మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్‌ మొఘల్స్‌ – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

లలిత హృదయుడైన అక్బర్‌ కళలను పోషించాడు. ‘బులంద్‌ దర్వాజా’ లాంటి బృహత్‌ నిర్మాణాలను చేపట్టాడు. 1584లో ‘ఇలాహీ’ శకాన్ని ప్రారంభించాడు. 1586లో తన జీవితం, కాలాలకు సంబంధించిన చరిత్ర రాయమని ఆ పనిని తనకు అత్యంత ఆప్తుడైన అబుల్‌ ఫజల్‌కు అప్పగించాడు. అది అక్బర్‌నామా గా ప్రసిద్ధమైంది.

అక్బర్‌ను తీవ్రాతి తీవ్రంగా విమర్శించిన ఛాందసాగ్రేసర చక్రవర్తి అబ్దుల్‌ కాదిర్‌ బదౌనీ ప్రకారమే, అక్బర్‌ కాలంలో సూఫీ తత్త్వమూ, శాస్త్రీయ చర్చలూ, తత్త్వశాస్త్ర శోధనలూ పరిఢవిల్లాయి. ‘గుడ్డి అనుకరణ’పై ‘హేతువు’ పైచేయి సాధించింది. సహజంగానే ముస్లిం ఛాందసులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ పరిస్థితే తగలడిరది! ఇస్లాంను సఱశ్రీబ్‌వ చేశాడన్న ఆరోపణతో ఇస్లామిక్‌ ఫండమెంటలిస్టులు అక్బర్‌ను తిడుతూనే వుండడం పరమ విషాదం. మన పొరుగు దేశంలోనైతే మరీ ఎక్కువ. దేవున్ని ప్రేమతో ఆరాధించాలేగానీ ఏవో భౌతిక ప్రతిఫలాపేక్షలతో కాదన్నాడు అక్బర్‌. ‘మంచి’గా వుండడం మంచిది కాబట్టి, మనం మంచిగుండాలన్నాడు. ఎంత గొప్ప మాట, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ!
యుక్త వయసులో వున్నప్పుడు బాగా మందు తాగేవాడైనప్పటికీ, వయసు పెరిగేకొద్దీ తాగుడు తగ్గించాడు. తనకు పెద్దగా చదువు లేనప్పటికీ, జ్ఞానం పట్లా, పుస్తకాల పట్లా, జ్ఞానుల పట్లా అక్బర్‌కు ఎంతో భక్తీ, గౌరవాదరాలుండేవి. స్వతహాగా జ్ఞానపిపాసి కావడంవల్ల సహజంగానే తన పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాడు. రాజ్యకాంక్షతో కుమారుడైన సలీం/జహంగీర్‌ తన మీద తిరుగుబాటు చేసినా క్షమించి వదిలేయడమే కాకుండా, చనిపోయే ముందు అతన్ని రాజ్యానికి వారసున్ని చేశాడు. అక్బర్‌ జీవితాన్నీ, ఆచరణనూ దగ్గరగా గమనిస్తే అన్ని మతాలనూ సమానంగా గౌరవించడానికి ఒక వ్యక్తి నాస్తికుడు లేదా నాస్తికురాలు కానక్కరలేదన్న ముఖ్య విషయం మనకు బోధపడ్తుందని ఫర్హత్‌ నస్రీన్‌ నొక్కివక్కాణించారు. మతంలోని నిజమైన సారాన్నీ, మానవత్వాన్నీ త్రుంచివేసే కర్మకాండల్ని తీవ్రంగా నిరసించిన అక్బర్‌ ప్రకారం, నిజమైన మతావలంబకులెవరైనా మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో, అక్బర్‌ నిస్సందేహంగా తన కాలం కంటే, మన కాలం కంటే చాలా ముందున్నాడు. ఇంత ‘గొప్ప’ మనిషి ` ద గ్రేట్‌ అక్బర్‌ ` 1605 అక్టోబరు 17న చనిపోయాడు.
అక్బర్‌ చనిపోయిన వారానికి 1605 అక్టోబరు 24న పట్టాభిషిక్తుడయ్యాడు నూరుద్దీన్‌ ముహమ్మద్‌ జహాంగీర్‌ బాద్‌షా ఘాజీ (పాలనా కాలం: 1605`1627). జహాంగీర్‌ తల్లి రాజపుత్ర స్త్రీ. అసాధారణ ఉదారవాది అయిన తండ్రికీ, హిందూ స్త్రీకీ పుట్టిన జహాంగీర్‌ వ్యక్తిత్వం విలక్షణంగా రూపొందింది. భాషల పట్ల జహాంగీర్‌కు ప్రత్యేక ఆసక్తి వుండేది. అతని ఆత్మకథ తుజుక్‌`ఇ`జహాంగీరీ లో శరీరధర్మశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగోళ శాస్త్రం, వైద్యం, చరిత్ర మొదలైన వైవిధ్యభరితమైన విషయాల్లో అతనికున్న తీవ్ర జిజ్ఞాస ద్యోతకమౌతుంది. తన తండ్రి అక్బర్‌ మక్కువతో పట్టుబట్టి అనుసరించిన ‘సుల్హ్‌`ఇ`కుల్‌’ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా కాపాడి కొనసాగించడమే కాకుండా, దానికి ‘న్యాయం’ అనే కొత్త అంశాన్ని జోడిరచాడు జహాంగీర్‌. మొత్తం బంగారంతో చేయించిన ఒక ‘న్యాయగంట’ను న్యాయార్థుల కోసం యేర్పాటు చేశాడు. జహాంగీర్‌ చేసిన అనేక ప్రజోపయోగకరమైన చట్టాల్ని వివరించారు ఫర్హత్‌ నస్రీన్‌. జాగీర్దార్లూ, ప్రభుత్వాధికారుల కబంధహస్తాల నుండి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడానికోసం చేసిన చట్టాలు వీటిలో ప్రధానమైనవి. బెంగాల్‌లోని సిల్హెట్‌లో తల్లిదండ్రులు తమ కుమారులను నపుంసకులుగా మార్చి అమ్మడమో లేదా, తాము చెల్లించాల్సిన పన్ను బకాయిలకు బదులుగా యిచ్చేయడమో చేసేవారు. జహాంగీర్‌ ఈ క్రూర పద్ధతిని మాన్పించడమే కాకుండా, అలాంటి తల్లిదండ్రులు దండనార్హులని ప్రకటించాడు. అంతే కాకుండా, నపుంసకులుగా మార్చబడ్డ యువకులను వారి వారి యజమానుల నుండి విడిపించాడు. ఇలాంటి వ్యాపారం చేసే వ్యాపారస్తులను యావజ్జీవిత కారాగారవాసంతో శిక్షించే నిమిత్తం ఆగ్రాకు పంపించమని అధికారులను ఆజ్ఞాపించాడు. జహాంగీర్‌ అధికారుల్లో ఒకడైన సాద్‌ఖాన్‌ దగ్గర 1200 మంది నపుంసకులుండేవారు. వారు పేద ప్రజల్నీ, బలహీనుల్నీ వేధించేవారు. న్యాయం అందరికీ ఒకటేననీ, తన నపుంసకులను నియంత్రించమనీ లేదా దండనకు సిద్ధంగా వుండమనీ సాద్‌ఖాన్‌ను గట్టిగా హెచ్చరించాడు జహాంగీర్‌. ఈ విధంగా ‘‘న్యాయం’’ పట్ల జహాంగీర్‌కున్న అంకితభావాన్ని నిరూపించడానికి అనేక ఉదాహరణలు పొందుపరచారు చరిత్రకారిణి ఫర్హత్‌ నస్రీన్‌.
ఏవిధంగా అయితే జహాంగీర్‌ తన తండ్రి అక్బర్‌పై తిరగబడ్డాడో, అదే విధంగా జహాంగీర్‌ కుమారుడైన ఖుస్రో కూడా రాజ్యకాంక్షతో తండ్రిమీద తిరగబడ్డాడు. దీని ఒక చేదు పర్యవసానం సిక్కుల ఐదవ గురువైన గురు అర్జున్‌సింగ్‌ను జహాంగీర్‌ చంపించడం. తండ్రి మీద తిరగబడినప్పుడు తన వద్దకు వచ్చిన ఖుస్రోని అర్జున్‌సింగ్‌ నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించాడు. దీన్ని తనమీద తిరుగుబాటుగా భావించి ఆగ్రహించిన జహాంగీర్‌, అర్జున్‌సింగ్‌ని చంపమని ఆజ్ఞాపించాడు. అర్జున్‌సింగ్‌ని చంపేయించడంలో రాజకీయ కారణమే తప్ప మతానికి ఏలాంటి ప్రమేయమూ లేదని వ్యాఖ్యానించారు ఫర్హత్‌ నస్రీన్‌. అయినప్పటికీ, ఈ దుర్ఘటన భవిష్యత్తులో మొఘల్‌`సిక్కు సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ విషయంలో యిప్పటికీ సిక్కులు మొఘలులను క్షమించలేకున్నారు. సహజమే కదా!
ప్రకృతీ, జంతువులూ, పక్షులూ, అపురూపమైన వస్తువులూ, ఇలా జీవితంలోని ప్రతి చిన్న విషయం పట్లా తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శించిన జహాంగీర్‌, వీటిపట్ల తీక్షణమైన పరిశీలనా దృష్టిని కనబరచేవాడుÑ నిఖార్సైన పరిశోధనా స్వభావం కలిగి వుండేవాడు. సంగీతాన్ని బాగా ఇష్టపడే వాడు. చిత్రకళ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరచాడు. చిత్రకళలో అతనికెంత ప్రవేశం ఉండేదంటే చిత్రాన్ని చూసి చిత్రకారుడెవడో చెప్పగలిగే కళా సామర్థ్యం వుండేది. జహాంగీర్‌ హృదయమే కళాత్మకమైంది.
వితంతువైన అర్జుమంద్‌ బానో బేగం (తర్వాత నూర్జహాన్‌)ను 1611 జూన్‌ 11న పెండ్లాడాడు జహాంగీర్‌. ఆమె పరిపాలనలో కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. జహాంగీర్‌ కుటుంబ సభ్యుల పట్ల చాలా ప్రేమతో వ్యవహరించేవాడు. తన తల్లినే కాకుండా, మొత్తం మాతృత్వాన్నే గౌరవించాడు. ఘాజీఖాన్‌ కుమారుడైన పహార్‌ అనే అతను తన తల్లిని చంపినందుకు అతనికి మరణ శిక్ష విధించాడు. ఈ విషయాన్ని తన స్వీయ చరిత్రలో ప్రత్యేకంగా నమోదు చేశాడు జహాంగీర్‌. తన పూర్వీకుల్లాగానే జహాంగీర్‌ కూడా మొఘల్‌ విస్తృత కుటుంబంలోని స్త్రీలను గౌరవించేవాడని వివరించారు ఫర్హత్‌ నస్రీన్‌.
ఇస్లామీయ జీవన విధానానికి పూర్తిగా విరుద్ధమైందని చాలా బాగా తెలిసినప్పటికీ, జహాంగీర్‌ తీవ్రంగా త్రాగేవాడు. ఎంతగా త్రాగేవాడంటే, తాగుడు మానేయకపోతే మరణం తప్పదని రాజవైద్యుడైన హకీం హుమాన్‌ అతన్ని గట్టిగా హెచ్చరించాల్సి వచ్చింది! 1601 నాటికి త్రాగుడు పరిమాణాన్ని 6 కప్పులకు తగ్గించినప్పటికీ, నల్లమందును మాత్రం వదల్లేకపోయాడు. దీంతో నానాటికీ ఆరోగ్యం క్షీణించనారంభించిందిÑ ఎంతగా అంటే, కనీసం తన దినచర్యను స్వయంగా రాయలేకపోయేవాడు! మొఘల్‌ సామ్రాజ్య పతనంలో రాజుల తాగుబోతుతనం, మత్తు పదార్థాలకు బానిసలవడం కూడా ఒక ప్రబల కారణమని నిర్ధారించారు ఫర్హత్‌ నస్రీన్‌ (పు. 119). ఈ విషయాన్ని నొక్కివక్కాణించడానికి జహాంగీర్‌ కుమారుడైన పర్వేజ్‌ తాగుడు వ్యసనం వల్ల 36 సంవత్సరాల వయసులోనే చనిపోయాడని యింకో వుదాహరణ యిచ్చారు.
సమ్మిళితమైన జహాంగీర్‌ మత విశ్వాసాలు ‘భారతీయ ఉమ్మడి సంస్కృతి’కి చక్కటి ప్రతీకలు. అతను కూడా తన తండ్రిలాగే అన్ని మతాలనూ సమానంగా గౌరవించి, మతపరంగా ఉదారవాద విధానాన్ని అవలంబించాడు. ఇస్లామిక్‌ పండుగలతో పాటు పర్షియన్‌ నౌరోజ్‌నూÑ హిందూ పండుగలైన హోళీ, దసరా, దీపావళి, రక్షాబంధన్‌, శివరాత్రి మొదలైన వాటినీ ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడు. శివరాత్రి రోజున హిందూ యోగుల్ని సందర్శించి, వారితో సంభాషించేవాడు: ఆశీర్వాదాలందుకొనేవాడు. ఒకసారి రాఖీ, ‘షబ్‌`ఎ`బరాత్‌’లు ఒకేరోజు వచ్చినప్పుడు, ఆ రోజును జహాంగీర్‌ ముచ్చటగా ‘ముబారక్‌ షంబా’ (‘అదృష్ట దినం’) అని పిలిచాడు. పిండదానం (‘పిత్రదాన్‌’) రోజున పేదలకు డబ్బులు పంచడానికీ, అన్నదానం చేయడానికీ కుమారుడైన ఖుర్రంను అక్బర్‌ సమాధి దగ్గరికి పంపేవాడు. ఎవర్నేగాని బలవంతంగా ఇస్లాంలోకి మార్చకూడదని తన అధికారులను కఠినంగా ఆజ్ఞాపించాడు. దనియాల్‌ కుమారులకు క్రైస్తవ ధర్మాన్ని బోధింపచేశాడు. క్రైస్తవులను ‘అప్ల్‌ా`ఇ`కితాబ్‌’ (పీపుల్‌ ఆఫ్‌ ద బుక్‌)గా భావించాడు. (వేదాల కారణంగా హిందువులను కూడా ‘అప్ల్‌ా`ఇ`కితాబ్‌’గా పరిగణించాడు మహానుభావుడైన అక్బర్‌). జద్రూప్‌ గోసాయి అనే హిందూ యోగితో ఆధ్యాత్మిక విషయాల మీద చర్చలు జరిపేవాడు. ఆ స్వామివారిని తన దగ్గరకు పిలవడం కాకుండా, చక్రవర్తి అయినప్పటికీ భేషజాలు చూపకుండా తనే ఆయన దగ్గరికి వెళ్లేవాడుÑ ఆశీర్వాదం తీసుకునేవాడుÑ ఆయన్ని కలవడం తన ‘అదృష్టం’గా భావించేవాడు. ఈవిధంగా మత విశ్వాసాల పరంగా ఉదారవాద విధానాన్ని అవలంబించడంలోనూ, హృదయ వైశాల్యంలోనూ తండ్రికి తగ్గ కుమారుడైన జహాంగీర్‌ 1627 అక్టోబరు 28/29న తన 58వ యేట మరణించాడు. మొత్తం 22 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించాడు.
జహాంగీర్‌కూ, రాజపుత్ర వంశానికి చెందిన రాణి మన్మతి జగతి గోసాయిన్‌ (మార్వార్‌ రాజు అయిన ఉదయ్‌సింగ్‌ మోటారాజా కుమార్తె)కూ 1592 జనవరి 5న లాహోర్‌లో జన్మించాడు షాజహాన్‌ అబుల్‌ ముజఫ్ఫర్‌ షిహాబుద్దీన్‌ ముహమ్మద్‌ సాహిబ్‌ కిరాన్‌సాని (పాలనా కాలం: 1628`1658). షాజహాన్‌ కాలంలో మొఘల్‌ సామ్రాజ్యం భారత పశ్చిమోత్తర భాగంలో బాగా విస్తరించింది. మొఘలులు బాల్ఖ్‌, బదక్షాన్‌లను ఆక్రమించారు. షాజహాన్‌ తన కుమారుడైన మురాద్‌ నాయకత్వంలో బొఖారా, సమర్ఖండ్‌లను కూడా ఆక్రమించుకోవాలనుకున్నాడు. కానీ మొఘల్‌ అధికారులూ, సైన్యం దానికి సన్నద్ధంగా వుండరు. ఈ సందర్భంలో ఫర్హత్‌ నస్రీన్‌ ఒక ముఖ్యమైన, అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. ఏవిధంగా అయితే తొలుత బాబర్‌ సైన్యం భారతదేశంలో వుండాలనుకోలేదో, అదేవిధంగా షాజహాన్‌ సైన్యం భారతదేశానికి వెలుపల వుండదలచుకోలేదు (పు. 157). అంటే అప్పటికి అంత పెద్దఎత్తున మొఘలులు భారతీయీకరణ చెందిపోయారన్నమాట! చారిత్రక వాస్తవాలు గ్రహించకుండా, ముస్లింలు భారతీయీకరణ చెందాలని గుడ్డిగా వాదించేవారికి యిలాంటి ఉదాహరణలు పెద్ద చెంపపెట్టు. ప్రస్తుతానికొస్తే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా గ్రామీణ ముస్లింలను దగ్గరగా గమనిస్తే ముస్లింలు ‘భారతీయీకరణ’ చెందాలనే వాదనలోని డొల్లతనం బట్టబయలౌతుంది.
షాజహాన్‌ నలుగురు కుమారుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి రాజ ప్రతినిధులుగా నియమించబడ్డారు. పెద్దవాడైన దారా షుకోప్‌ా అలహాబాద్‌, పంజాబ్‌లనూÑ షాషుజా బెంగాల్‌నూÑ ఔరంగజేబ్‌ దక్కన్‌నూÑ మురాద్‌ బక్ష్‌ గుజరాత్‌నూ చూసుకునేవారు. పెద్ద కుమారుడైన దారాను తన వారసుడిగా భావించాడు షాజహాన్‌. దారా పట్ల షాజహాన్‌ చూపించే అపేక్ష వల్ల అతని పట్ల మిగిలిన సోదరులు అసూయాగ్రస్తులయ్యారు. మతపరమైన ఉదారవాద విశ్వాసాల దృష్ట్యా దారా ప్రత్యేకంగా పేర్కొనదగ్గవాడు. అందరినీ కలుపుకుని పోయే సూఫీతత్వాన్ని అనుసరించిన దారా, ఆ తాత్వికతను ప్రచారం చేసే సఫీనతుల్‌ ఔలియా, సకీనతుల్‌ ఔలియా, రిసాలా`ఇ`హక్నుమ, హసనాత్‌`ఉల్‌`ఆరిఫీన్‌, మజ్మ్‌`ఉల్‌`బప్‌ారైన్‌, సిర్ర్‌`ఇ`అక్బర్‌ మొదలైన గ్రంథాలను రచించాడు. సిర్ర్‌`ఇ`అక్బర్‌ ఉపనిషత్తుల అనువాద గ్రంథం. దారా షుకోప్‌ా హిందూమతాన్ని స్వయంగా అధ్యయనం చేశాడు. అతని ప్రకారం, హిందూమతంలో కూడా ఏకేశ్వరోపాసన వుంది. దారా భగవద్గీతను కూడా పర్షియన్‌ భాషలోకి అనువదించాడు. మత, భాషా, సంస్కృతుల పరంగా వైవిధ్యభరితమైన భారతదేశానికి ఔరంగజేబ్‌ కాకుండా దారాలాంటి ఉదారమైన మత విశ్వాసాలున్నవాడు షాజహాన్‌ తర్వాత చక్రవర్తి అయి వుండి వుంటే బాగుండేదని సరిగ్గానే అభిప్రాయపడ్డారు ఫర్హత్‌ నస్రీన్‌ (పు. 167). ఏం చేయగలం? దేశ దౌర్భాగ్యం! మన యిష్టాయిష్టాల ప్రకారం చరిత్ర నడవదు కదా!!
షాజహాన్‌ అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని అతని కొడుకులు ఒక్కొక్కరే స్వతంత్రం ప్రకటించుకోనారంభించారు. 1657 డిసెంబరు 5న మురాద్‌ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. షుజా కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాడు. వారసత్వ సంఘర్షణల సమయంలో షాజహాన్‌ కూతుర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సోదరునితో జతకట్టారు. జహాన్‌ ఆరా దారానూÑ రోషన్‌ ఆరా ఔరంగజేబ్‌నూÑ గౌహర్‌ ఆరా మురాద్‌నూ సమర్థించారు. 1658 జూన్‌ 8న సామూగఢ్‌ వద్ద జరిగిన యుద్ధంలో ఔరంగజేబ్‌ దారాను ఓడిరచాడు. తనను కలవమని ఎంతగా ప్రాధేయపడ్డా, ఔరంగజేబ్‌ షాజహాన్‌ను కలుసుకోలేదు. చివరికి 1658 జూన్‌ 19న తన తండ్రిని పదవీభ్రష్టున్ని చేశాడు ఔరంగజేబ్‌.
షాజహాన్‌ తన కుటుంబాన్ని అమితంగా ప్రేమించాడు. ఉదాహరణకు, అతని కూతురైన జహాన్‌ ఆరా 1644 మార్చి 26న ప్రమాదవశాత్తూ మంటల్లో కాలిపోయినప్పుడు ఆమె కోసం ఎంతో తల్లడిల్లిన షాజహాన్‌ ఆమె బాధను ఉపశమింపజేయడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ఆమె చికిత్స కోసం ఎందరో గొప్ప వైద్యులను నియమించాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పెద్దఎత్తున దానధర్మాలు చేశాడు. ఇక తన ప్రియమైన భార్య ముంతాజ్‌ మహల్‌ కోసం 5 మిలియన్‌ రూపాయల ఖర్చుతో, 12 సంవత్సరాల కృషితో తాజ్‌మహల్‌ను కట్టించిన విషయం మనందరికీ తెలిసిందే! తాజ్‌మహల్‌తో పాటు ఎర్రకోట, జామా మస్జిద్‌లాంటి గొప్ప నిర్మాణాలను కూడా చేపట్టాడు షాజహాన్‌.
1618 నవంబరు 3న జన్మించిన అబుల్‌ ముజఫ్ఫర్‌ ముహియుద్దీన్‌ ముహమ్మద్‌ ఔరంగజేబ్‌ బహాదుర్‌ ఆలంగీర్‌ బాద్‌షాప్‌ా ఘాజీ (పాలనా కాలం: 1658`1707) 1634లో మన్సబ్‌దార్‌గా నియమితుడయ్యాడు. సాధారణంగా చాలామంది భావించేటట్లుగా ఔరంగజేబ్‌ పుట్టుకతోనే ఛాందసుడేం కాదనీÑ పరిస్థితుల ప్రాబల్యం వల్ల తర్వాత అలా మారిపోయాడనీ చెప్పారు ఫర్హత్‌ నస్రీన్‌. ఈ విషయాన్ని వివరించడానికి కొన్ని ఉదాహరణలు యిచ్చారు. 1661లో ఒక జబ్బుకు మందివ్వమని యోగి మహంత్‌ ఆనంద్‌నాథ్‌కు ఔరంగజేబ్‌ ఉత్తరం రాశాడు. అతనికి పంజాబ్‌లో భూమిని కూడా దానం చేశాడు. ఔరంగజేబ్‌ సంగీతాన్ని ద్వేషించేవాడనేది అపోహేననీ, బప్క్‌ాతవర్‌ ఖాన్‌ ప్రకారం ఔరంగజేబ్‌కు సంగీతంలో మంచి ప్రవేశం వుండేదనీ, 1666వ సంవత్సరం నాటి సంగీత గ్రంథం రాగ్‌ దర్పణ్‌ (ఫకీరుల్లా రాసింది)లో ఔరంగజేబ్‌కు బాగా ఇష్టులైన సంగీత విద్వాంసుల పేర్లున్నాయనీ, 1690లో చంద్రమాన్‌ తన నర్గీసిస్తాన్‌ (పర్షియన్‌లోకి అనువదితమైన రామాయణంÑ కావ్యభాషలో రాసింది)ను ఔరంగజేబ్‌కు అంకితమిచ్చాడనీ, చారిత్రక వాస్తవాలను పొందుపరిచారు. ఆమె ప్రకారం, అక్బర్‌లాగా ఔరంగజేబ్‌ కూడా కాలక్రమేణా పరిణామం చెందాడు. తేడా ఏంటంటే అక్బర్‌ ఉదారవాదం వైపు వడివడిగా అడుగులేస్తే, ఔరంగజేబ్‌ ఛాందసత్వం వైపు పరుగెత్తాడు. అయినప్పటికీ, ఔరంగజేబ్‌ పాలన చివరికాలంలో `అంటే 1705లో` అమర్‌సింగ్‌ పర్షియన్‌లోకి అనువదించిన రామాయణం అమర్‌ ప్రకాష్‌ ను ఔరంగజేబ్‌కు అంకితమిచ్చాడని తెలిపారు. ఔరంగజేబ్‌ పేరెత్తిన వెంటనే గుళ్ళు పడగొట్టించిన విషయాలే గుర్తుకొస్తాయి గాని, వాటికి దానాలు చేసిన సంగతులు గుర్తుకురావు. గమనించాల్సిన విషయమేమిటంటే ఔరంగజేబ్‌ మథుర, బృందావన్‌లలోని దేవాలయాలకు భూములు దానం చేశాడు. అతను పూర్తిగా మతంవైపు మొగ్గడమన్నది ఎక్కువగా వ్యక్తిగతమైన వ్యవహారమేగాని గానీ వృత్తిపరమైంది కాదని ఖరాకండిగా ప్రకటించారు ఫర్హత్‌ నస్రీన్‌. ఏది ఏమైనప్పటికీ అతని వ్యక్తిగత విశ్వాసాలు అతను చేపట్టిన రాచకార్యాల్లో స్పష్టంగా కనిపిస్తాయనేది ఎవరూ కాదనలేని సత్యం.
ఇంతకు ముందే చెప్పుకున్నట్లు తన తండ్రి షాజహాన్‌ను 1658 జూన్‌ 19న పదవీభ్రష్టుడ్ని చేశాడు ఔరంగజేబ్‌. రాజకీయాలకోసం మతాన్ని దుర్వినియోగపరిచే దుర్మార్గం భారతదేశ చరిత్రలో ముందు నుంచీ వుంది. ఔరంగజేబ్‌ కూడా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలు పవిత్రంగా భావించే ఖురానును వాడుకున్నాడు. చక్రవర్తిని చేస్తాననడంతో తనని నమ్మిన సోదరుడు మురాద్‌కు నమ్మకం కలగడానికి, అంటే నమ్మకద్రోహం చేయడానికి, ఖురాను మీద తప్పుడు ప్రమాణాలు చేశాడు. కానీ జీవితాంతం ఖురాను చదవడం, ఖురాను ప్రతులను రాయడం చేస్తూనే పోయాడు. విపరీతం! ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమేమంటే ఔరంగజేబు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న తీరును మక్కాలోని ఇస్లామిక్‌ మతపెద్దగానీ, పర్షియా చక్రవర్తిగానీ ఆమోదించలేదని చెప్పారు ఫర్హత్‌ నస్రీన్‌. అలాగే తన అన్న దారా షుకోని తీవ్రంగా అవమానపరచి చంపించడాన్ని సామాన్య ప్రజలే కాకుండా, దారా శతృవులు కూడా హర్షించలేకపోయారని తెలిపారు. తనకు ప్రబల ప్రత్యర్థి అయిన దారాను అడ్డుతొలగించుకోవడంలో కూడా ఔరంగజేబ్‌ మతాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం దారుణంగా దుర్వినియోగపర్చాడు. మతపరంగా దారాకున్న ఉదారవాద విశ్వాసాలను సాకుగా తీసుకొని అతన్ని ‘కాఫిర్‌’ (అవిశ్వాసిÑ ఇస్లాంలో ఘోరాతి ఘోరమైన తిట్టుమాట) అనీ, ఇస్లాం మత భ్రష్టుడనీ చిత్రీకరించి, అతని పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టించాడు (దారా తన పుస్తకం మజ్మ్‌`ఉల్‌`బప్‌ారైన్‌ లో హిందూ`ఇస్లాం మతాల మధ్య పదజాల ప్రయోగంలో తప్ప సారాంశంలో తేడా లేదన్నాడు. అతను ధరించిన ఉంగరంపై దేవనాగరి లిపిలో ‘ప్రభు’ అని రాసి వుండేది). అయితే రాజకీయపరమైన కృారత్వం విషయంలో దారా కూడా ఏం తక్కువ తినలేదు. పట్టుబడ్డ దారాతో ఒకవేళ నేను నీచేత చిక్కివుంటే నీవేం చేసి వుండేవాడివని ఔరంగజేబ్‌ అడిగినప్పుడు ఔరంగజేబ్‌ను నాలుగు ముక్కలు చేసి ఢల్లీి నాలుగు దిక్కులా వ్రేలాడగట్టించే వాడినని సమాధానమిచ్చాడట దారా! ఈ విషయంలో ఇద్దరూ యిద్దరే! రాచరికం రక్తసంబంధాలెరగదని అందుకే కదా అంటారు! దారాను శిరచ్ఛేదనం చేయించి ఖండిత శిరస్సును షాజహాన్‌కు ‘బహుమతి’గా పంపించాడు ఔరంగజేబ్‌. దాన్ని చూసిన షాజహాన్‌ మూర్ఛపోయాడు. తండ్రి కదా!
ఔరంగజేబును సాధారణంగా ‘హిందూ ద్వేషి’గా భావిస్తారనీ, కానీ అత్యంత క్రూరత్వంతో అతను నాశనం చేసినవారిలో అత్యధికులు అతని మతానికి చెందినవారే, అంటే ముస్లింలే, అందునా అతని రక్త సంబంధీకులేననీ, లెక్కలేనంత మంది హిందువులు అతని సైన్యంలో పనిచేశారనీ, సోదరులతో అతడు చేసిన వారసత్వ యుద్ధాల సమయంలో కూడా చాలామంది రాజపుత్ర రాజులు ఔరంగజేబ్‌ పక్షమే వహించారనీ, 1663లో ఈశ్వర్‌దాస్‌ అనే హిందూ జ్యోతిష్కుడు సంస్కృతంలో రాసిన పుస్తకంలో ఔరంగజేబ్‌ అవలంబించిన విధానాలను ‘ధర్మబద్ధమైనవి’గానూ, ‘న్యాయపూరితమైనవి’గానూ వర్ణించాడని ఫర్హత్‌ నస్రీన్‌ వివరించారు (పు. 206). ఈశ్వర్‌ దాస్‌ వాదన విడ్డూరంగా అన్పిస్తుంది.
ఔరంగజేబ్‌ అవలంబించిన విధానాల వల్ల, పశ్చిమోత్తర భారతదేశంలో మొఘలులు తీవ్రమైన తిరుగుబాట్లనెదుర్కోవాల్సి వచ్చింది. అలాగే 1668`69లో జాట్లు తిరగబడ్డారు. వాళ్ళు ఎంత పెద్దయెత్తున తిరగబడ్డారంటే సికంద్రాలోని అక్బర్‌ సమాధిని ఎముకలు సహా త్రవ్వితీసి దోచుకున్నారు! 1675 డిసెంబర్‌లో సిక్కుల తొమ్మిదో గురువైన గురు తేజ్‌బహదూర్‌ను చంపించడంతో, అతని కుమారుడైన గురు గోవింద్‌సింగ్‌ నేతృత్వంలో సిక్కులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శివాజీకీ, ఔరంగజేబుకూ మధ్య జరిగిన ఎడతెగని రాజకీయ ఘర్షణ మనందరికీ తెలిసిందే! కానీ చాలామంది దీన్ని మతం కోణంలో (అంటే హిందూ`ముస్లిం ఘర్షణగా) చూస్తుంటారనీ, ఔరంగజేబ్‌తో శివాజీ ‘ఘర్షణ పూర్తిగా రాజకీయపరమైందనీ, ఇరువైపుల నుండి అది మతయుద్ధం ఎంతమాత్రం కానేకాదనీ’ విశ్లేషించారు ఫర్హత్‌ నస్రీన్‌ (పు. 212). 1686 సెప్టెంబరు 22న బీజాపూరునూ, 1687 అక్టోబరు 3న గోల్కొండనూ జయించాడు ఔరంగజేబ్‌. ఈ రెండు రాజ్యాలనూ పాలించింది ముస్లింలు కూడా అయిన రాజులే. తన మతస్థులు కాబట్టి, ఔరంగజేబ్‌ వాళ్ళను వదిలిపెట్లేదు.
సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనను తాను ‘పక్కా ముస్లిం’గా నిరూపించుకోదలచుకున్న ఔరంగజేబ్‌ 1679లో దారుణమైన జిజియా పన్నును పునర్విధించాడు. ఒకవైపు యిలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతూనే, యింకోవైపు కొన్ని అభ్యుదయకరమైన పనులనూ చేపట్టాడు. ఉదాహరణకు, ముహమ్మద్‌ హాషింకు యిచ్చిన ఫర్మాన్‌ల ప్రకారం పన్నులు వసూలు చేసే అధికారులు రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలిÑ అప్పుడే వాళ్ళు వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడంలో శ్రద్ధ చూపించగలరు. ప్రభుత్వ అధికార్లలోని అవినీతిని అంతమొందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాడు ఔరంగజేబ్‌. అత్యంత నిరుపేదలైనప్పటికీ, రైతుల విన్నపాలను విని పరిష్కరించాలని అధికారులను ఆజ్ఞాపించాడు. అవినీతిశిఖామణులైన అధికారులను కఠినంగా దండిరచడంతో పాటు, నిజాయితీపరుల్నీ, కష్టపడి పనిచేసే వారినీ పదోన్నతులతో ప్రోత్సహించాడు.
జీవిక కోసం ప్రతి మనిషీ కష్టించి పనిచేయాల్సిందేనన్న నియమం పెట్టుకున్న ఔరంగజేబ్‌, తన జీవిక కోసం స్వయంగా టోపీలల్లేవాడుÑ ఖురాను ప్రతులను రాసేవాడు. అవి అమ్మగా వచ్చే ఆదాయంతో తిండి తినేవాడు. చాలా కష్టపడి పనిచేసే వాడు. పొద్దు పొడవకముందే స్నానం చేసి, పనికి సిద్ధమయ్యేవాడు. నమ్మశక్యంగా లేనప్పటికీ, అతని దగ్గరి మనుషుల ప్రకారం, ఔరంగజేబ్‌ కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడట!! కుటుంబం కోసం ప్రతిరోజూ రెండు గంటల సమయం వెచ్చించేవాడట. తన అంత్యక్రియల కోసం, తాను టోపీలల్లగా వచ్చిన సొమ్మునే వాడాలనీ, తను రాసిన ఖురాను ప్రతులనమ్మగా వచ్చిన డబ్బులనే పేదలకు పంచిపెట్టాలనీ చెప్పిన ఔరంగజేబ్‌ 1707 ఫిబ్రవరి 20న చనిపోయాడు.
రుబీ లాల్‌ (Empress: The Ashtonishing Reign of Nur Jahan (Penguin, 2018); Demesticity and Power in the Early Mughal World (Cambridge University Press, 2005)), సుభద్రా సేన్‌ గుప్తా (Mahal: Power and Pageantry in the Mughal Harem, Hachete, 2019) మొదలైనవారిలా ప్రత్యేకంగా రాస్తేనేగాని సాధారణంగా మొఘలులపై రాసిన చరిత్ర పుస్తకాల్లో నూర్జహాన్‌, ముంతాజ్‌ మహల్‌ మొదలైన ప్రఖ్యాతిగాంచిన వారిని గూర్చి తప్ప మిగిలిన మొఘల్‌ స్త్రీల గూర్చిన ప్రస్తావన పెద్దగా కన్పించదు. ఫర్హత్‌ నస్రీన్‌ పుస్తకం ఈ విషయంలో కాస్తంత భిన్నమైంది. ఇందులో మనకు చాలామంది మొఘల్‌ స్త్రీలు తారసపడతారు. నస్రీన్‌ ప్రకారం, మొఘలులు ఎల్లప్పుడూ తమ స్త్రీలను గౌరవించారుÑ వారి అభిప్రాయాలకు చాలా విలువిచ్చారు (పు. 126). బాబర్‌ అమ్మమ్మ ఎప్‌ాసాన్‌ దౌలత్‌ తెలివైందే కాకుండా అసాధారణ ధైర్యస్తురాలు కూడా. రాజకీయ, సైనిక వ్యవహారాల్లో సయితం ఆమె సలహాలు తీసుకోబడ్డాయి. ఫక్రున్నిసా (బాబర్‌ కూతురు), ఖాన్‌జాదా బేగం (బాబర్‌ అక్క), సలీమా సుల్తాన్‌ బేగం (బాబర్‌ మనుమరాలు), మప్‌ాఛుఛక్‌ బేగం (హుమయూన్‌ సోదరుడైన కమ్రాన్‌ భార్య), మహమ్‌ అనగా (అక్బర్‌కు దాది), ఫాతిమా బానూ బేగం (అక్బర్‌ కూతురు), షాప్‌ాజాదా ఖానం, ఫకృన్నిసా బేగం, ఆరాం బానూ బేగం (అక్బర్‌ కుమార్తెలు), మాన్‌బాయి`షాప్‌ాబేగం (జహాంగీర్‌ భార్య), మెహర్‌ ఉన్‌ నిసా (జహాంగీర్‌ భార్య), అర్జుమంద్‌ బానో బేగం (షాజహాన్‌ భార్య), ఇజ్జల్‌ నిసా బేగం, కాంధారీ బేగం (షాజహాన్‌ భార్యలు), పుర్‌ హునర్‌ బాను, హూరున్నిసా, జహనారా, రోషనారా, గౌహర్‌ ఆరా (షాజహాన్‌ కుమార్తెలు), బిల్కిస్‌ మకానీ (షాజహాన్‌ తల్లి), మర్యం ఉజ్‌ జమానీ (జహంగీర్‌ తల్లి), దిల్‌ రస్‌ బానూ బేగం (ఔరంగజేబ్‌ భార్య), నాదిరా బాను (దారాషుకో భార్య) మొదలైన వారితోపాటు యింకా ఎంతో మంది స్త్రీలు ఈ పుస్తకంలో మనకు కన్పిస్తారు. వీళ్ళందర్లో నాదిరా బాను గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొఘల్‌ కుటుంబంలోని చాలా ప్రభావవశీలురైన స్త్రీలలో ఒకరైన నాదిరా బాను, చాలా దయనీయమైన పరిస్థితుల్లో చనిపోయింది. తన భర్త అయిన దారాషుకో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో దేశాలు పట్టుకు తిరుగుతున్నప్పుడు అతనితోపాటే తిరుగుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన నాదిరా బాను చనిపోయే ముందు తనని భారతదేశంలోనే పూడ్చిపెట్టాలని భర్తను కోరింది (పు.196). ఎంతో కష్టపడి దారా ఆమె ఆఖరి కోరికను తీర్చగలిగాడు. మొఘలులు భారత మట్టిని హృదయపూర్వకంగా ప్రేమించిన తీరుకు ఆమె చివరి కోరిక అద్దం పడుతుంది. ఆమె యిక్కడి మట్టిని ప్రేమించిందిÑ ఈ మట్టిలోనే మట్టవ్వాలని గట్టిగా కోరుకుంది. ఆమె కోరిక నెరవేరింది. చివరి మొఘల్‌ చక్రవర్తి అయిన బహదూర్‌షా జఫర్‌ది కూడా యింతే దయనీయమైన పరిస్థితి. కానీ నాదిరా బానులా అదృష్టవంతుడు కాడు. ‘‘కిత్నా హై బద్‌ నసీబ్‌ జఫర్‌ దఫ్న్‌కేలియే దో గజ్‌ జమీన్‌ భీ న మిలీ కూయే యార్‌ మేఁ’’ అని తన మాతృభూమి మట్టిలో కలిసిపోవడానికి ఏడడుగుల నేల కూడా దొరకని తన దురదృష్టానికి దీనాతి దీనంగా విలపించాడు: విలపిస్తూనే పరాయి గడ్డపై ప్రాణాలొదిలాడు.
మొఘలుల కాలం నాటి కొందరు అరుదైన వైద్యుల సమాచారం కూడా ఈ పుస్తకంలో దొరుకుతుంది. అతీకా బక్షి (మంగోల్‌) గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు. తీవ్రంగా గాయపడ్డ బాబర్‌కు నయం చేశాడు. ఛిద్రమైన మెదళ్లను సైతం బాగు చేయగల సామర్థ్యం
ఉన్నవాడట. ఇతని శస్త్రచికిత్సా నైపుణ్యాల పట్ల బాబర్‌ అమితాశ్చర్యం చెందాడు. హకీం అలీ జిలానీ (అక్బర్‌కు వైద్యం చేశాడు), హకీం హుమమ్‌ (రాజవైద్యుడు), హకీం రుహుల్లా (నూర్జహాన్‌కు వైద్యం చేశాడు), అలీముద్దీన్‌ వజీర్‌ ఖాన్‌ (ముంతాజ్‌ మహల్‌ వ్యక్తిగత వైద్యుడు) మొదలైన వారి గూర్చి ఈ పుస్తకం ప్రస్తావించింది.
230 పుటల ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ అయిన ‘రూపా’ 2021లో ప్రచురించింది. మొఘలులను భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగంగా అత్యంత శక్తివంతంగా నిరూపించిన పుస్తక రచయిత్రి, చరిత్రకారిణి, ప్రొఫెసర్‌ ఫర్హత్‌ నస్రీన్‌ న్యూఢల్లీిలోని జామియా మీలియా ఇస్లామియాలో మధ్యయుగ భారతదేశ చరిత్రను బోధిస్తున్నారు. (సమాప్తం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.