమిలిపోతూ కూర్చోలేదు! ఆ కల్లోలం నుండి బయట పడిరది. కుటుంబ గొడవలనుండి గట్టెక్కి తన భాగాన వచ్చిన 300 ఎకరాలను రైతులకు పంచివేసింది. తన నగానట్రా దానం చేసి, రాజమహలును వదలిపెట్టి తన బిడ్డలను తీసుకొని డిల్లీకి చేరుకొని రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకొంది. ఇద్దరు పిల్లలను హాస్టల్‌లో ఉంచి, మరో ఇద్దరు పిల్లలను తనతోనే ఉంచుకొని సంగీతాభ్యాసం తిరిగి చెయ్యడం మొదలు పెట్టింది.
కొందరు స్త్రీలు ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూల పరిస్థితులుగా మార్చుకొంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నైనా. ఈమె జీవితం ఒక గొప్ప ఉద్యమం. సంగీత విద్వాంసుల దగ్గర విద్యను నేర్చుకొంది. కళాక్షేత్రం పెట్టి తాను డైరెక్టర్‌ అయింది. హిందూస్థానీ సంగీతం, కథక్‌ తదితర కళలను ప్రోత్సహించింది. తాను ఎదిగింది! తనతోపాటు తోటి కళాకారులను ఎదగడానికి దారిచూపింది.
ఒక సందర్భంలో తవాయిఫ్‌లు సభ నిర్వహించుకొంటూ ఈమెను కూడా ఆహ్వానించారు. ఈమె దానికి చిన్నబుచ్చుకోలేదు. తనను కూడా వారిలో ఒక్క తవాయిఫ్‌ గుర్తించినందుకు మురిసిపోయింది. రాగ్‌రంగ్‌ సాంస్కృతిక సంస్థను స్థాపించి దాని ద్వారా దేశంలోని కళాకారులనెందిరినో తీసుకొని వచ్చి అంజలీ బాయి, బెజ్జుమహరాజు వంటి వారిని కళ్లముందు పెరగడం చూసింది. దూరదర్శన్‌లో వారి ముఖాముఖులు నిర్వహించింది.
ముగింపు – ఇద్దరూ రెండు విభిన్న నేపథ్య కుటుంబాల నుండి వచ్చారు. ఒకరు దేవదాసి అయితే మరొకరు హిందూస్థానీ రాజ వంశస్థురాలు. నైనాదేవి చిన్నతనం నుండి సంగీతమే ప్రాణంగా పెరిగారు. వీరిరువురి నుండి మనం ఏమి నేర్చుకోవాలి!
భిన్నత్వాన్ని ఎదుర్కొనే వారినుండి ప్రతిఘటించి ముందుకు వెళ్ళాలన్న సందేశాన్ని ఇచ్చారు.
జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి!
ద్వేషానికి బదులు ప్రేమను పంచి ఇవ్వాలి!
అసహనాన్ని సహనంతో ఎదుర్కోవాలి!
ఈ నేర్పులను మనం అలవరచుకోవాలి!
ఇవన్నీకూడా స్త్రీలకే పరిమితమైన ప్రత్యేక విద్యలు!
సంగీతం, సాహిత్యాలలో పట్టు సాధించి చరిత్రను నిర్మించాలి. దానిని ముందు తరాల వారికి అందజెయ్యాలి.
వోల్గాగారు స్త్రీ సంగీతకారుల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.
శీలా సుభద్రాదేవి గారు ఈ సందర్భంగా వారి చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకొన్నారు. వారి అమ్మగారికి సంగీతం అంటే చాలా ఇష్టమట! వారి చిన్నతనాన పక్కఇంటిలో సంగీతకారుల కుటుంబంవారు ఉండేవారంట! వారి ఇంట్లో నిత్యం హర్మోనియంతో కూడిన పాటలు వినిపించేవట! వాటిని విని ఇంటికి వచ్చి ‘‘సానీ దపా… సాని…సాని…దపా….’’ అని పాడుతుంటే ఇంట్లోని వారు విని ఆ సాని పాటలు నీ నోటి వెంబడి రావడమేమిటని కోపడ్డారంట! కనీసం తన పిల్లలన్నా సంగీతం నేర్చుకోవాలని వాళ్ళ అమ్మగారి కోరిక! తాను కళాశాలలో రెండు సంవత్సరాలు సంగీతం నేర్చుకొని ఉద్దరించానన్నారు. ‘‘నాకు అటువంటి పరిస్థితే ఎదురైంది. కానీ మా అమ్మాయికి సంగీతం నేర్పించాను. తాను సర్టిఫికేట్‌ కూడా పొంది రేడియోలో కూడా పాడిరది. చివరికి ‘‘నేను చెప్పేదేమంటే సంగీతం నేర్చుకొన్నా కొన్ని కులాలలో పాడలేని పరిస్థితి ఉండేది’’ అని అన్నారు.
సంగీతంలో రాణించాలంటే స్వరం ప్రధానం! నాట్యకళలో రాణించాలంటే ఆసక్తితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి! అటువంటి ఈ కళపై పట్టు సాధించిన యశోదా ఠాగుర్‌ అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ గారి గురించి మాట్లాడారు.
ఓల్గాగారు అలవోకగా అలా మాట్లాడారు! నేను అలా తెలుగు రాక, ఇలా ఆంగ్లం గాక ఎలాగోలా మాట్లాడేందుకు ధైర్యం చేసి మీ ముందుకు వచ్చాను!
ఇక్కడ నన్ను దేవదాసి గురించి మాట్లాడమంటున్నారు. మావూరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి ఇబ్బందిపడి, పి.డి.పి అని చెప్పుకొనే సందర్భాలున్నాయి! కానీ నేడు ఇంతమంది గొప్పవారి నోటినుండి మా గురించి ఇలా వింటుంటే నేటి సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని తెలుస్తోంది.
యశోదా ఠాగూర్‌ గారి ప్రసంగం నేను కళాకారుల కుటుంబంలో పుట్టాను! నాట్యంతో పెరిగాను! అది నా అదృష్టం అనుకొన్నాను! శ్రీమతి శోభనాయుడు దగ్గర ఎంతోకాలంగా నాట్యాన్ని నేర్చుకొన్నాను. నా పదహారేండ్ల వయస్సులో చిన్న సంఘటన జరిగింది. నేను అందంగా ఉంటానని చక్కటి అభినయంతో నాట్యాన్ని ప్రదర్శిస్తానని పలువురు నాతో చెప్పేవారు. మా అమ్మ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను. ‘‘మనం సానివాళ్ళం! కళావంతుల కుటుంబం నుండి వచ్చాం! గుళ్ళల్లో నాట్యం చేసేవాళ్ళం! తరువాత మనలను వేశ్యలకింద పరిగణించారు’’ అని చెప్పింది. మా నాన్నగారు ఎ.పి.ఎస్‌. ఆర్‌.టి.సిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మనం ఏమి అలా లేము కదా! అని మా అమ్మను తిరిగి అడిగాను. మనం అందులోంచి చాలా కష్టపడి బయట పడ్డాం. ప్రస్తుతం నాయకులమని చెప్పుకొంటున్నాం. దీని గురించి ఇక మాట్లాడవద్దని, అయితే ఈ విషయం గురించి ఎవరికైనా మంచి జరుగుతుందంటే మాట్లాడు! కానీ దానినే పతాకం చేయవద్దని చెప్పింది.
ఒకసారి మా అమ్మగారు పదాలు, జావళీలు గురించి చెబుతూ అమ్మమ్మగారు మేజువాణి చెయ్యలేదు! వారి ముందు తరంవారు చెయ్యలేదు! అది ఒక అపవిత్ర కార్యం అన్నట్లు చెప్పింది. ఒకసారి నా నాట్యాన్ని వీడియోలో చూస్తూ దీనిని అమ్మమ్మగారు చేసేవారని గబుక్కున చెప్పింది. దానిని మీ ముందు అభినయించి చూపిస్తానని యశోదగారు చెప్పారు.
ఒక సామాన్య నాయక తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన నాయకుడిని చూసి ఇల్లు ఎరుగక మరొకరింటికి వచ్చావా! నీస్థాయికి తగ్గ అమ్మాయి ఆ పక్కవీధిలో ఉంది వెళ్ళు! బాగా తయారయ్యి వచ్చావు! మనస్సు మాత్రం ఇవ్వవు! నాకోసం పార్థ సారథి ఎదురుచూస్తున్నాడు వెళ్ళు! వెళ్ళు! అని అంటుంది.
భక్తిసంగీతం ద్వారా ప్రసిద్ధుడైన త్యాగరాజుస్వామి దేవదాసీల కృషి ద్వారా తిరిగి పునరుజ్జీవించబడ్డాడు. బెంగుళూరు నాగరత్నమ్మ, బాలసరస్వతితో పాటు మరొకరు ఉన్నారు. వారే తెలుగు నాట కళావతుల కుటుంబంలో పుట్టిన గుమ్మడి వెంకట రత్నమ్మ గారు. ఆమె గురించి చాలామందికి తెలియదు. గుమ్మడి వెంకట రత్నమ్మ మనవరాలు మంగతాయారు గారు మా గురువుగారు. భామా కలాపం, గొల్ల కలాపం తదితర అంశాలు వారి దగ్గర నేర్చుకొన్నాను.
ముందరి కాలాన దాసీలు దేవాలయాల్లో మాత్రం నాట్యం చేసేవాళ్ళు. పదాలు, జావళీలు ప్రదర్శించేవారు. దేవునికి సేవ ఆ విధంగా చేసి ‘దేవదాసీలు’ అయ్యారు. నిజానికి రాజాదరణ లేకపోతే ఆలయాలు లేవు. తరువాత క్రమంగా రాజస్థానాల్లో దేవదాసీలు నాట్యం చేయడం మొదలు పెట్టారు. మేజువాణి జరిగే సమయంలో స్త్రీలు జావళీలు అనేకం రాశారు. (క్షేత్రయ్య పదాలు రాసే కాలాన)
జమీందారి వ్యవస్థ వచ్చాక వారి పరిస్థితి క్షీణస్థితికి చేరుకొంది. వారి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. అందుకే వారిని సమాజం నుండి వెలివేశారని అంటారు.
సంస్కృతం దైవభాషగా, జంతువులను దేవతలుగా చేసుకొని మనవాళ్ళు ఆరాధిస్తున్నారని ఆంగ్లేయులు భావించారు. స్వాతంత్య్రం ఇక సిద్ధింస్తుందన్న సమయంలో గాంధీగారు తదితర స్వాతంత్రోద్యమ నాయకులు భారతదేశాన్ని అలంకరించి చూపాలని భావించారు. శృంగార భరితమైన జావళీలు ప్రదర్శిస్తున్నారని ‘దేవదాసీ చట్టం’ (సుమారు 11/2 పుటలో) తీసుకొని వచ్చారు. ఈ చట్టం ప్రకారం దేవదాసీల (భోగంవారు/ సానివారు) నాట్యం సమాజానికి మంచిదికాదని ఆలయాల్లో, శుభకార్యాల్లో, ఎక్కడా వారు నాట్యాన్ని ప్రదర్శించకూడదని దాని సారాంశం. అదే సమయంలో ఇతరులు ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పించారు. దేవదాసీలకు బతకడానికి నాట్యం తప్పితే వేరే ఏమీరాదు. అంతకుముందు సమాజంలో దేవదాసీల నేపథ్యాన్ని పరిశీలిస్తే, స్త్రీలు తమలో ఉన్న నాట్యకళను బయట ప్రదర్శించి కుటుంబాన్ని పోషించేవారు. స్త్రీలు శక్తివంతులని లోకానికి చాటి చెప్పేవారు. వీరికి ఇచ్చిన దేవుని మాన్యాలు వీరు అనుభవించవచ్చు! భూమిలో పంట వీరికి సొంతం! కానీ, ఇతరులకు అమ్మడానికి వీరికి హక్కులేదు.
దేవదాసీల రద్దు చట్టం రావాలని రెండు వర్గాలు విడిపోయాయి. ఒక వర్గం వారు దేవదాసీ వ్యవస్థ కొనసాగడానికి మద్దతునివ్వగా మరో వర్గంవారు దేవదాసీ వ్యవస్థ రద్దు చేయాలని కోరారు. ఈ వర్గంలో మగవాళ్ళే ఎక్కువ వుండటం విశేషం. రావుబాలసరస్వతి గారి దగ్గరకు వెళ్ళి ఈ వర్గంవారు సంతకం పెట్టమని కోరగా అందుకు ఆమె నిరాకరించారు. నా శరీరంలో నాట్యం చేసే సత్తా ఉన్నంత వరకు నేను నాట్యాన్ని చేస్తూనే ఉంటానని ధైర్యంగా సమాధానం చెప్పింది.
అంతకుముందు చోళుల కాలంలో నాట్యం నటరాజ స్వామి నుండి వచ్చిందని రాసిపెట్టారు. నాట్యంచేసే వారి లింగభేదాలను మార్చివేశారు. నటరాజస్వామి పదాలు జావళీలు రాసి చేసేవారన్న సంగతి నాకు తెలియదు.
ఈ నేపథ్యంలో బుల్లి వెంకట రత్నం గారి గురించి చెప్పుకోవాలి. వీరి అమ్మమ్మగారు అన్నాబత్తుల సత్యమ్మగారు, అమ్మ మంగతాయరుగారు. అన్నాబత్తుల వెంకటరత్నమ్మ గారు సంగీత కళాకారులకోసం మహారాజ నృత్య కళాశాలను ఏర్పాటు చేశారు. సత్రాలను కట్టించారు. ఈ మధ్యకాలంలో ఆమె శత వార్షికోత్సవం కూడా జరిగింది.
కొండవీటి సత్యవతి గారి ప్రసంగం! చాలామంది స్త్రీ మూర్తులు చరిత్ర పునాదుల్లో కనుమరుగు అయిపోయారు. అటువంటి వారిలో కొండపల్లి వెంకటేశ్వరమ్మగారు, బండారు అచ్చమాంబగారు అద్భుతమైన స్త్రీ మూర్తులుగా వినీలాకాశంలో మినుకు మినుకుమంటున్నారు. చరిత్రలో చాలా విషయాలు మనకు తెలియకుండా పోతున్నాయి. కొండపల్లి కోటేశ్వరమ్మ గురించి ‘మనకు తెలియని చరిత్ర’, అస్మిత వాళ్ళు ప్రచురించిన ‘షశీఎవఅ షతీఱ్‌వతీ ఱఅ Iఅసఱa’ అనే పుస్తకాల మూలంగా చాలామంది స్త్రీమూర్తుల గురించి లోకానికి తెలిసింది.
బండారు అచ్చమాంబ గురించి నేను చదివి ఆశ్చర్యపోయాను. ఆమె రాసిన మొదటి కథను తెరవేసి దాచిపెట్టారు. మనం మొట్టమొదటి కథ అని అనుకొంటున్న గురజాడ రాసిన ‘దిద్దుబాటు’ కన్నా పది సంవత్సరాలు ముందు ప్రధమ స్త్రీవాద చరిత్రకారిణి అచ్చమాంబగారు రాసిన మొదటి కథ ‘ధన త్రయోదశి’ హిందూ సుందరి పత్రికలో 1902 సం॥లో ప్రచురితం అయ్యింది.
కోటేశ్వరమ్మగారి గురించి చాలా విన్నాను. ఆమె వందేళ్ళ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎన్నేండ్లైనా కథలు కథలుగా చెప్పుకోవచ్చు. అందులో అంత దుఃఖం ఉంది. ‘మహిళావరణం’ పుస్తకంలో ఆమె గురించి చదివాను. ఆమె గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకొన్నాను. కోటేశ్వరమ్మ గురించి అన్వేషణ సాగించాను. ఆమెను ప్రత్యక్షంగా కలుసుకొని నేను వచ్చిన పనిని తెలియజేశాను. భూమిక పత్రిక కోసం ముఖాముఖి అడిగాను. తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల దొంతరలను తడుముకొంటూ విప్పారు.
1902. సం॥లో నాలుగేండ్ల వయస్సులో తన మేనమామతో వివాహం అయ్యింది. ‘అష్టవర్ష భవే కన్య’… అన్నట్లు ఆనాటి సమాజంలో ఆ వయస్సులో పెండ్లి చెయ్యకపోతే తల్లిదండ్రులను వెలివేసేవారు.
స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో మహాత్మ గాంధీగారు బందరుకు వచ్చారు. ఆ సభలో ఉద్యమానికి నిధులు సేకరిస్తున్న సమయంలో కోటేశ్వరమ్మ ఆడుతూ, పాడుతూ గాంధీగారి వద్దకు వెళ్ళి తాను వేసుకొన్న బంగారు గాజులు, గొలుసు తీసిచ్చి వచ్చిందంట! అప్పుడు ఆమె వయస్సు 5,6 సం॥లు ఉంటుంది. ఇంటికి వచ్చి విషయం చెప్పిందంట! ఎందుకు వెళ్ళావని అమ్మ కోప్పడితే, తనతోటి పిల్లలతో పాటు తాను వెళ్ళానని చెప్పిందంట! వాళ్ళ నాన్నగారు ‘‘మనం చేయలేని పనిని మన బిడ్డ చేసింది’’ అని మెచ్చుకొన్నారంట! ఈ విషయాన్ని చాలా ఉత్సాహంగా కోటేశ్వరమ్మగారు నాతో పాలుపంచుకొన్నారు.
కోటేశ్వరమ్మ గారు ఆరేండ్ల వయస్సు ఉన్నప్పుడు భర్త చనిపోవడంతో ఇంట్లో, బయట ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టారు. ఇలా ఎందుకు చూస్తున్నారో ఆ పసిమనస్సుకు అర్థం కాలేదు. తన తోటి స్నేహితురాలితో అడిగినపుడు ‘‘మగుడు చచ్చిన వారిని అలాచూస్తారులే!’’ అని చెప్పినదట! తనపట్ల అందరూ జాలి చూపడానికి కారణం తన వైధవ్యమే అని గ్రహించింది! దీనితో తన 11వ ఏటే చదువు మానేసింది. ఆమె బాబాయి దగ్గర పాటలు నేర్చుకొని, వేదికలపై తాను పాటలు పాడేది.
కోటేశ్వరమ్మకు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న కొండపల్లి సీతారామయ్య గారితో రెండో వివాహం చెయ్యాలని పార్టీవారు నిర్ణయించారు. ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. పల్లెటూరిలో మూఢాచారాలు ఎక్కువ! ఇటువంటి పెండ్లిళ్లు అంగీకరించరు! అందుకని వేరే ఊరికి తీసుకొనిపోయి అక్కడ వాళ్ళిద్దరికీ పెండ్లి చేశారు.
కమ్యూనిస్టు పార్టీలోని వ్యక్తుల భావాజాలాలు విభిన్నమై సుందరయ్య (సి.పి.ఎమ్‌) నాయకత్వంలో ఒక వర్గం, చంద్రసేన్‌ నాయకత్వంలో (సి.పి.ఎమ్‌) ఒక వర్గం… ఇలా రెండుగా విడిపోయింది. అయితే ఇందులో మహిళల సమస్యలు ఎక్కువై పోయాయి. ఉదాహరణకు మహిళలు పక్కవారితో మాట్లాడకూడదు!
పార్టీ వీడిపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కోటేశ్వరమ్మగారు గర్భవతిగా ఉన్నారు. అమ్మగారింటివారు ఒక కమ్యూనిస్టు పార్టీ వర్గానికి, అత్తగారింటి వారు మరోపార్టీ వర్గానికి వెళ్ళారు. కోటేశ్వరమ్మగారు తన బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బును కమ్యూనిస్టు పార్టికీ ఇచ్చివేసింది. పూట గడవడం కష్టమైంది. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ స్థాపించిన ‘ఆంధ్ర మహిళాసభ’లో చేరి పదవ తరగతి పూర్తి చేసింది. అదే ఆమెకు జీవనాధారం అయింది. కరుణ పుట్టింది. విజయవాడకు తిరిగి చేరుకొంది. సీతారామయ్య గారు, అర్థరాత్రి భార్యను వదిలి, ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కాకినాడలో రామ్మోహన్‌ రావుగారు ఉద్యోగమిచ్చి కోటేశ్వరమ్మ గారిని ఆదుకొన్నారు.
అమ్మ ఇచ్చిన స్పూర్తితో కోటేశ్వరమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగారు. ఒక కష్టం తరువాత మరొక కష్టం వెంటాడుతూనే
ఉంది. కొడుకును పోలీసులు తీసుకొనివెళ్ళి ఎన్‌కౌంటర్‌ చేశారు! శవాన్ని కూడా ఇవ్వలేదు.
‘‘నేను దుఃఖాలను అనుభవించడానికే పుట్టానని బాధ పడుతున్న సమయంలో సాహిత్యం నన్ను ఆదుకొంది’’ అని కోటేశ్వరమ్మగారు అంటారు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా హైదరాబాద్‌కు, కాకినాడకు తిరుగుతూనే ఉన్నారు. ఆ సమయంలో పార్టీ ఆదుకొంది. తాపీ ధర్మారావు కోడలు తాపీ ధర్మమ్మ ఈమెకు స్నేహితురాలైంది. వారి ఇంట్లో ఆశ్రయం పొందుతున్న సమయంలో స్నేహితురాలైన రాజమ్మకు తన యోగక్షేమాలను తెలుపుతూ లేఖ రాసారంట. దానిని చదివిన తాపీ ధర్మారావుగారు దానినే కథగా రాయమన్నారంట. అలా వారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను కథలుగా రాయడం మొదలుపెట్టారు. ‘‘కాకినాడలో కవితలు రాశాను. అలా సాహిత్యం నన్ను మీముందు నిలబెట్టింది’’ అని అంటారు కోటేశ్వరమ్మ గారు.
కూతురు కరుణ డాక్టర్‌ అయ్యింది. వృత్తిరీత్యా ఢల్లీి, చత్తీస్‌గడ్‌ తదితర ప్రాంతాల్లో పనిచేసింది. ఆ సమయంలో భర్త బెజవాడలో వడదెబ్బ తగిలి చనిపోయారు. కరుణ డిప్రిషన్‌లోకి వెళ్ళిపోయారు. నిద్రమాత్రలు తీసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఇటువంటి సమయంలో అచ్చమాంబగారు అండగా నిలిచారు.
ఈమె రాసిన ‘నిర్జన వారధి’ అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
కోటేశ్వరమ్మ గారితో నా అనుబంధం
కోటేశ్వరమ్మ గారికి వందో పుట్టిన రోజు జరిగినపుడు నేను ‘సారంగ’లో వచ్చిన ఆమె వ్యాసాలను (ఓల్గాలాంటి వాళ్ళు రాసినవి) కట్ట కట్టి తీసుకొని వెళ్ళాను. ఆమె చేతికి తీసుకొని మురిసిపోయింది. అవి నేను పెట్టుకొంటానని చెప్పింది. ఆమెకు వందేండ్లు నిండిన నిండు మల్లెలాగ తెల్లగా గలగల మాట్లాడుతూ పాత సంగతులన్నీ గుర్తు తెచ్చుకొని వినిపించింది. ఆమె రాసిన పుస్తకం విశాఖ పట్టణంలో విడుదల అయినపుడు మ్యూట్చువల్‌ (అంతర్జాల సమావేశంలో) పాల్గొని వారి స్నేహితురాలి గురించి మాట్లాడారు. వారు నేడు మన మధ్య లేకున్నా ఇటువంటి వ్యక్తుల స్పూర్తిదాయక కథనాలు యువతలోనికి వెళ్ళాలి.
శీలా సుభద్రాదేవిగారి ప్రసంగం నేను రాతకత్తెను కానీ, మాటకత్తను కాను!
శివరాజు సుబ్బలక్ష్మి గారు తన 12వ ఏట బుచ్చిరాజుగారి చిటికిన వేలుతోపాటు కలం పట్టుకొని ఆయనకు సమాంతరంగా రచనలు చెయ్యడం మొదలుపెట్టారు. అంతేగాక ఈవిడ గొప్ప చిత్రకారిణి కూడా!
స్వాతంత్య్రానికి ముందు, తరువాత మధ్య తరగతి స్త్రీల జీవితాన్ని రాశారు. ఆనాటి సమాజంలోని బాల్యవివాహాలు చేసి రసజ్వల కాగానే అత్తగారింటికి పంపించి తమ బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు అనుకొనేవారు.
అత్తగారింట్లో ఆరళ్ళు, భర్త చదువులు, ఒంటరిగా చేసే చాకిరితో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలు వీటిని ఎలా అధిగమించేవారో ఈవిడ కథలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకవేళ స్త్రీ వితంతువు అయితే చావైనా బతుకైనా అత్తగారింట్లోనే కడవరకు ఉండాల్సి వచ్చేది. అటువంటి స్త్రీలు ఎదుర్కోనే పరిస్థితులకు దర్పణం పట్టే శివరాజు సుబ్బలక్ష్మి గారు రాసిన కథలు కోకొల్లలు.
పోస్టు చెయ్యని ఉత్తరం – అక్క చనిపోతే బావను పెండ్లి చేసుకొనే పరిస్థితి, భార్య చనిపోతే రెండవపెండ్లి చేసుకొన్నప్పుడు మొదటి భార్య పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? అన్న కథనంతో కథ నడుస్తుంది.
ఇందిర భర్త పట్నంలో ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. మధ్యతరగతి ఇల్లాలుగా సంసారాన్ని గుట్టుగా నడుపుకొని వస్తూ ఉంటుంది. భర్త సుధ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొంటాడు. ఇందిర చదువుకోకపోవడం కారణంగా ఆత్మహత్యకు సిద్ధమై భర్తకు ఉత్తరం రాస్తుంది. భర్త స్నేహితునికి కంటపడి భర్తలో మార్పును తీసుకొనివస్తాడు.
‘తెల్లారింది’ కథలో రెండోపెండ్లి ప్రధాన సమస్యగా కనిపిస్తుంది.
ఈమె కథల్లో సాధారణంగా స్త్రీ పాత్రలు సమధానపడ్తునే సమస్యల నుండి తామే పరిష్కరించుకోగలుగుతారు. ఇవి మనస్సులోంచి వచ్చే కథలు. ఒకసారి బుచ్చిబాబుగారు నీ కథలంటే నాకిష్టం అని సుబ్బలక్ష్మిగారితో అన్నారంట! బుచ్చిబాబు కథల్లో వర్ణనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే సుబ్బలక్ష్మిగారి కథలు సూక్ష్మంగా ఉంటాయి.
‘ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది!, పోస్టు చెయ్యని ఉత్తరం!’ మొదలైన శీర్షికలు ఆకట్టుకొనేలా ఉంటాయి. కొన్ని వాక్యాలు వర్ణనాత్మకంగా ఉంటాయి. ఉదా. ‘‘చినుకులు చిటపటమంటూ నేలమీద ఉరికాయి’’
అద్దేపల్లి వివేకనందకి ఈమె రాసిన ‘ముంజేతి కంకణం’ చదివాక, ఉత్తరం రాస్తూ మా వదిన జీవితంలా ఉందని ప్రశంసించారంట!
కళ్ళల్లో చూస్తూ మనస్సులో నింపుకొని చిత్రాలరూపంలో సుబ్బలక్ష్మి ఆవిష్కరిస్తుంది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి దృశ్యం తిలకిస్తున్నట్లు ఉంటుంది. ఈమె చిత్రాలు గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తే, బుచ్చిబాబు గారి చిత్రాలు యూరోపియన్‌ శైలిని ప్రతిబింబిస్తుంది. 2015. సం॥లో బుచ్చిబాబు గారి 177 చిత్రాలు, సుబ్బలక్ష్మిగారి 140 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని వెలుగులోనికి తెచ్చారు.
‘నేరం’ కథ మంచి పేరు తెచ్చి పెట్టింది. పనిమనిషి దృష్టికోణంలో సమాజాన్ని చూపింది. చీకట్లో వెళ్ళినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలని సందేశాన్ని ఇస్తుంది ఈ కథ. ఈ వీధిలో సగం ఇండ్లు నావేనని అంటుంది.
ఈమె కథలు మనలను గ్రామీణ వాతావరణంలోనికి వేలుపట్టి నడిపించుకొని తీసుకొనిపోతాయి. కొబ్బరి ఆకుల గలగలలు, పచ్చని తోటల పలకరింపులు మనల్ని పులకరింప చేస్తాయి. బుచ్చిబాబుగారితో జీవించినది కొద్దికాలమే అయినా వారితో గల అనుబంధం ఎక్కువ!
సుబ్బలక్ష్మి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె రాసిన ఒక కథను అడిగితే ఆ కథ నేపథ్యాన్ని కూడా విడమరచి చెబుతారు. ఒకసారి ఆమెను హైదరాబాద్‌ సభలో కలిసాను. సాయంత్రం తాను బసచేసిన హోటల్‌కు రమ్మన్నారు. నేను వెళితే ఆప్యాయంగా పలకరించి ఎన్నో కబుర్లు చెప్పారు. 87 సం॥ల వయస్సులో కూడా ఏదైనా టి.విలో వార్తలు చూస్తూ దానికి సంబంధించిన కథను అలవోకగా అల్లేస్తారు. అలాగే ఏదైనా దృశ్యాన్ని చూసినా అలా చిత్రాన్ని గీసేస్తారు. ఆమెనుండి నేనుకూడా ఎంతో స్పూర్తిని పొందాను.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.