తెలుగు కథానికలు ` భారతీయ జీవన విధానం – శ్రీలత అలువాల

చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేలా చేసే ప్రక్రియ కథ. తక్కువ నిడివిలో కథ నడుస్తూ పాత్రధారులు సరాసరి పాఠకుల హృదయాలలో ప్రవేశించి వారి ఆలోచనలకు పదునుపెడుతూ ముందుకు సాగేవి అసలైన కథలు.

అలాంటి కథల స్వరూపం నాటి నుండి నేటి వరకు మార్పు చెందిన విధం గమనిస్తే ఎన్నో విషయాలు గోచరిస్తాయి. మన భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, భాషలు ఉన్నాయి. ఆయా భాషా, సంస్కృతులలోని భావ సంపద, ఆలోచన, సాంఘిక జీవన విధానం, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడానికి సాహిత్యం ఎంతో తోడ్పడుతుంది. కాలం నిలరంతరం పరిణామం కోరుకుంటుంది. ఇలాంటి పరిణామాలు సాహిత్య ప్రక్రియలను చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ప్రక్రియలలో భాగమైన కథలు, కథానికలు కూడా ఎన్నో మార్పులకు గురై నేడు ప్రజలను చైతన్యపరచే విధంగా, ప్రేరణ కలిగించే విధంగా, ఆలోచనలకు పదును పెట్టే విధంగా కొనసాగుతున్నాయి.
రామాయణ కాలం నుండి నేటి వరకు మన సాహిత్యకారుల కథలను పరిశీలించినట్లయితే సంస్కృతి, సంప్రదాయం, వస్తువు, భాష, సాహిత్యం, ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆధునికత వైపు పరుగులు పెడుతుంది. కథ అంటే కొంత సత్యాంశంతో కూడిన కల్పిత గద్యాంశం. పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్దలు అద్భుత కథలు, నీతి కథలు, రాజుల కథలు, చందమామ కథలు, మెదడుకు పదును పెట్టే కథలు ఎన్నో చెప్పేవారు. పిల్లలు ఎంతో ఆసక్తిగా వినేవారు. అందుకే ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా కథకి ఎంతో ఆదరణ.
తెలుగులోను, ఇతర భారతీయ భాషలలోను కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ కాలంలో లక్షల కథలు రచించబడ్డాయి. ఈ కథలలో సనాతన ధర్మాలతో పాటు నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం, చైతన్యం, ప్రేరణ వంటి ఎన్నో అంశాలు వస్తువుగా చేసుకుని నడిచాయి. ఏదైనా ఒక గొప్ప సన్నివేశాన్ని మంచి శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లుగా చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, చైతన్యవంతమైన ఆలోచనను స్ఫురింపచేసేదే అసలైన కథ అని నా అభిప్రాయం.
ఒకప్పుడు కథలలో వస్తువుగా జంతువులను, ప్రకృతిని తీసుకుని నీతినే నేరుగా వివరించారు. రాజుల చరిత్రలు, దేవుళ్ళు, దయ్యాలను కథలుగా మలిచారు. కాలక్రమేణా కథ మార్పు చెందుతూ సంఘంలో నివసించే ప్రజల జీవన చిత్రాన్నే కథలుగా మలచి మార్పుకు దోహదపడేలా చిత్రించారు మన కథకులు. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు మాత్రమే కథలుగా కాకుండా సమాజంలో మార్పును కోరుతూ సామాజిక, ఆర్థిక జీవన విధానాలలో మార్పు కోరుతూ ఎందరో మహానుభావులు కథలను వ్రాసి ప్రచురించారు.
సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రజల జీవన చరిత్రయే అసలైన చరిత్ర అని తెలిపారు. నెల్లూరు కేశవస్వామి వంటి వారు సమాజంలో మార్పు కోరుతూ చార్మినార్‌ కథలను వ్రాసారు. ఈ కథల్లో హైదరాబాద్‌ చరిత్రనే కాకుండా అక్కడి ప్రజల జీవన పరిస్థితులు, నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కుల, మత, రాజకీయ కల్లోలాలు, మూఢనమ్మకాలు వంటి ఎన్నో అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. తెలంగాణలో హైదరాబాద్‌ చరిత్ర పోయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడం, హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో ప్రజల పరిస్థితులు దాదాపుగా తెలిసుకోవచ్చు. హిందూ, ముస్లిం సంబంధాలు మెరుగు పరచడానికి, మూఢనమ్మకాలను పోగొట్టి చైతన్యపరిచేలా కథలు నడుస్తాయి. ఈ కథల ద్వారా నెల్లూరు కేశవస్వామిని సామాజిక చైతన్యమూర్తిగా అభివర్ణించవచ్చు. దాశరథి సోదరులు, వట్టికోట ఆళ్వారుస్వామి, స్త్రీ జనోద్ధారణకు కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, చలంలతో పాటు బండారు అచ్చమాంబ, ముదిగంటి సుజాత వంటి మహిళామణులెందరో తమ కథల ద్వారా సామాజిక మార్పు కోరుతూ ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేశారు.
ఇలా స్వతంత్య్ర, దళిత, మహిళా చైతన్యాల కొరకు మూఢ నమ్మకాలను పారద్రోలడానికి కులాలు, మతాలు, మానవత్వం, కుటుంబ సంబంధాలు వంటి ఎన్నో అంశాలపై మార్పు తీసుకురావడానికి కథలు, కవితలు, నవలలు వంటి వివిధ సాహితీ ప్రక్రియల్లో వ్రాసి వాసికెక్కారు. అటువంటి వారిలో మహిళా చైతన్యం కొరకు స్త్రీవాద నేతృత్వంతో శ్రీమతి పోపులూరి లలితకుమారి గారు ఓల్గా అనే కలం పేరుతో ఎన్నో కథలను, నవలలను, వ్యాసాలను, అనవాదాలను మహిళాలోకం స్ఫూర్తిపొందేలా వ్రాశారు. వాటిలో రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, విముక్త కథలు, కథలు లేని కాలం మొదలైనవి కథాసంకలనాలు. విముక్త కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది దేశవ్యాప్తంగా పేరు గడిరచారు. ఇందులో రామాయణంలోని స్త్రీలను కథావస్తువుగా ఎంచుకుని సృజనాత్మకంగా నేటి సమాజంలోని ధోరణుల్లోకి నడిపిస్తూ మహిళా లోకానికి ఎంతో సందేశాన్ని అందించారు.
‘‘అన్నింటిలోకి రాజకీయ కథలు రాయడానికి చాలా కష్టపడ్డాను’’ అంటారు రచయిత్రి. మహిళలు తమ గురించి తాము తెలుసుకునేలా తన ఆలోచనలను అక్షరబద్ధం చేస్తారు. రచయిత భావజాలం పాఠకుల హృదయాలను తాకి ఒక్క మెరుపు మనలో ప్రవేశిస్తుంది. స్త్రీని ఒక భోగవస్తువుగా చేసి తన ప్రతి అంగాన్ని వర్ణిస్తూ పొగిడే సాహిత్యం విస్తృతంగా అందుబాటులో ఉంది. నాటి రామాయణ, భారత, ప్రబంధాల కాలం నుంచి స్త్రీ శరీర భాగాలను అంగాంగ వర్ణనలు చేస్తూ స్త్రీకి వ్యక్తిగా ఏ విలువ లేకుండా వర్ణించిన సందర్భాలనూ చూస్తాం. ఒకరిద్దరు స్త్రీలను ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీలుగా వర్ణించినా, స్త్రీల వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో, స్త్రీల హీనత్వం, చపలత్వం గురించి వర్ణించారు. దీనివల్ల స్త్రీని శారీరక సౌందర్యం గల వ్యక్తిగా మాత్రమే ఎక్కువ ఊహించారు. స్త్రీ తన భావాలను, వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించి వ్యక్తపరిచే సందర్భాలను చాలా తక్కువగా చూస్తాం. ఎప్పుడైతే తన భావాలను వ్యక్తపరుస్తుందో అప్పటి నుంచి చైతన్యం దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. భారత స్వాతంత్య్రోద్యమంలో, ఇంకా ఇతర విప్లవోద్యమాలలో పాల్గొని తన భావాలను వ్యక్తపరచినప్పుడు స్త్రీల సమస్యల విషయంలో ప్రశ్నించినప్పుడు అభ్యుదయం వైపు అడుగులు పడ్డాయని చెప్పవచ్చు.
ఓల్గా కథల సంపుటి ` రాజకీయ కథలు ` విశ్లేషణ:
మహిళల శరీరభాగాలైన వాటిపై కుటుంబ సభ్యులు, సమాజం ఎలాంటి పెత్తనం చెలాయిస్తారు? దానివల్ల మనకు ఎటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి? అసలు వాటిని ఎలా వినియోగించుకోవాలి? అనే వాటిపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించేలా కొనసాగుతాయీ కథలు. అసలు స్త్రీలు ఎలా
ఉండాలి, వేటికి ప్రాముఖ్యతనివ్వాలి, తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఎలా చక్కదిద్దుకోవాలి, స్వతహాగా ఎలాంటి అభిప్రాయాలు ఉండాలి అని గొప్పగా వివరించారు. ఈ కథల్లో స్త్రీల జీవన విధానం మనం గమనించవచ్చు. నేటి కాలంలో స్త్రీలు చదువుకుని అభ్యుదయ పథాన నడిచినప్పటికీ ఎక్కడో అక్కడ మనం ఇలాంటి పరిస్థితులను గమనిస్తూనే ఉంటాం. ఆడపిల్లల్ని కనడం, పెంచడం, న్యాయం, భద్రత ఇలాంటి వాటిలో కొద్దిపాటి మార్పు వచ్చినప్పటికీ ఇలాంటి కథా పుస్తకాలు చదివినప్పుడు ఏదో మార్పు అయితే తప్పకుండా కోరుకుంటాం.
రాజకీయ కథలు మొత్తం 10 కథల సమాహారం. ఈ కథలన్నీ స్త్రీల శరీర భాగాలు, వీటిపై ఇతర స్త్రీలు, కుటుంబ సభ్యులు, సమాజం ఆధిపత్యం, పురుషాధిపత్యం చుట్టూ తిరుగుతాయి. ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల జీవితాలు సైతం తండ్రి, భర్త, కుటుంబం చేతుల్లో మగ్గిపోవడం, సమాజం ముసుగుల్లో నలిగిపోవడం గమనిస్తాం. దీంతో స్త్రీ తన గురించి తానే తక్కువ చేసుకుని ఒక నిర్లిప్తానికి గురయ్యే పరిస్థితి చూస్తే గుండె చెరువవుతుంది. ఇలాంటి సమస్యలపై ఈ పది కథలు నడుస్తూ స్త్రీగా పుట్టినందుకు మనల్ని మనం మూర్తిమత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుకుని ముందుకు సాగేలా చేస్తాయి.
కథల్లోకి… మొదటి కథ ‘‘సీతజడ’’ అమ్మాయికి జడ ఎంత ముఖ్యమైందో తెలిపే కథ. సీత అంటేనే తన జడ అన్నట్లుగా కథలోని పరిస్థితులు కనిపిస్తాయి. అమ్మాయికి జుట్టు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఎలా స్థిరపడిపోయిందో కూడా తెలిపే కథ. సీతకు పెళ్ళికి ముందు జుట్టు పోషణ, పెళ్ళి తర్వాత తొలినాళ్ళలో తన భర్త తన జుట్టును పొగడడం, కాలక్రమేణా పట్టించుకోకపోవడం, భర్త పోయిన తర్వాత జుట్టుని తీసేస్తారేమోనని భయపడడం, భర్త పోయాక జుట్టుకు నూనె రాసిన తన వదినలు వెక్కిరించడం, అరవైలో తన జుట్టు రాలిపోతోంటే తన వ్యక్తిత్వంలో భాగమైన జుట్టును తలచుకుని బాధపడడం ఈ పరిస్థితులన్నింటినీ కళ్ళముందుంచారు ఓల్గా గారు. తన జుట్టుపై కన్నవారికి, భర్తకి, వదినలకి, సమాజంలోకి వ్యక్తులకి ఉన్న అజమాయిషీ మీద సీత ప్రతిస్పందన పాఠకుల హృదయాలను ద్రవింపచేస్తుంది. తన పనులకు అడ్డు వస్తోందని, దాని పోషణ కోసం సమయం వృధా అవుతోందని జుట్టును కత్తిరించుకుంటాను అని సీత అంటే ఆమె తల్లి తిడుతుంది. దాంతో జుట్టే ప్రాణంగా తనలో భాగమైన సందర్భాలను చక్కగా వివరించారు రచయిత్రి. దీంతో జుట్టు ఏ మేరకు స్త్రీల జీవితాలలో ప్రాముఖ్యత వహించాలో తెలుస్తుంది.
‘‘కళ్ళు’’ కథలో… ఆడపిల్ల కళ్ళు ఆల్చిప్పల్లాగా పెద్దగా, ఆకర్షణీయంగా ఉన్నా అన్నింటినీ చూడకూడదు, చూసినా ప్రశ్నించకూడదు. ‘నీకు అన్నీ కనబడతాయే’ అంటూ కన్నవారి గద్దింపుతో ఆ చిన్నపిల్ల మనసులో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానం తెలియకపోవడం, అడగకూడదు అనే ఆంక్షల మధ్య గందరగోళం… అన్నింటి గురించీ కథలో వివరించారు.
‘‘ముక్కుపుడక’’ కథలో… చిన్నప్పుడే ముక్కుపుడక కుట్టించే ఆనవాయితీ, కుట్టించాక పుండు మానక పడిన తిప్పలు, కుట్టిన స్థలంలో పడిన మచ్చ వల్ల పెద్దయ్యాక చాలా పెళ్ళి సంబంధాలు తప్పిపోవడం, ప్లాస్టిక్‌ సర్జరీతో తమ తాహతుకు మించి ఖర్చుపెట్టి మచ్చ లేకుండా చేసుకోవడం, తీరా సంబంధం కుదిరాక పెళ్ళికొడుకు ముక్కుపుడక కోరడం, వీటన్నింటి మధ్య కథానాయిక పడిన మనోవేదన, చివరకు పెళ్ళి వద్దు అనుకునే మానసిక పరిస్థితి రచయిత్రి కలంలో జీవం పోసుకున్నాయి. ‘‘నోర్ముయ్‌’’ కథలో…కథానాయిక మెదడులో పుట్టే ఆలోచనలను మాటల ద్వారా, శబ్ద రూపంలో బయటపెట్టారు. అందుకు సమాధానం ‘నోర్ముయ్‌’ అనే పదం ఎన్నోసార్లు వినీవినీ పుట్టే ఆలోచనలకు అడ్డుకట్టపడి మెదడు మొద్దుబారి పోయేలా ఎలా అవుతుందో కళ్ళముందు చూపించారు. మాట్లాడితే మాటకారి అని, మాట్లాడకపోతే ముంగి అని వెక్కిరించే మాటల మధ్య కథానాయిక ఎలా నలిగిపోయిందో తెలిపారు.
‘‘వెన్నెముక’’ కథలో… స్త్రీ తన బలాబలాల్ని నిరూపించుకుంటూ బయటకొచ్చి తన అందాన్ని మెరుగుపరచుకుంటూ సన్నని నడుము కోసం తిండి తినక బలహీనపడకూడదని, శారీరక దృఢత్వం పెంచుకోవాలని తెలిపే కథ.
‘‘రాతిగుండెలు’’ కథలో… వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పుల గురించి అవగాహన లేని చిన్నతనంలో తన చుట్టూ మగాళ్ళ కామవాంఛలకు తన స్తనాలు ఎల బలయ్యాయో వివరిస్తూ పెళ్ళయ్యాక తన దౌర్భల్యానికి కారణమయిన స్తనాల మీద విరక్తి చెందిన ఆమె, పిల్లలు పుట్టాక వారికి పాలిచ్చే మధురక్షణాలను అభివర్ణించే తీరు, పాలిచ్చేటప్పుడు కూడా వదలకుండా ఆబగా చూసే జనాల తీరును, ఆఖరికి క్యాన్సర్‌ వచ్చి స్తనాలను తొలగించాల్సి వస్తే ‘వీటి పీడ వదిలితే మంచిదే’ అనుకునే తీరు, ‘పాలు ఇవ్వకపోవడం వల్లనే క్యాన్సర్‌ వచ్చిందా’ అని డాక్టర్‌ని అడిగే అమ్మ రాతి గుండెల వెనుక ఉన్న హృదయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో రచయిత్రి వివరించారు. ‘‘అయోని’’ కథలో… బాల వ్యభిచారిగా పిల్లల్ని ఎత్తుకుపోయే వారి చేతిలో పడిన ఒక పాప చీకటి జీవితంలో మగ్గిపోతూ సీత`అయోనిజ అని మాటల్లో తెలుసుకని తాను ‘అయోని’ అయితే బాగుండు అని ఎంతో మధనపడుతుంది. తనను యోని లాగానే అందరూ చూస్తున్నారని, ఒక వ్యక్తిగా తనను ఎవరూ గుర్తించట్లేదని, తిండిలేక తన యోనిని పదే పదే చీల్చేసే పిల్లకి అమ్మ గుర్తొచ్చి పడే వ్యథ హింసతోనే ప్రపంచం ఉందా? హింస, బాధ లేకపోతే జీవితం లేదా? అని అనుకునే చిన్నపిల్ల కష్టాన్ని రచయిత్రి ఎంతో వేదనతో మధనపడుతూ రాశారో అర్థమవుతుంది. ఈ కథను లైంగిక వ్యాపారులకు గురై చనిపోయిన చిన్నారులకు, రచనా కాలం నాటికి లైంగిక హింసకు గురై చనిపోయిన చిన్నారి శ్వేతకు అంకితమిచ్చారు.
ఒక రాజకీయ కథలో… సమాజంలో స్త్రీని స్త్రీగా గుర్తించాలంటే పిల్లల్ని కనాలి, వంశాభివృద్ధి చేయాలి, అంతేకానీ అలా చేయలేకపోతే తనకంటూ ఒక మనసు, వ్యక్తిత్వం ఏమీ ఉండకూడదు. కథానాయిక భర్త ఫ్యాక్టరీలో పనిచేస్తున్న క్రమంలో తన చేతివేళ్ళు కోల్పోతే యూనియన్‌ వాళ్ళు, కంపెనీ, కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలుస్తారు. అయితే అనుకోని సందర్భంలో గర్భధారణ జరిగి విచ్ఛిన్నమై గర్భసంచి తీసివేస్తే ఆమెకు తన కుటుంబ సభ్యులు, భర్త నుండి కనీసం ఎలాంటి అండ దొరకదు. పైగా తన భర్తకు వేరే పెళ్ళి చేయడానికి కూడా సిద్ధపడడంతో మానసికంగా కృంగిపోయిన కథానాయికకు అంతా అయోమయంగా తోస్తుంది. ఇలాంటి సన్నివేశాలు నేటికీ లోకంలో కోకొల్లలు చూస్తూనే ఉంటాం. మన చుట్టూ జరుగుతున్నప్పుడు మనం అసలు పట్టించుకోం కానీ కథ చదువుతుంటే మాత్రం చలనం కలగక మానదు.
‘‘ఆర్తి’’ కథలో…విడాకుల అనంతరం పిల్లలకు సంరక్షకుడు చట్ట ప్రకారం తండ్రి. భార్యమీద కక్షతో తాను తన పిల్లల్ని తీసుకెళ్తే తల్లికి దిక్కులేక తన కాళ్ళ దగ్గరికి వస్తుందని అనుకునే భర్త. భర్త తన పిల్లలను ఎలా చూసుకుంటాడో అని తపన పడిన తల్లి, తన పిల్లల కోసం లాయర్‌ దగ్గరికి వెళ్తే లాయర్‌ స్పష్టంగా నీ పిల్లల మీద హక్కు నీ భర్తదే అని తెలపడం అందుకు ఉదాహరణగా ‘పొలం కౌలుకు ఇస్తే దాని ఫలసాయంపై సర్వహక్కులు యజమానివి అవుతాయి’ అని చెప్పి నువ్వు ‘కేవలం క్షేత్రానివి, నీ స్థాయి అదే’ అని వివరించడం… ఇవన్నీ పాఠకులలో ఆలోచనలు కలిగించేవిగా ఉంటాయి. కానీ ఆ తల్లి తన శక్తినంతా కూడగట్టుకుని ‘నా పిల్లలపై నాకు ఏ హక్కు లేదా? అసలు మా మీదే మాకు ఏ హక్కు లేదు. మా పెళ్ళి, పిల్లలు… ఎలాంటి కోరికలు తీర్చుకోవాలన్నా మా ఇష్టం ఏమీ ఉండదు. ఎందుకు ఉండదో, ఎలా ఉండదో, ఎంత రాక్షసబలంతో అయినా పోరాడతాను’ అని స్థిర నిర్ణయంతో తల్లీ బిడ్డల సంరక్షణా హక్కులు పొందేందుకు ఆమె చేసే పోరాటం గురించి రాసిన కథ. ఇలా సమాజంలో స్త్రీ స్థానం, విలువ, ఆలోచనలు, కోరికలు ఎలా అణగదొక్కబడతాయో వాటినుండి బయటపడడం కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరించారు. స్త్రీ అభ్యుదయం వైపు నడుస్తున్నా ఇంకా ఈ కథల్లో పేర్కొన్నటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు ఇంకా రావాలి, చేయాలి. కథలన్నీ స్త్రీల పార్శ్వంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ చదివి తమ మానవత్వాన్ని చాటుకోవాలి.
చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏ విషయమైనా ఆడపిల్లకు చెప్పినట్లు, మగ పిల్లలకు చెప్పరు. ఆడ పనులు, మగ పనులు అని వేర్వేరుగా చూస్తారు. అవి మనం చూసే చూపుల వరకే పరిమితమని గ్రహించాలి. మగవాళ్ళు రెక్కలు విప్పుకుని తమ ఆలోచనలను స్వతంత్రంగా విస్తృతపరుస్తూ ఎలాంటి పనులు చేసినా సంతోషిస్తాం, కానీ ఆడవాళ్ళకు ఏది చేయాలన్నా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. స్వతంత్రంగా చేయాలన్నా ఒక్కోసారి తన మనసే తనకు అడ్డుగా నిలుస్తుంది. ఎందుకంటే ఇంకా మనం ఆచారాలు, సంప్రదాయాలు అని చిన్నప్పటినుండీ ఎన్నో అంశాలను నూరిపోస్తాం, కానీ ఏమైనా మనం పెట్టుకున్నవే. వాటిని అధిగమించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఇందుకు ఆడ, మగ అనే తేడా లేకుండా అందరి సహకారం అవసరం. అలా అయితే స్త్రీ తన శక్తినంతా దేశాభివృద్ధికై వినియోగించగలదు. రచయితలు సమాజాన్ని అర్థం చేసుకుని తన చుట్టూ జరిగే పరిస్థితులను కథల్లాగా అల్లి ఇలాంటి కథలను మన ముందుంచుతారు. ఇవేమీ ఊహల్లోకి రాని అంశాలు కావు. చూసేవే, చేసేవే, అయినా ఒప్పుకోము. ఏదేమైనా ఇలాంటి కథలు మానవాళి మార్పునకు దోహదపడతాయని నిస్సంకోచంగా తెలుపవచ్చు. స్వీయ మార్పునకు దోహదపడే కథలను అందించే కథా రచయితలందరికీ అక్షరాభివందనాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.