గిరిజన కథలు ` మహిళా జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ కథా ప్రక్రియ నేడు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అనేకమంది కథకులు గిరిజన సమస్యలు, గిరిజన స్త్రీ జీవిత చిత్రణను నేపథ్యంగా చేసుకొని కథలు రచించారు. అలా వెలువడిన ఉత్తరాంధ్ర గిరిజన కథల్లో ఆదివాసీ స్త్రీల జీవిత చిత్రణను చిత్రిస్తూ వెలువడిన కథలను ఈ వ్యాసంలో పరిచయం చేస్తాను.

ఆదివాసీ స్త్రీల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని పల్లపు బుగతలు, షావుకార్లు, అధికారులు గిరిజన స్త్రీలపై హింస, దోపిడీ, లైంగిక అత్యాచారాలు చేసి వాళ్ళని మోసం చేస్తున్నారు. గిరిజనేతరుల చేతిలో బలైపోయిన ఎంతోమంది స్త్రీలు మానాలు పోయిన తర్వాత ప్రాణాలు వదిలేస్తున్నారు.
ఇంకొంతమంది స్త్రీలు పొట్ట గడవక పడుపు వృత్తిలోకి దిగిపోతున్నారు. ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతున్నారు. ప్రసూతి సమయంలో సమయానికి సరైన వైద్యం అందక గిరిజన స్త్రీలు ప్రాణాలు విడిచి పెడుతున్నారు. ఇలా రకరకాలుగా గిరిజన మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కథల్లో చూడవచ్చు.
అడవితనం: ఈ కథ ఆంధ్రజ్యోతి నవ్య వారపత్రికలో సెప్టెంబర్‌, 2017వ సంవత్సరంలో ప్రచురించబడిరది. ఆదివాసీ జీవితాల్లో ఆచరణలో, విలువల్లో చోటుచేసుకుంటున్న అనేక వైరుధ్యాలను మల్లిపురం జగదీశ్‌ ‘అడవితనం’ కథలో చూడవచ్చు.
అడవికి దూరమై వేదనను అనుభవిస్తున్న ఆదివాసీ మహిళ గాథ. నగర జీవితాన్ని గడుపుతున్న ఆమెకు గత కొన్ని రాత్రులుగా నిద్ర పట్టడంలేదు. భర్త నగర జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయాడు. తన గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆమె మాత్రం పట్నంలో గడపడం చాలా కష్టంగా భావిస్తుంది. ఇక్కడ ఎవరితోనూ మాట్లాడడానికి ఉండదు. తన మనసు మొత్తం అడవి చుట్టూనే తిరుగుతుంది. తన బాల్యంలో జ్ఞాపకాలను తలచుకుంటూ కందికొత్తల పండగ సమయంలో ఆడిన థింసా నృత్యాలు, నాగడు కొట్టిన తుడుం దెబ్బలు, అడవి సౌందర్యం, ఇంటికి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం, నేస్తరికం చెయ్యడం… ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తుంది. ఈసారి పండక్కి ఎలాగైనా ఊరు వెళ్ళి జాకరమ్మ తల్లికి మొక్కు చెల్లించుకోవాలని, థింసా నృత్యం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఈ ఆలోచనల్లో ఉండగానే ఫోన్‌ మోగుతుంది. నాగడు భార్య తన స్నేహితురాలు తార. తార ఏడుస్తూనే ఉంది. ఉన్న ఊర్లో పనుల్లేక వలస బాట పట్టిన వారికి వలస ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి తార చెబుతుంది. దాన్ని ఆమె వెంటనే తన భర్తకు చెబుతుంది. ఆమె భర్త సహాయానికి నిరాకరిస్తాడు. ఆమె అతడ్ని కాదని తారకి సహాయం చెయ్యడానికి బయలుదేరుతుంది.
అరణ్య రోదన: ఈ కథ ప్రజాసాహితి మాస పత్రికలో మే, 2001 వ సంవత్సరంలో ప్రచురించబడిరది. అడవిలో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆదివాసీ మహిళ పరిచయం లేని వ్యక్తుల కాల్పుల్లో బలైపోతుంది. ఆమె కొడుకు దిక్కులేనివాడిగా అడవిలో ఉండిపోయిన వృత్తాంతాన్ని మల్లిపురం జగదీశ్‌ ‘అరణ్య రోదన’ కథలో రూపుదిద్దారు.
గిరిజనేతరుడి నమ్మకపు మాటలు నమ్మి మోసపోయిన ఆదివాసీ మహిళకు బుధడు జన్మిస్తాడు. భర్త ఆదరణ లేక ఆమె అడవిలో ఒంటరిగా జీవిస్తుంది. భర్తకు ఈమెకన్నా ముందు మరొక భార్య
ఉంది. భర్తకు ఉన్న ఆస్తినంతా మొదటి భార్యనే తీసుకోవాలనుకున్నప్పుడు ఆమె దళ నాయకుడు చంద్రన్నని ఆశ్రయించి కొంత భూమిని దక్కించుకుంటుంది. కొన్నాళ్ళకు చంద్రన్న తమకు తెలుసు అంటూ కొందరు పరిచయం లేని వ్యక్తులు వచ్చి ఆకలి అంటారు. ఆమె అందరికీ కొర్ర జావ వండి పెడుతుంది. ఈ అపరిచిత గుంపు మరొక గుంపుపై తుపాకీలు గురిపెట్టి కాల్చుతున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా
ఉన్న అడవి భయంకరమైన ధ్వనులతో మారుమోగిపోతుంది. ఈ కాల్పుల్లో జంతువులు బలైపోతున్నాయి. కొడుకు బుధడ్ని రక్షించుకోవాలని వచ్చిన ఆమె తలలోకి తూటా తగిలి చనిపోతుంది. బుధడు దిక్కులేకుండా అడవిలో మిగిలిపోతాడు. వాడి ఏడుపు కొండల్లో ప్రతిధ్వనిస్తుంది.
అరణ్య రోదనం: ఈ కథ ఈనాడు పత్రికలో 2008వ సంవత్సరంలో ప్రచురించబడిరది. మైదాన గ్రామాల వ్యక్తులు, పోలీసు అధికారుల కామావేశానికి బలైపోయిన ఆదివాసీ స్త్రీల ఆత్మఘోష పి.వి.బి.శ్రీరామమూర్తి ‘అరణ్య రోదన’ కథలో వస్తువు.
‘కిమిడిగూడ’లో సవరల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ గూడ గురించి బాగా తెలిసిన వ్యక్తి కొండయ్య. కొండయ్య గూడెంలో వాళ్ళకి అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కొండ పంటనంతటినీ తక్కువ ధరకే దోపిడీ చేసుకుంటాడు. ‘కిమిడిగూడ’ సాయుధ పోరాటం నాయకులకు రక్షణ కల్పించే స్థావరం. దళ సభ్యుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఓడిపోయినప్పుడల్లా వాళ్ళ లాఠీలకు ఆదివాసీల ఒళ్ళు హూనం అయిపోతూనే ఉంటుంది. కొండయ్య చనిపోవడంతో కొడుకు దర్మరాజు గూడెం ప్రజల దగ్గర అప్పులు వసూలుచేస్తూ, అవసరం అనుకున్న వాళ్ళకి అప్పు ఇస్తుంటాడు. ‘కిమిడిగూడ’ ప్రజలు మూడు సంవత్సరాలుగా పంటలు పండక, పండిన పంటని ఏనుగు దాడిచేసి నాశనం చెయ్యడం వల్ల ‘కందికొత్తల’ పండగ చేసుకోలేదు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. ఏనుగుల బాధ తగ్గిందని పండగ చేసుకోవాలని గూడెం వాసులంతా నిర్ణయించుకుని మీటింగ్‌ పెట్టుకుంటారు. ఆ మీటింగ్‌కు ధర్మరాజు వచ్చి సాయి కూతురిని చూసి తనని అనుభవించాలని అనుకుంటాడు.
దళ సభ్యులు వచ్చి ‘కిమిడిగూడ’లో ఉన్నారని తెలిసి పోలీసులు వస్తారు. దళ సభ్యులు పోలీసులకి పొగ కొట్టి తప్పించుకుని పారిపోతారు. ఆ కోపంతో ‘కిమిడిగూడ’ ప్రజలను పోలీసులు కుళ్ళబొడుస్తారు. ‘కిమిడిగూడ’ అంతా మూగబోయింది. ఇదే అదనుగా ధర్మరాజు వచ్చి ‘కందికొత్త’ పండగ చేసుకోండి, నేను డబ్బులు పెడతాను అంటాడు. దాంతో గూడెమంతా పండగ చేసుకుంటుంది. దళ సభ్యులు వచ్చారని పోలీసులకి తప్పుడు సమాచారం పంపిస్తాడు ధర్మరాజు. పోలీసులు వచ్చి ‘కిమిడిగూడ’ అంతా విధ్వంసం చేస్తారు. అదే సమయంలో సాయి కూతురిపై అత్యాచారం చేస్తాడు ధర్మరాజు. పోలీసులు కూడా ఆదివాసీ స్త్రీలపై అత్యాచారం చేసి ‘కిమిడిగూడ’ను వల్లకాడులా మార్చేస్తారు.
ఇప్పమొగ్గలు: ఈ కథ 2011వ సంవత్సరంలో రాయబడిరది. అభివృద్ధి పేరుతోనూ, పథకాల పేరుతోనూ, వాటి ముసుగుల్లో బలైపోతున్న ఆదివాసీ ఆడపడుచుల ఆత్మఘోషను మల్లిపురం జగదీశ్‌ ‘ఇప్పమొగ్గలు’ కథలో ఆవిష్కరించారు.
భూదేవిగా పిలవబడే బూది అడవిలో ఇప్పమొగ్గలు ఏరుకుంటూ ఉండగా ఫోన్‌ వస్తుంది. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం తెచ్చిన పథకాల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌, జ్యూస్‌ తయారీ, బనియన్ల తయారీ, ఎ.ఎన్‌.ఎం ట్రైనింగ్‌ మొదలైన పథకాల్లో బూది అక్క జ్యోతి ఎ.ఎన్‌.ఎం ట్రైనింగ్‌ చేసి గిరిజనేతరుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. కొన్నాళ్ళకి బూది కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తుంది. ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఐ.టి.డి.ఎ. కార్యాలయానికి వచ్చినప్పుడు అక్కడ క్లర్క్‌ ద్వారా ఎదురైన అమానవీయమైన సంఘటనలు బూది మనసులో బలంగా నాటుకుంటాయి. కొత్తగా ఏర్పాటు చేసిన రాకేష్‌ హోటల్లో బూదికి ఉద్యోగం వస్తుంది. తన అంతరాత్మ అక్క రూపంలో వద్దని వారించుతున్నా పేదరికం కారణంగా హోటల్లో జాయినైంది. హోటల్‌ మేనేజర్‌ బూది మీద మనసు పడతాడు. హోటల్‌కి ముఖ్యమైన గెస్ట్‌ వస్తున్నాడని చెప్పి పుష్పగుచ్ఛం తెచ్చేలోపు తనని రెడీ అవ్వమంటాడు. మేనేజర్‌ ఈ రాత్రి ఉండి తెల్లవారి వెళ్ళిపో అనగానే బూది కోపంతో విసురుగా తన ముఖాన పుష్పగుచ్ఛం విసిరేసి గదికి వెళ్లిపోతుంది. అభివృద్ధి పేరుతోనూ, పథకాల పేరుతోనూ వాటి ముసుగుల్లో జరుగుతున్న అన్యాయానికి ఎందరో గిరిజన యువతుల జీవితాలు పూలై వికసించకుండానే మొగ్గలుగా మారిపోవడానికి గల కారణాన్ని అన్వేషించి మొగ్గల్ని పువ్వులుగా చేసి రేపటి తరానికి ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది.
ఇసప్పురుగు: ఈ కథ శ్రీకాకుళ సాహితి సంపాదకత్వంలో వెలువడిన ‘వంశధార కథలు’లో 1999వ సంవత్సరం ముద్రించబడిరది. గిరిజనేతరుల మాయమాటలు నమ్మి గిరిజన మహిళలు ప్రేమ వలలో చిక్కుకొని చివరికి మోసపోయిన ఉదంతాన్ని బగాది వెంకటరావు ‘ఇసప్పురుగు’ కథలో చిత్రించారు.
కొండలలో ‘రూపాయిగూడ’ అనే గిరిజన గ్రామంలో ఆదివాసీలు ఇప్పపూలు ఏరుకుంటూ, వెదురు బొంగులు నరుక్కుంటూ జీవనం సాగిస్తుంటారు. ‘రూపాయిగూడ’ అడవిలో ఉండడం వల్ల వైద్య సదుపాయం లేదు. మైదాన గ్రామం నుంచి సదానందం అనే వైద్యుడు ఆ గ్రామానికి వచ్చి జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న రోగాలకు మందులిచ్చేవాడు. సదానందం గురువు కూడా ‘రూపాయిగూడ’ గ్రామానికి వచ్చి వైద్యం చేసి చాలా సంపాదించాడు. ఆయన రాలేని పరిస్థితుల్లో ఆ గూడ బాధ్యతను సదానందం తీసుకున్నాడు. గురువు బహుమతిగా ఇచ్చిన సూదులు, సిరంజీ వాడుతూ సదానందం గురువుకు తగిన శిష్యుడిగా నిలిచాడు.
చుక్కమ్మ అందాన్ని చూసి, మాటలతో లొంగదీసుకొని సదానందం ఆమెను వశపరచుకుంటాడు. ఫలితంగా చుక్కమ్మ గర్భవతి అవుతుంది. ఆదెమ్మ ఇంటి దగ్గర వైద్యం చేస్తున్న సదానందం దగ్గరికి వచ్చి తాను గర్భవతి అయిన విషయం చెబుతుంది చుక్కమ్మ. సదానందం చుక్కమ్మకి ధైర్య వచనాలు చెప్పి కడుపు పోయే మందు బిళ్ళలు ఇచ్చి వెళ్ళిపోతాడు. మార్గమధ్యలో సదానందానికి సాంబడు కనిపించి చుక్కమ్మకి, తనకి ఉన్న సంబంధాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఆ మాటలు విని సదానందం కొంత ఆందోళన చెందుతాడు. తనకి తెలిసిన ఆర్‌.ఎం.పి. డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి కడుపు పోవడానికి ఇంజెక్షన్‌ అడిగి తీసుకొని, పది రోజుల తర్వాత ‘రూపాయిగూడ’ వచ్చేసరికి చుక్కమ్మ గర్భవతి విషయం తెలిసి గ్రామమంతా పంచాయతీ పెడుతుంది. సదానందాన్ని గున్నమ్మ నిలదీస్తుంది. గూడెం పెద్దలు సదానందంకి వాళ్ళ ఆచారం ప్రకారం తప్పు కట్టమని చెబుతారు. చుక్కమ్మని సదానందం పెళ్ళి చేసుకోవాలని నీలయ్య చెబుతాడు. ఇదంతా విన్న చుక్కమ్మ ‘‘ఆ తప్పుని ఎల్లకాలం సాగదీసి ఒప్పు జెయ్యొద్దు. పురుగుని మారసలేం. ఈ అడివిల యే యిసప్పురుగులొద్దు. తగిలీయండి. మళ్ళా, మళ్ళా మన జాతి తలదించుకునే తప్పు మరెవ్వరూ సెయ్యకుండా… సూడండి’’ అని తనకి జరిగిన అక్రమానికి తానే తీర్పు చెప్పుకొని వెళ్ళిపోతుంది.
కళ్ళం: ఈ కథ వార్త ఆదివారం సంచికలో ఏప్రిల్‌, 2010వ సంవత్సరం ప్రచురించబడిరది. గిరిజన సమస్యలు తెలుసుకుందామని వచ్చిన పరిశోధకుడికి గిరిజనేతరుడి చేతిలో మోసపోయిన స్త్రీ జీవితం కనిపించే కథ మల్లిపురం జగదీశ్‌ ‘‘కళ్ళెం’’.
గిరిజన సమస్యలను పరిశోధనగా ఎంపిక చేసుకొని గతంలో తన తండ్రి తిరిగిన నేలకి, తెలిసిన ఉపాధ్యాయుడి సహాయంతో వచ్చిన పరిశోధకుని అక్కడ పరిస్థితులు చూసి బాల్యంలో తన తండ్రి చెప్పిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తన తండ్రిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడిన సుక్కుని కలవాలని ఉపాధ్యాయుడితో పాటు ఆ గ్రామానికి వెళ్ళి సుక్కు గురించి ఆరా తీస్తారు. వారికి ఎవరూ సమాచారం ఇవ్వరు. చివరికి ఒక విద్యార్థి ద్వారా సుక్కు కళ్ళంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి సుక్కుని కలుస్తాడు. ఉద్యమానంతరం తమకి రావలసిన భూములు రాలేదని అక్కడ సుక్కు ఇతర బృందం ద్వారా పరిశోధకుడు తెలుసుకుంటాడు. ఈ కళ్ళంలో ధాన్యం కూడా సిరిమెల అనే గిరిజన స్త్రీ తన భూమిని ఊరు కోసం ఇచ్చేసిందని సుక్కు చెబుతాడు. సిరిమెల గిరిజనేతరుడైన విజయ్‌ వల్ల మోసపోతుందని తెలుపుతారు. సుక్కుతో కలిసి వాళ్ళంతా సిరమెలను కలవడానికి వెళ్తారు.
కొండమల్లె: ఈ కథ ‘ఆహ్వానం’ సంచికలో ఆగస్టు, 1994వ సంవత్సరంలో ప్రచురించబడిరది. కాంట్రాక్ట్‌ పేరుతో గిరిజన గూడెంలోకి ప్రవేశించిన మైదాన గ్రామాల వ్యక్తుల చేతిలో బలైపోతున్న ఆదివాసీ స్త్రీల బతుకు చిత్రణే గంటేడ గౌరునాయుడు ‘కొండమల్లె’ కథ. బ్రిడ్జ్‌ నిర్మాణం పేరుతో అడవిలోకి ప్రవేశించిన రంగరాజు, గిరిజనుడైన ఎంకన్నతో నేస్తరికం చేస్తాడు. ఎంకన్న కూతురు చదువుకుంటుంది. ఎంకన్న కూతురు కన్నా బూదికి రెండేళ్ళు పెద్ద. బూదిని వాళ్ళ నాన్న గొర్రెల కాపరిగా చేసి చదివించలేదు. ఎంకన్న తన కూతురిని ఆశ్రమ పాఠశాలలో చదివించాడు. అదే ఆశ్రమ పాఠశాలలో వంటమనిషిగా ఉన్న సుక్కడు బూదిని నమ్మించి పెళ్ళి చేసుకొని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతాడు. సుక్కడు వల్ల బూది గర్భవతి అయ్యి కూతురు పుడుతుంది. అలా సుక్కడు చేతిలో చదువులేని బూది మోసపోతుంది.
బ్రిడ్జ్‌ నిర్మాణం పనులు సాగుతుండగా రంగరాజుని ఎంకన్న పూర్తిగా నమ్మాడు. ఎంకన్న నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని రంగరాజు బ్యాంక్‌ లోన్లు ఎంకన్న పేరున తీసుకుంటాడు. అలలా రంగరాజు చేతిలో ఎంకన్న మోసపోతాడు. రంగరాజు అస్వస్థత వల్ల అతని కొడుకు పని దగ్గర బాధ్యత తీసుకుంటాడు. పదవ తరగతి పాసైన ఎంకన్న కూతురు విజయనగరంలో ట్రైబల్‌ కాలేజీలో చదువుతుంది. సెలవులకి ఇంటికి వచ్చిన ఎంకన్న కూతురితో రంగరాజు కొడుకు చనువుగా ప్రవర్తిస్తాడు. ఫలితంగా వాళ్ళిద్దరి చనువు పెళ్ళి వరకు దారి తీసింది. చదువు పూర్తయిన ఎంకన్న కూతురికి తను చదువుకున్న ఆశ్రమ పాఠశాలలోనే టీచర్‌ ఉద్యోగం వస్తుంది. కొన్నాళ్ళకి రంగరాజు కొడుకు మొదటి భార్య నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చదివిన ఎంకన్న కూతురుకు తన స్థానం అర్థమైంది. రంగరాజు కొడుకుని నిలదీయగా తన నిజమైన స్వభావం బయటపడుతుంది. అలా రంగరాజు కొడుకు చేతిలో చదువుకున్న ఎంకన్న కూతురు మోసపోతుంది.
గోరపిట్ట: ఈ కథ ‘శ్రీకాకుళ సాహితి’ సంపాదకత్వంలో వెలువడిన ‘వంశధార కథలు’లో 1999వ సంవత్సరంలో ముద్రించ బడిరది. గిరిజనేతరుల చేతిలో నలిగిపోతున్న ఆదివాసీ మహిళల గురించి జ్యోతి అనే ఒక ఆదివాసీ మహిళను ఒక గోరపిట్టతో పోల్చుతూ చిత్రించినదే సువర్ణముఖి ‘గోరపిట్ట’ కథ.
సోములు ఉద్యమ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు మణెమ్మ, శిరిమెల, జ్యోతి. ఉద్యమ పార్టీతో సంబంధం ఉండడం వల్ల సోముల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అందరూ సోములు చనిపోయాడని అనుకుంటారు. కొన్నాళ్ళకు శిక్ష ముగించుకొని సోములు గూడెంకి వస్తాడు. కొద్దిరోజులు మాత్రమే ఉండి భార్య బంతెమ్మని, పిల్లల్ని వదిలేసి అన్నల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆదివాసీల కోసం ఐటీడీఏ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే రోడ్లు రావడం.
గిరిజన సంక్షేమ శాఖ నుంచి వచ్చిన అధికారి పెద్ద కూతురు మణెమ్మను తీసుకుపోతాడు. శిరిమెల, జ్యోతి చిన్నాయన దగ్గర పెరుగుతారు. శిరిమెలకు పెళ్ళి చేయడానికి వాళ్ళ చిన్నాయన కోసింమానుగూడకు చెందిన అబ్బాయితో సంబంధం నిశ్చయించుకుంటాడు. మల్లు, శిరిమెల ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళి నిశ్చయమైన శిరిమెలను మల్లు లేవదీసుకు పోతాడు. ఫలితంగా పన్నెండు వందలు తప్పు కడతాడు. శిరిమెల వెళ్ళిపోయిన కొన్నాళ్ళకు జ్యోతికి అడ్డయ్యతో వివాహమవుతుంది. అడ్డయ్య క్రైస్తవ మతం తీసుకొని జేమ్స్‌గా పేరు మార్చుకొని జీవిస్తుంటారు. జ్యోతి, అడ్డయ్య సినిమా చూసి వస్తుండగా పోలీసులు జ్యోతిని చూసి నక్సలైట్‌ జ్యోతి అని భావించి అరెస్ట్‌ చేసి తీసుకుపోతారు. సంఘ సభ్యుల జట్టుకి నేతృత్వ బాధ్యతలు వహించి మణెమ్మ జ్యోతిని విడుదల చేయిస్తుంది. మణెమ్మలో
ఉన్న నాయకత్వ లక్షణాలను చూసి రాజకీయాలలోని రమ్మని ఎమ్మెల్యే ఆహ్వానిస్తాడు.
మణెమ్మ జీవితాన్ని ఉద్ధరిస్తానని తీసుకుపోయిన వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు. గిరిజనుల వివాహం ‘హిందూ వివాహ చట్టంలోకి రాదు’ (సువర్ణముఖి, గోరపిట్ట, పుటః 119) అని ఆదివాసులు వారి సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకోవాలని కోర్టు అధికారులు చెబుతారు.
తెంపు: ఈ కథ ‘సాహిత్యనేత్రం’ త్రైమాస పత్రిక ` బహుమతి కథల విశేష సంచికలో 1996వ సంవత్సరంలో ప్రచురితమైంది. గిరిజన గ్రామానికి వచ్చిన మాస్టారి మాయమాటల్లో బలైపోయిన ఆదివాసీ మహిళ ఘోష ఒకవైపు, మాస్టారి నమ్మకపు మాటల్లో తమ భూములు కోల్పోయిన గూడెంవాసులు మరొకవైపు సువర్ణముఖి ‘తెంపు’ కథలో కనిపిస్తారు.
ఆదివాసి గ్రామానికి రామకృష్ణారావు అనే మాస్టారు వస్తాడు. ఆ ఊరిలో గురవయ్య, గూడెం పెద్ద మెంబర్‌ ఉంటారు. మెంబర్‌ కూతురు కోమలి. కోమలి, అమాస అనే ఆదివాసీ యువకుడు ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు. ప్రేమకు గుర్తుగా అమాస కోమలికి పూసల దండ ఇచ్చాడు. కానీ వీళ్ళ జీవితంలోకి మైదాన ప్రాంతపు మాస్టారు ప్రవేశించాడు. కోమలికి మాస్టారితో పరిచయం కాస్త ఇష్టంగా మారుతుంది. చదువులేని అమాస కంటే ఉద్యోగమున్న రామకృష్ణారావు కోమలి కళ్ళకు అందంగా కనిపించాడు. ‘‘మీసంలేని అమాస కంటే బొద్దు మీసమున్న మాస్టారే బాగున్నారు. గోసి కట్టుకున్న అమాస కంటే గొట్టం ప్యాంటు వేసుకున్న మాస్టారే బాగున్నారు. దుంపలు తింటూ అమాసతో ఉండడం కంటే అన్నం తింటున్న మాస్టారు దగ్గరే’’ (సువర్ణముఖి, గోరపిట్ట, పుటః 95) కోమలికి ఆనందమనిపించింది. రామకృష్ణారావు మాస్టారికి, కోమలికి వివాహం జరుగుతుంది. పదేళ్ళ తర్వాత మాస్టారి నిజ స్వరూపం దళ సభ్యుల ద్వారా తెలుస్తుంది. రామకృష్ణారావుకి పట్నంలో ఇంకో పెళ్ళై, కొడుకు కూడా ఉన్నాడని కోమలికి తెలుస్తుంది. కోమలి తన తండ్రి ఇంటికి వచ్చేస్తుంది.
రామకృష్ణారావు మాస్టారు ఎక్కడా ఏ బలవంతం, ఒత్తిడి లేకుండా తన మంచితనంతో, ఆకర్షణతో కోమలిని ఎట్లా చేపట్టి పెళ్ళి చేసుకున్నాడో అలాగే ఆమె తండ్రిని, ఊర్లో ఆదివాసీ పెద్దలని అట్లా తనకు అనుకూలంగా చేసుకున్నాడు. ఊర్లోకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చాడు. ఆయన మాటంటే చాలు ప్రభుత్వ అధికారులందరూ పని చేస్తారు. ఆయన కాంట్రాక్టర్‌ ఏమీ కాదు. ఆయన ఎక్కడా లంచాలు తీసుకున్న ఉదాహరణ లేదు. కానీ, కొంతకాలానికి స్వచ్ఛందంగానే ఆదివాసీలు తాము పోడు చేసుకున్న భూములు, అడవి భూములు కోల్పోయారు. పక్కా ఇల్లు వచ్చిన మాట నిజమే, ప్రాజెక్టులు వచ్చిన మాట నిజమే. కానీ, సాగుభూములు తమవి కాకుండా అయిపోయాయి. మాస్టారికి ఎనభై ఎకరాల భూమి సమకూరుతుంది. ఇదంతా దళ సభ్యుల ద్వారా తెలుస్తుంది. రామకృష్ణారావు ఇంత చేస్తున్నా గూడెం వాసులు కొంతమంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఎదురుతిరిగి ఏమీ చెప్పలేకపోయారు. ఎన్నో అనుమానాలతో, భయాలతో, ఆందోళనలతో ఉన్న ఆదివాసీలకు దళ సభ్యులు మాస్టారి మాయ గురించి గూడెం పెద్దలకు చెబుతారు. చివరకు పంచాయితీ పెట్టి పరిష్కారం చేయమని కోమలి తండ్రికి బాధ్యత అప్పజెప్తారు ఆదివాసీలు.
రామకృష్ణారావు నిజ స్వరూపాన్ని దళ సభ్యుల ద్వారా గ్రహించిన మెంబర్‌ గూడెం వాసులకు తను ఎదుర్కొన్న ఒక్కో విషయాన్ని విడమరచి చెబుతాడు. మాస్టారు తను సంపాదించిన ఆస్తి మొత్తం గిరిజన పొలాలు, స్థలాలే. అవన్నీ కూడా కొండల్లోనే ఉన్నాయి. దళ సభ్యుల నిర్ణయం మేరకు మాస్టారు ఆస్తినంతా గూడెం వాళ్ళకి పంచాలని నిర్ణయించుకుంటారు. ఆ తీర్పుకు అంతా చప్పట్లు కొడతారు. అప్పుడు అమాస నిలబడి మాస్టారి కారణంగా అన్యాయమైన కోమలికి రెండెకరాల భూమిని కేటాయించి మిగిలిన భూమిని పంచాలని చెబుతాడు. గూడెం వాసులంతా మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడతారు.
దగా మంచు: ఈ కథ ‘ప్రజాశక్తి’ ఆదివారం అనుబంధం ‘స్నేహ’లో 09, ఫిబ్రవరి, 2020వ సంవత్సరంలో ముద్రితమైంది. ఒక గిరిజన జంట ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆ స్త్రీకి ప్రకృతి నుంచి ఎదురైన సమస్యను చింతకంది శ్రీనివాసరావు ‘దగా మంచు’ కథలో చిత్రించారు.
రింతాడ గ్రామానికి చెందిన జానమ్మ, జెర్రిల గ్రామానికి చెందిన అగ్గిపడాలు ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారిరువురికి వాళ్ళ వాళ్ళ కుల సాంప్రదాయాలు, ఆచారాలు ఆటంకం కలిగిస్తాయి. అయినా వాటిని ఎదురించి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. వేగుచుక్కను ఆధారంగా చేసుకొని జెర్రిల గ్రామంలో కలుద్దామని వారిద్దరూ ముందుగానే ఆలోచన స్థిరపరచుకుంటారు. కలుసుకొన్న తర్వాత ట్రైన్‌ ఎక్కి మందస వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఆ మాట ప్రకారం ముందురోజు జెర్రిల గ్రామానికి వెళ్ళడానికి జానమ్మ సిద్ధపడి లేస్తుంది. తల్లిదండ్రులకు మొక్కి, బయటకు వచ్చి చాలాసేపు చూస్తుంది. కానీ, వేగుచుక్క కనిపించదు. నిరాశతో కూర్చున్న జానమ్మకి తల్లి పిలుపు వినిపిస్తుంది. ఈ సమయంలో ఎందుకు లేచావు అని తల్లి అడగ్గా, వేగుచుక్క కోసం అని జానమ్మ సమాధానమిస్తుంది. ‘‘పిచ్చిగుంటా…! వేగుచుక్క ఎక్కడని కనబడుతుంది. ఇది బుగ్గిమంచు కాలం. ముదురు మంచు ఆకాశాన్ని కప్పితే నేలరాజైన కుందేటి చుక్కే కానరాదు. నక్షత్రాలు కనబడతాయా…!’’ (ప్రజాశక్తి, ఆదివారం, 09 ఫిబ్రవరి 2020, పుటః 04) అన్న తల్లి మాటలు విని చేసేదేమీ లేక బుగ్గిమంచును తిట్టుకుంటుంది. మరుసటిరోజు ప్రయాణమై వెళ్దామని అనుకుంటుంది.
మరుసటిరోజు అర్థరాత్రి లేచి చూస్తుంది. వేగుచుక్క కనిపించదు. అయినా సాహసం చేసి ముందుకు సాగిపోతుంది. కానీ దారి కనిపించడం లేదు. దట్టమైన మంచులో కాలుతీసి కాలు వెయ్యడమే కష్టంగా ఉంది. ఇక ఈ రాత్రి ప్రయాణం సాగదని నిర్ణయానికి వస్తుంది. మరుసటిరోజు ఉదయమే వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే ఖాళీబిందెతో ఉదయాన్నే బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక జెర్రిల వైపు ప్రయాణం చేసింది. దగా చేసిన బుగ్గిమంచును కసితీరా తిట్టుకుంది. కాబోయే పెనిమిటిని తనివితీరా తలచుకుంటూ ముందుకు సాగిపోయింది.
దారి తప్పిన మనిషి: ఈ కథ ‘ఆంధ్రపత్రిక’ వారపత్రికలో సెప్టెంబర్‌, 1983 లో ప్రచురితమైంది. గిరిజనేతరుని కామదాహానికి బలైపోయిన ఆదివాసీ మహిళ గురించి బలివాడ కాంతారావు ‘‘దారి తప్పిన మనిషి’’ కథ తెలియజేస్తుంది.
మూర్తి ఒక వ్యాపారి. వ్యాపారం రీత్యా అనేక పట్టణాలకు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు పట్టణం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ క్రమంలో అడవి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాడు. తిరిగి పట్టణానికి వచ్చే క్రమంలో ఒక ఆదివాసీ స్త్రీ కనిపిస్తుంది. ఆమె భర్తకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఆతృతగా వెళ్తోంది. వెళ్తోన్న ఆ స్త్రీ అందం చూసి మూర్తి మోహిస్తాడు. ఆమె దగ్గరగా వెళ్ళి కారు ఆపుతాడు. ఆమె అవసరాన్ని గ్రహించి ఆమె ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి కారు ఎక్కించుకుంటాడు. ఆమెను తన మాటలతో మభ్యపెట్టి, కారును దారి తప్పిస్తాడు. తియ్యని సోడా అని చెప్పి మద్యం ఇస్తాడు. ఆ మద్యం మత్తులో ఆ ఆదివాసీ స్త్రీపై అత్యాచారం చేస్తాడు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత బాధపడుతుంది. మూర్తి ఆమెను బతిమలాడి మళ్ళీ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణ క్రమంలో గిరిజన స్త్రీ మూర్తి దృష్టిని మళ్ళించి కారు స్టీరింగ్‌ చక్రాన్ని బలంగా తిప్పేసి కారు కొన్ని వందల అడుగుల లోయలోకి జారి పడేటట్లు చేస్తుంది.
నా మగడు కోవర్టెట్లైతడు?:ఈ కథ ‘అనేక ఆకాశాలు’ స్త్రీల కథల సంపుటిలో 2016వ సంవత్సరంలో ప్రచురించబడిరది. ఇటు ప్రభుత్వానికి, అటు విప్లవ రాజకీయాలకీ మధ్య ఉక్కిరిబిక్కిరై నలిగిపోతున్న గిరిజన జీవితాలను చిత్రించిన కథ విజయభాను కోటే ‘నా మగడు కోవర్టెట్లైతడు?’
పల్లం నుంచి, పట్నం నుంచి వ్యాపారం పేరుతోనూ, పాలన పేరుతోనూ వచ్చిన షావుకార్లు. పోలీసు అధికారుల దోపిడీ దౌర్జన్యాల నుంచి గిరిజనులను రక్షించింది సాయుధ పోరాట నాయకులే. అలాంటి సాయుధ పోరాట నాయకుల్లో కూడా కొంతమంది దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా ఈ కథలో వీరేశం కనిపిస్తాడు. వీరేశం మాటలు నమ్మి ఆదివాసీ వనిత సర్దారు వంటి దళ నాయకునికి సహాయం చేస్తుంది. వాళ్ళ ప్రోద్భలంతోనే పాఠాలు చెప్పే ఆమె గూడెంని అభివృద్ధి చెయ్యాలన్న ఆశతో ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధపడుతుంది. గిరిజన స్త్రీపై మనసు పడిన వీరేశం ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాడు. ఆమెను అనుభవించడానికి ఆమె భర్త అడ్డంగా ఉండడంతో, ఆమె భర్తపై నేరారోపణ చేసి కోవర్ట్‌ అనే ముద్ర వేసి పోలీసులచే చంపించేస్తాడు. భర్త పోయిన దుఃఖంలో వెళ్తున్న ఆమెను చెట్టు చాటుకి లాగి నిన్ను కూడా మావోయిస్టులు చంపాలని చూస్తున్నారని చెబుతూ తన చేతులతో తనను పట్టుకుంటున్న తీరును గమనించిన ఆమెకు ఒక విషయం అర్థమవుతుంది. నిజమైన కోవర్ట్‌ ఎవరు అని అందరికీ తెలియడం లేదు అనుకుంటుంది.
శిలకోల: ఈ కథ ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధ సంచికలో మే, 2009లో ప్రచురించబడిరది. గిరిజనేతరులు ఆదివాసీ స్త్రీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నమ్మించి పెళ్ళి చేసుకొని వారికి రావలసిన పథకాలను లబ్ది పొందే సంఘటనలను మల్లిపురం జగదీశ్‌ ‘శిలకోల’ కథలో చూడవచ్చు.
పల్లం నుంచి వ్యాపారం పేరుతో కొండల్లోకి వచ్చిన గిరిజనేతరుడైన జగన్నాధం, చామంతి తండ్రితో స్నేహం చేసి వారి కుటుంబానికి దగ్గరవుతాడు. చామంతి బాగా చదువుకుంది. చామంతికి తన ఊరిలోనే టీచర్‌గా ఉద్యోగం వస్తుంది. అదే ఊరులో జగన్నాథం గిరిజన సంక్షేమ శాఖ భవంతులు కడుతున్నాడు. చామంతిని నమ్మించి మాయమాటలు చెప్పి పెళ్ళి చేసుకుంటాడు. అప్పటికే జగన్నాథంకి పెళ్ళవుతుంది. చామంతికి విషయం తెలిసేసరికి సంవత్సరం వయసు గల కూతురు ఉంటుంది. చామంతి ఉద్యోగం చెయ్యడమే కానీ జీతం జగన్నాథం తీసుకునేవాడు. గిరిజనులు అమ్మే భూమిని చామంతి పేరున కొని మళ్ళీ గిరిజనులకే కౌలుకు ఇచ్చేవాడు.
జగన్నాథం ఇంటికి తాగుతూ వచ్చేవాడు. ఎప్పటిలాగానే ఒకరోజు చామంతి దగ్గరకు వచ్చి మనది ఎస్టీ నియోజకవర్గం, మనకి సీటు ఇస్తారు, నువ్వు టీచరు ఉద్యోగం మానేసి ఎమ్మెల్యేగా నిలబడు అంటాడు. చామంతి దానికి నిరాకరిస్తుంది. జగన్నాథం కోపంతో చామంతిని అనరాని మాటలు అని, అవమానించి, తిట్టి, కొట్టి డబ్బు పట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు. చామంతిని ఎలాగైనా ఎమ్మెల్యేగా నిలబెట్టాలని తలచిన జగన్నాథం మళ్ళీ ఇంటికి వస్తాడు. విజయనగరంలో పార్టీ ఇన్‌ఛార్జిని కలిశానని, టికెట్‌ ఇస్తానన్నారని, మన ఇంటికి వస్తాడని, హాస్టల్లో ఉన్న కూతురిని ఇంటికి పిలిపించమని అంటాడు. ఆ మాటలు విన్న చామంతి తనను ఎంత హింసించినా భరించింది, కానీ కూతురిని ఇన్‌ఛార్జ్‌ పక్కన పడుకోబెట్టమని చెప్పిన జగన్నాథంని కోపంతో విసురుగా తన్నింది. ఆ దెబ్బకి జగన్నాథం దూరంగా వెళ్ళి పడ్డాడు. చామంతి జగన్నాథంని తొక్కుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
సుక్కి: ఈ కథ బి.వి.ఎ.రామారావు నాయుడు సంపాదకత్వంలో శ్రీకాకుళ సాహితి వెలువరించిన ‘నాగావళి కథలు’లో 1995లో ప్రచురించబడిరది. గిరిజనేతరుల కామదాహానికి బలైపోయిన గిరిజన యువతి, తనపై అత్యాచారం చేసిన నరరూప రాక్షసుడ్ని సంఘ సభ్యుల సహాయంతో అంతమొందించడం సువర్ణముఖి ‘సుక్కి’ కథలో కనిపిస్తుంది.
సుక్కికి మేనమామ కొడుకు రసూల్‌. సుక్కి తండ్రి అడ్డయ్య ఆశ్రమ పాఠశాల హెల్పర్‌గా పనిచేస్తాడు. అడ్డయ్య ఉద్యోగం చెయ్యడంతో తన కూతురికి కూడా ఉద్యోగస్తుడినే అల్లుడిగా తెచ్చుకోవాలనుకుంటాడు. ఆదెమ్మ అక్క కొడుకు నీలకంఠు ఐ.టి.డి.ఎ. పాల కేంద్రంలో పని చేస్తుంటాడు. నీలకంఠుకి సుక్కిని ఇచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటారు. రసూల్‌, సుక్కి అన్న ఎల్లంగు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. బావా, బావా అని పిలుచుకుంటారు. రసూల్‌ మంచి చురుకైనవాడు. నక్క నోట్లో నుండి కోడిని చాకచక్యంగా తీసుకురాగల నేర్పు కలవాడు. ఉడుములు పట్టడంలో మంచి నైపుణ్యం కలిగినవాడు. బ్రిడ్జి కాంట్రాక్టు పనులకి ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి సుక్కి మీద మనసు పడుతుంది. నీలకంఠు పిలిచాడని మాయమాటలు చెప్పి సుక్కిని పిలిచి అత్యాచారం చేస్తాడు. చెడిపోయినదాన్ని తాను చేసుకోనంటాడు నీలకంఠు. సుక్కి అత్యాచారం విషయం, చెడిపోయిన వివాహ సంబంధం విషయం దళ సభ్యులకు తెలుస్తుంది. సుక్కి అన్న ఎల్లంగు దళాలకు సహకరిస్తున్నాడని అతనిపై పోలీసుల నిఘా ఉంది. ఎల్లంగు తన బాల్యమిత్రుడు, బావ అయిన రసూల్‌ చేతిలో సుక్కిని పెట్టేసి దళంలో కలిసిపోతాడు. ఎల్లంగు వెళ్ళిన కొన్నాళ్ళకు బ్రిడ్జ్‌ ఇంజనీర్‌ని చంపేశారని తెలిసి సుక్కి, అడ్డయ్య, గూడెం వాళ్ళంతా సంతోషిస్తారు.
(పరిశోధక విద్యార్థి, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.